(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[అల మహీకి ఉత్తరం రాస్తుంది. ఫోన్‍లో మాట్లాడడం కంటే, ఉత్తరం రాయడం ఎందుకు ఉత్తమమో చెబుతుంది. తన మదిలో మెదులుతున్న భావాలకు అక్షర రూపం ఇచ్చి, వాటిని చిన్న చిన్న కవితలుగా మలుస్తుంది అల. తాను రాసిన ఓ కవితని ఉత్తరంలో మహీతో పంచుకుంటుంది. తాను కొత్తగా చదివిన పుస్తకాల గురించి చెప్తుంది. ఆర్. కె. నారాయణ్ ‘గైడ్’ నవల చదివి, తర్వాత ‘గైడ్’ సినిమా చూస్తే కలిగిన ఆనందం గురించి రాస్తుంది. ఆ సినిమాలోని పాట తనకి అర్థమయిన విధానాన్ని వివరిస్తుంది. త్వరలో మహీని కలవాలని కోరుకుంటూ ఉత్తరాన్ని ముగిస్తుంది అల. ఉత్తరం చదివాకా, మహీ తనని తాను పరిశీలించుకుంటుంది. పుస్తకాలు చదివి ఎన్ని రోజులయిదో అనుకుంటూ, వెంటనే లైబ్రరీకి వెళ్ళి ఆర్. కె. నారాయణ్ గారి పుస్తకాల తెలుగు అనువాదాలు తెచ్చుకుంటుంది. ఆ రాత్రి మహీ, తాతయ్య, శ్యామల, శ్రీధర్ గారూ, త్రిపుర గారూ కలిసి ‘గైడ్’ సినిమా చూసి ఎంతో సంతోషిస్తారు. మర్నాడు సినిమాల మీద, నటుల మీద చర్చ జరుగుతుంది. శ్రీధర్, త్రిపుర గారు చర్చలో ఎన్నో విషయాలు చెప్తారు. సామాన్య జనానికి సినిమాలు ఎంత మేలు చేశాయో తాతయ్య చెప్తాడు. కళాకారులెంతో అదృష్టవంతులని మహీ అంటే నువ్వూ కళాకారిణివేగా అని శ్రీధర్ అంటారు. కాదంటుంది మహి. శ్రీధర్ అక్కడున్న అందరి ప్రత్యేకతలనూ చెప్పి, అవి కళలే అని అంటారు. బెన్‍హర్ సినిమా చూద్దామని అంటారు త్రిపుర. నెలలు నిండుతున్న శ్యామల త్రిపుర ఒడిలో తల పెట్టుకుని అందరం హాయిగా కలిసిమెలిసి ఉందామని అంటుంది. శ్యామలకి త్రిపురగారు సాంత్వన కలిగించగలరు, మరి మా అమ్మకో అనుకుంటుంది మహి. – ఇక చదవండి.]
మహతి-3 మహి-20
[dropcap]మ[/dropcap]నసు ఎందుకో అభిమన్యుని తలుచుకుంటోంది. అతనుంటే నా సమస్యని అతని ముందు పెట్టి చక్కని గైడెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే, అతను చేస్తున్నదీ ఓ సెర్చే, అంటే వెతుకులాటే.
“గుతుకులు పడ్డ బ్రతుకుబాటలో
వెతుకులాటే జీవితం అంటే” అంటాడు ఓ పాదచారి.
‘మహిళా మండలి’ వ్యవహారం చూశాక రాజకీయాలనే వాటి వల్ల స్వంతలాభం కలుగుతుందే గానీ, ప్రజలకి ఏమీ వొరగదని అర్ధమయింది.
చిన్నగా మొదలెట్టి విశ్వవ్యాప్తమైన వ్యాపారుల వ్యాపార దక్షతనీ గమనించా.
ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం మొదట్లో వున్నా – పోను పోను అది అహంభావంగా, అహంకారంగా, నిరంకుశత్వంగా మారుతుందనీ గమనించా.
