Site icon Sanchika

మహతి-11

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[రోజులు వేగంగా గడిచిపోతాయి. సినిమా కంపెనీ వాళ్ళు ఫస్ట్ స్క్రీన్ టెస్ట్‌కి అలనీ, జగపతినీ, శ్యామ్‌ని పిలుస్తారు. అల వెంటనే ఎంపికవుతుంది. మహీ వాళ్ళ ఇంటికొచ్చి తాను చదువు మానేస్తున్నాననీ, సినిమాల్లోకి వెళ్ళిపోతున్నానని చెప్తుంది. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయమని మహీ వాళ్ళమ్మ చెప్తే, తనకి చదువు మీద ఆసక్తి లేదని చెప్తుంది అల. వాళ్ళమ్మతో కల్సి హైదరాబాద్‍ వెళ్ళిపోతుంది అల. పరీక్షల కోసం చదవడం ప్రారంభిస్తారు. పరీక్షలు దగ్గరికొస్తున్నా సంగీతం క్లాసులకి అటెండవం వల్ల సమయం వృథా అవుతోందని రహీమా వాళ్ళ అమ్మ అంటారు. పరీక్షలైపోయేదాకా సంగీతం క్లాసులకి రానని హగ్గీ సంపూర్ణగారికి చెప్తాడు. రెండు గంటలు సంగీత సాధన కనీసం 20 గంటల స్ట్రెస్‍ని మనసులోంచి తొలగిస్తుందనీ, ఆ పైన మీ ఇష్టమనీ అంటారావిడ. మిగతావాళ్లు మానేసినా, మహీ మాత్రం సంగీతం క్లాసులు కొనసాగిస్తుంది. పరీక్షలు పూర్తయిన రోజున నూతన నటిగా అల ఫోటో అన్ని పేపర్లలోనూ వస్తుంది. అమ్మమ్మా తాతయ్యలతో కలిస్ కర్రావూరి ఉప్పలపాడుకి వెళ్తుంది. బోలెడు ఖాళీ సమయం ఉండడంతో, తనకి ఏవైనా పని చెప్పమని డా. శ్రీధర్‍ని అడుగుతుంది. ఆయన ఏయే పనులు చేయచ్చో చెప్తారు. హాస్పటల్‍లో రోగులకి ఉన్న ఇబ్బందులని గమనించి, వాటిని పరిష్కరించడానికి పూనుకుంటుంది మహీ. సత్యసాయి సేవాదళం శ్రీరామారావుగారిని, చిన్నప్పటి స్కూలు మాస్టారు సీతారామాంజనేయులు గారి ద్వారా స్కౌట్ బాయ్స్ సాయంతోను, హాస్పటల్‍ని శుభ్రపరుస్తుంది. సిమెంటు బల్లలు వేయిస్తుంది. మంచి నీటి కుండలు పెట్టిస్తుంది. చెట్ల కింద చెత్త తీయించి, కొత్త మొక్కలను నాటిస్తుంది. అందరూ మహీని అభినందిస్తారు. ఓరోజు సురేన్ ఫోన్ చేసి తాను ఆర్మీలో చేరుతున్నట్లు మహీకి చెప్తాడు. అమ్మానాన్నని ఒప్పించడానికి మహీని ఇంటికి వచ్చేయమంటాడు. అమ్మమ్మా తాతయ్యలని తీసుకుని వస్తుంది మహీ. – ఇక చదవండి.]

[dropcap]మూ[/dropcap]డు సార్లు చర్చలు జరిగాయి. నాన్నా అమ్మా అనేది ఒకటే, చదువు పూర్తి చేసి వెళ్ళమని. కానీ వాడు పట్టు మీదే వున్నాడు. చివరికి అమ్మా నాన్నా ఒప్పుకోక తప్పలేదు. అమ్మమ్మ తాతయ్య తటస్థంగా వున్నారు. అదే మాట నేనడిగితే –

“అమ్మా, మాకు మగపిల్లలు లేరు. అందువల్ల వంశం, వంశాభివృద్ధి ఇలాంటి ఆశలు లేవు. గౌతమ్ సంగతి వేరు. ఎందుకు వేరో నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే, ఒక తల్లిగా, తండ్రిగా ఆలోచించడం వేరు, ఒక చెల్లిగా నువ్వు ఆలోచించడం వేరు” అన్నాడు తాతయ్య.

రాత్రి పడుకోబోయే ముందు సురేన్‍ని నాన్న అడిగాడు, “ఎప్పుడు జాయిన్ కావాలి” అని.

“వారం మాత్రమే టైమ్ వుంది నాన్నా” చెప్పాడు సురేన్.

