Site icon Sanchika

మహతి-2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[మహతి తన కథ చెబుతూంటుంది. అమ్మానాన్నలని, తోబుట్టువులని పరిచయం చేస్తుంది. అన్నా, తమ్ముడు, చెల్లెలు అమ్మానాన్నలతో ఉంటే మహతి మాత్రం అమ్మమ్మ తాతయ్యల దగ్గర ‘కర్రావూరి ఉప్పలపాడు’ అనే ఊరిలో పెరుగుతుంది. మహతికి ఐదేళ్ళు దాటాకా, తండ్రి కల్పించుకుంటే గాని బడిలో వేయలేదు తాతయ్య. కర్రావూరి ఉప్పలపాడు ఓ తింగరి వూరని, అక్కడి మనుషులది వింత ప్రవర్తన అని చెబుతుంది. ఆ చిన్న టౌన్‍లో పదో క్లాసు వరకూ చదువుతుంది మహతి. పాటలు పాడడంలో నైపుణ్యం సాధిస్తుంది. సెలవల్లో లైబ్రరీలో ఎన్నో పుస్తకాలు చదువుతుంది. లైబ్రరీలో పరిచయమైన అభిలాష్ వల్ల అనువాద రచనలు చదవడం అలవాటు చేసుకుంటుంది మహతి. మహతి స్నేహితురాలు కుసుమకి పదవ తరగతి అయిపోగానే పెళ్ళి చేసేస్తారు. ఆ అమ్మాయి అనుభవించిన మానసిక వేదన మహతిని కదిలిస్తుంది. కాలేజీలో చేరుతుంది. తోటి అమ్మాయిలని పరిచయం చేసుకుంటుంది. ఇంగ్లీషు లెక్చరర్ వచ్చి అందరినీ ఒకరి తరువాత ఒకరుగా పరిచయం చేసుకోమంటాడు. అలా పరిచయం చేసుకున్న వాళ్ళల్లో హరగోపాల్, తిరుమలరావు అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. మహతికి స్నేహ బృందం ఏర్పడుతుంది. – ఇక చదవండి.]

[dropcap]మా[/dropcap] కె.వి.ఎస్. కాలేజీలో ఫ్రీడమ్ ఎక్కువా.. డిస్లిప్లిన్ తక్కువ. “చదువు చాలా ముఖ్యమైనదే.. కానీ.. జీవితంలో ముఖ్యమైనవి ఇంకా చాలా వున్నాయి. మీ భవిష్యత్తుని నిర్ణయించేది మీరు చదువుకున్న చదువు మాత్రమే ‘కాద’ని గుర్తుంచుకోండి!” అని మా శ్రీమన్నారాయణ లెక్చరర్ గారు ఓసారి మాతో అన్నారు.

“అంటే అత్తెసరు మార్కుల్తో పాసైతే చాలంటారా?” అదోలా అడిగాడు బోండా ప్రసాద్ (చాలా లావుగా వుంటాడని అతని ఫ్రెండ్సే ఆ నిక్ నేమ్ పెట్టారు. అలా పిలిస్తే అతనూ ఏమీ అనుకోడు). అతను ఎప్పుడూ చదువులో ఫస్టేట.

“నేను మాట్లాడింది మార్కుల గురించీ, మీ సబ్జెక్టుల గురించీ కాదు నాయనా! హాయిగా చెమటోడ్జి నూటికి నూరూ సాధించినా, రేపు మీ జీవితాన్ని నిర్ణయించేవి ఈ డిగ్రీలూ, మార్కులూ కావు అని చెబుతున్నాను. ఇది నా అనుభవం.” నవ్వారు శ్రీమన్నారాయణ గారు.

ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఆయన అన్నమాట అక్షరాలా నిజమేనని తరవాత అర్థమైంది. ఏవో చిన్న చిన్న టీజింగ్‌లు తప్ప కాలేజీ (దాన్నే ‘జూ-కా’ అనేవాళ్ళం – అంటే జూనియర్ కాలేజీ అని) జీవితం హాయిగా గడిచిపోతోంది. ఒకసారి వింటే నా బుర్రలోకి క్లీన్‍గా ఎక్కుతుంది గనుక పెద్దగా ‘రుబ్బక’పోయినా నాకు ఎనభైలు దాటే మార్కులు వచ్చేవి. మా కాలేజీ లైబ్రరీ చాలా పెద్దది. పుస్తకాలకు కొదవ లేదు.

అప్పుడప్పుడూ అభిలాష్ గుర్తుకొచ్చేవాడు గానీ, వాళ్ళ నాన్నకి నాగ్‍పూర్ ట్రాన్స్‌ఫర్ కావడంతో అక్కడ వుంటూ చదువుకుంటున్నాడని విశ్వం గారు (లైబ్రేరియన్) ఓసారి చెప్పారు. రహీమాకి హిందీ, ఉర్దూ బాగా వొచ్చు. ఇంట్లో అరబిక్ మాట్లాడుతారట. వాళ్ళది బిజినెస్ కుటుంబం. ఆ పిల్ల కూడా బాగా మాటకారీ, మంచిదీ. నాకు హిందీ పాటల అర్థాలు విడమరిచి చెప్పేది. దాంతో నా దృష్టి హిందీ పాటల మీదకి మళ్ళింది. టీవీలో మ్యూజిక్ ఛానల్స్ పెట్టుకుని ‘ఎక్స్‌ప్రెషన్స్’ని గమనించేదాన్ని. పాటని అనుభవిస్తూ పాడటం మెల్లగా అలవాటైంది. ఎక్స్‌ప్రెషన్ లేని పాట ఉప్పు లేని పప్పు లాంటిదని అర్థమైంది.

మా కాలేజీ పక్కనించే బందరు కాలవ. అది నిండుగా ప్రవహించేటప్పుడు వంతెన మీద నించి చూడడం నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌తో చాలా సేపు ఆ వంతెన మీద గడిపేదాన్ని. ఆ వొడ్డునా యీ ఒడ్డునా వున్న చెట్లు చేమలన్నా నాకు మహా ఇష్టం. నీటిని పూర్తిగా పీల్చుకుని అవి బలిష్టంగా పెరిగాయి. వాటి మీద పక్షుల గూళ్ళు. ఉదయం, సాయంకాలం ఆ పక్షుల అరుపులు.. రెక్కల టపటపలు వింటుంటే భలే వుండేది. ఓ రోజెందుకో నేను ఒక్కదాన్నే వంతెన మీద నిలబడి కాలువలో పారుతున్న నీళ్ళని చూస్తున్నాను.

“మీ ఫ్రెండ్స్ రాలేదా?” హరగోపాల్ గొంతు విని పక్కకి చూశాను. “ఊహూ.. రాలేదు” అన్నాను.

“మీరు బాగా పాడుతారుటగా?” అతను నవ్వి అడిగాడు. అంత దగ్గరగా అప్పటి వరకూ ఏ మగాడూ నిలబడలేదు.

“పాడడం వరకూ నిజమే.. బాగా పాడటం సంగతి నాకు తెలీదు. అయినా ఎవరు చెప్పారూ?” అడిగాను.

“రహీమా. రహీమా వాళ్ళు నాకు బాగా తెలుసు. మా పెద్దన్నయ్యా, వాళ్ళ పెద్దన్నయ్యా క్లాస్‌మేట్స్. మంచి స్నేహితులు కూడా!”

“అలాగా.. పరిచయాల రోజున మీరు చెప్పారుగా.. పాటడం అంటే ఇష్టం అని!” నేనూ మొహమాటం లేకుండానే అన్నాను. సామాన్యంగా ఆ వయసులో ఆడపిల్లలు కాస్త సిగ్గుపడటం, పైట సద్దుకోవడం లాంటి చేష్టలు చేస్తుంటారు. నాకా అలవాట్లు లేవు. కొందరితో మాట్లాడినప్పుడు ఫ్రీగా మాట్లాడాలనిపిస్తుంది. కొందరితో ఆ స్వేచ్ఛ తీసుకోవాలనిపించదు. హరగోపాల్ దగ్గర నాకెందుకో స్వేచ్ఛగా మాట్లాడాలనిపించింది.

