Site icon Sanchika

మహతి-19

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[ఎడిటర్ మణి చెప్పిన మాటలకి అందరూ విస్తుపోతారు. ఎవ్వరి ముఖంలోనూ రక్తం ఉండదు. నిజమా అని సత్యమోహన్ అంటే, తన దృష్టిలో అదే నిజమని మణి అంటాడు. ప్రొడ్యుసర్ కొడుకుతో పాటు వచ్చే అతని ఫ్రెండ్ ఉత్త వెధవ అనీ, వాడికి అన్ని వ్యసనాలు ఉన్నాయనీ, వాడి తండ్రి మాజీ మంత్రి అని చెప్తాడు మణి. ప్రొడ్యూసర్ కొడుకుతో వచ్చే అలాంటి వాడిని తానెలా ఆపగలని అంటాడు. బహుశా ఆ మాజీ మంత్రి కూడా ఈ సినిమాలో స్లీపింగ్ పార్ట్‌నర్ అయి ఉండవచ్చని అంటాడు మణి. అలకి ఏమీ తోచదు. డైరక్టర్ సత్యమోహన్ ఆమెకు భరోసా ఇస్తారు. అందరూ డిస్‍పర్స్ అయి, ఓ గంట తర్వాత మళ్ళీ కలుద్దామని అనుకుంటారు. తన గదికి అల – ఈ సమస్యకి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తుంది. మహతికి ఫోన్ చేయాలన్న ఆలోచన వస్తుంది. ఫోన్ చేసి తన సమస్యని వివరిస్తుంది. మహతి ఒక ఉపాయం చెప్తుంది. గంట తరువాత ఫ్రెష్‍గా తయారై మీటింగ్ హాల్‍కి వెళ్తుంది అల. కాసేపు అందరూ ఏం చేయాలో చర్చిస్తారు. అప్పుడు అల తన ప్లాన్ చెబుతుంది. తనకి అడ్వాన్స్‌‌గా ఇచ్చిన చెక్ మార్చి ఆ ఎమౌంట్‌తో ప్రెస్ మీట్ నిర్వహించమని చెబుతుంది. షూటింగ్ మొదలవుతుంది. ప్రెస్ మీట్ జరుగుతుంది. నటీనటులని పరిచయం చేయమని విలేఖరులు అడిగే – తర్వాత చేస్తామని చెప్పి – సినీరంగానికి చెందిన ఓ పెద్ద వ్యక్తి తమని సంప్రదించారని, తమ యూనిట్ తీసుకున్న నిర్ణయాలు ఆయనకి నచ్చాయని, తమ యూనిట్‍తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సత్యమోహన్ విలేఖరులకు చెప్తారు. సాయంత్రానికి ఈ వార్త టివిల్లో వచ్చేస్తుంది. ఏడు గంటలకి నిర్మాత – సత్యమోహన్ గారికి ఫోన్ చేసి డబ్బు ఏర్పాటు చేస్తున్నాను, షూటింగ్ కంటిన్యూ చేయమని చెప్తాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి డబ్బింగ్‍కి బయల్దేరుతారు. ప్రొడ్యూసర్ కొడుకు, అతని ఫ్రెండు – హైదరాబాద్‍లో ఏమైనా ఇబ్బంది పెడితే ఎలా అని ఆలోచనలో పడిన అల తన సమస్యని మహతి ముందు ఉంచుతుంది. మహతి అందుకు తగిన ఉపాయం చెప్తుంది. ప్రయాణం ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మహతి అన్న సురేన్ తో పాటు ఆర్మీలో పనిచేసే ఫాలాక్ష అనే యువకుడు వచ్చి అలని పరిచయం చేసుకుంటాడు. మహతి చేసిన ఈ ఏర్పాటుకు ముగ్ధుడైన సత్యమోహన్, తమ సినిమా ఆడియోని మహతి చేత విడుదల చేయిద్దామని అంటారు. బృందాలుగా అందరూ బయల్దేరుతారు. సత్యమోహన్ గారి కారుని ఫాలాక్ష నడుపుతానని, సత్యమోహన్‍ని, సదాశివరావు గారిని కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. మధ్య దారిలో తన మిత్రుడి ద్వారా స్కాచ్ బాటిల్స్, తినుబండారాలు ఏర్పాటు చేయిస్తాడు ఫాలాక్ష. ప్రయాణం కొనసాగుతుంది. – ఇక చదవండి.]

