(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[హైదరాబాద్ వచ్చిన మహతి అమ్మానాన్నలతో హాస్పటల్‍కి వెళ్ళి ఇందిర గారిని చూసి వస్తుంది మహతి. తరువాత అల ఇంటికి వెళ్తుంది. సాయంత్రం అలతో పాటు వెళ్ళి ఓ సినిమా కథ వింటుంది. అక్కడ్నించి మళ్ళీ అల ఇంటికి వచ్చి, తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటానని నిద్రపోతుంది. ఈలోపు వంట చేసేస్తుంది అల. మహతి నిద్ర లేచాక, అసలేం జరిగిందో చెప్పమని అడిగితే, ఇందిర గారి వ్యవహారం ఓ సమస్యగా మారిన సంగతి చెబుతుంది. మీ అమ్మగారేమంటున్నారని అల అడిగితే, అమ్మ చాలా వ్యగ్రతతో ఉంటోందని, ఇందిర గారి విషయంలో అమ్మానాన్నల మధ్య జరిగిన చర్చలు తనకి తెలియవని అంటుంది మహతి. కాసేపయ్యాకా, ఇద్దరు భోంచేసి నిద్రపోవడానికి సిద్ధమవుతారు. తనని ఆదరించాలని ఇందిర గారన్న మాటలు అర్థం కాక, ఆవిడ ఉద్దేశమేమిటని అల మహతిని అడుగుతుంది. తనకీ అర్థం కావడం లేదంటుంది. ఈ విషయం కల్యాణి గారికి చెబితే ఆవిడ చక్కని పరిష్కారం సూచించగలరని అల భావిస్తుంది, కానీ మహతి వాళ్ళ అమ్మానాన్నలకి చెప్పకుండా కల్యాణి గారికి చెప్పడం భావ్యం కాదని అనుకుంటుంది. మర్నాడు ఉదయం అల లేచి, మహతి లేచే లోపే టిఫిన్ చేసేస్తుంది. తరువాత కాఫీ తాగుతూ, తను మూడు రోజుల తరువాత నార్త్‌కి షూటింగ్‍కి వెళ్ళాలనీ, మహతి తన ఫ్లాట్‍లోనే ఉండవచ్చని అల చెబుతుంది. మీ నాన్నగారెందుకు ఊర్కున్నారని అల అడిగితే, మా నాన్నగారికీ ఆవిడ పట్ల ఓ సాఫ్ట్ కార్నర్ ఉండి ఉండొచ్చని మహతి అంటుంది. ఇంతలో కల్యాణి గారు ఫోన్ చేసి మహతి ఉందా అని అడిగితే, ఫోన్ మహతికిచ్చి, అల వంటగదిలోకి వెళ్తుంది. ఫోన్‍లో మాట్లాడడం అయ్యాకా, కల్యాణి గారు టిఫిన్ తీసుకుని ఇక్కడికి వస్తున్నారని చెబుతుంది మహతి. తానూ పూరీలు, కూర సిద్ధం చేశానని చెప్తుంది అల. సరే, రెండూ పంచుకుని తిందాం, నువ్వు రెస్ట్ తీసుకో, మేమిద్దరం హాస్పటల్‍కి వెళ్ళొస్తామని అంటుంది మహతి. – ఇక చదవండి.]
మహతి-4 మహతి-అల-2
[dropcap]క[/dropcap]ల్యాణి గారూ నేనూ కారెక్కిన తరువాత ఓ చోట కారుని ఆపి, డ్రైవర్‌కి ఏదో పని పురమాయించి పంపి, నా వంక తిరిగి నా కళ్ళలోకి చూస్తూ “మహీ.. నేను మీ కుటుంబ వ్యవహారంలో తల దూరుస్తున్నానని అనుకోకపోతే, జరుగుతున్నదేమో నాకు చెప్పు. ఎందుకంటే, అటు మీ అమ్మా నాన్నగారూ, ఇటు నువ్వు చాలా టెన్షన్‌లో ఉన్నట్లు నాకు క్లియర్‌గా తెలుస్తోంది. ఏ సమస్య ప్రత్యేకమైనది కాదు. అటువంటి సమస్య ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. ఐతే, మనం మాత్రం మనకే వచ్చిందని మల్లగుల్లాలు పడుతుంటాం. నీ వ్యక్తిత్వం గురించి అల ద్వారా నాకు కొంచెం తెలుసు. మీ అమ్మ నాన్నగారు దేనికి, ఎలా స్పందిస్తారో నాకు తెలీదు. అయినా సమస్య గురించి ఎందుకు అడుగుతున్నానంటే బహుశా ఆ సమస్య గురించి మీకంటే నేను విపులంగా ఆలోచించగలనని” నా ముఖం వంక చూస్తూనే అన్నారు కల్యాణి. ఆవిడ నిజంగా ఆప్తురాలే. లేకపోతే మా గురించి ఇంత ఎలా ఆలోచిస్తుందీ.
