మహతి-16

12
2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[నటీమణుల టచప్ ఉమన్ కనకాక్షి అలతో మాటలు కలుపుతుంది. ఇతర హీరోయిన్‍లకి అహంభావమెక్కువ, ఎవరూ అలలా మర్యాదగా మాట్లాడరు అని అంటుంది. అల మాటలు పొడిగించదు. కారణం వసంత్ కుమార్ చెప్పిన మాటలే. టచప్ వాళ్ళతోటీ, డ్రైవర్లతోటీ గంభీరంగా, రిజర్వ్‌డ్‌గా ఉండమనీ, చనువిస్తే పుకార్లు పుట్టిస్తారని చెప్తాడు. జనాల్నించి తప్పించుకోవడం కోసం పుస్తక పఠనం అలవాటు చేసుకుంటుంది అల. వసంత్ కుమార్ ప్రముఖ రచయితల పుస్తకాలు ఇచ్చి చదవమని ప్రోత్సాహిస్తాడు. తల్లి పాత్రలు పోషించే చిత్రాణి – పుస్తకాలు మాని ప్రొడ్సూసర్లనీ, డైరక్టర్లనీ అలరిస్తే, ఇండస్ట్రీలో ఢోకా ఉండదని చెప్తే, ఈ సినిమా వరకూ సరిగ్గా చేస్తే చాలు అంటుంది అల. ఈలోపు షాట్ రెడీ అవగానే లేచి వెళ్ళిపోతుంది అల. తరువాత చిత్రాణి స్వభావం గురించి చెప్తుంది. అలాగే కథా రచయిత గురించి, మేకప్‍మాన్ గురించి, కాస్ట్యూమర్ గురించి చెప్తుంది. తాను నటిస్తున్న ‘ధీర’ సినిమా కథ క్లుప్తంగా చెబుతుంది. షూటింగ్ మూడో రోజున దర్శకులు సత్యమోహన్ సినిమాలో రెండు ముఖ్యపాత్రలని వసంత్‍ని, సదాశివరావు గారిని వేయమని చెప్తారు. ఆ నిర్ణయానికి కథారచయిత కమలాక్ష, చిత్రాణి ఆశ్చర్యపోతారు, సినిమా బడ్జెట్‍ని చక్కగా కంట్రోల్ చేస్తున్నందుకు సత్యమోహన్‍ను మెచ్చుకుంటారు. అప్పుడు సినిమాకి అక్కర్లేని ఖర్చులను ఎలా నియంత్రించాలో అందరి అభిప్రాయాలను తెలుసుకుంటారు సత్యమోహన్. అందరికంటే అనుభవజ్ఞులైన సదాశివరావు గారు విలువైన సూచనలు చేస్తారు. తరువాత కమలాక్ష, డైలాగ్ రైటర్ ఆదివిష్ణు, చిత్రాణి తమ అభిప్రాయాలు చెప్తారు. రాత్రి హోటల్‍లో భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు యూనిట్ సభ్యులు. సదాశివరావుగారు మూడు దశాబ్దాల క్రితం సినిమా మేకింగ్ గురించి చెబుతారు. – ఇక చదవండి.]

మహతి-2 అల-3:

[dropcap]స[/dropcap]ర్రీలో కుళ్ళుమోతుదనమూ, ఓ చిత్రమైన క్రూరత్వమూ, అహంభావము మొదటి నించీ చూస్తూనే వున్నాను. కానీ నేను ఆ ప్రవర్తననకి ఏ మాత్రం బాధ పడలేదు. కారణం, ఓ నాడు నాదీ అటువంటి ప్రవర్తనేగా. తిరుమలరావు ఉరఫ్ తిమ్మూ అనే నా క్లాస్‍మేట్‌ని ప్రేమ పేరుతో వెంటాడి వేధించా. అతను వూరొదిలి పోయాక కొన్ని నెలల పాటు నాలో నేను కోపంతో ఎంత రగిలిపోయానో, ఎంత కక్షగా నా స్నేహితులతో ప్రవర్తించానో నాకు గుర్తే. నిజం చెబితే మనిషి మనసులో కలిగే భావాలన్నీ, అవి ఉదాత్తమైనవైనా, కక్షతో కూడుకున్నవైనా, ఆధ్యాత్మిక భావాలైనా చెదిరిపోయే మేఘాల వంటివే. అందుకే నేను సర్రీ ప్రవర్తనని పట్టించుకోలేదు. నా గతం చిన్నదే. అయినా నన్ను నేను విశ్లేషించుకుంటే, నేనూ తప్పులు చేసినదాన్నే.

