Site icon Sanchika

మహతి-22

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[‘ధీర’ సినిమా సూపర్ హిట్ అవుతుంది. నటీనటులందరికీ మంచి గుర్తింపు, మరిన్ని అవకాశాలు వస్తాయి. సత్యమోహన్ గారికి దర్శకుడిగా మూడు పెద్ద సినిమాల ఆఫర్స్ వస్తాయి. అలకి కూడా పెద్ద పెద్ద హీరోల సరసన ఎన్నో ఆఫర్లు వస్తాయి. ఎలాంటి వాటిని ఒప్పుకోవాలో, ఎలాంటివి తిరస్కరించాలో సదాశివరావు గారు అలకి వివరంగా చెబుతారు. కళ్యాణి గారింట్లో ఉంటూ ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేకపోతుంది అలకి. అదే విషయం ఫాలాక్షకి చెబితే, జూబిలీ హిల్స్‌లో వాళ్ళకి ఇంకో బంగళా ఉందనీ, అలని అక్కడికి షిఫ్ట్ అవమని చెప్తాడు. ఫ్రీగా ఉండను, అద్దె ఇస్తానంటుంది అల. తమ కారుని కూడా వాడుకోమంటాడు. అమ్మని ఇక్కడికి పిలిపించుకుంటే ఎలా ఉంటుంది? లేదా మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఫాలాక్షని సలహా అడిగితే, మహతని అడిగి ఆమె చెప్పినట్టు చేయమంటాడు. కనకని తన అసిస్టెంటుగా పెట్టుకుంటుంది అల. జుబిలీహిల్స్ లోని ఓ మెస్ నుంచి భోజన ఏర్పాట్లు చేసుకుంటుంది. నాలుగు సినిమాలు ఒప్పుకుంటుంది. వాటిలో నాల్గవ సినిమా ‘శర్మిష్ఠ’ షూటింగ్ ముందు మొదలవుతుంది. ‘ధీర’ సినిమాని హిందీలో తీస్తామంటూ హిందీలో పాపులర్ హీరో వినోద్ కుమార్ సరసన అలని ఎంచుకుంటారు. సదాశివరావు గారు, మహతి, సత్యమోహన్, ఫాలాక్ష అందరూ అభినందిస్తారు. అల వాళ్ళమ్మ ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతుంది. అల వాళ్ళ నాన్న ఓ రోజు ఫోన్ చేసి మర్నాడు తాను హైదరాబాద్ వస్తున్నానని, వీలు చేసుకుని ఇంట్లో ఉండమని అంటాడు. మర్నాడు నాన్న రాకలోని ఆంతర్యం అర్థమవుతుంది అలకి. విజయవాడ వ్యవహారాలన్నీ ముగించుకుని ఇల్లు అమ్మేసి కుటుంబ సమేతంగా హైదరాబాద్ వచ్చేసే ఉద్దేశంలో తండ్రి ఉన్నట్టు గ్రహిస్తుంది అల. అందుకు కుదరదంటుంది. కనీసం మరో మూడేళ్ళ దాకా కలిసి ఉండడం వీల్లేదంటుంది. తండ్రి తిడతాడు. కానీ అల పట్టు వదలదు. తన మిత్రుడి కొడుక్కి అలనిచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇచ్చానని అంటాడు. తనని అడగకుండా మాటివ్వడం ఆయన తప్పనీ, ఫ్రెండ్‍కి ఏం చెప్పుకుంటారో, ఆయన్నే చెప్పుకోమంటుంది.  ఇంతలో ఆ ఫ్రెండ్ వచ్చి బయట కారు హారన్ మోగించటంతో తండ్రి వెళ్ళిపోతాడు. నాన్న వెళ్ళిపోయాక, అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుంది అల. కూతురిని ముందు కళ్యాణి గారింటికి వెళ్ళమంటుదామె. సరేనని బయల్దేరుతుంది అల. దారిలో టెలిఫోన్ బూత్ కనిపిస్తే, మహతికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. మహతి సలహా విని, ఆమె సూచన మేరకు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ మర్నాడు తన మిత్రుడిని తీసుకుని వస్తాడు అల వాళ్ళ నాన్న. అల చాలా తెలివిగా మాట్లాడి వాళ్ళి టిఫిన్లు, టీ ఇప్పించి పంపించేస్తుంది.. – ఇక చదవండి.]