పోనీ ఓ డాక్టురుగా, లాయరుగా జీవితం మొదలెట్టినా అక్కడ కూడా ఒత్తిడులకు తలొగ్గాలనే విషయాన్నీ గమనించాను. పోనీ ఓ టీచర్‌గా పిల్లలకు మంచి చదువు చెప్పి బాధ్యతగల పౌరులుగా తయారు చేద్దామంటే, అక్కడా నానా రకాల ఆంక్షలు.
‘యాసర్ ఆరాఫత్’ అన్నమాట గుర్తు కొచ్చింది. “మీరెందుకు యుద్ధం చేస్తున్నారూ? ” అని అడిగితే ఆరాఫత్ చెప్పి సమాధానం “శాంతి కోసం” అని. నిజమేగా! ఓ రామరావణ యుద్ధం జరిగాక కొన్ని వందల సంవత్సరాలు శాంతి నెలికొనింది. ఓ మహాభారత యుద్ధం తరువాత శాంతి కొంత కాలం స్థిరంగా ఉంది. సత్యం – అసత్యం లాగా, చీకటి వెలుగులాగా శాంతి అశాంతి కూడా బొమ్మ బొరుసు లేనా!
ఏ వృత్తిలో వుండే కష్టానష్టాలు ఆ వృత్తిలో ఉన్నై, ఎప్పుడో చదివిన జార్జ్ వాషింగ్టన్ మాట గుర్తుకొచ్చింది. “లోకం సుభిక్షంగా శాంతిగా, సుఖంగా ఉండాలంటే ఏం చెయ్యాలీ?” అని ఓ జర్నలిస్టు అడిగితే, ఆయన చెప్పిన సమాధానం – “రాజకీయాల్నీ, రాజకీయ నాయకుల్నీ బహిష్కరించాలి. అప్పుడు ప్రజల వ్యవహాలం ప్రజలే మాకంటే గొప్పగా చూసుకోగలరు” అని.
పోనీ సురేన్‌లా మిలటరీలో చేరితే! చేరాలంటే డాక్టర్నవ్వాలి. చేరడానికి అది సులభమైన మార్గం. పైలెట్ ట్రైనింగ్ తీసుకుని అప్లై చేయ్యడం ఇంకో మార్గం.
నాకు నవ్వొచ్చింది. ప్రతి వృత్తిలోనున్న కష్టనష్టాలని బేరీజు వేస్తున్నగానీ, నాకు అసలు ఏం కావాలో ఎందుకు ఆలోచించలేకపోతున్నాను?
“ఫస్టు నువ్వు కాలేజీలో చేరు. డిగ్రీ అయ్యేలోపు ఏం చెయ్యాలో నిర్ణయించుకోవచ్చు. అదీ ఓ టార్గెట్‌తో” అన్నారు డా. శ్రీధర్.
శ్యామల ఏదో మాట్లాడబోతుండగా ఫోన్ మ్రోగింది. నాన్నగారు.
“ఎలా ఉన్నావు మహతీ” అన్నారు.
“అంతా బాగున్నాము నాన్నగారూ” అన్నాను.
“గుడ్, తాతయ్య, శ్రీధర్, శ్యామలా అందరూ బాగున్నారా?”
“బాగున్నారు నాన్నా. అందరం ఇక్కడే ఉన్నాం” అన్నాను.
“అయితే తాతయ్యకి ఇవ్వు ఓ నిముషం” అన్నారు నాన్న.
ఇచ్చాను. నాన్న గొంతు మాములుగానే ఉంది. తాతయ్య మొఖాన్ని అబ్జర్వ్ చేశాను. ఆయనా మాములుగానే మాట్లాడుతూ, “మహీ భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాం బాబూ. ఏం చేస్తే బాగుంటుందా అనే అందరం చర్చిస్తున్నాము. ఈ చర్చలు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి గానీ, మీరూ అమూల్యా ఎలా ఉన్నారూ?” అనడిగాడు. ఓ రెండు నిముషాలు పాటున నాన్న చెప్పిన విషయాలు విన్నారు తాతయ్య. ఆయన ముఖం ప్రసన్నంగానే ఉంది. ఆ తర్వాత ఫోన్ డా. శ్రీధర్ గారినీ, శ్యామల గారినీ పలకరించి నా చేతుల్లోకి ఒదిగింది.
