మహతి-28

5
2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[హగ్గీ గురించి నెగటివ్‍గా విన్న అల మనసు మొద్దుబారుతుంది. చిత్రాణి మాటలను, అనుభవాలను గుర్తు చేసుకుంటుంది. మహతికి ఫోన్ చేసి జరిగినదంతా చెబుతుంది. అంత శ్రద్ధగా విని, గట్టిగా నిట్టూరుస్తుంది మహతి. అతను యీ ప్రపంచం మీద ద్వేషంతో, తన మీద తనకి కలిగిన ఇన్‍ఫీరియర్ కాంప్లెక్సుతో ఏదో ఒకటి చేస్తాడని అనుకున్నాననీ, కానీ ఇలా చేస్తాడని ఊహించలేదని అంటుంది మహతి. శర్మిష్ఠ షూటింగ్‌ జరుగుతూంటుంది. అల పాత్ర బాగా వస్తుండడంతో, హీరో అనుమతితో ఆమె పాత్ర నిడివిని పెంచుతాడు దర్శకుడు పవన్. ఒక రోజు అలని విలన్ రేప్ చేసే సీన్ చిత్రీకరిస్తుంటారు. విలన్ కేరళకి చెందిన రిషభ్ మీనన్. డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడితే, అలే ప్రాంప్టింగ్ ఇస్తుంది. మొత్తానికి అల్లరి అల్లరిగా, కెమెరామన్ బెడేకర్ వేసే జోకులతో షూటింగ్ సందడిగా సాగుతుంది. మూడో రోజున ఆ సినిమాలో అలకి అక్కగా నటిస్తున్న మృదుల షూటింగులో జాయినవుతుంది. అలని పలకరించి కరచాలనం చేస్తుంది. అల కరచాలనం చేసి ఆమెకి నమస్కరిస్తుంది. తన కుర్చీ పక్కనే ఇంకో కుర్చీ వేయించి ఆవిడ్ని కూర్చోమని, ఆవిడ కూర్చున్న తరువాత  కూర్చుంటుంది. అయితే నీకు ఇంకా సినిమా నీళ్ళు వంటబట్టలేదన్న మాట అంటుంది మృదుల. అర్థం కాలేదని అల అంటే – హీరోయిన్‍గా లెవెల్ మెయిన్‍టెయిన్‍ చేయటం ఇంకా  అలకి అలవాటవలేదని అన్నానని మృదుల చెబుతుంది. ఇంతలో అసిస్టెంట్ డైరక్టర్ బాబి షాట్‍కి పిలిస్తే లేచి వెళుతుంది అల. – ఇక చదవండి.]

మహతి-2 అల-15:

“నీ పెర్‌ఫార్మెన్స్ అద్భుతం. నీ ముఖంలో చాలా చక్కగా భావాలు పలుకుతై.” షాట్ అయ్యాక నేను కుర్చీలో కూర్చోబోతుండగా అన్నది మృదుల.

“థాంక్యూ” అన్నాను.

“అఫ్‍కోర్స్ నటీనటులకు నటన చాలా ముఖ్యం. కానీ అలా, నీ స్థానాన్ని డిసైడ్ చేసేది నీ నటన కాదు. నీ సినీ/పబ్లిక్ రిలేషన్స్. ముఖ్యంగా ప్రెస్, ఛానల్స్ వాళ్ళాతో. వాళ్ళని రెగ్యులర్‌గా మెయింటైన్ చేస్తే నీ పేరు ప్రతిరోజూ పత్రికల్లో, ఛానెల్స్ లోను వచ్చేట్టు వాళ్ళే చూస్తారు. నటీనటులైనా, రాజకీయ నాయకులైనా బ్రతికుండేది జనాల్లో వారి పేరు నానుతూ వుండేవరకే.” నవ్వింది మృదుల.

నేను అవునన్నట్టు తలాడించాను.

“ఇక సినీ రిలేషన్స్ అంటావా, డైరక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్.. అందర్నీ గ్రిప్‍లో పెట్టుకోవాలి. మెయిన్ టెక్నీషియన్స్‌కి కావల్సిన విధంగా మర్యాదివ్వాలి!” అన్నది.

“కావల్సిన విధంగా అంటే?” అమాయకంగా అడిగా.

