(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[అమ్మానాన్నలని ఒప్పించి ఆర్మీలో చేరిపోతాడు సురేన్. అతను వెళ్ళిన మూడో రోజున అతని గదికి వెళ్ళి పరిశీలిస్తుంది మహీ. అక్కడ సైన్యానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు కనబడతాయి. అసలు సురేన్‍కి ఆర్మీ అంటే అంత ఇష్టం ఎందుకో మహీకి అర్థమవుతుంది. సాయంత్రం అందరూ టీ తాగుతుండగా సురేన్ వ్యక్తిత్వం గురించి అందరికీ గొప్పగా చెబుతుంది. అప్పటిదాక నిశ్శబ్దంలో కూరుకుపోయిన ఆ ఇంట్లో మళ్ళీ సందడి మొదలవుతుంది. అమ్మమ్మ వాళ్ళ ఊరెళుతుంది మహీ. అమ్మమ్మ వంటలు నేర్చుకోమంటుంది. అక్కడే ఉన్న డా. శ్రీధర్ కూడా ఆ ఆలోచనకి మద్దతిస్తారు. వండడం ఒక సైన్స్, ఒక ఆర్ట్ అని చెప్తారు. వంట వండేటప్పుడు పొయ్యి వెలిగించడం దగ్గరనుంచి భోజనాలు పూర్తయ్యే వరకూ కోపతాపాలకి దూరంగా ఉండాలని చెప్తుంది అమ్మమ్మ. అన్నం గురించి తాతయ్య అమ్మమ్మలు చక్కని వివరణ ఇస్తారు. అమ్మమ్మ పర్యవేక్షణలో అన్ని రకాల వంటలూ శ్రద్ధగా నేర్చుకుంటుంది మహీ. వంటలు నేర్చుకుంటూనే, ఊరి హాస్పటల్‌కి తనకి తోచిన సేవ చేస్తుంది. ఆ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ హాస్పటల్‍గా గుర్తిస్తుంది. ఊరి ప్రెసిడెంట్ పొంగిపోయి మరికొన్ని మంచి పనులు చేస్తాడు. సత్యసాయి సంస్థలకీ, శ్రీరామారావు గారికీ, స్కౌట్స్ టీచర్ సీతారామాంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది మహీ. తాను ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాని డా. శ్రీధర్‍తో అంటే, ముందు రిజల్ట్స్ రానీ, వచ్చిన తరువాత చూడచ్చని ఆయన అంటారు. రిజల్ట్స్ రావడానికి మూడు రోజుల ముంది తిరిగి టౌన్‍కి వచ్చేస్తుంది మహీ. ఫలితాలు వస్తాయి. మహీకి 92%. హరగోపాల్‍కి 59% వస్తాయి. స్నేహితులందరూ పాసవుతారు. మహీ ఏం చదవాలన్న చర్చ వస్తుంది ఇంట్లో. అందరూ రకరకాల సూచనలు చేస్తారు. హగ్గీ డిప్రెషన్‍కి లోనయ్యాడని మహీ చెప్తే, అతని మనస్తత్వాన్ని విశ్లేషిస్తాడు మహీ తండ్రి. ఒక రోజు అల ఫోన్ చేస్తుంది. స్నేహితురాళ్ళిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. గతంలో తను చేసిన తప్పులకి క్షమాపణ కోరుతుంది అల. రేణుక పాడిన ఓ పాట సూపర్ హిట్ అవుతుంది. పేపర్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనని ప్రోత్సహించిన సంపూర్ణాదేవి గారి గురించి, మహతి గురించి గొప్పగా చెబుతుంది రేణుక. హగ్గీ మరింత క్రుంగిపోతాడు. అతనికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంది మహీ. కుసుమ చనిపోయిందన్న వార్త తెలుస్తుంది. ఊరు వెళ్దామని మహీ అంటే తల్లి వద్దంటుంది. కుసుమ శవాన్ని చూడొద్దనీ, కనీసం నీ ఊహల్లో అయినా తనని సజీవంగా ఉండనీ అంటుంది మహీతో. – ఇక చదవండి.]
[dropcap]మ[/dropcap]నసంతా వికలమైపోయింది. చిన్నప్పటి స్నేహితురాలు. దాని ఇంటికి వెడితే సరిగా మాట్లాడలేదనీ, కాపురానికి ఓకే చెప్పేసిందనీ చిన్న మిస్‍అండర్‍స్టాండింగ్‌తో సరిగ్గా తనతో స్నేహితురాలిగా బిహేవ్ చెయ్యలేదనిపించింది. కొరకరాని కొయ్యల్లాంటి తల్లిదండ్రుల ముందూ, ఆ బామ్మ ముందూ ఏం మాట్లాడగలదూ? అలాగే కారులో పోయేప్పుడు మా ఇంటి ముందు ఆగి ఏం చెప్పగలదూ?
