మహతి-24

6
2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[‘శర్మిష్ఠ’ సినిమాకి పది రోజులు పనిచేస్తుంది. హిందీ ‘ధీర’కి అలకి నలభై లక్షలు ఆఫర్ చేస్తారు. అది తక్కువే అయినా హిందీలో మొదటి సినిమా కదా, ఒప్పుకోమని చెప్తారు సదాశివరావు. కళ్యాణి గారి సలహా మీద వనస్థలిపురం దగ్గర తన పేరు మీదే 300 గజాల ఇంటి స్థలం కొంటుంది అల. అమ్మకి తప్ప ఇంకెవరికీ చెప్పదు. మహతికి చెప్తే, ఎంతో సంతోషిస్తుంది. ‘శర్మిష్ఠ’ సినిమా హీరో అల బాగా చేసినప్పుడు మెచ్చుకుని, సరిగ్గా చేయలేకపోయినప్పుడు ధైర్యం చెప్తాడు. దర్శకుడు పవన్ బెటర్‍మెంట్ కోసం తపిస్తాడు. అతనికి పెళ్ళయిందనీ, ప్రేమ వివాహం అనీ, విడాకులు కూడా అయ్యాయని తెలిసి అల బాధపడుతుంది. సెలెబ్రిటీల భార్యల ప్రవర్తన ఎలా ఉంటుందో సదాశివరావు అలకి చెప్తారు. ఆయన శబరీ మేన్షన్‍లో ఓ సింగిల్ రూమ్‍లో ఉంటూ అక్కడి కుర్రాళ్ళకి మంచిమాటలు చెబుతూ ధైర్యం చెబుతూంటారు. హిందీ ‘ధీర’ షూటింగ్ కోసం హర్యానా లోని ‘సిర్సా’ నగరాన్ని ఎంచుకుంటారు. ఫ్లయిట్ లో ఢిల్లీ చేరుతుంది అల. ప్రొడక్షన్ మేనేజర్ హరిలాల్ ఎయిర్‍పోర్ట్‌కి వచ్చి పికప్ చేసుకుంటాడు. ఇన్నోవాలో సిర్సాకి బయల్దేరుతారు. దారిలో హార్యానా ఊర్ల గురించి, ప్రజల గురించి, ఆహారపు అలవాట్ల గురించి వివరంగా చెప్తాడు హరిలాల్.  ఓ చోట మంచి టీ, మరో చోట అద్భుతమైన లస్సీ తాగిస్తాడు. కాసేపయ్యాక ఓ ధాబాలో భోజనం కోసం ఆగినప్పుడు అక్కడి ఏసి రూమ్‍లో ఓ గంట విశ్రాంతి తీసుకుంటుంది అల. సిర్సా ఊర్లోకి ప్రవేశిస్తుంటే, ప్రవేశద్వారం దగ్గర కారు ఆపించి, నేలకి రెండు చేతులూ ఆన్చి నమస్కరిస్తుంది అల. హిందీ ‘ధీర’ని బాగా లావిష్‍గా తీస్తున్నారని చెప్తుంది. హీరో వినోద్ కపూర్, తన జోడీ బాగా కుదిరిందని అంటుంది అల. – ఇక చదవండి.]

మహతి-2 అల-11:

[dropcap]‘సి[/dropcap]ర్సా’ సిటీ అద్భుతంగా వుంది. తన పాత రూపుని మెల్లమెల్లగా మార్చుకుని నవీనతను సిద్ధింప చేసుకుంటోంది. ఎడారి నగరం గనక (ఒకప్పుడు) దుమ్మూ దుమారం ఎక్కువే. ప్రజలు నాగరికంగా వున్నా, అధునాతనమైన దుస్తులు ధరించినా, వారి మనసులు గత కాలపు నీడలలోనే వున్నాయి. హరిలాల్ చెప్పినట్లు భాష మొరటుగా వున్నా, మనుషుల ప్రవర్తన మర్యాదగా వుంది. నాకే తెలీని ఓ ‘ఆపేక్ష’ ఆ నగరం మీద నాకు కలిగింది.

