మహతి-30

8
2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[‘శర్మిష్ఠ’ సినిమా షూటింగ్ ముమ్మరంగా సాగుతూంటుంది. అక్కకి ఎదురు తిరిగే సీన్‍లో చెల్లెలి పాత్రలో అల చక్కగా నటించి, డైలాగ్స్ బాగా చెబుతుంది. సీన్ బాగా వచ్చిందని అందరూ అభినందిస్తారు. ఆ పూట షూటింగ్ ముగియటంతో మధ్యాహ్ననికి ఇంటికి వచ్చేస్తుంది అల. తనతో భోజనం చెయ్యడానికి వీలవవుతుందా అని సదాశివరావు గారికి ఫోన్ చేస్తుంది. మొదట వద్దన్నా, భోజనానికి వస్తారు. చపాతీలు కూర చేసుకుంటారు అల, కనకాక్షి. తినడం పూర్తయ్యాకా, పొద్దున తనకీ, మృదులకీ మధ్య జరిగిన సీన్ గురించి, చెప్పి, చివర్లో మృదుల కన్నీరు కార్చడం గురించి చెబితే, బహుశా తనకి ఆమె అక్కచెల్లెళ్ళు గుర్తొచ్చి ఉంటారు అని చెప్పి, అల అడిగిన మీదట, మృదుల అక్కచెల్లెళ్ళ గురించి, వాళ్ళ అమ్మ గురించి ఎన్నో సంగతులు చెప్తారు సదాశివరావు గారు. మృదుల వాళ్ళ అమ్మ పేరు చూడామణి అని, ఆవిడ గొప్ప కూచిపూడి నర్తకి అనీ, సినిమాల్లో డాన్స్ డైరక్టర్ల కోసం ఎన్నో నృత్యాలు తానే స్వయంగా కంపోజ్ చేసిందని చెప్తారు. మృదులని సినిమాల్లో చేర్పించిందనీ తానేనని చెప్తారు. చనిపోయినప్పుడు మణికి 36 ఏళ్ళని చెబితే, అల విస్తుపోతుంది. కాసేపు మాట్లాడుకుని లెమన్ టీ తాగి వెళ్ళిపోతారు సదాశివరావు. మర్నాడు షూటింగులో అలకీ, మృదులకీ మధ్య ఐదు పెద్ద సీన్స్ ఉంటాయి. ఇద్దరూ పోటీపడి నటించటంతో ఆ సీన్స్ అన్నీ అద్భుతంగా వస్తాయి. మృదుల నటనని మెచ్చుకుంటుంది అల. కార్లు తక్కువ ఉన్నాయనీ, నీ కారులో మృదులని ఎక్కించుకుంటావా అని అలని అడుగుతాడు పవన్. సరేనంటుంది అల. కారులో వస్తుండగా మృదుల తన గురించి ఎన్నో విషయాలు మెల్లగా అలకి చెప్తుంది. దుఃఖంతో ఉన్న మృదులని దగ్గరగా హత్తుకుంటుంది అల. తన ఇంటికి రమ్నని అడిగితే, మరో రోజు తప్పక వస్తానని చెప్పి ఒక క్రాస్ రోడ్ వద్ద దిగిపోతుంది. మృదుల చెప్పిన మాటలతో చూడామణి గారి వ్యక్తిత్వం అలకి అర్థమవుతుంది. – ఇక చదవండి.]