పాపం దాని ప్రాణం ఎంత కొట్టుకుపోయిందో. నేను దాన్ని అర్థం చేసుకోలేదు. చాలా చాలా బాధ అనిపించింది. అసలు మనిషిని మనిషిగా బ్రతకనివ్వకుండా, పరువు ప్రతిష్ఠల పేరు మీద చేసే యీ హవనాన్ని ఏ శక్తి ఆపగలదు? ముఖ్యంగా స్త్రీలకి యీ దేశంలో ఇటువంటి దౌర్భాగ్యం ఎందుకూ? కొంతకాలం ‘సతి’ అంటూ బతికివున్న ఆడదాన్ని భర్తతో బాటు తగలబెట్టారు. కొన్నాళ్ళు కన్యాశుల్కం పేరుతో పసి బాలికలని డబ్బుకి ఆశపడి ముసలివాళ్ళకి కట్టబెట్టి విధవలుగా మార్చారు. కొంతకాలం వరకట్నాలు ఇచ్చుకోలేక నానా చెత్త వెధవలకీ ఆడపిల్లల్ని కట్టబెట్టారు. ఎందరు ఆడపిల్లలు కిరసనాయిల్‍కీ, గ్యాస్ స్టవ్వులకీ బలైపోయారు లెక్కలు తేల్చేది ఎవరూ? ఎంతమంది కోడళ్ళని అత్తామామలూ ఆడబడుచులూ భర్తలూ మందు బెట్టో, తగలబెట్టో చంపేశారో చరిత్రకెక్కించేదెవరూ?
రోడ్డు మీదకి ఆడపిల్లలు వస్తే చాలు, కిడ్నాప్‍లకీ, రేపులకీ, సామూహిక మానభంగాలకీ, ఏసిడ్ పోయటానికి సిద్ధంగా కాచుకునే నరకాసురులు, మహిషాసురులు ఎందరు లేరు? ఇంత మంది మానవ మృగాలను నుంచి తప్పించుకుంటే గానీ మగువకి మనుగడ లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా ఏం లాభం? అవినీతి, లంచగొండితనం, అవిద్య, కుసంస్కరం ఊళ్ళేలుతున్నంత వరకూ ఆడదానికి భద్రత ఏది? ఇక అధికారుల సంగతీ, రాజకీయ నాయకుల సంగతీ సరేసరి.
ఇది కలియుగపు స్త్రీ కథ కాదు. కృతయుగపు చంద్రమతి, త్రేతాయుగపు సీత, ద్వాపర యుగపు ద్రౌపది.. అన్ని కథల్లోనూ అన్యాయానికి గురైంది స్త్రీలే. స్త్రీని పూజించే దేశమా ఇదీ? పూజించకపోతే పోనీ, కనీసం మనిషిగా గుర్తించే దేశమా ఇదీ?
“మహీ.. అలా ఆలోచిస్తూ వుంటే రోజులు గడిచిపోవడం తప్ప, ప్రయోజనం ఏమీ ఉండదు. నీ ఆలోచనలన్నీ సరైనవే. అనేకానేక శతాబ్దాల నించీ స్త్రీలు వివక్షకి గురవుతున్న మాట నిజమే. కానీ వారి జీవితాల్లో మార్పు కావాలంటే రాత్రికి రాత్రి సాధ్యం కాదు. కుసుమనే తీసుకో. తను తిరగబడాలని ఖచ్చితంగా అనుకుంటే తిరగబడలేదా? కానీ, తిరగబడదు. తన బదులుగా నువ్వు వాళ్ళ వాళ్ళతో పోట్లాడి ఆమె అభీష్టం నెరవేర్చాలి. ఎందుకలా? కార్లో వెళ్ళేటప్పుడయినా ఒక్క క్షణం నీతో మాట్లాడాలని ఎందుకు పట్టుబట్టలేదూ? పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే భయమా? చావు దాకా వెళ్ళిందే హాస్పటల్లో. ఇంకా ఎందుకు భయం? సరే. ఆర్థికంగా నిలబడలేననా? బయటకి వస్తే గదా, ఆ విషయంలో భయపడటానికి. అది ఏమైనా, ఎటువంటిదైనా, ఆ స్థితిలో మాత్రం ఏ స్త్రీ వున్నా ఒక నిర్ణయం తీసుకోవాలి. తనకి ఏమి కావాలో తనే నిర్ణయించుకోలేకపోతే, ఇంకెవరు నిర్ణయిస్తారూ?” వేదనగానే అన్నారు నాన్న. గొంతులో స్పష్టంగా ఆవేదన వినిపిస్తోంది.
