(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[తరుణి అలని కౌగిలించుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టగానే అల ఆమెను నెట్టేస్తుంది. అది అల అందానికి ప్రశంస అని అంటుంది తరుణి. అల అవసరాలు కనిపెట్టుకుని చూడడానికే హీరోగారు తనని పంపిచారని చెబుతుంది. హాట్ డ్రింక్స్ కావాలంటే ఏర్పాటు చేయగలనని అంటుంది. తనకి అవి అలవాటు లేవని చెప్తుంది అల. అల భోంచేసేటప్పుడు కంపెనీగా ఉందామని తన డిన్నర్ కూడా అక్కడికే ఆర్డర్ చేశానని చెప్తుంది తరుణి. వెళ్ళి అలని స్నానం చేసి రమ్మంటుంది. అల ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడ్డం చూసి, మీ ప్రైవసీకి భంగం అనుకుంటే వెళ్ళిపోతానని అంటుంది తరుణి. తనకి కొంచెం ఒంటరిగా తినడం అలవాటని, ఆమెని తినమని చెప్తుంది అల. స్నానం చేసి వస్తుంది అల. ఫాలాక్ష చెప్పినట్టుగా, తరుణి కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడుతుంది అల. ఇద్దరూ భోం చేస్తారు. భోజనం విషయంలో కూడా అల భయపడుతోందని గ్రహించిన తరుణి తన ప్రవర్తనకి సిగ్గుపడుతుంది. తానేమీ అనుకోలేదని, మనం కలిసి పని చేద్దామని అల చెప్పాకా, ఆమె కాస్త రిలాక్స్ అవుతుంది. మర్నాడు షూటింగ్‍లో కలిసినప్పుడు దర్శకుడు అమిత్ తరుణి గురించి గొప్పగా చెబుతాడు. ఆ రోజు తనకి సీన్లు లేవని చెప్పి, అలని రెస్ట్ తీసుకోమని చెప్తుంది తరుణి. విల్లాకి వచ్చేసి మహతికి ఫోన్ చేస్తుంది. మహతి కొన్ని సూచనలు చేస్తుంది. మహతితో మాట్లాడాక, సంకోచాలు తీరిపోయి ప్రశాంతంగా నిద్రపోతుంది అల. మర్నాడు షూట్‍లో హీరో వినోద్‍ని కౌగిలించుకోవాల్సిన సన్నివేశం ఉంటుంది. మొదట సరిగా రాదు. పోనీ మర్నాడు చేద్దామని అంటాడు హీరో. వద్దని మళ్ళీ ప్రయత్నిస్తుంది అల. చివరికి అందరికీ నచ్చే విధంగా వస్తుందా సీన్. షూటింగ్ ఎనిమిది రోజులు జరుగుతుంది. తరుణి అన్‍కండీషనల్‍గా అలకి సహాయం చేస్తుంది. అల కూడా వచ్చీ రాని హిందీలోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. షాట్ గ్యాప్‍లలో తెలుగు హిందీ సినిమాల చిత్రీకరణలోని వ్యత్యాసం గురించి దర్శకుడు అమిత్, హీరో వినోద్, సినిమాటోగ్రాఫర్ కమల్ జీత్, అల చర్చించుకుంటారు. ఆ షెడ్యూల్ చివరి రోజున అలకి సెండాఫ్ ఇస్తూ మరుసటి షెడ్యూల్ ఆగ్రాలో అని చెప్తాడు దర్శకుడు. అందరూ అలకి ఆత్మీయంగా వీడ్కోలు పలుకుతారు. హరిలాల్‍తో పాటు కారులో బయల్దేరుతుంది అల. – ఇక చదవండి.]
మహతి-2 అల-13:
[dropcap]హా[/dropcap]యిగా ఢిల్లీకి వచ్చాం. సాయంత్రం 6.30 అయింది. ఫ్లయిట్ రాత్రి 10.30 కట, అదీ కేన్సిల్ కాకపోతే. ఢిల్లీకి వచ్చాక తెలిసిన విషయం అది. హరిలాల్ దౌలాకుఁవా దగ్గరి హోటల్ సవాయ్ (పేరు మార్చబడినది) లో నా కోసం రూమ్ బుక్ చేశాడు.