“ఇక్కడ దేని లెక్క దానికుంటుంది.” గంభీరంగా అన్నది.

“అలాగా” అని ఊరుకున్నాను. మాటలు కొనసాగించడం నాకు ఇష్టం లేకపోయింది. చిన్నగా నవ్వింది మృదుల.

“ఈ సంభాషణ పొడిగించడం ఇష్టం లేదని నీ మొహమే స్పష్టంగా చెబుతోంది. మొదట్లో నేనూ నీలానే ఉండేదాన్ని. ఎవరేం చెప్పినా నమ్మేదాన్ని కాదు. కాలం గడుస్తూ వుండగా అర్థమయింది. వాళ్ళు చెప్పిందల్లా నిజమేనని. కానీ ఏం చేయడం? జరగాల్సిన డామేజ్ నాకు తెలియకుండానే జరిగిపోయింది. జీవితంలో తప్పొప్పుల పట్టిక అసలు అవసరకు లేదన్న స్థితికి వచ్చింది నా మనసు” నా వంకే చూస్తూ అన్నది మృదుల.

“అదేమీ లేదు మృదుల గారూ. మీరు చెప్పేది వినాలని వుంది. కానీ షూటింగ్ జరిగేప్పుడు నా ధ్యాస చెయ్యాల్సిన సీన్ మీద, చెప్పాల్సిన డైలాగ్ మీద ఉంటుంది. వీలున్నంతవరకూ నా మనసుని డైవర్ట్ కానివ్వను. రెండో విషయం ఏమంటే నేను ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినదాన్ని. మీరు అనుభవంతో ఎదిగినవారు. మీ అనుభవాలు నాకు తప్పక సహాయం చేస్తాయనడంలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. కానీ చెప్పాగా, ఏకాగ్రత పోతే ఏక్ట్ చెయ్యలేను” అన్నాను.

ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి మౌనంగా కూర్చుంది. నేనూ మౌనాన్ని ఆశ్రయించాను.

ఈత వచ్చిన ప్రతివాడు గజ ఈతగాడు అవడు. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వ్యక్తి మృదులలాగో చిత్రాణి లాగో రకరకాల అనుభవాలకి గురికానక్కరలేదు. సంప్రదాయాలు మారుతున్నై. అదివరకటి పెత్తందారీతనాలూ, నిర్బంధాలు తగ్గుతున్నాయి. కష్టనష్టాలు ఎక్కడ లేవు? ‘లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్’ అనే సూత్రం అద్భుతమైనదైనా అన్నిచోట్లా అది పనికి రాదు. నీటికి భయపడే వాడు ఈత ఎలా నేరుస్తాడూ?

రాత్రి 10.30 వరకూ షూటింగ్ సాగుతూనే వుంది. మా యిద్దరి సీన్లు విడివిడిగానూ, కలివిడిగాను తీశారు. మృదుల కూడా చాలా మంచి ఆర్టిస్ట్. అక్క పాత్రలో ఎంత ఒదిగి పోయిందంటే, నాకు నిజ జీవితంలో అక్క వుంటే అలాగే వుండేదనిపించింది. ఆ మాటే అన్నాను.

“థాంక్యూ అలా. థాంక్యూ సో మచ్. కానీ నన్ను అక్కా అని పిలవకు. అక్క చెల్లెళ్ళంటే నాకు అసహ్యం. ఓ అక్క ఇద్దరి చెల్లెళ్ళతో విసిగిపోయా. నాకంటే చిన్నదానివి అయినా నన్ను ఫ్రెండ్‌గా చూస్తే నిజంగా సంతోషిస్తా.” అన్నది. నేను తెల్లబోయాను.

“షాకయ్యావా? ఈ ఇండస్ట్రీ నిజంగా చాలా గొప్పది. రాత్రికి రాత్రే మనిషిని సెలబ్రిటీగా మార్చేస్తుంది. ఒక్క సినిమాతో ‘పేరు’ వూరూ వాడా మారుమ్రోగేట్లు చేస్తుంది. కానీ దాని వల్ల జరిగేది ఏమిటో తెలుసా? మొదట నీ స్నేహితులు నిన్న దూరం పెడతారు. రెండోది నీ రక్తం పంచుకుని పుట్టిన బంధువులే నిన్ను మనీ మేకింగ్ మిషన్‌లా తయారు చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. ఓ క్షణాన నీకా విషయం అర్థమయ్యే సరికే నువ్వు అన్నీ కోల్పోయావని తెసుకుంటావు. జాగ్రత్తపడు అలా, జాగ్రత్తపడు” ఓ విషాదంతో అని కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంది.