మహతి-2 అల-9:

[dropcap]‘శ[/dropcap]ర్మిష్ఠ’ మొదలైంది. హీరోకీ నాకూ 16 సంవత్సరాల తేడా. కానీ ఆయన చాలా స్మార్ట్‌గా వున్నారు. ప్రతి రోజూ వ్యాయామం, మంచి ఫుడ్ హేబిట్స్ వల్ల ఫోటోల్లో అంత తేడా తెలియలేదు. షూటింగ్‌కి ముందే ఫోటో సెషన్ జరిగింది. కాస్టూమ్స్ కూడా రెడీ చేశాకే ఫోటో సెషన్. ఇండస్ట్రీకి చెందిన మహామహులందరూ వచ్చారు. కారణం హీరోగారే. ఓ పెద్ద హీరోతో సినిమా అంటే అంత గ్రేట్ గానూ అట్టహాసంగానూ ఉంటుందన్న మాట. ‘ధీర’ పెద్ద హిట్ అవడంతో నన్ను అందరూ కంగ్రాచ్యులేట్ చేశారు. ఇక ప్రెస్ వారూ, ఛానల్సు వారూ అయితే హడావిడే హడావిడి. మా డైకెక్టర్ ‘పవన్’ ముందుగానే నాకు చెప్పారు.. కథ గురించి గానీ మిగతా విషయాలు గానీ ప్రెస్ ముందర నేను మాట్లాడకూడదనీ, అవన్నీ హీరోగారు మాట్లాడతారనీ.

ఆయనన్నది నిజమే. జర్నలిస్టులు కథ తెలుసుకోవాలని నన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే హీరోగారే “నేను చెప్తానుగా బ్రదర్. సమయం వచ్చినప్పుడు. హీరోయిన్‌ని కంగారు పెట్టకు” అని నన్ను రక్షించారు.

పవన్‍కి మహా వుంటే 32, లేక 33 సంవత్సరాలు వయసుంటుంది. ఇది నాలుగో సినిమా. ఆయన ఇంతకు ముందు తీసిన మూడు సినిమాలూ సూపర్ హిట్లే. పెళ్ళి కాలేదు. తనూ తన పని అంతే. అల్లరి చిల్లరి వేషాలు లేవు. పవన్ గురించిన సంగతులన్నీ నాకు సదాశివరావుగారే చెప్పి “నిర్భయంగా సిన్మా చెయ్యవచ్చు” అన్నారు.

సత్యమోహన్ గారూ, వసంత్ కూడా ఓపెనింగ్‌కి వచ్చారు. వసంత్ పవన్‌కి స్నేహితుడట. ఇంకేం!

నేను కావాలనే మా వాళ్ళకి చెప్పలేదు. అమ్మకి మాత్రం చెప్పాను. నాన్న కూడా ఆ తరవాత నాకు ఫోనేమీ చెయ్యలేదు. కల్యాణిగారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఫాలాక్ష రాజమండ్రి నుంచి మద్రాసు, అటు నించి తన ఆర్మీ యూనిట్‌కి వెళ్ళిపోయాడట. తన నంబర్ నాకు ఇచ్చారు కల్యాణిగారు. మహిత చాలా సంతోషించింది. కాలేజీలో క్లాస్‌మేట్స్ అంతా ఎదురు చూస్తూన్నారనీ, వీలు వెంట వస్తే తనూ వస్తానన్నది. ‘తిమ్ము’ నా ప్రోగ్రెస్ చూసి చాలా చాలా సంతోషపడుతూ ఫోన్ చేశాడని కూడా చెప్పింది.

‘తిమ్ము’ విషయం విన్నాక ఓ క్షణం సైలెంట్ అయ్యాను. అతన్ని నేను ప్రేమించిన మాట నిజమేనా? అని నాకే అనిపించింది. చూడాలని కూడా మనసుకి అనిపించలేదే అని నాకే ఆశ్చర్యమేసింది. అంటే అది ఆ వయసులో వచ్చే చపలత్వమే తప్ప ప్రేమ కాదా? ప్రేమ కాకపోతే ఎన్ని నెలల పాటు రాత్రిళ్ళు నిద్ర పట్టక, చదువుకో బుద్ధి కాక రగిలిపోయాను?

