మహతి-27

3
2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[సిర్సాలో షూటింగ్ పూర్తి చేసుకుని హరిలాల్‍తో కలిసి సాయంత్రానికి ఢిల్లీ వస్తుంది అల. ఆమె ఫ్లయిట్ రాత్రి 10.30 కి. హరిలాల్ హోటల్ సవాయ్‍లో ఒక రూమ్ బుక్ చేసి ఉంచుతాడు. ఆ హోటల్‍ యజమానుల్లో తమ సినిమా నిర్మాత కూడ ఒకరని చెబుతాడు. ప్రతికూల వాతావరణం వల్ల ఫ్లయిట్ కాన్సిల్ అవుతుంది. అల ఆ హోటల్‍లోనే ఉండిపోతుంది. హోటల్ వాళ్ళు జగన్నాధ్ అనే తెలుగు వెయిటర్‍ని అల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. అతని ఆ హోటల్ స్పెషల్ బజ్జీలు తెచ్చి ఇస్తాడు. వాటిని తిని, రాత్రికి సౌత్ ఇండియన్ భోజనం సిద్ధం చేయమని కోరుతుంది. మర్నాడు ఉదయం హరిలాల్‍తో కలిసి ఢిల్లీలో కొన్ని దర్శనీయ ప్రదేశాలను చూస్తుంది. సాయంత్ర్రానికి ఎయిర్‍పోర్ట్ చేరుతుంది. తన మనసులో మెదిలిన భావాలని చిన్న డైరీలో రాసుకుంటుంది. ఎయిర్‍పోర్టులో అలను గుర్తు పట్టిన ఓ తెలుగు యువకుడు ఆమెతో ఫోటో దిగాలకుంటాడు. పక్కగా వెడుతున్న ఓ యువకుడిని ఫోటో తీయమని అడుగుతాడు. ఆ యువకుడు వీళ్ళ వైపు తిరుగుతాడు. అతడిని చూసి విస్తుపోతుంది అల. అతను హరగోపాల్, హగ్గీ.  అలని గుర్తుపట్టిన హగ్గీ వాళ్ళ వైపు రాబోతుండగా నలభై అయిదు నలభై ఆరేళ్ళ ఆంటీ వచ్చి హగ్గీని పిలుచుకుని వెళ్ళిపోతుంది. హగ్గీ స్థితి చూసి ఆశ్చర్యపోతుంది అల. హగ్గీ ‘సదాశివ’ అనే మ్యూజిక్ డైరక్టర్ దగ్గర అసిస్టెంటుగా కుదిరాడని అంతకుముందు మహతి చెప్పింది. ఇప్పుడు చూస్తే అతని వాలకం అలా అనిపించదు అలకి. విమానంలో వాళ్ళిద్దరూ అల ముందు వరుస సీట్లలోనే కూర్చుంటారు. ఆవిడ వైఖరి చూసి అలలో ఏదో వేదన కలుగుతుంది. హైదరాబాదులో దిగాకా సుమారు 50 మంది అభిమానులకు అల ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ లోపు హగ్గీ ఆమెతో వెళ్ళిపోతాడు. ప్రొడక్షన్ మేనేజర్ రాజు వచ్చి అలని విష్ చేసి చేస్తాడు. అల హగ్గీ వైపు చూస్తుండడంతో, వాళ్ళు తెలుసా అని అడుగుతాడు. మీకు తెలుసా అని అడిగితే, అతను కొన్ని వివరాలు చెప్పి, ఇకపై అడగవద్దని అంటాడు. – ఇక చదవండి.]

మహతి-2 అల-14:

[dropcap]నా [/dropcap]మనసు మనసులో లేదు. ‘పట్టింది’ అనగానే చేపల చెరువు దగ్గర వల వేసో గేలం వేసో చేపలు పట్టే వాళ్ళు గుర్తుకొచ్చారు. డబ్బు ఎర వేసి ఆంటీ హగ్గీని పట్టిందా? ఎందుకోసం?

