మహతి-4

5
2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[హాఫ్ యియర్లీ పరీక్షల తరవాత క్లాస్ పిక్నిక్ జరుగుతుంది. మహతి వాళ్ళు ఊరి బయట ఉన్న ఓ మామిడితోటకి వెళ్తారు. అక్కడ అన్ని వసతులు ఉంటాయి. వంటలు కూడా అక్కడే చేసుకుందామని అనుకుంటారు.  వరలక్ష్మిగారు, తెలుగు లెక్చరర్ వరదార్యులు గారు, మేథ్స్ లెక్చరర్ సత్యమూర్తి గారు, రవీంద్రనాథ్ గారు పిల్లలతో పాటు పిక్నిక్‍కి వస్తారు. వరదాచార్యులు గారూ, వరలక్ష్మి గారు, రవీంద్రనాథ్ గారూ వంటల అజమాయిషీ చేస్తూ చేయిస్తూ వుంటే మహీ, అల, మాన్య కూరలు తరగడంలోను, ఇతర పనుల్లోనూ సాయం చేస్తారు. రహీమా, భారతీ పక్క తోటలో ఉన్న బాదం ఆకుల్ని గంపనిండా కోసుకొచ్చి టిఫిన్‍లకీ, భోజనాలకీ చక్కగా సరిపోయేట్టు ‘విస్తళ్ళు’ కుడతారు. టిఫిన్ ఉప్మా చేయిస్తారు. అందరూ తినేసినా, వందన మాత్రం దూరంగా ఓ చెట్టుని ఆనుకుని ఉంటుంది. అది గమనించిన మహీ వెళ్ళి వందనని పలకరిస్తుంది. పిక్నిక్‍కి వచ్చినా ఎవరూ మాట్లాడకపోయేసరికి బాధతో ఒంటరిగా కూర్చుని వుంటుందని అనుకుంటుంది మహీ. కాసేపు ఏడుస్తుంది వందన. ఆమెని కాసేపు ఏడవనిచ్చి, గుండె లోని బాధ తగ్గాకా, టిఫిన్‍ తినడానికి తీసుకుని వస్తుంది మహీ. వందన బాధగా కూర్చుంటే, తనని మాటల్లో పెట్టాలనీ – వచ్చి కూరలు తరగడంలో తనకి సాయం చేయమంటుంది మహీ. వందనకి వంటొచ్చా అని అడుగుతారు వరలక్ష్మి గారు. వచ్చని చెబుతూ – తోటలో ఉన్న నేతిబీరకాయలతో పచ్చడి చేస్తానని అంటుంది. వరదాచార్యులు గారు కూడా సరేనంటారు. బోలెడు నేతిబీరకాయలు కోసుకొచ్చి దినుసులన్నీ తనే వేయించి తనే నూరి బ్రహ్మాండంగా పచ్చడి చేస్తుంది వందన. మధ్యాహ్నం భోజనాలకి కూర్చున్నప్పుడు – వడ్డిస్తూ – ఇది వందన చేసిన పచ్చడి అని చెప్పి వడ్డిస్తారు. రుచి బావుందని అందరూ తింటారు. వందన ఎంతో సంతోషిస్తుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మహీని హత్తుకుని కృతజ్ఞతలు చెబుతుంది. పిక్నిక్‍ని బాగా ఆర్గనైజ్ చేశాడని తిమ్మూని మెచ్చుకుంటుంది అల. అతనంటే నీకిష్టమా అని అడుగుతుంది మహీ. అవునంటుంది. రోజులు గడుస్తాయి. తిమ్మూ పత్రికలకి తమ ఊళ్లో జరిగే విశేషాల్ని న్యూస్ అయిటమ్స్‌గా – టెమూజిన్ – అనే పేరుతో పంపుతున్నాడని తెలుస్తుంది. కాలేజీలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తారు శ్రీమన్నారాయణ గారు. వారానికి రెండు సార్లు మా కాలేజ్ ప్లే గ్రౌండ్‍లో ఉన్న బూరుగు చెట్టు క్రింద సమావేశమై ఓ సబ్జెక్టుని ఎంచుకుని చర్చించాలనుకున్నాం. వందనలో కాస్త మార్పు వస్తుంది. కానీ హఠాత్తుగా ఎదుటివాళ్ళని భీకరంగా హర్ట్ చేస్తుంది. మహీ ఎంత ప్రయత్నించినా గుట్టు విప్పదు. అఖిల చాలా మారుతుంది. అల తిమ్మూ ప్రేమలో తలమునలుగా ఉంటే, మహీ హెచ్చరిస్తుంది. ఏదో చెయ్యాలని అనుకుంటుంది. – ఇక చదవండి.]

