(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[తను వ్రాసిన కవితని చదివి వినిపిస్తుంది మహతి. అద్భుతంగా ఉందని మెచ్చుకుంటాడు నాన్న. కవితలు రాయడం ఎప్పుడు మొదలెట్టావు అని అమ్మ అడిగితే, కవితలు రాయాలన్న ఆలోచనల ఎలా వచ్చిందో చెప్పి, డా. శ్రీధర్ తనని ఎలా ప్రోత్సహించింది చెబుతుంది మహీ. తాతయ్య మెచ్చుకుంటారు. మరో కవిత చెప్పమని అడుగుతుంది అమ్మమ్మ. మహీ మరో కవిత చదవగానే చెల్లెలు కల్యాణి వహ్వ వహ్వ అని ఎగతాళిగా అంటుంది. అమ్మమ్మ కల్యాణిని కసురుతుంది. అమ్మమ్మకి కవిత్వం అర్థమవుతుందన్న సంగతి ఇప్పుడే తెల్సిందంటూ తాతయ్య హాస్యమాడతారు. దానికి తగ్గ రిటార్ట్ ఇస్తుంది అమ్మమ్మ. ఇంతకీ, ఏం చదవాలని నిర్ణయించుకున్నావని మహీని అడుగుతారు అమ్మానాన్నలు. తన అభిప్రాయాలు చెబుతుంది మహీ. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి, విద్యా వ్యవస్థ గురించి, డివైడ్ అండ్ రూల్ పద్ధతి గురించి, మతకలహాల గురించి, అక్రమ మైనింగ్ గురించి ఆవేశంగా, ఆవేదనతో మాట్లాడుతుంది మహీ. అందరు మౌనంగా వింటారు. మీ అమ్మ కూడా ఒకప్పుడు ఇలానే మాట్లాడేది అంటాడు నాన్న. పోలీసుల గురించి, న్యాయం గురించి, సాహిత్యం గురించి, నేతల గురించి, కార్పోరేట్ కంపెనీలకి బ్యాంకులు అడ్డగోలు వేల కోట్ల ఋణాలివ్వడం గురించి ఆవేదనగా మాట్లాడుతాడు నాన్న. అందరికీ సర్దిచెప్తాడు తాతయ్య. ఆ సమయంలో పట్నం వచ్చిన డా. శ్రీధర్ మహీ వాళ్ళింట్లో బస చేస్తారు. వీళ్ళ మాటలన్నీ విన్న అయన మహీని, వాళ్ళ కుటుంబాన్ని మెచ్చుకుంటారు. ఆయన కళ్ళలో చెప్పలేని అభిమానం, ఆప్యాయతని చూస్తుంది మహీ. – ఇక చదవండి.]
[dropcap]న[/dropcap]మస్తే.
ప్రియాతి ప్రియమైన పాఠక దేవుళ్ళకి మీ ‘మహతి’ నమస్కారాలు. మానవుడు సంఘజీవి. ఎవరి జీవితమూ సొంతది కాదు. ప్రతి జీవితంలో సింహభాగం తల్లిదండ్రులు, చుట్టాలు పక్కాలు, స్నేహితులే గాక భూగోళాన్ని క్షణక్షణానికీ నింపే రాజకీయాలు, యుద్ధాలు, విధ్వంసాలు, వినోదాలు అన్నీ నిండి ఉంటాయి. ఒక రోజులో మన బుర్రలో తిరిగే ఆలోచనలన్నీ ఒక కంప్యూటర్‍కీ ఫీడ్ చేస్తే – అందులో మన కోసం ఆలోచించింది రెండు నిముషాలు కూడా ఉండవు. అవీ ఏదో ఒకటి పొందాలానే తపన తాలూకూవే గాని నిజమైన ‘నేను’ గురించి కావు.
నా జీవితమూ నా సొంతది కాదు. ఓ రోజు ‘అల’ ఫోన్ చేసింది. “మహీ.. నా కథ కూడా నువ్వే వ్రాయాలే. ఎందుకంటే నాకు వ్రాయడం రాదు. నా జీవితమూ, నీ జీవితంతో ఎంతో ముడిపడి వుంది కదా! సో, కేవలం నీ ఆత్మకథ రాస్తే వూరుకోను. మన జీవితాల్ని ఒకేసారి నువ్వు వ్రాయాలి. అందుకే – నేను చెప్పింది శ్రద్ధగా విని బుద్ధిగా నా కథ వ్రాయి.” అన్నది.