నవ్వొచ్చింది. ‘శారీరిక సుఖం’ అంటే నాకు తెలీదు. నిజంగా. కానీ, చిత్రాణి మాటల్లో ఆ అర్థం వంద సార్లు తెలిసింది. చిత్రాణి ఎప్పుడు మాట్లాడినా శృంగారం గురించే మాట్లాడేది. గొప్ప గొప్ప డైరెక్టర్లూ, నిర్మాతలు, తనని ఎలా లొంగదీయాలని ప్రయత్నించారో కథలు కథలుగా చెప్పేది. “ఫలానా హీరోయిన్ పైకి రావడానికి నేనే పరోక్ష కారణం, ఆ ప్రొడ్యూసర్‌ని తిట్టి నేను బయటకు వచ్చాక నా మీద కోపంతో ఆయన యీ హీరోయిన్ని దగ్గరకు తీసి వరుసగా మూడు సినిమాలు తీశాడు. మూడూ సూపర్ హిట్. ఒకవేళ గనక ఆ ఆఫర్‌ని నేను ఒప్పుకుని వుంటేనా? ఇండస్ట్రీని మహారాణిలా ఏలేదాన్ని” అని నిట్టూర్చేది.

అన్ని కథలూ దాదాపు ఒకటే. ఓ గో..ప్ప డైరెక్టర్ ‘డిన్నర్’ ఆఫర్‍ని తిరస్కరించడం, ఓ నలుగురయిదుగురు సూపర్ హీరోలకి లొంగకపోవడం ఎట్సెట్రా ఎట్సెట్రా.

“మరి?” అన్నానొక సారి.

“నువ్వెంత పవిత్రంగా ఉండాలనుకున్నా, ఇక్కడ వుండలేవు. గొప్ప గొప్ప వాళ్ళని నిరాకరించిన నేను – చిత్రాణిని – ఆఫ్ట్రాల్ ఓ సెకెండ్ హీరో వేషాలు వేస్తే ‘డుమ్కీ’ గాడి, ప్రేమలో పడి సర్వం అర్పించా. మిగిలిందేమిటో తెలుసా? వాడికి మూడేళ్ళ అపరిమిత సుఖం – నాకు మూడు నెలల కడుపు, ఏడు నెలల ఏడుపు” చాలా పెద్ద నిట్టూర్పు విడిచింది చిత్రాణి.

ఆవిడ చెప్పిన విషయాల్లో మరో పార్శ్వం కూడా వుంది. ఏఏ స్త్రీలు ఎవరెవర్ని తను చూట్టూ కుక్కల్లాగా తిప్పుకుంటారో, అలా తిప్పుకోడాన్ని ఎంత గర్వంగా ఇతర్ల ముందు ప్రదర్శిస్తారో అనేది ఆ కోణం. నాకు జాలీ, దుఃఖమూ రెండూ ఒకేసారి వచ్చినై.

కారణం, హగ్గీ నా క్లాస్‍మేట్ కావడం, గొప్ప సింగర్ కావడం కూడా. నేను ఎదుగుతున్నాను (ఎంత వరకు ఎదిగానో నాకే తెలీదు), అతను జారుతున్నాడు (ఎంత వరకో అదీ తెలీదు).

మహతికి పోన్ చేశాను ఫ్లాట్‌కి వెళ్లగానే. మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాను. నాకు ‘అల్కా సుభాష్’ అని పీరు మార్చడం నించి హగ్గీ ఆంటీల కథ దాకా.

చాలా ప్రశాంతంగా ‘ఊ’ కొడుతూ విన్నది. ఎక్కడా అడ్డు పడలేదు. మహిలో నాకు నచ్చిన విషయం అదే. ఒక్క ప్రశ్న కూడా వెయ్యదు. ఆసాంతం వింటుంది. విన్నదాన్ని మస్తిక్షం లోకి ఎక్కించుకుంటుంది. అంతా విని తనూ ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది.