నేను పట్టించుకోకపోవడం అనేది సర్రీకి మింగుడు పడటం లేదు. నేను మౌనంగా వున్న కొద్దీ నా గురించి నానా మాటలూ ఇతరుల ముందు మాట్లాడడటం ఎక్కువ చేస్తోంది, అదీ నాకూ తెలిసేటట్టుగా. తన ప్రవర్తనని మిగతా నటీనటులే కాదు, టెక్నీషియన్‍లు కూడా గమనించారు.. గమనిస్తున్నారు.

లోభానికీ, క్రోధానికీ, మదానికీ, మోహానికీ, కామానికీ ఖచ్చితంగా స్పష్టమైన కారణాలుండాలి. కానీ ‘అసూయ’కు ఏ కారణమూ అక్కరలేదు. ఆఫ్రికాలో ఉండేవాడిక్కూడా అమితాభ్ బచ్చన్ మీద అసూయ ఉండొచ్చు. అసూయకి పరిచయాలూ, సంబంధాలూ అక్కరలేదు. అసూయ అనేది నిప్పు లాంటిది. ఆ నిప్పు ఒకసారి అంటుకుంటే, కట్టెని సాంతం కాల్చి బూడిద చేసినట్లుగా, మనసుని కాల్చి బూడిద చేస్తుంది. మనిషి పతనానికి నూటికి తొంభై పాళ్ళు కారణం అసూయే. ఎవర్నయినా మార్చగలం – బ్రతిమాలో బామాలో తిట్టో కొట్టో! అసూయాపరుడ్ని మాత్రం మార్చడం ఎవరి వల్లా కాదు.

కానీ, సర్రీలో ఓ అద్భుతమైన నటి వుంది. నా మీద వున్న అసూయతో ఇంకా ఇంకా సాధన చేస్తున్నదేమో, సీన్ సీన్‍కీ రాటుదేలుతోంది. దాంతో నేనూ నా సాధనని అయిదారు రెట్లు పెంచుకోవాల్సి వచ్చింది. నాయిక కంటే సహనాయిక గొప్పగా నటించిందంటే నాకు మిగిలేది నామోషీనే కదా. అదీ కాక స్పర్ధ వల్ల విద్య వర్ధిల్లుతుందన్న నానుడి వుండనే వుందిగా. పోనూ పోనూ నటన లోని మెలకువలు తెలుస్తున్నాయి. కెమేరాని ఫేస్ చేసే ముందు కొంచెం బెరుగ్గా వుండేది. ఇప్పుడా భయం పోయి కెమెరాని ఫేస్ చెయ్యాలనే ఉత్సాహం ద్విగుణీకృతమైంది. డైలాగ్స్‌ని డైలాగ్స్‌లా కాకుండా సొంతం చేసుకుని హృదయంలోంచి పలకడం పట్టుబడింది.

“అలా.. నీ ఎక్స్‌ప్రెషన్స్ ఎంత బాగున్నాయంటే డైలాగ్ చెప్పలేని భావాల్ని నీ ముఖ కవళికలు చెప్తున్నాయి. ఓహ్.. యూ ఆర్ ఏ బార్న్ ఏక్ట్రెస్” అన్నాడు వసంత్ కుమార్.

“మరి నావీ?” అలిగినట్లుగా అడిగింది సర్రీ.

“నువ్వు నీ పాత్రలో ఆల్‍మోస్ట్ జీవిస్తున్నావు. నీలో ఉండే సహజత్వానికి నీ పాత్ర సరిపోవడం నీ అదృష్టం” అన్నాడాయన.

“అంటే?” అయోమయంగా అన్నది సర్రీ.

“రష్ చూసేటప్పుడు నీకే తెలుస్తుందిగా” నవ్వాడు వసంత్ కుమార్.

దాదాపు ఫస్ట్ షెడ్యూల్ అయిపోవచ్చింది.