ఆ మాట నాకూ సమంజసమనేననిపించింది. ఇప్పుడు ఆ పనిలోనే వున్నా.
‘కాలం నేను ఏం చెయ్యాలో’ చెప్పేముందో, ఏం చెయ్యాలో నేను నిర్ణయించుకునే ముందో ఒక అడుగు అటు వేసి అల కథని విందాం. కథ దానిది, రచన నాది. సరేనా..!
ఆత్మీయ శుభాకాంక్షలతో
మీ
మహతి
***
మహతి-2 అల-1:
నా పేరు అల. అంటే అనంత లక్ష్మి. నేను మంచిదాన్నని త్రికరణశుద్ధిగా చెప్పుకోలేను. అలా అని చెడ్డదాన్ననీ చెప్పలేను. అందరిలాగే మంచీచెడూ కలగలిపిన మనస్తత్వం నాది. నేను సినీ నటిని. టాప్ త్రీ లో నేనూ ఒకత్తెని. యీ పరిశ్రమలోకి అంత తేలిగ్గా రాలేదు. సారీ, రావడం వరకూ తేలిగ్గానే వచ్చాను. అయితే మొదటి మూడు స్థానాల్లోకి రావడం మాత్రం అంత తేలికగా జరగలేదు. చాలామంది అంటారు, ‘నాకు సినిమా అంటే మహా పిచ్చి’ అని. అదెంత వరకూ నిజమో నాకు తెలీదు గానీ, నేను సినిమా మీద పిచ్చితో సినిమాల్లోకి రాలేదు. తెలిసీ తెలియని యవ్వనంలో ఒక కుర్రాడు, అంటే, నా క్లాస్‍మేటే, అతన్ని ప్రేమించాను. ఎంత పిచ్చిగా ఆంటే, అతను నన్ను ప్రేమించి తీరాలనే బలిష్టమైన కాంక్షతో అతన్ని నానా తిప్పలు పెట్టాను. నా బాధ భరించలేక అతనా కాలేజీ వదిలి అడ్రస్ కూడా ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. దాంతో కాలేజీలో ‘క్రూక్‍డ్ పర్సన్’గా నా పేరు మారుమ్రోగిపోయింది. లక్కీగా ఓ సినిమా వాళ్ళు మా కాలేజీలోనే ఆడిషన్ పెడితే, సెలెక్ట్ అయి, చదువు మానేసి సినిమాల్లోకి వచ్చాను. ఇక్కడికి వచ్చే వరకూ సినీ పరిశ్రమ అంతే నాకు ఏమీ తెలియదు. మా అమ్మానాన్నలు అతి మంచివాళ్ళు. కూతురు సినిమాల్లోకి వచ్చిందన్న సంతోషం తప్ప మరేమీ వాళ్ళకి పట్టలేదు. ఆ.. అన్నట్టు నా స్నేహితురాలు ‘మహతి’ మాత్రం కొన్ని జాగ్రత్తలు చెప్పింది. కరాటే నేర్చుకోమంది. ఏదో ఒక చిన్న ఆయుధం స్వీయరక్షణ కోసం ఎప్పుడూ దగ్గరుంచుకోమని చెప్పింది. ఏ కష్టం వచ్చినా వెంటనే ఫోన్ చెయ్యమని వాళ్ళ ఫోన్ నెంబరు కూడా ఇచ్చింది. పిచ్చిది కదూ! నీళ్లల్లోకి దూకితే కానీ యీత రాదు. అలాగే సినీ పరిశ్రమలోకి కాలు పెట్టేదాకా ఇందులోని కష్టనష్టాలు అర్థం కావు. ఇదే కాదు.. ఏ పరిశ్రమకైనా అంతే.
