మహతి-40

3
1

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[త్రిపుర గారితో కలిసి కుసుమ వాళ్ళింటికి వెళ్తుంది మహతి. కుసుమ వాళ్ళ అమ్మ, నానమ్మ మహతిని చూసి ఏడుస్తారు. తమ బాధ వెళ్ళబోసుకుంటారు. కాసేపుండి వచ్చేస్తారు మహతి, త్రిపుర. దారిలో తన జీవితం గురించి కాస్త చెప్తారు త్రిపుర. కుసుమ వాళ్ళ అమ్మా, నానమ్మల దుఃఖం దూరం చేయడానికి వాళ్ళని విస్తళ్ళు కుట్టే పనిలో నిమగ్నం చేయాలని చెప్తారామె. మహతి అంగీకరిస్తుంది. త్రిపురా, మహతి – విస్తళ్లను కుట్టిచ్చేందుకు కుసుమ అమ్మనీ, నానమ్మని ఒప్పిస్తారు. ఇంటికి వస్తూ తన వివాహం విఫలమవడం, తాను కొన్ని పనులు నేర్చుకోవడం, ఉద్యోగం సంపాదించడం గురించి మహతికి చెప్తారు త్రిపుర. పర్యావరణానికి చేయాల్సిన మేలు గురించి, ప్లాస్టిక్, పాలిథిన్ అనర్థాల గురించి స్కూళ్ళల్లో బాగా ప్రచారం చేస్తారు. వీళ్లతో పాటు డా. శ్రీధర్ గారి మిత్రుడు డా. సూరి కూడా చేరుతారు. విస్తళ్ళు కుట్టే కార్యక్రమాన్ని మరింత గా పెంచాలనుకుని, టముకు వేయిస్తారు. మరికొందరు ఆడవాళ్ళు వచ్చి చేరుతారు. కక్కరాల పుల్లయ్య అనే దుకాణాదారు అడ్డాకుల్ని తక్కువ ధరకి సప్లయి చేసేందుకు ముందుకొస్తారు. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికీ, విజయవంతం చేయడానికి చేయాల్సిన పనులని నిర్ణయిస్తారు. తాను లేని సమయంలో ఏదో టముకు వేయించారట కదా అని ప్రెసిడెంటు గారు మహతిని అడుగుతారు. విస్తళ్ళ కుట్టుడం ఆలోచన, పర్యావరరణ పరిరక్షణ తదితర ఆలోచనల గురించి ఆయనకు చెప్పే, అవి విజయవంతమైతే ఆ ఖ్యాతి అంతా ఆయనకే దక్కుతుందని చెప్పి, ఈ ఉద్యమాన్ని మీరే ముందుండి నడిపించాలని అడుగుతుంది మహతి. పొందిపోయిన ఆయన సరేనంటారు. – ఇక చదవండి.]

మహతి-3 మహి-7

[dropcap]“అ[/dropcap]యితే లౌక్యం ప్రయోగించావన్నమాట” నవ్వారు డా. సూరి.

“లౌక్యం అనేది చెడ్డ మాట కాదు బాబూ. లోకరీతిని ఎరిగి మసులుకోవడమే లౌక్యం. నన్నడిగితే ప్రతి వ్యక్తీ అలవర్చుకోవాల్సిన మంచి లక్షణం ఇది. లౌక్యం వల్ల దెబ్బలాటలు కొట్లాటలూ రావు. పైగా వాటిని లౌక్యం ఆపగలదు కూడా. నొప్పించక తానొవ్వక బ్రతికే మార్గమే లౌక్యం” అన్నాడు తాతయ్య.

“మంచిమాట చెప్పారండి. దాన్నే మనసెరిగి మాట్లాడటం అంటారేమో. ఇవాళ మహి చేసింది నిజంగా మెచ్చుకోదగిన పనే. సక్సెస్ అవుతున్న క్షణాల్లో ప్రెసిడెంటు కాలు అడ్డం పెడితే? అందుకని ‘మేం చేసేది నీ కోసమే’ అనే భావన ప్రెసిడెంటులో కలిగించి, ఆయన పాల్గొనే విధంగా చేసింది. గ్రేట్ మహీ” అన్నారు శ్రీధర్.