అనుకోకుండానే ఓ నిట్టుర్పూ నా నాశిక నుండి వెలువడింది. దీర్ఘంగా శ్వాస తీసుకుని, నాకు తెలిసిన మొత్తం ఏకబిగిన చెప్పాను. చెప్పాక చాలా రిలీఫ్ కలిగింది. డ్రైవర్ వచ్చాడు. చిత్రం ఏమంటే అతను వెళ్ళింది ముప్పావుగంట ముందర. అంటే దాదాపు 43 నిముషాలు నేను మాట్లాడానన్నమాట.
మొత్తం విన్నాక తానేమీ మాట్లాడలేదు. డ్రైవర్ వింటాడని మౌనంగా ఉన్నారనుకుంటాను.
ఒకప్పుడు ఓ వ్యక్తి రాశాడు – “నీ భార్య గురించి పెద్దగా భయపడకు. మహా అయితే నీ సీక్రెట్స్‌ని చుట్టాలకీ, తన చుట్టాలకీ, స్నేహితులకీ చెప్పి నిన్ను దెప్పి పొడుస్తుంది. నీ రహస్యాలని డ్రైవర్లకీ పనివాళ్ళకి తెలియనివ్వకు. వాళ్ళు ఎవరికి చెప్పకూడదో వాళ్ళకే చెబుతారు” అని. ఆ మాట తెలిసినా తెలీకపోయినా కల్యాణిగారు ఆచరణలో చూపెట్టడం నాకు ఆనందాన్ని కలిగించింది.
“అల తోటి ఏమన్నా చర్చించావా?” అన్నారు కల్యాణి అతి మెల్లగా, దాదాపు గుసగుసగా.
“లేదాంటీ, పూర్తిగా చెప్పలేదు. తను మళ్ళీ ఓ రెండు రోజుల తరవాత ఘాటింగ్‌కి వెళ్ళాలని చెప్పింది. దాని బుర్ర ఎందుకు పాడు చేయడం?” అన్నాను.
“కొన్ని గ్రంథాలలో కొన్ని పరిష్కార ‘వాక్యాలు’ ఉన్నై, అందుకు అడిగాను అలకి చెప్పావా అని” చిన్నగా నవ్వి అన్నారు కల్యాణి.
“ఏమిటివి?” కుతూహలంగా అడిగాను.
“అవా? మొదటిది శాస్త్రవాక్యం, రెండోది మిత్రవాక్యం, మూడోది ఆప్తవాక్యం” అన్నారు.
“అంటే?” అడిగాను.
“ఏదైనా ఓ సమస్య వచ్చినప్పుడు మొదట మన శాస్త్రాలలో పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి. అలా దొరకనప్పుడు మిత్రుడితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అయితే ఆ మిత్రుడు చురుకైనవాడూ, నిష్పక్షపాతీ, సంయమనం కలవాడూ, పరిష్కారం వలన రాబోయే కష్టనష్టాలను ముందే బేరీజు చేయ్యగలివాడూ, సమర్థుడూ, గోప్యవంతుడూ అయి ఉండాలంటుంది శాస్త్రం” అన్నారు కల్యాణి.
“అయ్యబాబోయ్ అన్ని గుణాలు కలిగిన మిత్రుడో మిత్రురాలో అసలు దొరుకుతారా?” ఆశ్చర్యంగా అన్నాను. నిజమేగా మరి!
పక పక గట్టిగా నవ్వారు కల్యాణిగారు.