“ఏం లేదమ్మా చాలా రోజులయింది గదా మాట్లాడి అని చేశాను. హాయిగా ఉండు” అంటూ ఫోన్ పెట్టేశారు నాన్న. నేను టీ కలపడానికి వెళ్ళాను. నాన్న స్వరం చాలా మామూలుగా ఉంది. నాకు సంతోషంగా అనిపించింది.
***
“కాలాన్ని శరీరం మోస్తూంటే నా
ప్రేమని హృదయంలో మోస్తూన్నది ‘నువ్వు’
మొన్నటి ఆనందాన్ని యీనాటికీ
నిలిపి వుంచుతోంది ‘నీ తలపు’
యుగయుగాల జ్ఞాపకాల్ని
శ్వాసగా నాకందిస్తున్నది ‘నీ పిలుపు’
నా వొళ్ళంతా మెరుస్తున్నది నీ
చూపుల వర్షం తోనే!
నీ శ్వాసల దారుల్లోనేగా
‘నా’ జీవిత పయనం.”
డియర్ మహీ.. కవిత్వంతో ఉత్తరం మొదలెట్టానని చికాకు పడతున్నావా? వద్దమ్మా. ప్రేమ కవిత లంటే యువతీ యువకుల మధ్య కాయితాల మీద నడిచే అక్షరాలనుకుంటారు అందరూ. జాగ్రత్తగా ఆ కవితలలోని భావాలు గమనిస్తే అవి భగవంతుడికి భక్తుడు రాసుకున్న హృదయ నివేదనలుగా మనకి గోచరిస్తాయి. నిజమూ అంతేగా. Love is god అంటాం. భగవంతుడంటేనే ప్రేమ స్వరూపుడు. ఆయన ఇచ్చేది ఎప్పుడూ ప్రేమనే. కోరుకునేదీ మన నించి ప్రేమనే. అందుకే, నా నివేదనని నీ ముందుంచాను.
మహీ.. హైద్రాబాద్ వచ్చేశానే. షెడ్యూలు కొన్ని రోజుల ముందే పూర్తయింది. కెమెరా ముందుకి వెళ్ళాలంటే అది వరకు చచ్చేంత కంగారుగా భయంగా ఉండేది. ఇప్పుడయితే చాలా చాలా ఉత్సాహంగా ఉంది. అది వరకు ‘ఓ పాత్ర పోషిస్తున్నాను బాగా బాగా పోషించాలి’ అనుకునే దాన్ని. ఇప్పుడు ఆ పాత్రే నేనైపోతున్నాను. ..ఆ పాత్రే నా శరీరంలోకి దూరిపోతోంది. ఆ పాత్ర ధరించినంత సేపూ ‘నేను నేను కాదు’.
జీవితం ఎంత విచిత్రంగా ఉందో తెలుసా! నేను ఊహించని ప్రదేశాలు, కలులోనైనా చూడని మనుషులు, ఎన్నడూ వినని, వింటానని కనీసం అనుకోని రకరకాల భాషలు. కొన్నిటికి లిపే లేదు. కానీ, మాధుర్యం ఉంది. ఎంత దయ ఆ పరమాత్ముడికి! గొప్ప జీవితాన్నే కాదు, నీలాంటి మంచి స్నేహితురాల్ని ఇచ్చాడు. ఓయ్.. తొందరగా ఒకసారైనా హైద్రాబాద్‌కి వచ్చెయ్‌వే. నేను రాకుండా నిన్ను రమ్మని చెప్పడం సరైన పద్దతి కాదనుకో. అయినా, నిన్ను చూడాలనీ, నీతో మనసారా మాట్లాడాలనే స్వార్థమే ఆ పని చేయిస్తోంది. సరేనా..
నీ
అల.