“సరే, నీకు ఏం కావల్సి వచ్చినా, ఏం కొనుక్కుందామనుకున్నా సందేహించకు. అహీ.. ఓ అయిదువేలు వాడికివ్వు” బెడ్ రూమ్ లోకి వెడుతూ అన్నాడు నాన్న. ఆయన గొంతు ఎప్పట్లా కాకుండా చాలా గంభీరంగా వుంది.

***

ఒక వ్యక్తి మనతో వున్నంత సేపూ అతని/ఆమె విలువ తెలీదు. వాళ్ళు మనని విడిచి ఏ వూరో వెళ్ళినప్పుడు తెలుస్తుంది.. వారి విలువా, లోటూ. సురేంద్రని నేను నేను మామూలు ఓ అన్నయ్యగా ట్రీట్ చేసేదాన్ని. అంతే. ఏనాడూ సురేన్‍ని ఓ వ్యక్తిగా నేను గమనించలేదు. తను వెళ్ళిపోయాకా తెలుస్తోంది, అతనిది ఎంత లోతైన వ్యక్తిత్వమో! ఏనాడూ ఎవరికీ ఇబ్బంది కలిగించని తత్వం. ఏనాడూ సరదాగా కూడా ఒక మాట అని బాధించలేదు. తను ఏది తెచ్చినా చాలా సింపుల్‍గా, ఏ మాత్రం అదో పెద్ద విషయం కానట్టుగా అందరికీ పంచేవాడు. సహజంగా మితభాషి. మంచి దేహదారుఢ్యం. ఎప్పుడూ చదువుతూ వుండేవాడు. వాడి గదిలోకి వెళ్ళి చూస్తే, అన్నీ చరిత్రకీ, మిలిటరికీ, యుద్ధ చరిత్రలకీ, యథార్థ గాథలకీ సంబంధించిన పుస్తకాలే. మిలిటరీ అవార్డుల గురించి, సైనికులకు ఇచ్చే అవార్డుల గురించీ చాలా ‘నోట్స్’ ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఏర్‍పోర్స్‌కి సంబంధించిన ర్యాంకుల సమాచారం పూర్తిగా కనిపించింది. ‘హిమాలయన్ బ్లండర్’ అనే పుస్తకమూ (రచయిత జె.పి. దాల్వి), ‘ది అన్‌టోల్డ్ స్టోరీ (బి. ఎమ్. కౌల్)’ పుస్తకమూ కనిపించాయి. అయాన్ రాండ్ నవలలూ కనిపించాయి. అసలు సురేన్‍కి ఆర్మీ అంటే అంత ఇష్టమని నాకు తెలిసింది ఇప్పుడే.

సురేన్ వెళ్ళి మూడు రోజులు అయింది. ఈరోజే అతని రూమ్‍ని నేను చూసింది. సురేన్ ఆర్మీకి వెళ్ళడం అమ్మని నాన్నని మౌనంలోకి నెట్టింది. అమ్మమ్మ తాతయ్యలు మౌనంగానే వుంటున్నారు.

ఆ సాయంత్రం అందరూ టీ తాగుతుండగా, “డాడీ, ఇవ్వాళ నేను సురేన్ రూమ్‌ని చూశాను. పుస్తకాలూ అవన్నీ నీట్‍గా ప్యాక్ చేసి పెట్టాను. మనం ఎవ్వరం గమనించలేదు గానీ, ఇవ్వాళ తెలిసింది సురేన్‍కి డిఫెన్స్ అంటే ఎంత ప్రాణమో. దాదాపు పుస్తకాలన్నీ మిలిటరీకి సంబంధించినవే. పొద్దుటి దాకా నేనూ బాధపడ్డాను. ఇప్పుడు అనిపిస్తోంది, ఇది బాధ పడవలసిన విషయం కాదనీ, గర్వంతో పొంగిపోవాల్సిన సమయమనీ. తనేం చేయాలో స్పష్టంగా తెలిసిన వ్యక్తిత్వం సురేన్ అన్నయ్యది. రియల్లీ గ్రేట్ పెర్సన్ డాడీ” అన్నాను. ఆ మాట విని కొంత ఆశ్చర్యపోయారు. అమ్మానాన్నలని వాడి గదిలోకి తీసుకెళ్ళీ పుస్తకాలనీ, పాత డైరీలని చూపించాను. వాళ్ళ మొహంలో కాస్త రిలీఫ్ కనిపించింది.

ఆ రాత్రి మా యిల్లు మళ్ళీ మౌనపు పొరలని చీల్చుకుని, మాటల తోటలో అడుగుపెట్టింది.