ఓ రోజున కనక నాతో మెల్లగా, “జాగ్రత్తగా ఉండడమ్మా. వీలున్నంత వరకూ ఎవరు ఆఫర్ చేసినా కూల్ డ్రింక్సూ, కాఫీలు తాగకండి” అన్నది.

“ఎందుకూ?” అన్నాను.

“అమ్మా.. కాఫీల్లోను, కూల్‍డ్రింక్స్ లోనూ మత్తుమందు కలిపి ఇస్తారు. మనం మత్తులో పడిపోగానే వాళ్ళు మనని..” మధ్యలో ఆపేసింది. నేను పకపకా నవ్వాను.

“కనకా.. నీకా భయాలూ ఏమీ వద్దు. వీరంతా చాలా మంచివాళ్ళు. అటువంటి చిల్లర పనులకి పోయి వృత్తిని కాలదన్నుకోరు. నువ్వింతకు ముందు కూడా సినిమాల్లో పని చేశావుగా. అప్పుడు లేని భయాలు ఇప్పుడెందుకూ?” అన్నాను. కనక వయసులో ఎంత చిన్నదైనా నాకంటే పెద్దదే.

“ఎవరికో అలా జరిగిందని మా మేకప్ వాళ్ళు చెప్పారమ్మా. అలాంటివి మీకు చెబితే జాగ్రత్త పడతారని చెప్పా” అమాయకంగా అన్నది కనక.

ఇతరులు చేసిన తప్పులోంచి నేర్చుకోవడానికి చాలా ఉంది (లెర్న్ ప్రమ్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్)” అన్నాడో మేధావి. కనక మాటల్లో నాకనిపించింది అదే. యూనిట్ వాళ్ళు సర్వ్ చేసేవి తప్ప ఇతరులు ఆఫర్ చేసినవి తీసుకోవటం మానేశాను. భయం వేరు.. జాగ్రత్త వేరు.

ఫస్ట్ షెడ్యూల్ ముగిసినా నటన వరకే తప్ప ఎవరితోటీ నేను ఎక్కువ స్నేహాన్నో పరిచయాన్నో పెంచుకోలేదు. ఎదుటివారి మంచిచెడ్డల్ని ఎన్నడం అన్నంత పనికిమాలిన పని మరొకటి లేదు. ప్రతి వ్యక్తి లోపలా మరో వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎన్నటికీ వ్యక్తం కాడు. అయినా మనమేం న్యాయాధీశులం కాదుగా, ఇతరుల తప్పులని లెక్కించడానికో, ఎండగట్టడానికో. కనక ఎందుకు నాకా జాగ్రత్త చెప్పిందో నాకు తెలీదు. కానీ, ఏదో లేకపోతే ఎవరూ దేన్నీ అనవసరంగా చెప్పరని మాత్రం మనసుకి అర్థమయింది.

జనరల్‍గా ఏ సీన్ ఓకే అయితే దాన్ని టివి స్క్రీన్ మీద అప్పటికప్పుడు చూసుకోవచ్చు. డైరక్షన్ డిపార్ట్‌మెంటు వాళ్ళు, కెమెరామెన్ అప్పటికప్పుడు చూశాకే ఓకే చేస్తారు. సత్యమోహన్ గారు మాత్రం మమ్మల్ని మేం అలా చూసుకోవడానికి ఇష్టపడలేదు. బాగుంటే, “శభాష్.. ఇంకా ఇంప్రూవ్ చేస్తే పెద్ద ఆర్టిస్టువి అవుతావు” అని ఎంకరేజ్ చేసేవారు. స్టిల్స్ మాత్రం చూపించేవారు. వసంత్ చెప్పేవాడు..  నటన చాలా చాలా ఇంప్రూవ్ అయిందని.

