మహానుభావురాలు

0
3

[dropcap]కృ[/dropcap]ష్ణుడు మధురా నగరం వొచ్చి కంసుణ్ణి చంపి మూడు నెలలైంది. ఉగ్రసేనుణ్ణి రాజు చేసి రాజ్యం అవక్ర పరాక్రమంతో ఏలుతున్నాడు.

కంసుడి సభకి వెళుతూండగా ఎదురువొచ్చిన త్రివక్ర అయిన కుబ్జని అనుగ్రహించి తన దగ్గర ఉన్న లేపనాలని గ్రహించి తనని అత్యంత సౌందర్యవతిగా చేసింది మధురలో అందరికీ ఎరుకే.

కుబ్జ అసలు పేరు నాగమణి. చిన్నప్పటి నుంచీ తల్లీ తండ్రీ లేపనాలు చేస్తూ కంస మహారాజుకీ, ఇతర పెద్దలకీ ఇస్తూ ఉంటే ఆ విద్యలో ఆరితేరి తల్లీ తండ్రీ కాలం చేసిన తరవాత చెలికత్తెతో ఉంటూ కాలక్షేపం చేస్తోంది.

“వేంచేయుము నా ఇంటికి పంచశరాకారా” అని ప్రార్ధించిన కుబ్జకి “మత్కామితము తీర్చి పిదపన్ నీ మందిరమునకు వత్తును” అని అభయం ఇచ్చి వెళ్ళిపోయిన కృష్ణుడు చెలికత్తె ద్వారా పంపిన సందేశాలన్నీ వింటున్నాడే కానీ ఎప్పుడు వొస్తాడో చెప్పటల్లేదు.

శరత్కాలం వొచ్చింది. రాత్రులు మెల్లిగా పెద్దవౌతున్నయ్యి. నాగమణికి నిద్ర పట్టటల్లేదు. ఇరవై నాలుగు గంటలూ కృష్ణుడే మనసులో మెదులుతున్నాడు.

కృష్ణుడు వొస్తే ఏమేమి చెయ్యాలీ, ఎట్లా చెయ్యాలీ అనేది అనుకోవటాలూ, మళ్ళీ అవ్వన్నీ బాలేదు అనుకోవటాలూ రోజుకి వంద మాట్లు అవుతున్నయ్యి.

ఇది ఇలా సాగుతూండగా నాగమణి ఆనాడు కృష్ణుడికి ఇష్టమైన జున్నూ, పాలూ, పెరుగూ, భక్ష్యాలూ తయారు చేసి చెలికత్తె ద్వారా శరత్పూర్ణిమనాడు రమ్మని వర్తమానం పంపింది. కృష్ణుడు అన్నీ స్వీకరించాడు.

“స్వామీ, శరత్పూర్ణిమ నాడు తమరు మా ఇంటికి రావాలని మా చెలి ప్రార్ధన” అన్నది చెలికత్తె.

పక్కనే ఉన్న ఉద్ధవుడి వైపు చూశాడు కృష్ణుడు. ఉద్ధవుడు కృష్ణుడి అంతరంగం గ్రహించి “స్వామి శరత్పూర్ణిమా సాయంత్రం వొస్తారు” అని చెప్పాడు. చెలికత్తె పరుగు పరుగున వెళ్ళి నాగమణికి ఈ శుభవార్త చెప్పింది నాగమణి ఎగిరి గంతేసింది. అప్పటికి నాలుగు రోజులున్న పౌర్ణమి ఆరోజే వొచ్చేసినట్లు హడావిడి చేస్తున్న నాగమణిని చూసి చెలికత్తె నవ్వుకుంది.

నాగమణికి మట్టుక్కు బుద్ధికి కృష్ణుడు తప్ప వేరే ఏమీ తోచటల్లేదు. ఆకులు రాలినా, గాలి వీచి పూపొదలు కదలినా , కంటి ముందు నుంచి ఎవ్వరు కదిలినా, ఇంటి ముంగిలి దగ్గర ఏమి జరిగినా నాగమణి గుండెలు గుబగుబలాడతున్నాయి ఎక్కడా స్థిరంగా కూర్చోలేకుండా ఉంది ప్రతిక్షణం కృష్ణ నామం స్మరించటమూ, ప్రతి క్షణం కృష్ణ రూపాన్ని తలుచుకుని పులకరించటమూ, ప్రతి క్షణం కృష్ణుడు వొస్తాడని అమందానందం పొందడమూ చేస్తోంది.