అల ఉత్తరం నా మనసుకి ఎంతో నచ్చింది. నిజం చెబితే నా కంటే ఎంతో ఎంతో ఎత్తు ఎదిగింది.. మానసికంగా! ఏం చెయ్యాలా? అనే ఆలోచనతో నేనుంటే, చేస్తున్న పనిలో అత్యంత ఆనందాన్నీ, తృప్తినీ అనుభవిస్తోంది అల. వెళ్ళాలి. తప్పక వెళ్ళాలి హైద్రబాదు. అంతే కాదు నా సమస్యనీ అల తోటి చర్చించాలి.
***
త్రిపుర గారికి జ్వరం. ఊళ్ళో చాలా మందికి జ్వరాలు. డా. శ్రీధర్, డా. శ్యామల పిచ్చ బిజిగా ఉన్నారు. త్రిపుర గారింటికి వెళ్ళి వీలున్నంత సమయం నేను గడిపి, మందులూ అవీ ఇచ్చి వస్తున్నాను.
తాతయ్య యథా ప్రకారం ఇంటికి వచ్చి, సమస్యలు చెప్పుకునే వారితోటీ; హాస్పటల్ దగ్గరా బిజీగా ఉన్నాడు. వంట నేనే చేస్తున్నాను. శ్యామల గారికి క్షణం కూడా తీరక లేకపోవడంతో, కేరేజీలు కూడా సర్ది హాస్పిటల్‍కి పాలేరుతో పంపుతున్నాను.
బ్లడ్ టెస్టుల్లో త్రిపురగారికి టైఫాయిడ్ అని తేలింది. పరవాలేదు. ఆ జబ్బుకి మందులు పుష్కలంగా ఉన్నాయి కదా!
“శ్యామల బిడ్డని నేను చూడగలనా మహీ. నువ్వేమో నా కంటే శ్యామల కన్నా ఎంతో చిన్న. కానీ, నువ్వు నాకు ఫ్రెండ్ లాగే అనిపిస్తావు. శ్యామల మాత్రం నాకు స్వంత కూతురులా అనిపిస్తుంది. అందరూ వున్నా ఎవరూ లేని దానిగా ఇన్నాళ్లూ బ్రతికాను. మొదట హృదయానికి దగ్గరగా నువ్వొస్తే, ఇప్పుడు కూతురిగా శ్యామల వచ్చింది. తనకీ ఎవరూ లేరుగా!
దేవుడు ఎంతవాడో చూశావా. ఇద్దరు ‘లేని’ వాళ్ళని కలిపి ‘ఉన్న’ వాళ్ళని చేశాడు. అసలు నేను మంచాన పడితే నువ్వొచ్చి సేవ చేస్తూ ఆహారం తినిపిస్తావని కలలో కూడా అనుకోలేదు. ఏమిచ్చి రుణం తీర్చుకోనూ” కళ్ళ నీళ్ళతో నా రెండు చేతులూ పట్టుకుని అన్నారు త్రిపుర.
“మీరు తొందరగా కోలుకుంటే చాలు. మాకందరికీ అదే పదివేలు. సారీ పది కోట్లు” అన్నాను నవ్వి.
పూర్వ కాలం ‘అదే పదివేలు’ అనే వారు. పదివేలు అంటే చాలా ఎక్కువ. రూపాయికి అర బస్తా బియ్యం వచ్చే రోజుల్లో ఆ సామెత వచ్చింది. ఆ అరబస్తా అంటే ఇప్పుటి 50 kg కాదు. చాలా ఎక్కవ. దాదాపు 70 కిలోలు. అప్పటివన్నీ మానికలు, శేర్లు, సవా శేర్లు, లెక్కలు. తూనికలు కూడా వీశ, అరవీశ, సవాశేరు, తులం ఇల్లా అన్న మాట. అప్పటి పదివేలు ఇప్పటి పది లక్షలు కంటే ఎక్కువే వుంటాయి. కానీ, లక్షలకే విలువ లేని పరిస్థితుల్లో పదివేలు ఎక్కడ ఆనుతాయీ!