***

‘ధీర’ సినిమాలో వసంత్, సదాశివరావు గార్ల నటన నాకు అద్భుతంగా అనిపించింది. ఎంత సహజంగా ఉందంటే కళ్ళ ముందు జీవితాల్ని చూసినట్టుంది. వారి నటన చూస్తుంటే నేనింకా ఓనమాల దగ్గరున్నట్టే అనిపించింది. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయ్యాకా మాకు 15 days gap ఇచ్చారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ వూళ్ళకి వెళ్ళిపోయారు. “మీరు ఉండాలంటే హోటల్లోనే ఉండచ్చు. లేదా మీ వూరికి వెళ్ళొచ్చు. మీ ఇష్టం” అన్నారు సత్యమోహన్ గారు. డైరక్షన్ డిపార్ట్‌మెంట్ వారు హోటల్లోనే వుంటారట. ఎప్పుడయితే gap సంగతి నాతో చెప్పారో, ఆ క్షణమే నా మనసు విజయవాడకి పరిగెత్తింది. కానీ, పరిగెత్తే మనసుని బలవంతంగా ఆపాను. “సార్, మా అమ్మగారిని పిలిపించుకోవచ్చా” అని అడిగాను. “హాయిగా పిలిపించుకోవచ్చు, షూటింగ్ టైములో మీ వెంట వుంచుకోవచ్చు” అన్నారు డైరక్టర్ సత్యమోహన్. ఓ ఫోన్ కొట్టి అర్జంటుగా హైదరాబాద్ రమ్మని అమ్మకి ఆర్డరు వేశా.

“నువ్వే రావచ్చు కదే!” అన్నది.

“నో. పిక్చర్ రిలీజ్ అయ్యేవరకూ నేను ఎవరినీ కలవదలుచుకోలేదు” స్థిరంగా చెప్పాను. అంతే కదా మరి.

ఇంకా కాలేజీలో చదువుతున్న వాళ్ళ మధ్యకీ ఓ ఓల్డ్ స్టూడెంట్‌లా, ఓ క్లాస్‌మేట్‍గానో, స్నేహితురాలిగానో నేను వెళ్ళదలచుకోలేదు. ఓ హీరోయిన్‍లా వెళ్ళాలి. విన్నర్‍లా వెళ్ళాలి. ఓ పెద్ద సెలెబ్రిటీలా వెళ్ళాలి. సినిమా మధ్యలో వెళితే ఏముంటుందీ! నాకు నవ్వొచ్చింది, నాలోనూ సెలెబ్రిటీ కావాలన్న కాంక్ష ఎంతగా ఉందో తలచుకుంటే. ఆ సాయంత్రం డైనింగ్ హాల్‍కి వెళ్ళి టీ తాగుతుంటే,

“అలా జీ.. ఇంటికి పోలేదా?” అన్నాడు వసంత్.

“లేదండీ.. అమ్మనే హైదరాబాద్ రమ్మన్నాను.” అన్నాను.

“మంచిపని చేశారు. చుట్టాలు పక్కాలు స్నేహితులు వీళ్ళందరినీ యీ స్టేజ్‍లో కలవటం మంచిపని కాదు. సక్సెస్‍తో అడుగుపెట్టినప్పుడే గౌరవం దక్కుతుంది” అన్నాడు వసంత్.

నా నిర్ణయం సరైనదేనని అప్పుడనిపించింది.

“అలా.. నువ్వు యీ పది రోజులూ వీలున్నన్ని ఎక్కువ నవలలు చదువు. ఎందుకంటే నవలలలోని పాత్రలు హృదయానికి దగ్గరగా ఉంటాయి. మరొకటేమిటంటే సినిమా పాత్రల కంటే నవలల పాత్రలు మనసుకి కనెక్ట్ అవుతాయి. అఫ్ కోర్స్, నా దగ్గర వున్న నవల్స్ ఇస్తాను, చదువుకో” అని శెలవు తీసుకుని ఎడిటింగ్‌కి వెళ్ళిపోయాడు వసంత్.

ఆయన పంపిన నవల ‘అన్నా కెరినినా’. రచయిత లియో టాల్‍స్టాయ్. మొదలుపెట్టాకా తెలిసింది అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న నవలల తీరు ఎలా వుంటుందో.

మరుసటి రోజు పొద్దున్నే అమ్మ వచ్చింది. ఓ అరగంట ఆమెతో మాట్లాడేనేమో! మళ్ళీ నవలని ముందు వేసుకుని కూర్చున్నాను. “ఏమే, నువ్వు నవల చదువుకుంటుంటే నేనేం చెయ్యాలీ? నీ మొహం చూస్తూ కూర్చోవాలా? అందుకేనా, మీ నాన్ననీ, నీ అన్ననీ, తమ్ముడ్ని వదిలేసి ఇక్కడికి వచ్చిందీ? అదేదో రామాయణమో, భారతమో అన్నంత శ్రద్ధగా భక్తిగా చదువుతున్నావు. ఈ శ్రద్ధలో వందో వంతు నువ్వు ఇంటర్‍లో వుండగా పెడితే ఏ అయ్యేయస్సో ఐపియస్సో అయ్యేదానివి కాదూ.” అంటూ నన్ను ఏకి పారేసింది.

