(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[తనకి వంట నేర్పుతూ అమ్మమ్మ చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటుంది మహతి. తనకి తగిన చదువు లేకపోయినా, వంటనే విద్యగా భావించి సాధన చేశానని, దాని ద్వారా తనకో గుర్తింపు వచ్చిందని అమ్మమ్మ చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటుంది మహతి. తన భర్త మీద తనకెంతో ప్రేమ ఉందనీ, ఆయనకెప్పుడూ చల్లారిన వస్తువు పెట్టలేదనీ, తాను ముందు వెళ్ళిపోతే ఆయనకి ఎవరు వేడిగా వండిపెడతారన్న అమ్మమ్మ మాటలు తల్చుకుని బాధపడుతుంది మహి. తాతయ్యని తీసుకుని తోటలోకి వెళ్తుంది మహి. కాసేపు నడిచాకా ఒకచోట ఆగి భార్యని గుర్తు చేసుకుంటారు తాతయ్య. చివరి రోజుల్లో తామెంతో దగ్గరయ్యామని, ఆ గది నిండా ఆవిడ మాటలే ఉన్నాయని అంటారు. మృత్యువు గురించి ఆలోచిస్తుంది మహి. భార్య గొప్పతనాన్ని, తన తల్లి పద్ధతులని మహతికి చెప్తారాయన. మీ అమ్మమ్మకి చదువులేకపోయినా, అద్భుతమైన గ్రహణశక్తి ఉందని అంటారు. కాసేపయ్యాక, ఇంటికి బయల్దేరుతారు. ఇంటికి వెళ్ళాకా, తాను తాతయ్యతో పాటు కర్రావూరి ఉప్పలపాడు లోనే వుంటానని పట్టుబడుతుంది. చర్చలు, వాదనలు అయ్యాకా, చివరికి అంగీకరిస్తారు. అమ్మానాన్న, తమ్ముడు చెల్లి వెళ్ళిపోతారు. అమ్మమ్మ గతంలో చెప్పినట్టుగా తాతయ్యకి ఏయే వంటలు ఇష్టమో, వాటిని ఎలా చేయాలో ఓ పుస్తకంలో రాసుకుంటుంది మహి. ఓ రోజు లైబ్రరీకి వెళ్ళి లైబ్రేరియన్ విశ్వంగారితో కాసేపు మాట్లాడుతుంది. గ్రంథాలయానికి మళ్ళీ ఆదరణ వచ్చేలా ప్రయత్నిస్తానని అంటుంది. బీదలపాట్లు, అన్నా కెరినినా, ప్రకృతి పిలుపు, నవలల్ని; విశ్వనాథ సత్యనారాయణ గారి పురాణవైర గ్రంథమాలలోని ‘నాస్తిక ధూమము’, ‘భగవంతుని మీది పగ’ నవలలు తీసుకుని ఇంటికి వెడుతుంది. – ఇక చదవండి.]
మహతి-3 మహి-3
[dropcap]“కా[/dropcap]స్త ఆ పుస్తకాలు కూడా చదివి వినిపించు తల్లీ..!” నా చేతిలోని పుస్తకాలు తీసుకుని అన్నాడు తాతయ్య. నాకు ఎంతో ఆనందం కలిగిందో చెప్పలేను. తాతయ్యని భక్తిమార్గంలో పెడితే కాస్త కుదుట పడతాడని, అటువైపు మళ్ళించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు నాకు తెలిసింది.. తాతయ్య మళ్ళీ యీ ప్రపంచంలోకి వచ్చాడనీ, మళ్ళీ ‘తెలుసుకోవాల’న్న జిజ్ఞాస ఆయనలో కలిగిందనీ!
“అద్భుతమైన నవలలు తాతయ్యా.. చదవుతూ మరో లోకానికి వెళ్ళిపోతాం!” ఆనందంగా అన్నాను.
“చిన్నప్పుడు చదివావుగా! అట్టల్ని చూసి గుర్తుపట్టాను.”