మహతి-2 అల-17:

[dropcap]ఇం[/dropcap]టికి వెళ్ళంగానే అర్జెంటుగా “ఆ పిల్లలు మణిగారి పిల్లలు కారు బాబాయ్” అని చెప్పాలనిపించింది. టెలిఫోన్ మీద చెయ్యి పెట్టి, తీసేశాను. ఆయనకి మణి అబద్ధం చెప్పిందని తెలిస్తే, ఆయన తట్టుకోగలరా? అసలామె నలుగురు పిల్లలూ తన పిల్లలని లోకానికి ఎందుకు చెప్పింది? ఎందుకు నమ్మించిందీ? తెలియాలంటే డైరీ చదవాలి. లేదా మృదుల డైరీలో విషయాలు నాకు చెప్పాలి. ఎందుకు చెబుతుందీ? చూడామణి గారు నాకు తెలీదనే ఇవాళ మాట్లాడింది గానీ, ఆవిడ గురించి సదాశివరావు గారి ద్వారా నేను విన్నానని తెలిస్తే, ఒక్కమాటైనా మాట్లాడుతుందా?

పోనీ మహతితో చెబితే? నాకే నవ్వొచ్చింది. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడాలనే కుతూహలం నా మనసు లోనూ పుట్టిందన్న మాట. ఎందుకసలు తొంగి చూడాలీ? చూసినా నేను చేయగలిగింది ఏమిటీ?

ఇతరుల విషయంలో కుతూహలం చూపడం విజ్ఞత కాదని నాకు అనిపించింది. వాళ్ళంత వాళ్ళ చెబితే తప్ప నా అంతట నేను ఏనాడు వారిని అడగొద్దని నిర్ణయించుకున్నాకే మనసుని శాంతి కలిగింది.

బ్రెడ్ తెప్పించుకుని దిట్టంగా జామ్, తెల్లని వైట్ బటర్ లిబరల్‍గా దట్టించి ఎనిమిది స్లయిసెస్ తిన్నాను. ఆ తరువాత చల్లని స్వీట్ లస్సీ తాగి మంచం మీద పడుకుంటే, నా సామిరంగా, నిద్ర తన్నుకొచ్చింది.

బెజవాడ లోనూ అంతే. దిట్టంగా జామ్ బటర్ పుట్టించిన బ్రెడ్ స్లయిసెస్ తెగ తినేదాన్ని. ఒకసారి బ్రెడ్ స్లయిసెస్ మధ్యలో వేడి వేడి సమోస పెట్టి తినేదాన్ని. మీకు తెలుసో లేదో, వేడి వేడి పూరీ మీద బాగా జామ్ బటర్ దట్టించి, రోల్ చేసి తింటుంటే ఉంటుంది

పిచ్చెక్కి పది పూరీలు తినకపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ సీక్రెట్ చాలామందికి తెలీదు. తెలిసాక పూరీకి కర్రీ చేయమని అడగరు, జామ్ బటర్ తోనే పూరీలు లాగిస్తారు.

పొంగల్ అనేది నాకు చాలా అయిష్టం. అసలు దాని మొహమే చూసేదాన్ని కాదు. సినిమా వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ అయిటమ్స్‌లో పొంగల్+వడ+సాంబార్ మస్ట్. వడ అంటే మసాలా వడ కాదు. గారెని తమిళవాళ్ళు వడ అంటారు. ఆ వడ అన్న మాట.

మా వాళ్ళంతా హీరోతో సహా వేడి వేడి గారెల్ని సాంబారు కప్పుల్లో నానేసి, అవి చక్కగా నానాక వాటిని పొంగల్+చట్నీతో నంజుకు తింటారు. దానికి టమోటా చట్నీ కానీ ఉల్లిపాయ చట్నీ గానీ బాగుంటుంది. వేరుశనగ చట్నీ కూడా భేషుగ్గా వుంటుంది. కొబ్బరి చట్నీ అస్సలు బాగోదు. సినిమాల్లో కొచ్చాకా వేడి వేడి పొంగల్, వడా సాంబార్ చట్నీలు కూడా నా ఫేవరెట్ అయిపోయాయి.

“యూ నో వాటీజ్ ది సీక్రెట్ ఆఫ్ హెర్ బ్యూటీ?” అని ఒకరు సరదాగా అంటే, “యా.. ఇటీజ్ ఓన్లీ పొంగల్ వడా సాంబార్” అనేవాళ్ళు మరొకరు. అదీ నేను వాటిని తినేప్పుడు. నవ్వుకునేదాన్ని.

