Site icon Sanchika

మహతి-44

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[కరణం గారి కూతురు మనోరమకి వాళ్ళ బావ కరుణాకరంతో పెళ్ళి నిశ్చయమవుతుంది. శుభలేఖలు ఇవ్వడానికి పెళ్ళికి ఆహ్వానించడానికి కరణం గారు ఆయన భార్య మహతి వాళ్ళింటికి వచ్చి తాతయ్యకి అన్ని వివరాలు చెప్తారు. మనోరమ కూడా పదో తరగతి వరకూ మహతి క్లాస్‍మేటే. వంటకి ఎవరొస్తున్నారని తాతయ్య అడిగితే, బందంచర్ల నించి సుబ్బారాయుడ్ని రమ్మని పిలిచానని కరణంగారు చెప్తారు. ఆ సుబ్బారాయుడి నుంచి మీ అమ్మమ్మ కొన్ని వంటలు నేర్చుకుందని మహతికి చెప్తారు తాతయ్య. వాళ్ళు వెళ్ళాకా, తాతయ్యా మేనరికాలు మంచివి కావంటారుగా అని అడుగుతుంది మహతి. వాళ్ళింట్లో మొదటి మేనరికం ఇదే కాబట్టి పర్వాలేదంటారయన. ఇంతలో డా. శ్రీధర్ ఆసుపత్రి నుంచి వచ్చేసి, బాగా తలనొప్పిగా ఉందనీ, ఓ కప్పు కాఫీ ఇస్తారా అని మహతిని అడుగుతాడు. కాఫీ తెచ్చేలోపు వాంతు చేసుకుని మంచం మీద నిస్సత్తుగా వాలిపోతాడు. జ్వరం కూడా వస్తుంది. మహతి వెంటనే డా. సూరికి ఫోన్ చేస్తుంది. గంట తరువాత డా. సూరి, డా. శ్యామల అక్కడికి వస్తారు. శ్రీధర్‍ని పరీక్షించి చూసి, చాలా సీరియస్ వైరల్ ఫీవర్‍ అని చెప్తారు. ఇంట్లోనే ఉంచి వైద్యం చేద్దామంటుంది మహతి. ఈ లోపు మహతి కబురందుకున్న నర్స్ కూడా వస్తుంది. నర్స్‌కీ, మహతికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి, సూరి, శ్యామల వెళ్ళిపోతారు. వైరల్ ఫీవర్ ఊరందరికీ సోకుతుంది. చుట్టుపక్కల ఊళ్ళకి వ్యాపిస్తుంది. అయితే డా. సూరి – మహతికి, తాతయ్యకి ప్రివెంటివ్ ఇంజక్షన్ ఇవ్వడంతో వారిద్దరికీ సోకదు. మూడు వారాలకు కానీ పరిస్థితి సాధరణమవదు. డా. శ్రీధర్ కోలుకోవడానికి 24 రోజులు పడుతుంది. శ్రీధర్ తనతో ఏదో చెప్పాలనుకున్నారన్న సంగతి మహతికి గుర్తుంది. ఇప్పుడు సందర్భం కాదని వదిలేస్తుంది. సురేన్ ఉత్తరాలు రాస్తూంటాడు. వాటిని చదివి తాతయ్యకి వినిపిస్తుంది మహతి. వైరల్ ఫీవర్ సంగతి తెలిసి అల కూడా ఉత్తరం రాస్తుంది. జాగ్రత్తలు తీసుకోమంటుంది. తాను చూసిన చండీఘర్ నగరం గురించి, భారతదేశపు విశిష్టమైన సాంప్రదాయాల గురించి రాస్తుంది. – ఇక చదవండి.]

