Site icon Sanchika

మహతి-48

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[జాగ్రత్త, జాగో అనే ఈ రెండు మాటలూ జీవితానికి అతి ముఖ్యమైనవని గ్రహిస్తుంది మహతి. తల్లిదండ్రుల ప్రవర్తనలోని మార్పు సంగతి కనుక్కునేందుకు తామే అక్కడికి వెళ్దామా అని అడుగుతాడు తాతయ్య. వద్దంటుంది మహీ, అలా వెళ్ళడం వల్ల అమ్మానాన్నలు ఇంకా అసహజంగా ప్రవర్తిస్తారంటుంది. తమకి ఓ హాలు, ఓ గది, వంట గది ఉంచుకుని మిగతా ఇల్లాంతా డా. శ్రీధర్, శ్యామల గార్లకి కేటాయిస్తారు. ఓ రోజు మహీ ఇంటికి వచ్చిన త్రిపుర, ఎందుకో ఓ రకంగా ఉంటున్నావని మహీని అడుగుతారు. మామూలుగానే ఉన్నానే అంటుంది మహీ. నువ్వు మామూలుగా లేవని నీకు తప్ప అందరికీ తెలుస్తోందని అంటారు త్రిపుర. తన భవిష్యత్తు గురించి తనలో కల్గుతున్న అస్పష్టత గురించి మహీ ఆవిడతో ప్రస్తావిస్తుంది. డిగ్రీ కంప్లీట్ చెయ్యమని ఆవిడ సూచించి, వెళ్ళిపోతారు. ఉన్నట్టుండి ఊర్లో అకాల వర్షం కురుస్తుంది. చిన్నగా మొదలైన వాన జడివానగా, గాలి సుడిగాలిగా మారుతుంది. గుడి మండపంలో ఆగిన మహతి మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతాయి. ఇంతలో అక్కడున్న ఓ యువ సన్యాసి ఆమెను – ఏమాలోచిస్తున్నావని అడుగుతాడు. మీరేమనుకుంటున్నారని అడిగితే, అస్పష్టమైన ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోందని అంటాడతను. మీది ఈ ఊరు కాదు కదా అని మహి అడిగితే, సన్యాసులకు ఏ ఊరూ సొంతం కాదని అంటాడు. కాసేపు వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. తన గతం గురించి చెప్తాడతను. తనలో పరివర్తన తెచ్చిన ఘటననీ, అందుకు దోహదం చేసిన ఓ ఋషితుల్యుడి గురించి చెప్తాడు. తమ ఇంటికి ఆహ్వానిస్తుందతన్ని. ఇంతలో వర్షం తగ్గితే, అతను అక్కడ్నించి బయల్దేరుతాడు. కనీసం మీ పేరు చెప్పండి అంటే, తన పేరు ‘అజ్ఞాని’ అని చెప్పి అక్కడ్నించి బయల్దేరుతాడు. – ఇక చదవండి.]

మహతి-3 మహి-15

[dropcap]నా[/dropcap]కెందుకో పిచ్చి నవ్వు వచ్చింది. “ఇదుగో అజ్ఞాని గారు, దయచేసి మీరు మా ఇంటికి రావాలి.. ప్లీజ్” అన్నాను నవ్వుతూనే.

అతను ఆగి చిన్నగా నవ్వి, “నేనా, రాకపోతే? రానంటే?” అన్నాడు. ఆ మాటల్లో చిన్న కొంటెతనం ఉంది.

“అయితే నేనూ కాషాయం కట్టుకుని, జ్ఞాని అనో సుజ్ఞాని అనో పేరు మార్చుకుని మీ వెంట పడతా” నవ్వుతూనే అన్నాను.

“నేను వచ్చినందు వల్ల మీకేం ప్రయోజనం?” అన్నాడు.

“ప్రయోజనం సంగతి నాకు వద్దు. మీరన్నట్టు లాభాలు, నష్టాలు, ప్రయోజనాలు, పనికి కూలిన పనులు – ఇవన్ని వదిలేస్తే గానీ జీవితం హాయిగా వుండదని అర్థమైంది. మీరు వస్తే సంతోషిస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.” అన్నాను సిన్సియర్‍గా.

ఓ క్షణం సూటిగా నా కళ్ళల్లోకి చూశాడు. రెండు చంద్ర కిరణాలు నా కనుపాపల్లోకి దూసుకుని పోయినట్లు అనిపించింది. ఆ చూపులో ఓ స్నేహ భావం వుంది. దేనికీ చలించని నిర్భయతా, దేన్ని పట్టించుకోని ఓ నిశ్చలతా ఉన్నాయి.