“ఇక్కడ మనకి కావలసింది ఎవరు చేశారని కాదు, ఎలా ప్రజలకి మేలు కలుగుతుందా? అని ఆ విషయంలో మహీ చాలా నిస్వార్థంగా, నిలకడగా నిలిచింది” అన్నారు త్రిపుర.

“విస్తళ్ళ వాడకం సరే.. తరవాత?” అడిగారు తాతయ్య,

“నేను చెప్పనా? కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ ఎన్నో స్కీములు తీసుకొచ్చాయి, జనాలకి లబ్ధి చేకూర్చడానికి. అసలు ఆ స్కీములు ఎన్నో, వాటి వల్ల వచ్చే లాభాలు ఏమిటో, ఆ లాభాలు పొందాలంటే ప్రజలు ఏం చెయ్యాలో వివరంగా, సులభంగా ప్రజలకు అర్థం అయ్యేలా అవగాహన కల్పించడం” అన్నారు త్రిపుర.

“అదంత సాధ్యం కాదు త్రిపుర గారూ, చాలా చాలా స్కీములు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి. హాస్పటల్ సంగతే చూడండి, మందులు రావు. ఉన్నా సరిపోయినంతగా ఉండవు. ఏమంటే బడ్జెట్ ఎలాకేషన్ అంటారు, సామాన్యుడికీ యీ విషయం ఏం తెలుసు? డాక్టర్లూ, నర్సులూ మందుల్ని బయట అమ్ముకుంటున్నారని తిడతారు. ఒక్క మా డిపార్టుమెంట్ కాదు. అన్ని డిపార్ట్‌మెంట్స్ పరిస్థితీ ఇదే. కొన్ని స్కీములున్నాయి. అవి అస్మదీయులకు మాత్రమే చేరుతాయి. అదీ పార్టీ పరంగా, బంధు పరంగా. మరో దౌర్భాగ్యం ఏమంటే, అటువంటి స్మీముల నిధుల్ని దారి మళ్ళించడం.” శ్రీధర్ గారి గొంతులో ఆక్రోశం.

“మనం ప్రజాస్వామ్యం అంటాం. అదెక్కడుందీ? ఎన్నుకునేది ప్రజలనే మాట నిజమే. ఎన్నికల్లో గెలవాలంటే ప్రచారం కావాలి. ప్రజలకి ఆశలు చూపించాలి. కార్యకర్తల్ని కూడగట్టాలి. వాళ్ళని మూడు పూట్లా మేపాలి. ఇవన్నీ చెయ్యాలంటే బోలెడు డబ్బుండాలి. గెలిచాక ఖర్చు పెట్టిన దానికి వెయ్యింతలు కూడబెట్టగలిగే తెలివితేటలుండాలి. అన్నిటికీ ముందు తిమ్మిని బమ్మిని చేస్తానని ప్రజల్ని నమ్మించాలి. ఈ మరో పోరాటంలో సామాన్యుడు అభర్థిగా నిలబడగలడా? నిలిచి గెలవగలడా?” తాతయ్య అన్నాడు.

“మీరన్నది నూటికి నూరుపాళ్ళూ సత్యం. ఒక విధంగా చెబితే అదో ఊబి. ప్రజల వాదన ప్రజలకి ఉంటే రాజకీయ నాయకుల వాదన వాళ్ళకుంటుంది. అదీ గాక మనం రాజకీయ నాయకులకి మహా భక్త బానిసలం. మినిస్టర్ చనిపోతే వారి భార్యకో కొడుక్కో, బొడ్డూడని మనవడికో జై కొట్టి మరీ గద్దెనెక్కించే మహా విశాల హృదయాలు మనవి. ఓ మినిస్టర్ జైలు కెళ్ళిన మరుక్షణమే చపాతీలు తయారు చేస్తున్న వాళ్ళావిడ చీఫ్ మినిస్టరై పోయింది. మార్పు రావల్సింది ముందు ప్రజల్లో, మన విద్యా విధానంలో. చదువు అనేది కేవలం ఉద్యోగం కోసమనే ఆలోచన మారాలి. వైద్య, విద్యా రంగాలు ప్రభుత్వ అధీనంలో వుంటూ లాభాపేక్ష లేని, ఉచిత రంగాలుగా ఉండాలి. ఎవరు బడితే వారు ధనమూ, భుజబలమూ ఉన్నది కదా అని ప్రజా ప్రతినిధులుగా ఎన్నికలకి ఎగబడకుండా, కొన్ని అర్హతలను ప్రభుత్వాలు ఏర్పరచాలి.” అన్నారు శ్రీధర్.

