Site icon Sanchika

మహతి-50

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[గాలివాన తగ్గాకా, వారం రోజులు గడిచిపోతాయి. ఈ వారం రోజులు తాతయ్య, మహతి, అభిమన్యు తీరిక లేకుండా గడుపుతారు. అభిమన్యు ఏం చేసిన ఓ పద్ధతిలో, ఓ ప్రణాళికతో చేయడాన్ని ఊరంతా గమనిస్తుంది. యువతని చేరదేసి వాళ్ళకి స్ఫూర్తినిచ్చే ఎన్నో విషయాలు చెప్తాడు. అతన్ని చూసి అందరూ ప్రేరణి పొంది నిజమైన సేవాభావంతో నిరంతరం పనిచేస్తారు. రాజకీయ నాయకులు ప్రకటించిన సాయానికీ, అందిన సాయానికి పొంతన లేకపోవడం చూసి ఊరివాళ్ళతో బాటు తాతయ్య కూడా బాధపడతాడు. తప్పు ప్రజలదేననీ, ప్రక్షాళన జరగాలంటే ప్రజలలోంచే నిర్ణయం పుట్టాలని అంటాడు అభిమన్యు. నీలాంటి యువకులంతా కాషాయం కట్టుకుని వైరాగ్యం వైపు మళ్ళితే అదెలా సాధ్యమవుతుందని అడుగుతాడు తాతయ్య. అభిమన్యు సమాధానం చెప్పడు. ఊరి పనులు ఓ కొలిక్కి వస్తాయి. డా. శ్రీధర్, డా. శ్యామల వచ్చేస్తారు. అభిమన్యు, శ్రీధర్ క్షణాల్లో ఆప్తులవుతారు. రెండు రోజుల తరువాత అందరి దగ్గరా సెలవు తీసుకుని అభిమన్యు వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతుంటే మహతి బాధపడుతుంది. అల దగ్గర్నించి ఉత్తరం వస్తుంది. అక్కడి వాళ్ళందరూ కవులేనంటూ, ప్రతీదానికీ ఓ షాయరీని ఆయుధంలా వదులుతారంటుంది. తనకీ హిందీ, భోజ్‍పురి, పంజాబీలు కొద్దికొద్దిగా పట్టుబడుతున్నాయని రాస్తుంది. తను ప్రేమించిన వ్యక్తి ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాననీ, సిగ్గంటే ఏమిటో తెలుస్తోందని అంటుంది. ప్యార్ కియా తో డర్నా క్యా అనే పాటని ఉదహరిస్తుంది. తాను వ్రాసిన కవితని ఉత్తరంలో రాస్తుంది. ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి మహతి బాధ నుంచి బయటపడ్తుంది. – ఇక చదవండి.]

మహతి-3 మహి-17

[dropcap]“మ[/dropcap]నిషి రాజీ పడుతూనే వుంటాడు. పడకపోతే మనోక్లేశం తప్పదు. రాజీ పడటం కూడా గొప్ప విషయమే. పరిస్థితులతో రాజీ పడాలి. మనుషులతో రాజీ పడాలి. అన్నిటికంటే ముందు మన మనసుతో మనమే రాజీ పడాలి.” అన్నారు త్రిపురగారు.

***

మహిళామండలిలో చాలా భీకరమైన చర్చ జరిగింది. ప్రెసిడెంటు గారు స్వరూపరాణి మదర్‌కి సపోర్టు ఇచ్చి తీరాలని పట్టుపట్టారు.

“మీరెందుకు పట్టుబడుతున్నారు? మీకేం సంబంధం?” సీరియస్‌గా అడిగింది సరోజిని. సరోజిని కొంత కాలం నించి హెల్త్ ప్రాబ్లం వలన మహిళామండలికి దూరంగా వుండి మళ్ళీ వచ్చారు.

“ఏ మహిళకు అన్యాయం జరిగినా నేను ఊరుకోను” సీరియస్‌గా అన్నది ప్రెసిడెంటు.