“పదండి” అన్నాడు. నేను గబగబా అతన్ని చేరాను. ఇద్దరం నడుస్తున్నాం. నేను ఓ అరంగుళం ముందు నడుస్తున్నానంతే. అతను నన్ను అనుసరిస్తున్నాడు. ఏ మాటలూ లేవు మా మధ్య. కానీ, అప్పటి దాకా అలలు అలలుగా ఎగసిపడుతున్న మానస సరోవరం ప్రశాంతమైనట్లు నాకు అనిపించింది.

“నేను మనుషులతో మాట్లాడి చాలా కాలం అయింది. చిత్రం ఏమంటే, ఇప్పుడు మౌనంతో మాట్లాడుతున్నా” అన్నాడు సన్నగా. ఆ స్వరంలో చెప్పలేని మృదుత్వం. “నిజంగా చెబితే నేను కూడా మౌనం లోని ప్రశాంతతని అనుభవిస్తున్నా. గుడికి వెళ్ళినప్పటి తుఫాను ఇప్పుడు నా మనసులో లేదు. ప్రకృతిని కుదిపేసిన తుఫాను చల్లారినట్టుగానే, మీ మాటలతో నా మనసూ చల్లబడింది” నిజాయితీగా అన్నాను.

ఆయన చిన్నగా నవ్వాడు, అంతే. రోడ్లు అన్నీ చిన్న సైజు కాలువలయ్యాయి. పిల్లలు కాగితాల పడవలు చేస్తూ బుల్లి బుల్లి కాలవల్లో పందాలు వేస్తున్నారు. పెద్దవాళ్ళు పిల్లల్ని వెనక్కు రమ్మని అరుస్తున్నారుగానీ వారి స్వరాల్లో కోపం లేదు, బహుశా వారి బాల్యం వారికి గుర్తుకొచ్చి ఉంటుంది.

వర్షం ఎంత హాయినిస్తుందంటే చెప్పలేము. చెట్లన్నీ వర్షపు ధారలతో స్నానించి, మురికి, దుమ్ము, ధూళీ వదిలించుకుని పచ్చగా మెరుస్తున్నాయి. గాలికి మెల్లగా మృదువుగా ఎగిరే సాందర్యవతి ముంగురుల లాగా చెట్ల వృక్షాల ఆకులు సౌందర్యవంతంగా ఒళ్ళు విరుచుకుంటున్నాయి. రోడ్ల మీద గుంతలన్నీ నీటిలో నిండిపోయాయి. వాటి మధ్యలో జాగ్రతగా ముందు నడుస్తూ, ఆయన్నీ గుంతల గురించి హెచ్చరిస్తున్నాను.

మా వీధి లోకి తిరగగానే వీధరుగు మీద నిలబడి వున్న తాతయ్య కనిపించాడు. ఆయన మొహంలో చిన్న ఆందోళన. నన్ను చూడగానే, ఆ ఆందోళన మాయం కావడం నేను గమనించాను.

“అమ్మయ్య.. వర్షంలో ఎక్కడ చిక్కుకుపోయావో అని కంగారు పడుతున్నా.. మహీ.. వీరు..” అన్నాడు తాతయ్య ఆయన్ని చూసి.

“వారి పేరు అజ్ఞాని తాతయ్యా, ఇప్పుడే గుడి దగ్గర పరిచయం అయ్యారు” అన్నాను నేను.

“ఏయ్.. ఏంటా మాటలు? అజ్ఞాని ఏమిటి? పెద్దదానివైనా నీకింకా అల్లరితనమేనా?” కోపంగా అన్నాడు తాతయ్య. అతను నవ్వుతున్నాడు.

“లేదు తాతయ్యా. నేను పేరడిగితే ఆయన చెప్పిన పేరు అదే” అన్నాను.

“పేరులో ఏముంది తాతగారు? పుట్టినప్పుడు పెద్దవాళ్ళు ఏదో పేరు పెడతారు. పుట్టుకతో వచ్చిన పేరు వేరు.. పెట్టుకునే పేరు వేరు. జనం మన ప్రవర్తన చూసి పిలిచే నిక్‍నేమ్ వేరు.. అన్నీ పేర్లే. అందుకే ‘అజ్ఞాని’ అని చెప్పాను. అదీ ఓ పేరేగా” నవ్వి అన్నాడతను.

