(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[ఫాలాక్ష డ్రైవ్ చేస్తుంటే, అలకి నిద్ర వస్తుంది. కాసేపటి ఓ ఊళ్లో చిన్న హోటల్ దగ్గర ఆపి అలని లేపుతాడు. అందరూ టిఫిన్లు తింటారు. హోటల్ చిన్నదే అయినా పదార్థాలు రుచికరంగా ఉంటాయి. తినేసి బయల్దేరుతారు. హైదరాబాద్ సమీపిస్తుంటే, అలని లేపుతాడు ఫాలాక్ష. ముందు వాళ్ళ అక్క వాళ్ళింట్లో ఆగుదామని, ఫ్రెష్ అయి టిఫిన్లు తిన్నాకా, ఎక్కడ దింపమంటే అక్కడ దింపుతానని అంటాడు. తనకి అక్కడ ఎవరూ తెలియదని, ప్రొడక్షన్ వాళ్ళే బస ఏర్పాటు చేస్తారని అంటుంది అల. తన అక్కా వాళ్ళింటికి తీసుకువెళ్తాడు ఫాలాక్ష. అక్క కల్యాణి సాదరంగా ఆహ్వానిస్తుంది. అందరికీ చక్కని ఆతిథ్యం ఇస్తుంది. డబ్బింగ్ థియేటర్ వద్ద ప్రొడ్యూసర్ కొడుకూ, అతని మిత్రుడు ఇబ్బంది పెడితే అన్న సంశయం అలకి, సత్యమోహన్ గారికి కలుగుతుంది. వివరం తెలుసుకున్న ఫాలాక్ష ఆ సమస్యకి చక్కని పరిష్కారం చూపిస్తాడు. వాళ్ళ బావగారి మిత్రుడయిన ఐజిగారిని రమ్మందాం, ఆయన వెంట అల వెళితే, ఇక ఇబ్బంది ఉండదు అంటాడు. ముందు సత్యమోహన్, సదాశివరావు గార్లు వెళ్ళిపోతారు ఏర్పాటు చేయటానికి. ఆ రోజు అల హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. – ఇక చదవండి.]
మహతి-2 అల-7:
[dropcap]డ[/dropcap]బ్బింగ్ థియేటర్ లోకి నా ఎంట్రీ పరమాద్భుతంగా జరిగింది. ఐజి రాలేదు కానీ, వారి సెక్రటరీ వచ్చారు పూర్తి హంగుతో. ప్రొడ్యూసర్ కొడుకు మాజీ మంత్రి కొడుకూ ఓ రకం షాక్‌లో వున్నారు. ఎన్నాడూ లేనిది ‘మేడమ్’ అని సంబోధించడం మొదలెట్టారు. ఫాలాక్ష కల్యాణి గారి ‘బెంజ్’ కారులో నన్ను థియేటర్‌కి తీసుకొచ్చారు. మేమొచ్చిన పది నిముషాల్లో ఐజి గారి సెక్రటరీ గారి వెహికల్, సైరన్ మోగిస్తూ.
ప్రొడ్యూసర్ కొడుకు, మాజీ మంత్రి కొడుకు మాత్రమే కాదు; ఆవాళ ఓపెనింగ్‌కి వచ్చిన సర్రీ, చిత్రాణి, వసంత్ కుమార్, మణి గార్లు కూడా. మణి అయితే అయోమయంగా మొహం పెట్టాడు. అతను తమిళియన్ అని ముందే చెప్పాగా. యూనిట్ తోనే టచప్ కనక కూడా వచ్చింది. సెటిల్‌మెంట్ కాలేదు గదా.. అందుకని. ఒకవేళ సినిమాల్లో కంటిన్యూ అయితే కనకని కూడా నాతో వుంచేసుకుందామనుకున్నా.