నిట్టూర్పు అనేది కూడా మనిషికి ఆశ, నిద్ర, మరపు, మృత్యువు లాంటి దేవుడిచ్చిన వరం. నిట్టూర్పు లోపలున్న భావాల్ని అన్నిట్నీ నిశ్వాస ద్వారా బయటికి పంపి ఆలోచనల భారాన్ని చాలా తగ్గిస్తుంది.

అలాగే ఆవలింత కూడా. గుండెకి ఆక్సీజన్ తగ్గినప్పుడం, నిద్ర వచ్చే ముందు ఆవలింత ద్వారా మనం నోరంతా తెరిచి చాలా ఆక్సీజన్ (ప్రాణవాయవు) ని గుండెకి పంపుతాం. నోటి ద్వారా వెళ్ళే ఆక్సీజన్ గుండెని ఎలా చేరుతుందనా? (ముక్కు) శ్వాస ద్వారా గాలి పీల్చుకోలేక సతమతమయ్యేవారిని నోటి ద్వారా గాలిని పీల్చమంటారు. ముఖ్యంగా అస్తమా వ్యాధి బారిన పడ్డవారు.

“అతను యీ ప్రపంచం మీద ద్వేషంతో, తన మీద తనకి కలిగిన ఇన్‍ఫీరియర్ కాంప్లెక్సుతో ఏదో ఒకటి అసామాన్యమైన పని చేస్తాడని అనుకున్నాను. కానీ, ఇలా చేస్తాడని వూహించలేదు. అలా, అతను యీ వూరు వదిలి వెళ్ళేప్పుడు కూడా ఎవరికీ చెప్పలేదట. నాకు అసలు చెప్పలేదు. వాళ్ళ అమ్మకి బహుశా చెప్పి వుండాలి. లేకపోతే ఆవిడ అందరి ఇళ్ళకు వచ్చి కొడుకు గురించి అడిగి వుండేదిగా.” ఆగింది మహతి.

“ఊ” అన్నాను. మహతికి చెప్పకపోవడం ఆశ్చర్యమే.

“కానీ, అలా, అతను ఏం చేసినా ఎలా వున్నా ఎక్కడ వున్నా అతని లోని ‘గాన కళ’ నశించి పోకూడదు. అతని లోని టేలెంట్ లక్ష మందిలో ఒకరికి కూడా వుండదు. అలా, జీవితం ఎంత విచిత్రమైనదంటే, మన సంకల్పం లేకుండానే, మన ఆలోచనా ప్రయత్నం లేకుండానే అనేక మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులతో మన మనసుని తిప్పుతుంది. ఒకసారి అత్యున్నత శిఖరాలుకి ఎక్కించి, అకస్మాత్తుగా అగాధాల్లోకి విసిరివేస్తుంది. అతని పరిస్థితి మనకి నిజంగా తెలీదు. అది మనకి తెలియకూడదనే బహుశా నీతో మాట్లాడాలని వున్నా మొహం చాటేశాడు. తనని చూసిన విషయం నువ్వు నాకు చెబుతావని కూడా అతనికి తెలుసు. చూద్దాం!” అన్నది మహతి.

“అవునవును. సరే మహీ. ఇప్పటికే నీ నిద్ర చెడగొట్టాను. ఉండనా మరి!” అంటూ ఫోన్ పెట్టేశాను. మహతి అన్నది నిజమే.

‘దుఃఖం ఆటాడుకోని మనిషివరూ?

జీవితానికి అర్థం తెలిసిన మనిషెవరు?

ఆశ, ఆశయం, జీవితం రైలు పట్టాల్లాంటివి.

నింగీ నేల లాగా ఆ పట్టాలు ఎప్పటికీ కలవవు.’

ఎప్పుడో చదివిన ‘పాదచారి’ పలుకులు గుర్తొచ్చాయి.

‘ఓ విషాదమా.. నువ్వు నన్ను కాటెయ్యకు.

కేవలం తోడుండు. దుఃఖించడం అనేది

మృత్యువు కన్నా మేలైనది గదా!’

ఇదీ పాదచారి మాటే. మెల్లగా ఎప్పటికో నిద్రపోయా.