“ఎందుకు నవ్వుతున్నారూ?” ఆశ్చర్యంగా అన్నాను.
“ఎందుకా? ఆ సుగుణాలు నీలోనూ ఉన్నాయిగా! ‘అల’ సినిమా ఆగిపోబోతున్నప్పుడు చక్కని సలహా చెప్పి సినిమా యూనిట్‌ని అంతా ఆదుకున్నది నువ్వేగా! అంతెందుకూ, మీ వూళ్ళో జరిగిన ప్రతి ఉపయోగకరమైన పనుల్లోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నీ ఆలోచన ఉన్న మాట వాస్తవమేగా!” వాత్సల్యంగా నా భుజం మీద చెయ్యి వేసి అన్నారు.
“అవన్నీ మీకెలా తెలుసు?” మరోసారి ఆశ్చర్యం నాలో.
“ఎప్పటికప్పుడు అల చెబుతూనే ఉంటుంది. అది కాక మొన్న హాస్పటల్‌కి వెళ్ళినప్పుడు మీ అమ్మగారు రెండు గంటలు మాట్లాడింది ఏమిటనుకున్నావూ? నువ్వు చేసిన, చేస్తున్న మంచి పనుల గురించే. ‘మహీ నా కూతురుగా పుట్టడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం’ అన్నారు మీ అమ్మగారు” చిరునవ్వుతో అన్నారు కల్యాణి.
మా అమ్మ ప్రేమకి నాకు కన్నీళ్ళొచ్చాయి. నా మీద ఇంత ప్రేమ ఉందని నేను ఏనాడూ అనుకోలేదు.
“నిజం మహతీ. నువ్వంటే ఆమెకి చాలా చాలా ప్రేమ. అంతేగాదు, నీ మాటలకు చాలా విలువిస్తుంది” అన్నారు కల్యాణి మళ్ళీ. కొన్ని నిముషాలు ఏమీ మాట్లాడలేకపోయాను.
“మంచి మిత్రులకి ఉండాల్సిన అన్ని ప్రత్యేకతలూ నీకు ఉన్నాయని మేం ఖచ్చితంగా చెప్పగలం” సన్నివేశాన్ని తేలిక పరిచే పద్ధతిలో అన్నారు కల్యాణి.
“నేను అంగీకరించను ఆంటీ, ఎందుకంటే, వాళ్ళకి సలహా ఇవ్వడం ఆ క్షణంలో నా మనసులో పుట్టిన ఆలోచన. అదృష్టవశాస్తూ అది సక్సెస్ అయింది. ఫెయిలైతే? అల జీవితం చాలా దెబ్బతినేది” అన్నాను.
“నువ్వు చెప్పన సలహా సరైనదే. ఆ పరిస్థితుల్లో అంతకి మించి చెయ్యడానికీ ఏమీ లేదు” అన్నారు కల్యాణి.
“సరే. మరి ఆప్తవాక్యం అంటే?” అడిగాను.
“ఓ వ్యక్తికి అనేక మంది మిత్రులుంటారు. ఆ మిత్రులు కూడా దాదాపుగా ఆ వ్యక్తి వయసు ఉన్నవారే ఉంటారు. కొద్ది తేడాలు ఉండొచ్చు. ఆప్తులు వేరు, మనసుకి ఆత్మకి అతి దగ్గరైన వారు ఆత్మీయులు. మిత్రులు ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆత్మీయులు అలా చేయలేరు. విచక్షణతో, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల శాస్త్రవాక్యం లభించనప్పుడు ఆప్తవాక్యం బెస్ట్ అని విజ్ఞులంటారు.” అన్నారు కల్యాణిగారు.
“ఓహ్, మన దేశపు సంస్కృతి సాంప్రదాయాలు అద్భుతం గదూ!” మనసారా అన్నాను.
“అవును. ప్రపంచంలో ఎక్కడా ఇంత నిర్ధిష్టమైన పద్ధతులు ఉండవు” అన్నారు కల్యాణి.
ఓ పక్క ఆవిడ నాతో మాట్లాడుతున్నా మరో పక్క నే చెప్పిన విషయాల గురించి చాలా లోతుగా ఆలోచిస్తున్నారని ఆమె ముఖం చెబుతోంది.