“అల్కాజీ, నేను మానిటర్ చేస్తూనే వుంటాను. సేఫ్టీకి హోటల్ సవాయ్‌లో రూమ్ బుక్ చేశాను. ఆ హోటల్‍లో మన ప్రొడ్యూసర్ గారికీ కొంత వాటా వుంది గనుక నిర్భయంగా ఉండొచ్చు. నేను కూడా మీరు ఫ్లయిట్ ఎక్కేదాకా మీతోనే వుంటాను. అంతేగాక ఫ్లయిట్ ఎక్కాకా, హైదరాబాద్ ప్రొడక్షన్ మేనేజర్ రాజుకి కూడా ఫోన్ చేసి ఏర్‌పోర్ట్‌కి రమ్మని చెప్తాను. మీరు హైదరాబాద్ వెళ్ళేసరికీ కారూ, రాజూ సిద్దంగా వుంటారు” అన్నాడు హరిలాల్.
“థాంక్యూ హరిలాల్ జీ” అని అతనికి షేక్ హాండ్ ఇచ్చాను. అతని ముందుచూపు నాకెంతో నచ్చింది.
ఢిల్లీ పరిసరాల్లో విపరీతమైన గాలులు వీస్తున్నాయట. కారణం రాజస్థాన్ డిజర్ట్‌లో అకస్మాత్తుగా మొదలన డస్ట్ స్టార్మ్‌లు. వాటినే ‘ఆంధీ’ అని హిందీలోనూ, ‘ఇసుక తుఫాను’ అని తెలుగులోనూ అంటారు.
అవి ఎంత భయంకరమంటే, వూళ్ళకి వూళ్ళు ఇసుక కింద కప్పబడి పోతాయి. మనుషులూ పశువులూ కూడా ‘ఆంధీ’లో చిక్కుకుంటే నూటికి తొంభై వంతులు మరణం తప్పదు.
ఆ రాత్రి హోటల్ సవాయ్ లోనే నేను నిద్రించాల్సి వచ్చింది. అది కూడా చాలా పెద్ద విఐపి రూమ్. హీరోయిన్ వి.ఐ.పి.నే గదా ప్రొడ్యూసర్‌కి. స్టాఫ్ అంతా ఓనర్ ఆర్డర్స్‌తో అడుగులకు మడుగులొత్తుతూ భక్తి శ్రద్ధలతో చూసుకున్నారు. హోటల్‍లో దిగిన అరగంటకి బెల్ మ్రోగింది. చూస్తే వెయిటర్.
“మేడమ్, నా పేరు జగన్నాధ్. మా వూరు పూళ్ళ. నేను 100% తెలుగువాడిని. మీకు ఏం కావాలన్నా చూడమని నాతో మా మేనేజర్ చెప్పారు. లాంగ్వేజ్ ఇబ్బంది లేకుండా నన్ను మీ కోసం ప్రత్యేకించారు. మీ గురించి తెలిసిన వెంటన మీ కోసం మా సవాయ్ స్పెషల్ మిర్చి బజ్జీ మీ అనుమతి లేకుండానే తెచ్చాను. అందుకు క్షమించాలి. మన వాళ్ళకి మిర్చిబజ్జీ అంటే చాలా ఇష్టం గదా!” చెప్పి చిన్నగా వినయంగా నవ్వి టేబిల్ మీద పెట్టాడు. డోమ్ తీయంగానే బజ్జీలు సెగలు గక్కుతూ కనిపించాయి.
“థాంక్స్ జగన్నాధ్ గారూ. థేంక్యూ. రాత్రికి కాస్త సౌత్ ఇండియన్ ఫుడ్ దొరికితే చాలు” అన్నాను.