మహతి-2 అల-6:

[dropcap]“అ[/dropcap]నంతగారూ” ఫాలాక్ష పిలుపుకి మెలకువ వచ్చింది. రాత్రి 8.30కి ఓ ఊళ్ళోని హోటల్లో అందరం వేడి వేడి ఇడ్లీలూ, దోశలూ తిన్నాం. హోటలు వాడు బలవంతంగా పూరీలు కూడా వడ్డించాడు. హోటల్ చిన్నదే గానీ టేస్టు అద్భుతం. క్లీన్ అండ్ నీట్‌గా వుంది. కొబ్బరి చెట్నీ యావరేజ్. కానీ పచ్చిమిరప చింతపండు చెట్నీ ఇడ్లీలో కలిపి తింటుంటే ఘాటు నషాళానికెక్కింది. కళ్ళల్లో నీళ్ళు. అయినా వదిలి పెట్టలేదు. ఇక వేరుశెనగ చెట్నీ రుచి నలభీముల్ని గుర్తుకి తెచ్చింది. ఇక నల్ల కారప్పొడి అల్టిమేట్. పల్లెటూళ్ళు తెలుగు వంటల్ని మరచిపోలేదు. పూరీ అనేది నార్త్ ఇండియా నుంచి దిగుమతి అయిన వంటకం అయినా, నోట్లో పెట్టుకుంటే కరిగి పోయేట్టు చేశారు హోటల్ వాళ్ళు. బంగాళ దుంప, టమోటో కలిపి చేసిన ‘భాజీ’ అద్భుతం.

అందరం మధ్యాహ్నం సరిగ్గా తినలేదేమో, బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. అదీ ఓ పల్లెటూరి హోటల్లో కూర్చుని తినడం చాలా హాయిగా అనిపించింది. సదాశివరావు గారూ సత్యమోహన్ గారూ చెరో మూడు పెగ్గులూ వేసుకున్నట్లు వారే చెప్పారు. “ఫాలాక్షగారూ, మీ స్నేహితుడు రంగారావు గారికి హృదయపూర్వక కృజ్ఞతలండీ. తినుబండారాలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఎంత టేస్టో చెప్పలేను.” అన్నారు సదాశివరావుగారు.

“అరిసెలు, కజ్జికాయలు అయితే అబ్బా మా అమ్మగారు చేసినట్టుగా అనిపించింది.” సెంటిమెంట్ మేళవించి అన్నారు సత్యమోహన్ గారు.

మాములుగా కంటే మనుషులు మందు వేశాక చాలా ఫాస్ట్ అవుతారనీ, వారిలోని అత్యంత సున్నిత భావాలు అప్పుడే బయటకి వస్తాయనీ సదాశివరావుగార్ని, సత్యమోహన్ గార్ని చూశాక/విన్నాక అనిపించింది. వాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడటమూ నాకు బాగా అనిపించింది.

కళ్ళు నులుముకుంటూ లేచి “సారీ.. నిద్రపోయినట్టున్నాను” నా మీద నాకే కోపం వచ్చింది. రాత్రి 10.30 వరకూ మేలుకునే వున్నాను. ఎప్పుడు నిద్ర పోయానో నాకే తెలీదు.