నేనూ ఆలోచిస్తున్నా. అయినా, ఎవరో ఒకరు తమ మనసుని స్పష్టంగా బైటపెడితేనే గాని యీ సమస్యకి పరిష్కారం కుదరదనిపించింది. అయితే బయటపడేది ఎవరూ? అమ్మా – నాన్నా? బయటపడాల్సింది ఎవరూ? ఇందిర గారా, నాన్నా?
ఇందిర గారు స్పష్టంగానే ఉన్నారు. అమ్మ పరిస్థితి చాలా క్లిష్టం. ఇందిర గార్ని ఎలా భరించగలదూ?
“ఇందిర గారూ నీతో ఏమైనా మాట్లాడారా?” సడన్‌గా అడిగారు కల్యాణిగారు.
“స్పష్టంగా లేదు. కానీ చూచాయగా మాట్లాడింది. నాన్న మీద తనకి ఓ హక్కు ఉన్నట్లు మాట్లాడుతోంది. బహుశా అది మేకగాంభీర్యం. ఎందుకంటే, నాన్నగారు నాకు తెలిసి, ఏనాడూ ఆవిడని కలవలేదు. తలవలేదు” అన్నాను.
“కలవకపోవడం రైటే.. కానీ, తలవకపోవడం సంగతి చెప్పలేముగా మహీ.. మనసు చిత్రమైంది. ఎవర్నీ ఎప్పుడు ఎందుకు ప్రేమిస్తుందో ఎవరికి తెలుసూ? ఇంకో విచిత్రమేమంటే ఆడవాళైనా, మగవాళైనా తమ ప్రేమని ఏనాడూ మరిచిపోలేరు. అలాగనీ ‘పైకి’ తలుచుకోనూ లేరు. ఆ చోటు మనసులో అలాగే ఉండిపోతుంది. అక్కడ మాత్రం ఇతరుల్ని కూర్చోబెట్టలేరు. బాధ్యతలు ఎంత నెక్కి నాట్యం చేస్తున్నా ఆ సాఫ్ట్ కార్నర్ అలాగే ఉంటుంది. నిజం చెబితే, ఇక్కడ నిర్ణయం తీసుకోవలసిన వ్యక్తి మీ నాన్నగారు” అన్నారు కల్యాణి.
“అంత వరకూ నేనూ ఆలోచించానూ, ఇంకోలా చెప్పాలంటే..” ఆగిపోయాను. ఆ వాక్యం పూర్తి చెయ్యాలనిపించలేదు.
“అవును.. ఇందిరగారు అంత జబ్బులోను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ మానడం లేదు. ఆమెలో అందం ఎంత ఉందో, మూర్ఖత్వమూ అంతే ఉంది. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించే స్వార్థమూ ఆవిడలో తక్కువ లేదు.”
“ఒకసారి అటువంటి బ్లాక్‌మెయిల్‌కి తలొంచితే, జీవితం అంతా తలొంచుకునే ఉండాలి. అంతే కాదు ఆంటీ, అటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని శాంతంగా బతకనివ్వరు. వాళ్ళ అథారిటీని భరించడానికి ఎవరో ఒకరు ఉండాలి. అందుకే వాళ్ళు ఏ వ్యక్తి నుంచి నిజమైన ప్రేమ పొందలేరు. ప్రేమ లేకపోయినా సరే, వ్యక్తి మాత్రం ఉండాలి, తన వెర్రి మాటల్ని భరించడానికి” అన్నాను నేను. ఇంత కర్కశంగా ఆలోచిస్తానని ఏనాడూ అనుకోలేదు.
“సారీ. నేను చాలా అనాలోచితంగా మాట్లాడుతున్నా” అన్నాను.
“ఆవిడ మెంటాలిటీని నువ్వు పెరఫెక్ట్ గానే అంచనా వేశావు. ఆవిడ మాటలకు ఏమాత్రం తలొగ్గినా జరిగేది అదే. బహుశా ఒంటరితనం అనేది ఆవిడ మనసుని మరో పాషాణంగా మార్చిందేమో? చిత్రం ఏమంటే మీరందరూ మాటల్నీ నవ్వునీ కోల్పోయి తిరగడం ఆవిడకి ఆనందాన్ని ఇస్తోందన్న సంగతి మొదటి రోజునే నేను గ్రహించాను” అన్నారు కల్యాణి.
