5
నీ పట్ల అపారమైన ప్రేమ, భ్రమరం లేకుండానే పెళ్ళికూతురు సౌభాగ్యవతి అయింది.
(ఏక్ దీవానీ మీరా సీ)
తన ప్రేమ కాంతితో నీరజ్ గీతాలను కాంతిమయం చేసే ఒక పిచ్చి రాధ ఉంటే, మరో వైపు మీరా కూడా ఉంది. అసలు ఏమీ కోరకుండా తన సంపూర్ణ జీవితాన్ని నీరజ్‌కి అంకితం చేసింది. ఆమెకి పేరు ప్రతిష్ఠలు అక్కరలేదు. నీరజ్‍ని తన స్వంతం చేసుకోవాలన్న ఆలోచన లేదు. ఆమె కేవలం.. కేవలం ప్రేమించగలుగుతుంది. మనఃస్ఫూర్తిగా ప్రేమించింది. ఆమె ప్రేమ హృదయ భవనంలో మౌనం అనే మేలిముసుగు వేసుకుని చేసే దైవపూజ లాంటిది.
నీరజ్ – మూడు కోశాలు ఉంటాయి. తన్మయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ప్రేమ ఎప్పటివరకైతే దేహంలో ఉంటుందో అప్పటివరకు అది కేవలం కామ మోహం మాత్రమే, మనస్సులో ఉన్నప్పుడు ప్రేమ, ఈ రెండింటిని అధిగమించి భక్తిగా మారుతుంది. భక్తికి ఆ పైన ఉండేది ఆనందం… ఆనందం… అప్పుడు ఇక దేహం అవసరం ఉండదు. ఇంద్రా ప్రేమ కూడా అంతే. అక్కడ దేహం నగణ్యం.
నీరజ్ ఎవరు? ఎందుకు? ఎంతగా ప్రసిద్ధి చెందినవాడు? ఎంత గొప్పవాడు అన్నది ఆమెకి అక్కరలేదు. కావలసింది నీరజ్… నీరజ్… కేవలం నీరజ్.. ఇదంతా ప్రేమ ఉజ్జ్వల దీపం. అది నీరజ్‌ని ఏ బంధనాలలోనూ బంధించలేదు. ఇక్కడ తీసుకోవడం కాదు, అంతా ఇవ్వడమే. అదే ఆదర్శం ప్రకటితం అవుతోంది. నీరజ్ లేకుండా ప్రతీ కల, సంతోషం అంతా అసంపూర్ణమే… నీరజ్ రాస్తూనే వున్నారు. ఇంద్రా ఈ గీతాలను హృదయానికి హత్తుకుంది. నిజం చెప్పాలంటే వాటిలోనే జీవించింది.
చంద్రుడు రాత్రి వెంట్రుకలను ముడి వేస్తున్నప్పుడు
నీవు ఈ కుటీరంలోని చీకటిని గుర్తు చేసుకోకు.
మధుఋతు, మధువనం సిందూరాన్ని దొంగిలిస్తున్నప్పుడు
కాని శిశిరం నిన్ను కబళిస్తున్నప్పుడు
నన్ను పిలు – నేను శ్రావణం అయి వస్తాను
మఠంలో గంటలు మ్రోగుతున్నప్పుడు, శంఖనాదం జరుగుతున్నప్పుడు
గణగణలు, నాదం ప్రతిధ్వనిస్తున్నప్పుడు
నా పూజని స్వీకరించరు
గీతాల హోరులో నీవు అలంకరించబడి ఉండేవరకు
నా కన్నీళ్ళు గిలగిల తన్నుకుంటూ ఉండాలి
మఠం కూలినప్పుడు, శృంగారం చెల్లా చెదురైనప్పుడు
నీవు నన్ను పిలు, నేను తత్వం అవుతాను.
నీ జీవితం శూన్యం అని అనిపించినప్పుడు
నీవు నన్ను పిలు, నేను ఝుంకారం అవుతాను.