“ఫస్టు -స్వరూపరాణి తల్లి మన మెంబరు కాదు. రెండోది ఆవిడ చెప్పింది నమ్మడమే కాక, అవతలి పార్టీ స్వరూపారాణిని బాధలు పెట్టిన ధాఖలాలు ఏవీ లేవు. మరో విషయం, నేనుండేది వాళ్ళ ఇంటి దగ్గరే. నాకు తెలిసినంతవరకూ తప్పు స్వరూపరాణిదే. స్వరూపని తల్లిదండ్రులు పెళ్ళి చేసేగా అత్తవారింటికి పంపించింది? ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చింది. అవతలి వాళ్ళు ఆమెని ఏమీ గదిలో బందించి ఉంచలేదుగా? ఇక్కడికొచ్చాక మరి స్వరూపరాణి తల్లి బేరసారాలు ఎలా మొదలెట్టింది?” తనూ సీరియస్‌గా అడిగింది సరోజిని.

“బేరసారాలు అంటూ అసహ్యకరమైన పదాన్ని వాడకు” అరిచింది ప్రెసిడెంటు.

“మరేమనాలి? వీళ్ళు బంగారం పెట్టిందీ పిల్లకే, వాళ్ళు అంతకంటే ఎక్కువ బంగారం ఇచ్చిందీ పిల్లకే. పిల్లకి పెళ్ళి చేసి పంపారు. ఇప్పుడు విడాకుల కోసం రెండు కోట్లు భరణమా? ఎందుకివ్వాలి అతను?” రెట్టించింది సరోజిని.

“పిల్లని వాడుకున్నాడు గనుక” అరిచింది ప్రెసిడెంటు.

“పెళ్ళి చేసుకుని మర్యాదగా జీవితంలోకి ఆహ్వానించిన వ్యక్తితో సంసారం చెయ్యడం ‘వాడుకోవడం’ అయితే ఇప్పుడు మీరు డబ్బు పడేసేది అలా సంసారం చేసినందుకా? డబ్బు తీసుకుని పక్కలో చోటిస్తే వెలయాలు అవుతుంది కానీ ఇల్లాలెలా అవుతుంది? అయినా ఇప్పుటికీ వీళ్ళు కోర్టుకెడుతున్నానని బెదిరిస్తూ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారే గాని ఆ పిల్లాడు గానీ అతని తల్లిదండ్రులు గానీ విడాకులు ఇవ్వమని అడగలేదే? కందకి లేని దురద మనకెందుకు? న్యాయం చెయ్యడానికి కోర్టులున్నాయి. తీర్పు చెప్పడానికి పెద్దలున్నారు. మన మెందుకు ధర్నాలు చెయ్యాలీ? అదీ న్యాయం అనేది ఎవరివైపు ఉందో కనీసం ఆలోచించకుండా, నిర్ధారించుకోకుండా.” తనూ రెచ్చిపోయి ప్రెసిడెంటుగారి స్వరంతోనే జవాబిచ్చింది సరోజిని.

***

“ఆ తరువాత కేకలు, గావుకేకలు, సిగపట్లు ఓహ్!..” కథంతా వివరించి చెప్పారు త్రిపురగారు. చివరకి ఆవిడే ప్రెసిడెంటు గారి ఊబకాయాన్ని సరోజిని చేతుల్లోంచి రక్షించారట.

“ప్రెసిడెంటుగారికి అంత ఇంట్రెస్టు ఎందుకూ?” అడిగా.

“సపోర్టు ఇస్తే కొంత డబ్బు ఆవిడకి ఇస్తానని స్వరూప మదర్ ఆశపెట్టి ఉండొచ్చు. అదీ లక్షల్లోనే.” నవ్వి అన్నారు త్రిపురగారు. షాక్ తిన్నాను.

“ఆశ్చర్యమేముందీ! రాజకీయాల్లోకి ఎంటర్ కానేకూడదు. ఎంటర్ అయ్యాక ఆ రొచ్చే, ఆ బురదంటేనే మానససరోవరంలా కనిపిస్తుంది, అనిపిస్తుంది. మగవాళ్ళే కాదు.. ఇప్పుడు గెలవడానికి ఆడవాళ్ళూ ఖర్చు పెట్టాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. మళ్ళీ మహిళామండలికి ఎలక్షన్లు వస్తాయి గదా. డబ్బు సమకూర్చుకోవాలిగా!” నవ్వారు త్రిపుర గారు.

“ఝాన్సీ లక్ష్మీబాయి మహిళామండలి పేరు పెట్టుకుని జరుపుతున్నది ఇంత నీచ రాజకీయమా?” అన్నాను నేను కోపంగా.