పూర్ణిమ దగ్గర పడుతున్న కొద్దీ చెలికత్తెని అది చెయ్యమనీ, ఇది చెయ్యమనీ, వేపుకు తినేస్తోంది. చెలికత్తె తట్టుకోలేక తనవల్ల కాదని వొదిలేస్తే తనే పూనుకుని అన్ని పనులూ విశదంగా చేసింది.

తోరణాలు కట్టింది, ముగ్గులు వేసింది, గడపలకి రంగులద్దింది, చిత్రాతిచిత్ర లేపనాలు తయారు చేసింది. ఆ లేపనాలు, శాంత పరిచేవీ, ఉద్రేక పరిచేవీ, బాధలు తగ్గించేవీ, సుఖాలని పెంచేవీ. ఆల్లాంటివి ముప్ఫైఆరు రకాలు సిద్ధంచేసింది. అల్లాగే భక్ష్యాలూ, భోజ్యాలూ, పానీయాలూ అనేకరకాలు సిద్ధంచేసింది.

పౌర్ణమి రాత్రి అయ్యింది. ఉద్ధవ సహితుడై స్వామి వొచ్చాడు. ఆయనని చూసి నాగమణి మనస్సు ఆనందతరంగితమై, చిత్తములో స్వామినే తలచుతూ ఉంటే, బుద్ధిలో ఇతడే నా స్వామి అని నిశ్చయంగా ఉంటే, నన్ను చూడటానికి స్వామి వొచ్చాడు అని తనకి అహంకారం విస్తరిల్లింది.

కృష్ణుడు, ఉద్ధవుడు వొస్తే ఇద్దరికీ తగిన ఆసనాలు అమర్చి, లేపనాలు సమర్పించింది. భక్ష్య భోజ్యాలు సమర్పించి ఎదురుగా నిలబడింది.

కృష్ణుడి వొంక ఒకసారి చూసి నాగమణి వైపుతిరిగి “స్వామి నీ పరిచర్యలతో సంతుష్టాంతరంగులు అయ్యారు, నీకు వరమిద్దామని అనుకుంటున్నారు. ఏమి కావాలో కోరుకో” అన్నాడు ఉద్ధవుడు.

“స్వామితో ఈ రాత్రి గడిపే వరాన్ని అనుగ్రహించండి” అన్నది నాగమణి. కృష్ణుడు లేచి నాగమణితో కేళీ గృహంలోకి వెళ్ళాడు. ఉద్ధవుడు అక్కడే విశ్రమించాడు.

మరుసటి రోజు పొద్దున్నే కృష్ణుడూ, ఉద్ధవుడూ వెళ్ళిపోయారు.

వారం రోజులు అయ్యింది. ఒక అమృత ధార కింద స్నానమాడి బయటికి వొచ్చి ఆ స్నానం గురించి ఆలోచించినట్టూ, ఒక అద్భుతమైన భోజనం తిన్న సాయంత్రం ఆ రుచులు గుర్తుకు వొచ్చినట్టూ, చిత్రవిచిత్ర ఇంద్రజాలవిద్య చూసిన తరవాత దాని గూర్చి ఆలోచించినట్లూ, కృష్ణ కేళి మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని ఆనందిస్తోంది నాగమణి.

సాయంత్రం అయ్యింది. చెలికత్తె వొచ్చి ఉద్ధవుడు వొచ్చాడు అని చెప్పింది.

స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టింది.

“స్వామీ, మీరూ బావున్నారా” అని అడిగింది నాగమణి.

“అంతా కుశలమే, నువ్వు ఎట్లావున్నావో చూసిపోదామని వొచ్చాను” అన్నాడు ఉద్ధవుడు

“స్వామితో గడిపిన అద్భుతమైన క్షణాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నయ్యి”

“గుర్తుకొచ్చినప్పుడల్లానూ ఆ క్షణాలు అంత అద్భుతంగా ఉన్నయ్యా?”