భోపాల్‌లో నివసిస్తున్న ఇంద్రాకి నీరజ్ గీతాలంటే పిచ్చ ఇష్టం. ఆమె నీరజ్‌మయం. నీరజ్ మొదటిసారిగా ఇంద్రాని ఆమె ఇంట్లో కలిసారు. వాళ్ళ ఇంట్లో ఒక భాగం నవభారత్ ఆఫీసుకు అద్దెకు ఇచ్చారు. నవభారత్ ఎడిటర్ అక్కడే ఉండేవాడు. మొట్టమొదటిసారి నీరజ్ ఆయనతో పాటు అక్కడికి వచ్చారు. రెండో రోజు వాళ్ళింట్లో కావ్యగోష్ఠి జరిగినప్పుడు కలిసారు. మరో మీరా నీరజ్‌ని ప్రేమించిన ప్రేమమయి. ఈ కథకి మొదలే ఉంది, అంతం లేదు.
నీరజ్ మిత్రులు నరేంద్ర దీపక్ ఇంద్రాని చాలా కాలం తరువాత నీరజ్‌తో కలిపించారు. నీరజ్ ఎంత పెద్ద హోటల్‍లో ఉన్నా, పంచభక్ష్యపరమాన్నాల భోజనం ఉన్నా, ఇంద్రా తన చేతులతో భోజనం తయారుచేసి తీసుకువచ్చేది. ఆమె చేతి వంట ఆయనకు ఎంతో ఇష్టం. నీరజ్ ఆగమనం ముందే ఇదంతా ఏర్పాటు అయ్యేది. ఆయన వెళ్ళేవరకూ ఆమె అట్లాగే తన చేతి తీపి భోజనం తినిపించేది. నేను ఇదంతా ‘నీరజ్ విశేషాంక్’లో రాసాను.
ఇప్పటికీ ఇంద్రా ఆలీఘఢ్ వచ్చినప్పుడు ప్రేయసిలా కాదు, ఒక తల్లిలా నీరజ్ బాగోగులు చూస్తుంది. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏది తింటే మంచిది, ఏది తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది, మందులెప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకుడదు – అంతా ఆమె ఆధ్వర్యంలోనే జరగాలి. ప్రతి నిమిషం ఒక యుగమై జీవించే నీరజ్ ఏం మాట్లాడకుండా ఆమె చెప్పిందంతా వినేవాడు. అసలు ఆ సమయంలో నీరజ్ నీరజ్‌గా కాదు, ఒక సంయమంగా ఉండే నీరజ్ మాత్రమే. శబ్దాలతో, గీతాలతో వెక్కి వెక్కి ఏడ్చే ఆయన సంవేదన ప్రత్యక్షం అయితే, ఆ గాయాలకు మందు రాస్తుంటే, “పిచ్చిదానా! ఇట్లా చేయకు. ఎవరి హృదయంలో బాధ దాగి ఉందో లోకం వరద కంటే మిన్నగా చేయి కలుపుతుంది” అని నీరజ్ అంటున్నారా అని అనిపిస్తుంది.
ఇవాళ ఇంద్రా పడటం వలన నడవడం కష్టంగా ఉంది. అయినా ఆమె ఏదో విధంగా నీరజ్ దగ్గరకి వెళ్ళాలని కోరుకుంటోంది. ఎందుకంటే ఆమె ఉద్దేశంలో నీరజ్‌కి ఆరోగ్యం బాగా లేదు. వారిని కనిపెట్టి ఉండేవారు ఎవరూ లేరు. ఎంతసేపు నేను ఇంద్రాతో మాట్లాడానో అంతసేపు ఆవిడ ప్రేమ లోని పవిత్రతని ఫీల్ అయ్యాను. నేను భక్తి శ్రద్ధలతో తల వంచాను. “బాబాని నేను చూసుకుంటాను, మీరు బాధపడకండి” అని చెప్పగానే ఆమె హమ్మయ్య అని శ్వాస పీల్చింది. ఆవిడ శాంతియుతమైన ఊపిరి నా ఊపిరిలో అమృతాన్ని కలిపింది, అసలు ఆ సాధకురాలి ఊపిరిని వర్ణించడానికి నా దగ్గర శబ్దాలు లేవు, వర్ణించలేను.