“బాగా గుర్తు పెట్టుకున్నారే. నేను ఇంకోటి కూడా చెప్పాను. వినటం ఇంకా ఇష్టమని!” తనూ ‘కొత్త’ లేకుండానే మాట్లాడాడు.

“అంటే?” నవ్వాను.

“మీరు పాడితే వినాలని!” సిన్సియర్‍గా అన్నాడు.

“చూద్దాం! సందర్భం రావాలిగా!” బయల్దేరాను.

“వీలున్నంత త్వరలో ఆ సందర్భం వస్తుందని ఆశిద్దాం..” తనూ బయల్దేరాడు. వంతెన దాటాక అతని దారిన అతను వెళుతూ, “మాట్లాడినందుకు థాంక్స్” అన్నాడు.

‘అదీ మర్యాద అంటే’ అనుకున్నాను. ఎందుకో, అతను పాడితే వినాలని నాకూ అనిపించింది.

***

“ఏమిటీ.. నిన్ను నువ్వూ హరగోపాలూ వంతెన మీద చక్కెర్లు కొట్టారటా?” బోలెడు ఈర్ష్యతోనూ కొంచెం కుతూహలంతోనూ అడిగింది వందన. అందర్నీ వెక్కిరింతగానూ, వెటకారంగాను మాట్లాడుతుందని మేము ఆ అమ్మాయికి దూరంగా వుంటాం.

స్నేహ పరిమళాలు వెదజల్లే సుగంధ అగరబత్తీలు కొన్ని వుంటే, ఇతరుల్ని ఎప్పుడూ హేళన చేస్తూ విమర్శించే దుర్గంధ అగరబత్తీలు కొన్ని వుంటాయి. ‘వందన’ అన్న మంచి పేరు వుండి కూడా యీ అమ్మాయి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో మాకు తెలిసేది కాదు.

“అలాగా..! ఎన్ని చక్కర్లు కొట్టాంట?” కామ్‍గా నవ్వి అన్నాను.

“లవ్‍లో పడ్డారా?” అదే వెటకారం.

అసలు మాకు పెద్దగా మాటలు కూడా వుండేవి కాదు. ఇంత లిబర్టీ పోనీ, చనువు తీసుకుని అడగటం నాకు నిజంగా కోపం తెప్పించింది.

“కాలవలో మాత్రం పడలేదు. లవ్‍లో పడటం లాంటివి అనుకున్నప్పుడు మాత్రం నీ పర్మిషన్ తీసుకునే పడతా. సరేనా వందనొదినా..!” కావాలనే పకపకా నవ్వి నా దారిన నేనొచ్చా.

అమ్మలక్కల్లా అనవసరంగా ఇతర్ల విషయాల్లో దూరేవాళ్లని మా కర్రావురి ఉప్పలపాడులో ‘వదినా’ అని పిలిచేవాళ్ళం.. కాస్త ఎగతాళిగా. వందన మొహం మాడిపోయి వుండాలి. చూళ్ళేదు. నేను వెంటనే వచ్చేశాగా.

మరుసటి రోజున కాలేజీ గోడల మీద ‘హరగోపాల్+మహతి=లవ్ టు ద పవర్ ఆఫ్ లస్ట్!’ అని రాసి వుంది.

నేనేమీ పట్టించుకోలేదు గానీ నా ఫ్రెండ్స్ అందరూ బాధపడి ఆ రాతల్ని చెరిపేశారు.

“సారీ మహతీ.. నేను చనువు తీసుకుని మాట్లాడ్డం పొరపాటయిందనుకుంటా..!” మా ఫ్రెండ్స్ ముందరే నిలబడి హరగోపాల్ అన్నాడు.