***

డిగ్రీ పూర్తి చెయ్యాలి. ఏ డిగ్రీ తీసుకోవాలీ? లెక్కలు పరవాలేదు. సైన్సూ ఓకే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ మేమందరం మా కర్రావూరి ఉప్పలపాడుకి వెళ్ళినప్పుడు ఓ చిత్రం జరిగింది. మేము ఆ వూరు వెళ్ళిన గంటకల్లా ఆఫీసు నుంచి మా నాన్నగారికి ఫోన్ రావడంతో అమ్మానాన్నా వెంటనే బయలుదేరి వెళ్ళారు. తాతయ్యా, అమ్మమ్మా నేను హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. సడన్‍గా మా అమ్మమ్మ అన్నది, “మహీ, ఇది నువ్వు వంట నేర్చుకోవడానికి తగిన సమయం. రేపట్నుంచీ నేర్పుతా. నేర్చుకుంటావా?” అని. నేను ఎగిరి గంతేసినంత పని చేశా. అప్పటిదాకా ‘వంట’ మీదకి నా మనసు పోలేదు. ఏవేవో చిన్న చిన్న వంటల ట్రయల్స్ వెయ్యడమే గానీ పెర్‍ఫెక్షన్ లేదు.

“అమ్మమ్మా రేపట్నించి నువ్వే నా టీచర్‍వి, లెక్చరర్‍వీ, ప్రొఫెసర్‍వీ కూడా” కావలించుకుని అన్నాను.

“వాబ్.. మాక్కూడా రుచి చూసే మహా భాగ్యం దక్కుతుందన్న మాట” పక్క గదిలోంచి బయటకొచ్చి అన్నారు డా. శ్రీధర్.

“ఖచ్చితంగా” కాన్ఫిడెంట్‍గా అన్నాను.

“నిజం మహీ.. వండటం ఒక సైన్సు, ఒక ఆర్ట్. మనుషులు చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, తోడు లేకపోయినా, పిల్లలు లేకపోయినా,  ఆస్తి అంతస్తులు లేకపోయినా బతగ్గలరు. కానీ, తిండి లేకుండా బ్రతకలేరు. అందుకే అన్నారు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని” అన్నారు డా. శ్రీధర్.

***

ఆ మరుసటి రోజు నుంచే నా ‘వంట’ ట్రైనింగ్ మొదలయింది.

“మహీ.. అన్నం వండేటప్పుడు, అంటే పొయ్యి వెలిగించడం నించి భోజనాలు పూర్తయ్యేవరకూ ప్రసన్నంగా వుండాలి. అంటే కోపతాపాలకి దూరంగా వుండాలి.” బోధించింది అమ్మమ్మ.

“విను.. విను.. మీ అమ్మమ్మ తప్ప ఎవరూ ఇలాంటి విషయాలు చెప్పరు. చెప్పినా యీ కాలంలో ఎవరూ వినరు” పడక్కుర్చీ లోంచి అరిచాడు తాతయ్య.

“పాడు గుణం.. ఎప్పుడూ నా మీద ఓ కన్నూ చెవీ వేసే వుంచుతాడీయన” విసుక్కుంది అమ్మమ్మ ముద్దుగా.

“అన్నం బ్రహ్మ – రసో విష్ణుః – భోక్తోదేవో మహేశ్వరః అంటారు. సృష్టిలో ఏ జీవి అయినా అహారం లేకపోతే మనలేదు. అందుకే అన్నం బ్రహ్మ. రసో విష్ణుః అంటే, ఆ అన్నం ఇచ్చే ‘శక్తి’ విష్ణువన్న మాట. శక్తినివ్వని పదార్థాలు తిని ఏం వుపయోగం? ఇక మూడో మాట అత్యుత్తమమైనది ‘భోక్తోదేవో మహేశ్వరః’ అని. అంటే ఎవరైతే భుజిస్తున్నారో వారు సాక్షాత్తు శివస్వరూపులని అర్థం. ఇక్కడ ఒక మంచి విషయం వుంది. శ్వాస తనంతట తాను యీ శరీరంలోకి వస్తోంది. ఆ శ్వాస రాబట్టే మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం. అంటే, శ్వాసలోని చైతన్యం మన శరీరంలో ప్రవహించి మనని బ్రతికిస్తున్నదన్న మాట. ఆ చైతన్యమే ‘శివం’. ఆ ‘శివం’ శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవహిస్తున్నంత కాలం మనమూ, అంటే, యీ శరీరము శివమే. ఆ శ్వాస ఆగిన మరుక్షణం యీ శరీరం ‘శవం’గా మారుతుంది. దీన్ని బట్టి తెలిసేదేమంటే, మనం తినే ఆహారం మన శరీరంలో వుంటూ మనని నడిపిస్తున్న శివుడి కన్నమాట. అందుకే భుజించేవాడు శివుడు. ఆ చైతన్యం శ్వాస ద్వారా రాకపోతే, మనం భుజించలేము కదా!” వివరించింది అమ్మమ్మ.