“నువ్వన్నదీ నిజమే బాబూ.. ‘అజ్ఞానం’లో జ్ఞానం ఉంది. ‘జ్ఞానం’లో అజ్ఞానం ఉండదు కదా – ఓ విధంగా అందరూ అజ్ఞానులే” సాదరంగా అతని భుజం మీద చెయ్యివేసి అరుగు మీద కుర్చీలో కూర్చోబెట్టి అన్నాడు తాతయ్య,

“పెద్దవారు. మీ ఎదుట సత్యాన్ని మరుగుపరచకూడదు. నా అసలు పేరు అభిమన్యు” కూర్చుని అన్నాడతను.

“మంచి పేరు” అన్నాడు తాతయ్య.

“నాకయితే అజ్ఞాని పేరే బాగుంది తాతాయ్య. ఎవరూ ఆ పేరు పెట్టుకోరు కదా! అన్నట్లు తాతయ్యా, మీరు మాట్లాడుతూ ఉండండి. చిటికెలో వంట చేసేస్తా.” అభిమన్యు మాట కోసం ఎదురు చూడకండా లోపలికి పరిగెత్తాను నేను. అతనికి ‘నో’ అనే ఛాన్సు ఇవ్వదలచుకోలా.

చిటికెలో అన్నాను కానీ గంట పట్టింది. టమోటా రసం – దోసకాయ పప్పు – కందిపచ్చడి – వంకాయ చిక్కుడు కాయ కూర, ఆనపకాయ పెరుగుపచ్చడి, వడియాలు, అప్పడాలు, ఊర మిరపకాయలు.

వంట ఏ క్రమంలో చేస్తే క్విక్‍గా అవుతుందో నేర్పింది మా అమ్మమ్మ.

“నేను ఇన్ని పదార్థాలు తినను” అన్నాడు అభిమన్యు.

“గృహస్థుని సంతోషపరచాల్సిన బాధ్యత కాషాయధారులకి ఉందంటారు” నవ్వి అన్నాను.

“సరే.. అయితే గృహస్థు తాతగారే కదా!” అన్నాడు అభిమన్యు.

“నాయానా.. నాకు తెలిసి, తినే వయసులో ఖచ్చితంగా తినాలి. బిపీలూ డయాబెటికులూ వచ్చాక తీపీ, కారం ఎలానూ తినలేరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు గనుక మీలో ఉండే శివుడికి భక్తిగా నైవేద్యం పెట్టమనే నేను చెబుతాను” అన్నాడు తాతయ్య.

“సరే.. మా అమ్మ కూడా మీలాగే చెప్పేది తాతగారూ – ఇవ్వాళ అన్ని నియమాలకీ సెలవిచ్చేస్తా!” నవ్వి భోజనానికి కూర్చున్నాడు అభిమన్యు.

కొసరి కొసరి వడ్డించాను. ఓ పక్క మీద కొత్త దుప్పటి పరిచాను. “భోజనం అయ్యాకా కాస్త రెస్టు తీసుకొండి”, ఆయన చేతులు కడుక్కున్నాక పక్క చూపుతూ అన్నాను.

“అవునవును.. గృహస్థు చెప్పింది చెయ్యాలి గదా!” అన్నాడు. అరగంట పడుకున్నాడేమో.. భయంకరమైన గాలీ వానా మొదలైంది. ఎంత అంటే, ఊరు ఊరంతా గాలికి కట్టుకుపోతుందా అన్నంత.

పూరిళ్ళ కప్పులు, పాకల కప్పులే కాదు, రేకులు కప్పిన షెడ్లు కూడా గాలికి ఎగిరిపోతున్నాయి. భయంకరమైన పిడుగులూ ఉరుములూ.

“ఓహ్.. నేను పుట్టాకా ఈ వూళ్ళో ఇటువంటి బీభత్సమైన వర్షాన్ని ఎరుగను” అన్నాడు తాతయ్య.

గాలి హోరులో ఆ మాట వినిపించీ వినిపించనట్లుగా వినిపించింది. కొన్ని చెట్టు విరిగి పడటం కిటికీ లోంచి కనిపిస్తుంది. మా గొడవున్ పాక పై కప్పులో ఏదో కూలిపోయింది.

కరెంటు పోయి అరగంటైంది. కిరసనాయిలు దీపాలు అంటే, రెండు లాంతర్లూ, ఓ లెస్టర్ లాంపూ, కొవ్వొత్తులూ, టార్చి లైట్లూ సిద్ధం చేశాను.