“హయత్‌నగర్ సమీపిస్తున్నాం. డైరెక్టరు గార్లిద్దరూ నిద్రపోతున్నారు. వాళ్ళని లేపడం నాకు ఇష్టం లేదు. దిల్‌షుక్‌నగర్‌కి ఇవతలే మా సిస్టర్ ఇల్లుంది. అక్కడ ఆపుదాం. టిఫెన్, కాఫీ ముగించుకుని వారిని ఎక్కడ దింపాలో అక్కడనే దింపుతా. లేకపోతే సత్యా గారే డ్రైవ్ చేస్తూ గమ్యానికి చేరతారు. మరి మీరు ఎక్కడ దిగాలీ?” స్పష్టంగా అడిగాడు ఫాలాక్ష.

“నిజంగా నాకు తెలీదు. ఎందుకంటే, మా వాళ్ళెవరూ యీ వూర్లో లేరు. డబ్బింగ్ పూర్తి చెయ్యాలి. ప్రొడక్షన్ వాళ్ళే బస ఏర్పాటు చేస్తారు” అన్నాను. నిజంగా నాకు అప్పుడు కంగారు పుట్టింది. ప్రొడ్యూసర్ కొడుకు మళ్ళీ ఆకతాయి పనులు మొదలు బెడితే.

“ఓ పని చేద్దాం. మా సిస్టర్ ఇల్లు చాలా పెద్దది. అక్క కూతుళ్ళు ఇద్దరూ ఫారిన్‌లో వున్నారు. వాళ్ళ రూములే కాక మరో రెండు గెస్టు రూములు ఉన్నై. మీ బస ఎక్కడో నిర్ణయం అయ్యే వరకూ మీరూ మా సిస్టర్ ఇంట్లోనే ఉండండి. తనూ చాలా హేపీగా ఫీల్ అవుతుంది. అయితే ఒకటే ప్రాబ్లం” అన్నాడు.

“ఏమిటి” కుతూహులంగా అడిగింది.

“మా అక్కకి పెద్ద నమ్మకం తనో సూపర్ కుక్ అని. రక రకాల డిషెస్ ట్రై చేస్తూ ఆ ప్రయోగాలు మన మీద ప్రయోగిస్తుంది. అఫ్‌కోర్స్ బాగానే వుంటాయనుకోండి” నవ్వి అన్నాడు.

“ఓహ్.. ఇంకేమైనానేమో అనుకున్నా” నా గొంతులో రిలీఫ్.

“అయితే మీరు ఇక్కడ ఉండటానికి ఒప్పేసుకున్నారన్న మాట. ధన్యవాదాలు.. థాంక్యూ.. షుక్రియా!..” అంటూ

ఓ పెద్ద బంగళా ముందు ఆపాడు ఫాలాక్ష. సెక్యూరిటీ వాడు గేటు తీశాడు. చాలా పెద్ద గార్డెన్.. వెనుకగా బంగ్లా.. అదేదో మరో జమీందారుల బంగళాలా ఉంది. “మా బావగారు సెంట్రల్ గవర్నమెంట్‌లో ఫలానా మినిస్ట్రీకి ప్రిన్సిపల్ సెక్రటరీ” అన్నాడు ఫాలాక్ష.

“మా బావగారిది చాలా కలిగిన కుటుంబం. మా బావగారి తండ్రి కూడా చాలా పెద్ద లాండ్‌లార్డ్. బావగారి తాతగారు చాలా గొప్ప వ్యక్తి. స్వాంతంత్ర్య సమరంలో పాల్గొని ఎంతో సేవ చేశారు. వారి భార్యగారు ఏడు వారాల నగలూ గాంధీగారి జోలెలో వేసింది. చివర వరకూ వాళ్ళు ఖద్దరు బట్టలే వాడేవారట. స్వదేశీ తప్ప విదేశీ వస్తువులన్ని శాశ్వతంగా ఇంట్లోంచి బహిష్కరించారట.” కార్ పార్క్ చేశాక అన్నారు ఫాలాక్ష.