జీవించినంత కాలం జీవనం ఆగదు. మనసూ ఎక్కడా స్థిరంగా నిలిచిపోదు. అందుకే నేమో ఇవ్వాళ I love you అని ఎలుగెత్తి అరిచిన వాళ్ళే తరవాత I hate you అంటారనుకుంటా. నది నిరంతరం ఎలా ప్రవహిస్తుందో, జీవితమూ అంతే. ఘాటింగ్ మొదలైన రోజున సాయంత్రానికే పేకప్ చెప్పారు. పవన్ నాతో “డైలాగ్స్ మీకు ఒక రోజు ముందే అందే ఏర్పాటు చేస్తాను. చదివి వంట బట్టించుకోండి. బట్టీ పట్టనక్కర లేదు.. ఎందుకంటే స్పాట్ చేంజస్ ఉంటాయి.” అన్నాడు. బహుశా డైలాగ్స్ విషయంలో నా పట్టు గురించి వసంత్ చెప్పి వుంటాడు.

రెండో రోజు నుంచీ ఘాటింగ్ శరవేగంతో సాగుతోంది. పెర్‌ఫెక్ట్ ప్లానింగ్. ‘శర్మిష్ఠ’ మైథాలజీ పిక్చర్ కాదు. సోషల్ సినిమానే. అలాగని హీరోయిన్ ఓరియంటెడ్ కాదు గానీ, చాల ప్రాముఖ్యత ఉన్న పాత్ర.

సత్యమోహన్ గారు సీను వివరించి ఏక్ట్ చెయ్యమంటారు. ఎలా చెయ్యాలో చెప్పరు. మనతోనే నాలుగైదు సార్లు చేయించి బెస్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటారు.

పవన్ అలా కాదు. ఏక్ట్ చేసి చూపిస్తారు. ఒకసారి నేనే అడిగా “సార్ ఇలా చేస్తే ఎలా ఉంటుందీ?” అని. నేను అనుకున్న విధానంలో నటించి చూపించా. అతను ముందు ఏమీ మాట్లాడలేదు. గాని తరవాత నా వరకూ నటించి చూపించడం మానేశాడు.

“సారీ సార్, పొరపాటున అన్నాను. క్షమించండి” అని అతను ఒంటరిగా ఉన్నప్పుడు క్షమాపణ చెప్పాను. అతను నవ్వి, “అలా.. you are right. అన్ని పాత్రలనీ నా దృష్టితో చూసి డిజైన్ చేస్తున్న సంగతి నువ్వు act చేసి చెప్పాకే నాకు తెలిసింది. పొద్దున నువ్వు చేసిన ఇంప్రోవైజేషన్ అద్భుతం. ప్లీజ్ కంటిన్యూ ఇన్ యువర్ వే. బాగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చెబుతా” అన్నారు. నాకు ఏనుగెక్కినట్టు అనిపించింది.

నిజంగానే ఆనాటి నుంచి సీన్‌ని నన్నే నటించి చూపించమనేవాడు. అప్పుడప్పుడూ చిన్న చిన్న మార్పులు చేర్పులూ చేసేవాడు. ఓ విషాదకరమైన సీన్ తీసేటప్పుడు నేను లెఫ్ట్ నించి రైట్‌కి చూడాలి. చాలా మెల్లగా సున్నితంగా ఆ సీన్ చేశా. “అంత సేపు ఎందుకూ?” అన్నాడు.

నేను చెప్పడానికి సిగ్గుపడ్డాను. చెప్పమని బలవంత పెడితే చెప్పాను. రీరికార్డింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘స్లో’ చేశానని. గట్టిగా నవ్వేసి “బ్రిలియంట్ గాళ్” అని మెచ్చుకున్నాడు. రెండోసారి ఏనుగు ఎక్కేశా. సదాశివరావు గారితో ఆ విషయం చెబితే, “అవును.. పాతతరం డైరెక్టర్లు వాళ్ళు చెప్పిందే చెయ్యాలనే వాళ్ళు. ఏ మాత్రం ఇంప్రొవైజ్ చేసినా అందరి ముందూ ఇన్సల్ట్ చేసేవారు. యంగర్ జనరేషన్ డైరెక్టర్స్ చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉన్నారు. కనీసం వాళ్ళు ఓపికతో వింటారు. అలాగని అమ్మాయ్.. అందరూ అలా కాదు. ‘ఈవిడా మాకు చెప్పేదీ’ అని ఎక్కడ తొక్కెయ్యాలో అక్కడ తొక్కేస్తారు. ఎడిటింగ్ అయ్యాక చూస్తే మిగిలేది అరకొర సీన్లే” నిజాన్ని చెప్పారు సదాశివరావుగారు. వెంటనే నేను చేసింది ఏనుగు అంబారీల నించి కిందకి దిగడం.