“నిజ్జంగా అంత అద్భుతం గానూ ఉన్నయ్యి”

“అలా ఎలా సంభవం. కాలం జరిగిన కొద్దీ అనుభవాల గాఢత తగ్గాలి కదా?”

“———– హూ, అవును, అనుభవాల గాఢత తగ్గినది నిజమే”

“కొన్ని రోజులైతే ఇంకా తగ్గుతుంది కదా?”

“—– నిజమే”

“మరి అల్లాంటప్పుడు తాత్కాలికమైన ఆనంద అనుభవం ఎందుకు కోరావు. నిత్యానందానికి మార్గం అడిగి వుండవచ్చు కదా?”

“——“

“నువ్వు ఏది అడిగితే అది ఇచ్చే స్వామి ఎదుటపడి నప్పుడు జాగ్రత్తగా, ఆలోచించుకుని మరీ అడగొద్దూ?”

“తప్పైంది. ఆంత ఆలోచించలేదు”

“ఇప్పుడు ఏమి చేస్తావు?. స్వామి ఖాండవ ప్రస్థం వెళ్ళారు. రావటానికి నెలలు పడుతుంది. వొచ్చినా రాచకార్యాలూ, ఆర్యావర్తం లోని చాలాదేశాల రాకుమారికల రాయబారాలూ?”

“మళ్ళీ స్వామి దర్శనం ఈ జన్మకి దుర్లభం అని తెలిసే….” అని డగ్గుత్తికతో ఆగింది నాగమణి.

“మళ్ళీ వొస్తాను” అని బయలుదేరాడు ఉద్ధవుడు.

ఉద్ధవుడు వెళ్ళిన తరవాత జరిగిన సంభాషణ అంతా తరచి తరచి ఆలోచించింది. తప్పు చేశానా అని ఆలోచించింది. ఆ క్షణాన అలా జరగడం కృష్ణుడికి ఇష్టమయ్యే కాబోలు అని తనకి గట్టిగా అనిపించింది. జరిగింది ఎందుకు, జరగబొయ్యేదాని గురించి ఆలోచిద్దామనే స్థిర నిర్ణయానికి వొచ్చింది.

కొద్దిరోజులైంది శరత్పూర్ణిమా దిన అనుభవం వెనక్కి పడుతోంది. ఆ ఆలోచనల గాఢత తగ్గటం నాగమణికే తెలియటం మొదలైంది. అప్పుడు తన దృష్టి “నిత్యానందాన్ని ఎందుకు అడగలేదు” అన్న ఉద్ధవుడి ప్రశ్న దగ్గర ఆగింది. దాన్ని గురించే ఆలోచిస్తూ కూర్చుంది. అసలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకోవటం సృష్టికి వ్యతిరేకం కాదూ అని ఆలోచిస్తోంది. ఇంతలో ఉద్ధవుడు వొచ్చాడు అని చెలికత్తె చెప్పిన వార్తవిని ఒక్క గంతులో ముంగిట్లో ఉంది.

ఉద్ధవుడిని సాదరంగా ఆహ్వానించింది.

“మీరూ, స్వామీ బావున్నారా” అన్నది నాగమణి.

“అంతా కుశలమే, నువ్వేం చేస్తున్నావు” అన్నాడు ఉద్ధవుడు.

“కృష్ణుడు నాతో ఎప్పుడూ ఎలా వుంటాడా అని ఆలోచిస్తున్నాను”

“వుంటే ఫలితం?”

“నిత్యానందమే”

“కృష్ణుడు అంటే నీ వుద్దేశం”

“నీలమోహనుడూ, దేవకీ వసుదేవుల బిడ్డా అయిన ఆ బృందావన చంద్రుడే”

“కృష్ణుడు అంటే ఆ దేహమే అయితే వేరే పనుల వల్లో, దూరదేశం వెళ్ళటం వల్లో ఏదో ఒక కారణం వల్ల ఆ దేహం ఎప్పుడో ఒకప్పుడు దూరం కాక తప్పదు. ఆప్పుడు నీ నిత్యానందం అసంభవం అవుతుంది. “

“మరి నిత్యానందం ఎట్లా?”

“నిత్యానందం ఎవరికి కావాలి?”