“మీరేం వర్రీ కావక్కర్లేదు.. నేనేమీ ఫీల్ కాను. ఆఫ్ట్రాల్ ఇదో పిరికిపంద పని..!” నవ్వి అన్నాను. అతని ‘సారీ’, దానికి నా జవాబూ వందన విన్నదని నాకు తెలుసు.

కానీ, జనాలు ప్రవర్తించే విధానం వేరు. ఆ రోజు నించీ నా వంకా, హరగోపాల్ వంకా ఓ క్యూరియాసిటీతో చూస్తున్నారని బాగా అర్థమైంది. అందరూ విద్యార్థులే.. అందరూ స్వేచ్ఛని కోరుకునేవాళ్ళే.. కానీ ‘స్వేచ్ఛ’ పరిధి ఎంతో, ఏమిటో తెలీనివాళు. అందుకే వాళ్ళని చూసి, నాకేం కోపం రాలేదు.

‘ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటావో నువ్వు ఇతరుల పట్ల అలా ప్రవర్తించు’ అనే విషయాన్ని నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చెప్పారు. మా తాతయ్యా, అమ్మమ్మా అదే విషయాన్ని ప్రాక్టికల్‍గా చూపించేవారు. పాలేళ్ళని కూడా ఏనాడూ తక్కువగా చూసేవారు కాదు.

మా ప్రిన్సిపాల్ గారు చాలా మంచి మనిషి. హుందాగా వుంటారు. చాలా చక్కగా బోధించేవారు. ఏ విషయం గురించి ప్రసంగించినా తప్పనిసరిగా అందరికీ అర్థమయ్యేలా ఓ ఉదాహరణ ఇచ్చేవారు. అవ్వాళ ఆయన పుట్టినరోజని తెలిసింది. అందరం గబగబా డబ్బులు పోగు చేసి మాంఛి పూలదండా, స్వీట్ పేకెటూ, ఓ చక్కని గౌతమ బుద్ధుడి లోహపు బొమ్మ తెప్పించాం.

మా క్లాస్ రూమ్‍ లోనే ఆయన్ని అందరం గౌరవించాం. కేక్ కట్ చేయించి హేపీ బర్త్ డే పాట పాడాం. ఆయన చాలా ఆనందించి, “పుట్టిన ఇన్నేళ్ళకి మొదటిసారి కేక్ కట్ చేశాను పిల్లలూ..” అన్నారు. ఈ మొత్తం ఐడియా తిరుమలరావుది. ఇంత మంది ఐడియా ఇచ్చి కార్యక్రమాన్ని బాగా నడిపినందుకు తిరుమలరావుని అందరం అభినందించాం. అతను నవ్వి వూరుకున్నాడు – తన గొప్ప ఏదీ లేదన్నట్టు.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి. హేపీ బర్త్ డే పాట అయ్యాకా, హరగోపాల్ అందర్నీ వుద్దేశించి, “నా తరఫు నించి మన ప్రిన్సిపాల్ గారికో చిన్న స్వర పుష్పం” అని ‘బార్ బార్ దిన్ యే ఆయే బార్ బార్ దిల్ యే గాయె.. తూ జియో హజారోం సాల్’ అనే హిందీ పాట పాడాడు. అద్భుతం అనే పదం ఆ పాట ముందు చాలా తక్కువ అని చెప్పొచ్చు. ‘చప్పట్లు’ మారుమ్రోగిపోయాయి. అతను పాడతాడని అందరికీ తెలిసినా, ఇంత అద్భుతంగా పాడతాడని ఆ రోజే తెలిసింది.

“మీరెంత గొప్పగా పాడారంటే – చెప్పడానికి సరైన మాటలు లేవు..!” మనస్ఫూర్తిగా షేక్‍హ్యాండ్ ఇచ్చి అతనితో అన్నాను. అంతా సద్దుమణిగాక, వందన వెటకారంగా, “ఏం మహతీ పాణిగ్రహణమా?” అంది.