“నా సలహా ఒకటే మహీ.. ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టు. ఎందుకంటే, ప్రవహించి సముద్రంలో కలిసిన నీటి గురిచి ఆలోచించడం ఎంత వ్యర్థమో, జీవితాన్ని త్యజించి వెళ్లిపోయిన కుసుమ గురించి ఆలోచించడమూ అంతే వ్యర్థం. అయితే భవిష్యత్తులో ఇటువంటి కుసుమలు దౌర్భాగ్య మరణాలకి గురికాకుండా వుండాలంటే, ఏమి చెయ్యాలో పాజిటివ్‍గా ఆలోచించు. వారికి ఎలా చేయూతనివ్వాలో ఆలోచించు” మెల్లగా అన్నా, స్థిరంగా అన్నది అమ్మ.
ఆమె అన్నదీ నిజమే. జరిగిపోయినది మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మనిషిగా చేయాల్సింది.
***
“హరగోపాల్‍కి బాగోలేదే” అన్నది రహీమా. నాకు నిజంగా కంగారు పుట్టింది. నాకున్న మంచి స్నేహితుల్లో అతనొకడు.
“ఉండేది ఎక్కడో తెలుసా?”
“పాతూరు దగ్గర అనుకుంటా. మా పనిమనిషి ఉండేది అక్కడే. కనుక్కుని చెబుతాను” అన్నది.
“ప్లీజ్.. ఎంత త్వరగా అయితే అంత త్వరగా కనుక్కో. వెళ్లి చూసొద్దాం..” అన్నాను.
“ఓకే. నేనూ వస్తానులే నీతో బాటు. సాయంత్రానికి అడ్రసు తీసుకొస్తా” అన్నది రహీమా.
కుసుమ గొడవలో హగ్గీని అసలు పట్టించుకోలేదు. అతన్నే కాదు ఎవర్నీ పట్టించుకోలేదు. నా చెల్లెలు కల్యాణి అయితే మరీ కోపగించింది.
“అమ్మా, హరగోపాల్‍కి బాగోలేదట” అన్నాను.
“అనుకున్నానే! అతను చాలా సెన్సిటివ్. ‘టు బి సెన్సిటివ్, యీజ్ ఏ ఫూలిష్ థింగ్’ అంటారు పెద్దరు. సున్నితంగా ఆలోచించు, సున్నితంగా మాట్లాడు, సున్నితంగా ప్రవర్తించు.. గ్రేట్. కానీ, అందరూ నీలా సున్నితంగా ఉంటారనో, ఉండాలనో మాత్రం వూహించుకోకు. ఎందుకంటే జీవితం అంటేనే ఆటుపోట్లకి ఆలవాలం. ఎన్ని మలుపులూ, ఎన్ని ఎగుడుదిగుళ్ళూ!” అన్నది అమ్మ నిట్టూర్చి.
“నీకెందుకనిపించింది?” చెప్పలేనంత కుతూహలంతో అడిగాను.
“ఎప్పుడు చూసినా సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళ సంగతి గురించే ఆలోచిస్తూ తను మాత్రం అన్యాయానికి గురికాబడ్డానని అనుకుంటాడు. ఎన్నిసార్లు వివరంగా చెప్పినా, మరుసటి రోజుకి మళ్ళీ మొదటికొస్తాడు. నేనూ మీ నాన్నా కూడా చెప్పీ చెప్పీ ఓ విధంగా విసిగిపోయాం” అన్నది అమ్మ.
నాకు కొంత బాధ, కొంత చికాకూ, కొంత కోపం ఒకేసారి వచ్చాయి. మా అమ్మకీ నాన్నకీ ఓపిక చాలా ఎక్కువ. వాళ్ళే విసిగిపోయారంటే!
సాయంకాలం నాలుగ్గంటల కల్లా రహీమా వచ్చింది. ఆటో ఎక్కి పాతూరుకి వెళ్ళాం. అక్కడున్న ఓ పాత చర్చి నుంచి ఆరో ఇల్లు. ఇల్లు చాలా చిన్నది. పెంకుటిల్లు. ఇంటి ముందు ఓ పచ్చని వేపచెట్టు, ఓ మందార చెట్టు ఉన్నాయి. తలుపు తడితే ఓ పెద్దావిడ తలుపు తీసింది. బొట్టు లేదు.
“అమ్మా నమస్కారం. హరగోపాల్ ఉన్నారా?” అనడిగాను.
“ఉన్నాడు.. రండి” ఆవిడ గొంతులో మార్దవం లేదు. ఏదో పిలవాలి గాబట్టి పిలిచింది.
“లోపల ఉన్నాడు” అంటూ ఓ తలుపు చూపించింది.