స్క్రీన్ మీద సీన్‌ని జాగ్రత్తగా గమనిస్తూ, ఘాటింగ్‌లో చెప్పిన డైలాగ్స్‌ని, అదే ఎమోషన్‌లో సరైన సింక్‌లో చెప్పడమే డబ్బింగ్ అంటే. ఎందుకంటే, షూటింగ్‍లో అనేక శబ్దాలు రికార్డవుతాయి, కెమెరా శబ్దంతో సహా. అవన్నీ డబ్బింగ్ థియేటర్‍లో డబ్బింగ్ తరవాత తుడిచేస్తారు. అదో అద్భుతమైన అనుభవం. మొదటి రోజున సదాశివరావు గారూ, వసంత్ డబ్బింగ్ చెబుతుంటే, వారి నుంచి నాకు అవగాహన కలిగింది, ఎలా చెప్పాలో. చిత్రాణి అల్‌రెడీ ఎక్స్‌పర్టే. సర్రీకి కూడా కొద్దొ గొప్ప అనుభవం ఉంది. శ్రవణ్, నిశ్చల్ నిగమ్ కూడా నాతో పాటు డబ్బింగ్‌ని అబ్జర్వ్ చేశారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ రాజుని అడిగి నా సంభాషణల ఫైలు తెప్పించుకున్నా. డబ్బింగ్‌ని ఇంకా ఎఫెక్టివ్‌గా ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేయడానికి.
ఫాలాక్షకి అదంతా విచిత్రంగా అనిపించిందట. మొదట రోజు మధ్యాహ్నం నా వాయిస్ టెస్ట్ చేశారు. అఫ్‌కోర్స్ ఏ డైలాగ్ చెప్పాలో ముందుగానే ఇచ్చారు. ఆ సన్నివేశం నాకు చాలా బాగా గుర్తుంది కూడా. నిశ్చల్ నిగమ్‌తో ఓ లవ్ డైలాగ్. పిచ్చి ప్రేమతో చెప్పే డైలాగ్. అలాగే ఓ సీరియస్ డైలాగ్ కూడా ఇచ్చారు.
తొమ్మిదింటి దగ్గర్నుంచీ ఒంటి గంట వరకూ నా పని ఆ డైలాగ్స్‌ని రకరకాల మాడ్యులేషన్‍లో పునశ్చరణ చేసుకోవడమే. ఫాలాక్షని రిక్వెస్ట్ చేసి ఆ డైలాగ్స్‌ని రకరకాలుగా వినిపిస్తూ ఏది బెస్టో చెప్పమన్నాను. అన్నీ విని, “అలా.. మీరు ఎలా పలికినా ఆ ప్రేమ డైలాగ్ విన్న ఎవడైనా మీతో ఠక్కున ప్రేమలో పడతాడు. అలాగే ఆ సీరియస్ డైలాగ్ వింటే హడలి చస్తాడు” అన్నాడు.
నాకు చచ్చేంత సిగ్గు వచ్చినా, నా కాన్ఫిడెన్స్ వంద రెట్లు పెరిగింది. డబ్బింగ్ థియేటర్ పేరు ‘స్వరాలయ’.
చిత్రమేమిటంటే మేము డబ్బింగ్ చెప్పేటప్పుడే సంగీత దర్శకులు వాసూరావు గారూ, డైరక్టర్ చింతలపూడి వెంకట్, శ్రీ ఎస్.వి. కృష్ణరెడ్డి గారూ వచ్చారట. నా వాయిస్ విని “వెరీ స్వీట్ వాయిస్.. కలవమనండి” అని సత్యమోహన్ గారితో చెప్పారట. ఏనుగెక్కినంత సంతోషపడ్డా. ఫాలాక్ష అయితే, “నాతో చెప్పిన దానికంటే వంద రెట్లు తియ్యగా, అద్భుతంగా చెప్పారు” అని మెచ్చుకున్నారు.
“వెరీ హేపీ అనంతా.. అలవోకగా అద్భుతంగా చెప్పావు. నీకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలేమో అని భయపడ్డాను. You did an excellent job” అన్నారు సత్యమోహన్, వసంత్.
శ్రవణ్ వాయిస్ ఓకె అయింది గానీ నిశ్చల్ నిగమ్ వాయిస్ అతని పర్సనాలిటీ ముందు తేలిపోయింది. సౌండ్ ఇంజనీర్ ఎంత బేస్ పెంచినా మేచ్ కాలేదు.