“ఇప్పుడు వీరిని నిద్ర లేపుదామా?” అన్నాను.

“వద్దు.. ఎ.సి. ఆన్ లోనే వుంచానుగా. లేచాక చూద్దాం. మీరు నాతో కూడా లోపలకి రండి” అని సెక్యూరిటీ వాడితో “కారులో ఇద్దరు నిద్రపోతున్నారు. వెనక సీట్లో.. వారు లేచాక లోపలికి తీసుకురా” అన్నాడు.

“యస్ సార్..” అన్నాడు సెక్యూరిటీ.

మేం బెల్ మ్రోగించగానే ఓ నిముషంలో తలుపులు తెరుచుకున్నాయి. చూడంగానే గుర్తు పట్టాను. అజంతా శిల్పంలాంటి అందం.. అద్భుతమైన శరీర సౌష్టవం.

“ఏరా.. మై గాడ్.. నిన్నేనా చూస్తున్నది” అని బయటకొచ్చి నన్ను చూసి “ఓహ్.. సతీసమేతంగా వచ్చావా? ఒక ముక్క కూడా చెప్పలేదే? అంత కాని వాళ్ళం అయిపోయామా? నిన్న రాత్రి అమ్మానాన్నలు కూడా నీకు పెళ్ళయిందని ఒక్క ముక్క చెప్పలేదే?” కోపంగా అన్నది.

“తల్లీ.. ఆపు.. ఈ అమ్మాయి పేరు అనంత లక్ష్మి. నా ఫ్రెండ్ వాళ్ళ చుట్టం. మనింటికి తీసుకొచ్చా. వీరు కాక ఇంకో ఇద్దరు కార్లో నిద్రావస్థలో ఉన్నారు. అనంతగారు బహుశా కొన్ని రోజులు ఇక్కడే వుండొచ్చు. ఇప్పుడు ప్రశ్నలు సంధించు” నవ్వి అన్నాడు ఫాలాక్ష.

“సారీ అమ్మా.. పిల్లని డైరెక్ట్‌గా ఎత్తుకొచ్చే ధైర్యం చెయ్యడని తెలుసుగానీ, ఏదో తొందరపాటు. కమ్.. లోపలికి రా.. నా పేరు కల్యాణి. నీకంటే పెద్దదాన్ని గనక  ‘నువ్వు’ అని ఏకవచనంలోనే అంటాను” అని ఆప్యాయంగా నా చేయి పట్టుకుని లోపలికి తీసికెళ్ళింది.

ఓ గది నాకు కల్యాణి గారు చూపించి “ఇదిగో ఇది నీ గది. హాయిగా ఉండు. నువ్వు ఎన్నాళ్ళు వున్నా నాకు సంతోషమే.” అన్నది. నిజంగా స్టార్ హోటల్ రూమ్‌లా ఉందా గది. బాత్ రూమ్ అద్భుతం. టబ్ లోకి నీరు వచ్చేలా సెట్ చేసి గది తలుపులు మూశా.

ఎక్కడి బెజవాడ. ఎక్కడి తూగో జిల్లా. తమన్నా హోటలు. ఎక్కడి ఓ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ లాంటి రూము. టబ్‍లో విశ్రాంతిగా పడుకుంటే, ఆలోచనలే ఆలోచనలు.  ఈ టబ్‌లో పడుకుని స్నానం చేయ్యడం నాకు జీవితంలో ఫస్ట్ టైము. సినిమాల్లో చూశా గనుక కంగారు లేదు. గోరు వెచ్చని నీళ్ళలో పడుకుని విశ్రాంతి తీసుకోవడంలోని హాయి, అనుభవిస్తేనే తెలుస్తుంది.

“నేను బాగా డబ్బు సంపాదిస్తే?” ప్రశ్న నాదే.