లోపలికి వెళ్ళాం. హగ్గీ మంచం మీద పడుకున్నవాడల్లా తలుపు చప్పుడికి లేచాడు.
“ఓహ్.. మీరా?” ఆశ్చర్యంగా అన్నాడు.
“మేమే.! ఎలా ఉంది హరగోపాల్? అసలు ఏమయిందీ?”
నిలబడే అన్నాం. మంచం తప్ప కూర్చోవడానికి ఆ గదిలో ఏదీ లేదు.
“ప్లీజ్ కమ్..” బయటకొస్తూ అన్నాడు. అతని వెనకే వెళ్ళాం. చర్చి దాటాక ‘లిటిల్ ఫ్లవర్స్’ అనే స్కూలుంది. అక్కడున్న బెంచీల మీద కూర్చున్నాం.
“ఇదీ మాదే. మా అమ్మగారు యీ స్కూల్లో టీచరు” అన్నాడు.
“ఓహ్.. వెరీ గుడ్” అన్నాను నేను, ఏం మాట్లాడాలో తెలియక.
“ఇంతకీ ఏమిటీ ప్రాబ్లమ్. ఎందుకు అనారోగ్యం వచ్చిందీ?” అడిగింది రహీమా.
“అనారోగ్యం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. అసలు ఏదీ చెయ్యాలని లేదు. ఎవరితోటీ మాట్లాడాలనీ లేదు. ఎవరితో మాట్లాడినా టన్నుల కొద్దీ నీతులూ బోధనలూ. విసుగొచ్చింది” అన్నాడు దూరంగా చూస్తూ.
“ఆ జనాల్లో మా అమ్మా నాన్నగారు కూడా ఉన్నారు కదూ. పరవాలేదు. నేనేమీ అనుకోను” గట్టిగా నవ్వి అన్నాను.
“అదేమీ లేదు” నిర్లిప్తంగా అన్నాడు.
“మంచిదే.. లేకపోతే. ఉన్నా కూడా నేనేమీ అనుకోను. ఓకే. నీకు అనారోగ్యం అని తెలిసి వచ్చాం. అనారోగ్యం లేదు అన్నావు గదా, అంతే చాలు” లేచి అన్నాను. నాలో ఏదో నిర్లిప్తత.
“అప్పుడే వెళ్ళిపోతారా?” అతని గొంతులో ఒక చిత్రమైన ఆత్రుత.
“ఉండి ఏం చెయ్యాలీ? ఏదీ చెయ్యాలనీ, ఎవరితోటీ మాట్లాడ కూడదనీ అనుకునేవాడి దగ్గర ఏం మాట్లాడాలీ? బహుశా ఒంటరితనమే నీకు ఆనందమేమో!” కఠినంగానే అన్నాను. నేనే మాత్రం సానుభూతి చూపించదలచుకోలేదు. రహీమా షాక్ తిని నా వంక చూసింది. ఇంత కఠినంగా మాట్లాడతానని అది వూహించి వుండదు.
“అంతగా పొడవనక్కరలేదు. సాటి మనిషిని అర్థం చేసుకోవడానికో, అర్థం అయ్యేట్టు చెప్పడానికో ప్రయత్నించాల్సిన చోట, మాటల కత్తులు ఎందుకూ దూయడం?” హర్ట్ అయినట్లుగా అన్నాడు.
“కత్తుల్లాంటి మాటలా? దేనికి? అసలు నువ్వేగా చెప్పిందీ ఏదీ చెయ్యాలనీ, ఎవరితోటీ మాట్లాడాలని లేదనీ!” నేనూ సీరియస్ గానే అన్నాను.
“ఎందుకో నా ప్రపంచం అంతా కూలిపోయినట్టు అనిపించింది. దానికి తోడు నేను సింగర్స్‌ని ఇమిటేట్ చేస్తున్నానని విమర్శలు. పోటీలు పెడితే, నా కంటే అతి తక్కువ స్థాయి సింగర్స్‌ని సెలెక్ట్ చేసి నాకు సొడ్డుకొట్టారు. డిప్రెషన్ అనేది కలగదా?” సీరియస్‍గా, ఉక్రోషంగా అన్నాడు హరగోపాల్.
“ఓహో..! నాన్నగారు అమ్మ చెప్పింది నీ స్వరంలో పాటలు వినిపించమని. అది నీకు తప్పు అయింది. రఫీనీ, ముకేష్‍నీ, ఘంటసాలనీ, ఎస్.పి.బి.నీ నువ్వు 100% మక్కీకి మక్కీ దించెయ్యగలవు. కానీ హరగోపాల్ ఎక్కడ? ఇది ఎవర్నడిగినా చెబుతారు. ఇతర్లు సెలెక్ట్ కావడానికి కారణం, వారు తమదైన గొంతుతో పాడడం. ఎగ్జాంపుల్ రేణుక. ఇక సంపూర్ణాదేవి గారు సున్నితంగా నీకు ఏనాడో చెప్పారు. ఎవరి మీద నీ కోపం? నీ ప్రపంచాన్ని ఎవరు కూల్చారు? నీ మీద నువ్వే జాలిపడుతూ లోకాన్ని ఎందుకు నిందిస్తావూ?” స్పష్టంగా నిర్మొహమాటంగా అన్నాను.