“పాణిగ్రహణం సంగతి పక్కన పెట్టు. గ్రహణం మాత్రం కొన్ని మనసులకి ఎప్పుడూ పట్టే వుంటుంది. ‘విడుపు’ అనేది బహుశా వుండదేమో..!” నేనూ వెటకారంగానే అన్నాను.

రాయికి జవాబు రాయే.

మూతి ముప్ఫై వంకర్లు తిప్పి చక్కాపోయింది.

అసలెందుకీ అమ్మాయి ఇలాంటి వాగుడు వాగుతుందో అర్థం కాలేదు. ఎప్పుడూ ఏదో విధంగా ఓ మాట అని ఇతరులని హేళన చెయ్యడమే. తను అనే మాట ఎదుటివాళ్ళకి ఎంత బాధ కలిగిస్తుందో ఎందుకు ఆలోచించదూ?

నిజం చెబితే ఆ అమ్మాయికి ఒక్కరు కూడా స్నేహితులు లేరు. ఎందుకంటారూ?”

***

ఒక రచయితో రచయిత్రో అయితే ‘ఇంటర్’ రెండేళ్ళనీ వదిలేసేవాళ్లు. లేకపోతే, ఓ రెండొందల పేజీలు వర్ణించేవాళ్ళు. అదేమిటనా? నా ఉద్దేశంలో దీన్ని తీసుకున్నా – వదిలేసినా పెద్ద తేడా వుంటుందని కాదు. కాలేజీకి వెళ్ళే ముందు ఇక్కడ నేర్చుకునేది చాలా వుందని.

‘అఖిల’ నా క్లాస్‍మేట్. చాలా అందగత్తె. దగ్గరికెళ్తే కంపు. కారణం ఏమంటే చంకల్లో చెమట. నోటి నుంచి వెల్లుల్లి కంపు. మనిషి ఎంత అందంగా వుంటేనేమీ? పౌడర్లూ, స్నోలూ అన్నీ మొహానికే. శరీరంలో మిగతా భాగాలు కూడా వున్నాయిగా..!

స్నానం అవగానే వెంటనే బాడీ, జాకెట్టూ వేసుకోకుండా రెండు నిముషాలు తడి ఆరేదాకా ఫేన్ కింద చేతులు పైకెత్తి నిలబడాలనీ, ఆరాకా, లైట్‍గా ‘యుడికొలోన్’ రాసి, ఓ క్షణం తరవాతనే ఏ ‘నైసిల్’ పౌడరో చాలా పల్చగా జల్లితే చెమట కంపు రాదనీ మా అమ్మ చెప్పింది. అలాగే పాదాల పరిశుభ్రత గురించీ, గోళ్ళు ఎప్పటికప్పుడు ట్రిప్ చెయ్యటం గురించీ మా అమ్మ చెప్పింది.

ఆమె ఎంత ముందు చూపుతో యీ చిన్న చిన్న విషయాలు దగ్గరుండి నేర్పిందో, వాటి వల్ల ఎంత మంచి జరుగుతుందో ‘అఖిల’ దగ్గర నిలబడ్డాక తెలిసింది. ఒక అఖిల ఏమిటీ, చాలామంది ఆడపిల్లలకి శరీరాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో తల్లిదండ్రులు నేర్పరు అనుకుంటాను. ‘నీతులు’ అయితే బోలెడు నేర్పుతారు. నోటి దుర్వాసనకి మందు మంచి డాక్టర్ సలహా తీసుకోవడం; తగిన టూత్ పేస్ట్ వాడటమే కాక, ఓ చిన్న లవంగం ముక్క నోట్లో వేసుకుంటే సమస్య సాల్వ్ అవుతుంది కదా.!

ఓ రోజున అఖిలని విడిగా తీసికెళ్ళి చెప్పాను. “నువ్వేం నా అందం చూసి కుళ్ళుకుని చావక్కర్లేదు. ఏమిటీ చెడ కంపు కొడుతున్నానా?? మరోసారి ఎత్తావంటే మర్యాద దక్కదు -” ఏదేదో కోపంగా అంటూ విసవిసా వెళ్ళిపోయింది. ‘మంచి’ కూడా ‘మనస్తత్వాల్ని’ బట్టే చెప్పాలని ఆ రోజున అర్థమయింది.

