9
“ఆద్మీ కో ఆద్మీ బనానే కేలియే జిందగీ మే ప్యార్ కీ కహానీ చాహియే”
(నేను కేవలం ప్రేమించాను)
జడం అయినా చైతన్యం అయినా అది ఏదైనా నీరజ్ ప్రేమించారు. నిజానికి ప్రేమ వారి బలహీనత, వారి శక్తి కూడా. ప్రేరణ, గతి. అసలు జగత్తంతా ప్రేమమయం. ఈ ప్రేమలో పాపం ఉన్నా అది పాపమయమైన ప్రేమ ఎంత మాత్రం కాదు. పైగా ఈశ్వరుడి పట్ల జిజ్ఞాస లాంటిది. నిర్మలమైనది, శాశ్వతమైనది, సంపూర్ణమైనది.
ప్రేమ రాగం
దాని పేరే జీవితం
పాడుతూ గడిపితే ఉదయం
ఆడి గడిపితే సాయంత్రం
అసలు శబ్దాలు జ్ఞానం వ్యర్థం
కన్నీళ్ళను గీతలుగా మార్చాలంటే
ప్రేమను మనస్సాక్షిగా ప్రేమించాలి
మనిషిని మనిషిగా తయారు చేయాలంటే
జీవితంలో ఒక ప్రేమ కథ కావాలి.
ఎందుకంటే నీరజ్ దృష్టిలో
పుణ్యం చేసినవాళ్ళు దేవతలవుతారు
పాపం చేసినవాళ్ళు పశువులవుతారు
ప్రేమించేవాళ్ళు మాత్రమే మనుషులవుతారు.
నీరజ్ ప్రేమ ప్రేమను పూజనీయంగా చేసింది. పతనం చేయలేదు. పై స్థాయికి తీసుకువెళ్ళారు. నిర్మాణం, సృజన, సంవేదన మానవత్వపు కోటలే దీనికి పునాదులు.
హద్దులను అతిక్రమించడమే ప్రేమ కర్తవ్యం
అంటే ప్రతీ మనిషి ఋణాలను తీర్చుకోవడం
జ్ఞానాన్ని, ధ్యానాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకున్నవాళ్ళా!
మనిషి దేవుడవడమే మతం యొక్క ధ్యేయం.
నీరజ్ ప్రేమ సంబంధం ఆత్మతో ఆత్మకు కల సంబంధం. సంబంధాన్ని మానవత్వంగా మార్చే సంబంధం.
ద్వేషాన్ని ప్రేమతో అలంకరించినప్పుడే
ధరిత్రిని స్వర్గంతో అలంకరించగలుగుతాం.
ప్రేమలో ద్వేషానికి ఏ మాత్రం స్థానం లేదు. మనిషిని మహనీయుడిగా మార్చేదే ప్రేమ. అందుకే నీరజ్ హింస – ద్వేషం – వినాశకారి తుపాకి మందు రాశి మీద కూర్చునే బదులు సంవేదన లేని మరుభూమిని ప్రేమతో తడిపి శాంతి పూవులను వికసింపజేయాలని కోరుకున్నారు.
మనస్సు మనస్సులకు మధ్య అగాధాలు, మైదానాలతో రక్తపాతాలు, రోడ్ల మీద యుద్ధాలు నడుస్తున్నాయి. శ్మశానాలలో శాంతిని పాతిపెట్టారు. సంకెళ్ళు తెంపబడ్డాయి, కాని ఈ లోకంలో మనిషికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. ఆనందం అంతా వెండి తాపడం చేయబడ్డ భూములలోనే ఉంది.
నిద్రిస్తున్న కిరణాన్ని లేపుతూ ముందుకు నడు
అలకతో ఉన్న ఉదయాన్ని బతిమలాడు
ప్రేమ ముసుగులలో బందీ కాకుడదు
ప్రతీ మేలిముసుగును తొలగిస్తూ ముందుకు నడు
అందరూ ఒక దారిపై నడిచేవారే
అందరినీ ప్రేమిస్తూ ముందుకు నడు.
అణా రెండణాలకి అమ్ముడుపోయింది నలువైపులా ఇదే మాట
నడిరోడ్దు మీద మానం అమ్ముడుపోతోంది దుకాణాలలో
దారి దారినా మందిర్-మస్‌జిద్, అడుగడునా గురుద్వారాలు
ఈ భగవంతుడి బస్తీలలో మనిషి-మనిషిపై ఎన్నెన్ని అన్యాయాలో – అత్యాచారాలో…
ప్రతీ కిటికీని తెరిపించు, సంకెళ్ళను తెంచుతూ నడు
వీటి వలన వెలుగు రాకపోతే, మానస దీపాన్ని వెలిగించుతూ నడు.
అందరూ ఒకదారిపైన నడిచేవారే,
అందరినీ ప్రేమిస్తూ ముందుకు నడు.