నేను యాక్ట్ చేసిన మొదటి సినిమా పేరు ‘ధీర’. అది హీరోయిన్ ప్రాధాన్యత గలిగిన సినిమా. ఈ ఫీల్డుకి వచ్చే ముందు నాకు కనీసం నాటకానుభవం కూడా లేదు. అందరూ నా గురించి ఒకటే మాట అంటారు.. నా మొహంలో మనసులోని భావాలు స్పష్టంగా పలుకుతాయని. అందుకేనేమో, ఓ చిన్న పాత్ర ఇద్దామనుకున్న డైరక్టర్ సత్యం, ఏకంగా హీరోయిన్ పాత్రనే కట్టపెట్టారు. సెకండ్ హీరోయిన్ పేరు సర్రీ. అంటే సరోజిని అన్న మాట. సర్రీ క్షణాల్లో పార్టీలు మార్చగలదు. క్షణాల్లో పరమసత్యం అనిపించే అబద్ధాలను ఆడగలదు. ‘ది ఫాస్టెస్ట్ లేడీ లయ్యర్’ అని నేను ముద్దు పేరు పెట్టాను సర్రీకి. అంతేకాదు, ఎదుటివారిని ఎలాగొలా ఇరకాటంలో పెట్టి కావలసిన పనిని సాధించుకునే అద్భుతమైన సమర్థతా సర్రీకి ఉంది. సర్రీకి నేనంటే అసలు పడదు. హీరోయిన్ పాత్రకి ముందుగా ఎర వేసింది తనే. కానీ డైరక్టర్ ఆ వేషం నాకు ఇచ్చారు. దాంతో సర్రీ సెకండ్ హీరోయిన్‍గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పైన చాలా ప్రేమగా, చాలా అభిమానంగా మాట్లాడినా, నేనంటే తనకి ద్వేషం అని నాకు తెలుసు. ఎవరూ చుట్టుపక్కల లేని సందర్భాలలో చాలాసార్లు సూటీపోటీ మాటల్తో వెళ్ళగక్కింది.
“అలా.. నువ్వు చాలా అందంగా వుంటావని అందరూ అంటారు కానీ, నీలో ఉన్నది అందం కాదు.. ఎట్రాక్షన్” అన్నది ఓ రోజున.
“అలగా?” అన్నాను నేను.. ఇంకేమనాలో తెలీక.
“ఆ.. నువ్వంటే మన డైరక్టర్‍కి మహా పిచ్చిట కదా!” డైరక్టుగానే అడిగింది నన్ను.
“ఆ విషయం డైరక్టర్ గార్ని అడిగి చెప్పమంటావా?” అన్నాను.
“ఓహ్.. నో.. జనాలు అనుకుంటుంటే విని నిన్ను చనువుగా అడిగాను గానీ, ఆయనకీ నీకూ ఇష్టం అయితే నాకేం క్షోభ” అంది మొహం ముడుచుకుని.
ఈ ‘క్షోభ’ అనే పదం వాడే వాళ్ళంటే చిన్నప్పటి నించీ నాకు మహా మంట. అయినా ఏం చెయ్యగలం.
“పొరపాటున కూడా ఆవిడ ముందు బైట పడకు. డైరక్టరూ, కోడైరెక్టరూ, అసోసియేటూ కూడా ఆవిడ్ని తెగ పేంపర్ చేస్తున్నారు. నువ్వొచ్చింది నిన్న గాక మొన్న. ఏదో ఎక్కడో సుడి వుండి హీరో పాత్రకి సెలక్టు అయ్యావు గానీ, లేకపోతే, జీవితాంతం హీరో పక్కన నాలుగో ఫ్రెండ్ గానో, అయిదో ఫ్రెండ్ గానో జీవితం గడపాల్సి వచ్చేది” వార్నింగ్ ఇచ్చాడు హీరో ఫ్రెండ్‍గా నటించే శ్రావణ్.
“శ్రావణ్.. జీవితంలో నేననుకున్న దేన్నీ సాధించకుందా వదిలిపెట్టలేదు. దీన్నీ వదల్ను. లేకపోతే లవ్ యూ అంటే చెంప పగలగొడుతుందా? దాని చెంప మీద కాదు, జీవితం మీద దెబ్బ కొడతాను” క్రూరంగా అన్నాడు నిశ్చల్ నిగమ్.