క్లాసులూ పాఠాలూ షికార్లూ లాంటివి పక్కన పెడితే, అసలు మంచీ చెడూ నేర్చుకునే వయసు ఇంటర్ వయసులోనే. చెడుకి చాలా ఎట్రాక్ట్ అయ్యే వయసది. చిన్నప్పట్నించీ పుస్తకాలు తెగ చదవటం వల్లా, మా అమ్మానాన్నలే కాక తాతయ్యా అమ్మమ్మల చక్కని సమయోచిత శిక్షణ వల్ల నేను కొంత అవగాహన పెంచుకోగలిగాను గానీ, లేకపోతే ఎంత ఫూలిష్‌గా గడిచేదో తలచుకుంటేనే ఒళ్ళు  గగుర్పొడుస్తుంది.

ఓ రోజున అనంతలక్ష్మి నన్ను దూరంగా తీసికెళ్ళి, “మహీ.. ఎవడో నాకు లవ్ లెటర్ రాశాడే” అని భయం భయంగా చెప్పింది.

నేను నవ్వేసి “ఏం రాశాడే?” అనడిగాను.

“నీకు నవ్వుతాలుగానే వుంటుంది. నాకు మాత్రం ఏడుపు తన్నుకొస్తోంది!” అని లాకర్ లోంచి (జాకెట్లోంచి అన్నమాట) ఓ ఉత్తరం తీసి ఇచ్చింది.

ఆ కాయితాన్ని చూస్తూనే పకపకా నవ్వేశా. వెధవ.. ఏ చెల్లెలి నోటు బుక్కులోంచో తమ్ముడి నోటు బుక్కు లోంచో చింపిన కాయితం అది. ‘మేథ్స్’ నోట్ బుక్ లోది.

“వెధవన్నర వెధవ.. కాస్త మంచి కాయితం వాడి చావొచ్చుగా..” అని ఉత్తరాన్ని చదివాను. “అనంతా నువ్వంటే నాకు ప్రేమ. ఎంతంటే నీ కోసం చచ్చిపోయేంత. నీ బుగ్గలు బూరెలు. నీ పెదవులు దొండపళ్ళు.. నీ వీపు మైసూర్ శాండిల్ సోపు.. etc.. etc.. etc..!!” చివర్న ఇట్లు ‘నీ ప్రేమికుడు’ అని వుంది. చెప్పడానికి బాగోదేమోగానీ ‘షేపు’ల గురించి కూడా వెధవ వర్ణించాడు. ఎంత చీప్‍గా అంటే, “లవ్ లెటర్ రాయడం కూడా రాదుట్రా కుక్కా” అని చావబాదాలనిపించేంత.

“ఒసే అనంతా.. యీ దిక్కుమాలిన వెధవ వుత్తి నోటి దురద గాడు. అందుకే యీ సన్నాసి ఉత్తరం రాసి చేతి దురద తీర్చుకున్నాడు. వీడి సంగతి నేను తేలుస్తాలే పద” అన్నాను.

“ఏం చేస్తావే?” అంది కంగారుగా.

“చూస్తావుగా..!” అని నవ్వి క్లాస్ రూమ్‍ లోకి నడిచాను.