నీరజ్ ఎంతో భావుకుడు. వారి మానస ఉత్కర్ష, స్వచ్ఛతల సంబంధం హృదయంలోని లోతులతోనే కాదు, ఉన్నత దృష్టి కోణం, నమ్మకాలతో కూడా ముడిపడి ఉంది. కన్నీళ్ళను అద్దెకు తెచ్చుకునే ఈ మనుషుల మధ్య కవి నీరజ్ బాధ హృదయపు లోతుల్లోంచి వచ్చింది. ఈ బాధ నదీ ప్రవాహపు వేగంతో, విశ్వకళ్యాణం అనే మహా భావనా సముద్రంలో లీనం అవడం మనం చూడగలుగుతాము.
ద్వేషం అనే తుపాకి మందును వెదజల్లకు నేస్తం
ఈ యుద్ధాల విషపు కాలువలను మూసేయ్.
ఏ ప్రేమ అయితే ఇనుప పెట్టెలలో బంధింపపడ్డాదో
దాని బంధనాలను తెంచెయ్యి, ముక్తి కలిగించు.
యుద్ధాల వల్ల ఏ శక్తిని తెచ్చావని?
ఇక ఈ కత్తులు కటారాలు పారేసేయ్, ప్రేమను పొందు
నీదే విజయం అవుతుంది నేస్తం
శత్రువులకు నీ మనసిచ్చి చూడు నేస్తం.
అసలు మనిషి మానవత్వం మరిచిపోతే, మనిషి మనిషిని హృదయానికి హత్తుకోకపోతే, అవతలివాడి బాధను అర్థం చేసుకోలేకపోతే వాడికి మనిషి అని పిలిపించుకునే హక్కు లేదు – లేదు గాక లేదు అని నీరజ్ అంటారు.
నేను నేర్పించేది ఇదే, నీవు బతుకు, అవతలి వాళ్ళని బతకనివ్వు
పంచి ఇవ్వగలిగినంత ప్రేమను పంచు
నువ్వు, నీతో పాటు దళితులు; ధూళి నవ్వులా నవ్వు
దారిలో ఏ ముల్లు కూడా నలిగిపోకూడదు, అట్లా నడు
నీ సుఖం నీదే కాదు, అందులో లోకం పాలు కూడా ఉంది
పువ్వు కేవలం కొమ్మది కాదు, అది ఉద్యానవనానికి మొదటి శృంగారం
తరువాతే అది కొమ్మకి శృంగారం…
అసలు కృష్ణుడు ప్రేమకు ప్రతిరూపం అంటే, ప్రేమకు ప్రతిరూపం నీరజ్ అని నేనంటాను. ఈ ప్రేమ బలంతోనే నీరజ్ ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, యుద్ధాలు చేశారు. ఈనాడు ఈ వృద్ధాప్యంలో కూడా ఇంత బలహీనుడినా జవనశక్తి ఆయనకు ప్రేమ వలనే లభిస్తోంది. ఇప్పటికీ ఆయన మానసికంగా ఉల్లాసంగానే ఉన్నారు.
10
ఆకలి మనిషిని విశ్వాసఘాతకుడిగా చేస్తుంది.
కోరిక మనస్సు – దేహాన్ని అపరాధిగా మారుస్తుంది
(ఈ ఆకలి ఈతిబాధల వలనే పుట్టింది)
అసలు నీరజ్ బాధా దుఃఖాల గర్బం నుండే పుట్టాడు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పుట్టిన కొన్నిరోజులకే తండ్రి చనిపోయాడు. తల్లి అంటే ఆయనకి ఎంతో అభిమానం, ప్రేమ. కాని పరిస్థితుల కారణంగా మామయ్య హరదయాళ్ ఇంట్లో ఉండాల్సివచ్చింది. బాల్యం తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చింది. బాలుడిగా, యువకుడిగా లేమి వలన ఎన్నో బాధలు పడాల్సివచ్చింది. రైలులో కూడా పకోడీలు, టీ, సిగరెట్లు అమ్మాల్సి వచ్చింది.
కొందరు ఆయనని లోభి అని, సుర-సుందరిలతో ఆయన జీవితం ముడిపడి ఉందని అంటారు. ఎవరైతే బాల్యం, యౌవనంలో సగభాగం కడుపుకి ఓ ముద్ద దొరకక అలమటించాడో, ఈ నిస్సహాయ స్థితిలో ఏదో ఒక మిల్లు ఫాటక్ దగ్గర నిల్చుని పనికోసం ఎదురు చూసాడో మరి ఆయనలాంటి ఎవరైనా చివరివరకు ఆకలిగానే ఉంటారు కదా! అసలు ఈ భయం వలనే ఆయన ఇప్పటి దాకా లోభిగా బతుకుతున్నారు. అయినా ఆయన అంతో ఇంతో అందరికీ సహాయం చేసిన మనిషే ఈ నాటికి చేస్తూనే ఉన్నారు.