“అంతేకాదు.. ఎన్నికకు ముందూ పదవీవిరమణ అప్పుడు రాజకీయ నాయకులు తమ ఆస్తుల వివరాల్ని ప్రజా సమక్షంలో వుంచాలి” అన్నారు సూరి.

“అందరూ చెప్పిందీ సబబే. కానీ పిల్లికి గంట కట్టేది ఎవరు? అందువల్ల.. మనం స్వయంగా ఎంతవరకూ చేయగలమో నిర్ణయించుకుంటే, సమస్య ఓ కొలిక్కి వస్తుందని నా భావన. ఎందుకంటే, గుడిసె కట్టాలన్నా ఒక్కొక్క రాయీ, ఒక్కొక్క మట్టి ముద్దా, ఒక్కొక్క తాటాకు పేర్చుకుంటేనే కట్టగలం. అందువల్ల.. స్పష్టంగా మనం ఏం చెయ్యాలో నిర్ణయించుకుందాం.” అన్నాను నేను.

“అదే మంచిది” అన్నారు త్రిపుర గారు తలాడించి.

ప్రెసిడెంటు గారు పాలుపంచుకోవడంలో ఉద్యమం కాస్త ఊపందుకుంది.

“స్పష్టంగా తెలియాలంటే పెళ్ళిళ్ళ సీజన్ వచ్చాకే తెలుస్తుందండీ” అన్నారు కక్కిరాల పుల్లయ్య. అదీ నిజమేగా.

మార్పు అనేది ఓ సహజప్రక్రియగా మారాలంటే మొదట చేయాల్సింది మనుషుల మనసుని ఆకట్టుకోవడం.

“నాకు తెలిసిన నిజమైన లీడర్ గాంధీగారు. బార్ ఎట్ లా చదువుకున్నా పేదల్లో నిరుపేదగా కలిసి పోయారు. ఆహార వ్యవహారాల్నించి వస్త్రధారణ దాకా సామాన్యుడ్నే ఆదర్శంగా తీసుకున్నారు. అందుకే కోట్ల మంది ఆయన వెనక నడిచారు. మహీ, లీడర్ అంటే ముందుండి సేనని నడిపించేవాడు, కార్యకర్తల్ని ముందుకు నెట్టి తాను వెనక సేఫ్‍గా ఉండి ప్రగల్భాలు పలికేవాడు కాడు. జైలుకెళ్ళాల్సి వచ్చినా, నిరాహార దీక్షలు చేసినా, ఆఖరికి లాఠీ దెబ్బలు తిన్నా మొదలు ఆయనే వుండేవాడు. నేటి నాయకుల్లా కాదు.” అన్నాడు తాతయ్య.

“నాకు ఆయనలో నచ్చిన అద్భుతమైన గుణం ఏమంటే, ‘హింస ప్రజ్వలిస్తుంది’ అనుకున్నపుడల్లా తానే కార్యకర్తలలకి నచ్చజెప్పి వారిని అహింస వైపు మళ్ళించడం. నవఖాలీలో ఆయన హిందూ ముస్లిమ్స్ చర్యలను ఆపిన విధం చరిత్రలో మరపురాని సంఘటనగా మిగిలిపోతుంది.” అన్నారు త్రిపుర గారు.

“అవును, ఆయన జీవితమే ఓ అద్భుత పాఠ్య గ్రంథం” అన్నాడు తాతయ్య.

“చదువు లేదంటావు.. ఇవన్నీ ఎలా తెలిశాయి తాతయ్యా?” అల్లరిగా అడిగాను.

“చదువు లేకపోతేనేం, చెవులు బాగానే పనిచేస్తున్నాయిగా తల్లీ. ఈ వూరి మొత్తానికి ఆనాడు ఒకే రేడియో వుండేది. అదీ, పంచాయితీ ఆఫీసులో. పొద్దున్నా, సాయంత్రం ఆ రేడియో వార్తల్ని మైకులో వినిపించేవారు. అంతేకాదు, ఆనాడు ఎవరి నోట విన్నా దేశభక్తి గేయాలే. నిజం చెబితే అన్నం విలువ ఆకలితో అలమటించే వాడికి తెలుస్తుంది. మండుటెండలో పోతూ చుక్క నీరు దొరకని వాడికి తెలుస్తుంది నీటి విలువ ఏమిటో. అలాగే బానిసలుగా కునారిల్లిపోతున్న వారికే తెలుస్తుంది స్వాతంత్య్రం విలువ. ఖర్మ ఏమంటే, ఏనాడు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నామో, ఆనాడే, ఆ క్షణమే మనిషి ప్రవర్తన మారిపోయింది.. నడమంత్రపు సిరి వచ్చిన పరమ పేదలా!” తాతయ్య మాటల్లో వ్యథ.

***

“నీ పేరు అరచేతి మందాన మారుమ్రోగి పోతోందే.” అంది స్వరూపారాణి. గొంతులో డబ్బు తెచ్చిన అహంకారం. నేను చిన్నగా నవ్వాను.

“ఎలక్షన్లలో నిలబడాలని ఇప్పట్నించే ప్లాను వేస్తున్నావా!” స్వరూపారాణి గొంతులో అదే వెటకారం.

“చేసినా తప్పేముంది! ఆడవాళ్ళు అన్నిటా ముందుండాలనే గదా పెద్దలు చెప్పారు. అంతెందుకూ, పింగళి గారు ‘గుండమ్మ కథ’ సినిమాలో ఓ పాటే రాశారుగా – ‘పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో వుద్యోగాలూ, అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరుల నెదిరించారు’ అని!” అన్నాను.

కావాలనే ‘విడాకు చట్టం తెచ్చారు’ అనే లైన్‌ని చెప్పలేదు. ఎందుకూ బాధించడం.

“అవునవును. ఖచ్చితంగా ఆడవాళ్ళు పాలిటిక్స్ లోకి రావాల్సిందే. అప్పుడే ఆడవాళ్ళ సమస్యలు తీరుతాయి. యుగయుగాలుగా మగవాడి దౌర్జన్యానికి బలైపోతున్న మన జాతికి విముక్తి లభిస్తుంది.” అన్నది ఆవేశంగా.

“నా దృష్టిలో స్త్రీ జాతి మరీ అంత ఘోరాతిఘోర స్థితిలో లేదు. మా అమ్మమ్మ అత్తగారి చేతులలో ఆరళ్ళు పడ్డ మాట నిజం. దానికి కారణం స్త్రీయే గానీ పురుషుడు కాదుగా. అలాగే మా అమ్మ.. పెళ్ళయ్యాకా తనేమీ స్వేచ్ఛని కోల్పోయి బానిస బ్రతుకు బ్రతకలేదు. హాయిగానే ఉంది. నా సంగతైతే నేనూ స్వేచ్ఛాగానే పెరిగా. నా చుట్టూ నానా ఆంక్షలూ నా తల్లిదండ్రులు పెట్టాలా.” అన్నాను.

“నీలాంటి అదృష్టవంతుల సంగతి కాదు నేను చెప్పేది. దౌర్భాగ్య స్థితిలో వున్న మహిళల సంగతి” తీవ్రంగా అన్నది.

“స్త్రీలకి సంపూర్ణ రక్షణ లేదన్న విషయాన్ని తప్పకుండా ఒప్పుకుంటాను. దానికి లక్షా తొంభై కారణాలు. కుటుంబంలోనూ రక్షణ కరువైన స్త్రీలున్నారు. సంఘం లోనూ రక్షణ కరువైన స్త్రీలున్నారు. అటువంటి స్త్రీలని ఖచ్చితంగా ఆదుకోవలసినదే. వారికి ఎలా రక్షణ కల్పించాలో ఆలోచించవలసిందే!” అన్నాను.

“అన్ని దరిద్రాలకీ మూలం మన వివాహవ్యవస్థ” అన్నది స్వరూప.

“భారతదేశాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దింది ఆ వివాహ వ్యవస్థే. కొన్ని వివాహాలు విఫలమై ఉండొచ్చు. దానిని చూసి వ్యవస్థని తప్పు పట్టకూడదుగా. నాకు తెలిసి మన వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైనదే కాదు, దానివలన స్త్రీకి ఎనలేని రక్షణ లభిస్తుంది. అఫ్ కోర్స్, ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని ఫెయిల్ కావచ్చు. ఆ ఫెయిల్డ్ వివాహాల శాతం అతి తక్కువ.” అన్నాను నేను.

“హుఁ.. పెళ్ళే కాకుండా చాలా చాలా తెలిసిపోయిందే నీకు” చరచరా నడిచి వెళ్ళింది స్వరపారాణి. చిన్నగా నవ్వుకున్నాను. ఎందుకంటే, తనేదో చెప్పాలనుకుంది. బహుశా చెప్పి నన్ను ఒప్పించాలని కూడా అనుకుని ఉండొచ్చు. కానీ నేను ఆమెకి అవకాశం ఇవ్వలేదు. అందుకే ఆమెకా కోపం అనిపించింది.

***

“చక్కగా వినాల్సింది మహీ! వింటే బహుశా మనకి తెలిసేది.. విడాకులు ఎందుకు ఫైల్ చేసిందో.” అన్నారు త్రిపుర.

“అది నిజమే. అయినా, ఆ విషయం నాకు తెలియనట్టే ప్రవర్తించాను.. తెలియనట్టే మాట్లాడాను. కారణం అది ఆమె స్వవిషయం. మేడం, కుసుమ విషయంలో కొంత కల్పించుకున్నా పూర్తి న్యాయం చెయ్యలేకపోయాను. అప్పట్నించే ఆ బాధ నాలో ఉంటూనే వుంది.” అన్నాను. అది నిజం కూడా.

“బాధ వుండటం సహజం మహీ. ఎందుకంటే జీవితం పదిమెట్లు అనుకుంటే నువ్వు రెండో మెట్టుకి దగ్గర్లో వున్నావు గనక. మెట్లు ఎక్కుతున్న కొద్దీ అనుభవాల గాడ్పులతో మనసు మొద్దుబారుతుంది. అది మనుషులకే కాదు, చివురాకులు లేతగా పచ్చగా ట్రాన్స్‌పరెంట్‌గా వుంటాయి. రోజులు గడుపున్న కొద్దీ ఆ లేత పచ్చదనం పోయి ముదురు పచ్చరంగు సంతరించుకుంటాయి. పెళుసుగా, మొరటుగా మారుతాయి. అచ్చం మనిషి లాగే!” అన్నారు త్రిపుర,

“అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనసుకుండే సున్నితత్వం మరుగున పడి కఠినత్వం పెరుగుతుందనా?” అడిగాను.

“కఠినత్వం పెరగదు. ఏది జరిగినా.. ‘భరించగలిగే’ శక్తి పెరుగుతుంది. మా నాన్నగారు పోయిన రోజున చాలా దుఃఖించాను. మా అమ్మ పోయిన రోజు దుఃఖం పీడించింది కొన్ని గంటల వరకే. లోకరీతిని బట్టి నా అన్నకీ వదినకీ కబురు పెట్టాల్సి వచ్చింది, లేకపోతే నేనే అంత్యక్రియలు చెయ్యాలనుకున్నాను. మహీ.. నిజం చెబితే అదీ ఓ తంతు లాంటిదే. మా అన్నగారు నా ఖర్చు తోనే మా అమ్మగారి అంత్యక్రియలు చేశాడు. శ్రద్ధ, భక్తి, బాధ అనేది లేశమైనా లేదు. చిత్రం ఏంటో తెలుసా? ‘అమ్మ ఒంటి మీద నగలు న్యాయంగా కోడలికి వస్తాయి’ అన్నాడు పెద్ద ధర్మం పాటించే ధర్మాత్ముడిలాగా! వాడా మాట అనకపోతే నేనే ఇచ్చేదాన్ని – వాడి కూతురికి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఛస్తే ఇవ్వదలచుకోలా. అదే మాట నిర్మొహమాటంగా చెప్పాను.” అన్నారు త్రిపుర.

“ఓహో, అందుకేనా మీరు ఆస్తి కోసం కోర్టు కేసు వేసిందీ?” అన్నాను.

“అవును.. ఎందుకు వదలాలి? నన్ను వదిలించుకున్నారు, ఓకే. కన్న తల్లిని వొదిలించుకోవడమే కాదు. ఆవిడ నగలనన్నీ లాక్కునే బయటికి పంపారు. ఆవిడ ఒంటి మీద నగలు నేను చేయించినవి. అవి కూడా ఇమ్మనడం నాకు తిక్కరేగింది మనిషి కాని వాడితో చట్టమే మాట్లాడాలి. మానవత్వంతో కాదు. చట్టానికి కళ్ళూ చెవులూ, న్యాయాన్యాయాలూ వుండవు గదా!” అన్నారు త్రిపుర గారు.

“మీ అత్తవారి మీద కేసు వెయ్యలేదా?” అడిగాను.

“వెయ్యలేదు. వాళ్ళేమీ నన్ను అక్కడినించి గెంటెయ్యలేదు. వాళ్ళ అమర్యాదకీ మా నాన్న అహంకారానికి చెల్లు కి చెల్లు అనుకున్నాను” నిట్టూర్చారు త్రిపుర.

“ఆయన పెళ్ళి చేసుకున్నాడని..” ఆగాను.

“మహీ.. వంశం నిలవాలంటే సంతానం కావాలి. పిల్లలు పుట్టేంత కాలం నేనక్కడ వుండలా! పోనీ నన్నక్కడ వుంచలేదు. వంశం నిలబడాలని కోరుకోవడం తప్పేమీ కాదు గదా! జరిగిందంతా తలచుకుంటే ఓ కలలా అనిపిస్తుంది. అసలు ఏదీ మన చేతుల్లో లేదు అనిపిస్తుంది.” త్రిపుర గారి మాటల్లో చెప్పలేనంత వేదన ధ్వనించింది

“మీరు ఉద్యోగం చేస్తున్నారని వాళ్ళకి తెలుసా?”

“తెలుసు. ఓసారి మా అప్పటి మామగారు నా యింటికొచ్చారు. కోడలి నిర్వాకం, వీళ్ళిద్దరూ ఔట్ హౌస్‌లో ఉండటం అన్నీ చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఆవిడ చేసిన గారాబానికి తగిన శిక్ష పడిందని కూడా అన్నారు. నేనే అక్కడ ఉంటే ఇలాంటి దౌర్భాగ్యం వాళ్ళకి వచ్చేది కాదనీ వాపోయారు.” మెల్లగా చెప్పారు త్రిపుర.

నేను సైలైంటయిపోయాను. వివాహ వ్యవస్థా మీద ఇందాకే కదా నేను స్వరూపారాణికి లెక్చరిచ్చిందీ! లెక్చరిచ్చాను సరే, పెద్దలు కుదిర్చిన వివాహమా, ప్రేమ వివాహమా, ఏది మంచిదో నాకేం తెలుసూ? ఇప్పటి వరకూ నేను చూసిన మూడు, అంటే, కుసుమ, త్రిపుర, స్వరూపరాణి లాంటి పెద్దలు కుదిర్చిన సంబంధాలే. మూడూ చెడటానికి ఒక విధంగా కారకులు పెద్దలే. పెళ్ళి అనేది తనువూ మనసుల కలయిక మాత్రమే కాదు. రెండు వేరు వేరు కుటుంబాల్ని ఒకటిగా జోడించే అద్భుత క్రియ పెళ్ళి.