“నా నెంబరు మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే మీ ముందుంటాను. ఎందుకంటే, షూటింగ్ స్పాట్‍కి వెళ్ళాక నేను మళ్ళీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా వుంటాను” ఆదరంగా నవ్వి అన్నాడు హరిలాల్.

“ధన్య్‌వాద్ భయ్యా. మిమ్మల్ని చూస్తే నాకు నా స్వంత సోదరుడ్ని చూసినట్లుంది” గుండెలో మాటనే ఇంగ్లీషులో చెప్పాను. ‘రోజ్‍బడ్’ రిసార్ట్స్ దగ్గర కారు ఆగింది. అక్కడే షూటింగ్ జరిగేది. మా ‘బస’ కూడా అక్కడేనని హరిలాల్ చెప్పాడు. ఎంట్రన్స్ చాలా అట్టహాసంగా వుంది.

“మేమ్, ఇది ఇక్కడ వున్న కాస్ట్లియస్ట్ రిసార్ట్. పెద్దది కూడా. దాదాపు 300 ఎకరాల్లో విస్తరించి వుంది. ఇది ఓ ఎక్స్ మినిస్టర్ గారిది. లోపలికి వెడితే అనిపిస్తుంది, అత్యంత మోడరన్ స్వర్గానికి వచ్చామా అని!” గేటు లోపలికి ఎంటరవగానే అన్నాడు హరిలాల్.

ఎదురుగా, ‘Welcome to Our Heroine’ అనే పెద్ద బేనర్ నాకు కనిపించింది. బేనర్ మధ్యలో నా ఫొటో. దానికి ఇరువైపులా రకరకాల పోజుల్లో ఉన్న 6”/3” ఫొటోస్టాండ్‍లు. ప్రతి పది అడుగులకు ఒకటిగా వున్నాయి. నాకు నోట మాట రాలేదు. ఇది నేను జీవితంలో ఊహించని సంఘటన. దారి పొడవునా హోర్డింగులే.. బేనర్లే. ఓహ్.. ఇంతటి సుస్వాగతం ఎన్ని జన్మల పుణ్యమో, ఎందరు దేవతల వరమో. నా ఫొటోల్ని నేనే చూస్తూ అనుకున్నా, ‘ఆ ఫొటోల్లో వున్నది నేనేనా?!’ అని.

డైరక్టర్ అమిత్ సక్సేనా వయసు దాదాపు నలభై వున్నా చూడటానికి 30 ఏళ్ళ వాడిలాగా కనిపిస్తాడు. చాలా యాక్టివ్ అండ్ స్మార్ట్. చాలా చురుకైన కళ్ళు.

“బాలీవుడ్‍లో కాబోయే యువరాణికి సుస్వాగతం. ఈ సినిమా తరువాత మీరు ‘ఎంపరెస్’ అంటే ‘చక్రవర్తిని’ కావాలని మా ఆకాంక్ష” చేయి చాపి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు అమిత్ సక్సేనా. షేక్ హ్యాండ్ ఇచ్చి, అ తరువాత రెండు చేతులూ జోడించి నమస్కరించి, “హృదయపూర్వక ధన్యవాదాలు సార్” అని ఇంగ్లీషులో జవాబిచ్చాను. ఓ క్షణం అతను నా కళ్ళల్లోకి సూటిగా చూశాదు. రెండు బాణాలు నా కళ్ళల్లోకి సూటిగా దూసుకుపోయినట్లయింది. కారణం అతని చూపుల్లోని సూటిదనం. హిందీ హీరోల్లాగే అతనూ మంచి రంగులో మెరిసిపోతున్నాడు. వేసుకున్న దుస్తులు చాలా కేజువల్‍గా అనిపించినా, అవి డిజైనర్ దుస్తులనీ, చాలా ఖరీదైనవనీ చూడగానే తెలిసిపోయింది. అతని పక్కకొచ్చి ఓ అమ్మాయి నిలబడింది. “ఈమె పేరు తరుణీ కిద్వాయ్. నా అసోసియేట్ డైరక్టర్. ఇప్పటి వరకు దాదాపు ఓ ఇరవై సినిమాలకు పని చేసి, గత నా రెండు సినిమాల్లోనూ అసోసియేట్‍గా నాకు హెల్ప్ చేస్తోంది. చాలా ఫ్రెండ్లీ పర్సన్. అంతే కాదు, తను పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎ. డిగ్రీ తీసుకుంది. వాళ్ళ నాన్నగారు ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సప్లైస్‍లో జాయింట్ సెక్రటరీ” అంటూ ఆమెను నాకు పరిచయం చేశాడు అమిత్ సక్సేనా.