మహతి-3 మహి-11

[dropcap]వీ[/dropcap]రభద్రశర్మ, విశాలాక్షి గారి కుమార్తె మనోరమ వివాహం కరుణాకర్‌తో వైభవంగా జరిగింది. పచ్చని తాటాకుల పందిరి (పెద్దవి) వేయించారు. మామిడాకుల తోరణాలు, దరిదాపు వెయ్యి స్టీలు గ్లాసులు కొన్నారు. భోజనాలకీ టిఫిన్లకీ విస్తళ్ళు. ఆ విస్తళ్ళన్నీ మా గొడవున్‍లో తయారీనే. బేబిల్స్, చైర్లు భోజనాలు లేకుండా పందిట్లోనే చక్కని చాప కుదుర్ల మీదే భోజనాలు. వీటన్నిటికీ కారణం వంట బ్రాహ్మడు సుబ్బారాయుడి సత్యనారాయణ శాస్త్రి. వారం రోజుల ముందరే ప్రత్యేకంగా వచ్చాడుట. అద్దెకిచ్చే షామియానాల కింద వంట చెయ్యననీ, అద్దెకిచ్చే గరిటలూ, గంగాళాలు, సత్తు పాత్రలతో సహా వేటిని వాడననీ, శాఖాహార ఇళ్ళల్లో వుండే గంగాళాలు, గ్లాసులు చెంబులు వంట పాత్రలు మాత్రమే వాడతాననీ, ఒకవేళ అవి తెప్పించలేకపోతే తన ఊరైన బందంచర్ల నుంచే అవన్నీ బస్సులో వేయించి తెచ్చుకుంటాననీ చెప్పాడట.

‘అలా ఎందుకూ?’ అని కరణం గారు అడిగితే, షామియానాలు అద్దెకిచ్చే వారు వ్యాపారాన్ని మాత్రమే చూస్తారనీ, ఇవాళ డెడ్ బాడీ కోసం వెళ్ళిన షామియానానే మళ్లీ మరుసటిరోజున ‘పెళ్ళి’ కోసం పంపుతారనీ, అది తప్పని చెప్పాడట. అలాగే ‘మాంసాహారం వండిన పాత్రల్లో శాఖాహారం ఎలా వండనూ?’ అని కూడా అన్నాడట.

“సరేనయ్యా, పెళ్ళిళ్ళు సరే, రేపెప్పుడైనా పెద్ద కర్మలకీ సంవత్సరీకాలకీ వంట చెయ్యాల్సి వస్తే?” అని అనడిగారట కరణం గారు.

“అయ్యా, పుట్టుక ఎంత గొప్పదో, చావూ అంతే గొప్పదండి. అరిగిపోయిన శరీరావయవాలకి ముక్తి కలిగించేది మృత్యువే కదండీ! అందుకే ఆ అపరకర్మల కోసం వేరే ఒక సెట్టు వంట పాత్రలూ పరికరాలూ విడిగా పెట్టుకున్నానండీ. అయ్యా నాది చాదస్తం అనుకుంటారండీ అందరూ. కానీ కాదండీ. పెళ్ళి మంత్రాలు చదివేటప్పటి శబ్దతరంగాలు వేరండీ. శవానికి అపరకర్మలు చేయిస్తూ చదివేప్పటి మంత్రాల శబ్ద తరంగాలు వేరండి. అందుకే గాత్రశుద్ధి లాగా పాత్రశుద్ధి కూడా ఉండాలండీ!” అన్నాడట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనోరమ నాతో చెప్పగానే అతన్ని చూడాలనిపించి కరణం గారి ఇంటికి మనూతో బాబే వెళ్ళాను. పందిరి వెయ్యడం ఎలా, ఎటు వైపు ‘ఎత్తు’ వుండాలో, ఎటువైపు ‘వాలు’ ఉండాలో అతనే పురమాయిస్తున్నాడు. ముఖాన బొట్టుతో చాలా క్రమశిక్షణతో కనిపించాడు. మనూ నన్ను అతనికి పరిచయం చేసింది. “నమస్తే” అన్నాను. “శుభమస్తు” అన్నాడు దీవిస్తూ.

అతనికి మహా వుంటే ఇరవయ్యో ఇరభై ఒకటో వుంటాయి. “మీరు సుబ్బారాయుడి గారికి” అంటుండగానే

“వారు మా తాతగారు. వారి దగ్గరే నేను పాకశాస్త్రం నేర్చుకున్నాను” అన్నాడు.