“అచ్చు ఇలాగే నా రూమ్‌ని అలంకరిస్తా. ఇలాంటి బెడ్ రూమ్‌నే కట్టుకుని, ఇలాగే టబ్‌లో రోజుకి రెండు సార్లయినా షవర్ చేస్తా” జవాబు నాదే. నాకే నవ్వొచ్చింది.

అవునూ..! వాళ్ళు ఉండమన్నది సరే. సినిమా పని మీద నేనొచ్చి ఇక్కడ ఉండటం ఏం మర్యాద? నా మనసు ఇక్కడ ఉండటానికే మొగ్గు చూపినా మరో పక్క ‘తప్పు’ అని బుద్ధి చెబుతోంది.

ఏదేమైనా, డైరెక్టర్ గారితో మాట్లాడాకే నిర్ణయం తీసుకోవాలి. ఫాలాక్ష వాళ్ళ బావ  ‘పొజిషన్’ తెలిస్తే ప్రొడ్యూసర్ కొడుకు కళ్ళెత్తి చూసే ధైర్యం కూడా చెయ్యడు అని నేనునుకున్నా.

వాడెందుకు భయపడాలీ? ప్రశ్నించింది నా అంతరాత్మ. తర్జన భర్జన నించి బయట పడి టైమ్ చాలా చూసుకుని షాకు తిన్నా. బాత్ రూంలోకి దూరి అప్పటికి అరగంట గడిచింది. ధడాల్న లేచా. బాత్ రూమ్ లోని నిలువటద్దంలో నన్ను నేను చూసుకుంటే నాకు మతిపోయింది. అద్దంలోని అందమంతా నాదేనా అని ఆశ్చర్యమేసింది.

ఇంత చక్కని శరీర సౌష్టవాన్ని చూశాక ఎవరికి మోహం కలగదు! కానీ, ఫాలాక్ష ఏ మాత్రం తొణకలేదే!?

డ్రెస్ చేసుకుని హాల్లోకి వచ్చాను.

“సత్యగారూ, సదాశివరావు కూడా స్నానాలకి వెళ్ళారు. వచ్చాక హాయిగా టిఫిన్ చేద్దాం. నేను కాఫీకి పిలిచే లోపలే మీరు డోర్ లాక్ చేసుకున్నారు. గనక మీరు కాఫీ మిస్సయ్యారు. ఇప్పుడు మీరు కాఫీ అడిగినా నేను ఇవ్వను. ఎందుకంటే కాఫీ ఆకలిని చంపేస్తుంది.” నవ్వుతూ అన్నాడు ఫాలాక్ష.

తెల్లని పైజామా కుర్తాలో గ్రీకు శిల్పంలా ఉన్నాడు పాలక్ష. ఛాతీ మీద గుబురుగా వెంట్రుకలు. ఫ్రెష్‌గా గడ్డం చేసుకున్నాడేమో, చూబుకమూ, బుగ్గలూ లైట్ గ్రీన్‌లో వున్నాయి (అది గ్రీన్ కూడా కాదు). ఎవరినీ లెక్క చెయ్యని నా కళ్ళు, ఇతన్ని చూస్తే మాత్రం సిగ్గుతో వాలిపోతున్నాయి.

“అంత ఆకలి లేదు ఫాలాక్షగారు. నిన్న రాత్రి మీరు బలవంతంగా దోశలూ పూరీలు తినిపించారుగా” అన్నాను బిడియాన్ని జయించి.

“అది అదే.. ఇది ఇదే. ఆవిడ చేసిన ఫలహారాల్లో ఏది మిలిగినా మా అక్కకి బోలెడు కోపం వస్తుంది. అందుకే, హాయిగా తిని, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనిపించుకోండి” సలహా ఇచ్చాడు ఫాలాక్ష.

“మైగాడ్. నేను బేసిక్‌గా చాలా పూర్ యీటర్‌ని. మా అమ్మ నాతో ఫుడ్ తినిపించడానికి నానా పాట్లూ పడేది” నవ్వి చెప్పాను.