“తాతయ్యా.. ఇవాళ ‘పురాణవైరి గ్రంథమాల’తో మొదలెడదాం. పన్నెండు నవలలు. ఒకదానికి ఒకటి సంబంధం లేకపోయినా, అన్ని ఒక మాలలోని పూసలే. విశ్వనాథ వారి నవలలు చదివి పక్కన పడేసేవి గాదు. చదివి దాచుకోవలసినవి. రాబోయే తరాలతోను చదివించవలసినవి. అవి జ్ఞాన జలపాతాలు. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లూ మరొక కొత్త కోణంలో మానవ స్వభావాన్ని, ప్రకృతి ప్రతిచర్యలనీ ఆవిష్కరిస్తాయి.” ఉత్సాహంగా చెప్పాను.
“నాకు పదేళ్ళప్పుడు నేను వారిని చూశానమ్మ. వారి ఉపన్యాసమూ విన్నాను. ప్చ్.. చిన్నప్పుడు చదువుకోలేదు. ఆ బాధ ఇప్పటికీ పీడిస్తూనే వున్నది” నిట్టూర్చి అన్నాడు తాతయ్య.
“ఇప్పుడే వస్తాను తాతయ్యా..” అని చెప్పి, గబగబా బయటికొచ్చి ‘ముత్తయ్య’ బుక్ స్టాల్‌కి వెళ్ళాను. “అర్జంటుగా నాకో పెద్దబాల శిక్ష కావాలి. ఉంటే ఇవ్వండి.. లేకపోతే సాయంత్రాని కల్లా తెప్పించండి” అన్నాను. ముత్తయ్య చిన్నగా నవ్వి “ఉన్నదండీ.. మొన్ననే ఓ అయిదు కాపీలు తెప్పించా” అన్నాడు. పలాకా బలపాలు కూడా అక్కడే కొని ఇంటికి తెచ్చా. ఒక పలక ఒక బలపం కాదు. ఇరవై.
“తాతయ్య.. నువ్వు అయిదో తరగతి దాకా చదివినట్టు నా చిన్నప్పుడు చెప్పావు. రేపట్నించీ కొందరు ఇక్కడికి చదువుకోవడానికి వస్తారు. వాళ్ళకి నువ్వు అక్షరాలు, గణింతాలూ, ఎక్కాలూ అన్నీ నేర్పాలి. కాదనకు” అన్నాను.. పుస్తకాలు ఆయన చేతుల్లో పెట్టి. పలకల్ని షాపు కుర్రాడు తెచ్చి అరుగు మీద పెట్టాడు.
“ఇదేమిటే” ఆశ్యర్యపోయాడు తాతయ్య.
“అదంతే” అని మా తాతయ్యని ఒకసారి ప్రేమగా కౌగిలించుకుని బయటకు బయల్దేరాను.
చదువుకోవాలని అనుకున్నా, అవకాశం లేక చిన్నప్పుడే వ్యవసాయంలోకీ, వృత్తి పనుల్లోకో దిగిన వారినో పదిహేను మందినీ, కాఫీ షాపుల దగ్గర కప్పులు కడిగేవారినో ఎనిమిది మందినీ పోగుచేశా.
చెప్పినంత తేలికగా వ్యవహారం జరగలేదు. దాదాపు పదిహేను రోజులు పట్టింది, కాళ్ళరిగిపోయేలా తిరిగితే. కాఫీ షాపు ఓనర్లకి నచ్చచెప్పాల్సివచ్చింది, ఓ గంటకైనా పంపమని.
“ ఏమిటీ స్కూలా?” చిరునవ్వుతో అన్నారు శ్రీధర్.
“ఓ చిన్న ప్రయత్నం. తాతయ్య బాధపడ్డాడు, చదువుకోలేదని. చదువుకీ వయసుకీ సంబంధం ఏమిటీ? వయోజనులతో బాటు చిన్న పిల్లల్ని కూడా చేర్చితే, వాళ్ళల్లో తెలీకుండానే ఓ పట్టుదల పెరుగుతుంది. తాతా మనవళ్ళ పోటీలాగా!” అన్నాను.