“హాయ్.. హేపీ టు మీట్ యూ” అన్నది తరుణి.

“థాంక్యూ.. సేమ్ టు యూ” మా విజయవాడ కంటే కొంచెం బెటర్ ఇంగ్లీషులో అన్నాను.

(విజయవాడ ఇంగ్లీష్ తక్కువదని కాదు. మేము ఇంగ్లీష్‍లో తెలుగు యాస కలిసినా ఏమీ అనుకోకు గనక అలా అన్నాను).

తరుణి చిన్నగా నవ్వింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నా – ఇంగ్లీషునీ, హిందీని నమిలి నమిలి మింగి మింగి జీర్ణం చేసేసుకోవాలని.

“ఆలిండియా రేడియో హిందీ, ఇంగ్లీష్ న్యూసులు విను. వాళ్లు ఉపయోగించే ‘యాస’ని గమనించు. హిందీ ఇంగ్లీష్ సినిమాలు చూడు. అక్కడా నీ దృష్టి యాస మీదే వుండాలి. రోజూ ఇంగ్లీష్, హిందీ పేపర్లు – నువ్వు సినిమాల్లో, న్యూస్‍లో విన్న యాసతో గట్టిగా బయటకి చదువుతూ ప్రాక్టీస్ చెయ్యి. నువ్వే క్వీన్ వయిపోతావు. ఈ సలహా నీకే కాదు, నాకు నేను ఇచ్చుకుని ప్రాక్టీస్ చేస్తా” అన్నది మహతి ఫోన్‍లో. సిర్సా రిసార్టులో నాకు ఏర్పాటు చేసిన విల్లాకి చేరగానే నేను చేసింది మహితకి ఫోన్ చేసి నా నెంబర్లు చెప్పడం.

అంతే కాదు, కొన్ని టాప్ హిందీ ఇంగ్లీషు సినిమాల పేర్లు కూడా తను చెబితే నేను వ్రాసుకున్నాను. అన్నట్టు నాకు ఎలాట్ చేసిన విల్లా పేరు ‘సరయూ’. అయోధ్యని ఆనుకుని వుండే నదే సరయూ. లవకుశులకు పట్టం కట్టి రామలక్ష్మణభరతశత్రుఘ్నులు తమ అవతారాల్ని చాలించింది కూడా సరయూలోనే.

ఆ రిసార్ట్స్‌లో మొత్తం 62 విల్లాలు వున్నాయట. వాటికి నదుల పేర్లూ, కొండల పేర్లు పెట్టారట. కొన్నిటికి పురాణపురుషుల పేర్లు కూడా పెట్టారట. ఆ ఐడియా నాకు చాలా నచ్చింది. ఇల్లు కడితే దాని పేరు ‘సరయూ’ అని పెడదామని ఆ క్షణానే నిర్ణయించుకున్నాను.

“మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. హీరో గారు సాయంత్రం మిమ్మల్ని కలుస్తారు. ఆయనే కాదు, ఎంటైర్ యూనిట్ ‘బ్లూ బెర్రీ’ హాల్‍లో కలుస్తున్నాం, మీకు స్వాగతం చెప్పడానికి” అన్నది తరుణి.

నాకు నోట మాట రాక అవాక్కయ్యాను. ఓ క్షణం తరువాత తేరుకుని, “థాంక్యూ సో మచ్.. ఇట్ యీజ్ యాన్ అన్‍ఎక్స్‌పెక్టెడ్ ఆనర్” అన్నాను వినయంగా.

