[dropcap]స[/dropcap]నకాదులు అంటే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనే నలుగురు మహర్షులు. వీరు బ్రహ్మ మానసపుత్రులు. వీరిని బ్రహ్మ తనకు సృష్టి కార్యములో తోడ్పడమని అడుగుతాడు. కానీ వారు,”దేవా మీరు భగవత్ ధ్యానామృతములో మమ్మల్ని సృష్టించారు. మాకు కూడా భగవత్ ధ్యానామృతము పూర్తిగా అబ్బింది. అందుచేత మేము మీకు సృష్టి కార్యములో సహాయము చేయలేము. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మాకు చేతనైన సహాయము చేస్తాము” అని చెప్పి బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని లోకాల సంచారానికి బయలు దేరారు.
వీరి లోక సంచారములో శ్రీ మహా విష్ణువు దర్శనము కోసము వైకుంఠము వెళ్లారు. కానీ అక్కడ ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డగిస్తారు. అప్పుడు సనకాదులు వారిని భూలోకములో పుట్టమని శపిస్తారు. ఈ గొడవ జరుగుతుండగా లక్ష్మీనారాయణులు బయటకు వచ్చి జరిగిన వృత్తాంతము తెలుసుకుంటారు. వారిని చూసిన సనకాదులు భక్తి పారవశ్యముతో లక్ష్మీనారాయణులను స్తుతిస్తూ స్తోత్రాన్ని చెపుతారు. సంతోషించిన నారాయణుడు, జయ విజయులతో “మునుల శాపానికి చింతించ వద్దు. మీరు భూలోకములో రాక్షసులు జన్మించి నాతో శతృత్వము వహించి నాచే వధించబడి మూడు జన్మల అనంతరము శాశ్వతముగా వైకుంఠవాసులుగా ఉండిపోతారు” అని వారికి శాపవిముక్తి మార్గాన్ని చెపుతాడు. సనకాదులు లక్ష్మీ నారాయణుల దివ్య మంగళ రూపాలను గాంచి భక్తి పారవశ్యముతో వారిని స్తుతించి వారిని విడిచి వెళ్లలేక అతి కష్టము మీద వారి ఆశ్రమముకు చేరుకుంటారు.
ప్రజారంజకముగా పాలన చేస్తూ, నిత్యమూ బ్రాహ్మణులను పూజిస్తున్న గొప్ప హరి భక్తుడు అయినా పృథు చక్రవర్తి సముఖానికి ఆకాశమార్గాన బాల సూర్యుళ్ళ వలె ప్రజ్ఞావంతులు, సిద్ధవర్యులు అయిన సనకాదులు చేరుకుంటారు. వారిని చూసిన పృథు చక్రవర్తి అత్యంత ఆనందముతో ఎదురు వెళ్లి వారిని సగౌరవంగా ఆహ్వానించి వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఉచిత ఆసనాలపై కూర్చుండబెట్టి వారి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద చల్లుకున్నాడు. “మహాత్ములారా నేను ఎంతో పుణ్యము చేసుకోబట్టి నాకు మీ దర్శన భాగ్యము కలిగింది. నాకు చాలా ఆనందముగా ఉన్నది, ఈ సంసారములో దేని వలన మోక్షము కలుగునో సెలవు ఇవ్వండి” అని వారిని వేడుకుంటాడు. “మహారాజా శ్రద్ధ, భగవధర్మ చర్య, భగవంతుడిని గురించి తెలుసుకోవాలనే ప్రగాఢమైన కోరిక, శ్రీమన్నారాయణుడి లీలలను వినటం, అహింసను ఆచరించటం, సదా భక్తి మార్గాన్ని అనుసరించటం మోక్షసాధనాలు. ధర్మార్థకామాలు అనే మూడింటిని విడిచి పెట్టి పరమ పురుషార్థమైన మోక్షాన్నికోరుకుంటే తప్పకుండా మోక్షము ప్రాపిస్తుంది” అని పృథు చక్రవర్తికి బోధించి సభాసదులు అందరు చూస్తుండగానే సనకాదులు ఆకాశమార్గాన వెళ్ళిపోతారు.