***

మా హీరో చాలా మంచివాడు. గ్రేట్.. అన్నీ ok. కానీ, ప్రెస్ మీట్స్ లోనూ, జనాలున్నప్పుడూ భుజాల మీద చేతులు వేసి మెచ్చుకోవడం, ఒక్కొసారి దగ్గరికి తీసుకోవడం చేసేవాడు. జనాలు వెర్రెత్తి పోయేవారు. ప్రెస్ వాళ్ళయితే “సూపర్ యాక్టిర్‌ని తన వగలతో చిత్తు చేసిన కొత్త హీరోయిన్” అంటూ అవకతవక హెడింగ్స్ పెట్టి రాసేవాళ్ళు. ఒకరైతే “హీరోలో 100% కాక తగ్గలేదు” అని రాశాడు.

ఆయనకి ఎలా చెప్పడం. సదాశివరావుగారితో చెప్పాను. నా ఇబ్బంది. ఆయన నవ్వి “నలుగురి మందూ చనువు ప్రదర్శించడం గొప్ప తప్పేమీ కాదమ్మా. ఇంకో సంగతి ఏమంటే, మీ ఇద్దరి మధ్యన ఏజ్ గాప్ ఉంది. అది జనాలు గుర్తించకుండా హుషారించాలంటే కొంచెం close గా వున్నట్లు బిహేవ్ చెయ్యాలి. పెర్సనల్‌గా మీ హీరో చాలా మంచివాడు. కనక డోంట్ వర్రీ. ఇంకో విషయం చెప్పనా! ఇలాంటి కథలు ఎన్ని వస్తే నీకు అంత పబ్లిసిటీ వస్తుంది. బాంబేలో అయితే డబ్బులిచ్చి మరీ రూమర్స్ వ్రాయిచుకుంటారు” అన్నారు.

“ఓహ్ ఇప్పుడు హిందీలో కాలు పెడితే రూమర్లే రూమర్లన్నమాట” అన్నాను. “అందుకే సిద్ధంగా ఉండు” నవ్వారు. సదాశివరావుగారు.

‘శర్మిష్ఠ’ స్క్రీన్ ప్లే చిత్రంగా వుంది. టేకింగ్ కూడా. సత్యమోహన్ గారి ఘాటింగ్ ట్రెడిషనల్‌గా వుంటే, పవన్ గారి ఘాటింగ్ మాడరన్‌గా వుంది. పవన్ గారు మొత్తం వర్కు కంప్యూటర్‌లో చేసుకుంటారనుకుంటాను. త్రూఅవుట్ రెండు కంప్యూటర్లు ఆన్ లోనే ఉంటాయి. ఓ అసిస్టెంటు ప్రత్యేకంగా వాటి దగ్గరే వుంటాడు. ‘శర్మిష్ఠ’కి కెమెరామెన్ ముఖేష్ బెడేకర్. బెడేకర్స్ ఊరగాయలకు ఫేమస్. మనకి ప్రియ, జంధ్యాల, కొమ్మురి పికిల్స్ లాగా. బెడేకర్ పికిల్స్ అంటే మహరాష్ట్రే కాదు నార్త్ ఇండియా అంతా మోజు పడతారు. ఒకప్పుడు ఫ్లైట్స్‌లో లంచ్, డిన్నర్‌తోపాటు బెడేకర్ పికిల్స్ కూడా సర్వ్ చేసేవారు.

“మీకూ బడేకర్ పికిల్స్‌కి సంబంధం ఉందా?” సరదాగా అడిగాను ముఖేష్‌ని. అతనికి 30, 31 సంవత్సరాలు ఉంటై. పవన్ గారి దంతా యంగ్ బేచ్.

