(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[సర్రీలోని కుళ్ళుబోతుతనానికీ, ఓ చిత్రమైన క్రూరత్వానికి అల ఏమీ బాధపడదు. ఎందుకంటే ఒకప్పుడు నేనూ అలా ప్రవర్తించినదానినే కదా అని అనుకుంటుంది. సర్రీని అలని హేళన చేయడాన్ని అల పట్టించుకోకున్నా, యూనిట్ లోని ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ గమనిస్తారు. ఇదంతా అసూయ వల్ల అని అనుకుంటుంది అల. అయితే తనని డామినేట్ చేయడానికి సర్రీ అద్భుతంగా నటిస్తుంటే, అల కూడా ఇంకా గట్టిగా ప్రయత్నించి బాగా నటిస్తుంది. వసంత్ కుమార్ అల నటననీ ప్రశంసిస్తాడు, సర్రీని మెచ్చుకుంటాడు. ఎవరైనా డ్రింక్స్, కాఫీలు ఇస్తే తీసుకోవద్దనీ, మత్తు మందు కలిపి ఇస్తారని హెచ్చరిస్తుంది కనక. తమ యూనిట్ వాళ్ళంతా మంచివాళ్ళనీ, అలాంటి పనులు చేసేవారు కాదని చెప్తుంది అల. అయినా తన జాగ్రత్తలో తాను ఉంటుంది. ‘ధీర’ సినిమాలో వసంత్, సదాశివరావుల నటన చూసి ముగ్ధురాలైన అల, వాళ్ళ ముందు తను ఎందుకూ పనికిరాదని అనుకుంటుంది. ఫస్ట్ షెడ్యూల్ అయ్యాకా, 15 రోజులపాటు విరామం దొరుకుతుంది. అల హోటల్ లోనే ఉండి విజయవాడ నుంచి అమ్మని పిలిపించుకుంటుంది. విరామంలో చదవడానికి వసంత కుమార్ కొన్ని నవలలు ఇస్తాడు. వాటిని చదువుతూ, విశ్లేషిస్తూ ఉంటుంది అల. ఊర్నించి వచ్చిన అల అమ్మ – కూతురితో మనసు విప్పి మాట్లాడుతుంది. అలని కూతురిలా కాకుండా, ఓ స్నేహితురాలిగా భావించి – జీవితం గురించి, పెళ్ళి గురించి, కుటుంబం గురించి ఎన్నో విషయాలు చెబుతుంది. అలకి కొన్ని జాగ్రత్తలు చెబుతుంది. జీవిత సారాన్ని అక్షరాలలోకి నింపి ఇచ్చింది అమ్మ అనుకుంటుంది అల. అప్పుడప్పుడు వచ్చే వసంత కుమార్ కూడా అల వాళ్ళ అమ్మతో మాట్లాడి, ఆమె మాటల్లో జీవిత సత్యాలు ఉన్నాయని, ఆవిడ కనక కథలూ, నవలలు రాయగలిగితే అవి అద్భుతమైన విజయాన్ని సాధిస్తాయని అంటాడు. అదే మాట అల వాళ్ళమ్మి చెబితే.. ప్రతీ జీవితమూ ఓ వ్రాయబడని నవల లాంటిదే అంటూ నిట్టూరుస్తుంది. – ఇక చదవండి.]
మహతి-2 అల-4:
[dropcap]ప[/dropcap]దకొండో రోజున సర్రీ హోటల్‍కి వచ్చింది. “నేనూ వచ్చేశా! వసంత్ గారు నిన్ను బ్రహ్మాండంగా ట్రైనప్ చేస్తున్నారటగా!” ఆమె గొంతులో వెటకారం. నేను చిన్నగా నవ్వాను. సర్రీ అంటే జాలి కూడా వేసింది. “ఓహో, మౌనంగా వున్నావంటే నన్ను పురుగులా తీసిపారేసినట్టేగా” కోపంగా అంది.
“నువు మొట్టమొదట మాట్లాడిన మాటే తప్పు. సరే, నాకు ట్రైనింగ్ ఇస్తున్నారనుకుందాం. ఇప్పుడు నువ్వు వచ్చావు గనుక నువ్వూ ట్రైనింగ్ తీసుకో. అయినా సరోజినీ, నిన్ను నేను పురుగులా చూస్తానని ఎలా అనుకున్నావూ? నువ్వంటే నాకూ ఇష్టమే” సర్రీ భుజం తట్టి చెప్పాను. ఏమనుకుందో ఏమో, మౌనంగా తనకి ఎలాట్ చేసిన గదిలోకి వెళ్ళిపోయింది.