***

శర్మిష్ఠ షూటింగ్‌కి బయలుదేరాను. కనకాక్షి నా మేకప్ విమన్‍గా, అసిస్టెంట్‌గా నాతోనే వుంటోంది. బట్టలు అంటే, మంచి మంచివి నేనే కొనిస్తున్నాను. వేళ పట్టున తింటున్నదేమో, బాగా నిగ్గు తేలింది. పూర్వపు అమాయకత్వం (?) లేదు. హీరోగారు చాలా ఉత్సాహంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆయన పేరు ప్రమోద్ కుమార్ పర్వతనేని. కుమార్ గారని అందరూ పిలుస్తారు. ప్రొడ్యూసర్లు ప్రమోద్ బాబుగారు అంటారు. జాలీ పర్సన్. పవన్ (డైరెక్టర్) యథా ప్రకారం చాలా బిజీగా తన పనిలో తలమునకలై వున్నారు. “అలా.. యీ గేప్‍లో చాలా ఇంప్రూవ్ చేశా. నీ రష్ చూశాక నీ కేరక్టర్ నిడివి ఇంకా పెంచాలనిపించింది.. హీరోగారికీ విషయం చెబితే, ‘మంచి నటి. చక్కగా పెంచు’ అన్నారు.” నన్ను చూడగానే పవన్ అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ‘ధీర’లాగా ఇక్కడ కూడా మంచి మనుషులు మనసులు దొరకడం నా అదృష్టం.

ఆ రోజు షూటింగ్ జరుగుతోంది. ‘సినీలయ’ స్టూడియోలో విలన్ నన్ను బంధించి రేప్ ఎటెంప్ట్ చెయ్యడం. పపన్ చాలా చక్కగా సీన్ వివరించి “రేప్ సీన్ బిగినింగ్ షాటు. హీరో కాపాడే షాటు ముందు తీసేద్దాం. తరవాత రేప్ సీన్ తీద్దాం” అన్నారు. “అదేం?” అన్నాను కన్‍ఫ్యూజ్డ్‌గా.

“హీరో గార్ని వూరికే స్టూడియోలో కూర్చోబెట్టకూడదమ్మా. అదీగాక ఆయన ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల్లో చేస్తున్నారు” నవ్వి అన్నాడు కెమేరామాన్ ముఖేష్ బెడేకర్ గారు.

సినిమాలో ‘రేప్’ సీన్ వచ్చినప్పుడల్లా విలన్ చూసే క్రూరమైన చూపులకీ, క్రూరమైన చేష్టలకీ, చచ్చే భయపడేదాన్ని. షూటింగ్ జరుగుతుంటే మాత్రం నవ్వు ఆపుకోలేక చచ్చాను. మరి నవ్వితే గోలే కదా. చుట్టూతా జనాలు. స్టైలిష్ డ్రెస్‌లో విలన్. అతని పేరు రిషభ్ మీనన్ – మలయాళీ వాడు. పాపం డైలాగ్స్ బట్టీ పట్టి, ‘క్రూరంగా’ ఆ డైలాగ్స్ చెప్పడానికి చాలా కష్టపడుతుంటే, కొన్ని సార్లు నేనే ప్రాంప్టింగ్ ఇవ్వాల్సొచ్చింది. చూపులకి విలన్ లాగా వుంటాడు గానీ, మనిషి చాలా నెమ్మది. చాలా మర్యాదస్తుడు కూడా.

నా ప్రాంప్టింగ్ చూసి, బెడేకర్ “పవన్, రేప్ సీన్ రివర్స్ చేస్తే ఎలా వుంటుంది? అల రేప్స్ రిషబ్” అని పకపకా నవ్వాడు. యూనిట్ మొత్తం నవ్వులే. రిషభ్ మొహం సిగ్గు సిగ్గుగా వాలింది. అది చూసి నేను నిజంగా నవ్వు ఆపుకోలేకపోయాను.