అంతకుముందు అమ్మ ఎప్పుడు కేకలేసినా, క్లాసు పీకినా నాకు కోపం వచ్చేది. ఈసారి ఎందుకో ఆ ప్రేమకి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఒక్క తల్లి తప్ప ఎవరు అలా మాట్లాడగలరు?

మనిషికీ మనిషికీ మధ్య కంటికి కనిపించని ఎన్ని అడ్డుగోడలు వుంటాయో ఆ పదిహేను రోజుల్లో తెలిసింది. ఆ పదిహేను రోజులూ మా అమ్మ నన్ను కూతురిలా కాకుండా ఓ స్నేహితురాల్లా భావించింది. “అలా.. ఏ రిలేషన్‌షిప్పూ మనం ఊహించుకున్నంత అద్భుతంగా వుండదే. యవ్వనంలో ఎన్నో కలలు ఉంటాయి. పెళ్ళి విషయంలో ఆ కలలకి లెక్కే వుండదు. కానీ, పెద్దవాళ్ళు ఆలోచించేది మన ఆనందమూ, సుఖమూ కాదు. మన సెక్యూరిటీ, పరువు ప్రతిష్ఠలూ, బాధ్యతల గురించి మాత్రమే. ఆ మూడూ విషయాల్లో దేనికీ వాళ్ళూ రాజీ పడరు. పిల్లల సంగతా.. వాళ్ళు పుట్టినపుడూ బుడి బుడి నడకలతో నడుస్తున్నప్పుడూ ఎంతో బాగుంటుంది. అన్ని కష్టాలనీ వాళ్ళ నవ్వులతో మరిచిపోతాం. వాళ్ళు ఎదిగే కొద్దీ మళ్ళీ బాధ్యతల్లో కూరుకుపోతాం. ఏదో ఒకరోజున తీరిగ్గా గతాన్ని నెమరువేసుకుంటే, దుఃఖంతో అవాక్కవడం తప్ప మిగిలేదేమీ వుండదు. అసలెందుకు యీ జన్మనెత్తిందీ అనే ప్రశ్న ఆ తరువాత క్షణానికో శూలంలా వెంటాడుతూనే వుంటుంది” అన్నది అమ్మ నిట్టూరుస్తూ. నేనేమీ కామెంట్ చెయ్యకుండా సైలంటుగా ఉన్నాను.

“అసలెందుకీ జీవితం? పుట్టిన దగ్గర్నించీ అన్నీ రిస్ట్రిక్షన్సేగా. నడవడం మీద కామెంట్లు. గబగబా నడిస్తే, కంగారూలా పరిగెడతావేమిటీ? అని. మెల్లిగా నడిస్తే ఏమిటా పెళ్ళి నడకలూ? అని. ధైర్యంగా నడిస్తే, ఏమిటా బోర విరుచుకుని నడవటం? అని. పోనీ నవ్వినా తప్పే. నవ్వు నాలుగు విధాల చేటు అంటూ శాస్త్రాల చిట్టా విప్పుతారు. అంతే కాదు, నవ్వే ఆడదాన్ని, ఏడిచే మగాడ్నీ నమ్మకూడదంటారు. అంటే? జీవితాంతం ఆడది ఏడుస్తూ పడి ఉండాలనేగా? ఆడదానికి ఏ చదువు ఇష్టమో ఎవరూ అడగరు. ఎవరికీ పట్టదు. చాకలి పద్దులు రాసేంత చదువు చాలు అని ఒకరంటే, పోస్టు కార్డు రాసేంత వస్తే చాలాయ్యా.. ఆడది చదివి ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళు ఏలాలా? అని సాగతీతలు” మళ్ళీ సుదీర్ఘంగా నిట్టూర్చింది అమ్మ. ఆమె నాతో మాట్లాడడం లేదు, తనలో తాను మాట్లాడుకుంటోందని నాకనిపించింది.