మొత్తానికి సాయంత్రం నిద్రలేచాక అనిపించింది – కల్యాణి గార్ని చూసి చాలా వారాలయిందనీ, ఫాలాక్షతో యీ మధ్య మాట్లాడలేదని. కల్యాణి గారికి ఫోన్ చేశా. ఎవరూ తీయలేదు. ఫాలాక్షకి ఫోన్ చేసి ఓ పది నిముషాల్లో సంగతులన్నీ సంబరంగా చెప్పాను. హాయిగా విని, “అలా, అక్కే నీ దగ్గరకు బయలుదేరుతూ నాకు ఫోన్ చేసింది. డిన్నరే కాక బోలెడన్ని చిరుతిండ్లు కూడా నీ కోసం పేక్ చేసి పట్టుకొస్తోంది. ఈ విషయం నేను నీకు ముందే చెప్పానని చెప్పకు. తెలిస్తే సీక్రెట్‌ని బట్టబయలు చేసినందుకు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది” అన్నాడు చివర్లో. మనసు ఎగిరి గంతేసింది. అబ్బ.. కల్యాణిగారితో వుంటే నాకు మా అమ్మ దగ్గరున్నట్టే వుంటుంది.

గబగబా ఫాలాక్ష చెప్పింది మరిచిపోయి బాల్కనీలో నిలబడి రోడ్డు వైపు చూడడం మొదలెట్టాను.

“ఎవరి కోసం పిల్లా చూస్తున్నావు?” పది నిముషాల తరువాత కారు దిగుతూనే అన్నది కల్యాణి.

“కల్యాణి గారని” నేను కిందకి పరిగెత్తి కావలించుని అన్నాను. స్పర్శ మనసులోని మాటను నిశ్శబ్దంగా మరో మనసుకి తెలియజేస్తే ‘హగ్’ (కౌగిలింత) మనసు లోని ప్రేమ గాఢతని మరొక మనసుకు తెలుపుతుంది.

“ఊ.. అయితే మా తమ్ముడు నీకు హింట్ ఇచ్చేశాడన్న మాట.” చిరుకోపాన్ని నటిస్తూ అన్నది కల్యాణి.

“లేదమ్మా లేదు.. ఇంటికి వెళ్ళి చూసుకుంటే నా మిస్డ్‌ కాల్ కనిపిస్తుంది. అసలు నేనే బయలుదేరాలని రెడీ అవుతున్నా” అన్నాను. ఆ మాట నిజమేగా.

“మహమ్మద్ గారు కొండ దగ్గరికి పోకపోతే కొండే మహమ్మద్ గారి దగ్గరికొస్తుందని పెద్దలు అన్నారు గదా. ది గ్రేట్ హీరోయిన్‌ని వెదుక్కుటూ అందుకే వచ్చాను.” సోఫాలో కూర్చుంటూ అన్నది.

ఆ తరువాత కబుల్లే కబుర్లు. హిందీ ‘ధీర’ కోసం సిర్సా వెళ్ళడం దగ్గర్నించి ‘శర్మిష్ఠ’ నిన్నటి షూటింగ్ వరకు మొత్తం విషయాలన్ని చెప్పాను. టైమ్ ఎనిమిదిన్నర.

“సరే నేను వెళ్ళిరానా?”

“ఊహూ.. ఇవ్వాళ ఇక్కడే ఉండిపో అమ్మా. లేకపోతే నేను నీతో వచ్చేస్తా” అన్నాను.

“ఓకే ఓకే.. నాతో వచ్చేస్తే షూటింగ్‌కి ఎవరు వెడతారూ?”

“అందుకే ఇక్కడే వుండిపో అమ్మా” మారం చేశాను. ఏనాడూ మా అమ్మ దగ్గర మారం చెయ్యలేదు.