“ఈ రోజుకి ఆపేద్దాం. రేపు 9 గంటలకి సిధ్ధంగా ఉండండి. వీలున్నంత వరకూ మీ కాంబినేషన్ పూర్తి చేద్దామన్నారు డైరెక్టర్ గారు” చెప్పాడు ఉజ్వల్, అసిస్టెంట్ డైరెక్టర్. పవన్ దూరంగా పచార్లు చేయడం గమనించాను.

అతని ఆలోచనంతా సినిమా మీదే.

“మృదుల గారూ.. మీ కార్లో నన్ను డ్రాప్ చేస్తారా” అన్నాడు సతీష్, సీనియర్ కోడైరెక్టర్. సీనియర్ అంటే అతని వయసు ఓ నలభై వుంటుంది.

“ఇవాళ చాలా టైర్డ్‌గా వుంది సతీష్” అన్నది మృదుల. “ఓకే ఓకే” అన్నాడు గబగబా నడిచి వెడుతూ. మొదట అతను నన్ను గమనించలా, గమనించాకా కంగారులో వెళ్ళాడు.

“హు!” చికాకుతో అన్నది మృదుల.

నాకు అర్థమైంది.

“కొంత కాలం క్రితం అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇతను ఓ సినిమాకి అసిస్టెంట్ డైరక్టరుగా పరిచయం. ఆ తరవాత అసోసియట్ అయ్యేవరకు మర్యాదగా బాగానే వున్నాడు. ఆ తరవాత అతన్ని ఒబ్లైజ్ చెయ్యక తప్పలేదు” కుర్చీలోంచి లేచి నాతో అడుగులు వేస్తూ అన్నది మృదుల.

***

ఒకప్పుడు పడుకోబోయే ముందు ఆ రోజు జరిగిన అన్ని విషయాల గురించి ఆలోచించి విశ్లేషించుకొనేదాన్ని. ఈమధ్య అది మానేశా. రాత్రి ఎనిమిది అయిన వెంటనే పడుకుని నిద్రపోవడం సాధన చేశాం. పడుకునే ముందు ప్రశాంతమైన ‘పార్థన’ తప్ప ఏదీ మనసు లోనికి రావివ్వడంలా. ఎందుకంటే, ‘నిద్ర లేని మోహం’ కెమేరాకి చులకన అవుతుంది.

హోటల్ నించి ప్రొడక్షన్ వారు రెండు ఇడ్లీలు ఒక దోశ పార్సిల్ తెప్పించారు నా కోసం. టాప్ క్లాస్ హోటల్ గనక మాంఛి పేకింగ్‌తో వచ్చింది.

టిఫిన్ ముగించి ముఖం కడుక్కుని నిద్రకి ఉపక్రమించాను. స్టూడియోలోనే కొబ్బరి నూనెతో మేకప్ తుడిచేశారు. ఆ తరువాత మెత్తని తెల్ల ‘మల్లు’ పీస్‌లని చల్లని నీళ్ళలో ముంచి మేకప్‍ని శుభ్రంగా తుడిచేశారు. అఫ్‌కోర్స్ కనకాక్షి వుండనే వున్నది. మృదుల మాటలు మనసులో నాటుకుని పదకొండున్నరకి గానీ నిద్ర పట్టలేదు.

***

తెల్లని తెల్లవారుఝామున మెలకువ వచ్చింది. అద్దంలో ముఖం ఫ్రెష్‌గా ఉంది. కిటికీ తెరిచి చూద్దును గదా సన్నని చినుకులు పడుతున్నాయి. ‘గాలి’ వర్షంలో తడిసి తానూ చల్లబడింది. కిటికీలన్నీ తీసి ఆ చల్లదనాన్ని  గుండెల్లోకి  పీల్చుకుని బ్రష్ చేసుకొచ్చేయగా కనకాక్షి వేడి వేడి కాఫీ కప్పు చేతికిచ్చింది.