పది రోజులు ఏ పనీ చెయ్యకుండా విశ్రాంతిగా నీడ పట్టున వుండడం వల్ల మా అమ్మ కూడా తేరుకుంది. నిజం చెబితే మా అమ్మ చాలా అందమైనది.
“మీ అమ్మగారు వచ్చారటగా?” గంట తరువాత సర్రీ వచ్చింది.
“రా, వీరే మా అమ్మగారు జయలక్ష్మి” అన్నాను. సరోజినిని చూడగానే మా అమ్మ అన్నది – “ఏమ్మా నువ్వు ఉమాసుందరి కూతురివా?” అని. తెల్లబోయింది సర్రీ. ఓ క్షణం ఆగి, “మీకెలా తెలుసు ఆంటీ?” అన్నది. “అయితే నువ్వు ఉమ కూతురివే అన్న మాట. నేనూ మీ అమ్మా ఆ రోజుల్లో 5th ఫాం దాకా కలిసి చదువుకున్నాం. ఆ తరువాత వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ అయి ఏలూరికి మారిపోయారు. మేం చాలా మంచి స్నేహితులం” సంబరంగా చెప్పింది అమ్మ. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. “అసలెలా గుర్తుపట్టావు అమ్మా?” అన్నాను.
“అదేమిటీ వాళ్ళమ్మ నోట్లోంచి వూడిపడ్డట్టుంది. అచ్చు గుద్దినట్టు అలాగే ఉంది” అని సర్రీని దగ్గరకు తీసుకుని అన్నది. సర్రీ మొహంలో ఓ విషాదం.
“ఏమైందమ్మా.. అమ్మ ఎలా వుందీ?.. ఎక్కడుందీ?” అన్నది అమ్మ.
“నాకు పదేళ్ళ వయసులోనే చనిపోయిందమ్మా. మా అమ్మ చాలా ధైర్యవంతురాలనీ, ఎవరినీ లెక్క చేసేది కాదనీ, చాలా మంచిదనీ అందరూ అంటారు. నా వరకూ అమ్మ ఓ మౌన ముని. ఎప్పుడూ సైలెంటుగా ఉండేది” తల వంచుకుని అన్నది సర్రీ.
“ఓహ్. మేమందరం ఉమని ఫైర్‍బ్రాండ్ అనేవాళ్ళం. అంత ఉత్సాహంగా, ధైర్యంగా ఉందేది. ఎవరు చిన్న మాట అన్నా, ఊరుకునేది కాదు. అయితే చాలా మంచి హృదయం తనది. ఎంత మంచితనం అంటే ఎదుటి వారికి ఏం కావలన్నా క్షణాల్లో ఇచ్చేది. వాళ్ళ నాన్నతో దెబ్బలాడి కొందరు పేద పిల్లలకు స్కూలు ఫీజులు కట్టించేది. అలాంటిది మౌన ముని కావడం ఎలా సంభవించింది?” సర్రీ తల నిమిరి అన్నది అమ్మ. సర్రీ ఏమీ మాట్లాడలేదు కానీ, కళ్ళ వెంట బొటబొటా కన్నీళ్ళు కార్చింది.
“సారి తల్లీ.. ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేశాను. ఏడవకమ్మా.. నేనూ నీ తల్లి లాంటి దాన్నే” సర్రీని పొదివి పట్టుకుని తలా, వీపు నిమిరింది అమ్మ. చాలాసేపు సర్రీ అమ్మని బల్లి కరుచుకున్నట్లు కరుచుకునే వుంది.
అవ్వాళ ముగ్గురం కలిసే భోం చేశాం. సర్రీ అమ్మ పక్కనే కూర్చుంది. తల్లి లేకపోవటం అంటే ఎంత ఒంటరితనమో సర్రీ మొహంలో నేనానాడు చూశాను.
‘అమ్మ’లు ఉన్నవాళ్ళు లోకంలో ఎంత అదృష్టవంతులు!