“ఎందుకు లేదు. మా ఇంటి పేరు మాత్రమే బెడేకర్. పికిల్స్ వారికీ మాకూ ఎక్కడో ఎప్పుడో సంబంధం ఉందో లేదో తెలిదు గానీ, నేను మాత్రం డైలీ బెడేకర్ పికిల్ దేన్నో ఓ దాన్ని రుచి చూస్తా. టేస్టు చాలా బాగుంటుంది.” అనడమే కాదు మరుసటి రోజు ఓ పావుకిలో మిక్స్‌డ్ వెజిటెబుల్ బాటిల్ తీసుకొచ్చి నా చేతికిచ్చాడు. వీలున్నంతగా నేను ముఖేష్‌తో ఖాళీ టైమ్‌లో మాట్లాడేదాన్ని. కారణం కొంచెం హిందీ ఇంగ్లీషులు ఇంప్రూవ్ చేసుకోవాలని. నేను కూడా మరి అమ్మ పెట్టి ఇచ్చిన ఆవకాయని ఆయనకి ఇచ్చాను. నాది బెజవాడ ఇంగ్లీషు. చదివిందంతా తెలుగు మీడియం వల్ల స్టైలుగా ఇంగ్లీషు మాట్లాడలేను.

అదే మాట మహతితో అంటే “లోకంలో ఏదీ బ్రహ్మ విద్య కాదు. కనీసం నీది బెజవాడ ఇంగ్లీషు. నాదేమో కర్రావారి ఉప్పలపాడు ఇంగ్లీషు. ఇంగ్లీషు పేపరు చదవడం ప్రాక్టీసు చెయ్యి. ఇంగ్లీష్ అదే వస్తుంది తన్నుకుంటూ.” అన్నది. నాకొకటే అనిపించింది.. ఏది చెయ్యాలన్నా మొదట కావాల్సింది నమ్మకం – ధైర్యం.

ఇంటికి పోన్ చేసినప్పుడుల్లా నాన్నే ఫోన్ తీస్తున్నాడు కానీ అమ్మకి ఇవ్వట్లా. ఓ రోజు మధ్యాహ్నమే ఫోన్ చేశాను. అమ్మే ఎత్తింది. నా గొంతు విని చాలా సంతోషపడటం ఆమె స్వరంలో నాకు తెలిసింది.

“అలా.. కంగారు పడ్డావా, మీ నాన్న నాకు ఫోన్ ఇవ్వడం లేదని. డోంట్ వర్రీ. ఆయన మంచి వాడూ చెడ్డవాడూ కాని ఓ మామూలు మనిషి. మొన్నటి వరకూ జీవితం మామూలుగా గడిచింది. ఆ మామూలు జీవితంలోనే గొప్ప కోసం ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేసి అదే గొప్ప అనుకున్నాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇళ్ళల్లో అవి నిషిద్ధం కనక. ఎప్పడైతే నువ్వు హీరోయిన్ అయ్యావో అప్పుడు ఆయన వాళ్ళ దృష్టిలో చాలా గొప్ప వాడయ్యాడు.. ఓ హీరోయిన్ ఫాదర్‌గా. దానికి తోడు ఫ్రెండ్స్ ఊదరగొట్టారు.. నీ అంతవాడు లేడని. దాంతో రెచ్చిపోయి మకాం హైద్రాబాద్ మార్చెయ్యాలనీ, జూబ్లీహిల్స్‌లో గొప్ప ఇల్లు కొనేసి ఫ్రెండ్స్‌కి తన గొప్ప చూపించాలనీ తాపత్రయపడ్డాడు. అంతే. నువ్వు నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడం వల్ల ఆయన అహం దెబ్బతింది. నిన్ను దూరం పెడితే ‘హీరోయిన్ ఫాదర్’ పదవి వూడిపోతుంది. అందుకు కట్ చెయ్యడు. ఆయనకి తెలిసింది ఒకటే. నేను ఆయన సొంత ‘ప్రాపర్టీ’ని కనక నాతో నిన్ను మాట్లాడనివ్వకుండా నిరోధించడం” సుదీర్ఘంగా మాడ్లాడి శ్వాస పీల్చుకుంది. ఎంతగా మా అమ్మ, నాన్నని విశ్లేషించింది.

“అమ్మా.. నేను అలా ‘నో’ అనడం వల్ల నిన్నేమైనా..”

మధ్యలోనే మా అమ్మ, “లేదమ్మా, ‘నో’ అని చెప్పమన్నది నేనేగా. మొదట్లో కొంచెం మందు పట్టించి నానా మాటలు అన్నారు. నేనే చెప్పాను. ‘హీరోయిన్‌గా దాని కొచ్చే పేరు కంటే హీరోయిన్ తాగుబోతు ఫాదర్’గా నీకు ఎక్కువ పేరొస్తుంది” అని అప్పట్నించీ తాగుడు మానేసి మాములుగానే ఉంటున్నాడు” అన్నది.