“సరేలే. పద. తింటూ కబుర్లు చెప్పుకుందాం. నిద్ర లేకపోతే మొహం వాడిపోతుంది మళ్ళీ” అంటూ లేచి కేరేజీ ల్లోంచి మూడు ప్లేట్లల్లోకి కూరల్ని వడ్డించింది. అరటికాయ ఉప్మా కూర (అల్లం పచ్చిమిర్చి దట్టించి), చేమ దుంపల పులుసు, చక్కని బీరకాయ పచ్చడి, మెంతిమజ్జిగ, చారు, అరిసెలు, మిర్చి బజ్జీలు. ఇంకేం కావాలి. మాతో తినటానికి కనకాక్షి సిగ్గుపడింది కానీ, కల్యాణి కేకలేసి కూర్చోపెట్టింది. బ్రహ్మాడంగా భోజనం ‘బిగించా’. నేను కల్యాణి ఒకే పక్క మీద పడుకున్నాం. 9.30 కి నిద్రపోవడం గుర్తుంది.

***

పొద్దున్నే లేచేసరికీ కల్యాణి స్నానాలు అవీ కానించి సిద్ధంగా వుంది. “నీకు షూటింగ్ వుందని తెలుసు. నువ్వు దానికి రెడీ అయిపో. నేను ఇంటి కెళ్ళిపోతా. షూటింగ్ పూర్తయ్యాక మాత్రం నువ్వు రాకపోతే వూరుకోను” వీపు మీద ప్రేమగా తట్టి వెళ్ళిపోయింది కల్యాణి.

ఎందుకంత ప్రేమ నేనంటే! ‘మన’ అనుకునేవాళ్ళకి దూరమైనప్పుడు దేవుడు ఎవర్నో ఒకర్ని తోడుగా ఇలా పండిస్తాడనుకుంటా. లేకపోతే ప్రేమరాహిత్యంతో జీవితం ఎడారిగా మారిపోదూ!

ఫాలాక్షకి ఫోన్ చేసి వివరాలు చెప్పాను.

“వావ్.. ఉప్మా కూర అంటే నాకు చాలా ఇష్టం. అల్లం పచ్చిమిర్చి వేసి నిమ్మరసం కూడా కాస్త పిండి వుండాలే” అన్నాడు పాలాక్షి.

“మీ గెస్ 100% రైట్. హాట్ పేక్‍లో వచ్చిందేమో, ఉత్తి కూరనే తినేశా. తినేంతసేపూ మీ గురించే చెప్పారు. ఏమేమి ఆటలు ఆడేవారో, ఏమేమి అల్లరి పనులు చేసేవారో, ఏయే కూరలు ఇష్టపడతారో అన్ని చెప్పారు. చాలా విపరీతంగా చదువుతారనీ, సాహిత్యం అంటే ప్రాణం అని కూడా చెప్పారు.” అన్నాను

“అవును. ఇప్పుడయితే చలి రాత్రుల్లో, ఒంటరి పగళ్ళలో సాహిత్యమే నాకు తోడు. సంగీతం దేవుడి భాష అయితే సాహిత్యం మానవుడి హృదయ ఘోష.” అన్నాడు ఫాలాక్ష.

“ఓహ్. అద్భుతంగా చెప్పారు” అన్నాను. నిజంగా ఆ లైన్స్ నాకు చాలా నచ్చాయి

మా ఆత్మీయ సంభాషణ ముగిశాక గబగబా రెడీ అయి కూర్చున్నా. రెండు నిముషాల్లో కార్ వచ్చింది. కొన్ని అరిసెల్ని చిన్న బాక్సులో పెట్టుకున్నా, మృదులకి ఇవ్వాలనిపించింది. కారు మెత్తగా రోడ్డు మీద సాగిపోతుంటే, ఫాలాక్ష పరిచయమూ, కల్యాణి ఇంట్లో నేను పిచ్చి నిద్రపోవడమూ అన్నీ గుర్తొచ్చాయి.