“కనీసం.. కనీసం.. నువ్వు ఇట్లా మాట్లాడతావని కలలో కూడా వూహించలా” మొహం గంటు పెట్టుకుని అన్నాడు.
“నిజం నేనే కాదు.. ఎవరు మాట్లాడినా ఒకలాగే ఉంటుంది” అన్నా.
“నా బాధని నీ బాధగా భావిస్తావనుకున్నాను” తల వంచుకుని అన్నాడు.
“నీ బాధని నా బాధగానా? ఎందుకు భావిస్తాను? అసలు నీ బాధేంటీ? సింగర్‌గా సెలెక్ట్ అవలేదనా? దానికి ఎవరేం చెయ్యగలరూ? అదొక్కటే జీవితం కాదుగా? అసలు నేను నీ కోసం బాధపడాలనే దౌర్భాగ్యపు ఆలోచన నీకెలా వచ్చిందీ?” సీరియస్‌గా అడిగాను. అతనేమీ మాట్లాడలేదు. రహీమా ఆశ్చర్యంగా చూసింది నా వంక.
“ఓకే. నేను దౌర్భాగ్యుడ్ని. నేను ఇక జన్మలో పాడను” కళ్ళు మూసుకుని అన్నాడు.
“అంటే? నువ్వు పాడకపోవడానికి ఇతరుల్ని కారణంగా చూపించదలచుకున్నావన్న మాట. నీ పాటలు విని నికు అభిమానినయ్యా. మా ఇంట్లో అందరికీ నిన్ను పరిచయం చెయ్యడమే గాక మా వూరికి కూడా తీసుకెళ్ళాను. కేవలం ఓ స్నేహితుడిగా. నీ మాటలు చూస్తే వేరే విధంగా వున్నై. ఓకే. హరగోపాల్, నీ వైఫల్యాన్ని ఎదుటివారికి అంటగట్టకు. పాడడం, పాడకపోవడం నీ ఇష్టం. కానీ, ఒకటి గుర్తుంచుకో. సానుభూతి అనేది ఒక విధంగా విషం లాంటిది. దానికి అలవాటు పడకు. చేవుంటే, ధైర్యముంటే నీ లోపాలు నువ్వు సరిదిద్దుకో. నిజంగా అద్భుతమైన గాయకుడివి అవుతావు. సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ డిప్రెషన్ గొప్పవనుకుంటే అందులోనే కూరుకుపో! అప్పుడు కూడా నష్టం నీకే. ఒక స్నేహితురాలిగా నేను నీతో ఒక్కటే చెప్పగలను. పట్టుబట్టి సాధించు. భగవంతుడు నీకు వరంగా ఇచ్చిన గాత్రాన్ని సాధనతో నిలబెట్టుకుంటావో, నాశనం చేసుకుంటావో నీ ఇష్టం. వెళ్ళొస్తాం. గుడ్ బై. గాడ్ బ్లెస్ యూ. నీ సెల్ఫ్ డిప్రెషన్ నించి బయట పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” లేచి బయటకు నడిచాడు. రహీమా నా వెంటే నడిచింది.
“అదేంటి మహీ.. అలా మాట్లాడావూ? బాగా హర్ట్ అయ్యాడు” అన్నది రహీమా, మేం నడుస్తూ వుండగా.
“రహీ.. సారీ.. అతను ఉద్దేశించింది మా నాన్నగారినీ, అమ్మగారినీ. చేసిన తప్పును సున్నితంగా చెప్పి, అతన్ని సరైన గాయకుడిగా చూడాలనుకోవడం తప్పు కాదే. అదీగాక, అసలు మాకేం సంబంధం? చాలా హర్టింగ్‍గా అతను మాట్లాడటం వల్ల నేనూ ట్రిగ్గరయ్యాను. ఎనీ వే. చెప్పాల్సిందే చెప్పానుగా!” నిట్టూర్చి అన్నాను. ఎవర్నో పరామర్శించడానికి వెళ్ళి ఇలా మాట్లాడడం నాదీ తప్పే అనిపించింది.
