(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[పిల్లల్లో మార్పు తేవాలన్న మహతి ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. పాఠ్యపుస్తకాలే కాక, బాలసాహిత్యం పుస్తకాలు చదవడం, వారానికి రెండు సార్లయినా గ్రంథాలయానికి వెళ్ళటం అలవాటు చేస్తుంది. కానీ ఆ పిల్లల తల్లుల నుండే వ్యతిరేకత ఎదురవుతుంది. మహతి బృందాన్ని నానా మాటలంటారు. త్రిపుర గారు నిరాశపడితే, మహీ ధైర్యం చెబుతుంది, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం అంటుంది. ఓ రోజు – మహితో ఓ విషయం డిస్కస్ చేయాలని అంటారు డా. శ్రీధర్. అప్పుడు బజ్జీలు వేస్తుంటుంది మహి. ముందు వాటిని తినమని, తర్వాత మాట్లాడుకోవచ్చని అంటుంది. ఇంతలో తాతయ్య వస్తే ఆయనకీ మిర్చి బజ్జీలు పెడుతుంది. తినడం అయ్యాకా, విషయమేంటో చెప్పమని అడిగితే, మరోసారి చెప్తాలే అంటారు శ్రీధర్. సుచిత్ర గారి పుట్టిన రోజు వేడుకలో కలిసిన మహిళామండలి సభ్యుల మధ్య స్వరూపరాణి విడాకుల విషయం ప్రస్తావనకి వస్తుంది. మహతి ఏదో చెప్పబోతే, ఆమెని బయటకి పంపించమని త్రిపురగారితో అంటుంది మహిళా మండలి ప్రెసిడెంటు. అసలు అది మహిళామండలి మీటింగ్ కాదని, ఓ ఫంక్షన్ అనీ కొందరు వాదిస్తారు. మహతి మాత్రం ప్రెసిడెంటును పొగిడి, కిచెన్ లోకి వెళ్ళి సుచిత్ర గారికి వంటలో సాయం చేస్తుంది. కొన్ని వంటకాలు ఆవిడ ఎలా చేస్తున్నారో గమనిస్తుంది. సభ్యుల మధ్య చర్చ కొనసాగుతుంది. కాసేపయ్యాకా మహతి వచ్చి భోజనాలు సిద్ధమంటూ అందరినీ లేవదీస్తుంది. – ఇక చదవండి.]
మహతి-3 మహి-9
[dropcap]‘సి[/dropcap]ర్సా పట్టణంతో నేను ప్రేమలో పడ్డానే మహీ! అఫ్‌కోర్స్ ఏ నగరపు సంస్కృతీ సంప్రదాయాలు, ఆ వూరికో పట్టణానికో ఎలానూ వుంటాయి. కానీ హర్యానా రాష్ట్రంలోని ఈ పట్టణం మాత్రం అద్భుతం. అర్దంటుగా నిన్ను ఇక్కడికి పిలిపించి నాతోనే వుంచుకుని యీ నగరాన్నంతా తిప్పి చూపించాలని ఉందే!’ ఉత్తరం లోని మొదటి పేరా చదవగానే నవ్వుకున్నాను. ‘అల’ స్వంతంత్ర జీవితానికి చాలా సులభంగానే అలవాటు పడిందని దాని ఉత్సాహ పూరితమైన అక్షరాల పొందికే చెబుతోంది.
‘అదివరకు అనుకునే దాన్ని.. తెలుగు సినిమాల్ని మనవాళ్ళు చాలా ఫాస్ట్‌గా తీస్తారనీ, హిందీవాళ్ళు బాగా డ్రాగ్ చేస్తారనీ. సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు టేకింగ్ లోనే చాలా తేడాలు ఉన్నాయే. సినిమా మనకి ఒక కళాత్మక వ్యాపారం. ఇక్కడి వాళ్ళకి అదే జీవితం, అదే వ్యాపారం. ఇక్కడి హీరో హీరోయిన్లు సన్నివేశాన్ని సన్నివేశంగా, జీవితాన్ని జీవితంలాగే చూస్తారు. అందుకే బిడియాన్ని కొంచెం దూరం పెట్టి పాత్రలో ఎంత ఒదిగిపోవాలో అంతా ఒదిగిపోతారు. నవ్వడం, ఏడవడం కూడా ‘అందం’గా ఉందా లేదా అని తపనపడతారు. అఫ్‌కోర్స్.. సెట్ లోకి వచ్చేవరకూ ఎవరి నఖరాలు వాళ్ళవి. సెట్ లోకి వచ్చిన అందరితో హాయిగా కలిసిపోతారు.’ మళ్ళీ నాకు నవ్వొచ్చింది. అలకి సినిమానే జీవితంగా మారుతున్నందుకు.
ఒక విధంగా అదీ నిజమే. రాముడి పాత్రగారి చేతిలో విస్కీ గ్లాసు, నోట్లో సిగరెట్టు పెట్టుకుని పాత్ర పోషిస్తే చూడగలమా? అలాగే ‘వాంప్’ పాత్రధారిణి సెక్సీ డైలాగ్స్ బదులు సుమతి శతకం వల్లిస్తే జీర్ణం చేసుకోగలమా? పాత్రకి తగినట్టుగా మసలుకోవాలి. సినిమాలో వుండటానికి నిర్ణయించుకున్నది గనకనే సినీ పరిశ్రమని నిశితంగా పరిశీలిస్తున్నదని అర్ధమైంది.
‘ఒక మాట చెప్పనా.. మనవాళ్ళు మనకి మంచీ-చెడూ, కర్తవ్య నిర్వహణలూ, సంఘంలో మసులుకోవలసిన జాగ్రత్తలూ అన్నీ చెప్తారు గానీ, యవ్వనం క్షణికమనీ, ఆ కాస్త జీవితాన్ని ఎలా ఆనందమయంగా మలచుకోవాలో చెప్పలేదు. మనకి బోధించింది టన్నుల కొద్దీ నీతులు – ట్రక్కుల కొద్దీ వైరాగ్యం. అసలు వెన్నెలని ఏనాడైనా ఆనందించామా? చిన్నప్పుడు ఏనాడైనా మనవాళ్ళు మనని ‘జూ’ లోకో, హిల్ స్టేషన్‌కో తీసికెళ్ళారా? మహా అయితే నెలకో సినిమా గ్రాంట్ చేశారేమో. ఇహ గుళ్ళూ గోపురాలూ, భజనలూ, పూజలూ ప్రతాల సంగతి లెక్కే లేదు. ఎప్పుడూ చదువూ మార్కుల గోలేగా! ఇప్పుడు నేను చూస్తున్నా. ‘సోనా’ దగ్గరి వాటర్ స్ప్రింగ్స్..! కురుపాండవులు యుద్ధమాడిన కురుక్షేత స్థలం. డిల్లీలో రెడ్ ఫోర్ట్, జుమ్మా మసీద్, కుతుబ్ మీనార్, ఓహ్.. అవన్నీ పర్యాటక ప్రదేశాలని మాత్రమే కాదు. ఇప్పుడు తెలుస్తోంది లోకం ఎంత విశాలమైనదో.. మనిషి బతికే నాలుగు నాళ్లూ ఎంత విలువైనావో!’.
దాని రాతలో చేతన్మయత.
మనం చేస్తున్నదేమిటి? చదువు. చదువు ఇలా పూర్తి కాగానే అలా పెళ్ళి, వారంలో ఇక్కడి చిలకని అక్కడి పంజరంతో కాపరానికి పంపుతారు. సంసారం సరిగ్గా జరిగితే ఓకే. లేకపోతే హత్యలో ఆత్మహత్యలో. గ్యాసు స్టవ్ పేలడాలో, కిరసనాయిల్ చావులో.. భగవంతుడా!
ఇవేమి లేకపోతే పిల్లలు పుట్టలేదా? ఇంకెప్పుడు అని పెద్దవాళ్ళ సణుగుళ్ళు, పిల్లలు పుడితే లేత, నడి యవ్వనాలు చాకిరీలో రంగు మాసిపోతాయి.
ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు నా నాసికను మండించింది.
‘ఈ లోకానికి మనం వచ్చేది ఒక్కసారే. వెళ్ళేదెప్పుడో ఎవరికీ తెలియదు. ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు కావాలి. దాన్ని ఎంత ఎక్కువగా సంపాయిస్తే అంత నిశ్చింత అనుకుంటాం. కానీ వేళ్ళ మధ్యలోంచి జారిపోతున్న జీవితం గురించీ, దాని విలువ గురించీ క్షణం కూడా ఆలోచించం. మహీ.. ఓ శవం పక్కన పది లక్షల కోట్లు పెట్టి ఒక్క క్షణం కళ్ళు తెరవమంటే తెరుస్తుందా? భూలోకం లోని వజ్రాలూ, రత్నాలూ, బంగారం అంతా, అన్నీ తీసుకొచ్చి అర సెకను కళ్ళు తెరిచి చూడమన్నా చూస్తుందా? పోనీ భూలోకమే రానిచ్చేసి ఒక్క మాట మాట్లాడమంటే మాట్లాడగలదా? ఇంపాజిబుల్. మరి మనుషులు వెర్రివాళ్ళలా డబ్బు వెనక ఎందుకు పడతారూ?’
అల రాసిన ఉత్తరం చదువుతుంటే నా కళ్ళు చెమర్చాయి. ఎంత లోతుగా విశాలంగా ఆలోచిస్తోందీ! అది వాసినది అక్షర సత్యమేగా!
‘అలాగే పదవి, పరువు, పవరు, ఇవనీ కూడా వ్యర్థ పదాలే. ఎంత పెద్ద పదవిలో వున్న వారైనా మృత్యువు ముంగిట తలవంచక తప్పదు కదా! లేదే మహీ.. ఈ లోకన్నంతా చూడాలని వుంది. ప్రతి జీవినీ హృదయం నిండుగా ప్రేమించాలని ఉంది. ప్రతి చెట్టునీ, పూవునీ, ఆకునీ, మొగ్గనీ కూడా తడిమి తడిపి ‘ఐ లవ్ యూ’ అని చెప్పాలని ఉంది. లోకంలో ప్రతి జీవీ ఎంత విశిష్టమైనది! ఎంత శక్తిమంతమైనదీ! చిన్న చీమ కూడా ఎంత క్రమశిక్షణలో జీవిస్తుందీ! ప్రకృతితో ఎంత మమేకమైపోతుందీ!’
అల ఉత్తరం ఆనంద కెరటంలా నన్ను ఊపేసింది. మనసుని ఆనంద డోలికల్లో తేలించింది. అల ఒక ట్రాన్స్‌లో ఉత్తరాన్ని రాసినట్టు అనిపించింది.
‘నేను, నా అనే మాటల్ని చీల్చి పారేస్తే చాలు. ప్రపంచమే నీదై పోతుంది. ఎన్నో చెప్పాలని ఉంది నేస్తమా. కానీ అక్షరాలు చాలవు.. మనసులో పొంగే ఆనంద గంగని అక్షరాల్లో ఇమడ్జగలమా! అందుకే మహీ.. నా ప్రేమని మాత్రమే అక్షరాలలో తెలుపుతూ నిన్ను నీ చెలిమినీ, నీ ప్రేమనీ నా గుండెల్లో దాచుకుంటాను. ఇట్లు. నీ అల’ అంటూ ఉత్తరం ముగించింది. ఎదురుగా వుంటే ఎన్ని గంటలు మాట్లాడేదో!
***
“డాక్టరుగారూ.. ఏదో మాట్లాడాలని అన్నారుగా?” అడిగాను డా. శ్రీధర్‍ని.
“నువ్వా మాట గుర్తుపెట్టుకున్నందుకు థాంక్స్” నవ్వారాయాన.
“సస్పెన్స్ వీడితే గాని నిద్ర పట్టదు మరీ! ఇప్పుడు చెప్పుండి” – పేషెంట్‌కి ఉద్దేశించబడిన చైర్లో కూర్చోని అన్నాను.
“మంచి సమయం. అమ్మయ్య, పేషంట్ల రద్దీ కూడా తగ్గింది. అసలు విషయం ఏమిటంటే” – పెన్నూ, పేపరు చేతిలో పట్టుకుని అన్నారు శ్రీధర్.
“ఏమైనా రాతపనా?” అడిగాను
“అవును. ‘తలరాత’ పని” ఫక్కున నవ్వి అన్నారు శ్రీధర్.
“ఓహ్ అదైతే ఇంకా మజా, సెలవియ్యండి” అన్నాను కుర్చీలోంచి లేచి అటూ ఇటూ తిరుగుతూ.
“ఒక ఆలోచన నా మనసుని తొలుస్తోంది మహీ..” అన్నారు.
“మనసులు కూడా గుహలాంటివే. ఎంత తొలిస్తే అంత విశాలమవుతై” అన్నాను సరదాగా. సరదా ఎందుకంటే, ఆయన పని సీరియస్‌నెస్‌ని పక్కకి తొలగిస్తే గానీ ఫ్రీగా చెప్పలేరుగా!
“నిజం చెబితే మనసు పెళ్ళి వైపు మరలింది.” అన్నారు గోడ మీద అస్థిపంజరం బొమ్మని చూస్తూ.
“శరీరాలు అన్నీ అస్థిపంజరాలనుకోండి. అస్థిపంజరం పునాది అయితే శరీరం భవనం. భవనం చూస్తారు గానీ అస్థిపంజరం లాంటి పునాదుల్ని ఎవరూ చూడరు లేదా! కనుక ఇటువైపు చూస్తూనే చెప్పొచ్చు.” అన్నాను.
ఘొల్లున ఏడుపులు. గబగబా శ్రీధర్ గారూ నేనూ పరిగెత్తాం.
యాక్సిడెంట్‍లో ఘోరంగా దెబ్బతిన్న మనిషిని స్ట్రెచర్ మీదకి ఎక్కించి తెస్తున్నారు. కారు దగ్గరకు పోతే చాలావరకూ రక్తంతో తడిసి వుంది. ఉరుకుల పరుగుల మీద ఎమర్జెన్సీ రూమ్‍కి తరలించారు. ఈ వ్యక్తిని ప్రాణం పోసే ముఖ్యమైన పరికరాలు మావూరి హాస్పటల్లో లేవని నాకనిపించింది. పది నిముషాల తరువాత డాక్తర్ బయటకి వచ్చారు. ఆయన మొహం చాలా విచారంగా వుంది.
“ఏమిటి సర్?” అన్నాను.
“పేషంటు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. బ్రతకలాంటే వెంటనే గుంటూరుకో బెజవాడకో పంపాలి. అతని కండీషన్ ప్రయాణించే స్థితిలో లేదు. అంబులెన్స్‌కి ఫోన్ చేసి తెప్పించాలన్నా గంట పడుతుంది. కనీసం ఆక్సిజన్ సిలిండర్స్ కూడా లేవు. ఎన్నిసార్లు డిమాండ్ పెట్టినా పైనున్న పెద్దలు పట్టించుకోరు..” బాధతో అన్నారు.
“పోనీ డా. సూరి గారికి ఫోన్ చేసి అర్జంటుగా అన్నీ అమర్చిన అంబులెన్స్ పంపమంటే?” అన్నాను.
“థాంక్ గాడ్. సూరి విషయం నాకు స్ట్రెక్ కాలేదు. పద. అలా చేస్తే టైమ్ కలిసొస్తుంది” అన్నారు.
***
పేషెంటు మొత్తానికి బ్రతికాడు. అదీ మూడు వారాల యమయాతన తరవాత. ఆ రోజు డా. సూరి గనక అంబులెన్స్ ఆరేంజ్ చేసి దానితోపాటు తనూ, ఓ ఆర్థోపీడిషన్ డాక్టరూ రాకపోతే పేషంట్ అదృష్టం ఆనాడే తిరగబడేది. రాత్రింబవళ్ళు శ్రీధర్, డా. సూరి, డా. ప్రఫుల్ల కుమార్ చాలా జాగ్రత్తగా పేషంట్‌ని చూసుకున్నారు. ప్రెసిడెంటు గారి ప్రమేయం వల్ల రాత్రికి రాత్రే ఆక్సీజన్ సిలిండర్లొచ్చాయి. గుంటూరు నించి మొబైల్ ఎక్సరే వాహనం కూడా వచ్చింది. ముగ్గురు డాక్టర్లకీ బ్రహ్మరథం పట్టింది మా కర్రావూరి ఉప్పలపాడు.
“సమయానికి మహతి డా. సూరిని గుర్తు చేసుండకపోతే పేషంటు బ్రతికేవాడు కాదు!” అన్నారు శ్రీధర్ హాస్పటల్‍కి వచ్చిన జనాలతో. అందరూ నన్ను అభినందిస్తుంటే నాకు సిగ్గేసింది. నేనేం చేశాననీ?
“ఒక్క మాటో, సలహానో మనిషిని బ్రతికిస్తుందని రుజువు చేశావే తల్లీ” అన్నాడు తాతయ్య నా తల నిమిరి.
***
యాక్సిడెంట్‌కి కారణం రోడ్డు, రోడ్డు మీద పడ్డ గుంతలు. రోడ్డు మలుపుల దగ్గర రోడ్ సైన్స్ (Signs) లేకపోవడం మరో కారణం. సరైన టెస్టుల్ని నిర్వహించకుండా మైనర్లకి కూడా డైవింగ్ లైసెన్సులు దళారులు ఇప్పించడం. మితిమీరిన వేగం.
ఎవర్ని తప్పు పట్టగలం? నా చిన్నతనంలో అంటే ఏడు ఎనిమిది తరగలు దాకా ఊరు మొత్తానికీ రెండో మూడో మోటరు సైకిళ్ళు ఉండేవి. ఇవ్వాళ ద్విచక్ర వాహనాలకి లెక్క లేదు. నాన్నగార్ల బళ్ళని పిల్లలు యథేచ్ఛగా, లైసెన్స్ లేకుండా రోడ్ల మీద నడపటమే గాక, అదేదో రేస్ పోటీల్లా నడపటమే యాక్సిడెంట్లు జరగడానికి కారణమవుతున్నాయి.
పెద్దలు చెప్పరు. చెప్పినా పిల్లలు వినరు. ఇలా ఎంత కాలం? నా బుర్రలో రకరకాల ప్రశ్నలు. జవాబులకేం! ఎన్నైనా వస్తాయి. కానీ కావసింది జవాబు కాదు.. పరివర్తన, మనిషి ప్రవర్తనలో పరివర్తన.
“ఎక్కువ ఆలోచించి బుర్ర పగులగొట్టుకోకు మహీ.. సమాజం అంత తేలిగ్గా మారదు.” నా గోడు విన్న వనజ గారు నాతో అన్నారు.
“నిజమే. ఆలోచిస్తే బుర్ర పాడవుతుంది. ఆలోచించకపోతే ఈ పరిస్థితే చర్వితచర్వణం అవుతుంది. సమాజం మారదు. సరే.. మారాల్సింది ఏదీ? సమాజంలో ఉంది మనమేగా? మారాలంటే ఆలోచించాలి. సరైన ఆలోచన వచ్చాక దాన్ని ఆచరించాలి.” అన్నాను నేను.
“అవును.. నిజమే, మనం కేవలం ఆలోచించగలం. ఆపైన ఏమి చెయ్యాలన్నా డబ్బుండాలి. అధికారాల అండ వుండాలి, ఆపైన ప్రజల మద్దతు వుండాలి. ఇవన్నీ సాధ్యమా? ఏ పని మొదలెట్టినా దానికి లైసెన్సుల కోసం తిరిగీ తిరిగీ చెప్పులు అరిగి పోవాల్సిందే. అధికారుల, నాయకుల అవినీతికీ, అహానికీ, దాహానికి అసలు అంతం అనేది ఉన్నదా? అందరి గురించి నేను అనను. మంచివాళ్ళూ, దేశం మంచి కోరేవాళ్ళు అధికారుల్లోనూ, నాయకులలో కూడా ఉన్నారు. కానీ వారి మాట సాగుతుందా? అంతెందుకూ.. నీ చేతిలో అధికారం ఉంటే నువ్వు ప్రజలకు చాలా సేవ చెయ్యగలవు. కానీ, పోటీలో నిలబడి కనీసం కౌన్సిలర్‌గా గెలవగలవా? గెలవాలంటే డబ్బుండాలి. ప్రచారం కోసం లక్షలు ఖర్చుపెట్టాలి. ప్రజల మద్దతు కూడగట్టుకోవడానిక్కూడా తడిసి మోపెడు ఖర్చు అవుతుంది. ఇంతా చేసి గెలిచావే అనుకో.. నీ భావాల్ని, ఆశయాల్ని అమలు పరచాలని ప్రెసిడెంటుని ఒప్పించగలవా? సాటి కౌన్సిలర్స్‌ని ఒప్పించగలవా?” సూటిగా నా వంకే చూస్తూ అన్నారు వనజ గారు.
నేనేమీ మాట్లాడలేదు. ఆవిడ అన్న మాటల్లో ఒక్క అక్షరం కూడా ‘పొల్లు’ లేదు. అసలు నేను కౌన్సిలర్‍గా నిలబడితే ఎలా వుంటుందీ? ఎంతమంది నా వెనక వుండి నాకు మద్దతిస్తారూ?
“ఏ మనిపైనా మంచి చేస్తే కనీసం సంఘంలోని వ్యక్తుల్లో 30% అయినా మెచ్చుకుంటారు. ఆ మంచి అనే ఫలం ఎక్కువమందికి చేరితే సన్మానమూ చేస్తారు. శాలువాలు కప్పుతారు, కానీ మహీ, ఆ సన్మానాల, ఆ మెప్పుకోళ్ళూ అన్నీ తాత్కాలికాలే, అవేమీ ఓట్లని కురిపించవు. ప్రజల నాడిని ఒడిసి పట్టుకోగలగడమే రాజకీయ లక్షణం.. ఆ ప్రజ్ఞ కావాలంటే, కావల్సినది ఆదర్శాలూ ఆశయాలూ కాదు.. ఏరు దాటాక తెప్ప తగల వేయవల కుటిలత్వం.” అన్నారు వనజ గారు.
“కానీ వనజ గారూ, నిష్క్రియాపరత్వంతో, నిరాశతో, మనం ఏమి చెయ్యలేమన్న నిస్పృహలో బ్రతకటం సబబేనా? నా దృష్టిలో ప్రజలు మూర్ఖులు కారు. వారూ గమనిస్తూనే ఉంటారు. వారు మార్పుకి స్వాగతం పలుకడానికి సిద్ధంగానే ఉంటారు. చాపకింది నీరులా, నివురు గప్పిన నిప్పులా వారి హృదయాల్లోనూ నిస్సహాయతకు సంబంధించిన ‘జ్వాల’ రగులుతూనే ఉంటుంది. నూటికి నూరు పాళ్ళూ వాళ్ళకి నమ్ముకం కలిగేపరకూ మౌనం గానే ఉంటారు. నమ్మకం కలిగిన మరుక్షణం ప్రజలు ఎంతకైనా తెగిస్తారు. దేనికైనా సిద్ధపడతారు.” అన్నాను. అవి నాలో నించి వచ్చిన మాటలే, చాలా సహజంగా వచ్చిన మాటలే.
“నువ్వన్నది ముమ్మాటికీ నిజమే. తన వ్యక్తిత్వంతో ప్రజల మనసు గెలుచుకున్న వాడికి డబ్బుతో పనిలేదు. నీ ఆలోచనలు సరైనవే. అయితే, ఇంకా గమనించు.
ప్రజల నైజాన్ని, వారి నిస్సహాయతనీ ఇంకా ఇంకా గమనించు. అసలు వారికేమి కావాలో ముందు తెలుసుకో. అప్పుడు బహుశా ఒక చక్కని మార్గం కనపడవచ్చు.” ప్రేమగా భుజం తట్టి అన్నారు వనజ గారు.
ఆ తరవాత మాటలు సాగలేదు.
రోడ్లన్నీ గోతుల మయమే. ఎక్కడబడితే అక్కడ చెత్త. ఒకప్పటి పచ్చని పల్లెటూళ్ళు ఇప్పుడు ప్లాస్టిన్ వ్యర్థాలకి ఆలవాలమైనాయి.
ప్రజలు మాత్రం ఎవరో తరుముతున్నట్టుగా ఎవరి పనుల మీద వారు సాగిపోతున్నారు. అవును.. మన పెద్దవాళ్ళు మనకి చిన్నప్పటి నించీ, ఉగ్గుపాలతో నేర్పించింది సహనమేగా! మనం ప్రశ్నించలేము. ఎవర్ని ప్రశ్నించాలన్నా, నడిరోడ్డులో నిలదీయాలన్నా మనకి ‘భయం.. భయం.. భయం.’.
(ఇంకా ఉంది)