ఆ కాఫీ కప్పు నాకు గిఫ్టుగా ఇచ్చింది వినోద్. “మీరు పొద్దున్న లేచి కాఫీ తాగుతారుగా. ఈ కప్పులో తాగి నన్ను ధన్యుడ్ని చెయ్యండి” అన్నాడు డిపార్టింగ్ రోజున కప్పును అందిస్తూ. మొదటి సిప్ తాగానో లేదో ఫోన్. తియ్యగానే, “హలో అల్కాజీ ఐ యామ్ వినోద్” అన్న మాట వినిపించింది.

నాకు ఆశ్వర్యమూ ఆనందమూ రెండూ కలిగాయి. “హలో సార్.. ఇటీజ్ ఎ సర్‍ప్రెజ్” అన్నాను ఆనందంగా. “నాలుగు రోజుల నించి నువ్వే గుర్తొస్తున్నావు. మరొకటి ఏమంటి నీకు నార్త్ లోని ఏ చోటూ చూపించలేదు. అఫ్‌కోర్స్.. ఆగ్రాకి ఓ రోజు ముందే చేరుకుని, ఫతేపూర్‌ సిక్రీ, మధుర, దయాల్ బాగ్ అన్నీ నేనే దగ్గరుండి చూపిస్తా. మంచి పబ్లిసిటీ వస్తుంది. దానితో సినిమాకి కూడా మంచి హైప్ వస్తుంది. ఎలాగున్నావ్. నీ శర్మిష్ఠ సినిమా బాగా జరుగుతోందా?” హిందీ ఇంగ్లీషు కలగలిపి అన్నాడు. ఎంత ఆత్రంగా అంటే, నేను ఫోన్ ఎక్కడ పెట్టిస్తానో అన్న ఆత్రంలో.

“చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. నా పాత్ర నిడివి కూడా పెంచారు. మీరెలా వున్నారు?” నా బెజవాడ ఇంగ్లీషులో అన్నాను.

“ఓహ్.. హాయిగా వున్నాను. వీలున్నంత త్వరలో రెండో షెడ్యూల్‌కి కలుద్దాం” – ఫోన్ పెట్టలేక పెట్టడం తెలుస్తోంది. అతని మేనేజర్ అతనితో ఏదో చెప్పడం ఇన్ బిట్వీన్ నాకు వినిపించింది కూడా.

“బై సార్” అన్నాను.

“నో సార్.. ఓన్లీ వినోద్” అంటూ ఫోన్ పెట్టేశాడు.

నా మనసులో ఓ ఆనందం. ప్రస్తుతం టాప్‍లో వున్న హిందీ హీరో పర్సనల్‍గా నాతో మాట్లాడటం. రెండోది భయం. ఎందుకు నాతో పరిచయం పెంచుకుంటున్నాడా అని. ఆలోచిస్తూ ఆలోచిస్తూ అసంకల్పితం గానే మహతికి ఫోన్ చేశాను.

“హాయ్ హీరోయిన్.. హౌ ఆర్ యూ” అంది మహతి.

“ఇప్పుడు డబుల్ హీరోయిన్‌ని కదా. అంటే హీరోయిన్ స్క్వేర్ అన్నమాట” నేనూ పకపకా నవ్వి అన్నాను.

“యస్. యస్. ఏమిటి విశేషం?” అన్నది. మహతికి తెలుసు నేను ఏదో సందిగ్ఢంలోనో, ట్రబుల్‌లోనో వున్నప్పుడు నా గొంతు ఎలా వుంటుందో.

“జరిగిన వ్యవహారం ఇదీ” అంటూ మృదుల గురించీ, వినోద్ కపూర్ ఫోన్ చెయ్యడం గురించీ చెప్పాను. అంతా శ్రద్ధగా విన్నది. అదంటే అందునే ఇష్టం. మధ్యలోపు ఒక్క మాట కూడా మాట్లాడకుండా విన్నది.