నాకు చాలా రిలీఫ్ అనిపించింది. “అన్వేష్ ఏమంటున్నాడు?” అడిగాను. అన్వేష్ నాకు అన్న.

“వాడేమో బయటపడటం లేదు. మొదటి నించీ వాడిది స్వయం పాకమేగా(ఇంట్లో వ్యక్తిని అలా అంటారు) ఉద్యోగం కోసం మాత్రం ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తోంది. ఏవేవో కంపెనీలకి అంటూ తిరుగుతున్నాడు.” అన్నది అమ్మ.

“అమ్మా.. నువ్వు నా దగ్గరకి రావడానికి వీలవదా?” అన్నాను. నా గొంతులోని బేలతనం నాకే తెలుస్తోంది.

“ఏది ఎలా రాసి పెట్టిందో చెప్పలేనమ్మా. అమ్మ దగ్గర ఉండాల్సిన వయసులో మా అమ్మకి దూరమయ్యాను. చదువుకున్నా సరే. కాని మనసు ఎవరితో పంచుకోవాలీ? నాన్న ఉన్నారు.. లేరు.. ఆడపిల్లలకి తల్లి సలహా సంప్రదింపులు ముఖ్యం. కాని నా పెళ్ళికే అమ్మ లేదు. ఆ తరువాత నా నవ్వు, ఏడుపూ కూడా నాలోనే. ఎడారిలో ఒయాసిస్ లాగా నీ దగ్గర కొన్నాళ్ళు ఉండి సేదదీరాను. మీ నాన్నతో చెప్పొచ్చు, కానీ ఆయన పౌరుషానికి పోతే? సమస్య ఇంకా జటిలం అవుతుంది. అనంతా, నీ కాళ్ళు బలంగా ధృడంగా నిలబడాలంటే, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి. ధైర్యం తెచ్చుకో. ఇక్కడి విషయాల మీద ధ్యాస పెడితే అక్కడి పని చెడుతుంది. నువ్వు వున్న చోటునే నీ చోటుగా మలుచుకో. నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. నేనూ వీలు చూసుకుని ఫోన్ చేస్తాను” అన్నది. ఇప్పటిలా అప్పుడు కాదు. టెలిఫోన్ ‘బిల్లులు’ వచ్చేవి. ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ ఆ బిల్లుల్లో స్పష్టంగా వుండేవి. ఆ బిల్స్ నాన్న చూస్తే? అందుకే అమ్మ సందేహిస్తోంది. పురుషాధిక్యం అంటే ఇదీ?!

***

“సర్రీ నువ్వెందుకలా ఇబ్బందిగా వుంటావు నాతో. మీ అమ్మగారూ మా అమ్మగారూ ఫ్రెండ్స్ అని మా అమ్మ చెప్పింది గదా. అప్పటి నించీ నేను నిన్ను నా సిస్టర్ లానే చూస్తున్నాను. నువ్వు మాత్రం ఎందుకో ఇబ్బంది పడతావు. నా ప్రవర్తనలో ఏదన్నా లోపం వుందా? ఉంటే తప్పక సరిద్దుదుకుంటాను” ఓ అదివారం ఫాపింగ్‌లో కలిసిన సర్రీని ఇంటికి తీసికెళ్ళి అడిగాను.