రెండో రోజుకల్లా నటీనటులందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తింది. స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటుంటే పిచ్చెక్కింది. సినిమా నిజంగా ఓ మాయలాంటిదే. లేకపోతే తిమ్మూని ప్రేమించి కర్కశంగా బిహేవ్ చేసిన నేనేమిటీ, అప్సరసలా అపర ఝాన్సీలా కనిపించే తెర మీద అనంత ఏమిటి? నాకు ఆనందంతో ఏడుపొచ్చింది. ఫాలాక్ష అదే మాట అన్నాడు – “అలాజీ.. కన్ను చూడని లక్ష అందాల్ని కెమెరా కన్ను పట్టుకోగలదు. మిమ్మల్ని మామూలుగా చూశాం. తెరమీద చూస్తుంటే ఈమేనా బేలగా కార్లో కూర్చున్న ఆ అల అని ఆశ్చర్యం వేస్తోంది.. ఓ.. అన్‌బిలీవబుల్ బ్యూటీ..” అని.
ప్రొడ్యూసరు కొడుకు ఆల్‌మోస్ట్ చాలా విధేయుడయ్యాడు. దానికి కారణం ఫాలాక్ష పర్సనాలిటీ కూడా. అతని ముందు ప్రొడ్యూసర్ కొడుకు, మాజీ మంత్రి కొడుకు పిట్టల్లా ఉంటారు. ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా అప్పుడుప్పుడు మనుష్యుల్ని ‘విధేయులు’గా మారుస్తుందేమో !
సినిమాని ముక్కలు ముక్కలుగా తీస్తారు. తరువాత అతుకుతారు. డబ్బింగూ కొంచెం అలానే. నా పాత్రకి డబ్బింగంతా నా చేతనే చెప్పించడానికి టోటల్ వారం పట్టింది. “నువ్వు చాలా ఫాస్ట్ లెర్నర్‌వి. అందుకే అంత త్వరగా చెప్పగలిగావు. చాలా మంది కనీసం పదిరోజుకి పైగా తీసుకుంటారు. వేరీ గుడ్ అండ్ హ్యాపీ” అన్నారు నాతో డబ్బింగ్ మొత్తం చెప్పించిన వసంత్ గారు.
డబ్బింగ్‌లో ఒకొక్కరికే డబ్బింగ్ చెప్పాలి. హోటళ్ళు, బజార్లు సీన్స్ వచ్చినప్పుడు గ్రూప్‌తో చెప్పిస్తారు. కొత్త వాళ్ళందరినీ జస్ట్ ట్రయిల్ వేసి చూస్తారు. వాయిస్ బాగోలేకపోయినా, మేచ్ కాకపోయినా వేరే వాళ్ళతో చెప్పిస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులు. శ్రీనివాసమూర్తి లాంటి వారు top కళాకారులు. వాళ్ళు పెద్ద పెద్ద హీరోలకే డబ్బింగ్ చెబుతారు. సాయికుమార్ వెరీ కాస్ట్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్. వెయ్యి సినిమాలకి పైగా డబ్బింగ్ చెప్పిన ఘనత శ్రీ ఘంటసాల రత్నకుమార్ గారిది. ఆయన మన అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారి రెండో కుమారుడు. డబ్బింగ్ ప్రక్రియ (ఇతర భాషల్లోంచి తెలుగులోకి) ప్రారంభించిన వారు శ్రీరంగం శ్రీనివాసరావుగారు. శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, పినిసెట్టి, అనిశెట్టి, సి.నా.రె, వేటూరి, సిరివెన్నెల, వెన్నెలకంటి, ఆఖరికి యీ నవలా రచయత కూడా డబ్బింగ్ చిత్రాలకు పాటలు వ్రాసినవారే. రాజశ్రీ గారు అనువాద చిత్రాల్లో కింగ్. ఆయన దాదాపు 850 పైగా డబ్బింగ్ చిత్రాలకు మాటలు పాటలు రాశారు. ఆ రోజుల్లో top dubbing writer. అంతే కాక 200 చిత్రాలు, అంటే, డైరెక్ట్ చిత్రాలకు పాటలు, మాటలు, కథలు + సంగీతం కూడా సమకూర్చారు.