“అలా.. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఎవరూ నిన్ను కార్నర్ చెయ్యలేరు. మృదుల సంగతి అంటావా? ఇతర్లకి మంచి చెబుతున్నాని అనుకుంటూ భయం నూరిపోసే వాళ్ళల్లో ఆమె కూడా ఒకరు. ఆమె ఇంటెన్షన్ మంచిదే. కానీ అతి జాగ్రత్తలు నీకు నూరిపోసే ప్రయత్రం చేస్తోంది. అలా చేస్తోందని ఆమెకే తెలీదు. సుగర్ టెస్టు చేసే గ్లూకోమీటర్ (?) నీ దగ్గరుందనుకో. వారానికో సారో నెలకో సారో చెక్ చేసుకోవడం మంచిదే. అదే గంటకో సారో పూటకో సారో చేస్తే? ఆవిడ మాటల దారి మళ్ళించు. తనే గ్రహిస్తుంది. ఇక ఆ అక్కాచెల్లెళ్ళ సంగతయితే సినిమాల్లో పని చేసే ప్రతి స్త్రీకీ యీ తిప్పలు తప్పవు. అక్కాచెల్లెళ్ళ సంగతి అలా వుంచు.. స్వంత తల్లిదండ్రులే కూతుళ్ళని మోసం చేసి కొడుకులకు డబ్బుని మేపుతున్నారు. ఆ ప్రాబ్లం నీకు రాకూడదనే మీ అమ్మగారు ముందరే నీకు అన్ని జాగ్రత్తలూ చెప్పి, కుటుంబం నుంచి దూరంగా వుండమన్నారు. ఓ మాట చెప్పనా, సినిమా స్త్రీలే కాదు, ఏ స్త్రీ అయినా ఉద్యోగం చేసేదయినా, వృత్తుల్ని స్వీకరించినదైనా, తన కోసం తన స్వీయ రక్షణ కోసం తప్పని సరిగా కొంత కూడబెట్టుకోవాలి. ఆ ఎమౌంట్‌ని మాత్రం ఎవరి చేతికే అందకుండా చూసుకోవాలి. ఇవ్వాళ భార్య లక్ష సంపాయించినా, భర్త చేతుల్లో పొయ్యడం తప్ప వేరే దారి ఆమెకి లేదు. పెళ్ళికి ముందే స్పష్టంగా చెప్పాలి. నా జీతంలో 40%కి మించి నేను ఇవ్వనూ, నా ఎకౌంట్‌లో నేను దాచుకుంటానూ అని.” స్పష్టంగా అన్నది మహతి. నిజమేగా స్త్రీ ధైర్యంగా, నిర్భయంగా ఉండాలంటే, ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం. మా అమ్మ చెప్పిందీ అదే.

మరో గంట తరువాత సదాశివరావు గారు వచ్చారు. వారికి టిఫిన్ పెట్టి, నేను తిన్నాను. సమయం 7.30 అయింది. కారు 8.45కి వస్తుందని ప్రొడక్షన్ రాజుగారు ఫోన్ చేసి చెప్పారు. “బాబాయ్.. మృదుల తెలుసా?” అన్నాను. ఆయన నవ్వారు.

“తెలుసు. మనిషి మంచిదే. అయితే మెట్లు తొందరగా ఎక్కాలనుకుని రెండు మూడు సార్లు జారిపడింది. అలా, లోకం లోని మనుషులు తప్పులు చేస్తే కేవలం వారిని తప్పుపట్టలేం. పరిస్థితుల ప్రభావం వల్లనే ఎక్కువ తప్పులు జరుగుతాయి. మృదుల తల్లి గ్రూప్ డాన్సర్. నలుగురు పిల్లల్ని కన్నది. భర్త అనేది ఎవరో ఆమెకు మాత్రమే తెలియాలి. కానీ పకపకా నవ్వి ‘నలుగురూ నలుగురికి పుట్టారండీ! ఆ నలుగురి పేర్లు మీరు అడక్కూడదు.. నేను చెప్పకూడదు. ఆ కండీషన్ తోనే వారితో సహజీవనం చేశాను అఫ్‌కోర్స్ ఒకేసారి కాదు. ఒకరి తరువాత ఒకరితో. అందుకే పిల్లకీ పిల్లకీ మధ్య మూడు నాలుగేళ్ళ ఏజ్ గ్యాప్ వున్నది’ అనేది.” ఆపారు సదాశివరావు గారు.