***
రెండో షెడ్యూల్ మొదలైంది. మొదట్లో కంగారు పడ్డవాళ్ళూ, తికమక పడ్డవాళ్ళూ ఇప్పుడు మహోత్సాహంగా షూటింగ్‍లో పాల్గొంటున్నారు. రిహార్సల్ చేసి వెళ్ళటం వల్ల సమయం చాలా కలిసొస్తోంది. లంచ్‍లో నాన్-వెజ్ ఐటమ్స్‌ని జనాలే వద్దని చెప్పడం వల్ల ఖర్చు మంచి మొత్తంలోనే తగ్గింది. ఫైటర్స్‌నీ, డాన్సర్స్‌నీ అసలు పిలిపించనే లేదు. హీరో హీరోయిన్‍ల మధ్య ఉండే సాంగ్‍ని కూడా మావిడితోటల్లోను, చెరువు గట్ల మీదా, నీలాకాశపు కింద మబ్బుల బ్యాక్‍గ్రౌండ్‍లోనూ తీశారు. ఒక విధంగా ‘మూవ్‍మెంట్స్’ చెప్పింది వసంత్ గారే. సాంగ్ అయిపోయాక, అప్పుడు నా పాత్ర టర్న్ తీసుకుంటుంది. షూటింగ్ జరిగేటప్పుడు కొందరు దుండగులు హీరోయిన్‍ని కిడ్నాప్ చేసి ప్రభుత్వంతో బేరాలు పెడతారు. ఆ ప్రాసెస్‍లో హీరోని చావచితగ్గొడతారు. ఆ గుంపు నించి హీరోయిన్ ఎలా బయటపడి, ఆ దుండగుల్ని పట్టించి దేశాన్ని ఓ పెద్ద ప్రమాదం నించి రక్షిస్తుందో అదీ కథ. కథలో ఫైట్స్ ఉన్నా, అభూతకల్పనల్లా ఉండవు. ఫైట్ మాస్టర్ తప్పదని అనిపించాకా, సత్యమోహన్ గారు ఓ యువ ఫైట్ మాస్టర్‍ని పిలిపించారు. అతను ఎంత ఇంటలిజెంట్‍గా, ఎంత నైపుణ్యంగా ఫైట్‍ని కంపోజ్ చేశాడంటే, ఫైటర్స్ అక్కరలేకపోయింది. దుండగులుగా యాక్ట్ చేసినవారే ఫైటర్స్ అయ్యారు. సెకండ్ షెడ్యూల్ 26 రోజులు జరిగింది. చాలా ముఖ్యమైన ఘట్టాల షూటింగ్ పూర్తయింది
రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యాక, అమ్మ విజయవాడ వెళ్ళిపోయింది. ఆలోపులోనే నేనూ సర్రీ ఎంతో కలిసిపోయాం. అయితే ఒక్కటి నాకు విచిత్రంగా అనిపించేది. మేము ఎంత క్లోజ్‍గా వున్నా ఏనాడు సర్రీ తన జీవితం గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి గానీ ఏమీ చెప్పలేదు. ఆ విషయాలు ఒకవేళ పొరపాటుగా ఎత్తినా, ఏదో ఓ నెపంతో మాట దాటవేసేది. మిగతా విషయాల్లో తనేమే మారలేదు. నా వరకూ క్లీన్‍గా బిహేవ్ చేసేది.
సెకండ్ షెడ్యూల్ అయ్యాకా మళ్ళీ ఓ 20 రోజులు gap డిక్లేర్ చేశారు. నేను మళ్ళీ మా అమ్మగార్ని రమ్మని పిలిచాను. కానీ అందుకు నాన్నగారు ఒప్పుకోలేదు. “మీ అమ్మ నీ దగ్గర వున్నన్ని రోజులు ఇక్కడ గందరగోళంగానే ఉందమ్మా. నువ్వుండే చోటు చాలా సెక్యూర్డ్‌గా, సౌకర్యవంతంగానే ఉందని మీ అమ్మ చెప్పింది. పోనీ, నువ్వే ఇక్కడికి వస్తే అందరికీ ఎంతో బాగుంటుందిగా!” అన్నారు ఫోన్‍లో. అమ్మ ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇబ్బందిగా వుందటం కంటే, కంఫర్ట్ లేదన్న మాట. ముగ్గురు మగవాళ్ళు. ఒకరు 55 ఏళ్ళు, ఒకరు 21, మరొకరు 17. వీళ్ళు ముగ్గురు ‘అమ్మ’ అనే వ్యక్తి లేకపోతే మేనేజ్ కాలేరన్న మాట. అంటే అమ్మ అనే నిరంతరాయంగా పనిచేసే యంత్రం వాళ్ళ దగ్గర ఉండాలన్న మాట. నేను అమ్మని రమ్మన్నది, మరో ఇరవై రోజుల పాటు ఆమెకి విశ్రాంతి నిద్దామని. “అది కాదు నాన్నా, ఇక్కడికి వస్తే అమ్మకి కూడా..” అంటుండగానే అడ్డొచ్చి “అలా, మీ అమ్మకి ఇక్కడ ఏం కష్టం ఉందని? మొన్నా మధ్య బాగానే రెస్ట్ తీసుకుందిగా అక్కడికొచ్చి. మరోసారి చూద్దాంలే, ఈసారికి నువ్వే మేనేజ్ అయిపో. లేకపోతే బెజవాడకి వచ్చెయ్.. సరేనా” అన్నారు. అనడమే కాదు ఫోన్ పెట్టేశారు. నేను సైలంటైపోయా. వచ్చే ముందరే కొంత డబ్బు తెచ్చుకున్నా. కంపెనీ వాళ్ళు కూడా అడ్వాన్స్ చెక్ ఇచ్చారు. డబ్బుకి ఇబ్బంది లేదు. నా ఆశ ఏమంటే, అమ్మ గనక వస్తే ఆమెకి రెస్ట్ దొరుకుతుంది, అంతే కాదు, దగ్గరలోని పుణ్యక్షేత్రాలకు ముఖ్యంగా, షిరిడీకీ, శ్రీశైలానికీ తీసుకెళ్ళాలని నా ఆశ.