‘కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా’ అని ఆయన వ్రాసిన వాన పాట (బుల్లెమ్మ బుల్లోడు సినిమా) సినిమా పాటల్లోనే చిరంజీవి. వాన పాటలు ఎవరు రాయలన్నా ఆత్రేయగారి ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’ పాట; రాజశ్రీ గారి ‘కురిసిందీ వానా’ అధ్యయనం చేసి తీరాల్సిందే (నేను కూడా చాలా చాలా వాన పాటలు వ్రాశా. వారి పాటలే గాక హిందీలో వచ్చాక ‘జిందగీ భర్ నహీ భూలేంగే ఓ బర్‌సాత్ కి రాత్’ కూడా నాకు స్ఫూర్తినిచ్చింది – భువనచంద్ర). రాజశ్రీ గారి కుమారుడు చి. రాజశ్రీ సుధాకర్ గారు కూడా రాజశ్రీ గారి లానే అత్యంత ప్రతిభావంతుడు. సౌమ్యుడు. వారు కూడా 300 చిత్రాలకు పైగా డబ్బింగ్ చిత్రాలకు సంభాషణలు, పాటలు అందించారు. వసంత కుమార్ గారు ఓ ప్రముఖ డబ్బింగ్ రచయిత.
రాజశ్రీగారి డబ్బింగ్ చిత్రాల సంఖ్య 850 దాటితే, ఆ తర్వాత ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలకి సంభాషణలు మాటలు సమకూర్చింది వెన్నెలకంటి రాజశ్వర ప్రసాద్ గారు. వారి అబ్బాయి శశాంక్ వెన్నెలకంటి కూడా దాదాపు 100 చిత్రాలకు సంభాషణలు అందిస్తే, రెండో కుమారుడు రాకేందు మౌళి డబ్బింగ్, స్ట్రయిట్ చిత్రలకు పాటలు మాటలు రాస్తున్నారు.
(వెన్నెలకంటిలా చాలా ఎక్కువ సినిమాలకి డబ్బింగ్ పాటలు రాసింది నేనేనని వినయంగా మనవి చేసుకుంటున్నాను – భువనచంద్ర).
ఈ విషయాలన్నీ ఎందుకంటే, డబ్బింగ్ స్వంత పాత్రకి సంభాషణలు చెప్పినా, ఇతరులు పోషించిన పాత్రలకు సంభాషణలు పలికినా అనేది ఓ సంక్లిష్టమైన ప్రక్రియ. లిప్ సింక్ (పెదవుల కలయిక) యాక్షన్ సింక్ (శారీరిక కదలికలు) మాత్రమే గాక యాక్షన్, యాక్షన్ మూడ్‌ని బట్టి సంభాషణలు పలకాలి. అంటే, ఎవరో పోషించిన పాత్రలోకి డబ్బింగ్ కళాకారుడు/కళాకారిణి పరకాయ ప్రవేశం చెయ్యాలన్న మాట. అదో అద్భుత ప్రపంచం. దాదాపు ప్రతి రోజూ నేను డబ్బింగ్‌కి వెళ్ళి ఎవరు డబ్బింగ్ చెబుతున్నా వారిని గమనించేదాన్ని.
మొదటి రెండు రోజులు ఫాలాక్ష డబ్బింగ్ దగ్గరకు వచ్చినా, మూడో రోజు మళ్ళీ ఆయన రాజమండ్రికి ఫ్లైట్‌లో వెళ్ళిపోయారు. కంపెనీ వారే రోజూ నన్ను మా ఇంటి దగ్గర్నుంచి, అంటే కళ్యాణి గారి ఇంటి నించి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అందరం ఓ కుటుంబంలా మారిపోయాము. నేను నటించానన్న విషయం పక్కన పెడితే, డబ్బింగ్ అవుతున్నప్పటి నించీ సీను సీనుకీ సినిమా అద్భుతంగా మారుతోంది. సినిమా తీసినప్పుడు కలిగిన ఫీలింగ్ వేరు. ప్రొడక్టు చూస్తున్నప్పుడు కలుగుతున్న ఆనందం వేరు. అది అందరిలోనూ గమనించా.