“‘పెళ్ళి’.. అదో చిత్రమైన ఘట్టం. మనింట్లో పాతిన మొక్కని పక్కింట్లో పాతితే, అది బతకడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. ఆ నేలకి అలవాటు పడితే బతుకుతుంది, లేకపోతే చస్తుంది. కానీ ఆడపిల్లలు మాత్రం పెళ్ళయిన గంటల్లోనే అత్తవారింటి పద్ధతుల్ని అర్జంటుగా నేర్చేసుకోవాలట. కూతుళ్ళు పదిమంది ఉన్న తల్లి అయినా, అత్త పదవికి ఎగబాకేసరికి రాక్షసిలానే ప్రవర్తిస్తుంది. తన కూతుళ్ళు మొగుళ్ళని పైట చెంగులో కట్టెయ్యాలి. కోడలు మాత్రం పర్మిషన్ లేకుండా మొగుడితో కూడా మాట్లాడకూడదు. ఇదేం న్యాయం? కోడలు కూతురు లాంటిది కాదా? కోడలికీ ఆశలూ నిరాశలూ వుండవా? ఊహూ. పెళ్ళయిన ప్రతి ఆడదీ ఒక మౌన అగాధంలోనే కూరుకుపోతుంది. అత్తగారి కుటుంబంలో మనసు పంచుకోవడం కాదు గదా, మాట పంచుకోవడం కూడా జన్మలో జరగదు. పుట్టింట్లో చెబుదామంటే, వాళ్ళు ‘సర్దుకుపోవాలమ్మా’ అంటూ నీతులు. మౌనం తప్ప మిగిలేదేమిటీ?” మరోసారి సుదీర్ఘంగా నిట్టూర్చింది అమ్మ.

అమ్మ మొహం వంకే చూస్తున్నాను. యాబై యేళ్ళ వయసుకే మొహం అలసిసొలసి, ముడతల పాలవడానికి సిద్ధంగా వుంది. అమ్మతో ఇన్నాళ్ళూ వున్నా నేను గానీ మా కుటుంబ సభ్యులు గానీ ఏనాడూ ఆవిడ కష్టాన్ని పంచుకోలేదన్న పరమ సత్యం బాకులా నా గుండెల్ని గుచ్చింది. ఎంత సేపూ మా డిమాండ్లే గానీ, ఆవిడ కంఫర్ట్‌ని ఏనాడూ చూడలేదు.

మా నాన్న మరీ! ఉద్యోగం, స్నేహితులు, అంతే కాదు, ప్రతి ఆదివారం కనీసం అయిదారుగురు స్నేహితుల్ని భోజనానికి పిలిచేవారు. స్పెషల్స్ ఉంటాయని మేమూ హాయిగా ఎదురుచూసేవాళ్ళమే గానీ, ఆ స్పెషల్స్ అమ్మ ఎంత చెమటోడిస్తే కంచాల్లోకి వచ్చినయ్యో, ఆ విందులు అయ్యాకా ఎన్ని గంటలు పనిచేస్తే ఇల్లు ఓ కొలిక్కి వస్తుందో ఏనాడు మేమూ ఆలోచించలేదు. ప్రతి దానికీ అలకలు, అల్లర్లు. అసలెంత నలిగిపోయిందో అమ్మ.

“సద్దుకుపోయాను.. సద్దుకుపోతూనే వున్నాను. అసలు నేను పుట్టిందే సద్దుకుపోయేంతలా ఒదిగిపోయాను. ఒరిగిపోయాను” అమ్మ కళ్ళల్లోంచి చుక్కలు చుక్కలుగా కన్నీరు బుగ్గల మీద నుంచి జారి జాకెట్టు మీద పడుతోంది. నేను ఉన్నచోటే పాషాణంలా పాతుకుపోయాను. అంగుళం కూడా కదల్లేదు.