“లేదు, అనంతా లేదు. నిజంగా లేదు. లోపం నాలోనే ఉంది. నువ్వనుకున్నంత సున్నితమైన దాన్ని కాదు నేను. ఒకప్పుడు చాలా యారొగెంట్‌ని. నిజం చెబితే నిన్ను, మీ అమ్మగార్ని చూశాకే నాలోని మొండితనాన్ని, ఎగతాళి చేసే భావాన్నీ, అసూయనీ తగ్గించుకున్నాను. కామ, క్రోధం, లోభం, మోహం, మదం అన్నిటికీ కారణాలు ఉండాలి. లేకపోతే అవి ప్రకోపించవు. అసూయకి ఏ కారణమూ అక్కర్లా. నిన్ను చూడగానే నాలో మొదట పుట్టింది అసూయే. నిన్ను బాధించాలనీ, ఎగతాళి చెయ్యాలనీ చూసేదాన్ని. ఆ విషయం నీకూ తెలుసు. మీ అమ్మగార్ని చూశాక మా అమ్మ గుర్తుకొచ్చింది. అప్పుడే నీ మీద ప్రేమా అభిమానమూ కలిగాయి. కానీ, ఎలా ఎక్స్‌ప్రెస్ చెయ్యాలో తెలిసేది కాదు” కాసేపు సైలెంటైంది. నేనూ ఏమీ మాట్లాడకుండా తన చేతిని నా చేతిలోకి తీసుకున్నా. తన కళ్ళల్లో నీరు తిరగడం చూసినా, గమనించనట్టుగా వున్నాను. అలాంటి సమయంలో మౌనమే మంచిదని నా మనసుకి అనిపించింది. ఓ అయుదు నిముషాలు మౌనం రాజ్యమేలింది.

“సర్రీ నీకు వంట వచ్చా?” అన్నాను. తను మెల్లిగా తల పై కెత్తి “చేస్తాను.. కానీ ఎక్స్‌పర్ట్‌ని కాను” అన్నది.

“నేను రోజూ మెస్సునించే తెప్పించుకుంటాను. ఇవ్వాళ ఎందుకో వంట చెయ్యాలనిపించింది. గ్యాస్ స్టవ్వూ, బండా, పాత్రలూ అన్నీ ఇక్కడున్నాయి. నా తెలిసినంత వరకూ తలో కిలో అప్పుడూ పప్పులూ, నూనె, పోపుగంజలూ, అన్నీ తెచ్చాను. కూరగాయలు ఫ్రెష్‌గా షాపింగ్ చేశా. ఇద్దరం కలిసి వంటని ట్రై చేద్దామా. నాకు నువ్వు నేర్పుతావా?” అన్నాను. “అంత ఎక్స్‌పర్ట్‌ని కాదు” అన్నది.

“నాకైతే అసలు రాదుగా.. ప్లీజ్ నేర్పవా. ఒక వేళ బాంబేకి వెళ్తే ఉప్మా అయినా చేసుకోవాలిగా” అన్నా.

“అంత ఉండదు అలా, నిన్ను ఫైప్ స్టార్ హోటల్లో పెడతారు. కొండ మీద కోతి నైనా నువ్వడిగితే తెస్తారు. కానీ, వాళ్ళు ఎంత పొగుడుతారంటే, ఆ పొగడ్తలకు మాత్రం పొంగిపోకు. పడిపోతావ్, నేల మీదకాదు పాతాళంలోకి! సరే పద.. నిజమైన ఓ సిస్టర్ లాగా నాకొచ్చిన వంట నీకు నేర్పుతా” అన్నది నన్ను సడన్‌గా కావలించుకుని. ఆ కౌగిలింతలో అనంతమైన ప్రేమ అభిమానం నాకు కనిపించాయి.

“మా అమ్మ నాకు మొదటిగా నేర్పిన వంట టమోటా పప్పు. ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్‌కి 3 సత్తు గిన్నెలు వచ్చేవి. ఒక దానిలో గ్లాసుడు రైస్ కడిగి పెట్టి, దానికి రెండు, రెండు పావుల అదే గ్లాసులో నీళ్ళు కలపమంది. ఓ గిన్నెలో ఓ చిన్న కప్పుడు కంది పప్పు కడిగి పెట్టి, రెండు కప్పుల నీళ్ళు పొయ్యమంది. మూడో గిన్నెలో టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు తరిగి పసుపు, కారం వేసేసి మూడు గిన్నెల్లీ కుక్కర్లో పెట్టమంది. ఆఫ్‌కోర్స్ ఒక్కో గిన్నెకి మూతలా సత్తు ప్లేటులే ఉన్నాయనుకో.” టమోటా అన్నీ ఒకే సైజ్‍లో తరుగుతూ అన్నది సర్రి. నాకు తెలిసినా, అదే ఫస్టు టైం అన్నట్లు వింటున్నాను.