“ప్రత్యేకంగా చేయిస్తాను మేడం..” అంటూ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు
ఓ బజ్జీ నమిలాను. లోపల బంగాళాదుంప స్టఫ్. ఎంత కమ్మగా అద్భుతంగా ఉన్నాయంటే, టమోట సాస్‌తో ఆరు బజ్జీలు తినేశా. వాము కూడా ఆ స్టఫ్‍లో కలిపారేమో, మహత్తరమైన ‘రుచి’ వచ్చింది. రూమ్ లోనే చిన్న ఫ్రిజ్ ఉంది. ఓపెన్ చేస్తే రకరకాల కూల్ డ్రింక్స్, సోడాలు, వాటర్ బాటిల్స్ కనిపించాయి. బయట మరోచోట కుర్‍కురేలు, బదాం, కాజూ (జీడిపప్పు Salted) పాకెట్లు కనిపించాయి జీడిపప్పు పేకెట్ ఓపెన్ చేసి మరో బజ్జీ జీడిపప్పు కాంబినేషన్‌లో తిన్నా. మహదానందం వేసింది. వెంటనే మహతికి ఫోన్ చేసి, బజ్జీల గురించి చెబితే గానీ మనసు ఆగలేదు. రాత్రి డిన్నర్ అద్భుతం, అపూర్వం.
***
నిద్రలేచేసరికి 7.30 నిముషాలయింది. అంటే, పిచ్చి నిద్ర పోయానన్నమాట. హాయిగా రిలాక్స్‌డ్‌గా స్నానం చేసి డ్రెస్ చేసుకుందామనుకునే సమయంలో హరిలాల్ ఫోన్ చేశాడు.
“రెడీ అయితే మీకు కొద్దో గొప్పో ఢిల్లీ చూపిస్తా, మీ ఫ్లయిట్ సాయంత్రం 6.30 నిముషాలకి. టికెట్ కన్‍ఫర్మ్ అయింది” అన్నాడు.
నేను 8.15 కల్లా కిందకొచ్చేశాను. హరిలాల్ నవ్వుతూ, “మీ కోసం హోటల్ వారే బ్రేక్‍ఫాస్ట్ పేక్ చేసి ఇచ్చారు. పూరీ, మసాలా దోశ, హల్వా. ఇంకేమైనా కావాలంటే హోటల్స్‌లో తీసుకుందాం” అన్నాడు.
రిసెప్షన్‌లో ఉన్న డ్యూటీ మేనేజర్‍కి థాంక్స్ చెప్పి కారులో కూర్చున్నా. ఆశ్చర్యకర సంఘటన ఏమంటే వారంతా నా ఆటోగ్రాఫ్ తీసుకోవడం, దానికంటే ఆశ్చర్యకరమైన సంగతి ఏటంటే, నేను ‘అల’ అని కాక ‘అల్కా సుభాష్’ అని ఆటోగ్రాఫ్ ఇవ్వడం. ‘బుద్ధా గార్డెన్స్’ దగ్గర ఆగి ఓ రౌండ్ కొట్టి టిఫిన్ చేశాం. జ్ఞానీ రెస్టారెంట్ (కరోల్‍బాగ్) లో ‘ఫాలూదా’ తాగాం.
ఆ తరువాత ‘పాలికా బజార్’ (ఒకప్పటి కన్నాట్ ప్లేస్) లో షాపింగ్ చేస్తూ ‘ఆలూ చిక్కీ’లు ఆరగించాం. అక్కడే ఇండియా మొదటి 70 MM థియేటర్ ‘షీలా థియేటర్’ని చూసి, రోడ్ల మీద హాయిగా తిరుగుతూ 2.30 కి హోటల్‍కి వచ్చాం. నా పొట్ట ఫుల్. భోంచేసే చోటే లేదు. ఓ స్వీట్ లస్సీ తెప్పించుకున్నా. ఆ గ్లాసు ఎంతో పెద్దదంటే దాన్ని అమితాభ్ బచ్చన్ గ్లాస్ అంటారుట. మెల్లిగా చల్లగా ఆ స్వీట్ లస్సీని ఎంజాయ్ చేస్తూ 4 గంటలకి మళ్ళీ కారులో కూర్చున్నా. జీడిపప్పు, బదాం నేను తెచ్చేసుకున్నా. ఫ్లయిట్ రైట్ టైమ్‌కే అని నిర్ధారించాకున్నాకే నేను ఏర్‌పోర్ట్‌కి లోకి వెళ్ళా. నాకు తెలుసు, ఫ్లైట్ వెళ్ళే వరకూ హరిలాల్ ఉంటాడని.