మా మాస్టారు (సారీ స్కూల్ అలవాటింకా వదల్లేదు) రాగానే లేచి నిలబడి, “సార్ మన క్లాసులోని ఓ అబ్బాయి ఓ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. ఆ ఉత్తరం ఎవరు రాశారో కనుక్కోవడం రెండు నిముషాల పని. ఎందుకంటే, మా మామయ్య CBI లో పని చేస్తున్నారు. పట్టుకోగానే ప్రిన్సిపాల్ గారికి అప్పజెపితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇది ప్రేమించే వయసో కాదో నాకు తెలియదు గానీ పెళ్ళాడే వయసు మాత్రం కాదు. చదువుకోవలసిన సమయంలో ఇలాంటి పిచ్చి వుత్తరాలు రాస్తూ సమయం వృథా చేసుకోవద్దని అందరికీ మనవి చేస్తున్నాను. ఒకవేళ మా ఆడపిల్లల ‘మనవి’ని నిర్లక్ష్యం చేసి మరో వుత్తరం గనక వస్తే చాలా కఠినమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. యీ ఉత్తరాన్ని పదిలంగా ఉంచుతాం. మరో ప్రయత్నం చేస్తే మాత్రం క్షమించం. సార్, ఇలా మాట్లాడుతున్నందుకు మీరు అన్యథా భావించరాదని మనవి. నమస్తే” అని కూర్చున్నా.

అదేమీ అంత గొప్ప వుపన్యాసం కాదు. ఆ వయసులో ఆ మాత్రం చెప్పగలగటం మాత్రం ధైర్యమే. భయపడ్డారో, రియలైజ్ అయ్యారో గానీ అనంతలక్ష్మికి మాత్రం ఉత్తరాల బెడద తప్పింది. ఫస్ట్ యియర్ అయిపోయింది. బోలెడు అర్థాలూ అపార్థాలూ కలవడాలూ విడిపోవడాలూ విద్యార్థుల్లో చోటు చేసుకున్నాయి.

పరీక్షలు ఇంకో పదిహేను రోజులున్నాయనగా ఓ రోజున మా ఇంగ్లీష్ సార్ రిలాక్స్‌డ్‌గా “ఇవ్వాళ క్లాస్ వద్దు. సరదాగా గడుపుదాం” అన్నారు. దాంతో క్లాస్ రూమ్ వినోద ప్రదర్శన శాలగా మారింది. కొందరు మంచి జోక్స్ చెప్పి నవ్విస్తే కొందరు పాటలు పాడారు. హరగోపాల్ పాడాకా, అతని బలవంతం మీద మొదటిసారి నేను కాలేజీలో పాడాను. ‘ఆవో హుజూర్ తుమ్ కో బహారోం మే లే చలే’ అనే హిందీ పాట పాడాను. అది హీరోయిన్ ‘మందు’ కొట్టి పాడే పాట. అద్భుతమైన ట్యూన్ అండ్ లిరిక్స్. పాట అయ్యాక చప్పట్లే చప్పట్లు. ఆ తరవాత మరో మూడు పాటలు నా చేత పాడించే దాకా ఇటు స్టూడెంట్సూ, అటు మా ఇంగ్లీషు సారూ వూరుకోలేదు.

నేను ఇంటి వైపు వెళ్తుండగా బండి ఆపి “మీ గొంతు ఇంత స్వీట్‍గా, ఇంత ఎక్స్‌ప్రెసివ్‍గా వుంటుందని అనుకోలేదు. సింప్లీ మార్వలెస్” అని అభినందించాడు హరగోపాల్.

“సైకిలంటే ఇష్టమా?” అనడిగాను. అందరూ మోటర్ సైకిళ్ళో, టివిఎస్‍లో వాడుతుంటే హరగోపాల్ మాత్రం సైకిలే వాడతాడు.

“నాకు సైక్లింగ్ చాలా ఇష్టం.. హెల్త్‍కీ మంచిది..!” నవ్వాడు.

***

సెకండియర్ ఉత్సాహంగా మొదలైంది. యవ్వనపు శోభ వళ్ళంతా విస్తరిస్తూ వుండడంతో ఆడపిల్లలకు అదో రకమైన బిడియం, గర్వం లాంటివి వంటబట్టాయి. మొగపిల్లల చూపుల్లోనూ మాటల్లోనూ ‘తేడా’ స్పష్టంగా తెలుస్తోంది.