“అలా.. సినిమా రిలీజ్ అయ్యాక నీకు కనీసం అయిదారు ఆఫర్లు వస్తాయి, టాప్ హీరోస్‌తో” అన్నారు వసంత్. సదాశివరావుగారు ఆ మాటే అన్నారు. సత్యమోహన్ గారు భుజం తట్టి “నువ్వు నా సినిమాలో ఉండటం నా అదృష్టం అలా. నా నమ్మకం వమ్ము కాలేదు. నా తరవాత సినిమా కూడా నువ్వే చెయ్యాలి” అన్నారు.
ఓ కొత్త నటికి ఇంతకంటే ఇంకేం కావాలి. ఎంతమందితో చెప్పించినా నిశ్చల్ నిగమ్‍కి వాయిస్ సెట్ కాలేదు. అందువల్ల టాప్ డైలాగ్ అర్టిస్ట్ శ్రీనివాసమూర్తి గారిని హైద్రాబాదు పిలిపించి డబ్బింగ్ చెప్పించారు. అంతే.. నిశ్చల్ పాత్ర ఎక్కడికో ఎదిగిపోయింది. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ యాక్టర్‌ని ఎంత ఎలివేట్ చెయ్యగలరో అప్పుడు అర్థమయింది. నిజం చెబితే, నా డబ్బింగ్ కూడా నాకెంతో ముద్దొచ్చింది. కారణం, ఆ సమయంలో సావిత్రి, కన్నాంబ, కృష్ణకుమారి, జమున, జి.వరలక్ష్మి. వరలక్ష్మి వంటి వారి చిత్రాల్లో వారి మాడ్యూలేషన్స్ గమనినంచిడమే గాక. ఎన్నో హిందీ చిత్రాలలో వాయిస్ మాడ్యులేషన్స్ గమనించడం. భానుమతి లాంటి వాయిస్ అన్‌ఇమిటబుల్.
అప్పుడు అర్థమయింది. సాధన.. సాధన.. సాధన.. ఒక్కటి మాత్రమే విజయ శిఖరాల్ని అధిరోహింప చేయగలదని. అప్పటి దాకా నేను బావిలో కప్పలా ఓ చోట పడివున్నా. సినిమా నా అంతర్నేత్రాన్ని తెరిచింది. అందుకేనేమో సినిమా కళకారులూ, సాంకేతిక నిపుణులు, రచయితలు, దర్శకులూ అందరూ అమరులయ్యేది.
సినిమా ఫుల్ మూన్‌ని చూడగానే గుర్తుకొచ్చేది మార్కస్ బార్ట్లే గారే కదా. ట్రిక్ ఫోటోగ్రఫీ చూడగానే గుర్తుకొచ్చేది రవికాంత నగాయిచ్ గారే కదా. ఇక సింగర్స్ అంటే గాయనీ గాయకులు, కళాదర్శకులూ, మేకప్, అంటే రూప శిల్పులూ – ఎవ్వరినీ వదలకుండా అందర్నీ సినిమా అమరుల్ని చేసింది నృత్య కళాకారుల దాకా. సంగీత దర్శకులు, వాద్య నిపుణుల కథ మరో అద్భుతం. దశాబ్దాల, శతాబ్దాల పాటు గాయకుల, సంగీత దర్శకుల పేర్లు ప్రజల గళాల్లో జీవించే ఉంటాయి.
జరుగుతున్నదంతా ఏ రోజుకా రోజు మహతికి ఫోన్ చేసి చెబుతున్నా. కళ్యాణి గారైతే మా అమ్మకంటే ఎక్కవగా నన్ను చూసుకోవడమే కాదు. ఏ రోజు కారోజు అన్న విషయాలు కనుక్కుంటూ నన్ను ఉత్సాహపరుస్తున్నారు. నేను మరో నిర్ణయం కూడా తీసుకున్నా. సినిమా అయిన వెంటనే కళ్యాణిగారి నించి వంట నేర్చుకోవాలని. పిల్లలు దూరంగా వుండటంతో ఆవిడ నన్ను అత్యంత ప్రేమతో ఆదరణతో ఆప్యాయతతో చూస్తున్నారు. ఏనాటి బంధమో. ఫాలాక్ష రోజుకో సారి అయినా ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటున్నాడు.