“నువ్వన్నది నిజమే సుమా! పెద్దవాళ్ళతో పోటీపడి గెలవాలని పిల్లలూ, పిల్లల ముందు చులకన కాకుడదని పెద్దలూ చాలా శ్రద్దగా విద్య నేర్చుకుంటారు. గడ్ ఐడియా మహీ. చదువు రుచి తెలిస్తే పెద్దలైనా పిల్లలైనా చదవడం మానరు. సిలబస్ ఏమి అనుకున్నావూ?”
“చాలా అయిడియాలు ఉన్నై. పిల్లలకీ పెద్దలకీ నచ్చేవి కథలు.. కథలు చదివి వినిపిస్తూ, ఉంటే, తమంత తామే చదువుకోవాలనే ఉత్సాహం, పట్టుదల పెరుగుతాయి” అన్నాను.
“అవును, ఓ మాట చెప్పనా.. చదువు యొక్క లక్ష్యం ప్రవర్తనను సరిదిద్దడం. సమాజాన్ని రక్షించేది ‘సత్ప్రవర్త’నే. చందమామ కథలు చెప్పినా, ఈసప్ కథలు చెప్పినా, శ్రీమద్రామాయణ భారత భాగవతాలు చెప్పినా మనిషిని ‘మానవుడి’గా మారమనే!” అన్నారు శ్రీధర్.
“మీరన్నది ముమ్మాటికీ నిజమే. నిజం చెబితే డాక్టరు గారూ, యీ సంవత్సరంలో నేను ఏమి చెయ్యాలనుకుంటునో నాకే స్పష్టంగా తెలీదు. ‘చిన్నప్పుడు చదువుకోలేకపోయాను’ అన్న తాత మాట మనసులో నాటుకుని యీ పుస్తకాలు పలకలూ బలపాలు తెచ్చాను. వచ్చిన వాళ్ళని కేవలం అక్షరాస్యుల్ని చేస్తే పనయిపోతుందా? వాళ్ళల్లో లోకాన్ని మథించిన వృద్ధులున్నారు. తమ స్థితి ఏదో తమకే తెలియని చిన్నపిల్లలున్నారు. వీరికి ఏం చెప్పాలి? వృద్ధులను భక్తి వైపు మళ్ళించడం తేలిక. భారత భాగవత రామాయణాల్ని రసవత్తరంగా చెప్పగలిగితే వాళ్ళు అల్లుకుపోతారు. నా సమస్య చిన్న పిల్లల గురించే” అన్నాను.
“ఎటువంటి సమస్యో చెప్పగలవా?” అడిగారు శ్రీధర్.
“వాళ్ళని భక్తి వైపు మళ్ళించడం నిజంగా అన్యాయం. ఈ లోకాన్ని ఇప్పుడే చూస్తున్నారు. కొద్ది కొద్దిగా లోకంతో పరిచయం చేసుకుంటున్నారు. కనీసం లోకరీతిని గుర్తించేంత కూడా ఎదగలేదు. చరిత్ర చెబుదామా అంటే చంపడాలు, చావడాలు. వాళ్ళని మానవత్వం వైపు మళ్ళించాలి. ఎందుకంటారా ఇప్పటికే, అంటే పుట్టిన క్షణానే – కుల, మత, వర్ణ, వర్గ, భాషా సంకెళ్ళని తొడిగేశారు మన పెద్దవాళ్ళు. అవి నిజంగా మనిషిని మానవుడిగా మార్చగలవా?” మనసులోని మాట చెప్పేటప్పుడు నాలోని వేదన బాధ నాకే తెలిసింది. మనసులోని తుఫాను తగ్గలేదు.