షార్ట్ నేమ్స్ వాడుక బాగా ఎక్కువైంది. అనంతలక్ష్మిని ‘అల’ అనీ, హరగోపాల్‍ని ‘హగ్గీ’ అనీ, తిరుమలరావుని ‘తిమ్మూ’ అనీ, రహీమాని ‘రహీ’ అనీ ఇట్లా అందరూ షార్ట్ చేసి పిలుస్తున్నారు. నా పేరు ‘మహతి’ అని ఎవ్వరూ పిలవడం లేదు. ‘మహీ’ అనే ఫిక్సైపోయింది.

“ఇంటర్ తరవాత ఏం చేయాలనుకుంటున్నావూ?” తిమ్మూ అడిగాడు నన్ను. అప్పుడు నేనూ, అల, రహీమా, ఉష అందరం కలిసే వున్నాం.

“లెక్చరర్ కావాలని నా కోరిక. కనక B.A.. తరవాత M.A. ఆ తరవాత పి.హెచ్.డీ!” చెప్పాను. “మరి నీకూ?” అడిగాను.

“డిగ్రీ వరకూ చదువుతాను. ఆ తరవాత ‘జర్నలిజం’లో స్పెషలైజ్ చేసి, ఆ తరవాత రచయితగా స్థిరపడాలని అనుకుంటున్నా” స్పష్టంగా అన్నాడు.

“రచయిత అంటే..?” అయోమయంగా మొహం పెట్టి అడిగింది ఉష.

“నవలలు కథలు వ్యాసాలు కవితలూ నాటకాలూ ఇట్లా సాహిత్యానికి సంబంధించిన అన్ని కోణాల్నీ స్పృశించదలచుకున్నాను. అంతే కాదు, సినిమాల్లోనూ కథ, డైలాగ్, పాటల రచయితగా ఎంటరవ్వాలని వుంది” డ్రీమీగా ఆకాశం వంక చూస్తూ అన్నాడు.

“వావ్.. అయితే నువ్వు సినిమాల్లోకి వెళ్ళాక ‘తిమ్మూ’ మా ఫ్రెండ్ అని మేం గర్వంగా చెప్పుకోవచ్చన్న మాట!” కరచాలనానికి చెయ్యి జాస్తూ అన్నది అల. ఎందుకోగాని అనంతలక్ష్మికి తిమ్మూ అంటే చాలా ఇష్టమేమో అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడూ యీ విషయం మా మధ్య రాలేదనుకోండి!

నా ఫ్రెండ్స్ అందరూ (ఆడామగా), చాలా సార్లు మా ఇంటికి వచ్చారు. మా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోవడంతో నా ఫ్రెండ్స్‌లో నా మీద ఇష్టం, గౌరవం ఇంకా పెరిగాయి.

చాలామంది పేరెంట్స్ పిల్లల స్నేహితుల్ని పెద్దగా పట్టించుకోరు సరికదా, ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళ కులమతాలే గాక స్టేటస్ కూడా ఎంక్వయిరీ చేస్తారు. అలాంటి ‘కూపీ’లు పిల్లల మనసుల్ని ఎంత బాధిస్తాయో పెద్దవాళ్ళకి తెలీదు.

అంతెందుకూ, మతో పాటు చదివే ‘మాన్య’ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళమ్మ మా అందరి కులాలూ అడిగింది. ఉన్నవాళ్ళని గొప్పగా చూడటం – లేని వాళ్ళని చిన్నచూపు చూడటం ఇవన్నీ పసి మనసులకి చాలా ఎఫెక్టు ఇస్తాయి.

“కులం గురించి అడిగితే తప్పేముందీ! సేమ్ కులం అయితే చుట్టరికం ఏవన్నా వుందేమో చూడటానికి అడుగుతారు గానీ, తప్పుగా ఎందుకు అనుకోవాలీ?” చిత్రంగా ‘తిమ్మూ’ మాన్య వాళ్ళ అమ్మగార్ని సమర్థించాడు.

నిజమేగా..! ప్రతిదాన్నీ ఎవరి దృష్టికి తోచినట్లు వాళ్ళు చూస్తారు.. అలా ఆలోచించడం ‘తిమ్మూ’ సంస్కారం.

(ఇంకా ఉంది)

Exit mobile version