“తప్పదు. అయినా మా అక్క చేసే పెసరట్టు ఉప్మా, ఇడ్లీ చూస్తేనే ‘కిక్’ ఎక్కుతుంది. నిజంగా మా అక్క ఎక్స్‌పర్ట్ అండోయ్” అని ఫాలాక్ష అంటుండగానే సత్యమోహన్, సదాశివరావు గారూ వచ్చారు.

నన్ను చూడగానే నవ్వి “నీ పుణ్యం వల్ల హాయిగా నిద్రపోతూ వచ్చాం అలా. ఫాలాక్షగారి సహాయం ఎప్పటికీ మర్చిపోము” అన్నారు సత్యమోహన్ గారు.

“అయ్యో.. డ్రైవింగ్ అంటే నాకు పిచ్చి. నైట్ డ్రైవింగ్ అంటే ఇంకా అవన్నీ వదిలేసి చక్కగా బ్రేక్‌ఫాస్ట్ చేయ్యండి” నవ్వి అన్నాడు ఫాలాక్ష.

స్వయంగా వచ్చి పిలిచారు కల్యాణిగారు. టేబుల్ మీద నాలుగు అరిటాకులు శుభ్రంగా కడగబడి పెట్టి వున్నాయి. లేత ముదురు కాని చక్కని అరిటాకులు. రంగు చూస్తేనే కళ్ళకి ‘అహో’ అనిపించింది.

మేం కూర్చోగానే మొదట తలో మూడు ఇడ్లీలు పెట్టి దిట్టంగా వాటి మీద నెయ్యి పోసి, కొబ్బరి చెట్నీ, అల్లం చెట్నీ వేరుశెనగ చెట్నీ, కారప్పొడీ నీటుగా ఆకుల్లో వడ్డించారు. ఆ తర్వాత సాంబారు ‘కటోరీ’లో పెట్టి సాంబారు పోశారు.

“అయ్యో అంత నెయ్యా” అన్నారు సత్యమోహన్.

“మినప్పప్పుకి నెయ్యి మస్ట్‌గా తోడుండాలండీ. అప్పడే అరుగుతుంది. ఇవాల్టికి మాత్రం ఆరోగ్య సూత్రాలు అన్నీ పక్కన పెట్టి హాయిగా కానివ్వండి” నవ్వి అన్నది కల్యాణి.

ఇడ్లీలు వెన్నలా మృదువుగా వున్నాయి. చెట్నీలతో నంజుకుంటే ప్రాణం ఎక్కడికో పోతోంది. మళ్ళీ కిచెన్ నుంచి బయటికొచ్చి ఒక్కో పెసరట్టు ఉప్మా వడ్డించారు. ఉప్మా గట్టిగా లేదు. మృదువుగా, కొద్దిగా జారుగా ఉంది. పెసరట్టు నేతితో చేశారని స్మెల్ చెబుతోంది.

కొసరి కొసరి ఒక్కక్కరి చేత మూడు పెసరట్టులు తినిపించిగానీ కల్యాణి గారు వదల్లేదు. ఆ తర్వత నా జీవితంలో నేను తాగిన బెస్ట్ ఫిల్టర్ కాఫీ.

ఆవి తినే క్రమం మధ్యలో సత్యమోహన్ గారు, సదాశివరావుగారూ కల్యాణిగారి వంటల్ని పొందికనీ ఎంత మెచ్చుకున్నారో, ఎన్ని సార్లు సదాశివరావుగారు ఆశీర్వదించారో.

పుత్తూరు వక్కపొడి (రత్నం)తో టిఫిన్ కార్యక్రమం ముగిసింది. రత్నం వక్కపొడి టేస్టు దేనికీ వుండదు. ఒకప్పుడు త్రివేణి, రసిక్‌లాల్ కంటే గొప్ప రుచి ఆ వక్కపొడిది.