[dropcap]“మీ[/dropcap] ఫ్రెండ్ కుసుమని హాస్పటల్లో చేర్చారుట” అమ్మ అన్నది. టెలీఫోన్ ఒకటి కొత్తగా మా ఇంట్లో చేరింది. అలాగే మా తాతగారింట్లో ఒకటి పెట్టించారు మా నాన్న. దాంతో ఉత్తరాలు వ్రాయడం అనే అలవాటు అటకెక్కి ఫోన్లలో మాట్లాడ్డం షురూ అయింది. నిజం చెబితే, నా ఫ్రెండ్సూ, మా తాతయ్యా, అమ్మమ్మా రాసే ఉత్తరాలు చదవడం ఎంత బాగుండేదో. మా అమ్మకి అమ్మమ్మ ఉత్తరం రాస్తూ ఇట్లు – మీ ‘అంమ్మ’ అని వ్రాసేది. అదేమిటీ, ‘అ’ పక్కన సున్నా ఎందుకూ? అని అడిగితే, “మా రోజుల్లో అంతే, మీ రోజుల్లో మీరేం రాస్తారో నేను అడుగుతానా?” అని గడుసుగా సమాధానం చెప్పేది.

“ఎప్పుడు చేర్చారూ? ఎలా వుందీ?” ఆలోచిస్తూ అడిగాను. ఆలోచన ఎందుకంటే, అది నా క్లోజ్ ఫ్రెండ్ అయినా నాకెప్పుడూ ఉత్తరాలు రాసేది కాదు. ఆ సౌకర్యం తనకి లేదని ఒకసారి పుట్టింటికి వచ్చినప్పుడు చెప్పింది.

“ఏమో అమ్మమ్మ పొద్దున్న ఫోన్ చేసినప్పుడు చెప్పింది. పోనీ అమ్మమ్మకి ఫోన్ చేసి నువ్వే వివరాలు కనుక్కో!” అన్నది మా అమ్మ.

ఎస్.టి.డి పుణ్యమా అని ఠక్కున ఫోన్ చెయ్యగలిగాను.

“దాని పరిస్థితి బాగోలేదురా. పోనీ ఒక్కసారి రాకూడదూ!” అమ్మమ్మ గొంతులో అభ్యర్థన. ఈ పేరు మీదైనా నన్ను రెండు రోజులు తమ దగ్గర వుంచుకోవచ్చనే ఆవిడ ఆలోచన నాకు తెలిసిపోయింది.. గొంతు వినగానే.

“సాయంత్రం బస్సులో అమ్మమ్మ దగ్గర కెళ్తానే అమ్మా. రేపెలాగూ శనివారమేగా.. మళ్ళీ ఆదివారం రాత్రికల్లా వచ్చేస్తా.” అమ్మతో అన్నాను.

“సరే.. నువ్వు ఎక్కువ సేపు మేలుకుని వుండి వాళ్ళకి నిద్ర లేకుండా చెయ్యకు” జాగ్రత్తలు చెప్పింది మా అమ్మ. నాకు నవ్వొచ్చింది. తాతయ్యకీ అమ్మమ్మకీ ఎప్పుడో గాని నిద్రపట్టదు. తెల్లవారు ఝామునే మళ్ళీ లేచి కూర్చుంటారు. నిద్ర నేను చెడగొట్టటమేమిటీ?

గబగబా నాలుగు బట్టలు ఓ షోల్డర్ బేగ్‍లో కుక్కి బయలుదేరాను. మా అమ్మ ఓ రెండొందలు ఇచ్చింది. టిక్కెట్టు ఖరీదు అయిదు రూపాయలు అని ఆవిడకీ తెలుసు.

బజార్లో ఓ హార్లిక్సు బాటిలూ, ‘థ్రెప్టిన్’ బిస్కట్లూ కొని బేగ్‍లో పెట్టుకున్నా. ఏపిల్స్ మా వూళ్ళో, అంటే కర్రావూరి ఉలవపాడులో దొరకవు. అందుకే, ఓ అరడజను ఏపిల్స్ కూడా కొన్నా. మా వూరు చేరేసరికి ఏడు గంటలయింది. వస్తున్నానని ఫోన్ చెయ్యలేదు. అమ్మనీ చెయ్యద్దన్నాను. పెద్దాళ్ళిద్దరూ తలో కుర్చీ వేసుకుని అరుగుల మీద కూర్చుని వున్నారు. నన్ను చూడగానే తాతయ్య గబగబా ఎదురొచ్చాడు. అమ్మమ్మకి మోకాళ్ళ నొప్పులు మరి.