“ఎందుకు నవ్వావు” అని త్రిపురగారు అడిగితే వున్నదే చెప్పాను. తనూ నవ్వి “ఆ కాలమానాలు ఇవాల్టి వారికి తెలియదు. నీకు తెలుసా.. అప్పట్లో పావలా, బేడా, అణా, అర్ధరూపాయి, రూపాయి, నాణాలు ఉండేవి. ఆ నాణాలు మీద వుండే నాలుగు భాషల్లో మన తెలుగు ఒకటి. అలాగే ఓడల్ని పడవల్ని నౌకల్ని తయారు చేయడంలో ప్రథములు ఆంధ్రులు. ఒకప్పటి చెన్నపట్నంలో 4/5 మంది తెలుగువారే. అక్కడి వర్తకాన్ని, విద్యనీ అభివృద్ధి చేసిన వారు తెలుగువారే. బంగారు, వస్త్ర వ్యాపారాలూ, రోజువారీ వినియోగ వస్తువులూ, ఆహార పదార్థాలు, ధాన్యం, పప్పులు ఆఖరికి చీపుళ్ళు, విస్తళ్ళు కూడా తెలుగువారి చేతులు మీదే జరిగేవి. ఇప్పటికీ కుంకుడు కాయలూ, విస్తళ్ళూ. చీపుళ్ళూ కూరగాయలూ ఇవన్నీ వెళ్ళేది ఆంధ్రా నించే. తమిళనాడే కాదు ఆంధ్రుల ప్రతిభ ప్రగతి కన్నడ, మహారాష్ట్ర రాష్ట్రాలకు కూడా అనంతంగా విస్తరించింది” ఏకబిగిన చెప్పడంతో త్రిపుర గారు కొంచెం ఆయాస పడ్డారు.
“అవును. అలాంటి తెలుగు జాతి ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే, మన పిల్లలకి తెలుగు నేర్పమని మనమే మనవాళ్ళని దేబిరిస్తూ, బ్రతిమాలాడటం. ఇతర భాషల్ని అక్కున చేర్చుకుంటూ, తెలుగు భాషని మనమే నిరాదరిస్తున్నాం” బాధగా అన్నాను. అది నిజమేగా!
ఆ తరువాత కాసేపు త్రిపురగారితో కూర్చుని ఇంటికి వచ్చాను.
“అమ్మా, త్రిపుర గారికి జ్వరం తగ్గే వరకూ మనింట్లోనే ఉంచితే మంచిది కదూ!” అన్నాడు తాతయ్య. జస్ట్ అటూ ఇటూ కానట్టు తలవూపాను. నాకు అర్ధం అయిన దేమంటే, డాక్టర్లు ఇద్దరూ హాస్పటల్‌కి వెళ్తున్నారు. తాతయ్య కాసేపు హాస్పటల్లో, కాసేపు జనాలతో ఉంటున్నారు. నేను వంట పనిలో, ఇంటి పనిలో సతమతమైపోయినా త్రిపుర గారి దగ్గరికి వెళ్తున్నాను. ఇది తాతయ్య గుర్తించారు. నేను అంత ‘హైరానా’ పడటం తాతయ్యకి నచ్చలేదు. అలాగని చెప్పనూ లేరు. చిన్నగా నవ్వుకున్నాను. తన అనుకున్నప్పుడు దాని వెనకాల వుండే బంధం ఎంత గట్టిగా గాంఢంగా వుంటుందో అర్థమైంది.
శ్రీధర్ గారినీ, శ్యామల గారినీ కూడా ఆ విషయంలో సంప్రదించాను. “అమ్మ ఇక్కడికి వస్తే అద్భుతంగా ఉంటుంది” అన్నది శ్యామల.
త్రిపుర గారు మొదట స్వంత ఇంటిని విడిచి రావడానికి ఒప్పుకోలేదు. కానీ, నేనూ, శ్యామలా, తాతాయ్య నచ్చచెప్పాక ఒప్పుకున్నారు. అన్నీ సద్ది, ఆ యింటికి తాళం వేసి ఆటోలో త్రిపురగారిని మా యింటికి తెచ్చాం. నిజం చెప్పొద్దూ, నాకు చాలా సమయం ఆదా అయింది.