“ఆ మాట నిజమే. సాదం అంటే అన్నం. సాదం ప్రసాదం అయ్యేది నీలోని శివుడికి నువ్వు సమర్పించినప్పుడే. చాలా మంది అంటారు, ‘ఏమి పండగలో ఏమిటో, దేవుడికి చెయ్యి చూపించి మనం మింగడమేగా! దేవుడేమన్నా మనం పెట్టింది తింటాడా పెడతాడా?’ అని. అది తప్పు. మనం వండి నిజంగా వడ్డించేది మనలో వున్న దైవానికే. నివేదిస్తున్నాం కనుక నైవేద్యమయింది” క్లియర్‍గా వివరించాడు తాతయ్య. భోజనాన్ని యీ కోణంలో ఏనాడు నేను చూడలేదు. ఆ మాటే అన్నాను.

“ఇద్దరూ చక్కగా చెప్పారండి. ఈ విషయాలు నేనూ వినలేదు” శ్రద్ధగా అన్నారు డా. శ్రీధర్.

ఏ కూరని ఎలా తరగాలో దగ్గర్నించి వివరంగా, ప్రాక్టికల్‍గా చెప్పింది అమ్మమ్మ. అవన్నీ మెల్లమెల్లగా మీతో పంచుకుంటాను. ప్రతి ఇంట్లోనూ వంశపారంపర్యంగా వచ్చే వంటకాలు కొన్ని వుంటాయి. మా అమ్మమ్మ బుడంకాయతో ఆవకాయ పెట్టేది. బుడంకాయ చేదే. కానీ, ఉప్పు కారం కొద్దిగా ఆవపిండి మెంతిపిందితో చేరాకా, చేదు విరిగి బ్రహ్మాండమైన రుచి వస్తుంది. దాని రుచి అద్భుతం. అలాగే కొబ్బరి వాక్కాయ పచ్చడి, కంద బచ్చలి కూర, కేవలం పోపు మాత్రమే వేసిన ఉప్పు చింతకాయ పచ్చడి, అరటికాయతో చేసే పిండి మిరియం – ఇవన్నీ చక్కగా నేర్పింది. మొదట తను చేసి చూపిస్తే, మరుసటి రోజున నేను అదే ఐటమ్‍ని చేసేదాన్ని. అంతే కాదు, శ్రద్ధగా ‘పాళా’లు అన్నీ ఓ నోటు బుక్కులో చక్కగా రాసుకునేదాన్ని. దాదాపు 15 రోజులు మా వూళ్ళోనే గడిపాము. ఉడకబెట్టిన బచ్చలి దుబ్బులు, తోటకూర దుబ్బులతో ‘దుబ్బుల పులుసు’ అద్భుతంగా చేసేది అమ్మమ్మ. కొత్త కొత్త వంటకాలు నేర్చుకోవడం నాకు మహదానందం కలిగించింది. ఈ అయిటమ్స్ ఏ హోటల్లోనూ దొరకవు గదా!

ఓ పక్కన వంటూ వార్పులూ మహా జోరుగా జరుగుతున్నా – హాస్పటల్‍కి వెళ్ళి నాకు తోచిన ‘సేవ’ చెయ్యడం మానలేదు. అత్యాశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వారు కర్రావూరి ఉప్పలపాడు గవర్నమెంట్ హాస్పటల్‍ని బెస్ట్ హాస్పటల్‍గా గుర్తించడం. మా ప్రెసిడెంట్ ఉబ్బిపోయి ఏనుగెక్కాడు. మా ఇంటికి స్వయంగా వచ్చి ఆ కబురు చెప్పి, నన్ను తెగ మెచ్చుకున్నాడు. అంతేకాదు, వరండాలో పాత కలప బెంచీలకు  బదులు ముగ్గురు ముగ్గురు కూర్చునేలా ఎనిమిది స్టీల్ కుర్చీలు స్పాన్సర్ చేశాడు. అంటే, ఇరవైనాలుగు మంది హాయిగా కూర్చోవచ్చన్న మాట. డాక్టర్ గారికి కూడా కొత్త రివాల్వింగ్ ఛైరూ, మాంఛి టేబులూ వేయించాడు.

నేను సత్యసాయి సంస్థలకీ, శ్రీరామారావు గారికీ, స్కౌట్స్ టీచర్ సీతారామాంజనేయులు గారికి విషయం చెప్పి కృతజ్ఞతలు చెప్పాను. అందరికంటే ఆనందించింది తాతయ్య, అమ్మమ్మ, డా. శ్రీధర్ గారు. మా తాతయ్య మహదానందంతో ఆ విషయం మా అమ్మానాన్నలకి చెబితే వాళ్ళు ఉప్పొంగిపోయారు.