“మరి మీరు స్కూలుకి వెళ్ళలేదా?” ఆశ్చర్యంగా అడిగాను.

“వెళ్ళకేం? ముందు బి.ఎ. చేశాను. ఆ తరువాత బెంగుళూరులో మూడేళ్ళ పాటు కంప్యూటర్ కోర్సులు చేశాను” నవ్వుతూ అన్నాడు.

“మరి ఇలా..” ఆగాను.

“వంట చెయ్యడం ఒక అద్భుతమైన కళే కాదు, సైన్స్ కూడా. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు, నేను పట్టించుకోను.. నా వరకూ నేను వంట వండి వడ్డించడాన్ని ఒక ఉపాసనగా భావిస్తాను. ఆహారం బట్టే ఆలోచనలు, ఆచరణలు ఉంటాయని 100% నమ్ముతాను. అంతేకాదు. మా పూర్వీకులంతా ఈ విద్యతోటే తరించారు. మా నాయనగారు ఈ విద్యని వదిలేసి కోర్టులో ప్లీడరుగా పేరు గడించారు. అది ఆయన వ్యక్తిగత వ్యవహారం. నేను మాత్రం మా పూర్వీకులు పెంచి పోషించిన విద్యని వదలకూడదని నిర్ణయించుకున్నాను” అన్నాడు అతను.

“అద్భుతమైన నిర్ణయం శాస్త్రిగారూ. అయితే సంవత్సరమంతా బిజీగా వుండలేరుగా యీ వృత్తిలో” అన్నాను.

“అవునూ. అందుకే మా వూళ్ళో కంప్యూటర్ సెంటర్ పెట్టి దాదాపు నలభైమందికి కంప్యూటర్ నేర్పిస్తున్నాను. మరో విషయం ఏమంచే ఔత్సాహికులకు యీ పాకవిద్యని కూడా నాతో బాటు తిప్పుకుంటూ నేర్పిస్తున్నాను. ఈ విద్య ఎంత గొప్పదంటే, ఏ దేశానికి వెళ్ళినా హాయిగా బ్రతకొచ్చు, బ్రతికించవచ్చు” అన్నాడు.

“మరి..” ఆగాను.

“చూడండి.. తెలుగులో వంట చేసేవాళ్ళని వంటవాళ్ళు, వంటబ్రాహ్మణులు అని తేలిగ్గా చూడొచ్చు. కానీ వాళ్ళే టై కట్టుకుని సూటూ బూటూ వేసి వంట చేస్తే ‘చెఫ్’ అని గౌరవిస్తారు. ‘చెఫ్ స్పెషల్’ అని ఊరించి ఊరించి చెబుతారు. ఎవరో ఏదో అంటారని నా వృతిని నేను ప్రేమించడం మానను. అందుకే ఎవరడిగినా నిర్మొహమాటంగా నా వృత్తిని ప్రకటిస్తాను. యస్ వంట అంటే నా హాబీ, నా ప్రాణం, నా వృత్తి” అన్నాడు ఉల్లాసం, ఉత్సాహం, వృత్తి మీద ప్రేమా తొణికిసలాడుతుండగా.

“నిజంగా చాలా సంతోషంగా వుంది సత్యనారాయణశాస్త్రి గారూ మిమ్మల్ని కలిసి. మా అమ్మమ్మగారు కొన్ని వంటలను మా తాతగారి నించి నేర్చుకున్నారని మా తాతాయ్య చెప్పాడు” అన్నాను చెయ్యి ముందుకు జాచి.

అతను కరచాలనం చేసి, “అంత పొడుగు పేరు కష్టపడి చదవక్కర్లేదు. నన్ను ‘సత్యా’ అని పిలుస్తారు. మీరూ అలాగే పిలవచ్చు” అన్నాడు నవ్వుతూ.

“అయితే మీరు కూడా నన్ను ‘మహీ’ అనే పిలవచ్చు” అని సెలవు తీసుకున్నాను. ఆనాడు అతని దగ్గిర నుంచి నేను తెలుసుకున్నాను – ఎంచుకున్న వృతిని ప్రేమించాలనీ, త్రికరణ శుద్ధిగా, ఆ వృత్తికి న్యాయం చెయ్యాలనీ. లోకంలో ఇంటువంటి వ్యక్తులు ఉన్నారు గనకే న్యాయం ధర్మం నిలిచి వున్నాయనిపించింది.