“నీదాకా వచ్చిందో లేదో నాకు తెలీదు గానీ, మీరిద్దరు మొదట్నించి లవ్‍లో వున్నారని చాలామంది అనుకుంటున్నారు. అతన్ని మీ ఇంటికీ, ఊరికీ తీసుకెళ్ళటం జనాల వూహలకి ఇంకా వూతమిచ్చింది. నేనూ అలానే అనుకున్నాను. ఓహ్.. నీ మాటలతో తెలిసింది అతన్ని నువ్వు కేవలం ఓ ఫ్రెండ్‍లా చూస్తావని!” రిలీఫ్‍గా అన్నది రహీమా.
“మై గాడ్.. నిజమా?” షాక్‍తో అన్నాను.
“అవును. అతను కూడా అట్లాగే అనుకున్నాడనుకుంటా. అందుకే నీ నుంచి మరింత సాంత్వన, సానుభూతి ఎక్స్‌పెక్ట్ చేశాడు” నా భుజం మీద చెయ్యి వేసి అన్నది రహీమా.
“మై గాడ్. నా వరకూ నేను గానీ మా ఇంట్లో వాళ్ళు గానీ అతన్ని ఓ గాయకుడిగా అభిమానించాం. అందుకే అతని ఫొటోల్ని కూడా ఫ్రేమ్ కట్టించి మా నాన్నగారు అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు” అన్నాను.
“ఆ విషయం కాలేజీలో టాం.. టాం.. అయింది. ఎనీ వే – ఇప్పటికైనా అతని కళ్ళు తెరుచుకుంటాయని ఆశిద్దాం” అన్నది రహీమా. నిజంగా నేను షాక్ లోనే ఉన్నాను. నాకు తెలిసినంత వరకూ ఎప్పుడూ అతనితో స్వీట్ నథింగ్స్ మాట్లాడలేదు. మా మధ్య మాటలైనా, చర్చలైనా, సంగీతం గురించి, పాటల గురించే ఉండేవి. ఏనాడూ నేను ఇతర విషయాలు ఎత్తలేదు.
“ఆలోచించకు మహీ! నువ్వు మాట్లాడింది రైట్. అర్థం చేసుకుంటే, ఆ సెల్ఫ్ పిటీ నుంచి బయటపడతాడు. లేదా, అతని ఫేట్ అతన్ని నడిపిస్తుంది” అనునయంగా అన్నది రహీ.
మరుసటి రోజు ఉదయం మా అమ్మ నన్ను నిద్ర లేపింది. ఏమిటా అని చూస్తే హరగోపాల్ తల్లి. షాక్ తిన్నాను. అయినా తమాయించుకుని అవిడ్ని అమ్మకి పరిచయం చేశాను. నాన్నగారు వాకింగ్‍కి వెళ్ళారు. అమ్మమ్మ, తాతయ్య లోపల ఉన్నారు.
“నీ పేరు మహిత కదూ. వాడే చెప్పాడు. రాత్రి నించీ ఏడుస్తున్నాడు. నువ్వు ఏమన్నావో, వాడు ఏం విన్నాడో నాకు తెలీదు. వాడి బాధ చూడలేక వచ్చాను.” నా కళ్ళల్లోకి చూస్తూ నిర్లిప్తంగా అన్నది.
“మీ అబ్బాయికి బాగోలేదంటే చూడడానికి నేనూ, నా ఫ్రెండ్ రహీమా వచ్చాం. విషయాలన్నీ వివరంగా చెబుతాను. కూర్చోండి” అని సోఫా చూపించాను. ఆ మాట విని అమ్మ లోపలికి వెళ్ళింది.
పూసగుచ్చినట్టు మొత్తం చెప్పాను. మా అమ్మానాన్నగారు అతనికి ఇచ్చిన సలహాతో కూడా. నా దృష్టిలో అతనో గొప్ప గాయకుడనీ, సాధన చేస్తే ఇంకా గొప్పవాడు కాగలడనీ, నేననుకున్న సంగతి వివరించాను. దాదాపు 20 నిమిషాలు పట్టింది. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ఓపిగ్గా విన్నది.
“నీ వరకూ నువ్వు చాలా క్లీన్‍గా మంచి ఉద్దేశాలతోనే వున్నావు. బహుశా వాడే నీ గురించి చాలా ఎక్కువగా చాలా దగ్గరగా వూహించుకుని వుంటాడు. నువ్వు వాడికి చెప్పిన మాటలు కూడా సరైనవే. కానీ మహితా, హరగోపాల్ మంచివాడే. స్నేహానికి మించి ఆలోచించవలసిన వయసు గానీ, పరిస్థితులు గానీ మీ ఇద్దరికీ లేవు. ఇప్పుడు వాడు బాధపడుతున్నది కూడా నీతో స్నేహం కట్ అయినందుకే అని నాకు అనిపిస్తోంది. ఒకే ఒక్కసారి నీ స్నేహం కట్ అవలేదనీ, అతను మామూలుగా నీతో మాట్లాడవచ్చనీ దయచేసి నా కోసం చెప్పు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా వీడంత సెన్సిటివే. చిన్న మాట తేడా వచ్చి సూయ్‍సైడ్ చేసుకున్నాడు. లోకంలో నాకంటూ మిగిలింది వీడొక్కడే!” అంటూ సైలెంటయ్యింది.
