మహనీయులు మనతోనే ఉన్నారు…

1
2

[dropcap]అ[/dropcap]ది 1982వ సంవత్సరం.. కాకినాడ. మా నాన్నగారు బులుసు వెంకటేశ్వర్లు గారి ఇల్లు.

ఒకరోజు మా నాన్నగారు..”అమ్మా, మనింటికి కలెక్టర్ గారు వస్తున్నారు. వారికి ఏమి మర్యాద చేస్తావో చెయ్” అన్నారు.

మనలాంటి సామాన్యుల ఇంటికి పెద్ద ఆఫీసర్ గారు రావడమా అని ఆశ్చర్యం, ఆనందం, కాస్తంత కంగారు కలిగింది. చెప్పిన టైంకి కరెక్ట్‌గా వచ్చేసారు కలెక్టర్ గారు. ఆయనే శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు..

వారిని తన గ్రంథాలు ఉన్న గదిలోకి తీసుకు వెళ్లారు సాదరంగా. అప్పుడు సమయం ఉదయం 10.30 గంటలు అయింది. నాన్న పిలవగానే ఒక ట్రేలో కాఫీ, బిస్కట్స్, ఫ్రూట్ జూస్ తీసుకు వెళ్లాను. నాన్న ‘మా అమ్మాయి, సెలవులకి వచ్చింది’ అంటూ పరిచయం చేశారు. నేను వారికి నమస్కరించి ‘ఏమి తీసుకొంటారు సార్?’ అనడిగాను. వారు జ్యూస్ తీసుకొన్నారు. నాన్న, ప్రసాద్ గారు చాలా సేపు మాట్లాడుకున్నారు.

ఇంతకీ అంతటి అధికారి మా ఇంటికి ఎందుకు వచ్చారంటే, మా నాన్న గారు, సుసర్ల శ్రీనివాసరావు గారు ఒకే కాలేజీలో లెక్చరర్లు. స్నేహితులు. రావు గారి అల్లుడే శ్రీ ప్రసాద్ గారు.

ఒకసారి నాన్న రావు గారి ఇంటికి వెళ్ళినపుడు రావు గారమ్మాయి గోపిక భర్తని పరిచయం చేసి ‘నాన్న రచయిత అనీ, పుస్తకాలు రాసారని, వారి దగ్గర గొప్ప సాహిత్య గ్రంధాలు ఉన్నాయ’ని చెప్పారు. గోపిక నాన్నగారి స్టూడెంట్ కూడా..

సాహిత్యాభిలాషి అయిన ప్రసాద్ గారు ఆ గ్రంథాలు చూడాలనే కుతూహలంతో మా ఇంటికి రావడం జరిగింది. నాన్న తాను రాసిన మహర్షుల చరిత్ర 9 భాగాలు వారికి ఇచ్చారు.

ఆ తర్వాత ఏమి జరిగిందంటే, మహర్షుల చరిత్ర చదివిన గోపిక ‘మహర్షుల గురించి ఎవరూ పుస్తకాలు రాయలేదు. ఎవరికీ తెలియదు. వీటిని ప్రచారంలోకి తీసుకు రావాలి. కనుక మీరు ఏంచేస్తారో చేయండి’ అంటూ ప్రసాద్ గారికి చెప్పారు.

అప్పుడు ప్రసాద్ గారు తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్నారు. వారు మహర్షుల చరిత్ర పుస్తకం ప్రచురణ హక్కులు దేవస్థానం గ్రంథాలయంకి తీసుకొన్నారు. శ్రీమతి గోపిక కారణంగా మహర్షుల చరిత్ర గ్రంథం తిరుమలేశుని పాదాల చెంతకు చేరింది. భారతదేశంలోని శ్రీవారి భక్తజన కోటికి చదువుకొనే అవకాశం కల్పించిన ఆ పుణ్య దంపతులను ఏమని పొగడగలము..

నాన్నగారికి గోపిక అనే ఒక విద్యార్థిని ద్వారా ప్రసాద్ గారి సాన్నిహిత్యం లభించింది. వారి గ్రంథానికి గుర్తింపూ వచ్చింది. అది ఆయన కృషికి ఫలితం అంటారు. ”ఆ పై వాడు శాసించాడు, నేను నా కర్తవ్యం నిర్వహించాను” అంటూ భక్తిపూర్వకంగా చెప్పారు తప్ప ఆవగింజ అంత అతిశయం లేదు. అంతటి గొప్ప హృదయం ప్రసాద్ గారిది.