“నాకే”

“నువ్వెవరు? ఈ దేహానివా, మనస్సువా, ఎవరివి.

“—–“

“మెలుకువలోనూ, కలలలోనూ, నిద్రలోనూ నువ్వు ఉన్నావు అనేది నీ అనుభవం”

“అవును”

“మరి ఆ మూడు స్థితుల్లో ఉన్న నువ్వు ఎవరు. నిద్రలో దేహమూ, మనస్సూ లేకపోయినా నువ్వు ఉన్నావనేది నీ అనుభవం. మరి నిజంగా నిత్యానందం అడిగే నువ్వు ఎవరు? “

“—“

“ఆలోచించు, మళ్ళీ కలుస్తాను” అని వెళ్ళిపోయాడు ఉద్ధవుడు.

రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఉద్ధవుడి నిర్దేశిత్వంలో నాగమణి సత్యాన్ని ఎడతెగకుండా విచారించి ఉద్ధవుడు చెప్పిన విషయాలని తన అనుభవంలోకి తెచ్చుకుంది.

శాంతంగా, స్థిర చిత్తంతో సత్యాన్ని నిరంతరం అనుసంధానం చేసింది.

కృష్ణుడికి ఎనిమిది పెళ్ళిళ్ళూ అయ్యాయి. పిల్లలు కూడా పుట్టారు.

ఒక రోజున ఉద్ధవుడు వొచ్చాడు.

ఉభయకుశల ప్రశ్నలూ ఎగిరిపోయాయి.

ఉద్ధవుడు మెల్లగా” నిన్ను ఒక్కసారి చూడటానికి కృష్ణుడు వొస్తానంటున్నాడు” అన్నాడు

నాగమణి కన్నులు వెలిగాయి. ముఖం విచ్చుకుంది. ఆలోచిస్తోంది, ఇంకా ఆలోచించింది. స్థిర పరుచుకుని సమాహిత చిత్తంతో “తను ఇవ్వాల్సింది తను ఇచ్చాడు, నేను ఇవ్వాల్సింది నేను ఇచ్చాను. ఇంకా ఇవ్వన్నీ ఎందుకు” అంది.

సాయంత్రం జరిగినదంతా విని చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు. ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు.

కొన్నేళ్ళ తరవాత ఖాండవప్రస్థంలో ఉద్ధవ సహితంగా ఉన్నాడు కృష్ణుడు. అర్ధరాత్రి తొందర తొందరగా వొచ్చి ఉద్ధవుణ్ణి లేపి మధురకి బయలు దేరాడు. ఉద్ధవుడికి ఏమీ అర్ధం కాలేదు. మధుర చేరారు. అక్రూరుడు రధాన్ని నాగమణి ఇంటికి తీసుకు వెళ్ళాడు.

నాగమణి చెలికత్తె కృష్ణుడికీ, ఉద్ధవుడికీ స్వాగతం పలికి లోపలికి తీసుకు వెళ్ళింది. అక్కడ నాగమణి పద్మాసనంలో సుఖంగా కూర్చుని ఉంది. కృష్ణుడు దగ్గరికి వెళ్ళాడు. పక్కన కూర్చుని నాగమణిని పట్టుకున్నాడు. నాగమణి కృష్ణుడి ముఖాన్ని పుణికింది ఒకసారి. కృష్ణ స్పర్శతో చిత్తవృత్తులు తగ్గి పరమ శాంత స్థితిలో నిలిచింది. కృష్ణుడు తనని దగ్గరకి పొదువుకున్నాడు.

నాగమణికి కృష్ణుడి మీద అమిత ప్రేమ కలిగింది. కృస్ణుడు నవ్వాడు. నేను ఈ దేహాన్నా అని కృష్ణుడు ప్రశ్న వేసినట్టు నాగమణికి అనిపించింది. వెంటనే కృష్ణ రూపప్రేమని విజ్ఞాన ఖడ్గంతో ఖండించి సచ్చిదానంద కృష్ణతత్వంలో లీనమైంది. కృష్ణుడు తనకి చేయాల్సిన అన్ని కర్మలూ చేశాడు.

“మహానుభావురాలు” అని తర్పణం వొదిలాడు ఉద్ధవుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here