(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[గుడి దగ్గర మండపంలో పరిచయమైన ‘అజ్ఞాని’ అనే యువ సన్యాసిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది మహీ. కొన్ని క్షణాలతను సందేహిస్తాడు. చివరికి సరేనని, మహతి వెంట బయల్దేరుతాడు. అప్పటిదాకా కురిసిన వాన వల్ల రోడ్ల మీద ఉండే గుంతలు నీటితో నిండిపోతాయి. అందుకని తను జాగ్రత్తగా నడుస్తూ, అతన్ని జాగ్రత్తగా నడమవని హెచ్చరిస్తుంది. అప్పటికే తాతయ్య ఆమె కోసం ఎదురు చూస్తూంటాడు. ఈయనెవరూ అని అడుగుతాడు. అతని పేరు ‘అజ్ఞాని’ అనీ, ఇప్పుడే గుడి దగ్గర పరిచయమయ్యారని చెప్తుంది. అల్లరి వద్దంటాడు తాతయ్య. కాదు, అతను తన పేరు అజ్ఞాననే చెప్పారు అంటుంది. అతను తాతయ్యతో మాట్లాడుతూ పేరులో ఏముంది లెండి అంటాడు. కొన్ని క్షణాల తరువాత పెద్దవారి ముందు సత్యాన్ని దాచకూడదంటూ తన అసలు పేరు అభిమన్యు అని చెప్తాడు. వాళ్ళని మాట్లాడుతూండమని చెప్పి వంట చేస్తుంది మహీ. బోజనం వడ్డించాకా, అన్ని పదార్థాలు చూసి, తాను అన్ని పదార్థలు తిననని అంటాడు అభిమన్యు. తాతయ్య చెప్పిన మీదట తన నియమాన్ని పక్కన బెట్టి, తింటాడు. కాసేపు నిద్రపోతాడు. కాసేపటికీ బీభత్సమైన గాలివాన మొదలవుతుంది. ఊరూ ఊరంతా గాలికి కొట్టుకుపోయినంతలా గాలీ, వానా, పిడుగులూ, ఉరుములూ. వర్షం ఆగదు. రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. అభిమన్యు తన గతం చెప్తాడు. రాత్రి సుమారు పదిన్నర వాన జోరు తగ్గుతుంది. పొద్దున్న లేచేసరికి ఇంట్లో అభిమన్యు కనబడడు. మహీ స్నానం చేసి కాఫీ నీళ్ళు పడేసే సమయానికి తాతయ్య లేస్తాడు. అభిమన్యు ఎక్కడ అని అడుగుతాడు. గుడికి వెళ్ళారేమో అంటుంది మహి. బయటకి వచ్చి చూస్తే వర్షం బీభత్సం అర్థమవుతుంది. ఇరవై మంది చనిపోతారు. చాలా ఇళ్ళు కూలిపోయాయి. ఎక్కడ చూసినా రోదనలే. అభిమన్యు అక్కడుంటాడు. అందరికీ ధైర్యం చెప్తాడు. రెండు గంటల్లో మందులు, నిత్యావసర వస్తువులు తెప్పిస్తాడు, డాక్టర్లని రప్పిస్తాడు. అందరికీ భరోసా ఇస్తాడు. అతన్ని చూసి కరణం, మునసబు, ప్రెసిడెంటు లాంటి వారు కూడా తమకు చేతనయిన సాయం చేస్తారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతాయి. – ఇక చదవండి.]
మహతి-3 మహి-16
[dropcap]వా[/dropcap]రం రోజులు ఎలా గడిచిపోయాయో నాకు తెలీదు. పొద్దున్న లేవడం గబగబా వంట చెయ్యడం, టిఫిన్లు తినేశాక ముగ్గురం జనాల్లోకి పోవడం.. మా వంతు ఏం చెయ్యాలో అది చెయ్యడం. నాకు ఆశ్చర్యం వేసేది అభిమన్యుని చూసి – ‘ఇతడేనా సిగరెట్‍తో లేచి విస్కీతో పడుకునేవాడు?’ అని.
ఏది చేసినా ఓ పద్ధతిలో, ఓ ప్రణాళికతో చేసేవాడు. ఆ విషయాన్ని ఊరంతా గమనించింది. ముఖ్యంగా యువత! యువతకి అద్భుతంగా స్ఫూర్తి కలిగించేవాడు. వివేకానంద యోగానంద, గురు రామ్, గురుగోవింద్ సింగ్ వంటి మహామహుల జీవితాలని – ఓ పక్క పనిచేస్తూనే వివరించేవాడు.