మరో మూహుర్తం పెట్టారు. రీరికార్డింగ్‌కి మూహుర్తం. సంగీత దర్శకులు సాలూరి వాసురావుగారు. వారు ది గ్రేట్ సంగీత దిగ్గజం సాలూరి రాజేశ్వరరావుగారి కుమారులు. వీరి సోదరులే శ్రీ కోటిగారు. వాసురావు గారు గ్రేట్ గిటారిస్ట్. 30 మంది సంగీత దర్శకుల దగ్గర క్షణం తీరిక లేకుండా పని చేసేవారు. వారిని సినీ దర్శకులు నిర్మాత శ్రీ విజయ బాపినీయుడు గారు సంగీత దర్శకులుగా పరిచయం చేశారు ‘పోలీస్ ఆఫీసర్’ సినిమాతో. సినిమాలకే కాక వేలాది టివి ఎపిసోడ్స్, సీరియల్స్‌కి వాసురావు గారు సంగీతం సమకూర్చారు.
ఎంతో మంది యువ గాయనీ గాయకుల్ని, రచయితల్ని, వాద్యకళాకారుల్ని సినిమా ఫీల్డుకి పరిచయం చేశారు. (వారి సంగీత దర్శకత్వంలోనే ‘నేను’ అనగా భువచంద్రని పాటలు వ్రాశాను. నన్ను పరిచయం చేసింది కూడా శ్రీ విజయ బాపినీయుడుగారే. సినిమా పేరు ‘నాకు పెళ్ళాం కావాలి’).
వాసూరావు గారు చాలా ఫాస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. 5 పాటలని ఒక్క పూటలో కంపోజ్ చేశారు. అప్పుడు నేను లేను. కానీ, పాటలు అద్భుతంగా కంపోజ్ చేసారు. ఆ అయిదింట్లో నాలుగు పాటల్లో నేనున్నాను. వాసురావు గార్ని నేను చూడటం రీరికార్డింగ్ లోనే.
డబ్బింగ్ అయిపోయాకా సౌండ్ ట్రాక్‍లో డైలాగ్స్ మాత్రం ఉంటాయి. రీరికార్డింగ్ అన్నది ఓ అద్భుతమైన శబ్ద ప్రక్రియ. ప్రతి సన్నివేశాన్ని ఒకటి పది సార్లు చూసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (B.G.M) కంపోజ్ చేస్తారు. ఒకేసారి 30, 40 మంది వాద్యకళాకారులు అంతులేని ఏకాగ్రతతో క్రమశిక్షణతో మ్యూజిక్ వాయిస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. సంగీత సరస్వతి ఆనంద తాండవమాడుతున్నదా అని మనసు పులకరించిపోతుంది. న్యాయంగా అయితే నటీనటులకి రీరికార్డింగ్‌తో పని లేదు. ఆ పని సంగీత దర్శకుడూ, దర్శకుడూ చూసుకుంటారు. సౌండ్ ఇంజనీర్ సంగతి సరే సరి. నేను మాత్రం క్యూరియాసిటీతో వెళ్ళాను. అన్నీ తెలుసుకోవాలనే తపన నన్ను ఇంటి వద్ద ఖాళీగా వుంచలేదు.
“అలా.. నీకు డైరెక్షన్ చెయ్యాలని ఏమన్నా కోరికగా వుందా?” అనడిగింది సర్రీ. నేను నవ్వి “జీవితంలో ఆ పని మాత్రం చెయ్యదలచుకోలేదు. రీరికార్డింగ్ ప్రాసెస్ చూసేటప్పుడు మాత్రం ఖచ్ఛితంగా అనిపించింది, ఏ సీన్‌లో ఏ ఎక్స్‌ప్రెషన్ ఎంత సేపు ఇవ్వాలో మానసికంగా నిర్ణయించుకుని అమలు చేస్తే రీరికార్డింగ్‌తో మన కేరక్టర్ అద్భుతంగా ఎలివేట్ అవుతుందని” అన్నాను. ఆ ఆలోచన రీరికార్డింగ్‌లో నన్ను నేను చూసుకున్నప్పుడే కలిగింది.
రీరికార్డింగ్ లేని సినిమా ఇంపాక్ట్ 40% అయితే రీరికార్డింగ్ అయ్యాక దాని ఇంపాక్ట్ 98% అవుతుంది. రీరికార్డింగ్ అనేది అంత ముఖ్యం సినిమాకి.