“మన వూరు ప్లస్ చుట్టు పక్కల ఊళ్ళల్లో అయిదారు మహిళామండళ్ళు ఉన్నాయి. అందర్నీ కూడగట్టుకుంటే తిరుగులేకుండా ఎదగొచ్చు” అన్నారు త్రిపుర.

ఆ రోజు నుంచీ నేనూ త్రిపుర గారూ.. ఓ స్థిర నిర్ణయానికి వచ్చాం. నిజమైన సమస్యలకి స్పందించాలనీ, ఇలాంటి ‘జరుగుబాటు’ సమస్యలకి దూరంగా ఉండాలనీ.

తాతయ్య అడిగిన ప్రశ్నకు, అదే, యువకులు సన్యాసం పేరుతో సమాజానికి దూరమైతే, సమాజాన్ని బాగు చేసేవారు ఎవరూ అన్న ప్రశ్నకు అభిమన్యు సమాధానం చెప్పలేదు.

ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ, అప్పటి అతని ముఖం క్షణక్షణం నాకు గుర్తుకొస్తూనే ఉంది. ఆ ప్రశ్న గుర్తుకొస్తోంది. అతను కూడా నేను ఆలోచిస్తున్న విధానం ‘రైట్’ అన్నాడే గానీ, నాకు ఏమీ మార్గదర్శనం చెయ్యలేదు. సూచనగా కూడా. అదే విషయం త్రిపురగారితో అన్నాను.

“అతనే ఓ అన్వేషణలో ఉన్నాడు. నిజం చెబితే దేనికి అన్వేషిస్తున్నాడో అతనికే స్పష్టంగా తెలీదు. బుద్దుడు అలాగే బయలుదేరాడుగా. తిరిగి తిరిగి లోకాన్ని చూసుకుంటూ చివరికి బుద్దగయలో బోధవృక్షం కింద ‘జ్ఞానోదయం’ పొందాడు. అయినా చివరికి తెల్సింది ఏమిటీ? బుద్ధం శరణం గఛ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే శరణాగతే! మహీ.. జీవితం చిన్నది. ఓ విధంగా మనిషి తన జీవితంలో అతి ఎక్కువ భాగం గడిపేది అన్వేషణలోనే! ఎక్కువ సార్లు తన అన్వేషణ ఫలించలేదని ఆవేదన చెందితే, అతి తక్కువ సార్లు మాత్రమే అన్వేషణ ఫలించిందని సంతోషపడతాడు. ఆ సంతోషమూ తాత్కాలికమే. ఎందుకో తెలుసా, ఒక అన్వేషణ అంతం మరో అన్వేషణకి ఆరంభం గనుక.” అన్నారు త్రిపుర గారు.

చాలా సేపు మౌనంగా ఉన్నాం. మెల్లగా లేచి ‘టీ’ పెడుతుండగా డా. శ్యామల అనీజీగా కనిపించింది.

“వదినా ఏమైంది?” అన్నాను.

“చాలా అనీజీగా ఉంది. వాంతికొచ్చేలా..” అంది చాలా ఇబ్బందిగా. మాట విని త్రిపుర గారు “పిరియడ్స్ వచ్చి ఎన్ని నెలలు?” అన్నారు.

“బహుశా..” అని ఆగింది. శ్యామల మొహంలో చిన్న కంగారు.

“డోంట్ వర్రీ.. శుభవార్తే అయి ఉంటుంది.” అన్నారు త్రిపుర గారు శ్యామల తల నిమిరి.

చిత్రమేమంటే వారం రోజుల… కోసం బెంగుళూరు, మైసూరు వెళ్ళిన శ్రీధర్ గారు, శ్యామలగారు స్నేహితుల బలవంతంతో నెలా పదిహేను రోజులు ఉండిపోయారు. కొన్ని వూళ్ళూ, పుణ్యక్షేత్రాలు కూడా దర్శించారట. మొత్తానికి దైవ దర్శన ఫలితం ఇలా ప్రకటితమయింది.

డా. శ్రీధర్ గారికి మిగతా వారికీ తీపి కబురు చెప్పారు.

భార్యాభర్తలు మొదట చేసింది తాతయ్యకి సాష్టాంగ నమస్కారం. మొదటి ఫోను మా అమ్మనాన్నలకి.