కానీ, కలిసిన కుటుంబాలని విడదీస్తున్నది పెద్ద వాళ్ళ అహంకారం తప్ప మరేమిటీ? సరైన సమయంలో ఓ మంచిమాట చెప్పగలిగిన వారుంటే ఎన్ని వివాహాలు భద్రంగా నిలబడివుండేవో. ‘అభిమానం కలుపుతుంది. అహంకారం విడగొడుతుంది’ అన్ననిజం అర్థమయింది.

“పెద్దలు కుదిర్చిన సంబంధాలు ఇలా విఫలమవుతుంటే, ప్రేమ వివాహాలే బెటర్ కదా!” అన్నాను.

“కనీసం యీ పెళ్ళిళ్ళలో కాస్త విషయ సేకరణ, పదిమంది ఉమ్మేస్తారనే బెరుకూ, సంఘ, న్యాయపరమైన రక్షణా వుంటాయి. ప్రేమ వివాహాలలో ప్రేమ మీద మనం పెట్టుమనే నమ్మకం తప్ప ఏదీ వుండదు. అటూ ఇటూ తల్లిదండ్రులే కాదు, సంఘం కూడా ఆమోదముద్ర వేయదు. అయినా మహీ, జాగ్రత్తగా పరిశీలిస్తే పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళ కంటే ప్రేమ వివాహాలే తక్కువ ఫెయిలవుతున్నాయి. ‘ఐ లవ్ యూ’ అని ఎంత తేలిగ్గా యువతీయువకులు చెప్పుకుని పెళ్ళి చేసుకుంటున్నారో, అంతే ఫాస్ట్‌గా ‘ఐ హేట్ యూ’ అని విడిపోతున్నారు. ఇవాళ లెక్కలు చూడు ‘సింగిల్ మదర్స్’ ఎంత మందో!” నిట్టూర్చి అన్నారు త్రిపుర గారు.

ఆవిడ అన్నదానిలోనూ నాకు సత్యం కనిపించింది. ఓ పాదచారి అన్నట్లు ప్రేమ పెళ్ళికి పునాది, పెళ్ళి ప్రేమకి సమాధి అవుతోంది. ప్రేమించినప్పటి అద్భుత ప్రేమ పెళ్ళి అయ్యాక నిలబడాలిగా! మగవాడి జీవితంలోనే కాదు, ఆడదాని జీవితంలో కూడా ప్రియుడు/ప్రియురాలు, భార్య/భర్త పోస్టుల్లో అంతులేని తేడాలున్నాయి. ప్రేమలో హక్కులూ, బాధ్యతల ప్రమేయం ఉండదు. పెళ్ళయిన మరుక్షణమే హక్కులూ బాధ్యతల సంకెళ్ళు తగులుకుంబై. అప్పటి నించే ప్రేమ స్థానాన్ని అహంకారం ఆక్రమిస్తుంది. స్వీట్ నథింగ్స్‌కి బదులు ఎత్తిపొడుపులూ, పరస్పర వాదనలూ, తప్పు పట్టడాలూ ప్రారంభం అవుతాయి. బ్రతుకు దుర్భరం కావడానికి ఇంకేం కావాలి. ‘నాకు బుద్ధి లేక నిన్ను చేసుకున్నాను’ అని భర్త, ‘నా వాళ్ళ మాట విని ఆ డాక్టర్నో యాక్టర్నో పెళ్ళి చేసుకుంటే బాగుండేది’ అని భార్య బహిరంగం గానే అనడం మొదలుపెడతారు. పిల్లలు పుట్టకపోతే ఓకే. పుడితే, యీ నరకం వాళ్ళకి కూడా పుట్టుక తోనే స్థిరాస్తిలా సంక్రమిస్తుంది.” అన్నారు త్రిపుర. ఎంత నిజం!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here