“కులమతాలూ, ఆచారాలూ, సంప్రదాయాలు ఓ సంస్కారవంతమైన జీవితాన్ని గడపడానికి ఏర్పరచిన పద్ధతులు. ఒకప్పుడు అవి మంచివైనా చెడ్డవైనా ఇప్పటి పరిస్థితులో అవి చెడుని మాత్రమే బోధిస్తున్నాయని చెప్పక తప్పదు. మానవుడు కనిపిట్టిన అత్యంత ఘోరమైనవి రెండు. ఒకటి ధనం. రెండోది దైవం. ఒక అనంత శక్తిని పేర్లు పెట్టి, భక్తిని కూడా వ్యాపారం చేశారు స్వార్థపరులు. దైవాల్ని సృష్టించింది ఆ పేరు మీద సమాజాన్ని ముక్కలు చెయ్యడానికా? రకరకాల పద్ధతుల్ని ప్రవేశపెట్టి డబ్బులు దండుకోవడానికా? మనిషి కోసం మతం పుట్టిందా లేక మతం కోసం మనిషి పుట్టాడా? తల్లి కడుపులో వున్న పిండం ఆడో మగో ఆ తల్లికే తేలీదు.. ఆ పిండానికి కూడా తెలిదే. ప్రపంచమూ, సృష్టీ, దేవుడూ దెయ్యమూ అనంత ఆకాశమూ జీవజాలమూ ఉన్నాయని ఆ పిండానికి తెలుసా? లేదే. పుట్టిన మరుక్షణమే, కళ్ళు ఇంకా తెరవకముందే, ఆ శిశువు కాళ్ళకీ చేతులకీ కుల, మత, వర్గ, సంకెళ్ళు తగిలించబడ్డాయి. ఏ దేవుడ్ని పూజించాలో ఏ హద్దుల మధ్య జీవితాన్ని నడపాలో స్పష్టంగా పుస్తకాల్లో వ్రాసి మరీ వుంచారు. ఆ శిశువుకి స్వతంత్రం ఎక్కడిది? వాడి దైవాన్ని, వాడి కులాన్ని మతాన్ని మనమే నిర్ణయించేశాం. శతాబ్దాల వెనకే!” ఆగాను. శ్రీధర్ నా వంకే చూస్తూన్నారు.
“సారీ..” అన్నాను.
“లేదు మహీ.. నువ్వు చెప్పే ప్రతి విషయమూ అక్షరసత్యేమే. పేరు దగ్గరి నించే సిద్ధం చేసేసారు.. పుట్టడానికి ముందే! తరతరాల బానిసత్వం! స్వాతంత్రం వచ్చినా అది మనిషి గుమ్మం దాకా కూడా రాలేదు. ఎందుకంటే, స్వాతంత్య్రం సామాన్యుడి గుడిసెలోనో హృదయంలోనో అడుగపెడితే తరతరాలుగా మనుషుల్నీ కట్టి పడేస్తున్న కులమత చెరసాలలు ఒక్కసారిగా కూలిపోతాయిగా! అవి కూలిపోతే ఓట్లు ఎక్కడి నించి వస్తాయీ? మనిషికీ మనిషికీ మధ్య అగాధం సృష్టించడమే రాజకీయం అక్కడ! సామాన్యుడు ఎదగకూడదు. వాడు అజ్ఞానంలో వుండడమే నాయకులకి కావల్సింది” ఆవేశంగా అన్నారు శ్రీధర్.
“ఆశయాలు వల్లించడంలోనూ, పిల్లల తోటి వల్లింప జేయటంలోనూ నాకు నమ్మకం లేదు. ఆచరణలో చూపాలి. అప్పుడే ఆశయానికి ఓ అర్థం వుంటుంది” అన్నాను. అన్నానే గానీ, స్పష్టమైన అవగాహన లేదు.
హాస్పటల్ నుంచి ఫోన్ వచ్చింది.. ఓ పేషంటుకి సీరియస్‍గా వుందని. “సారీ మహీ.. చర్చ మధ్యలో ఆగింది.” గబగబా హాస్పిటల్‍కి వెడుతూ అన్నారు శ్రీధర్.
“మహీ.. వినాలని నేను అనుకోకపోయినా, మీ మాటలు నా చెవినబడ్డాయి. నీ ఆలోచనా విధానం నూటికి నూరుపాళ్ళూ కరెక్ట్. పొట్టకూటి కోసమో, టైంపాస్ కోసమో, పదవి – పరువు ప్రతిష్ఠల కోసమూ చదివే చదువు, చదువు కానే కాదు. ఇందాక నువ్వన్నట్లు మనిషిని మానవుడిగా మార్చేదే చదువు. ఒకప్పుడు ‘కులం’ వల్ల నిరుద్యోగ సమస్య తలెత్తేది కాదు. మతం మనిషి ప్రవర్తనను తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలా తయారుచేసేది. ఇప్పుడు కులమతాలు ఉన్నది విభేదాల్ని, విద్వేషాల్ని రగిలించడానికి.” ఆగాడు తాతయ్య.