శ్యామల శ్రీధర్ గార్లు త్రిపుర గారికీ పాదాభివందనం చేశారు. శ్యామల నన్ను ఆర్తిగా కౌగిలించుకుంటే శ్రీధర్ గారు నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు.

***

అమ్మకి మేం ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంది గాని ఏదో మార్పు, పోనీ అక్కడికే వెడితే?

తాతయ్య అన్నట్టు వాళ్ళు మమ్మల్ని చూసి సహజంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.. అది ఇబ్బంది ఇబ్బందిగా.

తాతయ్యతో ఆలోచిస్తే ఆయనా అదే అన్నాడు. “విషయం దానంతట అది బయటపడటమో, వాళ్ళు చెప్పడమో జరిగే వరకూ యథా స్థితిని కొనసాగించడమే మంచింది.” అన్నాడు.

నేను కర్రావూరి ఉప్పలపాడులోనే ఉంటాననీ పట్టు పట్టకపోతే, ఏ కాలేజీలోనో చేరి చదువుకుంటూ.. అన్ని విషయాలూ నాకు తెలిసేవేగదా! అప్పుడీ టెన్షన్ ఉండేది కాదు కదా అనుకున్నాను నాలో నేనే.

If, but లనేవి చాలా విచిత్రమైన పదాలని మా మాస్టారు అనేవారు. ఇప్పుడు ఆలోచిస్తూంటే మనిషి ఎంత బలహీనుడో తెలుస్తోంది.

ఒకవేళ అక్కడుంటే, ఒకవేళ ఇలా అయితే, అనే ఆలోచనలు వర్షాకాలపు దోమల్లా ముసురుతూనే ఉన్నాయి. ఏదో.. ఓ అభత్రతా.. కంగారు మనసుని కలవర పెడుతోంది.

***

“విడిపోవడం నిజంగా విషాదకరం. అది రెండు నిముషాలైనా, రెండు సంవత్సరాలైనా, రెండు యుగాలైనా! ఎల్లుండితో షూటింగ్ అంటే ఈ షెడ్యూల్ వరకూ పూర్తవుతుంది. తరువాత షెడ్యూల్ ప్రారంభమయ్యేది రెండు నెలల తరువాత. మనసు ఏదో అగాధంలో పడినట్టు వున్నదే మహీ.. ఎలా భరించగలనూ.. తనతోటి ఎడబాటుని ఎలా సహకరించగలనూ?” వ్రాసింది అల.. ఉత్తరంలో.

“ఓ గెలుపే కాదు, ఓటమీ కూడా ఎన్నెన్నో నేర్పుతుంది. తిమ్ముని ప్రేమించాననుకుని, అతడు నో అనడం వల్ల నా మనసు క్రూరమైన ఆలోచనల్ని చేసింది. అతన్ని వేటాడి వేటాడి నా నుంచి పారిపోయేటట్టు చేసింది. చాలా కాలం ఆ ఓటమి ఓ చితిలా రగులుతూనే ఉండేది కాని..”

చదువుతూ వుండగానే తాతయ్య పిలిచాడు. “ఏంటి తాతయ్యా?” అన్నాను.

“ఎవరో సరోజినిగారూ, మరి కొందరూ నీ కోసం వచ్చారమ్మా.” అన్నాడు.

బెడ్ రూమ్‌లో నుంచి వడి వడిగా హాల్లోకి వచ్చాను. వనజ, సరోజిని, సీత, విజయ, ఇంకో ఇద్దరు కొత్తవాళ్ళు ఉన్నారు. “ఆమె విరజ, యూమె నీరజ” అని సరోజినిగారు పరిచయం చేశారు. అందరూ కూర్చున్నాక అన్నాను “ఒక్క నిముషంలో టీ తీసుకొస్తాను” అని.

“ఏమీ తొందర లేదు మహతీ, నువ్వు కూర్చో.. నీతో మాట్లాడాలి” అన్నారు వనజగారు.

“చెప్పండి” అన్నాను ఓ కుర్చీలో సర్దుకుని కూర్చుని.

“స్ట్రయిట్‌గా చెబితే ఈసారి ఎలక్షన్‌లో మేమందరం త్రిపురగారికి మద్దతుగా నిలిచి ఆవిడ్ని ప్రెసిడెంటుగా ఎన్నుకుందామనుకుంటున్నాం” అన్నారు సరోజిని.