తనని ఒక సాధారణ స్త్రీగా నీరజ్‌ని అసాధారణమైనవాడిగా, ఎంతో గొప్పవాడిగా ఎంచే ఆమెను, నేను నా భావాలకు ఆనకట్ట వేసి ఆమెను అడిగాను – “ఎప్పుడైనా మీకు ఈర్ష్య కలిగిందా? బాధ కలిగిందా? పశ్చాత్తాపపడ్డారా?” అని. ఆమె ఇచ్చిన జవాబు – “నేను నీరజ్‌ని మనస్ఫూర్తిగా ప్రేమించాను”. ఇక ముందు ఏ ప్రశ్నలు అడిగే ధైర్యం నాలో లేకపోయింది.
ఫోన్ పెట్టేసాకా నేను ఎంతో ఆలోచించాను. అసలు ప్రేమగా ఒక పర్వతంలా నిల్చుంది. ఆ ప్రేమే మంచి చెడులను వేరు వేరు చేసి చూడలేకపోతోంది, సంపూర్ణత్వాన్ని మాత్రమే కోరుకుంది. మనస్సు నిండిపోయే అమృతత్వాన్ని. ప్రేమ ఎంతో నిస్సహాయమైనది. ఎందుకంటే అది మొరపెడుతుంది, ఫిర్యాదు చేస్తుంది, కాని వదిలిపోలేదు. ఎందుకంటే ప్రేమాంకురాన్ని లాగి బయట పారేయవచ్చు, మొక్కను తీసేసి కొత్త మొక్క పెట్టవచ్చు కాని ప్రేమ వటవృక్షం అయ్యాక దానిని మొత్తంగా కూకటివేళ్ళతో కూల్చడం ఎంతో కష్టం, అసలు అసంభవం కూడా.
“ఈ జన్మలో మేం కలవలేకపోయాం కాని మరో జన్మ అంటూ ఉంటే నీరజ్‌ని ముందే బుకింగ్ చేసేసుకున్నాను” అని ఇంద్రా అంటే, “నేను ఇంద్రా ఎదురుకుండా నన్ను నేను వామనుడిగా అనుకుంటాను, ఆమె చాలా మంచి మనిషి. నన్ను చాలా ప్రేమించింది. ప్రేమకు హద్దులు లేవు, నేను ఆమె ప్రేమను ప్రేమించాను కాని ఎక్కడా మైలపరచలేదు. ఈనాటికి కూడా ఆమె గంగలా పవిత్రమైనదే. ప్రేమమయి. ప్రేమకు అంకితం అయిన ఆమె అందరికీ ఆదర్శం, ఉదాహరణ. ఆమె ఎదుట నేను ఎప్పుడూ తలవంచాను, ఇక ఎప్పటికీ తలవంచుతాను”.
6
అసలు నీవు గుర్తుకు రాకుండా తెల్లవారలేదు
సాయంత్రం కాలేదు… అంతటా నీవే… నీవే…
(సావిత్రి నిజానికి సావిత్రే)
నీరజ్ మొదటి భార్య సావిత్రి చాలా సాధారణమైన స్త్రీ. ఆమె పతివ్రత. పతి సేవయే ఆమె పరమ ధర్మం. నీరజ్ కష్టకాలంలో ఆయనకి చేయూతనిచ్చింది. ఆయనే తనై జీవించింది. కాని నీరజ్‌కి పేరు ప్రతిష్ఠలు వస్తున్న కొద్దీ, ఆయన పూర్తిగా బిజీ అయిపోయి, పోయిన కొద్దీ, అందరు ఆయన వెనక పిచ్చివాళ్ళై వెంబడించడం చూసిన కొద్ది ఆమెకు సందేహం కలగసాగింది. తనవాడు కాకుండా పోతాడేమోనని భయం కలగసాగింది. “స్త్రీలో ఎప్పుడూ బాధపడే గుణం, ఈర్ష్య ఉంటాయి. నేను ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ఎప్పుడూ నీ వాడినే. నేను అందరివాడినైనా నీ వాడిని మాత్రమే. నీ వాడిగానే ఉంటాను. అసలు ఆమెను వదిలివేయాలన్న ఆలోచనకూడా నాకెప్పుడూ రాలేదు. కాని ఆవిడ ఎన్నో ఫిర్యాదులు చేస్తూ, ఆవిడ తన ఆయుష్షు కూడా నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. నేను ఈ రోజు ఆమెను గుర్తు చేసుకుంటూ…”
7
ఎవరిని చూసినా నీ చిత్రమే కనిపించింది.