అమ్మమ్మ పోయాక తాతయ్య ఇంతసేపు మాట్లాడడం ఇదే. అఫ్ కోర్స్, అమ్మమ్మ చిన్నతనం గురించీ వారి వైవాహిక జీవితాం గురించి గంటల తరబడి మాట్లాడటం వేరే కథ.
“అసలు మనిషికి ఏం కావాలీ? ధనమా దైవమా, పదవా, పరువుప్రతిష్ఠలా, ఏం కావాలీ? సుఖంగా జీవించాలంటే తగినంత ధనం వుండాలి. డబ్బు తగినంత వున్నప్పుడు మనను ప్రశాంతంగా వుంటుంది. ‘తగినంతట అంటే? డబ్బే జీవితం అయితే సుఖానికి చోటేదీ? సరే.. మరేదీ? ఒకడు వేలాది గ్రంథాలు చదివాడు. విజ్ఞాన ఖనిగా మారాడు. సరే.. ఇతరులకు పంచని, ఇతరులకు ఉపయోగపడని విజ్ఞానం వలన ఎవరికి లాభం? ఎవరికి సుఖం? మట్టి కుండలో నీరు ఎప్పుడు పడితే అప్పుడు దాహాన్ని తీర్చగలదు. మేఘాల్లోని నీరే కావాలంటే? మహతీ, ఎన్నెన్ని విధాల ఆలోచనలు వస్తున్నాయో తెలుసా? మనిషి ఏనాడూ సోమరిగా ఉండకూడదు. అలా అని ఇరవై నాలుగంటలూ పనిచేసినా కడుపు నిండకపోతే? ఏది శాశ్వతం? డబ్బా? జ్ఞానమా? పదవులా? పరువు ప్రతిష్ఠలూ, గౌరవాలా? మనిషితో బాటు రావాలా? మనిషితో బాటు అన్నీ మట్టిలో కలిసేవే.. మీ అమ్మమ్మలా.” కూర్చున్నాడు తాతయ్య,
అవును. ఒక యువతిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా ఎన్ని కలలు కన్నదో అమ్మమ్మ. కానీ ఆ కలలు ఏమయ్యాయి? అసలు అటువంటి వ్యక్తి యీ భూమి మీద ఆవిర్భవించిదనడానికి బ్రతికి ఉన్న మేమే సాక్షులం. మరి తరువాత? ఈ నేలని ఎందరు ప్రభువులు పాలించారో ఎవరికి తెలుసు? మంచి ప్రభువుని లోకం గుర్తుపెట్టుకుంటుంది. వారి కోసం మనసులో ఆలయం కడుతుంది.
పరమ దుర్మార్గుడిగా పాలించిన ప్రభువునీ లోకం గుర్తు పెట్టుకుంటుంది. అతని కథల్నీ చిలవలు పలవులుగా లోకం చెప్పుకుంటుంది. వారి సంగతి పక్కనపెడితే సామాన్యుల్ని, సామాన్యుల్లోని అసామాన్యుల్ని? ఉప్పు కారం మామిడి ముక్కలు కలిపిన మొదటి వ్యక్తి ఎవరో చెప్పగలమా? దానిలో ఆవపిండి, మెంతి పిండి, నూనె కలిపితే ఇంకా రుచి పెరుగుతందీ, నిలవ ఉంటుంది అని ఓ మహాద్భుత పరిశోధన చేసి ఆవకాయని తరతరాలకు అందించిన ఆ పరిశోధకుని పేరు చెప్పగలమా? తోటకూర పప్పుకీ, దోసకాయలు పచ్చడికీ, ఇంగువ జీలకర్ర మెంతులూ పోపుకి పనికొస్తాయని చెప్పిన మహానుభావుడు/మహానుభావురాలు ఎవరు? భూమిని చక్కగా లోతుగా గుండ్రంగా తవ్వితే నీరు పడుతుంది, ఆ నీటిని హాయిగా తాగొచ్చు అని బావిని నిర్మించిన వారి చిరునామా ఎవరికి తెలుసు? చనిపోయిన పశువు చర్మంతో చెప్పులు కుడితే పాదాలకు రక్ష గానూ, సౌకర్యంగానూ వుంటాయని చెప్పులు సృష్టించిన పరమాద్భుత సైంటిస్టుని ఎప్పుడైనా మనం తలచుకున్నామా? తనకి ధన్యవాదాలు చెప్పామా? మన సంగతి సరే, ‘బాటా’ కంపెనీ అయినా ఆ అపరిచిత విజ్ఞానికి థాంక్స్ చెప్పిందా? చదువు లేనివాడు సృష్టించిన అద్భుత వస్తు సముదాయాన్ని, చదువుకున్నవాడు దోచుకుని ‘పేటెంట్’ హక్కులు తీసుకుంటున్నాడు. ఇదెక్కడి న్యాయం? నా మనసులోనూ అనేకానేక ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి.
“ఒకప్పుడు వినిమయ పద్థతి (బార్టర్ సిస్టమ్) ఉండేది. అంటే వస్తు మార్పిడి అన్న మాట. రైతు బియ్యమో, ధాన్యమో ఇస్తే కుమ్మరి కుండనీ, వడ్రంగి నాగలినీ, కమ్మరి పలుగులనీ, దుకాణాదారు ఉప్పూ పప్పూ బియ్యం మొదలైన దినుసులనీ, పద్మశాలి వస్త్రాల్నీ ఇచ్చేవారు. అంటే సమాజం అంతా ఒకరిమీద ఒకరు ఆధారపడేవారు. అందరికీ అందరితో అవసరాలు ఉండేవి. చెప్పుల జత కావాలంటే, చర్మకారుడికి వడ్రంగి చెక్కవస్తువులు, కంసాలి బంగారం, కుమ్మరి కుండలు, పద్మశాలి వస్త్రాలూ ఇచ్చేవారు. అంటే ఎక్చేంజ్! అందరూ వరసలతో పిలుచుకునేవారు. వీరి కులం ఎక్కువ వారి కులం తక్కువ అనే భావం మచ్చుకైనా ఉండేది కాదు.” అన్నాడు తాతయ్య.
నేను శ్రద్ధగా వింటున్నాను.
“గ్రామాన్ని నిర్మించేవారు, ఇంత జనాభాకీ, స్థలానికీ ఏ వృత్తి వారు ఎందరుండాలో లెక్క కట్టేవారు. అవసరానికన్నా ఎక్కువమంది వుంటే రాజాస్థానానికి చెప్పాలి. అప్పుడు రాజు ఆ వృత్తి కళాకారుల్ని నిపుణుల్ని ఎక్కడ వారి అవసరం ఉందో అక్కడకి పంపేవాడు. లేదా రాజాస్థానంలో వారికి పని కల్పించేవాడు. నిరుద్యోగమన్న మాటే లేదు. తరాలు గడిచాయి. విదేశీయులు భారతావనిలో చొరబడ్డారు. ఇక్కడి సంఘ నిర్మాణం వారిని అచ్చెరువు పరిచింది. వారి స్వార్థం కోసం ప్రవేశపెట్టింది ‘డబ్బు’. అదొచ్చి ‘వస్తు మార్పిడి’ పద్ధతికి గండి కొట్టింది. వస్తు మారకం చోటుని వారు సృష్టించిన ‘ధనం’ ఆక్రమించింది. అక్కడ్నించీ పతనం ప్రారంభమైంది. ఆఖరికి రైతులు కూడా ఏ పంటని పండిస్తే లాభం వస్తుందో అదే పంటని పండించడం ఆరభించారు. లాభదాయక ఉత్పత్తుల మీద మోజు పెరిగింది.. సర్వనాశనానికి బీజం పడింది.” ఆగాడు తాతయ్య.