మనసంతా ఓ ఆహ్లాదం నిండింది. ఇప్పటివరకూ నేను చూసిన మగవాళ్ళలో అత్యంత సౌమ్యుడూ, సంస్కారీ, అందగాడూ నిస్పందేహంగా ఫాలాక్షయే. ఏ హీరో అతనికి సాటి రాడు. అతను ప్రవర్తన, సమస్యల్ని అతను డీల్ చేసే విధానం చాలా చక్కగా వుంటాయి. ఇక కల్యాణి గారి ప్రేమకీ అభిమానానికి హద్దే లేదు. కోట్లలో పెట్టి పుట్టినా ఏ మాత్రం భేషజం లేని వ్యక్తి. నాది ఎంత అదృష్టం. వారి పరిచయం, స్నేహం నాకు కలిగాయంటే అది అదృష్టం కాక మరేమిటీ! స్టూడియో దగ్గర కారు ఆగింది.

***

నేను స్టూడియోకి వెళ్ళేసరికే మృదుల మేకప్‍తో సిద్ధంగా వుంది. నేను మేకప్ రూమ్ లోకి వెళ్ళాను.. జస్ట్ మృదులని పలకరించి. చిత్రాణి గుర్తొచ్చింది. “ఒకప్పుడు అసలు స్టూడియోల్లో మరుగుదొడ్లు వుండేవి కాదట. ఔట్‌డోర్ షూటింగ్‌లో అయితే మరీ ఘోరం. మిగతా వాళ్ళు (ఆడవాళ్ళు) చీరలో ఏవో అడ్డంగా పట్టుకుని నిలబడితే గానీ పని జరిగేది కాదు. అలా, మా అమ్మ చెప్పింది. ఆవిడ బాంబేలో కూడా పని చేసి వచ్చింది. అక్కడ మరీ ఘోరం. ఆ తరువాత మద్రాసులో స్టూడియోలు కట్టడం మొదలెట్టి మేకప్ రూమ్స్, టాయ్‌లెట్ రూమ్స్ కన్‍స్ట్రక్షన్ మొదలెట్టారు. చాలా బాంబే స్టూడియోలు మన స్టూడియోలని ఆదర్శంగా తీసుకున్నాయి. కారణం ఏమిటో తెలుసా? బాంబేలో అన్నీ దొరుకుతై – ఒక్క స్థలం తప్ప. అందుకే అక్కడి స్టూడియోలు కూడా మహా విశాలంగా ఏమీ వుండవు” అన్న చిత్రాణి మాటలు గుర్తొచ్చాయి.

“ఇప్పుడైతే స్టూడియోలు అన్ని సదుపాయాలతో వున్నా, డిమాండ్ లేదు. ఆ రోజుల్లో అసలు సినిమా వాళ్ళు జనాలకి కనిపించేవారు కాదు గనక పిచ్చ క్రేజ్. ఇవాళ షూటింగ్ జనాల మధ్యలో పొలం గట్ల మీద, చాకిరేవుల్లోనూ, తోటల్లోను. క్రేజ్ ఏముంటుందీ? తారలు ఆకాశంలో వుండాలి. షూటింగులు, స్టూడియోల్లో జరగాలి, అప్పుడే ఆరాధన అభిమానాలు పెరుగుతాయి” అని కూడా అంది.

మేకప్‍లో కూడా చాలా మార్పులొచ్చాయి. “యస్ మేమ్” అన్నాడు మేకప్ మేన్. ఆలోచనలో వుండగానే మేకప్ అయిపోయిందన్న మాట.