“ఈ భూమ్మీద మనం గడిపే ప్రతి క్షణం ఎంత విలువైనదంటే, దాని విలువ యీ మొత్తం విశ్వం విలువ కంటే కోటి రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి క్షణాన్ని జీవించండి.. జీవన మాధుర్యాన్ని ఆస్వాదించండి. జీవన మాధుర్యం ఎలా దొరుకుతుందో తెలుసా.. నిస్వార్థంగా, ప్రేమగా, నిష్కల్మషంగా మనం చేసే సేవలో మాత్రమే దొరుకుతుంది. తను బ్రతకడానికి ఇతర్లను పీడించేవాడూ, దోచుకునేవాడు రాక్షసుడు. తన బ్రతుకు తానే బ్రతికేవాడు మానవుడు. తను బ్రతుకుతూ పదిమందిని బ్రతికించేవాడు దేవుడు” అని చక్కగా మనసులో నాటుకునేలా చెప్పేవాడు.
“ఇటువంటి కొడుకుని కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో” కనీసం ఓ వందమంది నోట యీ మాట నేను విన్నాను.
“అప్పుడు తెలీలేదు మహీ. ఇప్పుడనిపిస్తుంది.. ఇలాంటి కొడుకు ఒకడుంటే జీవితం ఎంత బాగా ఉండేదోనని” అన్నారు సాక్షాత్తూ త్రిపుర గారే నాతోటి.
తాతయ్య బలవంతం వల్ల అభిమన్యు మా ఇంట్లోనే ఉన్నాడు. అతనికి శ్రద్ధగా వంట చేసి వడ్డించడం నాకు చాలా చాలా సంతోషంగా ఉండేది.
నాకో విషయం అర్థమయింది – ప్రతి మనిషిలోనూ కొన్ని స్కిల్స్ (ప్రావీణ్యాలు) ఉంటాయి. సమయం వచ్చినప్పుడే అవి బయట పడతాయి. అభిమన్యు సారథ్యంలో మా వూరి యువతీయువకులు చేసిన అద్భుతాలే దానికి సాక్ష్యం. నిజమైన సేవా భావంతో వాళ్ళు నిరంతరం పనిచేశారు.
నాయకుడు సమర్థుడూ, స్ఫూర్తి రగిలించగలిగిన వాడు అయితే యువత ఎంతటి ప్రబలశక్తిగా తయారవుతుందో నేను కళ్ళారా చూశాను.
అదృష్టవశాత్తూ మనదేశంలో నిస్వార్థ నాయకులకు కొరతలేదు. కానీ, నిస్వార్థ నాయకులు ఎంతో ఎంతో ఎంతో ఎంతో వెతికితే తప్ప కంటికి కనిపించడం లేదు, చెవులకి వారి పేర్లు వినిపించడం లేదు.
‘పార్టీ’లు ఏనాడో తమ నైజాన్ని మార్చుకుని ‘కుల’ గుంపులుగా మారి పోయాయి. ఆత్మగౌరవం అడుగంటి ‘బేరసారాలకు’ దేవుళ్ళాడుతున్నాయి.
ప్రభుత్వ ధనంతో చేసే సేవా, సమాజ ఉద్ధరణ, పథకాలన్నిటికీ తమ పేర్లో తమ నాయకుల పేర్లో పెడుతున్నారు రాజకీయ నాయకులు. వాళ్ళ సొమ్ము ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టరు. ప్రజాధనంతో చేసే వాటికి తమ పేరో తమ తల్లిదండ్రుల పేరో పెట్టే హక్కు వారికి ఎవరిచ్చారు? సొమ్ము ప్రజలదీ సోకు తమదా? ఇంతకంటే హేయమైన పని మరోటి ఉంటుందా? ప్రజలకి రక్షణ కల్పించడం, అణగారిన వర్గాలకి చేయూతనీయడం, నిరుద్యోగలకు ఉద్యోగావకాశాలు కల్పించడం, విద్యార్థులకు చక్కగా చదువుకునే వీలు కల్పించడం, ప్రజారోగ్యం – ఆరోగ్య, ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వం యొక్క విధి కాదా?