“అలా, నేను చిత్రాణి గారితో వాళ్ళ వూరు వెళ్తున్నాను. ఆ వూరు చాలా చల్లగా పచ్చగా వుంటుందిట” ఉత్సాహంగా అన్నది సర్రీ. “అదేం సర్రీ, మీ వూరికే వెళ్ళొచ్చుగా” అన్నాను. ఠక్కున సైలంటైపోయింది. అలాగే నిలబడిపోయింది. “ఏంటి సరూ, ఏదన్నా పొరపాటుగా మాట్లాడానా?” సర్రీని దగ్గరికి తీసుకుని సిన్సియర్‍గా అన్నాను. తన తల నా భుజం మీద ఆనించి నిశ్శబ్దంగా పెదాలు బిగించింది. కానీ సర్రీ గుండెలు ఎగిరెగిని పడుతున్నాయి. పెదవులు మాత్రం కోట తలుపులు బిగించినట్లనిపించింది. ఎన్ని నిమిషాలు నిశ్శబ్ద సముద్రంలో గడిచాయో.
ఎప్పుడో, మెల్లగా నిట్టూర్చి అన్నది “నా కుటుంబం ఓ నరకం అనంతా. నా మనసు నిండా, ఒంటి నిండా అన్నీ గాయాలే. నా జీవితమే ఓ తూట్లు పడ్డ నావ లాంటింది. నిజంగా చెబితే ఎక్కడికెళ్ళాలో తెలికే చిత్రాణి గారు రమ్మని అడిగితే ఒప్పుకున్నాను” అన్నది.
“ఫస్ట్ షెడ్యూల్ తరువాత మీ ఊరు వెళ్ళలేదా?” అన్నాను.
“లేదు. ఫ్రెండ్స్‌తో కలిసి బెంగుళూరు వెళ్ళాను. ఫ్రెండ్స్ ఎవరని అడక్కు” అన్నది.
“పోనీ మా యింటి కెడదాం, నాతో వస్తావా?” అన్నాను అసంకల్పితంగా.
“అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండటం కంటే మరో ఆనందం నాకీ జన్మలో ఉండదు. ఎందుకంటే మీ అమ్మగారు మా అమ్మకి స్నేహితురాలు. ఇక్కడున్నన్నినాళ్ళూ నన్ను కన్నబిడ్డ లానే చూసింది, ప్రేమించింది. కానీ, ఇప్పుడా ధైర్యం చెయ్యలేను. ఎందుకని అని అడగొద్దు. ఏనాడో ఓనాడు జరిగినవన్నీ నీతోనే చెప్పుకుంటాను. సరేనా?” గట్టి నన్ను కౌగిలించుకుని వీపు తట్టి బైటకి వెళ్ళిపోయింది.
అవాక్కై గది మధ్యలో నిలబడిపోయాను.
***
జీవితం నదిలాగే ప్రవహిస్తుంది. నది లాగే ఎండిపోతుంది. వర్షరుతువు రాగానే మళ్ళీ ఉరుకులు పరుగులు పెడుతూ కడలి వైపుకి కదం తొక్కుతూ పయనిస్తుంది. మళ్ళీ ఎండాకాలం నీరసిస్తుంది. సెగలు పొగలు వదుల్తూ నిట్టూరుస్తుంది.