“తెలుగామెనేనా?” కుతూహలంగా అడిగాను.

“ఉహూ.. తమిళామె. అద్భుతమైన స్ట్రక్చరు, బాగా నలుపు. కానీ ఆ నలుపు లోని అందం చెప్పటానికి భాష లేదు.” ఎక్కడో చూస్తూ అన్నారు. నేనాయిన్నే చూస్తున్నాను.

“నిజం చెబితే ఆవిడ్ని పెళ్ళి చేసుకోవాలనే బలమైన కాంక్ష నాకే కలిగింది. ఆమెతో అన్నాను కూడా” అన్నారు.

“ఏమందీ?” ముందుకు వొంగి అన్నాను.

“‘వద్దు రావుగారూ. ఇక ఏ ప్రయత్నమూ చెయ్యదలుచుకోలేదు. మనుషుల్ని నమ్మీ నమ్మీ నమ్మీ నా గుండె చిల్లుపడింది. ఎక్కువ కాలం బ్రతకను. బ్రతకాలనీ లేదు. పెళ్ళి వద్దు. నాతో సుఖం పొందాలంటే సరే, ఆనందంగా నన్ను నేను అర్పించుకుంటా.. ధనానికి కాడు సుమా. నా మీద మీకు వున్న ప్రేమకి’ అన్నది.” సైలెంటయ్యారు సదాశివరావుగారు.

“ఆ తరువాత?” అడిగాను ఉత్కంఠతో

“ఆమెకి ప్రియాతిప్రియమైన స్నేహితుడ్ని అయ్యాను. ఎంత స్నేహం అంటే, అన్ని మాట్లాడుకునే వాళ్ళం. తన జీవితాన్ని నాతో చెప్పింది. అలా, అంత స్నేహం వున్నా మేం ఒక్కసారి కూడా హద్దు దాటలేదు.” మళ్ళీ సైలెంటై కళ్ళు తడుచుకున్నారు సదాశివరావుగారు. నా గుండెలో తెలియని బాధ.

“ఒకే ఒక్కసారి.. నిజగా ఒకే ఒక్కసారి.. అదీ ఆమె చనిపోబోయే చివరి క్షణాల్లో తను బ్రతికి ఉండగానే హాస్పటల్ బెడ్ మీద కూర్చుని కౌగిలించుకున్నా. ‘గుడ్ బై మై ఫ్రెండ్’ అని నా చెవిలో సన్నగా గొణిగి, ప్రాణం విడిచింది.” ఆయన కళ్ళల్లో బొటబొటా నీళ్ళు.

“అంతకు ముందు రోజు నాతో అన్నది ‘నేస్తమా.. నాకు బ్రతకాలనుంది, బ్రతికించవూ’ అని” ఆయన కళ్ళ నించి కన్నీళ్ళు ధారగా కారుతున్నాయి.

ఆ తరువాత మాటల ఏమీ సాగలేదనే కంటే, ఆయన ఏమీ మాట్లాడలేక పోయారు. నిశ్చేష్టురాలినై నేను మౌనంగానే కూర్చొన్నా.

“అమ్మా, కారు వచ్చింది” అన్నది కనకాక్షి.

సదాశివరావుగారు లేచి ‘వెళ్ళొస్తానన్నట్లు’ సైగ చేసి వెళ్ళిపోయారు. స్టూడియో వరకూ ఆయన రూపమూ మాటలే నన్ను వెన్నడాయి.

ప్రేమ ఇలా కూడా వుంటుందా?

నలుగురు పిల్లల తల్లిని అంత గాఢంగానూ ప్రేమించే వారుంటారా.

ఆయనసలు పెళ్ళే చేసుకోలేదుగా.

అంటే –

అమలిన శృంగారానికి అర్థమూ, సాక్ష్యమూ రావుగారే అయి వుండాలి యీ విద్వేష, స్వార్థ ప్రపంచంలో.

ఆయన కన్నీళ్ళే గుర్తు కొస్తున్నాయి.

ఆ కన్నీళ్ళ విలువ ఏ మేధావి, ఏ షరాబు లెక్కగట్టగలడు?

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here