***

బాత్ టబ్‍లో పడుకుని ఆలోచనలో మునిగిపోయా. నా చిన్నతనం, అమ్మ నిస్వార్థ ప్రేమ, నాన్న గొప్పలకి పోవడం, కాలేజీ, నేను ఎంతో ఇష్టపడ్డ మహతి, నేను ఎంతో ప్రేమించి పీడించిన తిమ్మూ, గోడ మీద విషపు రాతలు – అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ తరువాత ‘ధీర’ సినిమా, ఫాలాక్ష, కళ్యాణి గారూ అంతా ఓ సినిమాలా నా కళ్ళ ముందు తిరిగింది.

‘ఇదంతా నా జీవితమేనా?’ అనే ఆశ్చర్యం కూడా కలిగింది.  అన్ని సన్నివేశాలలో వున్నది నేనే. కానీ, ఆ సన్నివేశాలు గడిచిపోయాక, వాటి గాఢత తగ్గి, అవన్నీ ఓ సినిమా రీళ్ళులాగా అనిపిస్తున్నాయి.

చాలాసేపు అలానే బాత్‌ టబ్‍లో విశ్రాంతి తీసుకుని టబ్ లోంచి బయటకొచ్చా. నగ్నంగా వున్న నా శరీరం అజంతా శిల్పంగా ఉంది.

మనిషికి ‘డ్రెస్ అండ్ అడ్రెస్’ చాలా ఇంపార్టెంట్ అన్న మాట గుర్తుకొచ్చింది. బాత్ రోబ్ వేసుకున్నా.

భగవంతుడు ఎంత గొప్ప శిల్పి. అసలీ శరీర నిర్మాణాన్ని చూస్తే తెలుస్తుంది. ప్రతి అవయవానికి ఓ ఉపయోగమూ, ఓ సౌందర్యం ఉన్నాయి. అలా అని నిశ్చలం కాదు. ప్రతి క్షణమూ శరీరంలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి అణువూ పెరుగుతూ వుంటుంది. కొత్త అణువులు నూతనంగా పుట్టుకొస్తే, జీవం కోల్ఫోయిన అణువులు కాలంతో కొట్టుకుపోతాయి. ఒక్కసారి లోకం లోకి వచ్చి నా సూట్‍కేస్ తెరిచి తెల్లని శారీ, తెల్లని జాకెట్, బ్రా, లో దుస్తులూ తీసి మంచం మీద పెట్టాను. తెలుపు అంటే నాకు చాలా ఇష్టం. అదీ వెన్నల లాంటి తెలుపు. ఆ తెలుపు తల్లి కొంగ రెక్కల లాంటిది కాదు. తెల్ల గులాబీ, తెల్ల మందారం, మల్లె, సన్నజాబి  లాంటి పూవుల తెల్లదనం కాదు. పండు వెన్నెల తెలుపు. నిండు వెన్నెల తెలుపు. ఓ శ్వేతనాగు అప్పుడే విడిచిన కుబుసంలా, సన్నటి నీలిరంగును పొదువుకున్న తెలుపు.

సినిమా పుణ్యమా అని అందంగా చీర ఎలా కట్టుకోవాలో ‘ధీర’ షూటింగ్‍ అప్పుడు అబ్బింది. సన్నటి గొలుసు, కుడి చేతికి ఉంగరాలు, ఎడం చేతికి వాచీ, మళ్ళీ కుడి చేతికి రెండు బంగారు గాజులు – ఇవే నా ఆభరణాలు.

కరెక్టుగా ఆరున్నరకి ఫోన్ మ్రోగింది, రెడీ అయ్యానో లేదో కనుక్కోవడానికి. “రెడీ” అన్నాను. పది నిమిషాల్లో డ్రెస్ అయ్యాను. అద్దంలో ఉన్నది ‘అల’ కాదు.. మరెవరో!

అరగంటకల్లా కారు, కారుతో పాటు ‘తరుణి’ వచ్చింది. నన్ను చూసి అవాక్కయింది.

“మైగాడ్.. ఇది మీరేనా?” షాక్‍తో అంది. “అన్‍బిలీవబుల్” అని నా చెయ్యి పట్టుకుంది. చెయ్యి వెచ్చగా వుంది ఆమెది.

నేను చిన్నగా నవ్వి “బయల్దేరుదామా?” అన్నాను.