“కట్” అన్నారు డైరక్టర్ సత్యమోహన్. మైదానంలో తొలిరోజున తీసిన షాట్ అది.
‘ధీర’ సినిమావాళ్ళ కథే. నిశ్చల్ నిగమ్ కూడా నిజంగా హీరోకి ఫ్రెండు వేషాలు అయిదారు సినిమాల్లో వేశాడు. శ్రావణ్ కొంచెం కొత్త. అయినా వైజాగ్‍లో ట్రైనింగ్ తీసుకుని మరీ ఇండస్ట్రీకి వచ్చాడు గనుక కెమెరా ముందు కంగారు పడలేదు.
“చాలా బాగా చేశారు” మెచ్చుకుని భుజం తట్టారు సత్యమోహన్. స్టిల్ కెమెరామెన్ ప్రదీప్ స్టిల్స్ తీసుకోవడం కోసం సిద్ధంగా వున్నాడు.
“నీ పోర్షన్ చదువుకున్నావా?”
“యస్సర్” అన్నాను.
షూటింగ్ రూమ్‍కి మారింది.
“ఏమయినా నువ్వలా చేసి వుండాల్సింది కాదే. ఏదో ఐ లవ్ యూ అన్నాడనుకో.. నవ్వి వదిలేస్తే పోయేది. అసలే అదో రౌడీ బ్యాచ్” నాకు బుద్ధి చెబుతూ అన్నది లత.
“లతా.. ఆ ఒక్క మాట అన్నందుకూ నేను కొట్టలేదు. ఆ లవ్ యూ కి ముందు చాలా నీచమైన వర్ణన చేశాడు. ఏ ఆడదైనా సిగ్గుతో చచ్చిపోయేంత వర్ణన. వాళ్ళది రౌడీ బ్యాచ్ అయితే నాకేంటీ? మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా. పిచ్చి వాగుడు వాగితే చెంప పగలగొడతా” సీరియస్‍గా నేనన్నాను.
“కట్”
క్లాప్స్ కొట్టారు డైరక్టరూ, కోడైరెక్టరూ.
“చాలా బాగా చేశావు అలా. నీ కళ్లల్లో ఫైర్ ఫస్ట్ షాట్‍లోనే కనబడింది. ఓహ్. మా నిర్ణయం సరైందే!” తృప్తిగా నిట్టూర్చి అన్నారు సత్యమోహన్.
కాకపోతే కాస్ట్యూమ్స్ తెగ ఇబ్బంది పెడతాయి. మేకప్పూ అంతే. మేకప్ మేన్, కాస్ట్యూమర్, డైరెక్షన్ డిపార్ట్‌మెంటూ, స్టోరీ రైటరూ, డైలాగ్ రైటరూ అందరూ క్లాస్ వన్ టెక్నీషియన్సే. ఎవరితో పేచీ వచ్చినా అసలుకి మోసమే. ఇక డాన్స్ డైరక్టరయితే ఆ రుబాబే వేరు. పైకి ఎక్కించేవారు ఉండరు కానీ కిందకి తోసెయ్యడానికి ఎందరో! కొత్తవాళ్ళకైతే చెప్పుకోలేని నరకం. ప్రొడ్యూసర్ కథ ఆల్ టుగెదర్ డిఫరెంట్!
***
“అలా.. నువ్వు భయపడాల్సింది ఏదీ లేదు. చాలామంది చాలా విధాలుగా నిన్ను ఇబ్బంది పెడతారు. చిన్నగా నవ్వుతూ మంచి మాటల్తో తప్పించుకోవాలి. కాస్త తెలివి, కాస్త చమత్కారం, కాస్త ఒడుపూ చుపిస్తే ఆ ఇబ్బందుల్ని ధైర్యంగా దాటగలవు” అన్నారు డైరక్టర్ సత్యమోహన్. ఆయనకి నలభై సంవత్సరాలు వుంటై. చాలా గొప్ప డైరక్టర్ల దగ్గరా, సక్సెస్‍ఫుల్ డైరక్టర్ల దగ్గరా అసిస్టెంటుగా, అసోసియేట్‍గా, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‍గా పనిచేసిన అపార అనుభవం ఉంది.