జీవితమూ ఒక నదే. నా జీవితమూ అలాగే వుంది. ప్రేమలాంటి పిచ్చిలో పడి నన్ను నేను పోగొట్టుకున్నా. మనసులోని లాలిత్యాన్నీ, సౌందర్యాన్నీ నాకు నేనే పోగొట్టుకుని అగ్నిశిఖనయ్యాను. మళ్ళీ మహతి మందలింపులతో కొద్దో గొప్పో మళ్ళీ నన్ను నేను పొందగలిగాను. జీవితం నేర్పే పాఠాలు ఏ పాఠశాలా నేర్పదు.
‘సినిమా’ అనగానే అందరూ భయపెట్టారు. సినిమా అనేది ఓ బురదగుంట అని నానా పిచ్చి మాటలూ చెప్పారు.
ఇక్కడ చూస్తే కనిపించింది వేరు. డైరక్టర్లూ, ఆర్టిస్టులూ, సాంకేతిక నిపుణులూ అందరూ పని చేస్తారు – ఆఫీసు గంటల్లా కాదు. నిరంతరం ఒక ధ్యాసతో, ఒకే ఏకాగ్రతతో. శరీరమూ మనసూ ఏకమై – చెమటోడుస్తూ పని చేస్తారు. యూనిట్ మొత్తం ఒక కుటుంబంలా మారుతుంది. ఎవరు ఏది మాట్లాడినా సినిమా గురించే, సినిమా బెటర్‍మెంట్ గురించే.
ఇటువంటి అవిశ్రాంత లోకం అంటూ ఒకటుంటుందని దీనిలో అడుగుపెట్టేదాకా ఎవరికీ తెలీదు.
“ఏం అలా.. ఏమిటీ ఆలోచన?” ఆదివిష్ణు గారన్నారు. ఆదివిష్ణు గారు డైలాగ్ రైటర్. మితభాషి. సడెన్‍గా ఆయనన్ని హోటల్లో చూడడం ఆశ్చర్యమనిపించింది.
“మీరేంటి సార్ ఇలా!” ఆశ్చర్యంగా అన్నాను. ఆయన పకపకా నవ్వి “నేను అలా అంటే నువ్వు ఇలా అన్నావు” అన్నారు. నేను నవ్వానో క్షణం. అయన మళ్ళీ నవ్వి
“ఏముందీ.. సత్యమోహన్ గారు మళ్ళీ పిలిపించారు. మళ్ళీ ఓసారి డైలాగ్స్ మీద కూచుందామని. బహుశా కొన్ని సీన్లు కూడా మారవచ్చు. వసంత్, సదాశివరావు గార్లు అద్భుతంగా యాక్ట్ చేశారు. అలాగే నీ కేరక్టరూ చాలా బాగా వచ్చింది” బాయ్ తెచ్చిన కాఫీ కప్పు తీసుకుని అన్నారు.
“ఓహ్” చాలా సంతోషంగా అన్నాను.
“నీకో మాట చెప్పనా? నువ్వు చాలా ఇన్నోసెంట్‌వి. సినిమా కందిరీగలు ఇంకా నిన్ను కుట్టలేదు. గాడ్ బ్లెస్ యూ. నేను ఒకటే చెప్పగలను. ఈ ఫీల్డు ఎటువంటిదయినా ‘అమరత్వం’ ఇస్తుందని మాత్రం మరిచిపోకు. జీవితం వేరు.. తెర వేరు. జీవితం సమసిపోతుంది.. తెర మీది బొమ్మ చిరకాలం నిలుస్తుంది” అన్నారు.
“ఈ మాటలు ఎందుకు చెబుతున్నారూ?” అడిగాను ఆశ్చర్యంగా.
“ఇక్కడ ఇవ్వాళ్ళ ఉండినట్టు రేపు ఉండదు. ఏ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడాలి. ఎందుకంటే మొగలి పొదలు అందంగా ఉంటాయి. సువాసలని వెదజల్లుతూ వుంటాయి. కానీ, వాటికి పాములు చుట్టుకుని ఉంటాయి. అలాగని అవి మన మీదకి రావు. వాటికి దగ్గరయినప్పుడే ప్రమాదం” అన్నారు ఆదివిష్ణు.
“నాకు తెలీకుండానే నేను ఎవరికైనా దగ్గరవుతున్నానా? సార్, మీరు పెద్దవారు. లోకజ్ఞానంలో ఎంతో ఎత్తున వున్న వారు. నాలో ఏ లోపం కనిపించినా నిర్మొహమాటంగా చెబితే సంతోషిస్తాను” ఫ్రాంక్‌గా అన్నాను.