***

‘మిడిల్ క్లాస్’ అంటే మధ్య తరగతి. ఈ మధ్య తరగతిలో ఓ గొప్పదనం వుంది. పైకి వెళ్ళి అతి తొందరలోనే ‘హై క్లాస్’ వాళ్ళని అనుసరిస్తూ, అనుకరిస్తూ వారిలో కలిసిపోగలరు. ఖర్మ కాలి కిందకి, అంటే, లోయర్ క్లాస్‍కి దిగితే, అక్కడా కూడా ‘విధి చేయు వింతలెన్నో’ అనుకుంటూ కాలం గడిపెయ్యగలరు. తేడా ఒకటే, హై క్లాస్‍కి వెళ్ళాక, గతం సంగతి ఎప్పుడో తప్ప ఎత్తరు. ఒకవేళ ఎత్తినా ‘ఎన్ని కష్టాల కోర్చి జీవితాన్ని సాధించుకున్నామో తెలుసా?’ అని చుట్టూ ఉన్నవాళ్ళని ఆశ్చర్యంలోనో దిగ్భ్రమలోనూ ముంచడానికి ఎత్తుతారు. అదే లో క్లాస్‍కి దిగితే మాత్రం రోజుకి పదిసార్లయినా తమ ‘మిడిల్ క్లాస్’ గొప్పల్నీ, సౌకర్యాల్నీ, సంప్రదాయాల్నీ జనాలకి చెబుతూనే వుంటారు.

‘మిడిల్ క్లాస్’లో పుట్టిన నాకు ఓ గొప్ప రిసార్టులో జరగబోయే పార్టీల గురించి ఏమి తెలుస్తుంది?

పత్రికల వాళ్ళకి పరిచయం చేసేముందు చాలా తతంగం జరిగింది. ఓ పెద్ద యూనిఫామ్‌డ్ బేండ్. స్టేజిని వెలుగులతో నింపుతూ ఫ్లడ్ లైట్లు. రెడ్ కార్పెట్టు. గాడ్.. ఆ హంగమాని ఏమంటారో కూడా నాకు తెలీదు. హీరో, డైరెక్టరూ నన్ను నడిపిస్తూ స్టేజ్ మీదకు తీసుకెళ్ళారు. అఫ్ కోర్స్, ఆ స్టేజి మీదకి అతి వయ్యారంగా ఎలా నడవాలో ఒకామె చేత నాకు ప్రాక్టీస్ ఇప్పించారు. “యూ ఆర్ ఎ ఫాస్ట్ లెర్నర్” అని ఆవిడ నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది.

“వుయ్ ప్రౌడ్లీ ప్రెజంట్ మిస్ అల్కా సుభాష్” అని ఎనౌన్స్ చేశారు హీరో. నాకు షాక్ తగిలింది. “అల అంటే ఎవరికీ తెలీదు. అందుకే అల్కా అని మార్చాం. మీ నాన్నగారు వెంకట సుబ్బయ్య పేరుని సుభాష్‍గా మార్చి, నిన్ను అల్కా సుభాష్‍ని చేశాం” చెవిలో గొణిగాడు నిర్మాత.

అన్నట్టు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను బుక్ చేసే ముందే నా ‘జాతకం’ అడిగి తీసుకున్నారు. బహుశా పండిట్‍జీని సంప్రదించి ఇలా అలని అల్కా సుభాష్‍గా మార్చి ఉండొచ్చని నాకు అనిపించింది.

ఆ తరువాత జరిగిన తతంగానికి నా మతిపోయింది. నేనసలు ‘అల’నేనా? అనే సంశయమూ కలిగింది. నాకే తెలియని నా జీవితకథని వాళ్ళు ‘ప్రెస్’కి మృదు మధురంగా వినిపించారు. అందుకో కొన్ని:

  • నేను పుట్టిన మూడో నెలలో ఓ నాగుపాము నాకు పడగ పట్టిందట.
  • నాలుగో ఏటే నేను మహా నటీమణుల్ని అలవోకగా అనుకరించి, సినిమాల్లోకి పోతానని గోల పెట్టేదాన్నిట.
  • నా ఎనిమిదో యేడే ఓ నిర్మాత నన్ను బాలనటిగా పరిచయం చేస్తానని మా అమ్మానాన్నల కాళ్ళావేళ్ళా పడితే వాళ్ళు ‘నో’ అని తిరస్కరించారట.
  • అసలు మా పూర్వీకులది ఢిల్లీ పరిసరాల్లోని ఓ ‘జమీ’ట. మా ముత్తాత పదిమంది ఆంగ్లేయులని చంపి, సౌత్‍కి ఫేమిలీతో సహా పారిపోయాడట, దొరక్కుండా వుండటానికి. ఆ రకంగా చూస్తే నా పూర్వీకులు దేశభక్తులూ, స్వాతంత్ర సమరయోధులూ!
  • చిన్నతనం నుంచి మా అమ్మ నాకు ‘ప్రత్యేక’మైన ఆహారాన్ని మాత్రమే ఇస్తూ, నన్ను స్ట్రీట్ ఫుడ్‍కీ, చాక్లెట్లకీ, చిరుతిండికీ దూరంగా వుంచడానికి వేయి కళ్ళతో కాపలా కాయడం వల్లే నేను ఇంత నాజూగ్గా  ఉన్నానుట (దేవుడా, నేను బెజవాడలో తిన్న వీధి తోపుడు బండి బజ్జీలకి, బోండాలకీ, ఇడ్లీలకీ, పునుకులకీ లెక్కుందా?)

నాకు తెలియని నా జీవితం వింటుంటే, నేను ‘అదా లేక ఇదా?’ అన్న సంశయం నాకే కలిగింది.

వారు నాతో బట్టీ పట్టించిన బ్రీఫ్ స్పీచ్ (ఇంగ్లీషు)తో సభ ముగిసి జనాలు ‘మందు’ మీద పడ్డారు. మన హాస్యబ్రహ్మ ‘ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకం’ అన్నట్లు జనాలు ‘మందు’ మీద పడ్డారు. అవన్నీ చాలా ఖరీదువిట. బఫేలో దాదాపు 40 రకాల తినుబండారాలున్నై. వినోద్ తనతో నన్ను తిప్పుతూ అందరికీ పరిచయం చేస్తూ ముందుకెళ్తున్నాడు గానీ, తను పట్టుకున్న గ్లాసు అలానే వుంది.

జనాలు మందు ఆస్వాదనలో పడ్డాక, “ఎంజాయ్ యువర్‍సెల్ఫ్ జెంటిల్‍మన్. అల్కాజీ సెలవు తీసుకుంటుంది” అని ఓ మాట ఎనౌన్స్ చేశాదు వినోద్. తరుణీ, వినోద్ నన్ను ప్రత్యేకంగా ఉన్న డోర్ లోంచి  స్టేజ్ బయటకీ, అక్కడి నించి నా విల్లాకీ తీసుకెళ్ళారు. అక్కడ ఓ స్పెషల్ టేబుల్ (నేను సాయంత్రం దాకా చూడనిది) మీద భోజన సామగ్రి అందంగా అమర్చి వుంది.

“రిలాక్స్ అల్కా.. తరుణీ నీతో వుంటుంది. నీ భోజనం అయ్యేవరకూ, సరేనా.. గుడ్ నైట్” అని సడెన్‍గా నా బుగ్గ మీద ఓ చిన్న ముద్దు పెట్టి వినోద్ వెళ్ళిపోయాడు. నేను అవాకయ్యాను.

“ఏమిటి షాకయ్యారా? అతను చిటికెన వేలితో ముట్టుకుంటే చాలాని లక్షల మంది యవతులు కలలు గంటున్నారు. మైగాడ్, మొదటి పరిచయంలోనే ముద్దా! ఓహ్.. హే లక్కీ” అంటూ తరుణి నన్ను కౌగిలించుకుని రెండు బుగ్గల మీదా పది పన్నెండు ముద్దులు పెట్టింది. ఆవిడ చేతులూ, మొహమూ వేడిగా కాలుతున్నాయి. శ్వాసలు జ్వాలల్లా వున్నాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here