“ఓహ్.. చాలా మంచి నిర్ణయం. కానీ.. ” ఆగాను.

“ఇప్పుడున్న ప్రెసిడెంటు సామ దాన భేద దండోపాయాల్ని తప్పకుండా ప్రయోగించగల వ్యక్తే కాదు, ప్రయోగిస్తుంది కూడా” అన్నది నీరజ.

“అది కరెక్టే. కానీ నేను మెంబర్ని కాదుగా. నా ఓటుతో ఆవిడకే సంబంధం లేదుగా” అన్నను ఆశ్చర్యంగా.

“సమస్య మెంబర్‌షిప్ గురించి కాదు. త్రిపురగారు.. పోటీ చెయ్యడానికి ఒప్పుకోవడం లేదు. పేనల్ సిద్ధంగా ఉంది. ఆవిడ ‘ఊ’ అంటే చాలు. కానీ ఎంత చెప్పినా వద్దని వారిస్తున్నారు మహీ. త్రిపురగారు చదవుకున్న విద్యావంతురాలే కాదు, చక్కని ఆలోచనలు ఉన్న సంస్కారి. ఎవరినీ తన మాటలతో ఏనాడూ బాధించని వ్యక్తి. ఏది చేసినా బాగా ఆలోచిస్తుంది. అందర్నీ కలుపుకుని ముందుకు సాగే వ్యక్తిత్వం ఆవిడది. అందుకే ఆవిడని ఒప్పించే బాధ్యత నీ మీద పెడుతున్నాం.” అన్నది వనజగారు. మిగతా వారు తలలు ఆడించి వనజని బలపరిచారు.

“నేనేం చెయ్యగలను వనజగారూ? ఏ పదవి అయినా, పని అయినా, మనసా వాచా కర్మణా ఒప్పుకుంటేనే ఆ పనికీ, పదవికీ న్యాయం చెయ్యగలం. ఆవిడ నాతో చనువుగా ఉండే మాట నూటికి నూరు పాళ్ళు నిజం. కానీ, ఆవిడని ఒప్పించేంత స్నేహమో, బంధమో నాలో ఉందా? నా మాటకి త్రిపురగారు విలువిస్తారా” అన్నాను. నిజమేగా మరి!

మా మధ్య ఉన్న బంధానికి స్నేహమనో, మరొకటనో పేరు పెట్టలేదు. అది నాకే తెలీని ఓ బంధం.

“నా కయితే సంపూర్ణమైన నమ్మకం ఉంది. నువ్వు చెబితే ఒప్పుకుంటారనీ, నువ్వు ఒప్పించగలవనీ. ఒక పదవిలో సమర్థులు ఉంటే ఎంత గొప్పగా ఆ సంస్థ రాణిస్తుందో నీకు తెలియనిది కాదు. వీలున్నంత త్వరగా త్రిపురగారిని ఒప్పించే ప్రయత్నం చెయ్యి మహీ. ఒకవేళ అప్పటికీ ఆవిడ ‘నో’ అంటే, అప్పుడు ఆలోచించాలి. ఏం చెయ్యాలో” సుదీర్ఘంగా నిట్టూర్చి అన్నది వనజగారు.

త్రిపురగారు పోటీకి ఒప్పుకుని గెలిస్తే ‘ఇప్పుడున్న మనశ్శాంతి అప్పుడు ఆవిడకి ఉంటుందా?’ ఇదే నాలో పుట్టిన మొదటి ప్రశ్న.

మరి కొంతసేపు వుండి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విషయం తాతయ్యతో కూడా చర్చించాను. తాతయ్య, “త్రిపుర పోటీ చెయ్యడమే మంచిది. మహీ.. కుటుంబం అనే సాలెగుడులో చిక్కిన వారు నూటికి ఎనభై పాళ్ళు సమాజానికి ఏటూ మేలు చేయలేరు. ఏం చెయ్యాలన్నా కుటుంబ సభ్యులు అనుమతితోనే చెయ్యాలి కాని, కుటుంబ సభ్యులు నూటికి 90 పాళ్ళు అనుమతించరు. పైగా విమర్శిస్తారు. దాంతో మంచి చెయ్యాలన్నా భావనే నీరుకారిపోతుంది.”

ఓ నిమిషం ఆగాడు తాతయ్య. శ్యామల గారు కూడా వచ్చి మా మాటలు వింటోంది.