అంతకుముందు చాలా సార్లు డైరక్షన్ ఛాన్స్ వచ్చినా వద్దని ‘ధీర’ సినిమాకి ఫస్ట్ టైమ్ ఫుల్‍ప్లెడ్జ్‌డ్ డైరక్టరయ్యారు. సినిమాకి సంబంధించిన అన్ని శాఖల మీదా ఆయనకి అపారమైన అనుభవం ఉంది.
“ఇంకో విషయం, ఇక్కడ అందరూ లైన్స్ వేసేవారే తప్ప ‘హింసించే’ పనికి ఎవరూ దిగరు. ఎందుకంటే, ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు, ప్రొఫెషన్‍తో సహా బూడిదపాలైపోతుందని. నీకే సమస్య వచ్చినా నాతో చెప్పు. సరేనా?” అనునయంగా చెప్పారు నేను సెట్‍లోకి వచ్చిన మొదటి రోజునే. ఆయన అలా చెప్పకపోతే నేను ఖచ్చితంగా ఇంటికి పారిపోయి వుండేదాన్ని. రాత్రి పగళ్ళలా, కష్టసుఖాల్లా, స్నేహద్వేషాల్లా మంచీచెడులూ కూడా కలిసే వుంటాయని అర్థమైంది.
ఒక కవి వ్రాశాడు.. “నా సుఖం నీదీ – నీ సుఖం నాదీ. సూర్యచంద్రుల్లాంటి నీ రెండు నయనాలూ నావే ప్రియతమా” అని (సినిమా పేరు గైడ్.. సంగీతం ఎస్.డి. బర్మన్. దేవ్ ఆనంద్, వహీదా రెహమాన్, కిషోర్ సాహూ, ఆగా). ఎంత మధురమైన పాట. హిందీ పాటలు పాడటంలో నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ హరగోపాల్ దిట్ట. అర్థాలు కూడా చక్కగా వివరించి చెప్పేవాడు. మహతి కూడా అద్భుతంగా పాడేది. మగ గొంతుకలా వినిపించే స్వరం గల ‘రేణుక’ ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ పాటలు కూడా పాడుతోంది. అందరం ఒక బేచ్ వాళ్లమే అయినా కలవడాలు తక్కువే.
జీవితంలో ముఖ్యమైనవని, మనం అనుకున్నవన్నీ, ఇలానే పక్కకి తొలగిపోతాయనుకుంటా.
“కాస్ట్యూమర్ నారాయణ చాలా నేర్పరి. అయినా గుణం గుడిసేటిది. అది అరిచే కుక్క కానీ కరిచే కుక్క కాదు. వాడు అక్కడా ఇక్కడా చెయ్యేస్తాడు. చలి పుట్టినట్టుగానో, చక్కిలిగిలి పెట్టినట్టుగానో నటించు. వీలైతే ‘ఛీ.. పొండీ’ లాంటి గొణుగులు గొణుగు.. చెప్పాగా వాడో బురద గట్టని” ముందే బ్రీఫింగ్ ఇచ్చాడు వసంత్ కుమార్. వసంత్ కుమార్ మా పిక్చర్‍కి అసోసియేట్ డైరక్టర్. హీరో కావాలనుకుని లెక్కలేనన్ని ప్రయత్నాలు చేసి చివరకు డైరక్షన్ డిపార్ట్‌మెంట్‍లో కుదురుకుని ఐదేళ్ళకి అసోసియేట్ డైరక్టర్ అయ్యాడు. మనిషి చాలా సిన్సియర్. జాగ్రత్తలు చెప్పడమే కాదు, ఎలా మసలుకోవాలో కూడా చెప్తాడు. వయసు 32 నించి 35 వరకు ఎంతైనా ఉండొచ్చు. అతనంతే అందరికీ ఇష్టమే. మనిషిని గమనిస్తే ఇంకా పెళ్ళి కాని వాడి లానే ఉన్నాడు. కానీ ప్రవర్తన మాత్రం చాలా డిగ్నిఫైడ్.