నీరజ్ ‘కాన్‌పూర్ కీ పాతీ’లో రాసారు.
కాన్‌పూర్ ఇవాళ నీ కొడుకుని చూసావు
నీ నీరజ్ బదులు అతని శవాన్ని చూసావు
నన్ను నేను ఎంత తక్కువగా అమ్ముకున్నానంటే
బీదరికం కూడా నన్ను కొంటే బాధపడుతుంది.
కాని ఈ వ్యక్తి ఎప్పుడు ఎవరిదీ ఒక చిల్లి కానీ తీసుకోలేదు, మోసం చేయలేదు. ఏ పని దొరికితే ఆ పని చేసారు. ఈ పని చేస్తే పరువు తక్కువ, ఆ పని చేస్తే గౌరవం అని ఎప్పుడు అనుకోలేదు. ఎవరి దగ్గరా పైసా అప్పు తీసుకోలేదు. అప్పులు తీసుకుని ఎగురగొట్టలేదు. ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. స్వాభిమానంగా శ్రమపడ్డందుకు గర్వపడ్డారు. ఈనాడు వారు ఈ స్థితిలో ఉన్నారంటే ఆయన శ్రమకి ఫలితమే. అసలు ఎవరనుకున్నారు, ఎవరినైతే దారిలోని ధూళి సైతం చీదరించుకుందో, అతడే ఒకరోజు ఒక మహాకవి, ఒక యుగకర్త అవుతాడని?
కాని ఈనాడు వారి స్థితి చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. జీవితం అంతా అందరి కోసం శ్రమించిన ఆ మనిషి ఇవాళ అందరికి బరువైనారు. ఆయన ఒకప్పుడు ఎట్లా శ్రమించి రాజకుమారుడిలా బతికారో రాజకుమారుడిలాగానే చనిపోతే చాలు. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను.
ఇక ప్రేమ విషయంలో… పైసల లాగా ప్రేమ రాహిత్యం ఆయనను ప్రేమ కోసం తపింపజేసింది. ప్రేమ కోసం ఆయన పడ్డ తపన అంతా ఇంతా కాదు. అయినా నీరజ్ ఎపుడు ఎవరిని మోసం చేయలేదు. ఎవరిపై అధికారం చూపించలేదు.
ప్రతి వ్యక్తి లోనూ మంచి గుణాలు, చెడు గుణాలు రెండూ ఉంటాయి, ఏ వ్యక్తీ పరిపూర్ణుడు కాదు. నీరజ్‍లో కూడా బలహీనతలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. ఆయన శరీరపు దుప్పటి మురికిగా ఉండవచ్చు, వందల మరకలు ఉండవచ్చు, కాని ఆయన మనస్సు అనే దుప్పటి మాత్రం ఎటువంటి మరకలు లేనిది. నేను ఎక్కువగా ఎవరిలోనూ చెడు చూడను. కొందరు వారిలో బలహీనతలు మాత్రమే చూసారు. నేను నీరజ్‌లో ఒక ఎంతో అమాయకుడైన మంచి మనిషిని చూసాను. వారిలో అమాయకమైన, నిష్కళంకమైన, నిరభిమాన, పట్టుదల కల ఒక బాలుడిని నేను చూసాను. నేను వారిలో ఒక మహామనిషిని చూసాను. ద్వేషం, అహంకారం లేని ఆత్మను చూసాను. ఎంతో విశాలమై, మానవతా విలువలతో వెలిగే ఆత్మను చూసాను.
అందుకే…
నీరజ్ కన్నా ధనవంతుడు ఇక్కడ ఎవరున్నారు?
ఆయన హృదయంలో లోకం లోని ప్రేమ అంతా నిండుకుని ఉంది
అని నేనంటాను.
11
కన్నీళ్ళను సన్మానం చేసినప్పుడల్లా అందరూ నన్ను తలచుకుంటారు అని ఆయన అన్నారు.
కాని మానవతా విలువలను నిలపాలని తపన పడ్డ ఈ ప్రేమ పూజారిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వీళ్ళల్లో ఆయన ముందు పొగిడి, వెనక ఆయన గురించి చెడు ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు మోసకారులు, ఎంత సేపూ లోపాలు వెతకడమే వీళ్ళ పని. వీళ్ళు స్వార్థపరులు. వారితో పనులు చేయించుకుని నమ్మక ద్రోహం చేసేవాళ్ళు. విమర్శించడం తప్పు కాదు, విమర్శించే తీరు తప్పు. ఈ విమర్శంచే వాళ్ళు పత్తిత్తులేం కారు. విమర్శించినా కేవలం ఆయన వ్యక్తిత్వం గురించే ఎందుకు? రచనలను ఎందుకు విమర్శించలేదు? ఆయన లోని చీకటి మాత్రమే చర్చించేవాళ్ళు వ్యక్తిత్వంలోని ఉజ్జ్వలమైన పక్షాన్ని ఎందుకు వితర్కించరు? ఎదురుకుండా ఒక మాట, వెనక మరో మాట.