“డైరెక్టరు గారూ.. నా బస ఎలా?” టిఫిన్ అయ్యాక అడిగా, డ్రాయింగ్ రూంములో.

“ఆలోచిస్తూనే వున్ననమ్మా. ఈ స్టేజ్‌లో ప్రొడ్యూసర్ తరపు నుంచి ఏ గొడవా రాదు. వస్తే వాళ్ళకి ఆత్మహత్య సదృశమే. మినిస్టర్ తాలూకు వాడి వ్యవహారమే అలోచించాలి. అయినా నాకు తెలిసిన మంచి రక్షణ గలిగిన గెస్ట్ హౌస్ వుంది. అసలు మా యింట్లోనే ఉంచుకోవచ్చు. కానీ..” ఆగారు సత్యమోహన్.

“ఫాలాక్షగారు నన్ను ఇక్కడ ఉండమని ఆఫర్ ఇచ్చారు.. కానీ..” అన్నాను. ఉండమంటే ఉండటం నాకు మర్యాద కాదు. ఒక్క విషయం చెప్పాలి. మర్యాద అనేది ఎక్కడయినా, ఎవరింటలోనైనా కొంత కాలమే ఉంటుంది. నిరంతరం కాదు. అందుకే ఎవరు ఎక్కడ వుండాలో అక్కడ ఉండమే మర్యాద అని మా అమ్మ ఎప్పుడూ చెప్పడం నాకు గుర్తే.

కాసేపు అందరూ సైలెంటుగా వున్నాక సదాశివరావుగారు అన్నారు “ఈ విషయం ఫాలాక్షగారికీ, కల్యాణిగారికీ వివరించి వారి సలహా తీసుకుందాం” అని.

— గంట తర్వాత —

“మా యింట్లో మా పర్మిషన్ లేకుండా అడుగు పెట్టే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు. నాలుగు డాబర్‌మెన్‌లు ఉన్నాయి. అదీగాక 24 గంటలూ సెక్యూరిటీ వాళ్ళు. అనంత హాయిగా ఇక్కడ ఉండొచ్చు” అన్నారు కల్యాణి. “అయినా మా వారికి ఫోన్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ కొడుకు పనీ, వాడి ఫ్రెండ్ పనీ పట్టడం అయిదు నిముషాలు” అని కూడా కోపంగా అన్నారు.

“అక్కా.. నీ కోపం సరైనదే. కానీ ఇక్కడి వ్యవహారం వేరు. ఇది అల జీవితానికే కాదు, భవిష్యత్తుకి కూడా సంబంధించిన వ్యవహారం. బావకి ఐ.జి. స్నేహితుడేగా. ఒక్కసారి డబ్బింగ్ థియేటర్‌కి వారి కారులో అనంతగారిని పర్సనల్‌గా దింపమని బావ చేత రిక్వెస్టు చేయించు. అల వంక చూడడానికైనా వాళ్ళది గుండే చెరువా” నవ్వి అన్నాడు ఫాలాక్ష.

“నీది భలే బుర్రరా! నాకు తోచనే లేదు” హాయిగా నవ్వి తమ్ముడి భుజం మీద చరిచింది కల్యాణి.

“మీరు నిర్భయంగా ఉండండి. డబ్బింగ్ మొదలైనప్పుడు ఇక్కడికి కాల్ చెయ్యిండి. అల ఇక్కడే ఉంటారు. కాల్ చేసే ముందర ఆ ప్రొడ్యూసర్ కొడుకూ వాడి ఫ్రెండు ధియేటర్లో ఉండేట్టు చూడండి” సత్యమోహన్‌తో అన్నాడు ఫాలాక్ష.

“మీకెలా థాంక్స్ చెప్పాలో నాకు తెలీడం లేదు. ఇది అనంతకే కాదు మాకూ జీవన్మరణ సమస్యే. నానా చికాకులూ పడి ‘మహతి’ గారి ఉపాయం వల్ల ఘాటింగ్‌ని గట్టెక్కించాం. డబ్బింగూ, రీ రికార్డింగూ పూర్తయితే మా జీవితాలు ఓ గాడిన పడట్టే” అన్నారు సత్యమోహన్ నిలబడి.