“వస్తు మార్పిడి దూరాభారాలకు పెద్దగా ఉపయోగపడదుగా” అన్నాను నేను.
“అవును. ఆ విషయంలో ‘డబ్బు’ నూటికి నూరు పాళ్ళు చక్కని పద్ధతే. డబ్బుని వినియోగంలోకి తేవడం మానవ మేధస్సు యొక్క గొప్పతనమే. కానీ, ఆ డబ్బే చివరికి మానవతని అణగదొక్కి ‘వ్యాపారాని’కి పెద్ద పీట వేసింది.” మళ్ళీ ఆగాడు తాతయ్య.
“నువ్వన్నది నిజమే తాతయ్యా. వ్యాపారం మనిషిని మానవత నుండి దూరం చేసింది. అన్నీ అమ్మకానికే. ఆఖరికి వివాహాల్లో కూడా జరిగేది ‘ధన మార్పిడే!’ ఒకప్పుడు కన్యాశుల్కం, మరోకప్పుడు వరవిక్రయం.. ఇప్పుడు అవి + అతిశయం. దేవుడిచ్చిన ప్రకృతిని మనిషి వ్యాపార వస్తువుని చేశాడు. దేవుడిచ్చిన నీటిని బాటిల్స్‌లో పోసి పావలా ఖర్చుకి పదహారు రూపాయల లాభం ఆర్జిస్తున్నాడు. మనిషి బలహీనతలని ధనంగా ఎలా మార్చవచ్చో కళ్ళారా చూడవచ్చు, హాయిగా బావి నీళ్ళు తాగడానికి బదులు బ్రాండెడ్ మినరల్ బాటిల్స్ వాడుతున్నాం. మరచెంబుకు బదులు బాటిల్స్ వచ్చాయి. అవీ యూజ్ అండ్ త్రో. ప్రతి రోజూ లక్షల కోట్ల వాటర్ బాటిక్ట్ ‘త్రో’ చెయ్యబడి ప్రకృతికి పెను సవాలుగా మారినై. భూమిని నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రతీ వస్తువూ పేక్డ్ సిస్టం లోనే వస్తోంది. పోలిథిన్ ప్రాణాల్ని హరిస్తోంది.. భూమిని బీడుగా మారుస్తుంది. ఓజోన్ పొరకు చిల్లులు పొడుస్తోంది. అయినా మనిషి మారలేదు. మారాలన్న స్పృహే మనిషికి లేదు.” వేదనగా అన్నాను.
తాతయ్య వింటున్నాడు.
“ఓ పక్క భీకరంగా కరిగిపోతున్న మంచుఖండాలు, మరో పక్క ‘సూర్యుడ్నే’ వేడిక్కించే ఉష్ణ పవనాలు. ఇంకో పక్క తుఫాన్లు వరదలూ, సునామీలూ. మానవాళికి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో యుద్ధాలు. ఎంత కాలం యీ దౌర్జ్యన్యాలని ప్రకృతి భరించగలదూ? రెండంతస్తుల నుంచి రెండు వందల అంతస్తులు వుండే ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు, ఎందుకు? అది ఏ భూకంపం వచ్చైనా కూలిపోతే? ఎన్ని వందల మంది మృత్యువు పాలవుతారు? ఇవన్నీ ఎవరూ ఆలోచించారు. అన్నం పెట్టి పొలాలన్నీ ఆకాశహర్మ్యాలు అయిపోతున్నయి. కొండలన్నీ కంకరరాళ్ళుగా మారి రోడ్లవుతున్నాయి. చెరువులు జనావాసాలుగా మారి వరదల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ఏర్ పొల్యూషన్‌కి అంతే లేదు. తాతయ్యా, ఇవీ నేటి పరిస్థితులు.. అన్నీ అందరికీ తెలిసినవే. కానీ నిర్లక్ష్యం.” నా గొంతు లోని వేదనా, అశక్తత నాకే స్పష్టంగా వినిపించాయి.
(ఇంకా ఉంది)