ఆ రోజు సీన్ ఏమంట్, నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి రమ్మని నా అక్క కాళ్ళా వేళ్ళ పడటం. అక్క మీద కోపంతో నేను వెళ్ళిపోయి విమెన్స్ హాస్టల్లో చేరుతాను. అందరిముందు మా ఇద్దరి మధ్యా సీను. నేను చాలా హార్ష్‌గా ఆమెని హర్ట్ చెయ్యాలి. మొదటిసారి చెయ్యలేకపోయా. పవన్ సీరియస్‍గా “అలా.. మనసులో బాగోలేకపోతే మరో రోజున షూట్ చేద్దాం. సగం కాన్సన్‌ట్రేషన్‍తో వద్దు.” అన్నాడు. నాకు ఇన్సల్ట్‌గా అనిపించి, “ప్లీజ్ వన్ మోర్ టేక్ సర్” అన్నాను. ఆయన ముభావంగా ఓకే అన్నట్టు తలాడించి కెమెరా వైపు చూశాడు.

నాకు హిస్టీరియా వచ్చినట్టయింది. వెర్రెత్తినట్టు పాత్రలో దూరిపోయాను. రచయిత రాసిన డైలాగ్స్‌కి అదనంగా కూడా ఏవో నా నోట వచ్చినై.

“కట్” అని డైరక్టర్ అరిచే దాకా ఆ మూడ్ లోనే వున్నాను. ఒక్కసారి నిస్సత్తువ అలముకుంది.

“అలా, నీ జీవితంలోని బెస్ట్ పెర్‌ఫార్మెన్స్‌లలో ఇది ఒకటిగా మిలిగిచిపోతుంది” అన్నాడు పవన్ దగ్గరగా నన్ను హత్తుకుకుని. గొప్పగా చేస్తే చప్పట్లు కురుస్తాయి పాత్రలో జీవిస్తే చప్పట్లు కురవవు, మాట రాని నిశబ్దం మౌనమై అభినందిస్తుంది. బేడేకర్ గారు నా దగ్గరకొచ్చి “అలా.. ఓ గొప్ప నటిని ఇవ్వాళ్ళ చూశాను.. నీ రూపంలో. గాడ్ బ్లెస్ యూ” అంటూ తల నిమిరారు. హాస్టల్‍లో మెంబర్లుగా నటించిన ఎక్స్‌ట్రా నటులు నా దగ్గరకొచ్చి కరచాలనం చేశారు. ఓ తుఫాను భీకరంగా ప్రళయాన్ని సృష్టించి ఆగినట్టు నాకనిపించింది. మృదుల మెల్లగా నా దగ్గరికి వచ్చి కౌగిలించుకుని నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆవిడ చెంపల నిండా కన్నీళ్ళే. మృదుల మౌనం చెప్పింది ఆ రోజు నిజమైన నటిని నేనని.

“లంచ్ బ్రేకోవర్ తరువాత మిగిలిన భాగం పూర్తి చేద్దాం” అన్నాడు పవన్. నేను మెల్లగా తలాడించాను.

“నిజంగా బ్రేక్ ఇప్పుడు ఇవ్వక్కర్లేదు. మరో గంట తరవాత బ్రేక్ చెప్పొచ్చు. కానీ అలా, నీ నటన చూశాకా మైండ్ బ్లాంక్ అయింది” అన్నాడు నవ్వి.

“మృదులా ఇద్దరం కలిసి తిందాం” అని కనకాక్షితో ఆ విషయం ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పమని పంపించాను. టేబుల్సూ ఛెయిర్స్ ఓ చెట్టు కింద వెయ్యమన్నాను. భోజనం చెయ్యకుండా చెరో రెండు చపాతీలు కూర, కొంచెం పప్పు, మసాల బెండతో తినేసి  స్వీట్ లస్సీ తాగాము. ప్రాణానికి హాయిగా అనిపించింది.

“అలా.. నువ్వు కెమేరా ముందు సృష్టించిన బీభత్సానికి నేనేం చేయాలో తెలీడం లేదు” నవ్వి అన్నది మృదుల.

“నన్ను పొగుడుతున్నావు. నాకు తెలుసు.. You can do better” అన్నాను.