“త్రిపురగారికి స్వంత కుటుంబం అంటూ ఏదీ లేదు. అంతే కాదు, సమాజనికి మేలు చెయ్యాలనే మనసు కలిగిన వ్యక్తి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అవసరమైతే నేనూ మాట్లాడుతాను. మనమందరం ఆవిడకి తోడుగా, సపోర్డుగా ఉన్నాం అనే విషయం ఆమెకి తెలిస్తే, మరింత ధైర్యంగా ఉత్సాహంగా ఆమె నిర్ణయం తీసుకోగలదు” అన్నాడు తాతయ్య.

“అవును తాతయ్యా. నేనూ అమ్మకి చెబుతాను” అన్నది శ్యామల. త్రిపురను శ్యామల “అమ్మా” అనే పిలుస్తోంది, పెళ్ళైన రోజునించీ.

ఏ బంధం ఎప్పుడు మొదలై బలపడుతుందో ఎవరికి తెలుసు. కాలువలు, నదుల్లో కలిసినట్లు, జీవితమనే నదిల్లో స్నేహమనే కాలువలు ఎంత చక్కగా కలిసిపోతాయి. పయనాన్ని ఎంత సులభతరం చేస్తాయో!

సడన్‌గా నాకు అభిమన్యు గుర్తొచ్చాడు. అతను ఇక్కడుంటే ఏమి చెప్పేవాడు? ఖచ్చితంగా త్రిపురగారిని ఎన్నికల్లో నిలబడమని ప్రోత్సహించేవాడు. సమాజ హితాన్ని నిజంగా కోరుకునే అటువంటి స్నేహితుడు లభించడం ఎంత గొప్ప వరం! అయినా అతను నాకు స్నేహితుడేనా????

వేళ్ళ మధ్య నుంచి సన్నగా జారిపోయే ఇసుక రేణువుల్లా కాలం గడిచిపోతోంది. త్రిపురగారిని మొత్తానికి నేనూ, తాతయ్యా,. శ్యామలగారూ కలిసి ఒప్పించాం.

ప్రస్తుతం వున్న ప్రెసిడెంటు నుంచి చాలా త్రీవమైన ఒత్తిడులు వచ్చాయి. బెదిరించడంలో మగవాళ్ళకి ఆడవాళ్ళు ఏమి తీసిపోలేదని అర్థమయింది. మహిళామండలి ఎన్నిక రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ‘కప్పదూకుళ్ళు’ చాలా మొదలయ్యాయి.

త్రిపురగారిని బలపరిచే మెంబర్సు కూడా కొందరు అవతలి ‘కక్ష్య’ తీర్ధం పుచ్చుకున్నారు. ఎవరన్నారూ.. రంగులు మారవని!..

వనజగారు మిగతా మిత్రమండలీ ఎంతో శ్రమించారు. త్రిపురగారిని ఎందుకు ఎన్నుకోవాలో, ఎన్నుకుంటే వచ్చే లాభం ఏమిటో కూడా చక్కగా విడమర్చి చెప్పారు. వారూ జాగ్రత్తగా శ్రద్ధగా విన్నారు.

ఈసారి మహిళామండలి ఎన్నికలు మగవాళ్ళకి కూడా హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఏదో విధంగా చర్చలు జరుతూనే ఉన్నాయి.

‘గాలి’వాటాన్ని పసిగట్టి ‘త్రిపురగారిదే గెలుపు’ అని కొన్ని వర్గాలు ఢంకా బజాయించి చెప్పారు. దానా దీనా చాలా మందికి ఆ మాట మీదే గురి కుదిరింది.

నేను చాలా బిజీగా కాన్వాస్ చేశాను. కాన్వాస్ చెయ్యడానికి మెంబర్‌నే కానఖరలేదుగా.

రిజల్టు వచ్చింది.

త్రిపురగారు సలక్షణంగా ఓడిపోయారు. కారణం ఓట్లు చీలిపోవడం.

రిజల్టు వచ్చాక అత్యంత ఆనందపడిందీ త్రిపురగారే. “అమ్మయ్యా.. తలనెప్పి వదిలిపోయింది” అని పకపకా నవ్వారు. అది గుండెల్లోంచి వచ్చిన హాయైన నవ్వు. ఇంకేం మాట్లాడుతాం!

(ఇంకా ఉంది)

Exit mobile version