మ్యూజిక్ డైరెక్టర్ నోట్స్ చెబితే మ్యూజిషియన్స్ నోట్స్ రాసుకోవడం, కొద్ది నిముషాల్లోనే అద్భుతంగా ప్రాక్టీస్ చేసి ‘టేక్’కి సిద్ధమవడం చూసి, అక్కడ వున్నవారు యుద్ధంలో పాల్గొంటున్న సైనికులుగా కనిపించారు. ఏమి ఏకాగ్రత.. ఎంత క్రమశిక్షణ. ఒక్క ‘నోట్’ కూడా తప్పు లేకుండా వాయించాలంటే ఎంత ప్రజ్ఞ, నిష్ఠ అవసరమో!
8 రోజుల్లో ‘ధీర’ రీరికార్డింగ్ పూర్తి చేసుకుంది. చిత్రం ఏమంటే, ధీర సినిమా నభూతో నభవిష్యతిగా ఉందని వాద్యకళాకారులు ప్రశంసించడం, ఆ ప్రసంశ చిత్ర పరిశ్రమలో వైరెల్ అవడం, సినిమాకి బ్రహాండమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. బయర్లు, ఎగ్జిబిటర్లు క్యూ కట్టారు. ఇది దర్శక నిర్మాతలు ఊహించని పరిణామం.
చాలా పెద్ద మొత్తానికి ‘అంజాన్ పిలిమ్స్’ వారు ఆఫర్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ అటు వైపు ఊగినా సత్యమోహన్ గారు స్థిరంగా ఉన్నారు. ఫస్ట్ కాపీ చూసి డిసైడ్ చేద్దామన్నారు. అంతా బాగానే వున్నా అందరిలోనూ ఏదో బెరుకు. అది సక్సెస్ అయితే అందరి జీవితాలూ అద్భుతంగా వుంటాయి. శ్రీలలితా ఫిలిమ్స్ వారు అంజన్ ఫిలిమ్స్ కంటే అయిదు రెట్లు ఎక్కువ ఆఫరిచ్చారు. సత్యమోహన్ గారు ఓకే అన్నారు. కారణం లలితా పిక్చర్స్ వారికి దాదాపు 300 థియేటర్స్ ఉండడమే (లీజుకి తీసుకున్నవీ, స్వంతవీ).
సినిమాకి పని చేసిన కళాకారుల్ని సాంకేతిక నిపుణుల్ని అందర్ని సగౌరవంగా పిలిచి ‘లక్కి’ థియోటర్లో ప్రివ్యూ వేశారు. ఆ ప్రివ్యూ కోసం మహతి, సురేన్, ఫాలాక్ష, కల్యాణి, మా అమ్మానాన్నగార్లని ప్రత్యేకంగా నేను పిలిపించుకున్నాను.
థియేటర్‍లో కొత్త పరిచయం ‘అల’ (అనంతలక్ష్మి) అని చూసుకోగానే నా కళ్ళు ఆనందంతో వర్షించడం మొదలెట్టాయి. నేను నేనుగా కాక, పాత్రలో లీనమైపోయాను. చప్పట్లు, హర్షధ్వానాలు కౌగిలింతలు, ముద్దులు, కేకలు అరుపులు మధ్య సడన్‌గా లోకంలోకి వచ్చా. “అలా.. యూ ఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్” అని కౌగిలించుకుంది మహతి. మా అమ్మ ఏడుస్తూంది.
హాల్ నుంచి బయటకి వచ్చాక గంట పట్టింది కారు ఎక్కడానికి. ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ కొడుకు డోరు తీసి నిలబడ్డారు. సత్యమోహన్ “థాంక్యూ” అన్నారు గాద్గదికంగా. రెండు గంటల్లో “ఓ నవతార సినీ వినీలాకాశంలో మెరిసింది. ఆమె పేరు అల” అని ‘చిత్రలోకం’ ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయిందని వసంత్ ఫోన్ చేసి చెప్పారు. నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. నా మౌనాన్ని అర్థం చేసుకున్న మహతి, “అలా.. ఇది కేవలం బిగినింగ్” అని నవ్వింది.
(ఇంకా ఉంది)