కానీ వారేదో మన పూర్వజన్మ పుణ్యఫలం వల్ల పుట్టి మనకు నాయకులైనట్టుగా భావిస్తే!!!
ప్రశ్నలు లక్ష. జవాబులు బయటికి రావు. ఎందుకంటే అన్ని ప్రభుత్వ సంస్థలూ పని చేసేది పైవారి దయాదృష్టి తోనే. కొన్నిట్ని మినహాయించవచ్చు, కొంత కాలం.
ప్రభుత్వం పనిచెయ్యలేదా అంతా చేసిందనే చెప్పాలి. ఆ చేసినప్పుడు నేతల ఉపన్యాసాలు కూడా, తమ పార్టీ నాయకుల గొప్పల తోనే నిండిపోయాయి గానీ, తమ ఓటు బలం పెంచుకునే మార్గంలోనే గానీ, నిజమైన సేవా దృక్పథంతో చేసినట్లు ఎవరికీ అనిపించలేదు.
రాజకీయమా.. నీకు ఎన్ని లక్షల చేతులూ. ఒక చెయ్యి ఇస్తే వంద చేతులు లాక్కుంటై. లెక్కలు మాత్రం తేడా లేకుండా సరిగ్గా సరిపోతై.
జనాలు అవాక్కయ్యారు. నాయకులు ప్రకటించిన దానికీ, చేతికి అందిన దానికీ ఉన్న వ్యత్యాసం చూసి. “మహీ గమనిస్తున్నావా.. వివిధ పార్టీలు ఉపన్యాసాలు సన్నివేశాన్ని ఎంత రక్తి కట్టిస్తున్నాయో!” విచారంగా అన్నాడు తాతయ్య.
“తాతగారూ.. తప్పు ప్రజలదేనండీ. తాత్కాలిక లోభానికి లోబడి ఓటుని నోట్లుగా మార్చుకోవడం తప్పే కదా! అభ్యర్థి పరమ నీచుడని తెలిసినా ఓటేసి గెలిపించడం మన తప్పే కదా! మధ్యతరగతి, ఎగువ, దిగువ, మధ్యతరగతి వాళ్ళయితే ఓటు హక్కుని కూడా వినియోగించారు.. నలభైశాతం వరకు. ఇక పై వాళ్ళ సంగతంటారా – ప్రభుత్యమూ, నాయకులూ, అధికారగణం ఉండేది వారి కనుసన్నలలోనేగా! ఏమైనా.. మొత్తం ప్రక్షాళన జరగాలంటే ప్రజలలో నించే నిర్ణయం పుట్టాలి” అన్నాడు అభిమన్యు,
“అది ఎలా సాధ్యం అభిమన్యు? నీలాంటి యువకులు మీ మీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వైరాగ్యం వైపు మళ్ళి కాషాయం కట్టుకుని తిరుగుతుంటే, దేశాన్ని ఎవరు బాగు చేస్తారూ? ప్రతి నాయకుడి వెనకాలా, వాడ్ని అన్నా అనో మరొక పేరుతోనో ‘మోసే’ అనుచరులు వేల సంఖ్యలో ఉన్నారు. ఆ నాయకుడి కోసం ప్రాణాలివ్వడానికో, కాళ్ళూ చేతులు నరికించు కోవడానికో సిద్ధంగా ఉన్నారు. కానీ దేశం కోసమో, తమ తల్లిదండ్రుల కోసమో, తాము ఉన్న సమాజం కోసమో ఏదీ చెయ్యరు. సినీనటుల జన్మదినాలు గుర్తువుంటై. తల్లిదండ్రుల పుట్టినరోజులూ, నిస్వార్థ నాయకుల పుట్టినరోజులూ మాత్రం గుర్తువుండవు. ఈ దేశపు యువతది ఎంత దయనీయ పరిస్థితి. నాయకులూ, నాయకత్వం కేవలం నినాదాలకే పరిమితమైతే దేశం ఎలా ముందుకెళ్తుంది.” సుదీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు తాతయ్య.
అభిమన్యు శ్రద్ధగా వింటున్నాడు. తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. నేనూ తన సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. కొన్ని నిముషాలు నిశ్శబ్దం లోకి ఒరిగిపోయాయి.