“నిజంగా నేను ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేకపోతున్నాను డాక్టరు గారు” అన్నాను.

“తొందరెందుకూ. రిజల్ట్స్ రావాలి. ఆ తరువాత ఆలోచిద్దాం. ఒకటి మాత్రం నిజం. నువ్వెక్కడున్నా గొప్పగా రాణిస్తావు. ఎందుకంటే, ‘ఇతరుల సంగతి నాకెందుకు’ అని నువ్వు ఆలోచించవు. చెయ్యగలిగినంత సేవ చెయ్యడానికే చూస్తావు. టోకెన్లు పంచితే సరిపోయేది. అక్కడ నువ్వు ఆగలా. కాంపౌండు బాగు చెయ్యాలంటే ఏం చెయ్యాలో నువ్వే చేశావు. బెంచీలు ఏర్పాటు చెయ్యడం, పూల మొక్కలు నాటించడం, మంచినీళ్లు ఏర్పాటు చెయ్యడం దగ్గర్నుంచీ ఓ పెర్‍ఫెక్షన్‍తో చేశాన్వు. మహీ.. యూ ఆర్ ఎ జీనియస్” మొదటిసారి నా భుజం తట్టి అన్నారు డా. శ్రీధర్.  నేను బిడియపడ్డ మాట ఎంత నిజమో, లోపల్లోపల పొంగిపోయినదీ అంతే నిజం.

మూడు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయని పేపర్లో ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆ రోజే తాతయ్యా అమ్మమ్మా నేనూ టౌన్‍కి వచ్చాం.

***

కాలం తనంతట తాను పోతూనే వుంటుంది. దాన్ని గంటలుగా, రోజులుగా విభజించింది మనమే. కాలానికి అసలు విభజనే లేదుగా. అదో ప్రవాహం. తుదీ మొదలు లేని ప్రవాహం. లేదా నిరంతరం తుదే మొదలై, మొదలే తుదై కదిలే చక్రం. ఓ పక్కన రిజల్టు కోసం తహతహ. మరో పక్క సురేన్ గురించిన ఆలోచనలు.

సురేన్ ఆర్మీలో చేరి నెల రోజులైంది. ఎంత మామూలుగా వున్నా పూడ్చలేని ఓ శూన్యం వెక్కిరిస్తూనే వుంది. సురేన్ చోటు సురేన్‍దే. వ్యక్తి దూరమయ్యాకే తెలిసింది.. అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో. సురేన్‍ది చాలా ఉన్నతమైన, విశిష్టమైన వ్యక్తిత్వం. అందరి అవసరాలూ చాలా క్వయిట్‍గా గమనించేవాడు. ప్రేమని వెల్లడించే పద్ధతి కూడా చాలా కూల్‍గా వుండేది.

ట్రైన్ ఎక్కినప్పుడు మాత్రం తన ప్రేమని లోలోపలే దాచుకోలేక అందర్నీ గాఢంగా కౌగిలించుకుని లోపలికి వెళ్ళాడు. అందరూ కొద్దో గొప్పో మిస్ అయినా, సురేన్‍ని బాగా మిస్ అయింది తమ్ముడు నరేన్. ఇక కల్యాణి అయితే దాని గోల దానిది అన్నట్టే వుండేది కాస్తా, ఇప్పుడు మౌనంగా ఉంటోంది. ఎక్కువ సమయం నరేన్‍తో గడుపుతోంది. నా దగ్గరకు రావడం మొదట్నించీ తక్కువే. అది మరో మితభాషి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, యీ లోకంలో ఎవరి చోటు వారిదే. ఎవరూ ఎవరినీ రీప్లేస్ చెయ్యలేరు. కానీ కొంత క్లోజ్‍గా మెలిగితే మాత్రం కాస్త సాంత్వనని ఇవ్వగలమని అనిపించింది. అందుకే నరేన్‍తో ఎక్కువ మాట్లాడడం సాగించా.

***

రిజల్ట్స్ వచ్చాయి. అనుకున్నట్టుగానే నేను ఫస్టు క్లాసులో పాసయ్యాను. చిన్నప్పుడు 40% దాటేవి కాదు. ఇప్పుడు 92%. హరగోపాల్‍కి 59% వచ్చింది. స్నేహితులందరూ పాసయ్యారు.

జీవితంలో ఏం కావాలనుకుంటామో, ఆ కావలసిన దాని కోసం ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది.

“నీలో చాలా సేవా దృక్పథం వుంది మహీ! నువ్వు డాక్టరువైతే సమాజానికి చాలా ఉపయోగపడతావు” అన్నారు తాతయ్య.