నలుగురితో ఉండటంతో త్రిపుర గారు చాలా త్వరలో కోలుకున్నారు. ఇప్పుడు నేను వద్దన్నా, వంట పనిలో ఇంటి పనిలో సాయం చేస్తున్నారు. శ్యామలకి నిజమైన అమ్మ త్రిపుర గారిలో లభించింది. వాళ్ళిద్దరూ నిజమైన తల్లీ కూతుళ్ళులా మసలడం నాకెంతో నచ్చింది.
ఎవరు మనవాళ్ళు?
ఎవరైతే కష్టంలో ఆదుకుంటారో,
నా కోసం, నీ కోసమే నేనున్నానని తోడుంటారో,
ఎవరైతే అవసరం వచ్చిన నాడు నీకు చేయూతనిస్తూ
నీతో నిలబడతారో, నిన్ను పడిపోకుండా
కరిచిపట్టుకుని ఉంటారో –
వారే నీ వాళ్ళు. నిజమైన వాళ్ళు.
అదృష్టం ఏమంటే నా చుట్టూ అలాంటి ‘నా’ వాళ్ళు ఉండటం. ఠక్కున అభిమన్యు గుర్తుకొచ్చాడు. అవును. ఎవరికి కష్టం వచ్చినా అది తనకే అని భావించే మంచి మనిషి. ఏ స్వార్థమూ లేకుండా, అడగక ముందే సాయమందించి మహా మనిషి. లోపల ఒకటి బైటికి ఒకటీ కాకుండా నిజాయితీగా మాట్లాడే అజ్ఞాత వ్యక్తి. ఓ నిట్టూర్పు నాలో నుంచి వెడలింది. ఓ మంచి వ్యక్తినీ, స్నేహితుడ్నీ, అందిరికీ హితుడ్నీ మేం ఇక్కడ ఆపలేకపోయాము. ఆపినా, తన లక్ష్యం సాధించే వరకూ అతను ఆగడనీ నాకు తెలుసు.
***
అర్జంటుగా నన్ను కొన్ని రోజులు వుండేలా రమ్మనీ నాన్నగారి ఫోన్. తాతయ్యని త్రిపురగారికీ డాక్టర్లిద్దరికీ అప్పగించి బయలుదేరుతుండగా చెల్నెల్నీ తమ్మడ్నీ తీసుకుని అమ్మ వచ్చింది. “సరే సరే, నాన్నా వీళ్లద్దర్నీ మీరే ఓ వారం భరించాలి. నేను మహీని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాలి. మీ అల్లుడు కూడా వస్తున్నారు” అని అందరితో చెప్పి నాతో పాటు తనూ బస్సెక్కింది. బస్సులో ఓ ముక్క కూడా మాడ్లాడలేదు. నేను డిస్టర్బ్ చెయ్యలేదు.
ఇంటికెళ్ళగానే నాన్నని గమనించాను. ఆయన మాములుగానే ఉన్నారు. “మహీ.. హైదరాబాద్ వెళ్తున్నాం. రెండు మూడు రోజులు అవుతుంది. అవసరం అయితే ఫోన్ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఉండగలవా?” అన్నారు. “ఉంటాను” అన్నాను. గంటలో వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఇల్లు శుభ్రం గానే ఉంది. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాలని అనిపించినా వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నా. పొద్దున్న ఫోన్ వచ్చింది. “కనీసం 3 రోజులు సరిపడా దుస్తులు పేక్ చేసుకుని హైదరాబాద్ వచ్చేయ్” అని. బయలుదేరే ముందు ఫోన్ చేయ్యమన్నారు. “అలాగే” అని ఫోన్ పెట్టేసిన తరువాత నాకు వచ్చింది ఒకే ఆలోచన.
అలకి ఫోన్ చేయ్యాలని. “అలా, వచ్చేస్తున్నా” అని ఫోన్ చేశా (చదవండి.. అల 20వ భాగం).
PS:
అలని కలువబోతున్న ఆనందం ఒకవైపు, హైదరాబాద్‌కి యీ అర్ధరాత్రి ప్రయాణం ఎందుకని ఒకవైపు ఆలోచనలతో బస్సెక్కాను. చల్లగాలి తాకుతుంటే నిద్ర పట్టేసింది.
(ఇంకా ఉంది)