“అనంతా.. జీవితం ఎంత ముందుకెళ్ళిందంటే, ఇక వెనక్కి వెళ్ళినా ఏమీ ప్రయోజనం లేనంత. అసలు నేను ఇక్కడికి నువ్వు రమ్మనగానే ఎందుకొచ్చానో తెలుసా? నీలా నువ్వు బతకమని చెప్పడానికి. ఎవర్నీ లెక్క చెయ్యకు. నువ్వు సంపాయించే డబ్బుని జాగ్రత్తగా దాచుకో. ఎందుకో తెలుసా? నీ ధనమే నీ శక్తి, నీ ధనమే నీకు ఆయుధం. నీ ధనమే నీకు శాంతిని ప్రసాదించే నేస్తం.. నీ గొప్ప చూసి నీ చుట్టూ చేరే వాళ్ళు కాకుల్లాంటి వారు. ఎప్పుడైనా ఎగిరిపోతారు. ఎవర్నీ గుడ్డిగా నమ్మకు. నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకో. గెలిచినా ఓడినా నువ్వే కారణం కావాలి. ఇతరులు కాదు” కళ్ళు తుడుచుకుని లేచి, నా తల నిమిరి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది.

మనోభారం కొంత దింపుకున్నదేమో, మొహం కాస్త శాంతపడినట్లనిపించింది. నేను శబ్దం లేకుండా లేచి వరండాలోకి అంటే కారిడార్ లోకి వచ్చాను. ఇన్ని మాటలు అమ్మ మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు. చాలా చాలా మితభాషి. అసలు అమ్మ జీవితాన్ని పూర్తిగా వింటే? అసలు నేనడిగినా తను చెప్తుందా! ఐనా జీవిత సారాన్నే నాకు అక్షరాల్లో (మాటల్లో) నింపి ఇచ్చింది. ఇంకేం అడగాలీ.

***

పది రోజులు గడిచాయి. అమ్మ నాతో చాలా ఓపెన్‍గా, క్లోజ్‍గా మాట్లాడుతోంది. ఆ రోజుల పరిస్థితులు, పరిసరాలు, స్త్రీల బతుకు గురించి నాకు కొంచెం కొంచెం అర్థమవసాగింది. ప్రేమ అనే మాట ఎత్తడానికి ఆడవాళ్ళు భయపడేవాళ్ళట. అసలు నవలలు, పత్రికలు, కథలు కూడా చదవడానికి బోలెడు ఆంక్షలుండేవిట. పెద్దవాళ్ళు చదివి, పిల్లవాళ్ళు చెడిపోయే మేటర్ వాటిల్లో లేదని నిర్ధారించాకే పిల్లల్ని పత్రికల్ని చదవనిచ్చేవారట. తోడు లేకుండా ఏ ఆడపిల్లా బయటకి అడుగుపెట్టరాదట.

వసంత్ రోజుకి ఒకసారైనా మమ్మల్ని కలిసి మాట్లాడుతున్నాడు. ఓ పాతిక పుస్తకాలు (అతనివే) తీసుకొచ్చి పడేశాడు. మా అమ్మ కూడా చదివేది అవి. ఒక్కోసారి చక్కని చర్చలు జరిగేవి. మా అమ్మ చాలా చక్కని చర్చ చేసేది. అసలు మా అమ్మ  అంత సూక్ష్మంగా, అంత విశాల దృక్పథంతో ఆలోచించగలదని నేనూ ఏనాడూ అనుకోలేదు.

“అలా, మీ అమ్మగారి మాటల్లో జీవిత సత్యం తొణికిసలాడుతోంది. ఆవిడ గనక కథలూ నవలలూ రాయగలిగితే, అవి అద్భుత విజయాన్ని చవిచూస్తాయి.” అన్నాడు వసంత్ ఓ నాడు. నేనెంత పొంగిపోయానో.

అదే మాట మా అమ్మతో చెబితే ఆవిడ నవ్వి, “ప్రతీ జీవితమూ ఓ వ్రాయబడని నవల లాంటిదే. కొందరు దాన్ని అక్షరబద్ధం చేస్తారు. కానీ, చాలా చాలామంది ఆ గ్రంథాన్ని అబద్ధాలతోటీ, ఆశయాలతోటీ నింపి, అసలు జీవితాన్ని అక్షరానికి దూరం చేస్తారు. అలా, ఒక ఆడది నూటికి నూరు పాళ్ళూ నిజాన్ని వ్రాయగలిగే పరిస్థితి ఇప్పుడు లేదు. బహుశా ఏనాటికీ యీ దేశంలో ఆ పరిస్థితి ఏర్పడదు” అంటూ నిట్టూర్చింది. నిజమేగా మరి!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here