రాత్రి భోజనానికి చపాతీలు, కొంచెం ఉప్మా కూడా సిద్ధం చేశాను.

ఎందుకంటే మ ఊర్లో కరెంటు పోతే ఎప్పుడొస్తుందో ఎవరు చెప్పలేరు. చెట్లు విరిగి, కరెంటు తీగలు తెగిపడ్డ సంఘటనలు కోకొల్లులు. నీటిని కూడా మూడు బిందెల నిండా మూడు కూజాల నిండా నింపాను.

వర్షం కురుస్తూనే ఉంది. మెరువులు ఉరుములూ పిడుగుల బీభత్స నాట్యాన్ని ప్రదర్శిస్తోంది. మా మధ్య మౌనమే నాట్యమాడింది. ఎవరి మాటా ఎవరికీ వినపడే పరిస్థితి కాదుగా!

సాయంత్రమంతా బీభత్సమైన వర్షంతో సాగి పడమటికి చేరింది. నిర్మలమైన రాత్రి భయం దుప్పటి కప్పుకుని భయంభయంగా పుడమిని పలుకరించింది.

అభిమన్యు రాత్రి మాతో గడపక తప్పలేదు. అతని కథంతా తాతయ్యతో చెప్పాల్సి వచ్చింది, తాత మాటని గౌరవిస్తూ. అతని జీవితాన్ని నేను విన్నాను గనక, నాకూ ఆశ్చర్యంతో మాట రాలేదు.

“ఏ జీవికీ అపకారం చెయ్యకుండా ఎవరికీ చెడుపు చెయ్యకుండా ఉండే జీవితమే ఉత్కృష్టమైనదని నా భావం. సంపాయించిన కొద్దీ సంపాయించమని సాధిస్తుంది మనసు. సంపాదన ఓ భయంకరమైన వ్యసనం. అసలు నీకు ఎంత కావాలీ? ఎంతుంటే తృప్తి పడతావూ? ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయాయి. ఈ లోకానికి నువ్వొచ్చావు. అన్నిట్నీ ఉచితంగానే యీ నేల తల్లి ఇస్తోంది. నువ్వేం చెయ్యగలవో ఏనాడైనా ఆలోచించావా? తాతయ్య గారూ, ఇవి నా ప్రశ్నలు కావు. నన్ను నా గురువు అడిగిన ప్రశ్నలు. ఆ ప్రశ్నలు నన్ను నేనే వేసుకున్నాను. అశాంతి నించి ప్రశాంతి వైపుకి మెల్లిగా నా మనసుని మళ్ళిస్తున్నాను. సన్యాసం అంటే నిరాశ, నిర్లిప్తత కాదు. మొదట నువ్వు తృప్తిగా ఉండటం నేర్చుకోవడం.. నీ మాటలతో చేతలతో లోకులకు సాంత్వన కలిగించడం!! ఇదీ నా గురువు బోధించినదే. ఆయన ఓ నిరంతర విద్యార్ధి గనుకనే నాకు గురువయ్యారు” ఆగాడు అభిమన్యు.

రాత్రి 10 గంటల 25 నిముషాలు. వర్షం కొంచెం నెమ్మదించింది అంతే. ఉధృతిని మాత్రమే తగ్గించింది.

“ఆ సాధనా క్రమంలోనే నా గురువు నాకు కొంచెం వైద్యం, కొంత జ్యోతిషం, కొంత హస్త సాముద్రికం, కొంత మనోపరిశీలన, మనోవైద్యం వంటివి నేర్పించారు. ఆయన నా కిచ్చిన అపూర్వ బహుమతులు అవే!” ఎక్కడో ఉన్న గురువుకి వినమ్రంగా నమస్కరించి అన్నాడు అభిమన్యు.

ఆ వర్షంలోనే కరెంటు లేని ఆ కొవ్వొత్తుల, లాంతర్ల వెలుగులోనే ఆధరువులన్నిటినీ మళ్ళీ వేడి చేసి వడ్డించా. “బహుశా ఇలా కడుపు నిండుగా తిని ఐదారేళ్ళ పైనే అవుతుందేమో, తినాలనే కోరిక చచ్చిపోయిందని అనుకున్నాను. కానీ, బ్రతికే వుంది” అన్నాడు అభిమన్యు. నాకు చాలా ఆనందం కలిగింది.