“డిగ్రీ పూర్తి చేసి సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వు. ఎడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ నీకు చాలా వున్నాయి” అన్నారు నాన్న. తాతయ్య, నాన్న ఇద్దరూ మా వూరి హాస్పటల్ కోసం నేను చేసిన పనులనే దృష్టిలో పెట్టుకుని అన్నారని నాకు అర్థమయింది.

“అక్కా.. సింగర్‍గా అయితే సూపర్. నువ్వు సినిమాల్లో పాడితే నాకు గొప్పగా వుంటుంది” నరేన్ అమాయకంగా అన్నాడు.

“నరేన్, మన వూరి చెరువులో యీదడం వరకూ నేను మొనగత్తెనే. కచేరీలన్నా, నేపథ్యగానం అన్నా నదులు, సముద్రాల్లాంటివి. సంగీతం నేర్చుకోవడమే కాదు, అనంతంగా సాధన చెయ్యాలి. ‘ఇప్పటి నా స్థాయి’ వాటికి చాలదు” ప్రేమగా నరేన్ తల నిమిరి అన్నాను.

“ఏ కాలేజీకి అప్లై చేస్తావూ?” అడిగింది అమ్మ.

“ఇంకా నిర్ణయించుకోలేదమ్మా” అన్నాను కాస్త ఆలోచిస్తూ.

“ఆలోచన ఎందుకూ?” నాన్న అడిగారు.

“చదువు గురించి కాదు నాన్నా! హరగోపాల్ మళ్ళీ డిప్రెషన్‍కి గురయ్యాడు. 60% అయితే కనీసం ఫస్ట్ క్లాస్ వచ్చేది గదా. అతనికి వచ్చింది 59%. అందుకే సైలెంటైపోయాడు” అన్నాను.

“మహీ.. పరీక్షల ముందు ఎంత ఎఫర్ట్ పెడితే అంత లాభం వుంటుంది. అతను చదివే వుండచ్చు. కానీ, 100% తెచ్చుకోవాలనే పట్టుదల మాత్రం పట్టి వుండడు. నూటికి నూరూ రావాలని ప్రయత్నిస్తే కనీసం అరవై డెబ్బై వచ్చినా ఓకే. అలా ఎఫర్టు పెట్టినప్పుడూ? రెండోదేమిటంటే, నేను అబ్జర్వ్ చేసినంత వరకూ అతన్ని ఎవరో ఒకరు నిరంతరం పుష్ చేస్తూ వుండాలి. అది పాటయినా సరే, చదువయినా సరే. ఒకసారి చెబితే అల్లుకుపోయేలా ఉండే మనస్తత్వం అయితే ఓకే. లేకపోతే నిజంగా కష్టం” ఓపెన్‍గా అన్నారు నాన్న, అరటిపండు ఒలిచిపెట్టినట్టు హగ్గీ మెంటాలిటీని వివరిస్తూ.

“అతని లైఫ్ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. బహుశా అతని చిన్నతనంలోని అనుభవాలు అతన్ని అలా తయారు చేశాయేమో!” కావాలనే అన్నాను. నాన్న చిరునవ్వు నవ్వాడు.

“మహీ.. చిన్నప్పటి కష్టాలు నిజమైన కష్టాలయితే మనిషి ఎదుగుతున్న కొద్దీ మనసును రాటు తేలుస్తాయి. ఎటొచ్చీ ప్రాబ్లం ఎక్కడంటే, ఆ కష్టాలు వూహించుకున్న కష్టాలు అయినప్పుడే! అఫ్ కోర్స్, ఆ తేనెతుట్టని కదపకుండా ఉండడమే మంచిది” నా తల నిమిరి అన్నాడు నాన్న.

ఎంత అనుభవం! ఎంత లోతైన విశ్లేషణ!!

***

“మహీ.. ఎలా వున్నావ్?” ఫోన్ ఎత్తగానే అన్నది అల.

“అలా.. నువ్వా.. ఓహ్ సర్‌ప్రైజ్!” సంతోషంగా అన్నాను నేను.

“నేను ముందే చెప్పాగా మహీ.. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్‌వనీ, నీతోనే నా మనసు పంచుకుంటాననీ” సిన్సియర్‍గా అన్నది.

“గుర్తుంది మేడమ్.. గుర్తింది.. సినిమా లైఫ్ ఎలా వుందీ.. ట్రైనింగ్ అక్కర్లేదన్నారు గదా నీకు.. సినిమా మొదలయిందా!” కుతూహలంగా అడిగాను. ఎంత వద్దనుకున్నా ‘సినిమా’ అనేది మనకి తెలీకుండానే మనసుని లాగేస్తుంది.