వసంత్ చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజం. డ్రెస్సులు కుట్టించి ‘స్టిల్స్’ తీయించమన్నారు డైరక్టర్ సత్యమోహన్ గారు. కాస్ట్యూమ్ రూమ్ లోకి వెళ్ళగానే పైట తీసేయ్యమన్నాడు నారాయణ. నేను కోపంగా ఏదో అనబోతే, “ఇదిగో అమ్మాయ్.. పైట తియ్యమన్నది నీ కొలతలు తియ్యడానికి. జనాలు అంతేసి డబ్బు ఖర్చు పెట్టుకుని సినిమా టికెట్లు ఎందుకు ‘కోయిస్తారో’ తెలుసా? కళ్ళారా అందాలు చూసి లొట్టలెయ్యడానికీ, కలలు కనడానికీ. ఇదేం సతీ సుమతి కథ కాదు. కౌబాయ్ టైపులో ఒంటికి బట్టలు అతుక్కున్నట్లు కుట్టాలి. అప్పుడే నీ ఎనకా ముందూ జనాలకి కనబడి, ఎర్రెత్తిస్తాయి. అరేయ్.. కొలతలు చెబుతా రాసుకోండ్రా” అంటూ తనే చెంగును పట్టుకున్నాడు. నేను సైలంటయ్యా. చుట్టూ ముగ్గురు మగాళ్ళు. చిత్రం ఏమంటే నారాయణ వెధవ్వేషాలు వెయ్యలేదు. మర్యాదగానే టేపుతో కొలతలు తీసుకున్నాడు. కుర్రాళ్ళు కూడా ప్రొఫెషనల్‍గానే కొలతలు రాసుకున్నారు గానీ ‘ఆబ’ చూపులు చూడలేదు.
మా బెజవాడలో జాకెట్ కుట్టమంటే వారం రోజులు టైమ్ అడిగి, నెల రోజులకి గానీ ఇవ్వరు. నారాయణ తొమ్మిదింటికి కొలతలు తీసుకుని సాయంత్రం ఏడింటికల్లా రెండు డ్రెస్సులు రెడీ చేయించాడు. టైమ్‍కి వున్న విలువ సినిమా వాళ్ళకి తెలిసినంతగా ఇతర్లకి తెలీదని ఆనాడు నాకు తెలిసొచ్చింది.
ఒంటికి అతుక్కుపోయినట్టున ఆ డ్రెస్ వేసుకుని నిలువెత్తు అద్దంలో చూసుకోగానే నా మతి పోయింది. అసలు హైట్ కంటే ఆ స్కిన్ టైట్ జీన్స్ తోనూ లావిష్ బ్లేజర్ తోనూ చాలా హైటుగా, అందంగా కనిపించా. మేకప్ అయ్యాకా చూసుకుంటే ‘ఇది నేనేనా’ అనిపించింది. చిన్న చిన్న ఇబ్బందులు పక్కన పెడితే మేకప్ మేన్ మీదా కాస్ట్యూమర్ మీదా నాకు చెప్పలేని గౌరవం కలిగింది. మట్టిని మణిగా మార్చేంత నేర్పుంది వాళ్ళకి. ఆ నేర్పు వెనకాల ఎంత సాధన, ఎన్ని కష్టాలు, ఎన్ని నిద్ర లేని రాత్రులు, ఎన్ని కన్నీళ్ళు వున్నాయో ఎవరికి తెలుసు?