“మా మహీ చదువు మానింది. కారణం ఏం చెప్పిందో తెలుసా? తాను ఏ పని చేస్తే ఆత్మ తృప్తి కలుగుతుందో; ఏ చదువు చదివితే తనకీ సమాజానికీ నిజమైన మేలు జరుగుతుందో నిర్ణయించుకోవడానికి. నువ్వేమయినా దానికి సలహా ఇవ్వగలవా?” అన్నాడు తాతాయ్య మళ్ళీ తనే సంభాషణ పారంభిస్తూ. చిన్నగా నవ్వాడు అభిమన్యు.
“ముందుగా మిమ్మల్ని, మహీ తల్లిదండ్రుల్నీ నేను అభినందించాలి. ఎందుకంటే, నా కూతురు/కొడుకూ డాక్టరు కావాలనో, యాక్టరు కావాలనో, మరోటి మరోటి కావాలనో పిల్లల్ని తమ కోరికలని తీర్చుకునే ప్రస్తుత సమాజంలో ‘తనకి ఏది మంచిదో తననే నిర్ణయించుకోనీ’ అనే స్వాతంత్రం మీరందరూ ఇచ్చినందుకు” ఆగాడు అభిమన్యు. అతనన్నది ముమ్మాటికీ నిజం. వాళ్ళు నాకు స్వాతంత్రం ఇవ్వకపోతే మా మధ్య యీ సంభాషణ జరిగేదే కాదుగా.. నా క్లాస్‍మేట్లతో ఏ కాలేజీ లోనో చదువుతూ ఉండేదాన్ని.
“ఇచ్చిన స్వాతంత్రాన్ని మహతి కూడా వ్యర్థం చెయ్యకుండా తనని తాను మలుచుకునే ప్రయత్నం చెయ్యడం ఇంకా మెచ్చుకోదగినది. ఎందుకంటే, తల్లిదండ్రుల కోరిక ఏదన్నా, తనకి ఏది కావాలో తెలుసుకోవడమే చాలా మంచిదే కాదు, క్లిష్టమైనది కూడా!” అన్నాడు అభిమన్యు.
“ఆ మాట నిజమే” అన్నాడు తాతయ్య.
“అంతేకాదు.. మహి చేసిన, చేస్తున్న పనుల గురించి నేను విన్నాను. సామాన్యంగా యువతీయువకుల్లో ఉండే ఊహలూ, భ్రమలూ మహీలో లేకపోవడం, మనసులో సేవా తత్పరత ఉండటం, సమాజం కోసం ఏదో చెయ్యాలన్న తపన – ఇవన్నీ ప్రజలు మాటల ధ్యారా నాకు తెలిసాయి. నేను తనని గమనిస్తూనే ఉన్నాను. తాతయ్యగారూ, తన నిర్ణయం ఖచ్చితంగా గొప్ప నిర్ణయమే అవుతుంది. ఆ విషయంలో నాకు ఏ సందేహమూ లేదు.” అన్నాడు అభిమన్యు. అతను నా వైపు చూసిన చూపులో మెచ్చుకోలు మాత్రమే కాదు, నిజాయితీ నాకు కనిపించింది.
ఊరి పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ప్రజలు దీక్షగా పనులు చెయ్యడం వలన అధికారులలోనూ కదలిక వచ్చింది. ఓ సుఖం అందర్నీ కలుపుతుందో కలపదో కానీ ఓ విషాదం మాత్రం అందరినీ అరమరికలు లేకుండా దగ్గరకు చేరుస్తుందని నాకు అర్థమయింది.
డా. శ్రీధర్, డా. శ్యామల వచ్చేశారు. అభిమన్యు, శ్రీధర్ క్షణాల్లో ఆప్తులయ్యారు. శ్యామల ముఖం నిండుగా, సంతోషంగా ఉంది. నన్ను ‘మరదలా’ అని పిలుస్తుంది. వంటింట్లో నాతో పాటే పనిచేస్తూ అతి ఫాస్టుగా వంటలు నేర్చుకునే పనిలో పడింది. “ఎందుకు వదినా?” అని నేనంటే, “ఆడపడుచు అర్ధ మొగుడు కదా!” అని పకపకా నవ్వింది.