లోకంలో ఎలాగో ఓలాగ బ్రతికెయ్యటం ఒక పద్ధతి. తాము ఎలా బ్రతకాలని అనుకుంటారో, అలాగే  బ్రతకటం మరో పద్ధతి. మొదటి పద్ధతి ననుసరించేవారు కోటానుకోట్ల మంది. రెండో పద్ధతి అంత తేలికైనది కాదు.

చాలా నిష్ఠ, నిబద్ధత, క్రమశిక్షణ, మనసుపై అపారమైన కంట్రోలు ఉంటే తప్ప రెండో పద్ధతిలో బ్రతకటం సాధ్యం కాదు. అయిదు రోజుల ముందే అతను వచ్చినా ఒక్క క్షణం తీరిగ్గా లేడు. మా సంభాషణ కూడా పనుల మధ్యే జరిగింది.

“మీరు చైన్ ఆఫ్ కేటరింగ్ సర్వీసెస్ ప్రారంభించవచ్చుగా?” అడిగాను.

“చెయ్యొచ్చు, కానీ 100% నిబద్ధత కలిగిన వారు కావాలి. ఎక్కువ డబ్బిస్తానంటే చాలు.. గంటలో పని మానేసి వెళ్ళిపోయే వారు కోకొల్లలు. ప్రతి వృత్తి లోనూ ఇదే సమస్య. డాక్టర్లు, ఇంజనీర్లు, కంప్యూటర్ ఎక్స్‌పర్ట్‌లు, గొప్ప పేరు తెచ్చకున్న హోటల్ యాజమానులు కూడా ఇవ్వాళ ఫారిన్‌కో, గొప్ప నగరాలకో వలస వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం డబ్బు.. మొదట మనం డబ్బున సంపాదించడానికి నాన కష్టాలూ పడతాం. ఆపైన డబ్బే డబ్బుని సంపాదిస్తుంది” ఆగాడు సత్యా.

“డబ్బు సంపాదన మంచిది కాదంటారా?” సీరియస్‌గా అడిగా.

పకపకా నవ్వాడు “నేను ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదన కేగా! అయినా  ఓ తేడా వు౦ది. కరణం గారికీ, మా పరిచయం ఇప్పటిది కాదు. అది అలా వుంచితే ‘డబ్బు’ సంపాదన ఓ వ్యసనమైతే, అద్భుతంగా సంపద పెరుగుతుంది. కానీ, మనం నష్టపోయేది జీవితాన్ని. ఎన్నివేల కోట్ల ధనమైనా తొలిగిపోయే కాలాన్ని ఒక్క క్షణం ఆపగలదా? యవ్వనాన్ని ధన సంపాదన కోసం వెచ్చిస్తాం. వృద్ధాప్యంలో అంతులేని ఆస్తి వుండొచ్చు. కానీ కరిగిపోయిన యవ్వనం తిరిగి రాదుగా. జీవితం పప్పు అయితే ధనం ఉప్పు లాంటిది. తగినంత డబ్బు సంపాయించుకోవడం గ్రేట్. ధనమే ముఖ్యం అనుకంటే? అప్పుడు జీవితమనే పప్పు ఉప్పుమయమై తినడానికి పనికి రాకుండా పోతుంది.” మళ్ళీ ఆగాడు సత్యా. అతను చెప్పిన దాన్ని ఆలోచిస్తున్నాను.

“మహతి గారూ, నాకు సామన్య జీవితం అంటే ఇష్టం. అమితమైన ఆనందం కావాలంటే, అన్నిట్నీ ‘మితం’ గానే వాడుకోవాలి. అవసరాల్ని తగ్గించుకోవడమే ఆనందానికి పునాది. సారీ ఇవి కేవలం నా భావాలు. అవి రైటో రాంగో నాకు తెలియదు. కానీ, అవి రైటే అని నా మనసు అనుభవం తోనే తెలుపుతోంది” గాడి పొయ్యిని తవ్విస్తూ అన్నాడు సత్యా. ఉప్పులూ పప్పులు కూడా మేలైనవి ఎంచి మరీ తెస్తున్నాడు. వంకాయలు, బెండకాయలు, దోసకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు చిక్కుడుకాయలు, బంగాళా, చేమ దుంపలు చిలగడదుంపలు గుమ్మడి, బూడిద గుమ్మడి, ఆకు కూరలూ అన్ని ఒక వరుసగా రాసుకని ఫ్రెష్‌గా ఏ పూట వంటకి ఏవి తేవాలో కూరల దుకాణంలో స్పష్టంగా చెప్పి వచ్చాడు. కందా బచ్చలి కూరకి కందని భీమవారం నించీ, బచ్చలిని పత్తిపాడు నించీ తెమ్మని అసిస్టెంట్స్‌గా రాబోయే తన స్టూడెంట్స్‌కి ఫోన్‍లో చెప్పాడు. ‘మెనూ’ని చక్కగా పుస్తకంలో తేదీల వారీగా ఏ రోజు ఏమి వండాలో స్పష్టంగా రాసి కరణం గారికి చూపించాడు.

సత్యా ప్రతిదీ పుస్తకంలో వ్రాయడం, ఒక ప్లాన్ ప్రకారం పనులు చెయ్యడం చూస్తూ నేను చాలా స్ఫూర్తి పొందాను. ‘ఇతను నిజంగా గొప్పవాడు’ అనే భావం నాలో చాలా బలపడింది. అరటి బజ్జీలకీ, కూరకీ కాయల్ని సెలెక్ట్ చెయ్యడానికి అతను మునసబు గారి అరటి తోటకి వెళ్ళాడని తెలిసి ఆశ్యర్యపోయాను. “అన్ని కాయలూ ఒకలానే కనపడతాయి కానీ, చాలా తేడాలు ఉంటాయి. అనుభవమే నేర్పుతోంది ఆ సూక్ష్మమైన తేడాల్ని ఎలా గుర్తించడమో!” అని అతనన్న మాటకి ఇంకా ఆశ్చర్యపోయాను.

పెళ్ళి ఎలా జరిగిందో, ఏ ఏ కూరలు వగైరాలు చెప్పి మిమ్మల్ని విసిగించను. ఒక్కటి మాత్రం చెప్పగలను.. సత్యా, సుబ్బారాయుడు గారు సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ వరాన పుట్టారనిపించింది. పెళ్ళిలో ఎన్ని అవకతవకలున్నా, భోజనం అద్భుతంగా ఉంటే అన్నీ సర్దుకుపోతాయి. అలాంటిది, ఏ అవకతవకలు జరగని కరణం గారింటి వివాహ మహోత్సవం, సత్యా తయారు చేయించిన వంటలతో వెయ్యింతలు పరిమళించింది. సత్యా రూపంలో ఓ గురువుని పొందాను.

***

“సమాజం మనిషిని ప్రభావితం చేస్తుందా? మనిషి సమాజాన్ని ప్రభావితం చేస్తాడా?” అనడిగాను త్రిపుర గారిని.

“రెండూ జరుగుతై. కొందర్ని సమాజం ప్రభావితం చేస్తే ‘కొందరు’ సమాజాన్నే ప్రభావితం చేస్తారు. అయితే ఆ ‘కొందరు’ తమని తాము మలుచుకున్నవారు” అన్నారు త్రిపుర. సత్యా లాంటివారు బహుశా తమని తాము మలుచుకున్నవారిలా నాకు అనిపించింది.

కరణం గారి ఇంటి పెళ్ళి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. పెర్‌ఫెక్షన్‌ని అందరూ మెచ్చుకున్నారు. మా తాతయ్య “మహీ.. నీ పెళ్ళి కూడా ఇంత చక్కగా జరిగితే కళ్ళార చూడాలని ఉందే. అప్పటి వరకూ ఉంటానంటావా?” అన్నాడు నా తల నిమురుతూ. నేను మాట్లాడే ముందరే, “ఏం మాట్లాడకు తల్లీ.. ముసలివాళ్ళ కోరికలు యువతరానికి ప్రతిబంధకం కాకూడదు. కుసుమని అట్టా బలవంతపెట్టేగా ఇవ్వాళ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. హాయిగా నువ్వేం చెయ్యాలనుకుంటావో నిర్భయంగా అదే చెయ్యి.” అన్నాడు.