కాసేపు మళ్ళీ మౌనం రాజ్యం చేసింది.
“అదీ ఒక రకమైన శాడిజమే” అన్నారు ఆవిడే.
“నిస్సహాయత లోంచి పుట్టిన శాడిజం కావచ్చు. అహంభావం, అహంకారం తీవ్రంగా దెబ్బతిన్నాయిగా మరి” అన్నాను.
“యస్. అయితే మహీ, ఆవిడని మార్చాలంటే చాలా చాలా ఓర్పు కావాలి. చివరి స్టేజ్‌కి వచ్చినా, ఆవిడ ఆలోచనల్లో ఏ మార్పూ ఉంటుందని నాకు అనిపించడం లేదు. అలాగని ఆవిడ్ని వ్యతిరేకిస్తే, ఆ ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి” ఆలోచిస్తూనే అన్నారు కల్యాణి.
ఆ భయం నన్ను వెన్నాడూతూనే ఉంది. హైద్రాబాదు వచ్చి ఇందరని చూసినా దగ్గరనించీ.
“ఏదేమైనా అన్నింటికీ సిద్ధమై ఉండాలి.. ఆవిడ మాటకి అసలైన అర్థం ఆవిడ నోటి వెంట వచ్చేదాకా” మళ్ళీ అన్నారు కల్యాణి.
హాస్పిటల్ వచ్చింది. డాక్టర్ గార్ని ముందు కలిశాము. “పేషెంట్ కండీషన్ కొంచెం స్థిరంగానూ, ఆశాజనకంగానే వుంది. మానసిక స్థితి మాత్రం చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యం ఏమంటే ఏ మాత్రం మానసిక గాయం కాకూడదు” అన్నారు.
“ఆయన అన్నదానిలో ఏ తప్పూ లేదు. ఆయన ప్లేస్‌లో ఏ డాక్టర్ వున్నా అదే చెబుతారు. బహుశా ఇందిరగారి మీద ఆయనకి సానుభూతి ఉండొచ్చు. మహీ, ఆడదాని ‘జబ్బు’ మూడొంతులు ‘గొంతు’ లో ఉంటుంది. ‘స్వరం’తో సానుభూతిని పొందడం స్త్రీలకి వెన్నతో పెట్టిన విద్య. ఆడదాన్నై కూడా ఇలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోకు.. కొన్ని వందల సార్లు యీ విషయం గమనించాను. ఆ ‘స్వరం’ మాజిక్ తోనే స్త్రీలు అందరి దగ్గరా సానుభూతి పొందేది.
ఇందిరా ఆ విషయంలో అతీతురాలు ఏమీ కాదు. బహుశా జాయిన్ అయినప్పుడే తన జీవితం గురించి ‘సానుభూతి ప్రేరకంగా’ మాట్లాడి ఉండొచ్చు” అన్నారు కల్యాణి బయటకొచ్చాక.
మా అమ్మ నాన్నగారికి టిఫిన్ పెట్టాం. మా అమ్మ మాత్రం మౌనంగా ఉంది. నాన్న మాత్రం మామూలుగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ మామూలుగా లేరని నాకూ కల్యాణిగారికీ కూడా అర్థమైంది.
“డాక్టర్ ఏమన్నారూ?” అయిష్టంగానే టిఫిన్ తింటూ అన్నది మా అమ్మ. మేం డాక్టర్ రూంలోకి వెళ్ళడం తాను చూసి వుండాలి.
“శారీరిక పరిస్థితి ఆశాజనకంగానే ఉందన్నారు” అన్నారు కల్యాణి గారు. ఆ తరువాత కాసేపు సైలెన్స్. అమ్మ నాన్న చేతులు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు “ఆంటీ డైరెక్ట్‌గా ఇందిరగారితో మాట్లాడి మౌనమనే ఐసుగడ్డని పగలగొడదామా?” అన్నాను – ఈ సమస్యకి తెరపడితేగానీ, ఎవరికీ, శాంతి లభించదని అనిపించి.