రెండు రోజుల తరవాత, “తాతయ్యా, మహీ.. ఇక నాకు సెలవిప్పించండి. నా నియమం ప్రకారం నేను ఎవరు ఇంట్లోనూ ఉండకూడదు. కానీ, ఊరు ఊరంతా కష్టంలో వున్నప్పుడు ‘నియమం’ అంటూ మడి కట్టుమని కూర్చోడం నాకు సరి అనిపించలేదు. ఇంకొంత కాలం నేను నా దారిన సాగాలనుకుంటున్నాను. ఏదేమైనా, ఇక్కడున్నన్ని రోజులూ చాలా చాలా ఆనందంగా ఆత్మీయంగా గడిచాయి. ఇన్ని రోజులు విందారగించి ఇప్పుడు మళ్ళీ నా సహజమైన ఆహారాన్ని తీసుకోవడం కష్టమే. అయినా, నా నియమ నిష్ఠలను పాటించాలి గనుక తేలిగ్గానే అలవాటు పడిపోతాను. శ్రీధర్ గారూ, మీరూ నాకు సెలవివ్వాలి” తన కాషాయం బేగ్‍ని భుజానికి తగిలించుకుని అన్నాడు అభిమన్యు.
“లోకం మనం అనుకున్నంత పెద్దదీ కాదు, మనం ఊహించలేనంత చిన్నదీ కాదు. కావాలని మనం కలవలేదు. కాదనుకునీ విడిపోవడం లేదు. మళ్ళీ ఎప్పుడో ఎక్కడో నిర్ణయించేది కాలమే” అన్నాడు అభిమన్యు.
అతన్ని ఆపాలనే కాంక్ష నాలో కట్టలు తెంచుకుంది. కానీ ఒక్క మాట కూడా నా నోటి నించి బయట పడలేదు.
మళ్ళీ అతను గుళ్ళల్లోనో మఠాల్లోనో పడుకుంటాడు. సహజంగానే అతనికి తిండి యావ లేదు. అది నేను యీ తొమ్మిది రోజులలో గమనించాను. పనిలో పడితే మంచినీళ్ళు తాగాలనే ధ్యాస కూడా వుండదు. ఇతని అతీ గతీ ఎవరు చూస్తారు? ఆకలేసినప్పుడు ఎవరు పెడతారు? నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి గంగాయమునలు పొంగాయి.
“ఏడుస్తున్నావా? నో. నేను నీలో చూసింది ఓ ధైర్యస్తురాలిని. పిరికిదాన్ని కాదు. నేను ఒకటే నీకు చెప్పగలను.. నీ గమ్యాన్ని నువ్వు చక్కగా యోచించి నిర్ణయించుకో. నిర్ణయించుకున్నాకా మనసా వాచా కర్మణా ఆ గమ్యం వైపే అడుగులు వెయ్యి. సెంటిమెంట్స్ చాలా విలువైనవి. వాటి కోసం కన్నీటిని వృథాగా వెచ్చించకు. ఆల్ ద బెస్ట్..” మొదటిసారి నాతో కరచాలనం చేసి, భుజం తట్టి బయటికి నడిచాడు అభిమన్యు. అతను మా అందరి వంకా చూసిన చూపులో ‘దయచేసి ఎవరూ వెంట రావొద్దు’ అన్న అభ్యర్థన కనిపించింది. అందుకే అందరం ఎక్కడున్న వాళ్ళం అక్కడే నిలబడిపోయాం.
అతను గేటు దాటాక, తాతయ్య గట్టిగా నిట్టూర్చి, “ఓ నిజమైన మనిషి” అన్నాడు.
***
“ప్రియమైన మహీ.. అప్పుడేదో రాశాను. ఏం రాశానో గుర్తులేదు. కానీ, రాస్తూన్నంత సేపూ ఏదో అద్భుతమైన అనుభవం నా మనసుకి కలిగిందే. ఓ చిత్రం చెప్పనా.. ఇక్కడి వాళ్ళందరూ షాయర్‌లే. అంటే కవీశ్వరులే. ప్రతీ దానికీ ఓ షాయరీని బయటకి తీసి ఆయుధంలా ఒదులుతారు. ఆ బుజ్జి కవితలు ఎంత బాగుంటాయో తెలుసా! నాకూ కొంచెం,. హిందీ, కొంచెం భోజపురీ, కొంచెం పంజాబీ పట్టుబడుతున్నాయి. మాట్లాడటం కేవలం 10%. అయినా అర్థం చేసుకోవండంలో 40% దాటానని అనిపిచింది. ఇంకో సరికొత్త జబ్బు, అదీ ఆనందాన్నిచ్చే జబ్బు నన్ను అంటుకుందే! వాటికి ‘కవితలు’ అనే పేరు పెట్టే ధైర్యం చెయ్యను కానీ, ‘అలలు’ అని మాత్రం పేరు పెట్టగలను. ఇవి ఎలా పుట్టాయో తెలుసా? ప్రేమలో నించీ పుట్టాయీ. నేను ప్రేమించిన వాడి ముందు ఇప్పటికీ ఒక్కమాట కూడా మాట్లాడకపోతున్నా. సరిగ్గా తలెత్తి అతని కళ్ళలోకి కూడా చూడలేకపోతున్నా. ‘సిగ్గు’ అనే పదానికి ఇప్పుడు అర్థం తెలుస్తోందే మహీ..!”