“ట్రెడిషనల్‌గా చెయడం వేరు. కుక్కర్‌లో చేయడం వేరు. టమాటాల గిన్నెలో చింతపండుని ఓ చిన్న గులకరాయిలా గుండ్రంగా చేసి పడేస్తే అత్యద్భుతమైన టేస్టు వస్తుంది. ట్రై చేసి చూడు. ఇవ్వాళే వేద్దాం.” టమోటాలు, ఉల్లిపాయలు, మిర్చి, చిన్న చింతపండు ఉండ, పసుపు, కారం అన్నీ వేసి కొలతలతో కుక్కర్‌లో సర్ది కుక్కర్‌ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ రానిచ్చి స్టౌ ఆఫ్ చేసి 20 నిముషాలు అలాగే కుక్కర్ వెయిట్ తియ్యకుండా వుంచింది.

తరవాత పప్పుని పప్పు గుత్తితో బాగా చిదిమి టమోటా etc. అందులో కలిపి బాగా మెదిపింది.

ఓ గిన్నెలో నూనె వేసి, ఆవాలు, సెనగబద్దలు, మెంతిబద్దలు, ఇంగువ, ఎండుమిర్చి ముక్కలూ వేసి మాంఛి పోపు పెట్ట టమోటా పప్పుని అందులోకి వంచింది. కలరు గానీ స్మెల్లు గానీ సూపర్.

“అమ్మాయ్. దీనిలోకి వడియాలూ అప్పడాలు, చల్ల మిరపకాయలు నంజుకుంటే సూపర్. ప్రస్తుతం అవి లేవు గనకనూ, లేత బెండకాయలు వున్నందుననూ, బెండకాయ కూర తయారుచేద్దాం. పెరుగు ఉండనే ఉంది. మిరయాల చారూ తయారుచేసి చూపిస్తా” అన్నది సర్రీ. తన మూడ్ ఛేంజ్ చేసినందుకు ఆనందించా.

డాక్టర్లకి హస్తవాసి ఎలానో వంట చేసే వారికీ (ఆడైనా, మగైనా) హస్తవాసి అలాంటిదే. కల్యాణి గారి హస్తవాసి సూపర్. భోంచేసేటప్పుడు తెలిసింది. వంటలో సర్రీ కూడా ఎక్స్‌పర్టేనని. టమోటా పప్పులో చిన్న చింతపండు వుండి చేసిన మేజిక్ అద్భుతం. సాలిడ్ టేస్ట్‌నే మార్చేసి ఎక్కడికో తీసికెళ్ళింది.

(ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మిత్రులారా, మనసు బాగోనప్పుడో, సమస్యకి పరిష్కారాలు లభించనప్పుడో ఆలోచిస్తూ కూర్చోకుండా ‘వంట’ చెయ్యడం మొదలెట్టండి. మైండ్ ఇట్టే క్లియర్ అయిపోతుంది. ఇది నేను ఊసుపోక చెబుతున్న మాట కాదు. ఎన్నో ఎన్నో సార్లు పరీక్షించి నిర్ధారించిన మాట -రచయిత)

ఆ రోజు ఇద్దరం కలిసే భోంచేశాం. హాయిగా ఒకే బెడ్ మీద పడుకుని ‘ధీర’ ఘాటింగ్‌లో జరిగిన సరదాలనన్నీ మళ్ళీ మళ్ళీ తలుచుకుని, నవ్వుకున్నాం. ఆ తర్వాత ఎంత నిద్రపోయామంటే లేచేసరికి రాత్రి 7.30.

“సర్రీ, ఇవ్వాళ ఇక్కడే, నా దగ్గరే ఉండిపో! ఏదో ఒకటి మళ్ళీ మనమే వొండుకుని తినేద్దాం” అన్నాను.

“పిచ్చి అలా.. రాత్రిళ్ళు మాత్రం నన్ను ఒదిలెయ్. సస్పెన్స్ ఎందుకూ.. రెండు పెగ్గుల విస్కీనో బ్రాందీనో పడితే తప్ప నిద్రపట్టదు. ఒకవేళ తీసుకోకపోతే, రాత్రంతా కాళరాత్రే. ఎందుకని అడక్కు. ఎప్పుడో చెబుతా.. నీకే చెబుతా.. నీకు మాత్రమే చెబుతా” మళ్ళీ నన్ను గాఢంగా కౌగిలించుకుని చెప్పులు వేసుకుని మెట్లు దిగి పోయింది. నేను మాట్లాడే లోపునే గేటు దాటి టాటా చెప్పి ఆటో స్టాండ్ వైపుకి నడిచిపోయింది. అవాక్కై నిల్చున్నా!

(ఇంకా ఉంది)

Exit mobile version