“నేనూ అదే ఆలోచిస్తున్నా. కానీ, ముందా విషయం మీ పేరెంట్స్‌కి తెలిసి తీరాలి. లేకపోతే, వారి ఫీలింగ్స్‌ని హర్డ్ చేసినట్టు ఉంటుంది” అన్నారు కల్యాణి.
“అయితే మా అమ్మానాన్నలనే అడుగుతా” అన్నాను స్థిరంగా. ఎందుకంటే, ఏ టెన్షన్ అయినా రోజులపాటు నెలలపాటు సాగకూడదు. అలా సాగితే వచ్చేది ఊహించరాని నష్టమే.
“ఒకసారి పేషెంటుని చూసి వద్దాం” అన్నారు కల్యాణి.
అమ్మానాన్న వచ్చాక వాళ్లకి చెప్పి ‘రూమ్’ లోకి వచ్చాం.
ఇందిరగారు నిజంగా ‘అలసిపోయిన అందం’ లాగే ఉంది. మమ్మల్ని చూడగానే ఓ చిన్న చిన్న చిర్నవ్వు.
“ఎలా ఉన్నారు ఇందిరా” అన్నారు కల్యాణి.
“ప్రస్తుతానికి పరవాలేదు అండీ. తరవాత సంగతి డాక్టర్‌కే తెలియాలి” అన్నది ఇందిర, ఆ నవ్వుతోనే.
“మీరు హాయిగా కలకాలం ఉండాలి” చనువుగా పక్కనున్న కుర్చీ లాక్కుని కూర్చుంటూ అన్నారు కల్యాణి.
“మీ నోటి చలవ, నాకూ బ్రతకాలనే కాంక్ష బలీయంగా ఉంది.”
ఇప్పుడా మోములో చిరునవ్వు లేదు. గొంతులో ‘జీర’ ఉంది.
“భగవంతుడు నిజంగా మీకు మేలు చేస్తాడు. నిండు నూరేళ్ళు తప్పక బ్రతుకుతారు. ధైర్యంగా ఉండండి” అన్నారు కల్యాణి.
“బ్రతకాలని ఉంది.. కానీ బ్రతికి ఏం చెయ్యాలీ? నాకంటూ మిగిలివున్నది ‘బావ’ ఒక్కరే. సరే.. ఆయన సంసారం ఆయనకి వుంది” సుదీర్ఘంగా నిట్టూర్చి అన్నది ఇందిర. ఆ స్వరంలో అనంతమైన వేదన ధ్వనించింది.
“బావ ఒక్కరే కాదుగా ఇందిరగారూ, మా అమ్మ, నేనూ, మా అన్న, తమ్ముడు, చెల్లీ మా తాతయ్య అందరం ఉన్నాం కదా! మీరు త్వరగా కోలుకోవాలనీ ఆరోగ్యవంతులవ్వాలనే కదా ఇక్కడికి వచ్చింది” అన్నాను నేను.
“అందరూ ఉన్నారు మహతీ, అందరూ ఉంటారు. తేలిపోయే మేఘాలు లక్ష వున్నా, ఎదురుచూసేది ఒక్క వర్షించే మేఘం కోసమేగా!” నిర్లిప్తంగా అన్నది ఇందిర.
ఆమె ఇచ్చిన ఉదాహరణకి అర్థం నాకు సంపూర్తిగా తెలిసింది. నాకు తెలియాలనే అలా ఇందిర మాట్లాడిందని కూడా నాకు అర్థమైంది.
నేను నోరు తెరిచి మాట్లాడక ముందే కల్యాణి గారు నిగూఢమైన సౌంజ్ఞ చేశారు. సైలెంటయ్యా.
“వర్షించే మేఘం వర్షాన్ని ఇస్తుంది నిజమే, కానీ తేలిపోయే మేఘాలు కూడా మండుటెండలో నీడని ఇస్తాయి. సూర్యుడిని అడ్డుకుని సూర్య తాపాన్ని తగ్గిస్తాయి. దేని ప్రత్యేకత దానిదే కదా ఇందిరా.
‘లేరు’ అనుకుంటే ఎవరూ ