Site icon Sanchika

మహతి-43

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అల ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరం సిర్సా పట్టణం గురించి హిందీ సినిమాల చిత్రీకరణ గురించి, అక్కడి నటీనటుల పద్ధతుల గురించి వివరంగా రాస్తుందా ఉత్తరంలో. ఉత్తర భారతంలో తాను చూసిన పట్టణాల గురించి, ప్రజల గురించి, వారి జీవితాల గురించి రాస్తూ, మన దగ్గర జీవితాన్ని ఆస్వాదించడం లేదని, డబ్బు వెనుక పరిగెత్తడమో పరమావధిగా మారిందని వ్యాఖ్యానిస్తుంది అల. అద్భుతంగా రాసిన ఆ ఉత్తరాన్ని చదివి పరవశించిపోతుంది మహతి. తనతో ఏదో మాట్లాడాలని డా. శ్రీధర్ అన్న మాటని గుర్తొచ్చి, ఆయనని ఆ విషయం అడుగుతుంది మహి. తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్తారాయన. ఇంతలో ఒక యాక్సిడెంట్ కేస్ రావడంతో, డా. శ్రీధర్, మహతి ఆయన గదిలోంచి బయటకు పరిగెత్తుతారు. తీవ్రంగా గాయపడ్డ ఆ పేషంటుకి వైద్యం చేయడానికి సరైన పరికరాలు, ఆక్సీజన్ సిలిండర్స్ లేవనీ, అంబులెన్స్‌కి ఫోన్ చేసి తెప్పించాలన్న గంటపైన పడుతుందని శ్రీధర్ బాధపడుతుంటే, డా. సూరిగారికి ఫోన్ చేసి అన్నీ అమర్చిన అంబులెన్స్‌ని అర్జెంటుగా పంపమని చెప్పమని సలహా ఇస్తుంది మహి. అంబులెన్స్‌తో పాటు డా. సూరి మరో వైద్యుడితో కర్రావూరి ఉప్పలపాడుకి వస్తారు. ముగ్గురు డాక్టర్లు వైద్యం చేసి ఆ పేషంటును బ్రతికిస్తారు. ఊరి వారు, ఆ పేషంట్ కుటుంబం ముగ్గురు వైద్యులకీ కృతజ్ఞతలు చెప్తారు. యాక్సిడెంట్‍కి మూల కారణం రోడ్ల మీద గుంతలని గ్రహిస్తుంది మహి. పైగా లైసెన్సులు లేని మైనర్లు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవింగ్ చేయడం కూడా మరో కారణమని భావిస్తుంది. వీటిని పరిష్కరించాలంటే ఏం చేయాలో వనజ గారితో చర్చిస్తుంది. మనం కేవలం ఆలోచించగలమనీ, ఆ పైన ఏం చేయాలన్నా డబ్బు ఉండాల్నీ, అధికారుల అండ ఉండాలని అంటారామె. నువ్వు కౌన్సిలర్‌గా పోటీ చేయగలవా, గెలవగలవా, గెలిచినా నీ ఆలోచనలను అమలుచేసేలా ప్రెసిడెంటును ఒప్పించగలవా అని అడుగుతారామె. అయితే నిరాశ నిస్పృహలను వదిలి ప్రజల్లో నమ్మకం కలిగించగలిగ్తే, వారు ఎంతకైనా సిద్ధపడతారని అంటుంది మహతి. ప్రజల నైజాన్ని, వారి నిస్సహాయతనీ ఇంకా ఇంకా గమనించమనీ, అసలు వారికేమి కావాలో ముందు తెలుసుకోమని, అప్పుడు బహుశా ఒక చక్కని మార్గం కనబడుతుందని చెబుతారు వనజ. – ఇక చదవండి.]

మహతి-3 మహి-10

[dropcap]క[/dropcap]రణం గారింట్లో పెళ్ళి. కరణం గారు వస్తుతః మితభాషి. ఆస్తిపరులు కూడా. అందువల్ల రైతుల్ని ఏనాడూ ఇబ్బంది పెట్టని ‘మంచాయన’గా పేరు తెచ్చుకున్నారు. ఆయన పెద్ద కూతురు ‘మనోరమ’ పెళ్ళి. మనోరమ ఇంటర్‌తో చదువు మానేసింది. కారణం, బెజవాడ వెళ్ళాలంటే భయం. చాలా కట్టుబాట్లలో పెరిగిన కుటుంబంలోంచి వచ్చింది గనక మనోరమ కూడా చాలా వినయవిధేయతలు కలిగిందే. నా క్లాస్‌మేటే. అయితే ఇంటర్ చదివింది గుడివాడ వాళ్ళ బాబాయి ఇంట్లో వుండి. కరణం గారూ, వారి భార్యా ప్రత్యేకంగా ఇంటికొచ్చి మరీ తాతయ్యనూ, నన్ను, డాక్టరుగార్ని పిలిచారు. అమ్మానాన్నలకు ఫోన్‌లో ఆహ్వానం పలికి మరీ మరీ రమ్మని చెప్పారు. అడ్రసు తీసుకున్నారు శుభలేఖ పంపించడానికి.

“అమ్మాయ్, మీ తాతగారు మా నాన్నగారూ మంచి స్నేహితులు. నువ్వూ, మనోరమ కూడా క్లాసుమేట్సేగా 10th వరకూ. కనుక తప్పకుండా నువ్వు దగ్గరుండి మరీ నీ స్నేహితురాలి పెళ్ళి జరిపించాలి.” అన్నారు కరణంగారు.

“అలాగే బాబాయ్” అన్నాను. చిన్నప్పటి నించే నేను ఆయన్ని బాబాయ్ అనే పిలిచేదాన్ని.

“వంటకి ఎవరొస్తున్నార్రా వీరభద్రా?” అనడిగారు తాతయ్య. కరణం గార్ని తాతయ్య ఏరా అనీ, వీరభద్రా అనే పిలుస్తారు. ఆయన పేరు వీరభద్ర శర్మ.

“ఇంకెవరు, బందంచర్ల నించి సుబ్బారాయుడ్ని రమ్మని కబురెట్టాను.” అన్నారు కరణం గారు.

“సుబ్బారాయుడికేం.. నలుడికీ భీముడికీ సరిసాటి వాడు. అబ్బ.. నీ పెళ్ళిలో వాడు వండి వడ్డించినవి ఇప్పటికీ మరిచి పోలేదనుకో, మహీ, మీ అమ్మమ్మ కొన్ని కొత్త వంటలూ, టెక్నిక్సూ నేర్చుకున్నది సుబ్బారాయుడి దగ్గర్నించే” అన్నారు తాతాయ్య.

ఆ సుబ్బారాయుడ్ని చూడాలనే కుతూహలం అప్పటికప్పుడు కలిగింది. అమ్మమ్మకి వంట నేర్పినవాడు మామూలోడు కాదు గదా!

“ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరు? ఏం చేస్తున్నాడూ?” అడిగారు తాతయ్య.

“మేనరికమే. నీకు తెలుసుగా కరుణాకరం, వాడి కొడుకే, ప్రస్తుతం బాంబేలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయ్యాక అమెరికా వెడతాడట. వాడు పనిచేసే కంపెనీనే వాణ్ణి అమెరికా పంపిస్తుందట. చిన్నప్పటినించే తెలిసిన వాడే. కుర్రాడు బుద్ధిమంతుడు, సౌమ్యుడూ. అదీ గాక మనోరమకీ వాడంటే చాలా ఇష్టం.” మెల్లగా అన్నారు కరణం గారు.

“అవునండీ.. దానికీ కిరణ్ అంటే ఇష్టమేనండీ” వినయంగా అన్నది కరణం గారి భార్య.

“ఇంకేం శుభమస్తు” అన్నారు తాతాయ్య. ఓ అరగంట కూర్చొని వాళ్ళు వెళ్ళారు.

“మేనరికాలు మంచివి కావని అంటారు గదా తాతయ్యా?” మెల్లగా అన్నాను.

“వరస మేనరికాలు చెయ్యరు. కరణం గారి కుటుంబంలో ఇదే మొదటి మేనరికం. కనుక ఫరవాలేదు. ఇంకోటి తెలుసామ్మా.. పెళ్ళికొడుకు తండ్రి కరణం గారి భార్యకి స్వయానా తమ్ముడు. అతను చిన్నప్పుడే బాంబేలో సెటిలై, మహారాష్ట్ర బ్రాహ్మణ పిల్లనే పెళ్ళి చేసుకున్నాడు. మనోరమకి కాబోయే అత్తగారి పేరు వందన. ఆ పిల్ల చాలా చదువుకున్నదీ, మహా ఉత్తమురాలూ. చాలా పొందిగ్గా వుంటుంది.” అన్నారు తాతయ్య.

“ఆ విషయం మనోరమ ఎప్పుడూ చెప్పలేదు” అన్నాను.

“బహుశా సిగ్గుపడి వుంటుంది” నవ్వేశారు తాతయ్య.

“మహీ నీకు తెలీదు గానీ, బావా మరదళ్ళ రిలేషన్ చాలా లోతైనది. చాలా గాఢమైనది కూడా” అన్నారు తాతయ్య.

డాక్టర్ శ్రీధర్ ఇంటికొచ్చారు.

“మహీజీ.. ఓ కప్పు కాఫీ ఇస్తారా!” అలసటగా కుర్చీలో కూర్చుని అన్నారు శ్రీధర్. నేను లేచాను.

“ఏమైంది?” కంగారుగా అన్నారు తాతయ్య.

“ఏం లేదండీ. పేషెంట్లు రద్దీ.. నాకు బాగా తలనొప్పి వచ్చింది.” నీరసంగా అన్నారు డాక్టర్.

కాఫీ ఇచ్చాను. తాగబోతూ గబాల్న బయటికి పరిగెత్తి డోక్కున్నారు. తాతయ్య గబాగబా చెంబుతో నీళ్ళు తీసికెడితే నేను టవల్ పుచ్చుకుని పరిగెత్తాను.

“సారీ..” అలసటగా నీళ్ళతో ముఖం నోరు కడుక్కుని టవల్‌తో తుడుచుకుంటూ అన్నారు.

“మాతో మాట్లాడుతునే గదా మీరు హాస్పటల్‍కి వెళ్ళింది. మళ్ళీ వెంటనే తిరిగి రావాడం తోనే అనిపించింది.. మీకు ఒంట్లో బాగోలేదని. తెల్లారుఝామున ఆరింటికి వెళ్ళి పన్నెండింటికి వచ్చారు. పన్నెండున్నరకి వెళ్ళి రెండింటికొచ్చారు. ఇలా నిద్రాహారాలు మాని పనిజేస్తే అనారోగ్యం కాక ఇంకేముంటుందీ!” తాతయ్య అన్నారు.

“ఇంకో డాక్టరు పదిహేను రోజుల నించీ రావడం లేదు.” మంచం మీద నిస్సత్తువగా పడుకున్నారు డాక్టరు గారు. నుదుటి మీద చెయ్యి వేసి చూస్తే కాలిపోతోంది. మెల్లగా డా. సూరికి ఫోన్ చేసి శ్రీధర్ గారి పరిస్థితి చెప్పాను. డా. సూరి వచ్చేలోగా తడిగుడ్డని నుదుటి మీద వుంచి టెంపరేచర్ తగ్గేందుకు, ఇంట్లో అదివరకు జ్వరానికి వాడే మాత్రనే ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేసి శ్రీధర్ గారికి వేశాను.

గంట తరువాత చూస్తే టెంపరేచర్ ఇంకా ఎక్కువయింది. మూలగటం కూడా మొదలయింది. కాలు మీద కాలు వేసి రుద్దుకుంటుంటే అర్థమైంది.. కాళ్ళనొప్పులతో కూడా బాధపడుతున్నారని.

తాతయ్య కంగారు పడి, “పోనీ నర్స్‌ని పిలిపిస్తే?” అన్నారు.

“నేను డా. సూరి గారికి ఫోన్ చేసి చెప్పాను. ఇంకో గంటలో ఆయన వస్తారు. ఈ లోగా నేను డాక్టర్ గారికి హార్లిక్స్ కలుపుకు వస్తాను” అన్నాను.

“అలాగే” అంటూ తాతయ్య శ్రీధర్ గారి కాళ్ళు నొక్కడం మొదలెట్టారు.

“అదేంటి తాతయ్యా.. నువ్వు లే.. నేను నొక్కుతా” అన్నాను.

“పరవాలేదురా.. నువ్వు ఆడపిల్లవి. ముందు హార్లిక్స్ సంగతి చూడు” అన్నారు తాతయ్య.

ఎందుకయినా మంచిదని నర్స్‌కి కూడా కబురు పెట్టాను ఇంటికి రమ్మని. ఇన్నేళ్ళలో డాక్టరు గారు ఇలా డీలా పడటం ఎప్పుడూ చూళ్ళేదు.

ఓ గంటంపావు తరువాత డా. సూరి, మరో ఆమె కారు దిగారు. “ఈవిడ డాక్టర్ శ్యామల” అని పరిచయం చేస్తూనే శ్రీధర్ గారి పోర్షన్ లోకి వెళ్ళారు సూరి. నర్స్ అప్పుడు వచ్చింది.. “పేషంట్లకి సర్ది చెప్పలేక తల ప్రాణం పైకెగిరిందమ్మా” అంటూ. ఇద్దరు డాక్టర్లు చాలాసేపు డిస్కస్ చేసుకున్నారు.

“మహీ.. ఇది చాలా సీరియస్ వైరల్ ఫీవర్. ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు. అలాగని ఇప్పటికిప్పుడు అంబులెన్స్ తెప్పించి తరలించడమూ సరైన మార్గం కాదు” అన్నారు సూరి.

“శ్రీధర్ గారి బంధువులెవరైనా..” అడిగారు తాతయ్య.

“నాకు తెలిసి ఎవరూ లేరండీ.” అన్నారు సూరి.

“అయితే ఆయన్ని ఇక్కడే ఉంచుదాం.” స్పష్టంగా చెప్పాను.

“అది కాదు మహీ.. ఈ వైరల్ మంచిది కాదు.. అదీగాక..” ఆగారు డా. సూరి.

“సూరిగారూ, అదే వైరల్ నాకు వస్తే మీరు గానీ శ్రీధర్ గారు గానీ వదిలేసి వెళ్తారా? ముందు ఆయనకి ఎలా ట్రీట్‌మెంట్ ఇవ్వాలో నిర్ణయించండి. జాగ్రత్తలు నేను చూసుకుంటాను” అన్నాను.

“అవును సూరిగారూ. నాకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు కన్నకొడుకులాగా చూసుకున్నాడు శ్రీధర్. అతని కష్టకాలంలో మేం అతన్ని చూడకపోతే కృతజ్ఞత అనే మాటికి అర్థమేముంటుందీ!” తాతయ్య కూడా స్థిరంగా చెప్పారు.

“నిజంగా ఓ సమస్య తీరింది. ఇవాళ రాత్రి గడిచేంత మటుకూ మేమూ ఇక్కడే ఉంటాం” అన్నారు డాక్టర్ సూరి.

ఆ తరువాత ఆ వైరస్ లక్షణాలు, ముందు జాగ్రత్తలూ అన్నీ మాకే గాక వివరంగా నర్స్‌కి కూడా బోధపరిచారు డా. సూరి. “సిస్టర్ మీరు హాస్పటల్‌కి వెళ్ళచ్చు. ఈ వైరస్ ఇప్పటికే ఎవరికైనా సోకిందేమో చూడండి” అన్నారు.

ఊరు ఊరంతా వైరల్ ఫీవర్ వ్యాపించింది. మా ఊరే కాదు.. ఊళ్ళకి ఊళ్ళు ఆ మహమ్మారి బారినపడ్డాయి. డా. సూరి, డా. శ్యామల తప్పకుండా కార్లో వచ్చి ప్రతిరోజూ డా. శ్రీధర్ గార్ని చూసి వెడుతున్నారు. ఎప్పటికప్పుడు వారి ఇనస్ట్రక్షన్స్ ఫాలో అవుతూ నేను డాక్టరు గార్ని చూసుకుంటూనే ఉన్నాను. అదృష్టం ఏమంటే, నాకూ తాతయ్యకీ ఆ వైరల్ ఫీవర్ అంటుకోలేదు. డాక్టర్లిద్దరు నాకూ తాతయ్యకీ కూడా ఏవో ప్రివెన్షన్ మెడిసిన్ ఇచ్చారు. ఊరంతా జ్వరాలతో వాంతులతో అంటకాగిపోయింది. ఒక వూరికీ మరో వూరికీ కూడా రాకపోకలు బంద్. కూరగాయలు తట్టల్లో పెట్టుకుని అమ్మేవాళ్మూ, తోపుడు బళ్ళ మీద ఉల్లిపాయలు, దోసకాయలు పెట్టుకుని అమ్మేవాళ్ళు, ఆఖరికి ఆకుకూరలూ, ములక్కాడలు అమ్మేవాళ్ళు కూడా అంతర్ధానమైపోయారు.

మంచి చెరువు నీటిని ఒకటికి పదిసార్లు వడకట్టి, ఆపైన సలసలా కాచి చల్లార్చి తాగుతున్నారు జనాలు.

మా ఇంట్లో బావి వుండటం ఎంతటి వరమో ఆరోజుల్లో నాకు తెలిసింది.

అదృష్టవశాత్తూ నేను ఇక్కడికి వచ్చాక పెరట్లో పెట్టిన కూరకాయల మొక్కలూ, పాదులే మమ్మల్ని ఆదుకున్నాయి. వంకాయలు, బెండకాయలు, బీర, గోరుచిక్కుడు, గుమ్మడి, బచ్చలి కూర, తోటకూర, చుక్కకూర, చిక్కుడు, ఆనప వంటివి పుష్కలంగా కాయడం వలన, ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఇస్తున్నాం.

పాలేరు పుణ్యమా అని పాలు పెరుగులకి ఢోకా లేకపోయింది. అరటి గెలలు, పచ్చిమిర్చి మొక్కలు, మెంతికూర, కొబ్బరికాయలు, కొత్తిమీర కావల్సినంత ఉండటంతో వంటకి ఏ లోటూ రాలేదు. ఎందుకంటే నేనూ తాతయ్యా, శ్రీధర్ గారే కాక, డా. సూరి, డా. శ్యామల, ఇంకా హాస్పటల్‍లో కొంతమందికి కూడా భోజనాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఇద్దరు డాక్టర్లని మద్రాస్ నించి ఓ హాస్పటల్ వారు మా ఊరికి పంపారు. కారణం ఆ మద్రాస్ హాస్పటల్ వారి పూర్వీకులు మా ఊరివారు అవడమే.

ఆ రోజుల్లో త్రిపుర గారూ, నేనూ, మహిళా మండలి లోని కొందరూ కలిసి పేషంట్లకి భోజనాలు ఏర్పాటు చెయ్యడమూ, టీ బిస్కెట్లు బ్రెడ్డు ఫ్రూట్సు లాంటివీ పంచడమూ చేసేవాళ్ళం. సత్యసాయి సేవా సంస్థ వారి సేవలు నిజంగా వెలకట్టలేనివి. బియ్యం ఉప్పు పప్పులు పంచదారా కిరసనాయిలుతో సహా చక్కగా పేక్ చేసిన బాక్సుల్ని పేదలకు పంపిణీ చేశారు, ఉచితంగా. చాలా ప్రయివేటు సంస్థలు కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాయి.

ఒక మహమ్మరి వచ్చి ప్రజల్ని దగ్గర చేసింది. అప్పటి వరకూ ఎడమొహం పెడమొహం పెట్టుకు తిరిగేవాళ్ళు కూడా యీ వైరల్ ఫీవర్ విజృంభణకి ప్రేమగా పలకరించుకోవడం మొదలెట్టారు.

డా. శ్రీధర్ కోలుకోవడానికి 24 రోజులు పట్టింది. ఊరు కూడా కొంత వరకూ కోలుకుంది. మా ఊరు వచ్చినప్పుడల్లా అంటే ప్రతిరోజు డా. సూరి, డా. శ్యామల హాస్పటల్‍కి కూడా వెళ్ళి సేవలు చేశారు.

***

“తాతయ్యా.. శ్రీధర్ గారికి ఎవరూ వున్నట్టు లేదని సూరి గారు అన్నారు కదా.” అన్నాను.

“అవునమ్మా.. ఇంతవరకూ ఆయన విషయం ఏనాడు చెప్పలేదు. మరొక విషయం ఏమంటే, తనంతట తాను చెప్పేవరకూ మనం అడగడం సబబు కాదు. ఎందుకంటే ఎవరి స్వవిషయాలు వాళ్ళవి.” అన్నారు తాతయ్య.

నాతో ఏదో మాట్లాడాలని ఆయన రెండుసార్లు అనటం, మొదటిసారి ఆయనే మాట తప్పించడం, రెండోసారి యాక్సిడెంటు కేసు వల్ల ఆ మాట మరుగున పడటం గుర్తొచ్చింది. తాతయ్యతో చెప్పాలనుకున్నాను. కానీ చెప్పలేదు. పోనీ వీలు చేసుకుని శ్రీధర్ గారినే అడిగితే! నా అంత నేను ‘ఏమిటి’ అని అడగటం బాగుంటుందా? మనసుకి జవాబు రాలేదు.

ఒక తుఫాను వెలిశాక సముద్రం ఎలా అంటుందో అలా వుంది మా కర్రావూరి ఉప్పలపాడు.

విచిత్రం ఏమంటే, మా అమ్మ నాన్నా తమ్ముడు చెల్లెలూ – నేనిక్కడికి వచ్చాక రాలేదు. ఫోనుల్లో మాత్రం మాట్లాడుకుంటున్నాం. అమ్మానాన్నా ఎన్నిసార్లు ప్రయత్నించినా మా ఊరికి రావడం కుదరలేదు. కారణం ఇంట్లో వారందరికీ ఒకరి తరువాత ఒకరికి ఫీవర్ రావడమే.

సురేన్ (మా అన్నయ్య) రెగ్యులర్ టచ్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం వాడున్నది ఇండియా పాకిస్తాన్ బోర్డర్‍లో. వాడు రాసిన ఉత్తరాలు చదివితేనే నాకు టెన్షన్ పెరుగుతోంది. వాడికి మాత్రం మహా ఎగ్జయిటింగ్‌గా ఉందని వాడు రాసే విధానమే తెలియజెపుతోంది.

ఓ సైనికుడి జీవితం ఎలా ఉంటుందో నా మనసులో ఒక ఊహ గూడు కట్టుకుంటోంది.

ఉత్తరాన్ని ఎంతవరకూ చదివి చెప్పాలో అంతవరకే తాతయ్యకు చెబుతున్నా. వాడు నివసిస్తున్నది హార్డ్ లివింగ్ ఏరియాట. ఆర్మీ పోస్టల్ ఆఫీస్ అడ్రస్సే గానీ అసలు అడ్రస్ ఉండదు.

ఒక్కోసారి నా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది సురేన్‌ని తలుచుకుని. దేశం కోసం యవ్వనాన్ని, సుఖాలనీ త్యాగం చెయ్యడం ఎంత గొప్ప విషయం.

అక్కడ చలికీ గాడ్పులకీ వాళ్ళు భయపడకుండా పహారా కాస్తున్నందుకేగా మనం హాయిగా నిద్రించ గలుగుతున్నాము.