మా నాన్న అమ్మా చెల్లీ తమ్ముడు కూడా పెళ్ళి రోజు ఉదయం వచ్చి పెళ్ళి చూసుకుని సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోయారు. అమ్మా నాన్న బాగానే ఉన్నారు గానీ నాకు మాత్రం ఏదో ఓ వెలితిగా అనిపించింది.

వాళ్ళ మాటలు ఖాతరు చెయ్యకుండా నేను చదువుకి కామా పెట్టినందువల్ల కూడా కావొచ్చు. ఉన్న కాసేపట్లో కూడా మేం మాట్లాడుకున్నది శ్రీధర్ గారి అనారోగ్యం గురించీ, కుసుమ గురించీ, పెళ్ళి గురించీ, సత్యా పాటించిన పద్ధతుల గురించీ.

అమ్మ చిన్నప్పటి స్నేహితులు చాలామంది ఆ పెళ్ళిలో నాకు పరిచయమయ్యారు. ఇక నా క్లాస్‍మేట్స్ లకు అంతే లేదు.

పెళ్ళి అనేది చుట్టాలూ పక్కాలు హాయిగా చక్కగా మరోసారి మళ్ళీ కలిసే ఓ కూడలి వంటిది. ఎన్ని భావోద్రేకపు పక్షులు మనసుల్లో వివరిస్తాయో. ఎన్ని ఊహల పువ్వుల వికసిస్తాయో!

***

స్త్రీ నిజమైన శత్రువు స్త్రీయే అని ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో అన్నారో గానీ, మనోరమ పెళ్ళి కూడా ఆ నానుడిని నిజం చేసింది. వచ్చిన అమ్మలక్కలందరూ ఓ పక్క పెళ్ళి చూస్తూనే మరో పక్క స్వరూపరాణి విడాకుల విషయాన్ని అతి లోతుగా, సూక్ష్మాతి సూక్ష్మ పాయింట్లను వెలికి తీస్తూ చర్చించడం నేను కళ్ళారా కన్నాను. చెవులారా విన్నాను. ఎదటివాళ్ళ దౌర్భాగ్యం ఎంతోమందికి ఎంత ఆనందాన్ని కూర్చుతుందో ఆనాడు నేను కళ్ళారా గమనించాను.

నిజంగా స్వరూపరాణి మీద నాకు జాలి కలిగింది. తప్పు ఎవరికైనా అందరి నోళ్ళలో అనవసరంగా నానుతున్నది ఆ అమ్మాయేగా!

మహిళా మండలి ప్రెసిడెంట్ మాలతీ గారు రాగానే అత్యంత వేగంగా ప్లేటు మార్చి స్వరూపరాణికి సానుభూతి కురిపించడం కూడా నా చెవులారా విన్నాను.

ఈ విచిత్ర పోకడలన్నీ ఫెమినిస్టు సంఘాల వారికి తెలియదనే అనుకోవాలి మరి.

“ఎంతో తెలుసుకున్నా
తెలుసుకో వలసింది
ఇంకెంతో వున్నదని
తెలిసినప్పుడు –
తెలుసుకోవడం ఎందుకూ?
తెలియనిది తెలుసుకోవడమే
తెలియడం అని తెలిసినప్పుడు
ఎంతో తెలుసుకున్నా
తెలిసేది ఏముంటుందనీ.”

అని ఎప్పుడో ఓ పాదచారి రాసిన కవిత గుర్తుకొచ్చింది నాకు.

అంతేకాదు ఓ పది పెళ్ళి సంబంధాలు కూడా నాకు వచ్చాయి.