మాటలే మాటలు. “హాస్పటల్‍కి వెళ్ళి చూసోస్తానే అమ్మమ్మా” అన్నాను. ఆ వూళ్ళో వున్నది గవర్నమెంటు హాస్పటలే. అందరూ తెలిసినవాళ్ళే గనక అడ్డుపెట్టే వాళ్ళు వుండరనుకున్నాను.

“కుదరదే! శ్రీధర్ గారనీ కొత్త డాక్టరొచ్చాడు. ఆరు దాటాక విజిటర్స్ రాకుడదని రూలు పెట్టాడు..” నవ్వాడు తాతయ్య. ఏం చేస్తాం. వంటింట్లో ఆల్రెడీ వంటలు మొదలయ్యాయి.

“బంగాళాదుంప కూర పచ్చిమిర్చీ అల్లం దంచి చేస్తానే.. నీకిష్టం కదా, నిమ్మరసం కొద్దిగా ఆ కూరకి తగిలిస్తే మహత్తరంగా వుంటుంది. మిరియాలు దంచి టమాటా చారు పెడితే కాంబినేషను బ్రహ్మాండంగా వుంటుందనుకో. కొత్తావకాయ చక్కగా వూరి సిద్ధంగా వుంది. ఒసేవ్, బ్రహ్మాండమైన గడ్డ పెరుగుందే.. అదిగో, ఆ కొబ్బరికాయ పగలగొట్టి ఓ గుప్పెడు కొబ్బరి కోరిపెడితే, కొబ్బరికాయ పెరుగుపచ్చడి కూడా చిటికెలో చేస్తానే. పచ్చిమిర్చి తరుగుతో భలే రుచి వస్తుంది. పోపులో ఎండుమిర్చీ ఉండనే వుంటుందాయె..!” ఓ పక్క బంగాళాదుంపలు ఉడికిస్తూ, మరో పక్క వంటల గురించి వూరించి చెబుతోంది మా అమ్మమ్మ. చిన్నప్పటి నుంచీ అంతే. చేయబోయే కూరలు ఎలా వండబోతోందో, వండితే అవి ఎంత రుచిగా వుండబోతాయో కూడా వివరించి చెప్పడం ఆవిడ అలవాటు.

“ఆపవే.. నువ్వు వర్ణించి వర్ణించి చెప్పేదానిలో వందోవంతు రుచిగా వున్నా నా మీసాలు తీసేస్తా” వెక్కిరించాడు తాతయ్య.

“అసలు మీకు సరిగ్గా మొలిస్తేగా తీసెయ్యడానికీ!” నవ్వింది అమ్మమ్మ. మా తాతయ్యకి అక్కడక్కడా తప్ప దిట్టంగా మీసాలు వుండవు; ఆ మాట చెప్పే అమ్మమ్మ ఆయన్ని హేళన పట్టిస్తుంది. హేళన అనేది కొంచెం పెద్ద మాట, నిజానికి అల్లరి పట్టిస్తుంది.

ఆయనా అలా పైపైకి అంటాడు గానీ, అమ్మమ్మ వంటలంటే ఆయనకి మహా యిష్టం. ఎదురుగా మాత్రం పొగడడు.

అల్లం పచ్చిమిర్చీ దంచి నిమ్మరసం పిండిన బంగాళదుంప కూర నిజంగా అద్భుతం. టమాటా చారు ఘాటుకి టేస్ట్ బడ్స్ పులకించాయి. కొబ్బరి పెరుగు పచ్చడి నిజంగా మహత్తరమే. మా అమ్మా బాగానే వండుతుంది గానీ, అమ్మమ్మంత ఎక్స్‌పర్ట్‌ కాదు. కొబ్బరి పెరుగు పచ్చడితో వూరమిరపకాయ నంజుకుంటే, ఓహ్..! తిన్నాక ఒళ్ళు తెలీని నిద్ర ముంచుకొచ్చింది.

***

“ఆ దరిద్రుడి వల్ల నా వొంటి నిండా రోగాలేనే. వాడు ఎప్పుడో పుచ్చిపోయాడు.. రెండు సార్లు అబార్షన్లయ్యాయి. బ్రతకాలని లేదే మహీ” గుండెలు అవిసేటట్లు ఏడుస్తూ అన్నది కుసుమ.

నిజంగా అది పువ్వులాగే సున్నితంగా వుండేది. ఇప్పుడు దాన్ని చూడలేకపోతున్నా. కళ్ళు రెండూ గుంటల్లా వున్నాయి. ఒళ్ళు కర్రపేడులా తయారైంది.

“ధైర్యం తెచ్చుకోవే” దాని చెయ్యి పట్టుకుని గొంతు పెగుల్చుకుని అన్నాను.

“నీకు తెలీదే మహీ.. శోభనం పేరు మీద జరిగే తంతు నీకు తెలీదు. భర్తని చూసి ఆనందంతో శరీరం స్పందించాల్సింది పోయి ఆనాడే నా వొళ్ళు కుంచించుకుపోయిందే. సెక్స్ అనేది ఇంత అసహ్యంగా, ఇంత నీచంగా వుంటుందని తెలీదే మహీ. అబ్బ.. తాగొచ్చాకా, వాడి నోటి కంపూ, ఆ సిగరెట్ల కంపూ ఎంత భయంకరంగా వుంటాయంటే, వాంతి మీద వాంతి అయ్యేది. బలిపశువుని అలంకరించినట్లు అలంకరించి నా మనసుని సమాధి చేశారే వీళ్ళంతా. మహీ.. నువ్వు మాత్రం నాలాగా నేను చేసుకున్నలాంటి దౌర్భాగ్యపు పెళ్ళి చేసుకోకే.” దాని వేదనకీ, ఏడుపుకీ అంతులేదు.

“మేం చేసిన పెళ్ళికి ఏం తీపరమొచ్చిందీ? లక్షణమైన సంబంధం. వంద ఎకరాల ఆస్తి.. ఆ పైన రైసు మిల్లు. ఇదే.. ఊహల్లో బతుకుతూ సంసారాన్ని నిప్పులపాలు చేసుకుంటోంది. మొగాడన్నాకా సిగరెట్లు తాగడా, మందు తాగడా! దీనిది మరీ సుకుమారం. ఏం తీపరమొచ్చిందనీ.. ఎప్పుడూ చూసినా ఏడిచే దాన్ని ఎవడు భరిస్తాడు?” దీర్ఘం తీసింది వాళ్ళ బామ్మ. ఆ ముసల్దాన్ని అక్కడికక్కడే చంపి పాతిపెట్టాలన్నంత కోపం వచ్చింది నాకు. ఈ రాస్కెల్ గురించేగా తొందరపడి కుసుమ పెళ్ళి చేసిందీ.

“పెళ్ళి చూసి చచ్చిపోతానన్నారుగా? ఇంకా బతికెందుకు వున్నారూ? సొంత మనవరాలని కూడా లేకుండా దాన్ని ఎందుకు ఆడిపోసుకుంటున్నారూ? ఛీ.. నువ్వు మనిషివేనా?” పిచ్చి కోపంతో అరిచాను. ఎవతి ఏమనుకుంటే నాకెందుకు. నా అరుపుకి ముసల్దానికి దడ పట్టుకుంది. చిన్నప్పట్నించీ ఆవిడ నాకు తెలుసు. మొండి పట్టుదల. అనుకున్నది జరిగిపోవాల్సిందే.. కొడుకూ కోడలూ కూడా యీవిడ చెప్పినట్టు విని తీరాల్సిందే. నాకేం భయం.

“ఇదిగో అమ్మాయ్.. పెద్దంతరం చిన్నంతరం లేకుండా..” గొంతెత్తి అరవబోయింది.

“నోరెత్తక. నువ్వసలు మనిషి పుటుక పుడితే నీ మనవరాలి బాధ అర్థం చేసుకునేదానివి. నువ్వసలు మనిషివి కాదు. ఆడదానివి అసలే కాదు. మళ్ళీ నోరెత్తకు.. ఏం చేస్తానో నాకే తెలియదు” రెచ్చిపోయి అరిచాను.

“ఇది హాస్పటల్.. చేపల మార్కెట్ కాదు. అరుపులూ పెడబొబ్బలూ పెట్టడానికి” సీరియస్‍గా మగ గొంతు వినిపిస్తే ఠక్కున వెనక్కి తిరిగి చూశాను. డాక్టరు గారు. చాలా అందంగా హుందాగా ఉన్నారు.

“సారీ డాక్టర్.. ఈ ముసల్ది, అదే యీ పెద్దావిడ, అంతా నా ఫ్రెండ్ తప్పే అన్నట్లు మాట్లాడితే సహించలేక అరిచాను. చచ్చే ముందు మనవరాలి పెళ్ళి చూడాలని గోలపెట్టి మరీ యీవిడే కుసుమ పెళ్ళి జరిపించింది” డాక్టర్‍కి వివరించా.

నా గొంతులో కోపం తగ్గలేదని నాకే తెలుస్తోంది.

“ఫస్టాఫాల్ బీ కూల్..” అని, కుసుమ బీపీ చెక్ చేశాడాయన. “ఓ అరగంట తరవాత నా గదికి రండి” అని నాతో చెప్పి మిగతా పేషంట్స్‌ని చూడ్డానికి వెళ్ళాడు.

ముసల్ది మొహం మటమటలాడిస్తూ సణుగుతూనే వుంది. నేనేమీ పట్టించుకోలేదు. నేను యీవిడ్ని తిట్టిన విషయం ఖచ్చితంగా మా తాతయ్యకీ అమ్మమ్మకీ చెబుతుంది. మా వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు కాదుగా.

కుసుమ మౌనంగా వుంది. నేను వాళ్ళ బామ్మని తిట్టిపొయ్యడం దానికి కాస్త సంతృప్తిని ఇచ్చిందేమో అనిపించింది.

అరగంట తరవాత డాక్టరు గారి కన్సల్టింగ్ రూమ్ లోకి వెళ్ళాను. హాస్పటల్‌ని నీట్‍గా మెయిన్‍టెయిన్ చేస్తున్నారనిపించింది.

“కమ్ ఆన్.. నువ్వు కుసుమకి ఫ్రెండ్‌వి కదూ. నీ పేరేమిటీ?” కుర్చీ చూపించి అన్నారు డాక్టర్ గారు.

నా వివరాలన్నీ చెప్పాను.

“గుడ్. మహతీ, నీ ఫ్రెండ్ పరిస్థితి నిజంగా బాగోలేదు. మొదట ఆ పిల్లకి కావల్సింది మానసికమైన ప్రశాంతత. సరే, ఇవాళా రేఫు ‘సుఖరోగాల’కి మంచి మందులే వస్తున్నై. ఆ సంగతలా వుంచితే ఆ పిల్ల భర్తకి ఖచ్చితంగా మెడికల్ ట్రీట్‌మెంట్ అవసరం. అలాగే కుసుమకి మరోసారి అబార్షన్ చేసే పరిస్థితి రాకూడదు. నువ్వన్నట్టు ఆ బామ్మ కేరక్టర్ మహా మూర్ఖపుది. అందుకే నిన్ను పిలిచి చెబుతున్నా. కొన్నాళ్ళ పాటు నీ ఫ్రెండ్‌ని భర్తకి దూరంగా ఉంచడం చాలా మంచిది. అలాగే యీ పెద్దావిడ నుంచీ కూడా. ఓ ప్రశాంతమైన వాతావరణంలో ఓ ఆర్నెల్లో సంవత్సరమో ఆ అమ్మాయి మందులు కంటిన్యూ చేస్తే గానీ మామూలు మనిషి కాదు” చెప్పాల్సింది సూటిగా చెప్పారు డాక్టర్ శ్రీధర్.

“నేనేం చెయ్యగలనో నాకే అర్థం కావటం లేదు డాక్టర్. కుసుమ తల్లీ తండ్రులకి విషయం వివరించినా ప్రయోజనం ఉంటుందనుకోను. కానీ, మీరొక్కసారి కుసుమ పేరెంట్స్‌కి వివరించి చెప్పండి. కుసుమ భర్త ట్రీట్‍మెంట్ కోసం ఈ వూరు వస్తాడని నేను అనుకోను. నేనూ తల్లిదండ్రుల మీద ఆధారపడ్డదాన్నే కానీ, ఫైనాన్షియల్‍గా ఇండిపెండెంట్‍ని కానుగా. అయినా, మా తాతయ్య, అమ్మమ్మలతో చర్చించి చూస్తాను” నిస్సహాయంగా అన్నాను.

చాలాసేపు ఆయన నా వంకే చూశారు. ఆ తరవాత, “నువ్వేదో చేస్తావనీ, చేసి తీరతావనీ నాకెందుకో నమ్మకం కలుగుతోంది.. ఈ విషయంలో నేనేమీ కంపెల్ చెయ్యను. ఏమి చెయ్యగలవో నువ్వే ఆలోచించుకో. ట్రీట్‍మెంట్ విషయంలో మాత్రమ్ పుల్ కో-ఆపరేషన్ ఇస్తాను. కన్సెషన్ కూడా” చిన్నగా నవ్వి అన్నారు డాక్టర్ శ్రీధర్. ఆ వొక్క మాటకే నాకెంతో సంతోషం కలిగింది.

లోకంలో ఇదో చిన్న విషయమే. అయినా చాలామంది యీ చిన్న విషయన్ని పట్టించుకోరు. నీలో అది లేదూ ఇది లేదూ అని లోపాల్ని వెదికే బదులు ‘నువ్వు ఖచ్చితంగా యీ పని చెయ్యగలవన్న నమ్మకం నాకున్నది’ అనే ఒక్క మాట అంటే ఎదుటి వ్యక్తికి ఎంత సెల్ఫ్-కాన్ఫిడెన్స్ పెరుగుతుందీ!!

ఆయనన్న ఆ మాట నిజంగా నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది. ఓ గంట తరువాత ఇంటికెళ్ళాను. ఆ గంటలో కుసుమ బామ్మని తెలివిగా పక్కకు పంపి, కుసుమ నించి కొన్ని వివరాలు రాబట్టాను. ఇంటికెళ్ళాక అమ్మమ్మనీ, తాతయ్యనీ కూర్చోబెట్టి అన్ని విషయాలూ నాకు తెలిసినంత వరకూ వివరించాను. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించమన్నాను.

వారిద్దరూ సైలంటయ్యారు. కుసుమకి బాగోలేదనే వాళ్ళకు తెలుసు గానీ, ఆమె కుటుంబ పరిస్థితులు నిజంగా వాళ్ళకి తెలీవు. రెండోదేమంటే, వూరు చిన్నదయినా పెద్దదయినా ఇటువంటి విషయాలు ఎవరూ ఎవరికీ చెప్పరు. చిత్రం ఏంటంటే, సుఖరోగాల్ని అంటించిన వెధవని బయటికి ఏమీ అనరు – కానీ ఆడదాన్ని మాత్రం ఆవిడేదో మహా పాపకార్యం చేసినట్టు వెలి వేస్తారు. ఇది చదువు లేని వాళ్ళ సంగతి కాదు, చదువుకున్న లలనామణులూ చేసేదీ యీ పనే. ఎదుటిదాన్ని అవమానించటంలోనో, హింసించటంలోనో, అపవాదులు వేయటంలోనో చాలామంది ఆడవాళ్ళకి పరమ సంతోషం లభిస్తుందని నాకు చాలా సార్లు అర్థమయింది.

“నేను కుసుమ తల్లిదండ్రులతో మాట్లాడుతాను. ఆ తరవాతే ఓ నిర్ణయానికి వద్దాం” చాలాసేపు మమ్మల్ని కమ్మేసిన మౌనపు కవచాన్ని బద్దలు చేస్తూ అన్నాడు తాతయ్య.

తాతయ్య పైకి మామూలుగా కనిపించినా, మంచి ఆలోచనాపరుడు, సమర్థుడు. ఆ విషయం నాకు ఆయన అన్న మాటతో స్పష్టంగా అర్థమయింది.

“మీ తాతయ్య అడుగుపెడితే కాని పని అంటూ వుండదే మహీ.. నిశ్చింతగా వుండు. సరే, నువ్వు కొంచెం సహాయం చేస్తే బ్రహ్మాండంగా కంది పచ్చడీ, దానికి తోడుగా వంకాయ పచ్చిపులుసూ చేస్తా. వడియాలు ఎలానూ వుంటాయనుకో.. నువ్వు హాయిగా తినేసి, ఆ కుసుమకి కూడా తీసికెళ్ళు. ఇవ్వాళ నో కూరా పప్పూ. రాత్రికి ఏం స్పెషలో ఇప్పుడు చెప్పను” అంటూ వూరించింది అమ్మమ్మ.

కుసుమకి భోజనం తీసుకెళ్లాను.