ఒకసారి ఈశ్వరుడు సనత్కుమార మహర్షి దగ్గరకు వస్తాడు. మహర్షి పరమేశ్వరునికి సపర్యలు చేసి, “త్రిలోచనా నేను ఏమి చెయ్యాలో చెప్పండి” అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు “నీతో మాట్లాడి పోదామని వచ్చాను” అని చెప్పి ,”ధ్యానములో చూడతగ్గది ఏది? తత్వాలు ఎన్ని?, సాంఖ్యము అంటే ఏమిటి? అనే ఆధ్యాత్మిక విషయాలను నీ ద్వారా తెలుసుకుందామని వచ్చాను” అని ఈశ్వరుడు మహర్షితో అంటాడు. ఈశ్వరుని ప్రశ్నలకు సమాధానముగా సనత్కుమార మహర్షి, “తత్వములు ఇరవై అయిదు. అవి భూతాలు ఐదు, వాటి గుణాలు పది, ఇంద్రియాలు ఐదు, మనసు బుద్ధి అహంకారము ప్రకృతి మొత్తము ఇరవై నాలుగు, ఇంకొక తత్వము దేహమందు ఉండే పురుషుడు, కాష్ఠములో ఉండే నిప్పులా శరీరములో పురుషుడు ఉంటాడు. అతన్ని చూడగలగటమే అమృతార్థ తత్వము. దీనిని చూసిన వాడు మృత్యువును కూడా జయిస్తాడు. ఇవన్నీ కలిపి చూడటమే ఏకత్వము అంటే బ్రహ్మాన్ని చూడటమే. తనలోతాను చూసుకోగల్గినవాడే జ్ఞాని, జిహ్వ యందు సోముడు, అపానములో సూర్యుడు, సమానములో అప్సరసలు, కళ్ళలో సూర్యుడు, శరీరములో అంఘ్రలు, చెవుల్లో శేషుడు, ఉపస్థములో ప్రజాపతి, బుద్ధి యందు బ్రహ్మ, ఈ అన్నింటిలో కలిపి ఆత్మ ఉంటుంది. ఆత్మను చూడగలిగిన వాడే యోగి. అటువంటి యోగి నిర్మానుష్య ప్రదేశములో ఇంద్రియాలను లాగి పట్టి ఆకలిదప్పులు మరచిపోయి హృదయముతో దేవుణ్ణి చూస్తాడు” అని సనత్కుమారుడు ఈశ్వరునికి వివరిస్తాడు. సనత్కుమారుడు ఈశ్వరునికి సాంఖ్య యోగాన్ని వివరిస్తాడు. సంగమే బంధము, సర్వసంగ పరిత్యాగమే మోక్షము. ఇది పరమ రహస్యము, పరమ తత్వము అని కూడా ఈశ్వరునికి చెపుతాడు. ఈశ్వరుడు సనత్కుమారుడు చెప్పినవి విని సంతృప్తి చెంది కైలాసానికి వెళతాడు. పరమేశ్వరుడు సనత్కుమారుని ద్వారా జ్ఞానబోధను లోకానికి అందిస్తాడు. ఆ తరువాత సనకాదులు మార్గములో స్వేచ్ఛా విహారానికి బయలు దేరుతారు.
రావణుడు ఒకసారి తన దిగ్విజయ యాత్ర ముగించుకొని సనత్కుమారుడి దగ్గరకు వచ్చి అనేక వేదాంతపరమైన క్లిష్ట ప్రశ్నలను అడిగాడు. వాటిలో కొన్ని ఏమిటి అంటే “మహాత్మా అనాది మధ్య లయుడెవ్వరు? ఎవరితో విశ్వ సృష్టి జరిగింది? ఎవరిని స్మరిస్తే బంధ విముక్తి అవుతుంది?” అనే సందేహాలను అడుగుతాడు. “రావణా అనఘుడు అధ్యయుడు మొదలైన గుణాలతో ఉన్న శక్తియే బ్రహ్మము. ఆ బ్రహ్మమే నారాయణ, కృష్ణ హరి, విష్ణు, గోవిందా అనే నామాలతో పిలబడుతుంది” అని చెప్పి హరి చేతిలో మరణించిన వారి గురించి చెపుతాడు. అప్పుడు రావణుడు, “మహాత్మా నాకు ఆ యోగము ఉన్నదా? ఉంటే ఎప్పుడు వస్తుంది?” అని మహర్షిని అడుగుతాడు. “కృతయుగము చివరలో హారి కృత యుగము చివరలో శ్రీరామునిగా జన్మిస్తాడు. నీవు ఆయనతో వైరము పెంచుకొని అయన చేతిలో హతుడివి అయి మోక్షాన్ని పొందుతావు” అని సనత్కుమారుడు రావణునికి అతనికి జన్మ రహస్యాన్ని శ్రీరామావతారం గురించి చెప్పి అంతర్ధానము అవుతాడు.