“తమ తప్పు తెలుసుకోవడానికి ఆతురపడేవాళ్ళు నిజంగా ఉత్తములు. తప్పు చెప్పాక దాన్ని గ్రహించి సరిదిద్దుకునేవాళు ఉత్తమోత్తములు. తప్పు చెప్పాక, ‘వీడా నాకు చెప్పేదీ’ అని ఆగ్రహించే వారు అధములు. ఆగ్రహంతో ఊగిపోవడమే కాక రివెంజ్ తీసుకునేవారు అధమాధములు” నవ్వి అన్నారాయన.
“నేను ఆ నాలుగు కేటరిగిల్లోకీ రానండి. నావల్ల ఏ తప్పు జరిగిందని, జరుగుతోందనీ మీరనుకుంటారో ఆ తప్పు నేను నిజంగా చేశానా, చేస్తున్నాన్నా అని ఖచ్చితంగా ఒకటికి వందసార్లు ఆలోచిస్తా. ‘తప్పు’ అని నా అంతరాత్మ చెబితే తక్షణమే ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటా. నా అంతరాత్మ అది తప్పని ఒప్పుకోకపోతే, అప్పుడు చెప్పిన వారినే అడుగుతా, వారి విశ్లేషణ ఇవ్వమని” నిర్మొహమాటంగా అన్నాను.
“గుడ్, మంచి మాట. ఓ చక్కని మెచ్యూరిటీ వుంది నీలో. సామాన్యంగా యీ వయసులో అంత పరిపక్వత ఉండదు. అనంతా – ఇప్పటి వర్కూ నీలో నాకు తప్పే కాదు, తప్పు చేసె ఆలోచన కూడా లవలేశమయినా కనబడలేదు. నేను నీతో జరిపిన సంభాషణ కేవలం ఓ ముందు జాగ్రత్త లాంటింది మాత్రమే. ఎన్ని దశాబ్దాలు జీవించినా, జీవితం ఎలా అర్థం కాదో; ఎన్నేళ్ళు యీ పరిశ్రమలో వున్నా, పరిశ్రమ ‘నాడి’ ఎవరికీ అర్థం కాదు. వెల్, బహుశా డైరక్టర్ నా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్” అంటూ లేచి ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ వైపుకి వెళ్ళారు. డైరక్టర్ ఇంకా రాలేదని నాకు తెలుసు.
‘ఇతను చెప్పడం లేదు. కానీ ఏదో వుంది. లేకపోతే ఇంకా రాని డైరక్టర్‍ని కలుసుకోవాలనే వంకతో ఉన్నట్టుండి బయలుదేరడు’ అని మనసులో అనుకున్నాను. విషయం ఏదైనా ఆలోచించవలసిందే. ఎందుకంటే, ఆ మాటల వెనక ఓ నిగూఢమైన అర్థం ఉంది. అలాగే ఓనాడు కనక చెప్పిన మాట కూడా జ్ఞాపకం వచ్చింది – డ్రింక్స్ లాంటివి ఎవరిచ్చినా తాగొద్దని.
సడన్‍గా నీరసం ముంచుకొచ్చింది. కనీసం అమ్మ నా దగ్గర వుంటే బాగుండేది.
***
“ఎల్లుండి నించీ షూటింగ్ మొదలమ్మా. ఆ ఫైట్ సీన్ అద్భుతంగా వచ్చింది. ఈమధ్య ఫైట్ అంటే ఒక హీరో, వెయ్యి మంది రౌడీలు. మన సినిమాలో ఒక హీరోయిన్, నలుగురు మాత్రమే దుండగులు. ఎనీ వే. బీ రెడీ. అందరికీ కబురు పంపడం అయిపోయింది” హుషారుగా అన్నారు సదాశివరావు గారు.
“ఓహ్.. చాలా సంతోషంగా ఉందండీ” అన్నాను నేను ఉత్సాహంగా.
“హ.. హా.. సినిమా అంటే అందరికీ అందని పండు లాంటిదో, అందని అంబరం లాంటిదో. ఓసారి అవకాశం అంటూ దొరికితే నూటికి డెబ్భై మంది భయపడో సిగ్గుపడో ఛాన్సుని చేజార్చుకుంటారు. కొంతమంది అవలీలగా ఆ ‘పట్టు’ని వదలకుండా నిలబెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతారు. నీలో ఆ ‘పట్టు’ ఉందమ్మాయ్. అందుకే ఆ ఉత్సాహం” ఆయనా నవ్వుతూనే అన్నారు.