***
VIP లౌంజ్‌లో కూర్చున్నా. వారు నాకు బుక్ చేసింది ఎగ్జిక్యూటివ్ క్లాస్. ఒక్కసారి జీవితం కళ్ళ ముందు మెదిలింది.
“ఇది నిజమా.. అది నిజమా
ఇది స్వప్నమా.. అది స్వప్నమా
ఇది నేనా? అది నేనా?
జీవితం నాదే.. అయినా నేస్తం
నాకు తెలియని జీవితాన్ని జీవిస్తున్నా
ఇదేమి వింత! అసలేమిటిదంతా!
నిన్నటి మొగ్గ నిన్ననే పువ్వై నిన్ననే వాడిపోయింది.
నిన్నటి మొక్క పచ్చగా ఇంకొంచం ఎదిగి ఇవ్వాళ
కనువిందు చేస్తుంది.. కలత వద్దంటోంది.
రేపటి మొగ్గ?
రేపటి మొక్క?
రేపటి నవ్వు?
కలలు గనకు మనసా..
స్వేచ్ఛవైపో.. సాక్షివైపో..
కలలు కన్నా.. కన్నీరెరుగని కలలు కను”
పాకెట్ పుస్తకంలో మనసులో మెదిలిన భావాల్ని కవిత కాని కవితలా వ్రాశాను. పోనీ, కవిత అంటే ఇదేనా? చెప్పేవారెవరూ?
మహతి ఓ సారి నాకు చక్కని విషయం చెప్పింది. ‘నూర్ జహా’ చనిపోతూ తన మనసులోని మాటల్ని కవితగా వ్రాసి౦దట. సహజంగానే ఆమె కవయిత్రి. మాటే కవిత గదా! ఇంతకీ ఆమె వ్రాసింది ఏమంటే,
“నా సమాధి మీద పువ్వుల్ని పరచకండి.
అవి ఎండకి వాడి వత్తులైపోతే
సమాధిలో ఉండే నా హృదయం తట్టుకోలేదు.
నా సమాధి తల వైపున మొక్కలు నాటకండి
వసంత కాలంలో అవి అందంగా పుష్పిస్తాయి.
కోయిలలు ఆహ్లాదంగా ఆ కొమ్మల మీద వాలుతాయి.
కోయిలలు కుహుకుహూ అంటూ కూసే వేళా –
మిత్రులారా.. వాటి కళ్ళ వెంట కన్నీటి బిందువులు
జాలువారుతాయని మీకు తెలుసా?
వాటి కన్నీటిని
సమాధిలో వుండే నా హృదయం భరించలేదు.
అందుకే.. మొక్కలు నాటకండి.
ఆ..
ఓ చిక్కని స్నేహపు నిశ్వాసాన్ని మాత్రం
నా కోసం నిట్టూర్పులుగా విడవండి.
సమాధిలో చలితో తపించే నా
హృదయానికి ఆ స్నేహపు నిట్టూర్పు
వెచ్చదనాన్ని అందిస్తుంది.” అని.
(సారీ.. ఆవిడ కవిత్వానికి నా పైత్యం కొంచెం జోడించక తప్పలేదు. ఆ కవితకి నేను వీర అభిమానిని మరి).
ఆ కవిత ముందర నా కవిత ఎంతది! ఇదే మాట మహతితో అంటే మహతి నవ్వి, “పిచ్చుకా ఆకాశంలో ఎగురుతుంది. గద్దా, కొంగా, కాకీ, తూనీగా, సీతాకోకచిలుక, పావురమూ, గువ్వా, గోరింకా అన్నీ తమ తమ శక్తితో ఆకాశంలో ఎగిరివే.. ఆకాశాన్ని జయించేవే!” అన్నది.
ఎంత చక్కని ఉపమానం. మహతిని తలుచుకోగానే నా మనసులో ఓ ఉల్లాసం, ఓ ఆనందం.
“హలో.. అలగారు కదూ మీరు?” ఓ పాతికేళ్ళ యువకుడు సంభ్రమంగా నన్ను పలకరించాడు.
“అవునండీ” అన్నాను.