సనకాదులను మార్కండేయుడు పితృదేవతల మహిమ గురించి తెలియజేయమని అడుగుతాడు. వారు మార్కండేయుని సందేహాలను తీర్చి దివ్యదృష్టిని సర్వ విజ్ఞానాన్ని కలుగజేస్తారు. అలాగే సనత్కుమారుడు రైభ్య మహర్షికి గయా శ్రాద్ద ఫలాన్ని ఫల్గుణి నది స్నాన మహిమను వివరిస్తాడు. ఒకసారి నారదుడు సనత్కుమారుని తనకు జ్ఞానబోధ చేయమని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ మహర్షి “మహాత్మా ముందు మీరు మీకు తెలిసినవి చెప్పండి, అప్పుడు తెలియనివి నేను చెపుతాను” అని చెపుతాడు. నారదుడు చెప్పినవి విని ఆత్మజ్ఞానమే గొప్పదని చెప్పి ఆయనకు అఖండ ఆత్మజ్ఞానాన్ని భోదిస్తాడు. నారదుడు విష్ణు తత్వాన్ని గురించి అడిగినప్పుడు శ్రీహరిని గురించి వివరిస్తాడు. నైమిశారణ్యములోని మునులు రుద్రమహాత్యాన్ని వివరింపమని అడిగితే వివరించిన విషయాలే సనత్కుమార సంహిత అనే గ్రంథరూపములో వెలువడింది. ఆ గ్రంథములోనే సనత్కుమారుడిచే బ్రహ్మ విష్ణుత్పత్తి, హరి విరించి సంవాదము, సప్తద్వీప సప్త వర్ష చరిత్ర, శివలింగ పూజ, శివాష్టకము, శివలింగ ప్రళయోత్పత్తి, జ్ఞాన ప్రశంస, మొదలైన అంశాలు వివరింపబడ్డాయి. బ్రహ్మజ్ఞాని, మహర్షి అయిన సనత్కుమారుడు సామాన్యుల కోసము గృహ వాస్తు శాస్త్రాన్ని శిల్ప శాస్త్రాన్ని రచించాడు.
వృత్రాసురుడు అనే రాక్షసుడు ఇంద్రునితో యుద్ధము చేస్తూ పడిపోయినప్పుడు అతనిని రాక్షసులు శుక్రాచార్యుని దగ్గరకు తీసుకువెళతారు. కానీ అక్కడ గురువు శుక్రాచార్యునికి, శిష్యుడు వృత్రాసురునికి సనత్కుమారుడు విష్ణు తత్వాన్ని కర్మఫలాన్ని జీవుడు ఎలా అనుభవిస్తాడో మొదలైన అంశాలను వివరించగా అమృతము లాంటి మహర్షి మాటలను విన్న వృత్రాసురుడు పరిశుద్ధమైన మనస్సుతో ప్రాణాలను విడిచిపెట్టి విష్ణువును చేరుతాడు. ధృతరాష్ట్రునికి విదుర నీతిని వివరించగా ధృతరాష్ట్రుడు విదురుని ఇంకా కొన్ని క్లిష్టమైన సందేహాలను అడుగుతాడు. విదురుడు ఈ సందేహాలను వివరించటానికి సనత్కుమార మహర్షి ఒక్కడే సమర్థుడు అని చేపి అయన ప్రార్థించగా అయన ప్రత్యక్షమై దృతరాష్ట్రునికి జ్ఞానబోధ చేస్తాడు.
జీవికి మృత్యువు అనేది లేదు. శరీరములో అంతరాత్ముడైన పురుషుడు బొటనవ్రేలు పరిమాణములో ఉంటాడు. అజ్ఞానులు ఇతనిని చూడలేరు. బ్రహ్మ విద్య నిష్ణాతులైన మానవుడు ప్రజ్ఞా రూపుడై తన లోపల గల పరమాత్ముడిని తెలుసుకుంటే అతడు శరీరాన్ని విడిచి పోనేపోదు. అలాంటి వాడికి చావు అనేది లేదు, మోక్షము లేదు బ్రహ్మతోనే సంబంధము. నేను అనేది ఆత్మ, సర్వము ఆత్మ, ఉన్నది లేనిది ఆత్మే, మనలో ఉండే భగవంతుడు అంటే ఆత్మ ఒక్కటే సత్యము. లోకమంతా నిండి ఉన్నది ఆత్మే. నాకు చావు పుట్టుకలు లేవు. నేనెప్పుడూ ఆనంద స్వరూపుడినే అనుకుని నిష్టగా నియమముగా వుండేవాడు ఎన్నేళ్లయినా బ్రతకగలదని చెప్పి సనత్సుజాతుడు వేదాంతాన్ని బోధించి ఆకాశ మార్గములో అంతార్ధానమవుతాడు. ఈ విధముగా సనక, సనందన, సనత్కుమార సనత్సుజాత మహర్షులు ఆకాశమార్గములో సంచరిస్తూ ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళుతూ అక్కడ అడిగినవారు సందేహాలను తీరుస్తూ జ్ఞానబోధ చేస్తూ అనేక ఆధ్యాత్మిక విషయాలను లోకానికి తెలియజేస్తూ దివ్య తేజస్సుతో ప్రకాశించేవారు. వీరి ద్వారా జ్ఞానబోధ పొందినవారు అనేక మంది మహాపురుషులు ఉన్నారు. దేవతలు రాక్షసులు అనే భేదము చూపకుండా అందరికి జ్ఞాన బోధ చేసిన గొప్ప మహర్షులు వీరు.