“పేపరూ పెన్నూ ఉందా.. కొన్ని లెక్కలు వెయ్యాలి” అన్నాడు అభిమన్యు. చక్కగా తెల్ల రెండు పెన్నులూ ఇచ్చి, “ఏ లెక్కలు కడుతారూ? వర్షపు లెక్కలా? వ్యక్తుల లెక్కలా?” అన్నాను నవ్వుతాలుగా.

“హోమియో వైద్యం గురించి తెలుసా? వ్యక్తి రంగూ, ఒడ్డూ పొడుగుల గురించే కాదు.. నడిచే, నవ్వే, కూర్చునే, నిలబడే పద్ధతిని కూడా వైద్యుడు గమనిస్తాడు. గమనించినప్పుడే ‘రెమెడీ’ని కనుక్కోగలడు. అలాగే జ్యోతిష్యులకు కూడా కొన్ని పద్ధలున్నాయి. కలిసిన సమయం. మాట్లాడిన మాటలు, అవన్నీ లెక్కలోని వస్తాయి. అది వ్యక్తి అయినా వర్షమయినా లెక్క లెక్కే” నవ్వి అన్నాడతను.

“వెయ్యండి వెయ్యండి. నా మనవరాలు ఏం చేయాలో ఆలోచించడానికి ఓ సంవత్సరం చదువు మానింది. అసలు విషయం నా భార్య గతించింది. నేనేమైతోననే బెంగతో నాతో ఉంటూ నా బెంగ పోగొట్టింది. పరిస్థితుల్ని ఎదుర్కొనేలా నన్ను సిద్ధపరిచింది. కానీ, తన భవిష్యత్తు ఏమిటా అనే దిగులు నాకు.” టూకీగా నా గురించి చెప్పాడు తాతయ్య.

“నేను గమనించినంత వరకూ మీ మనవరాలు చాలా సూక్ష్మగ్రాహి. తను అనుకున్నది ఏదైనా సరే సాధించగల సంకల్ప బలం తనకున్నది. అంతేగాదు, పరిస్థితులకు ఎలా స్పందించాలో చక్కగా తెలిసిన వ్యక్తి. తాతగారూ, ప్రతి మనిషిలోనూ మరో మనిషి ఉంటారు. ఆ రెండో మనిషి సామాన్యంగా బయటపడరు, అత్యవసర స్థితిలోగానీ. ఈ శరీరపు వయసు వేరు, లోపలుండే ఆ రెండో మనిషి వయసు వేరు. మీరు నిశ్చింతగా ఉండండి” అన్నాడు అభిమన్యు.

పొద్దున్న లేచేసరికి ఆయన లేరు. తాతయ్య ఇంకా లేవలేదు. తలువులు దగ్గరగా వేసి ఉన్నాయి. గుడికి వెళ్ళారేను అనుకున్నాను. నేను స్నానం చేసి కాఫీకి నీళ్ళు పడేసే వేళకి తాతయ్య లేచాడు.

“మహీ. ఆ అభిమన్యు ఎక్కడ?” అన్నాడు లేస్తూనే.

“బహుశా గుడికి వెళ్లారేమో తాతయ్యా, నేనూ చూడలేదు. తలుపులు దగ్గరికి లాగి వున్నాయి” అన్నాను.

వాకిట్లోకి వచ్చి చూశాకా తెలిసింది వర్షపు బీభత్సం. ఎన్ని ఇళ్ళు పడిపోయాయో..! ఎన్ని పైకప్పులు ఎగిరిపోయి గోడలు బోసిగా దర్శనమిచ్చాయో! గుడిసెలు, పాకలు పడిపోయి ఎందరు నిర్వాసితులయ్యారో!!! మృతి చెందినవారి సంఖ్య 20. అందులో వృద్ధులు 13 మంది, శిశువులు 3, నలుగరు పిల్లలు. ఎక్కడ చూసినా రోదనలే. గుడికి పరిగెత్తాను. అభిమన్యు అక్కడున్నాడు, దుఃఖించే వారిని ఓదారుస్తూ.

“ఒక్క రెండు గంటలు ఓపిక పట్టండి. అందరికీ మందులూ భోజనాలూ వస్తాయి. నేను ఓ మనిషిని పండించాను. ధైర్యంగా ఉంచండి. గాయపడ్డ వారిని హస్పటల్లో చేర్చండి. మృతి చెందిన వారికి జరగాల్సిన విధి విధానాలు చూద్దాం” అంటూ వారికి ధైర్యం చెబుతున్నాడు.