కథ అయి ఈ సమయంలో జీవిస్తున్న నీరజ్‌ని ఎందరో మహిళలు ప్రేమించారు. ఇది నిస్సందేహం. మీరట్‌లో ఉండే మహిళ నీర్ (పేరు మార్చబడింది) ఆయన సమకాలీనురాలు. విదేశాలలో ఎన్నో ప్రోగ్రామ్‌లు ఇచ్చిన నీరజ్ గీతాల పట్ల ఎంతగానో ప్రభావితురాలయింది. ఒకరకంగా నీరజ్‌మయం అయిపోయింది. ఆమె ఇల్లు-వాకిలీ వదిలివేసి, గౌరవ-ప్రతిష్ఠలను తుంగలో తొక్కి భర్త దగ్గర నుండి ఇండియాకి వచ్చేసింది. భారతదేశం తన ఇల్లు, నీరజ్ తన జీవితం అనుకుంది. ఆమె ఇంట్లో బెడ్‌రూమ్ అయినా, డ్రాయింగ్ రూమ్ అయినా, గోడల మీద ఎటు చూసినా నీరజ్ ఫోటోలే, ఆమె పూజామందిరంలో కూడా ఒకటే ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో నీరజ్‌ది. నేను చూడలేదు కాని విన్నాను, ఆవిడ ఇంట్లో అడుగుపెట్టగానే వాతావరణం అంతా నీరజ్‌మయం అయిపోతుంది.
ఇట్లాగే ఒక ముస్లిం ఆడపిల్ల ఉండేది. ఆమె ఒక అర్ధరాత్రి నీరజ్ ఇంటికి వచ్చేసింది. వంటి మీద ఉన్న బట్టలతో వచ్చేసింది. ఆ బట్టలు తప్ప కట్టుకోడానికి మరే దుస్తులు లేవు. చేతిలో చిల్లిగవ్వ లేదు. సావిత్రిగారు ఆ అమ్మాయికి బట్టలు కుట్టించింది. వాళ్ళ ఇంటివాళ్ళు వచ్చేదాక ఆమెని తన ఇంట్లోనే అట్టిపెట్టుకుంది.
ఇట్లాంటి మరెన్నో కథలు నీరజ్‌తో ముడిపడి ఉన్నాయి. ఆయనని ఎవరు ప్రేమించినా హృదయ పూర్వకంగా ప్రేమించారు. ఆయన కోసం పిచ్చివాళ్ళు అయ్యారు. ఉదాత్త ప్రేమ వాళ్ళ జీవితం అయింది. ప్రసిద్ధి చెందిన రచయిత్రి మన్నూ భండారి గారు నీరజ్ గీతాల పట్ల ఎంతో ప్రభావితం అయింది. కాని తరువాత ఆవిడ జీవితంలో రాజేంద్ర యాదవ్ ఆగమనం అయింది. ఆవిడ వారిని వివాహం చేసుకుంది.
8
ఎవరు ప్రేమించినా హృదయపూర్వకంగా ప్రేమించారు.