“యాక్ట్రెస్ కదూ కదూ. మీ ఫొటోలు పత్రికల్లో చూశా.. అదే, తెలుగు పత్రికల్లో. ‘ధీర’ సినిమా చూద్దామన్నా గానీ, ఢిల్లీలో ఉద్యోగం వచ్చి చూడలేకపోయాను. నేనో కంపెనీకి మేనేజర్‌గా సెలెక్టయ్యాను. ఇవ్వాళ ఆ కంపెనీ పని కోసమే కలకత్తా వెళ్ళాడానికి ఏర్‍పోర్ట్‌కి వచ్చి మిమ్మల్ని చూడగలిగాను. సినిమా వారిని చూడడం ఇదే మొదటిసారి. నా కెంత సంతోషంగా ఉందో చెప్పలేను.”
అతనికి యీ సంఘటన ఎంతో థ్రిల్లింగ్‌గా వుందో అతని ముఖమే చెబుతోంది.
“థాంక్యూ” అన్నాను.
“ఓ చిన్న ఫొటో తీసుకోవచ్చా?” ఓ కెమెరా షోల్డర్ బ్యాగ్ నించి తీసి అన్నాడు.
“సరే” అన్నాను. నా ఫొటో ఒకటి తీశాడు. “మేడమ్.. మీతో కలిసి..” సందిగ్ధంగా ఆగాడు.
“తీసుకోండి ఫరవాలేదు” అన్నాను.
అతను చుట్టూ చూసి అవటాని వైపుకి తిరిగి నుంచున్న ఒకరి భుజాలు తట్టి ఫోటో తీయమని అడిగినట్లున్నాడు. ఆ వ్యక్తి వెనక్కు తిరగ్గానే నాకు షాక్ తగిలింది. అతను మా క్లాస్‌మేట్, హగ్గీ అనబడే హరగోపాల్. సింగర్. గబాగబా నేనతని వైపు నడిచాను.. ఆనందంతో, ఆశ్చర్యంతో. అతనూ నన్ను చూసి నా వైపు రాబోయేంతలో “హరీ” అన్న పిలుపు వినిపించింది. అతను తల వంచుకుని వెనక్కు తిరిగాడు. అతని వైపు వస్తూ ఓ నలభై అయిదు నలభై ఆరేళ్ళ ఆంటీ “కమాన్ కమాన్, ఓ గిఫ్ట్ కొందాం” అంటూ అతని చెయ్యి పట్టుకుని లాక్కుపోయింది. ఫొటో అడిగినతను మరొకర్ని రిక్వెస్ట్ చేసి ఫొటో తీసుకున్నాడు. నేను మాత్రం షాక్‍లో ఉండిపోయా. అసలు హరి ఢిల్లీలో వుండటం ఏమిటి? ఆ ఆంటీ ఎవరూ? ఆవిడ వెనక పెంపుడుకుక్కలా కనీసం నన్ను పలవరించకుండా ఎందకతను వెళ్ళాడు? అన్నీ ప్రశ్నలే.
ఆవిడ చాలా ‘రిచ్’ అని ఆవిడ ఒంటిమీది నగలూ, వస్త్రధారణా చెబుతున్నాయి. ఆవిడ పిలిచిన పిలుపు లోనూ ఓ కమేండ్ ఉంది. మార్దవం లేదు. హగ్గీ మీద ఆవిడకి గల అథారిటీ ఏమిటీ?
హగ్గీ మంచం పట్టడం, హగ్గీ తల్లి మహతి ఇంటికి వచ్చి వారికి హగ్గీ స్థితిని చెప్పడం, ఆ తరువాత మహతి తల్లిదండ్రులు వాళ్ల ఇంటికెళ్ళి మంచీ చెడూ వివరించి చెప్పడం నాకు తెలుసు. అవన్నీ మహతే నాతో చెప్పింది. హగ్గీ ‘సదాశివ’ అనే మ్యూజిక్ డైరక్టర్ దగ్గర అసిస్టెంటుగా కుదిరాడని కూడా మహతే చెప్పింది. ఇప్పుడు చూస్తే అతని వాలకం అలా అనిపించలేదు. డ్రెస్ బ్రాండెడ్ డ్రెస్, షూస్ బ్రాండెడ్ షూస్, కాస్ట్లీ వాచ్. ఓ సంగీత దర్శకుడు, అదీ ఓ చిన్న బడ్జెట్ సినిమాలను మ్యూజిక్ చేసి అతని అసిస్టెంట్ ఈ లెవెల్ స్టేటస్ ఏనాటికీ మెయిన్‌టెయిన్ చెయ్యలేడు. సంథింగ్ యీజ్ రాంగ్.