“పథ్యంగా పెట్టలా, ఏదైనా పెట్టొచ్చా డాక్టర్?” అడిగాను. దానికి మధ్యాహ్నం భోజనంగా కంది పచ్చడీ, వంకాయ పులుసూ, వడియాలూ, కొబ్బరి పెరుగు పచ్చడీ పట్టుకెళ్ళి, అఫ్‌కోర్స్, మెనూ చెప్పాను.

“నిజంగా చెబితే నువ్వు తెచ్చినవి ఏమీ పెట్టకూడదు. కానీ హాయిగా పెట్టు. అసలు ఆ పిల్ల అన్నం తినగలిగితే ఇప్పుడే సైలైన్ పెట్టడం మానవచ్చు” నవ్వి అన్నారాయన.

“మీరు భోంచేశారా డాక్టర్?” మళ్ళీ అడిగాను.

“లేదు. ఏం?” కొంచెం ఆశ్చర్యంగా అడిగారు.

“అన్నీ ఎక్కువే తెచ్చాను” నవ్వి, నేను తీసికెళ్ళిన కేరేజీ డాక్టర్ గారి రూమ్ లోకి షిప్ట్ చేశాను. చక్కని పచ్చని అరిటాకులు, మా ఇంట్లోవే, లేతగా అందంగా వున్నవాటిని చుట్టచుట్టి తెచ్చాను. బోలెడు స్పూనులు, గరిటెలు, గ్లాసులతో సహా.

“ఏమిటీ నాకు వడ్డిస్తావా?” నవ్వారాయన.

“యస్సర్” అంటూ ఆయన్ రూమ్ లోనున్న వాష్ బేసిన్ చూపించా.

శ్రీధర్ గారి టేబుల్ నిండా బోలెడు అయిటమ్స్ వున్నాయి. వాటినో పక్కకి సద్ది, నేను తెచ్చిన న్యూస్ పేపరు స్ప్రెడ్ చేసి, దాని మీద అరిటాకు వేసి, కేరేజీ విప్పి  అన్ని అయిటమ్స్ పొందిగ్గా వడ్దించాను.

“మైగాడ్, ఇన్ని అయిటమ్సా?” నా వంక చూసి అన్నారు.

“తనకి చారు విడిగా తెచ్చాను. మీరు తింటూ వుంటే నేను దానికి వడ్డించి వస్తాను” అన్నాను నేనూ చిన్నగా నవ్వి.

ఓ చిన్న కంచంలో దానికి కొద్దిగా పలచని పప్పుచారూ, కొద్దిగా కందిపచ్చడీ, వడియాలూ, కొంచెం వంకాయ పులుసు పచ్చడీ వడ్డించి, “సార్, మీరు ఇవన్నీ మిగల్చకుండా తినెయ్యండి.. నేను తినేసే వచ్చా” అని చెప్పి కుసుమ బెడ్ దగ్గరికి వెళ్ళాను. శ్రీధర్ గారి దగ్గర ఓ వాటర్ బాటిల్ పెట్టి, మరొకటి కుసుమ దగ్గరకి తీసికెళ్ళా.

ఏ కళనున్నదో గానీ, చక్కగా కలిపి చెమ్చాతో తినిపిస్తే చక్కగా తిన్నది.. అఫ్‍కోర్స్.. కొంచెంగానే.. కానీ ఇష్టంతోనే. ఏవేవో కబుర్లు చెబుతూ మరి కొంచెం తినిపించా. తిన్నాక పది నిముషాల్లో అది నిద్రపోయింది. వాళ్ళ బామ్మ ఇంటి దగ్గర్నించి తెచ్చుకున్న భోజనం తిని నేనొచ్చేటప్పటికే వార్డు బయట వున్న మంచం మీద పడుకుని కునుకు తీస్తోంది. అదీ మంచిదే అయింది. లేకప్తే, పథ్యం పథ్యం అంటూ ఏమీ పెట్టనిచ్చేది కాదు.

“నువ్వు చాలా పొందిగ్గా వొడ్దించావు. సో నైస్ ఆఫ్ యూ.. భోజనం రుచి మరిచి చాలా కాలం అయింది. చాలా నాళ్ళ తరువాత ఇవ్వాళ బ్రహ్మాండమైన భోజనం చేశాను.” చాలా తృప్తిగా అన్నారు శ్రీధర్ గారు. ఏనుగెక్కినంత సంబరం కలిగింది నాకు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here