“ఈ షెఢ్యూల్‍తో ఆల్ మోస్ట్ అయిపోవచ్చు. క్లైమాక్స్ బాగానే వచ్చింది కానీ, ఇంకా బెటర్‍మెంట్ కోసం రచయితలూ, సత్యమోహన్ గారూ ట్రై చేస్తున్నారు” మళ్ళీ ఆయనే అన్నారు.
“మీరు పార్టిసిపేట్ చెయ్యడం లేదా సార్?” అన్నాను కుతూహలంగా.
ఆయన చిన్నగా నవ్వారు. “అనంతా, విక్టరీ మధు గారి దగ్గర్నించి ఎందరో మహానుభావుల దగ్గర కో-డైరక్టర్‍గా పని చేశాను. ఏనాడూ నిచ్చెనలు ఎక్కాలని ట్రై చెయ్యలా. ఎందుకో తెలుసా? మీలాంటి వర్ధమాన నటీనటుల్ని కెమెరా ముందు భయపడకుండా, ఎలా నటించాలో నేర్పడం నాకు ఇష్టం. ఇది తప్ప నాకు దేని మీదా ఆసక్తి లేదు. నన్ను తెలిసిన వాళ్ళెవరూ నాకు వేరే పని చెప్పరు. వృత్తిపరంగా అయితే నేనూ సిటింగ్స్‌లో భాగం పంచుకోవాలి. కానీ మా వాళ్ళు నన్ను ఫ్రీగానే వదిలేస్తారు” గాఢంగా నిట్టూర్చారు సదాశివరావు గారు. ఆ తరువాత చాలా సేపు మౌనంగానే గడిచింది. ‘ఎందుకు’ అని అడగాలని నాకు ఎంతో అనిపించినా అడగలేదు. ఎందుకంటే ఆయన నిట్టూర్పులో ఓ చెప్పలేని ‘వ్యథ’ ఉన్నట్లు నాకు అనిపించింది.
***
మొదట్లో ఫుల్ సపోర్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ సడన్‍గా చేతులెత్తేశాడు. అదీ షూటింగ్ రేపు అనగా. మొత్తం అందరూ షాక్‍తో అవాకయ్యారు. డైరక్టరూ, కోడైరెక్టరూ నటీనటులూ, సాంకేతిక నిపుణులు ఉండేలు దెబ్బ తిన్న పిచ్చుకల్లా వాడిపోయారు.
“పోనీ ఓసారి అందరం ఆయనింటికి వెళ్ళి అడిగితే?” చిత్రాణి అన్నది. “చాలా ప్రయత్నించా. అసలు మనిషే పత్తాలేడు” నిస్పృహగా అన్నాడు వసంత్.
“అసలు రష్ చూశారా?” కమలాక్ష అన్నాడు.
“ఎందుకు చూడలా? వహ్వ, భేష్, భళా అంటూ చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. సినిమా అయ్యేలోగా మరో సినిమా ఎనౌన్స్ చేద్దామని వందసార్లు చెప్పాడు. మొన్న కూడా ఓకే అని రాత్రికి రాత్రి ప్లేటు మార్చేశాడు” నిస్పృహగా అన్నాడు కెమెరామాన్ డుప్లేకర్.
“ఇప్పుడు మన పరిస్థితి ఏమిటీ?” అడిగాడు ఎడిటర్ మణి.
“పొద్దున్నించీ ఫోన్ ట్రై చేస్తూనే వున్నా. టోటల్ స్విచ్ ఆఫ్‍లో ఉంది. బిగినింగ్ లోనూ, సెకండ్ షెడ్యూల్ మొదట్లోనూ ఇచ్చిన చిన్న ఎమౌంట్ చెక్కులు తప్ప ఎవరికీ కనీసం హాఫ్ పేమెంట్ చెయ్యలేదు. దాదాపు మూడు వంతులు పూర్తయిన సినిమాలోంచి జారుకోవడం దారుణం. కొత్త నటీనటులకైతే ఆత్మహత్మ లాంటింది. ఒక్కసారి ఫస్ట్ సినిమానే ఆగిపోయిందంటే వాళ్ళ ఫ్యూచర్ అగమ్య గోచరమే” చాలా బాధతో అన్నాడు వసంత కుమార్.