“అంతా బాగానే వుంది మహీ. చెప్పాల్సినవి బోలెడన్ని ఉన్నాయి. ఇది మరో విచిత్ర ప్రపంచం. బురదా పన్నీరు పక్కపక్కనే వుంటాయి. ఒక్కోసారి బురద అన్నది పన్నీరుగానూ, పన్నీరు బురదగానూ కూడా మారుతాయి. సర్లే.. అవన్నీ నిన్ను కలిశాక చెప్తాను. 92% సంపాదించినందుకూ, మన కెవిఎన్ కాలేజీ పరువు నిలబెట్టినందుకూ కంగ్రాట్స్. మహీ, ఇప్పుడనిపిస్తోంది.. మళ్ళీ నీతో పాటు చదువుకుంటే బాగుంటుందని. అంతే కాదు, తెలిసీ తెలియని మూర్ఖత్వంతో మన ఫ్రెండ్స్ అందర్నీ చాలా ఇబ్బంది పెట్టాను. ముఖ్యంగా తిమ్మూని. పాపం, పారిపోయేలా చేశాను. ఇప్పుడు అనుకునీ ఏం లాభం లేదు గనక ఓకే. ఒకవేళ అతను గనుక నీ టచ్‍ లోకి వస్తే క్షమించమన్నానని చెప్పు. మహీ.. నువ్వంటే నాకు నిజంగా ప్రేమ. నీవంటి స్నేహితురాలు వున్నందుకు I feel proud.” అంటూ ఠక్కున ఫోన్ పెట్టేసింది. చివరి మాటలు అనేటప్పుడు దాని గొంతు గద్గదికంగా వినిపించింది. కళ్ళల్లో నీరూ కారిందేమో! ఎంత ఆనందమో, అంతా బాధపడ్డాను. ప్రేమ ఎంత చిత్రమైనది.

తిమ్మూ నెంబర్ ఆల్‍మోస్ట్ అలకి ఇద్దామనుకున్న దానినల్లా ఆగిపోయాను. ప్రేమలో ప్రియమైన కోణాలే కాదు, క్రూరమైన కోణాలు వుంటాయి. తిమ్మూ కూడా ఇప్పుడు కాలేజీలో చేరి చదువుకోవాలిగా.

అలనీ, తిమ్మూనీ మళ్ళీ కలిపితే, ప్రతి రోజూ ఫోన్ చేసి అతని చదువు చెడగొట్టవచ్చు. లేక, తిమ్మూనే అల అంత ఎదిగింది గనక ప్రేమలో పడి మళ్ళీ పిచ్చోడు కావచ్చు. అందుకే ఎవరి నంబరూ ఇతరులకి ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. అల ఫోన్ విషయం అమ్మకి నాన్నకి చెబితే ఆనందించారు.

“జీవితం ఓ అల.. జీవితం ఓ కల

జీ.. వితం సా.. గనీ ఇలా.. ఇలా..!”

అనే పాట పిచ్చ పాపులర్ అయిపోయింది. ఎక్కడ చూసినా యీ పాటే. తెలుగు పాట.. వెస్ట్రన్ వాయిస్. ఆ స్వరంలో ఎన్ని హొయలంటే వూహించలేము. పాడింది రేణుక శివరామ్. రేణుక నాన్నగారి పేరు శివరామ్. మొదట్లో నాకూ నమ్మకం కలగలా, ‘తెలుగు వెలుగు – తెలుగు పలుకు’ పత్రికలో మూడు పేజీల ఇంటర్వ్యూ చూసేదాకా. మా కెవిఎన్ రేణుకానే. అందులో నేను తనని సంపూర్ణాదేవి గారి దగ్గరకు లాక్కెళ్ళడం కూడా చెప్పింది. నేనూ, హరగోపాల్ ఆమెకి ఇచ్చిన సపోర్ట్‌కి పత్రికాముఖంగా ధన్యవాదాలు మరీ మరీ చెప్పింది.

ఒక్క పాటతో రేణుక ఆంధ్ర దేశాన్ని ఊర్రూతలూపింది. ఒక్కటి చాలదా?

“కలిమి నిలవదూ లేమి మిగలదూ

కలకాలం ఒక రీతి గడువదూ”

అన్న ఒక్క పాటే సినిమాలకి భుజంగరాయశర్మ గారు వ్రాసింది (రంగులరాట్నం సినిమా లోది). ఇది దశాబ్దాలయినా  ఆ పాట గాయకుల గళాల్లోనూ, శ్రోతల పెదాల మీదా  నర్తిస్తునే వుందిగా!

‘కాలాతీత వ్యక్తులు’ అన్న నవల డా. శ్రీదేవి గారిని అమరం చెయ్యలేదూ!