“ఓహ్, మహతి మా సురేన్ సిస్టరు. షీ యీజ్ ఈ ఎ జెమ్” అన్నాడు ఫాలాక్ష. ఆ నవ్వు నిష్కల్మషంగా ఉంది.

“మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళాలి. సరేనా?” అన్నది కల్యాణి.

“అమ్మా కన్న తల్లిలా కొసరి కొసరి తినిపించావు. నాకయితే ఎప్పుడో పోయిన మా అమ్మ గుర్తుకొచ్చింది. సాయంత్రం దాక మంచి నీళ్ళకి కూడా చోటు లేనంతగా పొట్ట ఫుల్ అయింది. మళ్ళీ సారి ఖచ్చితంగా వచ్చి మీ చేతి వంట పది సార్లు రుచి చూస్తాం. ప్రామిస్” అని సదాశివరావుగారన్నారు. ఆ మాట నిజమే. పొట్ట ఫుల్‌గా ఉంది.

వాళ్ళు వెళ్ళపోయాక సోఫాలోనే కూనికిపాట్లు పడుతుంటే కల్యాణి గారు నన్ను లేపి రూమ్‌లో పడుకోమన్నారు. వెళ్ళి మంచం మీద వాలిపోయాను.

నిద్ర లేచేసరికి మూడు గంటలయింది. కంగారుగా హాల్లోకి వచ్చాను. ఫాలాక్ష కల్యాణి చిన్నప్పటి కబుర్లు చెప్పుకోవడం దూరం నుంచే వినిపించింది.

“వచ్చావా.. రా. భోజనానికి పోదాం” లేచి అన్నది కల్యాణి.

 “సారీ.. నాకు ఒళ్ళు తెలీలేదు” బిడియంగా అన్నాను.

“అనంతా.. నీ మొహంలో భావాలు భలే పలుకుతాయి. ఎంత అందంగా సిగ్గుపడ్డావో నీకు తెలుసా? ఏరా తమ్ముడూ, నేనన్నది రైటేనా?” నవ్వి అన్నది కల్యాణి.

“హండ్రెడ్ పర్సంట్ రైట్, అయినా అక్కా, ఇన్నాళ్ళ పాటు టెన్షన్ భరించీ భరించీ మనసు ఛిద్రమైపోయి వుంటుంది. ఇప్పుడు మనసు ఫ్రీ అయింది గనుక హాయిగా నిద్ర పట్టివుంటుంది. అందుకే అనంతా, మిమ్మల్ని లేపలేదు. ఇక నుంచీ నిర్భయంగా ఉండండి. భోం చేద్దాం పదండి” అన్నాడు ఫాలాక్ష. వారి ఆప్యాయతకి నా గుండె కరిగింది.

అందరి కంటే మందు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మహతికి.

టమోటా పప్పు, అరటికాయ ఉప్మా కూర, గోంగూర పండు మెరపకాయల పచ్చడీ, వంకాయ బంగాళదుంప కూర, మాంఛి మిరియాల రసం, మెంతి మజ్జిగ, అప్పడాలు, వడియాలు, ఊరు మెరపకాయలు గడ్డ పెరుగుతో భోజనం దివ్యంగా ఉంది.

“అనంతగారూ అన్నీ మా అక్కే చేసింది. మా అక్కకి సాటి సౌత్‌లో ఎవరూ ఉండరు. హాయిగా భోం చేస్తే మా అక్క సంతోషపడుతుంది” ఎర్రగా ఊరిస్తున్న ఆవకాయ తను వడ్డించి అన్నాడు ఫాలాక్ష.

(ఇంకా ఉంది)

Exit mobile version