“పేద అరుపులు అరవకుండా హాయిగా ‘తిన్నా’ బాగుండేది. ఇటు డబ్బులూ రాక, అటు కడుపు మాడ్చుకున్నాం. ఏం లాభం? ఎవరి కాలు పెట్టారో” శ్లేషగా ఆడవాళ్ళ వంక చూశాడు నారాయణ (కాస్ట్యూమర్).
“అయ్యా.. అదీ మీ లెగ్ కూడా ఉండొచ్చుగా. ఇతరల మీద విసుర్లు విసరడానికీ నాలిక పదును చూపించడానికీ ఇది తగిన సమయమా?” కోపంగా అన్నాడు ఎడిటర్ మణి.
“పోనీ అందరం వెళ్ళి బ్రతిమలాడితే?” అందరివంకా చూస్తూ అన్నాడు శ్రావణ్. విషయం వినగానే అతని మొహం కళ తప్పడం నేను చూశాను.
“దొరికితే అలాగే చెయ్యొచ్చు. కానీ దొరికితేగా?” నిట్టూర్చి నిస్పృహతో అన్నాడు వసంత్.
“ఏం చేసినా ఇవ్వాళే చెయ్యాలి. పేపర్లకీ, ఛానల్స్‌కీ ఆల్రెడీ ‘ఇన్‍ఫో’ ఇచ్చాం, రేపట్నించీ షూటింగ్ అని. షూటింగ్ మొదలుపెట్టకపోతే పెద్ద దెబ్బ తగుల్తుంది. జన్మలో ఫిలిమ్ కంప్లీట్ చెయ్యలేం” అన్నారు డైలాగ్ రైటర్ ఆదివిష్ణు.
ఎవరికి తోచిన సలహాలు వాళ్ళిస్తున్నారు. అయితే,
“మీరెవ్వరూ యీ విషయన్ని పొరపాటుగానైనా బైటపెట్టద్దు. ఏమాత్రం డౌట్ వచ్చినా హోటల్ వాళ్ళు మన మీదకొస్తారు. చిన్నా చితకా టెక్నీషియన్స్ మనల్ని ప్రశ్నలతోనే చంపేస్తారు. చిట్టచివరి నిముషం దాకా మౌనంగా పరిస్థితిని ఎదుర్కుందాం. అసలు ఏ అఘాయిత్యమూ రానట్టుగానే మన పనిలో మనం నిమగ్నమవుదాం. ఎవరికీ ఏ మాత్రమూ అనుమానం రాకూడదు. ఏ మాత్రం అనుమానం వచ్చినా డబ్బిచ్చే వరకూ మనల్ని ఇక్కడే కట్టేస్తారు. మనకుండే అన్ని సోర్సెస్‌నీ ఉపయోగించి ప్రొడ్యుసర్‍ని కలిసితీరే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కో-ఆపరేట్ విత్ మీ” నిస్సహాయంగా అన్నాడు వసంత్.
“సార్.. నాకో డౌటుంది” సన్నగా అన్నాడు మణి.
“ఏమిటి?” ఆత్రంగా అడిగాడు వసంత్.
మణి ఏమీ మాట్లాడకుండా దిక్కులు చూస్తున్నాడు.
“చెప్పు మణీ..” అన్నాడు వసంత్.
“మరీ..” ఆగిపోయాడు మణి.
“ప్రొడ్యూసర్ గారి అబ్బాయి, అతని ఫ్రెండూ ఎన్నోసార్లు మనం రష్ చూసేటప్పుడు వచ్చేవాళ్ళు. జ్ఞాపకం ఉందా?” అడిగాడు మణి.
“అవునూ.. అతనూ తండ్రికి ప్రొడక్షన్‍లో సహాయపడుతూ వుంటాడుగా. ప్రొడ్యూసర్ రిక్వెస్టు మీదే నేను వాళ్ళని రానిచ్చాను” అన్నాడు వసంత్.
“మన అనంతగారి సీన్లన్నీ ఒకటికి పదిసార్లు వేయించుకుని చూసేవాడు. ఎంతగా అంటే పచ్చి పచ్చిగా ఆవిడ స్ట్రక్చర్‍ని నా ముందే వర్ణించేంతగా. బహుశా యీ వ్యవహారంలో అతని హస్తం ఏమన్నా ఉందేమో” మెల్లగా అన్నా స్పష్టంగా అన్నాడు మణి. గుండుసూది పడ్డా బాంబు పేలుతుందా అన్నంత సైలెంట్ అయిపోయింది మా మీటింగ్ హాల్.
నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది.
(ఇంకా ఉంది)