ఎన్నో ముళ్ళబాటలు దాటితే గానీ పూలబాట కంటికి కనిపించదు. మా గీత రచయిత నాతో అన్నాడు, “అమ్మాయీ పన్నెండు సంవత్సరాలు నేను ఎక్కి దిగని నిర్మాతల, దర్శకుల, సంగీత దర్శకుల గుమ్మాలు లేవు. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్మ చేసుకుందామని అనుకున్నాను. కారణం ఒక్క సినిమాకైనా పాట వ్రాయకపోతే స్నేహితులు, బంధువులు హీనంగా చూస్తారనే బాధ. అంతేగా మరి. వయసు చేజారిపోతున్నా, పెళ్ళి చేసుకోలేదు. జీవితంలో స్థిరపడకుండా ఆ జంఝాటాన్ని ఎక్కడ పెట్టుకోనూ? చివరికో క్షణాన ఒక్క ఛాన్సు దొరికింది. నా అదృష్టమో, ఏమో, గీత రచయితలందరూ ఏదో మీటింగ్‍కి పోయారుట హైదరాబాద్‍కి. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మద్రాసులో ఉన్న అందరు, అన్ని భాషల రచయితల్నీ, గాయనీగాయకుల్నీ, సంగీత దర్శకుల్నీ లలితకళాతోరణంలో జరిగే ఘంటసాల విగ్రహావిష్కరణకి స్వంత ఖర్చులతో స్పెషల్ ట్రైన్‍లో తీసుకెళ్లారట. ఆ రోజున అదృష్ట దేవత నా తలుపు తట్టింది. నన్ను చూసిన వెంటనే ఓ డైరక్టరు సిచ్యుయేషన్ చెప్పి పాట వ్రాయమన్నాడు. కసితో ఆ పాట వ్రాశా.. అక్కడే, ఆ డైరక్టర్ ఇంటి వరండాలో కూర్చుని. ఆయనకి ఆ పాట అద్భుతంగా నచ్చింది. వారం అయ్యాకా, ఫలానా సంగీత దర్శకుడి పర్యవేక్షణలో ఆ పాట రికార్డయింది. సినిమా రిలీజ్ అయ్యాకా, ఆ పాట తెలుగునాట దశదిశలా మారుమ్రోగిపోయింది. ఆ తరువాత మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడలేదు” అని.
అప్పుడనిపించింది, ‘కష్టం ఫుట్‍బాల్ ఆడుకోని మానవ జీవితం సృష్టిలో వున్నదా’ అని. ఏమైతేనేం కాస్ట్యుమర్ గారూ, మేకప్ మేన్ గారు నన్ను స్క్రీన్ టెస్టులో పాస్ చేయించారు, అదీ ఫస్ట్ క్లాసులో.
సత్యమోహన్ గారి అసోసియేట్ వసంత్ కుమార్ చాలామంచి నటుడు. యాక్ట్ చేసి చూపించేవాడు. ప్రతీ డైలాగ్‍నీ బట్టీ పట్టించి, ఆ తరువాత ఏ స్వరంతో ఎలా పలకాలో స్పష్టంగా నేర్పించేవాడు. అతని మాడ్యులేషన్ నిజంగా అద్భుతం.
పాఠాలు చదవడంలో నేను పప్పుసుద్దనే. కానీ, డైలాగ్స్ బట్టీపట్టడం, వాటిని సరైన మాడ్యులేషన్‍లో పలకడంలో నేను చాలా బ్రైట్ అనీ, ఫాస్ట్ అనీ కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నాను. వసంత్ నాకు ఇంకో టిప్ ఇచ్చాడు. అద్దం ముందర డైలాగ్ చెబుతూ సాధన చెయ్యమనీ, డిఫరెంట్ యాంగిల్స్ ట్రై చెయ్యమని. దాంతో ఏ యాంగిల్‌లో నా అందాన్ని ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయగలనో నాకు అర్థం కాసాగింది. ఏ యాంగిల్‍లో నవ్వితే బాగుంటుందో, ఏ యాంగిల్‍లో ఎలా ఏడవాలో (అందంగా ఏడవడం) కూడా ప్రాక్టీస్ చేశా. చిలిపిగా, కోపంగా, సంతోషంగా, ద్వేషంగా, శాంతంగా ఎలా చూడాలో కూడా నేను అద్దంలో