ఫ్లయిట్ ఎనౌన్స్ చేశారు.. సెక్యూరిటికి బోర్డింగ్‌కీ. విమానంలో ఎక్కేప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరిని చూశాను. హగ్గీ నా వంక చూసి కూడా చూడనట్టు వెళ్ళి మెట్లెక్కాడు. ఆవిడ నడకలో వయసుకి తగని హొయలు. హగ్గీ మీద వాలి నడుస్తుంది. నాకెందుకో చెప్పలేని వేదనో కోపమో ఒకేసారి ఉప్పెనలా ఎగసింది.
ఖర్మకాలి వాళ్ళిద్దరూ నా సీటు ముందువరస లోనే కూర్చున్నారు. వాళ్ళ ముఖాలు కనపడకపోయినా తలలు కనపడుతున్నాయి. ఫ్లయిట్ సాగినంతసేపూ గుసగుసలూ, ముద్దుల శబ్దాలూ.. మేక్సిమమ్ ఆవిడవే. నా మనసు ఏమి ఆలోచించాలో తెలియక బ్లాంక్ అయింది. హైదరాబాద్‌లో లాండ్ అయినప్పడు కూడా వాళ్ళు దిగాకే నేను దిగాను.
లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటికి వచ్చేలోగా కనీసం ఏభైమందికి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ విషయం హగ్గీ గమనించడాన్ని నేనూ గమనించాను. కనీసం వాళ్ళ లగేజ్ తీసుకుని వెళ్ళేప్పుడు కూడా అతను నావంక డైరెక్ట్‌గా చూసే ప్రయత్నం చెయ్యలేదు.
బయటికి రాగానే ప్రొడక్షన్ మేనేజర్ రాజు నన్ను గ్రీట్ చేసి ‘తోపుడు బండి’ (ట్రాలీ)ని తీసుకున్నాడు. చిత్రమేమంటే హగ్గీ, ఆవిడ ఓ పడవ లాంటి పెద్ద కారులో ఎక్కడం నా దృట్టిని దాటిపోలేదు. అటువైపు నేను చూడటం గమనించిన రాజు, “వాళ్ళు మీకు తెలుసా?” అన్నాడు.
“లేదండీ, వాళ్ళు ఈ ఫ్లయిట్ లోనే వచ్చారు, ఢిల్లీ నుంచి. అఫ్‌కోర్స్ జస్ట్ చూడటమే కానీ పరిచయం లేదు” అన్నాను. హగ్గీ నా క్లాస్‌మేట్ అని చెప్పాలనిపించలేదు. అంతకంటే, క్లాస్‌మేట్ అని నేను చెబితే రాజుగారు కొంత చెప్పరేమో అనిపించింది.
“మీకు తెలుసా వాళ్ళెవరో” అన్నాను.
“ఆ కుర్రాడు పాటలు బాగా పాడతాడు. అవకాశం ఇప్పించామని నేను పనిచేసే మరో నిర్మాత ఇంటికొచ్చాడు. ఆయను పాట పాడించుకుని తర్వాత రమ్మని పంపేశారు. అలా కృష్ణానగర్ లోనూ, శారదా నగర్ లోనూ అతన్ని చాలా సార్లు చూశాను. సదాశివ గారి దగ్గర అసిస్టెంటుగా చేరాడని విన్నాను. ఆ తరువాత..” ఆగిపోయాడు.
“ఆ తరువాత?” అడిగాను కారులో కూర్చుంటూ.
“ఆవిడ అతన్ని పట్టింది. అలాజీ.. ఆ తరువాత అని అడక్కండి.” అన్నాడు సుదీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచి. అంటే??!
(ఇంకా ఉంది)