అల ఉత్తరం రెండోసారీ నన్ను సేద తీరుస్తోంది. అభిమన్యు అదాటున అలా వెళ్ళిపోయాక అందరిలాగే నన్నూ ఒక నిశబ్దపు పొర ఆవహించింది. ఎందుకో మాత్రం నిజంగా తెలీలేదు. నన్ను దుఃఖపెట్టేంత గాఢమైన పరిచయం అతనితో నాకు ఏముంది గనక? కానీ ఓ కనపడని శూన్యం నాలో సుడి రేగుతోంది. ఆ ఆలోచనల నించి అల ఉత్తరం నన్ను నిజంగా పక్కకి తప్పిస్తోంది. మళ్ళీ ఉత్తరం పట్టుకున్నా.
“ ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ అనే పాట విన్నావా? మొఘల్-ఎ-అజమ్ అనే సినిమా చూడు. ఓహ్! మధుబాల అందం, అభినయం అపూర్వం, అద్భుతం. రిలీజై దశాబ్దాలు దాటినా దాని ప్రత్యేకతా, సౌందర్యం ఆ సినిమాని వీడలేదు. అది భారత చలనచిత్ర చరిత్రలో కోహినూర్ వజ్రంలాంటిది. ‘ప్రేమిస్తూ ఎందుకు భయపడటం. ప్రేమించడం నేరమేమీ కాదుగా.. అదేమీ దొంగతనం కాదుగా.. నిట్టూర్పులు విడుస్తూ క్షణాల్ని దగ్ధం చెయ్యడం ఎందుకూ’ అని ప్రశ్నిస్తుంది అనార్కలీ ఆ పాటలో.
అవును మహీ. ప్రేమిస్తే భయపడటం ఎందుకూ? కానీ, నేను భయపడటం లేదు, అతనితో ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతన్నాను. నిజంగా నోరు పెగలటం లేదే! కానీ, ఆ మాట రాని మౌనం కూడా ఎంత బాగుందో!
~
ఒక హృదయం.. మరో హృదయం..
మధ్య.. ఓ.. స్పందన..!
పేరు ప్రేమట!!
ఓ మనిషీ మరో మనిషీ
మధ్యలో మౌనం
పేరు కవితట!!
ఓ రాత్రి ఓ పగలూ
మధ్య.. మృగతృష్ణ
పేరు.. భ్రాంతి
చూసింది.. చూసినది కాదు
చూసిందనుకున్నది.. చూడబడేదీ కాదు.
కనిపించింది ఒకటి
కనబడింది అనుకునేది వేరొకటి
ప్రతి మౌన క్షణాన్నీ
మనసులో నాటుకున్నాను
ప్రతి కలనీ కళ్ళల్లో
దాచుకున్నాను!
~
ఏమిటి పిచ్చి పిచ్చిగా రాస్తున్నానని అనుకుంటున్నావా. భానుమతి గారి పాట గుర్తులేదూ – ‘ప్రేమ.. పిచ్చీ.. ఒకటే’ అనే పాట. ప్రస్తుతం నా పరిస్థితీ అదే. ప్రేమ పిచ్చో, పిచ్చి ప్రేమో తేల్చుకోలేపోతున్నా. ప్రియాతిప్రియమైన నెచ్చెలీ.. నిన్ను గట్టిగా కౌగిలించుకుని నీతో మౌనంగా నా మనసుని నివేదించాలని ఉందే. కలుద్దాం, కలుద్దాం!! సరేనా. నీ అల.”
ఉత్తరం పూర్తి అయింది. నేనూ బాధ లోంచి బయటపడ్డా.
(ఇంకా ఉంది)