“మందులూ ఆహారమూ ఎక్కడినించి వస్తాయి?” మెల్లగా అడిగాను. అతన్ని కాఫీకో టిఫిన్‌కో ఇంటికి పిలిచే ధైర్యం చేయలేకపోయాను.

“ఓ మోటర్ సైకిల్ కుర్రవాడ్ని బ్రతిమిలాడి నా ఎస్టేట్‍కు పంపాను. ఓ రెండు గంటల్లో లారీలో మందులూ, బ్రెడ్లూ, ఫలాలే కాదు; నిత్యావసర సరుకులు కూడా వస్తాయి. ముందు కరణం, మునసబు, ప్రెసిడెంటు, రెవెన్యూ అధికారుల్ని కలిసి, వీరికి పునరావాసం కల్పించే ఏర్పాట్లు చెయ్యాలి. మృతుల డెత్ సర్టిఫికెట్లు, వగైరాలే కాకుండా ఇన్సూరెన్సులు కూడా ఏమన్నా తెలుసుకుని క్లెయిమ్ చేసే కార్యక్రమం ఏర్పాటు చెయ్యాలి. ఎందుకంటే, యీ బాధలో కంగారులో ఏం చెయ్యాలో వారికి తెలీదు” అన్నాడు అభిమన్యు. అనటమే కాదు.. అప్పటికప్పుడు అధికార్లను కలవడానికి నన్ను కూడా బయల్దేరదీశాడు.

మాతో పాటు జనాలూ వచ్చారు. కరణం గార్నీ, మునసబు గార్నీ, ఆర్.ఐ. గార్నీ, ప్రెసిడెంటునీ కలిసి విషయం వివరంగా చెప్పాడు. తన వంతుగా ‘రెండు లక్షల రూపాయల’ సహాయాన్ని ప్రకటించి, “దయచేసి యీ రెండు మూడు రోజులూ ఉన్న దాన్ని అందరితో పంచుకోండి. లారీలు వస్తాయి. ఏమీ కొదవ లేదు. ధైర్యంగా ఉండండి. మొదట బాగు చేయాల్సింది రోడ్లు. రోడ్ల మీద వాలిన చెట్ల కొమ్మల్ని తొలగిద్దాం. ఆ తరువాతే మిగతా పనులు. కరెంటు రావాలంటే, స్తంభాల పరిస్థితి చూడాలి.” ఓ కమాండర్‌లా పరిస్థితిని అతను చేతుల్లోకే తీసుకుని దిశానిర్ధేశం చెయ్యడం నాకు ఆశ్యర్యం కలిగించింది. మరో చిత్రం ఏమంటే, అతనో సన్యాసి అని చూస్తూ కూడా అధికారులు అతని మాటల్ని గౌరహించి తలదాల్చడం.

కరణంగారు నలభై బస్తాల ధాన్యం హైస్కూలికి పంపితే, మునసబు గారు బస్తా బియ్యం పంపారు. ప్రెసిడెంటు గారు మూడు బస్తాలు, తాతయ్య రెండు బస్తాలు.. అలాగే పప్పులూ ఉప్పులు.. ఎవరన్నారు మానవత్వం చచ్చిపోయిందనీ?

మధ్యాహ్నానికల్లా అభిమన్యు ముందుచూపు వల్ల, సారధ్యం వల్ల ఊరిలో కొంత ఆందోళన, భయము, ఆక్రోశమూ తగ్గి శాంతి నెలకుంది.

రెండు లారీలు వచ్చాయి. మందులే కాదు, రెండు కార్లలో డాక్టరూ వచ్చారు. నిత్యావసర వస్తువులలో పాలు, పెరుగూ, నూనె, రెడీమేడ్ ఆహార పొటాలు లెక్కకు మించి దిగాయి, వంటవారితో సహా.

అన్నిట్నీ దించింది హైస్కూల్ దగ్గరే. హాస్పటల్ గదులూ వరండాలూ మాత్రమే కాక నేను వేయించిన బెంచీలు కూడా పేషంట్లతో నిండిపోయాయి.

“అతను చూడడానికి మాత్రమే సన్యాసి మహీ.. ఇలాంటి వాడు ఊరికొకడుంటే చాలు.. దేశం స్వర్గమౌతుంది” అన్నాడు తాతయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ. అవి ఆనందబాష్పాలని నాకు తెలుస్తూనే ఉంది.

(ఇంకా ఉంది)

Exit mobile version