ఆయన గురించిన కథలు – వదంతులు ఇక చాలించండి. ఆయన పొందిన వాటిని గురించి, ఆయన గీతాల గురించి చర్చించండి అని నేనంటున్నాను. 95 సంవత్సరాల వయసులో కూడా సాహిత్యం పట్ల ఆయనకున్న ప్రేమను చూస్తె మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. సాహిత్యం కోసం ఆయన అంకితమైపోయారు. దానిని గురించి చర్చించండి. ఆయన గీతాలపై చర్చలు పెట్టండి. దేహం జర్జరమైన స్థితిలో ఉన్నప్పుడు దాన్ని గురించే ఎందుకు మాట్లాడటం? నిజానికి ప్రేమ సంబంధాలు వ్యక్తిగతమైనవి. ఒక తాగుబోతు మరో తాగుతోతును విమర్శించడం హాస్యాస్పదం. తాము చరిత్రహీనులై ఎదుటివారిని వేలెత్తి చూపడం ఎంతవరకు న్యాయం?
కాని ఆశ్చర్యం ఏమిటంటే ఆయనని ద్వేషించేవారు – ద్వేషించడం, బహిష్కరించడం బదులు ఆయనకి తమ మనస్సులలో పెద్ద పీట వేసి పూజిస్తున్నారు. ఆయన విఅపు వేలెత్తి చూపిస్తూ, మళ్ళీ ఆయన గురించిన జయఘోష చేస్తున్నారు. సాహిత్యాకాశంలో ఆయనకి ఒక స్థానం దొరకక పోయినా ప్రపంచంలో గీతకారుడిగా ఎంతో పేరు పొందారు. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది ప్రతి వ్యక్తిలో ఒక నీరజ్ ఉన్నాడని, ఆ నీరజ్ కవి నీరజ్‌లా బతకాలనుకుంటాడని. కాని ఈ విమర్శలు, అభాండాలు, ఆరోపణలు – గాయపడ్డ నీరజ్ ఇట్లా అంటారు “నేను ఏ అపరాధం చేయలేదు, నేను ఏది చేసినా ప్రేమకు వశీభూతుడనై చేసాను. మనిషి మనిషిని ప్రేమించడం అపరాధం అయితే నేను ఈ అపరాధం చేసాను. ప్రతి జన్మలోనూ చేస్తాను. జన్మ జన్మలకీ నేను అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను.”
12
“నేను ఎంతగా బద్‌నామ్ అయ్యానంటే లోకమా! నన్ను మరిచిపోవడానికి నీకు కొన్ని యుగాలు పడుతుంది…”
నీరజ్ ఈనాడు మారుతున్న ప్రేమ స్వరూపాన్ని చూసి ఆయన ఎంతో బాధపడుతున్నారు. అసలు ఈనాడు ప్రేమ ఎక్కడ ఉంది? అంతా పై పై నాటకమే. ఈనాడు ప్రేమ ఫోనుతో మొదలవుతుంది. ఫోనుతో అంతం అవుతుంది. ప్రేమ ఒక తపస్సు, ప్రేమ ఒక ఆరాధన. ఇది అందరికీ సాధ్యం కాదు. అవతలి వాళ్ళని పొందడమే ప్రేమకాదు. అసలు ప్రేమ ఉంటే ద్వేషం ఎట్లా ఉంటుంది? ఈనాడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావం అధికంగా ఉంది. ఆలోచనల మీద భావాల మీద దాని ప్రభావం ఊహకందనంతగా ఉంది. యాసిడ్ దాడులు, బలాత్కారాలు, హత్యలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ఏది జరగకూడదో అదంతా జరుగుతోంది. ప్రేమను చేయూతగా తీసుకోండి. జీవితానికి పునాదిగా చేసుకోండి. ఒకవేళ దొరకలేదనుకోండి, ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలని, లేకపోతే తనని చంపేసుకునే ఆలోచనలని మానేయండి. ఆ ప్రేమకే కొత్త ఆకారం, కొత్త పరిభాష ఇవ్వండి. విశ్వాన్ని ప్రేమించడం నేర్చుకోండి.
అసలు గమ్యం లేని దారిలో మనం నడవాలి
ఏ దుఃఖంలో అయితే జీవితాంతం బతికామో,
ప్రేమకి ఆ బాధ కావాలి,
బలమైన కోరిక కోసం
తమని తాము సమర్పించుకోవడమే ధర్మం.