“నిదురించే తోట లోకి

పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచి

కమ్మటి కల ఇచ్చింది

రమ్యంగా కుటీరాన రంగవల్లులద్దిందీ

దీనురాలి గూటిలోన దీపంగా వెలిగిందీ”

అన్న గుంటూరు శేషేంద్ర శర్మగారి పాట చిరంజీవైపోలేదూ?

అలాగే.. వ్యక్తిలోని ప్రతిభని వెలికితీయడానికి ఒక్క పాట చాలు. రేణుక ఎంత పాపులర్ అయిందంటే, రేణుక పేర అభిమాన సంఘాలు వెలిశాయి. ఆ పాట రాని రేడియో/ఛానల్ లేనే లేదు. కొన్ని మిలియన్ల మంది ఆ పాటకి లైక్స్ కొట్టి శిఖరాగ్రాన నిలిపారు. మా కెవిఎన్ స్టూడెంట్స్ అంతా తామే గెలిచినంత గొప్పగా ఫీల్ అయ్యారు. నన్ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో ప్రస్తావించడం వల్ల నేనూ కొన్ని వందల ఫోన్లు ఎటెండ్ కావాల్సి వచ్చింది. మొత్తానికి అల, రేణుక, కాలేజీ పేరు నిలబెట్టారు.

రేణుక ఎంత ఎదిగిందో హగ్గీ అంత కుంచించుకుపోతున్నాడు. కారణం తనకి అవకాశం రాకపోవడం. లోపల్లోల నీరసించిపోతున్నాడు.

“హగ్గీ రేణుకది పెక్యూలియర్ వాయిస్. ఆ విషయం ముందే మనకి సంపూర్ణాదేవి గారు చెప్పారు. అలాగే, ఆవిడా మా నాన్నగారు కూడా ఇతరుల్ని అనుకరించకుండా ‘నీ స్వరంతో నువ్వు పాడు’ అని సలహా చెప్పారు. ఇప్పుడు ఏం ముంచుకుపోయిందని ఇంతలా క్రుంగిపోతున్నావూ? మరింత సాధన చెయ్యి. మరింతగా నీ తప్పులు నీవు దిద్దుకో. ముందు డిగ్రీ అయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అప్పుడు తప్పకుండా సినిమాల్లో ప్రయత్నిద్దు గాని” ఓ రోజున తీరిగ్గా వివరించి చెప్పాను.

“అది కాదు మహీ..” ఏదో చెప్పబోయి ఆగిపోయాడు.

“అవకాశం అనేది ఒకటి, దానంతట అది రావాలి. లేదా, మనమే అవకాశాన్ని వెదుకుతూ వెళ్ళాలి. అలా వెళ్ళేముందు సంపూర్ణమైన సాధనతో, నమ్మకంతో వెళ్ళాలి. హగ్గీ, ముందర నీలోని అసంతృప్తినీ, అసహనాన్నీ, మరో విధంగా చెబితే నీలో నిగూఢంగా దాగుని వున్న జెలసీని తీసిపారెయ్యి. Put all your efforts. చర్చల వల్ల ఏమీ లాభం వుండదు. చేతల్లో చూపించాలి!” అతని భుజం తట్టి వచ్చేశాను.

ఓదార్పు అనేది మాత్రలా వుండాలి గానీ, స్టెరాయిడ్‍లా వుండకూడదు. ఓదార్పుకి అలవాటు పడ్డవాళ్ళు ఛస్తే జీవితంలో పైకి రాలేరు. ఇది సత్యం.

***

“కుసుమ చనిపోయిందటే” దిగాలుగా అన్నది అమ్మమ్మ.

నాకు నోరెండిపోయింది. “ఎవరు చెప్పారూ?” నా గొంతు నాకే వినబడలేదు.

“డాక్టర్ శ్రీధర్ ఫోన్ చేశారు. డెడ్ బాడీని ఉప్పలపాడుకే తెస్తారుట” అమ్మమ్మ గొంతులోనూ జీవం లేదు.

ఒక్కసారి కుసుమ పెళ్ళీ, అది హాస్పటల్లో చేరటం, నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అది ముభావంగా వుండటం – అన్నీ మనసులో సినిమాలా రివైండ్ అయ్యాయి.

కళ్ళ నీరు ధారగా కారుతుండగా, “అమ్మమ్మా ఊరు వెళ్దాం” అన్నాను.

“వద్దు మహీ.. వద్దు. శవాన్ని మాత్రం చూడకు. కనీసం నీ వూహల్లో అయినా దాన్ని బతికి సజీవంగా వుండనీ” నెమ్మదిగా అన్నా, స్పష్టంగా అన్నది అమ్మ.

(ఇంకా ఉంది)

Exit mobile version