అంతటితో నాన్న గారితో ప్రసాద్ గారి పరిచయం ముగిసిపోయింది.. ఎప్పుడు ఎవర్ని ఏ విధంగా కలుస్తామో తెలియదు. కానీ ఆ పరిచయంలో మరో పరమార్థం కూడా ఉంటుందని నా అనుభవం చెపుతోంది..

అసలేం జరిగిందంటే…

16 సంవత్సరాల తరవాత మా వారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడటం జరిగింది. అప్పటికే శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారి కుటుంబం కూడా హైదరాబాద్‌లో ఉన్నారు. నాన్నగారి దగ్గరున్న పుస్తకాలు, ఇంటి ఎదురుగా ఉన్న గ్రంథాలయ సాహిత్యం మొత్తం చదవడం వలన నాక్కూడా రాయడం పట్టుబడింది. కొన్ని పత్రికల వారు పుస్తక సమీక్షలు రాయమని పంపుతుండేవారు.

అదీ కాక స్వంతంగా కొనుక్కొని కూడా సమీక్షలు రాసి పంపేదాన్ని. ఆ సందర్భంగా శ్రీప్రసాద్ గారు రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా చదివి సమీక్షలు రాసేను.

ప్రసాద్ గారు రాసిన ఆ గ్రంథాలు ఒక ప్రత్యేకం. ‘అసలేం జరిగిందంటే’….. మరో ప్రత్యేకత సంతరించుకొంది. వారి లోని రచయిత సాక్షాత్కరించారని చెప్పాలి.. ఒక ఆఫీసర్‌గా, ఒక పరిపాలనా దక్షుడుగా, ఒక భక్తునిగా పవిత్రుడు. రచయితగా సాహితీ ప్రియులకు ప్రియమయినవాడు. ఇన్ని లక్షణాలు ఉన్నవారు చాలా అరుదే కాదు… అసలు లేనే లేరేమో…

ఈ పుస్తకం చదివి సమీక్ష రాసాను. చదివించే శైలి, పక్షపాతం లేకుండా నిజాయితీగా తన అనుభవాలను ఆకట్టుకొనే విధంగా రాసారు. హాస్య చాతుర్యం, ఉత్కంఠ, హృదయాన్ని కదిలించే విషాదం అన్నీ ఉన్నాయి ఇందులో. ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు. ఇంతగా చదివించిన పుస్తకం ఇదొక్కటే. అంతగా ఆకట్టుకొంది. నా అభిప్రాయాలూ సమీక్ష ద్వారా తెలియజేస్తూ ఒక కాపీ ప్రసాద్ గారికి, ఒక కాపీ ఆంధ్రప్రదేశ్ మాస పత్రికకి పంపించి అమెరికా వచ్చేసాను. నా సమీక్ష పత్రిక వారు ప్రచురిస్తారా, లేదా అని పట్టించుకోలేదు.

దాన్ని గురించి ఆలోచించలేదు. చెప్పాలనిపించింది, చెప్పేసాను అంతే..

రెండు నెలల తరవాత స్నేహితులు సమీక్ష చదివాం, పుస్తకం వెంటనే కొని చదివాం… అని చెప్పినప్పుడే తెల్సింది. చేరాల్సిన వారికీ చేరింది అని… ఇంతకన్నా ఏమి కావాలి…గొప్ప సంతృప్తి…

ఒకసారి హైదరాబాద్‌లో మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సత్యసాయి ఫంక్షన్ హాల్‌లో టి.టి.డి. వారు ఏర్పాటు చేసిన 116 మంది వేదపండితుల వేదం పఠనం చూసాను… అది ‘ప్రసాద్’ గారి ఆధ్వర్యంలో.. చెవులారా విన్నాను. ఇలాంటివి జీవితంలో ఒకసారి అయినా చాలు…

అప్పుడు కాకినాడ తరవాత ప్రసాద్ గారిని దర్శించడం.. మా దంపతులు వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.. వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, వారి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వారు మన మధ్యనే ఉన్నారు. వారు ప్రజా సేవ,

భగవత్సేవలో అగ్రగణ్యులు.. ఆధ్యాత్మిక ప్రచారంలో అలుపెరగని శ్రమజీవి.

ఎందరికో బ్రతుకు తెరవు చూపిన ఉదారమూర్తి… మహనీయులకు పుట్టుకే కానీ మరణం అనేదే లేదు. వారి జ్ఞాపకాలను పంచుకోవడం మన కర్తవ్యం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here