అప్పుడు అర్థమయింది.. ఆమె తన హృదయాన్ని పాషాణంగా మార్చుకుని బతుకున్నదని.
మా అమ్మ కాఫీలు తీసుకొచ్చింది, “మేడమ్.. మీ మాటల్ని నేనూ విన్నాను. మా దృష్టిలో మీ పిల్లవాడు మాకూ పిల్లాడి లాంటి వాడే. నేనూ మా వారూ వచ్చి అతనికి చెప్పాల్సింది చెబుతాం. మీరు ధైర్యంగా ఉండొచ్చు” అన్నది.
హరగోపాల్ తల్లి నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది.
“అమ్మా..” అన్నాను. అమ్మ చిన్నగా నవ్వింది.
“మహీ.. ఇఅవన్నీ మామూలే. టెన్షన్ పడకు. యవ్వనారంభంలో అనేకానేక ఆలోచనలు వలస పక్షుల్లా మనసుల్లో విహరిస్తాయి. కొందరు మాత్రం ఆ పక్షులు జీవితమంతా తమ దగ్గరే వుండాలని కోరుకుంటారు. అది సాధ్యమా? హరగోపాల్ ఆశ పడడంలో తప్పు లేదు. బహుశా అతనికి జీవితంలో కాస్త సంతోషం దొరికిన ఒయాసిస్సు నువ్వో, మన ఇల్లో కావొచ్చు. అది ఎప్పుడైతే దూరమవుతుందో రకరకాల వేదనాభరితమైన ఆలోచనలు కలగడం సహజం. It is a matter of small misunderstanding. అతనికి కొంచెం నచ్చజెప్పితే చాలనుకుంటున్నా. నువ్వు రిలాక్స్‌డ్‌గా నీ పని చూసుకో. నేనూ, మీ నాన్నగారూ వెళ్ళి అతనితో మాట్లాడుతాం. సరేనా!” నా తల నిమిరి లోపలికి వెళ్ళింది.
ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు అప్రయత్నంగా వెలువడింది.
***
“కుసుమ చనిపోయి బ్రతికింది మహీ. నువ్వంటే ఆమెకి ప్రాణం. చిట్టచివరి వరకూ నిన్నే నిన్నే తలచుకుంది” డా. శ్రీధర్ నాతో అన్నారు.
“మీకెలా..” ఆశ్చర్యంగా అన్నాను.
“జరిగిందంతా వివరంగా నాకు ఉత్తరం వ్రాసింది. ఆ మరుసటి రోజునే ఆమె పోయిందంట. పనిమనిషికి ఇచ్చి ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేయిస్తున్నాని ఉత్తరంలో వ్రాసింది” నిట్టూర్చి అన్నారు శ్రీధర్.
“ఆ ఉత్తరం నేను చదవొచ్చా” ఆత్రంగా అడిగాను.
“వొద్దు. బహుశా కుసుమ నిన్ను ప్రేమించినంతగా ఎవర్నీ ప్రేమించలేదు. అంత ప్రాణంగా నీ గురించి వ్రాసింది. తన జీవితం, ఆశలూ అన్నీ రాస్తూ, తన పెళ్ళయ్యాక జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు వ్రాసింది. ఒక డాక్టరుగా నాకే ఆ విషయాలు చదివి కొన్ని రోజుల పాటు నిద్ర పట్టలేదు” ఆయన కళ్ళు చెమర్చాయి.
“ఎంత బాధాకరమైనా” నేనన్నాను.
“అందుకే అంటున్నా. ఆమె ప్రేమని జీవితాంతం గుర్తు పెట్టుకో. ఆమె భరించిన జీవితాన్ని చదివి నాకే అనిపించింది, అర్జెంటుగా అమె తల్లిదండ్రుల మీద, భర్త అత్తమామల మీద కేసు పెట్టి ఋజువుగా ఆ వుత్తరాన్ని కోర్టుకి సాక్ష్యంగా సమర్పించాలని. ఆ ఆలోచనని అణచుకోవడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. నిజమే.. వాళ్ళందరికీ శిక్షలు పడతాయి. తరవాత? చనిపోయిన కుసుమ తిరిగొస్తుందా?”
“మిగతా వాళ్ళకయినా బుద్ధొస్తుందిగా?” ఆయన్ని మధ్యలో ఆపి, ఆవేశంగా అన్నాను.