“అదంత తేలిక కాదు. నామీద తీయబోయేవి 60% రియాక్షన్లు, 40% డైలాగ్స్. యాక్షన్ వరకూ చక్కగా మేనేజ్ చెయ్యగలననే అనుకుంటున్నాను. ‘రియాక్షన్స్’ గురించే గుండె కొట్టుకుంటోంది” అన్నది.

నిజం కదూ!

“ఓహ్.. గొప్ప మాట అది. గొప్ప పాఠం కూడా” అన్నా మృదుల చెయ్యి గట్టిగా పట్టుకుని.

ఓ డెత్ సిట్యుయేషన్‍లో బిగ్గరగా ఏడుస్తూ గొప్పగా నటించవచ్చు. ఆ సీన్‍లో ‘రియాక్ట్’ కావాలంటే చాలా కష్టం. కేవలం విచారంగా మొహం పెడితే సన్నివేశం పండుతుందా?

కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది మృదుల. నేను డిస్టర్బ్ చెయ్యలా.

ఇక్కడో విషయం చెప్పాలి. షాట్ గ్యాప్‌లో హీరో హీరోయిన్ల దగ్గరికీ, ఇతర నటీనటుల

దగ్గరికీ జనాలు మూగి నానా పిచ్చి ప్రశ్నలతో డిస్టర్బ్ చేస్తారు. కొందరు ఆటోగ్రాఫ్‍లంటారు. కొందరు ఫోటోలంటారు. సదరు నటులు చికాకుపడితే వీళ్ళు పెద్ద అవమానంగా భావించి నానా చెత్తా మాట్లాడుతారు. అది తప్పు. చాలామంది నటీనటుల మనసులో వుండేది తరువాయి భాగం, దానికి మానసిక ప్రిపరేషను. ఈ విషయం చాల మంది అర్థం చేసుకోలేక నటీనటుల్ని తప్పుపడతారు.

***

నేనెంత ఎమోషనల్‌గా చేశానో అంత గొప్పగానూ మృదుల రియాక్షన్స్ వున్నాయి. నిజం చెబితే ఆమె నటనకి నాకే కళ్ళు చెమర్చాయి. సీన్ పూర్తయ్యాక చప్పట్లు. ఈ చప్పట్లగే మాకు ఊపిరి.

“ఫెంటాస్టిక్ మృదులా.. మీ ఇద్దరి నటనా కాంబినేషన్ అదిరింది. ఓహ్” అంటూ ఇద్దర్నీ

అభినందించారు పవన్ సారూ, బెడేకర్ సారు.

చిన్నచిన్న రియాక్షన్స్, క్లోజ్ షాట్లూ తీసేసరికి సాయంత్రం 6.30 అయింది.

“అలా, చాలా కాలం తరువాత మళ్ళీ ఓ ఊపిరి నాలోకి వచ్చింది, నీవల్ల” హగ్ చేసుకొని అన్నది మృదుల.

“అవునూ రియాక్షన్స్ అంత అద్భుతంగా ఎలా ఇవ్వగలిగావూ?” సడెన్‌గా అడిగాను.

తలవొంచుకుంది. ఓ నిముషం తరవాత,

“మా అక్క చేసిన అల్లరికి మా అమ్మ మొహం లోని రియాక్షన్స్ గుర్తుకు తెచ్చుకున్నాను. నిజం చెప్పనా – నువ్వు చేసిన వీరంగం కంటే మా అక్క చేసిన దౌర్యాన్యపు అల్లరి ఎన్నో రెట్లు. ఎన్ని రెట్లంటే, మా అమ్మ చనిపోయింది ఆ రోజే శారీరకంగా కాదు, మానసికంగా!” మెల్లగా స్పష్టంగా అన్నది.

నేను అవాక్కయ్యాను. అసిస్టెంట్ డైరక్టర్ మధు వచ్చి “మేడమ్ ఎవరో హరగోపాల్‌ట, మీ కోసం వచ్చాడు. పంపమంటారా?” అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here