చూసుకుంటూ ప్రాక్టీస్ చెయ్యడమే కాదు, తెలుగు, హిందీ నటీమణుల హావభావాల్ని స్టడీ చేస్తూ వాటిలోని ‘బెస్ట్’ ఎక్స్‌ప్రెషన్స్‌ని ప్రాక్టీస్ చేశా. ‘నైనోం మే బద్‌రా ఛాయే’ అనే సాధనా పాట (సినిమా మేరా సాయా, సంగీతం మదన్ మోహన్, పాడింది లతా మంగేష్కర్) నిజంగా నన్ను పిచ్చెక్కించింది. అసలు పెదవుల కదలికలు ఎలా వుండాలో, పలువరుసని ఎలా అందంగా ఎక్స్‌పోజ్ చెయ్యాలో, అసలు ఎలా నడవాలో ఎలా తల వంచాలో, ఎక్కడ హీరో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడాలో ఆ ఒక్క పాట నా పాలిట ఓ నిఘంటువు అయింది. సాధన రోల్ మోడల్ కావడానికి ఎంత కృషీ, ఎంత సాధన చేసిందో ఆ సినిమా నాకు చెప్పింది. శరీరంలోని ప్రతి భాగానికీ, ప్రతి అణువుకీ తనదైన ఓ భావముద్ర ఉన్నదని సాధన పాటలనీ, యాక్టింగ్‌ని పరిశీలిస్తే నాకు అర్థమైంది. సల్వార్ కమీజ్‍నీ, సాధనా హేర్ స్టైల్‌ని హిందీ పరిశ్రమలోకి తెచ్చి, దశాబ్దాల పాటు తరతరాల హీరోయిన్స్ అవి చచ్చినట్టు ఫాలో అయ్యేలా చేసింది. అలాగే మీనా కుమారి, సావిత్రి, భానుమతి, కన్నాంబ, బి. సరోజ, సూర్యకాంతం, కాంచన, జమున etc etc etc.
వసంత్ నాకిచ్చిన యాక్టింగ్ టిప్స్ ఎంత ప్రభావితం చేశాయంటే, ఆషామాషిగా సినిమా పరిశ్రమకి వచ్చిన నన్ను తొలి దశలోనే సినిమా భక్తురాలిగా మార్చినయ్. నే పలికే ప్రతి డైలాగ్‍కీ ఓ విశిష్టతతో భావం వెల్లివిరియాలని శ్రమించేదాన్ని. నడకలో, నవ్వులో సహజత్వమూ, సౌందర్యమూ ఉట్టిపడాలని ఎంతో చెమటోడ్చా. అద్దం నా ‘మౌన గురువు’ పాత్రని పోషించింది.
ఓ రోజు సర్రీ అన్నది, “హేయ్.. నీ ప్రతీ అణువూ అందంగా కనబడుతోందోయ్, అది వరకు కనుబొమల్ని అనవసరంగా ఎత్తి చూసేదానివి. మీనింగ్‍లెస్‍గా భుజాలు ఎగరేసేదానివి. ఇప్పుడు ఎంత పొందిగ్గా, ఎంత లవ్‍లీగా వున్నావో తెలుసా. అబ్బ.. ఎవరు నేర్పేరమ్మా యీ పాఠాలూ?” అని.
గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారుతోందన్న మాట. సదాశివరావు గారు ఓల్డెస్ట్ కోడైరక్టర్. ఆయన అంతకు మించి ఏదీ కోరుకోడు. “సార్, మీకున్న అనుభవంలో ఎప్పుడో డైరక్టరు కావల్సింది” అన్నాను. ఆయన నవ్వి, “అమ్మాయ్ పేరు ప్రతిష్ఠలూ, డబ్బూ సుఖాలూ ఇవి నన్నెప్పుడూ ఆకర్షించలేదు. మీలాంటి యంగ్‍స్టర్స్‌ని అద్భుతంగా మలచడమే నాకు ఆనందం. నేనో శిల్పి లాంటి వాడ్ని. శిల్పం చెక్కడం వరకే నా పని. ఆ తరువాత ఆ పై వాడి నిర్ణయం. పాఠాలు చెప్పడం వరకే గురువు పని. చదువు పూర్తి చేసుకున్నాకా, తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఏమయ్యారో ఏమవుతారో గురువు ఏనాడన్నా పట్టించుకుంటాడా? మీరు గొప్ప నటీనటులుగా పేరు తెచ్చుకోవడం నాకు ‘ఆనందం’. అదే నా స్వార్థం” అని నవ్వారాయన.
(ఇంకా ఉంది)