కొందరు”మా అబ్బాయిని తీసుకుంటావా?” అని నన్నే డైరెక్టుగా అడిగితే, మరికొందరు మా అమ్మానాన్నలను ‘మా వాడికి మీ పిల్లనిస్తారా!” అని సమర్యాదగా సంప్రదించారు.

మొత్తానికి భారతీయ వివాహం అనే కార్యాక్రమంలో ఎన్నో ఉపయోగాలు బయటపడ్డాయి. ఒకరి బంధుత్వం. ఎవరు ఎవరికి ఏమవుతారో తెలిసేది పెళ్ళిళ్ళలోనే. కొత్త పెళ్ళిళ్ళకు పునాదులు పడేదీ పెళ్ళిళ్ళ లోనే.

“అయ్యో మనవాడు కష్టంలో ఉన్నాడట.. నలుగురం కలిసి ఒడ్డున పడేద్దాం” అనే సత్సంకల్పాలు రూపుదిద్దుకునేదీ పెళ్ళిళ్ళలోనే. పెళ్ళి వయసు వచ్చిన ఆడ, మగ పిల్లలు స్వయంవర, స్వయంవధ కార్యక్రమాలు జరిగేదీ పెళ్ళిళ్ళ లోనే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి భారతీయ సాంప్రదాయిన కార్యక్రమం వెనుకా అనేకానేక ఉపయోగాలు మనకు దర్శనమిస్తాయి. నా వరకూ చాలా నేర్చుకున్నా. అరటికాయలు ఎదరుగా పెడితే, నాకేమీ తేడా తెలిసేది గాదు. సత్యా చూపించాడు కూరకి ఏది బాగుంటుందో, బజ్జీలకి ఏ కాయలు వాడాలో అనేదాన్ని.

అంటే కేవలం గమనించడం వేరు, సూక్ష్మంగా పరిశీలించడం వేరు.

మరో చిత్రం కూడా మీతో పంచుకోవాలి. పెళ్ళి ఆహ్వాన పత్రికల్ని యీనాడు పోటీ పడి మరీ విలువైన కార్డుల్ని ఎంపిక చేస్తున్నారు. పెళ్ళయింతరువాత ఆ కార్డుని ఎంతమంది జాగ్రత్తగా దాస్తారూ? మీరిచ్చేది పది రూపాయల కార్డైనా అయిదు వందల రూపాయల కార్డు అయినా, జనాలు బయట పారేస్తారు గానీ జాగ్రత్తగా ఉంచరుగా! అలాంటప్పుడు వృథాగా అంత ఖర్చు ఎందుకూ పెట్టడం! వివాహ ఆహ్వాన పత్రిక లక్ష్యం ‘ఇన్‌ఫర్మేషన్ అండ్ ఇన్విటేషన్’. అది అర్థం చేసుకుంటే పూర్వకాలంలోలా అతి తక్కువ ఖర్చుతో ముద్రింపజేయొచ్చు.

“త్రిపురగారూ, మధ్య తరగతి నాశనం అవుతున్నది అనవసరపు ఖర్చులతో నేనండీ.! అసలు ఓ పెళ్ళికి ఏ ఖర్చు సబబో ఏది బేసబబో ముందు తెలుసుకోగలిగితే ఎంత దుబారాని అరికట్టవచ్చు.” అన్నారు వనజ గారు.

“Yes. మీరన్నది ముమ్మాటికీ నిజం. ఓ స్పష్టమైన పద్ధతిని మిడిల్ క్లాస్ పీపుల్ గనక ఎంచుకుంటే, చాలా చాలా ఆదా అవుతుంది” అన్నాను.

“మరి నీ పెళ్ళికి అటువంటి పద్ధతిని ఖచ్చితంగా పాటిస్తావా?” అడిగారు వనజ గారు.

“మమ్ముటికీ పాటిస్తా. ఎందుకంటే ఆచరణ సాధ్యమైన ఆలోచననే నే విశ్వసిస్తాను” ధీమాగా అన్నాను.

తరువాత చెప్పలేనంత నవ్వొచ్చింది, చదువే పూర్తి కాలేదు, పెళ్ళి విషయం ఆలోచించినందుకు!

(ఇంకా ఉంది)

Exit mobile version