సురేన్ ఉత్తరం వచ్చిన రోజంతా తాతయ్య చాలా ఉత్సాహంగా ఉంటాడు. మళ్ళీ మళ్ళీ చదవమంటాడు. ఆ మాత్రం ఆయన చదవలేక కాదు. నేను సెన్సార్ చేసి చదువుతున్న విషయము ఆయన గమనించాడని నాకు తెలవడం కోసం. ఒక ఉత్తరాన్ని ఒక పదిసార్లు ఒకే విధంగా చదవలేముగా. మాములు ఉత్తరం అయితే ఓకే. మరి నేను సెన్సారు చేస్తానుగా. దానికి కారణం తాతయ్య కంగారు పడకూడదనే సదుద్దేశం మాత్రమే. ఉత్తరం వచ్చిన రోజున తాతయ్య అడిగి మరీ స్పెషల్స్ చేయిస్తాడు.

***

“మహీ.. అక్కడంతా వైరల్ ఫీవర్ అని అమ్మ చెప్పింది. జాగ్రత్త, నా విషయం బాగానే వుంది. షెడ్యూల్ ఆల్‍మోస్ట్ అయిపోయినా, ‘శర్మిష్ఠ’ సినిమా కొన్ని రోజులు వాయిదా పడటం వల్ల ఇక్కడే వున్నాను. ఏం చేస్తున్నానంటావా? చెబితే ఆశ్వర్యపోతావు. వినోద్ కపూర్ గారి సిస్టర్ ఇంట్లో ఉన్నాను. వారుండేది గుర్‌గావ్‍లో. ఆవిడే నన్ను చండీఘర్ తీసికెళ్ళి ఆ అద్భుత నగరాన్ని చూపించింది. హర్యానా పంజాబ్ లకు అదే ఉమ్మడి రాజధాని. దేశంలోని మొట్టమొదటి ప్లాన్డ్ సిటీ. సెక్టార్లు సెక్టార్లుగా నిర్మించబడింది. అక్కడి రాక్ గార్డెన్స్ చూసి తీరాల్సిందే. ఇక క్లీన్లీనెస్ మాట చెప్పక్కరలేదు. మహీ.. ఎక్కడో పుట్టి అదే ‘విశ్వం’ అనుకుంటూ మనం ఎంత మిస్సయ్యామో ఇప్పుడు తెలుస్తోందే. మన భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశం ప్రపంచంలో మరొకటి ఉండదనిపిస్తోంది. ఎన్ని భాషలు.. ఎన్ని సంస్కృతులు. ఏ భాష వారి జీవనం అయినా ఓ ప్రత్యేకత సంతరించుకోవడాన్ని గమనించాను. ఏ రాష్ట్రపు సంస్కృతి సాంప్రదాయాలు దానివే. ఓహ్.. నువ్వంటే ఇంకా ఆనందించేదాన్ని.” ఇలా సాగింది ఆరు పేజీల అల ఉత్తరం.

ఫోన్ గొప్పదే. మాటల్నీ మధురంగా వినిపిస్తుంది. ఎదుటి వారి ‘మూడ్’ నీ స్వరంతో తెలియచేస్తుంది. కానీ ‘ఉత్తరం’ విలువ ఉత్తరానిదే. దశాబ్దాల పాటు దాచుకోవచ్చు. వందలసార్లు చదువుకోవచ్చు. ఎప్పుడో, వృద్ధాప్యం మీద పడ్డనాడు ఆ ఉత్తరాలు నెమరేస్తూ మరోసారి యవ్వన హేలని మనోఫలకంపై చూసుకోవచ్చు. అందుకే నేనిప్పటికీ (వయసు అడక్కండి) ఉత్తరాలనే ప్రేమిస్తాను. ఉత్తరాలే వ్రాస్తూ వుంటాను. ఉత్తరం కాలానికే కాదు, జీవితానికి కూడా సాక్షే!

(ఇంకా ఉంది)

Exit mobile version