హీరో గారు వెళ్ళిపోయారు గనక షూటింగ్ అంతా మహా అల్లరిగా గడిచిపోయింది. ఆఖరికి బెడేకర్ పేల్చే జోకులకి పవన్ కూడా పగలబడి నవ్వాడు.

“సార్.. ఆడవాళ్ళందరూ మగవాళ్ళని పట్టి కట్టి, కొట్టి రేప్ చేస్తే ఎలాగుంటుందో ఓ సినిమా తీద్దాం సార్” అన్నాడు, అందరి కంటే చిన్న అసిస్టెంట్ డైరెక్టరయిన బాబీ.

“అందులో హీరోయిన్‌వి నువ్వే. అంటే నీకు ఆడవేషం వేసి సినిమా తీస్తాం” అన్నాడు బెడేకర్.

స్టూడియో నిండా నవ్వులే నవ్వులు.

ఎక్కడెక్కడ్నించో వచ్చినవాళ్ళం. సినిమా మమ్మల్నందర్నీ కుటుంబంలా కలిపింది. ఎవరూ ఎవరితోనూ తమ కష్టసుఖాల్ని వెళ్ళబోసుకోరు. తిండి లేక మాడుతున్నా అప్పుడే ‘విందు’కి వెళ్ళొచ్చినట్లు నటిస్తారు. ఎందుకంటే, మన పేదరికం కూడా అడ్డొస్తుంది.

శ్రీ ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారు అంటే, ప్రభ్యాత సినీగాయకులూ, 3,40000 కి పైగా కవితలూ, కీర్తనలూ సన్మాన పత్రాలు 12 కి పైగా భాషల్లో ప్రావీణ్యం వున్న వారూ, వ్రాసిన వారూ ఓ సారి మాతో (నేను, మ్యూజికాలజిస్ట్ రాజా) అన్నారు. ఆ ముచ్చట ఏంటంటే:

ఓసారి ఓ ప్రొడ్యూసర్ వచ్చి PBS గారూ ఫలానా కంపెనీ వారు మీతో పాట పాడిద్దామనుకుంటున్నారు. ఓ సారి కలిస్తే బాగుంటుంది” అన్నారుట. దానికి PBS “అలాగే నండీ” అన్నారుగానీ ఆ కంపెనీకి వెళ్ళలేదు. ఆ విషయం తెలిసిన ఓ ఫ్రెండు, “ఎందుకు వెళ్ళలేదు?” అడిగారు. దానిని PBS “నేను వెళ్ళి పాట అడిగితే వాళ్ళు ఇచ్చింది పుచ్చుకుని పాడాలి. అదే వాళ్ళు నా దగ్గరకి వాచ్చి పాట పాడమంటే, నేను చెప్పిన రేటు ఇచ్చితీరాలి గదా!” అన్నారుట.

అందుకే, ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నవారు కొంత ‘గుంభన’ మెయిన్‌టెయిన్ చెయ్యక తప్పదు.

***

“నేను దివాలీకి బాంబే వెళ్ళి వచ్చేస్తా” అన్నారు ముఖేష్ బెడేకర్ గారు షూటింగ్ అయ్యాక.

“దీపావళి పేరు వింటే నాకు మొదట గుర్తొచ్చేది కృష్ణంరాజు గారు. ఏం రాజసం. దీపావళికి ఓ రోజో రెండు రోజులకో ముందే ఇండస్ట్రీలో అందరికీ పెద్దా చిన్నా అని చూడకుండా రెండు కేజీల స్వీట్లు ఇంటికి పంపేవారు. ఆఖరికి గుంపులో గోవిందా నటులకి కూడా స్వీట్లు వచ్చేవి. గోపీకృష్ణా కంపెనీలో భోజనాలు అద్భుతం” అన్నాడో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టు.

“అవునవును” వెంటనే అన్నారు అరవై ఏళ్ళు పైబడ్డవారు. హీరో విలన్ని చితకబాదితే చూసే సీన్‌లో యాక్ట్ చేయడానికి వచ్చిన ‘ఎక్‍స్ట్రా’ నటులు వాళ్ళంతా.