నిజానికి నీరజ్‍ని చూసి ఈర్ష్య చెందేవాళ్ళు ఎందరో ఉన్నారు. వారిని బద్‍నామ్ చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. కాని ఆయనని ప్రేమించినవారి ప్రేమ హృదయ లోతుల్లోంచి పొంగివచ్చిన ప్రేమ. ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి మైత్రేయి పుష్ప నీరజ్ గీతాలను చదివాకే ప్రేమించడం నేర్చుకున్నానని చెప్పారు. ప్రసిద్ధ గజల్‌కార్ సురేంద్ర చతుర్వేది, ఓం నిశ్చల్, లతా యాదవ్ మొదలగువారికి నీరజ్ అంటే ఎంతో గౌరవం. వాళ్ళ ఉద్దేశంలో నీరజ్ యుగపురుషుడు. సైమ్‌సంగ్ బహాదూర్, రామసింహ్ భయ్యా, ఆశీష్‌లే కాకుండా ఇంకా ఎందరో నీరజ్ గీతాలను చదివారు. వృద్ధాప్యంలోకి వచ్చారు. నీరజ్ పేరు వినగానే కళ్ళల్లో మెరుపు వస్తుంది. కేవలం నీరజ్ పేరు విని కవి సమ్మేళనానికి వెళ్ళేవాళ్ళు కోకోల్లలు. “కరతాళ ధ్వనుల మధ్య నా జీవితం నడిచింది. వేదిక మీద నేను లేనప్పుడు, చప్పట్లు విననప్పుడు ఆ క్షణమే నేను చనిపోయినట్టు లెక్క” అని ఎప్పుడూ అంటూ ఉంటారు. నిజానికి వేదిక కుడా నీరజ్ లేనప్పుడు తనను తాను ఆధా అధూరా అని అనుకుంటుంది. కాన్‌పూర్ వాస్తవ్యులు, ప్రసిద్ధ అస్టూబాబూ ఎంతో ఉత్సాహంగా నీరజ్ గురించి మాట్లాడుతుంటారు. ఆయన ఆఫీసులో నీరజ్‌తో పాటు తను తీయించుకున్న ఫోటో కూడా ఉంది. నేను చూసాను. బ్రహ్మేంద్ర గుప్తా నీరజ్‌ని సాక్షాత్ దేవుడిగా భావిస్తారు. వారి చరణాలకు వందనం చేసినప్పుడు దేవుడికి పాదపూజ చేసినట్లుగా ఆయన భావిస్తారు.
భగవాన్ ఓషో కూడా నీరజ్‌ని గౌరవించేవారు. ఆయన ఎన్నో పుస్తకాలకు నీరజ్ ఉపోద్ఘాతం రాసారు. అమృతాప్రీతమ్ జీవితం – రచనల పట్ల ఎంతో ఆకర్షితులైన ఓషో ఆవిడకి ఆహ్వానం పంపినా ఆమె రాలేదు. కాని నీరజ్ వెంటనే వెళ్ళేవారు. ఎందుకంటే ఓషోకి నీరజ్ పట్ల ఎంతో ఆకర్షణా, గౌరవాలు ఉన్నాయి. అంతే ఆకర్షణా, గౌరవాలు నీరజ్‍కి ఓషో పట్ల ఉన్నాయి. ఓషో ఉపన్యాసాలలో ఎప్పుడూ నీరజ్ కావ్యపంక్తులు ఉండేవి. నీరజ్ గీతాలలో ఓషో తత్వం ఉండేది. ఇద్దరు చాలా దగ్గరి స్నేహితులు. ఓషో అడిగినందువల ఆశ్రమంలోనే నీరజ్ 5,6 గీతాలు రాసారు. వాటిల్లో ‘యహ్ ప్యాసోంకీ ప్రేమ్ సభా హై’ ఎంతో ప్రసిద్ధి పొందిన గీతం.
ఒకసారి ఓషోని “భగవాన్ ఓషో అని ఎందుకు రాస్తావు, భగవంతుడని అనిపించుకోవాలని ఎందుకనుకుంటావు?” అని అడిగారు. “చనిపోయాక ఈ విశేషణాలని అందరూ మరచిపోతారు. కాని నీ ఫిలాసఫీ, నీ ఆలోచనలే నిన్ను జీవింపజేస్తాయి” అన్నారు నీరజ్. ఓషో అప్పటికే పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. ఆయన నీరజ్ మాటలను అన్యథా అనుకోలేదు. అపార్థం చేసుకోలేదు.