“అందుకే నీకు ఉత్తరం ఇవ్వనన్నది. నీలో ఆవేశం చాలా ఉంది. కానీ, ఇక్కడ కావల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఆ ఉత్తరం చదివిన పన్నెండో రోజున నేను వాళ్ళింటికి వెళ్ళాను. కుసుమ తల్లీ తండ్రీ భోరుమన్నారు. కూతురు జీవితం నాశనం కావడానికి తామే బాధ్యులుగా భావించి కుళ్ళిపోతున్నారు. ముసల్దాన్ని నోరెత్తనివ్వడం లేదు. ఇప్పటికీ వాళ్ళకి మిగిలింది గర్భశోకమేగా. అంతకంతే ఇంకేం శిక్ష వుంటుందీ? ఎంత అయినా ఆమెని వాళ్ళు కన్నారు. అల్లారు ముద్దుగానే పెంచారు. పరువు ప్రతిష్ఠా అంటూ ఇతర తల్లిదండ్రుల లానే వాళ్ళూ తాపత్రయపడ్డారు గానీ, పరిస్థితి ఇంత ఘోరంగా వుంటుందని వాళ్లూ వూహించలేదుగా” అనునయంగా అన్నారు డా. శ్రీధర్.
***
“ఆయన అన్నదే కరెక్ట్ మహీ. అన్నీ మన చేతుల్లోనే వుంటాయని మనం అనుకుంటాం. చివరికి మన చేతుల్లో ఏమీ లేదనే నిజం తెలుసుకుంటాం. నిజంగా కుసుమ నీ కోసం తపించడమే ఆమెకి నీ మీదున్న ప్రేమకి తార్కాణం” అన్నారు తాతయ్య.
ఆ మూడో రోజున నేను హాస్పటల్‍కి వెళ్ళాను. చూడ్డానికి. శ్రీ సత్యసాయి సేవా సంఘం వాళ్ళు చక్కగా సర్వీస్ చేస్తున్నారు. మరో పదహారు పార్క్ బెంచీలను జనం స్పాన్సర్ చేశారు. మా తాత కట్టించిన పాక లాంటి పెద్ద పాకని హాస్పటల్ ఆవరణలోనే పంచాయితీ వారు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రథమ బహుమతి పొందినది గనుక మరో డాక్టర్‍నీ, ఇద్దరు నర్సులనీ, ఇద్దరు ఆయాల్నీ అదనంగా ప్రభుత్వం నియమించింది.
అక్కడ కనిపించారు కుసుమ తల్లీ తండ్రీ. ముసలావిడ ఎడ్మిట్ అయిందట. “ఇంటిల్లిపాదీ నిన్ను తలుచుకుంటూనే వుంటామమ్మా. ఆఖరికి ముసలావిడ కూడా” అన్నది కుసమ తల్లి. ఆవిడని చూడడానికి వెళ్ళాను. “నన్ను క్షమించు మహీ. పిల్ల పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమో అనే ఆరాటంలో పిల్ల గొంతు కోశా పెళ్ళి పేరు పెట్టి. నాకు చావు రాకుండానే అది చచ్చిపోయింది. నాకిప్పుడు బ్రతకాలని లేదు” అంటూ భోరుమంది. గుండ్రాయిలా వుండే ఆవిడ గులకరాయిలా మారింది.. చిక్కిశల్యమై. ఏం మాట్లాడనూ?
***
“మహీ.. నువ్వేం కాదల్చుకుంటావో నిర్ణయించుకోవసిన సమయం దగ్గర పడింది. మళ్ళీ కాలేజీలు తెరిచే లోపలే అప్లికేషన్లు పెట్టడం, పోటీ పరీక్షలకి తయారు కావడం జరగాలి. నువ్వు ఏం చెయ్యదలచుకున్నా మాకు సమ్మతమే” అన్నారు నాన్న.
“నువ్వు డాక్టరువయితే మాకూ, దేశానికి కూడా మంచిది” అన్నారు తాతయ్య నా తల నిమిరి.
“లాయరుగా అయితే గొప్ప పేరు తెచ్చుకుంటావు” మా అమ్మ నవ్వుతూ అన్నది.
“ఒక మాట చెప్పనా.. నీ నడక అచ్చు ఇందిరాగాంధీ నడకలా వుంటుంది. ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా, మన వూరి పంచాయితీ ప్రెసిడెంటుగా నిలబడవే, నేను కాలర్ ఎగరేస్తాను” అన్నది అమ్మమ్మ.
“నువ్వు టీచరువి కా” అన్నారు తమ్ముడూ, చెల్లెలు.
కాలం నన్ను ఏం చేస్తుందో!!!!
(ఇంకా ఉంది)