(15 జూన్ మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సముద్రాల హరికృష్ణ గారి నివాళి- ‘త్రిదశ’!)
‘త్రిదశ’లో – స్వగతం!!
1
[dropcap]క[/dropcap]వనం ఒక సవనం, నాదొక పట్టుదలల భగీరథ ప్రయత్నం
సవనానికి సమిధేద్దామని, సుర్నది నిలమార్గం పట్టిద్దామని!
~
2
వెన్నెలలు ఆ కోయిలలు కారాదోయ్ నీ రచనాంగణ సన్నివేశం
అన్నార్తుల ఆ బడుగన్నల గాథాశతి కావాలోయ్ నీ కృషిరంగం!
~
3
తలదాచగ గూడు లేని కడుపారగ కూడు లేని శ్రమజీవుల
తలరాతల మార్చే నవతేజం తేవాలోయ్ యువరక్తం కావాలోయ్!
~
4
ఆ రైతు చెమట, కార్మికుడి పటిమ, కూలీ కష్టం పట్టు ల్కావాలోయ్
విరబూసే సమాన హక్కుల ప్రజానురంజన ప్రబోధ గీతానికి!
~
5
జనోపయోగం లేని మృషాక్షర వ్యవసాయం, మస్తిష్కపు వృథాయాసం
ఓ నవోహల సదామల లోకం కనవోయ్, తరాల తమ్ముల కోసం!
~
6
కవితా పథాన్ని నిర్వచించి నిర్దేశిస్తా, అభినవమార్గం పట్టిస్తా
అవనిలో అర్హం కాని దేది లేదు కవితకు, ఇదే నా ఋతగీతం!
~
7
మెట్ట వేదాంతీ, ఓ మిథ్యావాదీ, తప్పుకో యిక, శుష్క ప్రియాలు చాలిక
కట్టు నడుమందరి బాగుకు, ఉమ్మడి సంక్షేమ బృహల్లక్ష్యం వైపుగ!
~
8
కర్షక శ్రామిక బలగా లేకత్రమై, పుడమిని పున్నమి కడలై
హర్షం అందరి కందించే సమతార్ణవ వరతరుణం అతిత్వరలో!
~
9
అందం తాజ్ మహల్ది ఎట్లా? రాళ్ళెత్తిన, అది కట్టిన చేతుల స్వంతం
డెందం ఉంటే చూడండిక కొండల కరగించే కష్టం లో-వెల్గుల అందం!
***** ***** *****
‘త్రిదశ’లో జగద్విదితం!!
1
‘అక్షర’ బాణ సంపద తన పొదిని మెరిసే వీర ధని, శ్రీశ్రీ!
వాక్యపు వజ్ర ధారల పదునెక్కిన కవితా వర గుణి, శ్రీశ్రీ!
~
2
బంధించే శృంఖలాలు అడ్డంకులని గతఛందస్సుల, కాదన్నాడు
పంథా స్వయంనిర్మితము, స్వతంత్రము నాది, గురజాడ జాడన్నాడు!
~
3
నీ కోసం నే గావించిన తపోన్వేషణలో, ఏమేమో విన్నా నన్నాడు
ఆ కవితా జననిని, కని విని నేర్వని రీతుల సేవించాడు!
~
4
కన్నియలు, ఆమనులు, ఊర్వశులెట్లా కవితావస్తువు లన్నాడు?
అన్నార్తుల ఆ అరుపులే, అతి సామాన్యుడే తన లక్ష్యం అన్నాడు!
~
5
మనిషి వ్యథల చెప్పజాలని ఆ పలుకు, సిరా వృథా అన్నాడు
కన గల్గితె, వ్యక్తికి బహువచనమె శక్తని హుంకరించాడు!
~
6
కవితావేశ సహజావేదన ప్రజకై అక్షరబద్ధం చేశాడు
ఎవరికి పట్టని, ఆ బాధాసర్ప దష్టుల తా నక్కున చేర్చాడు!
~
7
ఎక్కడో అల నింగిదారుల ఆ రథచక్రాల నిటు మళ్ళించాడు
అక్కజమై చూసి, అవాక్కైన, జగన్నాథుని భూమార్గం పట్టించాడు!
~
8
ప్రపంచపు బాధ తనదని ఓపగలేక లిపి రూపం ఇచ్చాడు
విపంచీ రాగాల, విస్ఫోటితాంగారాల, రెండిటిని తా చూపాడు!
~
9
ఇరవైలో అరవై భావాల వారిని, నీరసుల నిరసించాడు,
నిర్భయత్వపు ప్రశ్న-బావుటా వహించే సరి జోదుల రమ్మన్నాడు!
~
10
నూత్న వైప్లవ్యగీతాలను, ప్రాచీన పదబంధాలలో బిగించాడు
పాత బాగ చదివి, క్రొంగొత్త కవితా రసౌషధం కనిపెట్టాడు!
~
11
అనితరసాధ్యం నామార్గం, శతాబ్ది నాదన్న ఖలేజా అతనిది
కని, వినగల్గే మనసుంటే, నవీన కవితా వేదం అతనిది!
~
12
దేశ చరితల, మనిషి స్వార్థపులోతుల ప్రేగుల లెక్కించాడు
లేశంలో సారం, పరపీడన పరాయణమె నరచరిత్రన్నాడు!
~
13
మరో ప్రపంచపు పిలుపు లవిగో విన రా రమ్మని కేకేశాడు
సరిసమానంగా మనుషులందరు మెలిగే నాకం కల గన్నాడు!
~
14
కలంలో, పల్కులో బలముంటే, కవిత కేదైన సరియే నన్నాడు
వెల్గు అగ్గిపుల్ల, నుర్గు సబ్బుబిళ్ళ, చెలిమి కుక్కపిల్ల, ఏదైనా!
~
15
ఆ పయోధి రత్నశోధనో, గుప్తసమాధో ఎంపిక నీదేనన్నాడు
ఇంపగు సినీగీతాల ఉందిలే మంచి కాలమని ఊరడించాడు!
~
16
తిరిగే కుమ్మరి చక్రం, మండే కమ్మరి కొల్మే, పూజాసామగ్రన్నాడు
నరుడే, శ్రామికుడే, కవితా ప్రస్థానానికాధార కేంద్రమన్నాడు!
~
17
బిందువై మొదలై, పెను సింధువై పరచుకొనిన దీతని వైనం
చంద్రునిలో నిప్పులు, తరణిలో చలువల చూపించిన కవనం!
~
18
‘సిప్రాలి’లో చిత్రాతిచిత్ర కళల చూపాడు, సిరిమువ్వ చిందుల
సుప్రాస క్రీడల, లిమరిక్కోక్తుల, త్రిఫల రసాయనం వండాడు!
~
19
ప్రపంచమొక పద్మవ్యూహం, చొచ్చి వెల్వడే సౌభద్రుడు నేనన్నాడు
కవిత్వమొక తీరని దాహం, అక్షర గంగనె తాగేశానన్నాడు!
~
20
శ్రమ జీవన సౌందర్యా న్నారాధించా డాకాసపు టెత్తుల కెత్తాడు
హిమానీ స్తబ్ధ శైలాల నిరసించి, కాంతిశిఖరం చేరుకొన్నాడు!
~
21
అతడొక విచిత్ర వ్యక్తిత్వపు, విక్రాంతపు దినుసుల ఆల్కెమీ
చేతల లొసుగులెందుకు, రాతల వాసికి సు మనస్సుల మౌదాం!!