అన్నట్టు ‘జూనియర్’ ఆర్టిస్టులను సప్లై చేసే సప్లయర్స్ కొందరుంటారు. కాలేజీ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ వయసు వాళ్ళని, ముత్తయివులు అంటే ముత్తయిదువులుగా వుండే వయసు వారినీ, కేవలం జనాల్ని, ఆఖరికి స్కూలు పిల్లల్ని కూడా వారే సప్లై చేస్తారు. దానిగ్గానూ మనిషికి ‘ఇంత’ అని రేటు మాట్లాడుకుని, కమీషన్ తీసుకుంటారు.

అలాగే ప్రతి ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్స్ వారి గ్రూపుల్ని మెయిన్‌టెయిన్ చేస్తారు. సినీపరిశ్రమలో ప్రత్యక్షంగా ఉండేది కొందరైతే, పరోక్షంగా బ్రతికేది వేలాది మంది. అయితే వీరి జీవితాలు కూడా ఏ రోజుకా రోజు దినదిన గండమే. కొన్ని కంపెనీలు ‘దిట్టంగా’ భోజనాలు పెడితే, కొన్ని కంపెనీలు సాంబారు పొట్లం, పెరుగన్నం పొట్లంతో సరిపెడతాయి. మొదట్లో తెలిసేది కాదు. తెలిశాక కలిగిన బాధని ఎలా తట్టుకోవాలో అసలు తెలిసేది కాదు.

మూడో రోజున ‘మృదుల’ వచ్చింది. ఆమె రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా, ఓ ఏడెనిమిది సినిమాల్లో సెకెండు హీరోయిన్‌గా పనిచేసింది. పేరు కూడా తెచ్చుకుంది. ఆ తరువాత కొన్నాళ్ళకు పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీ నించి తొలగి కేరళకి వెళ్ళిపోయింది. ఆ రోజే నేను మృదులని చూడటం.

“సో.. నువ్వు శర్మిష్ఠవా.. అంటే సినిమాలో నా చెల్లెలివీ’ నవ్వుతూ కరచాలనం చేసింది .

“నమస్తే నా పేరు అల.. మీ పేరు మృదుల. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా వుంది“ అన్నాను, కరచాలనం తరువాత చేతులు జోడించి.

“యూ ఆర్ లక్కీ. ఫస్ట్ సినిమా అవగానే శర్మిష్ఠలో నాయిక వేషం. ఆ తరువాత హిందీలోకి వెళ్ళి ‘అల్కా’గా మారడం. ఈ అదృష్టం చాలా కొద్దిమందికి మాత్రమే దొరికే అరుదైన అదృష్టం” నా భుజం తట్టి అన్నది.

ప్రొడక్షన్ వాళ్ళు మరో కుర్చీ తీసుకొని నా కుర్చీ దగ్గర వేశారు. ఆవిడ్ని కూర్చోమని, ఆవిడ కూర్చున్న తరువాత నేను కూర్చున్నాను.

“ఓహ్.. ఇంకా నీకు సినిమా నీళ్ళు వంటబట్టలేదన్న మాట” అన్నది నవ్వి. ఆ నవ్వుకి అర్థం తెలీలా.

“అంటే?” అన్నాను.

“వంటబడితే నువ్వు నన్ను కూర్చొనమని పొరపాటున కూడా అనవు. కుర్చీ తెచ్చిన బాయ్‌ని ఉరిమి చూసి ఆ కుర్చీ తీసేటట్టు చూస్తావు. హీరోయిన్స్ అలాగే ‘లెవెల్’ మెయిన్‍టెయిన్ చేస్తారు. అలాగే మెయిన్‍టెయిన్ చెయ్యాలి. నేను చేశాననుకో!” అన్నది మృదుల.

అసిస్టెంట్ డైరక్టర్ బాబి నన్ను షాట్‍కి పిలిచాడు. చర్చ ఆపి కెమెరా వైపు వెళ్ళాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here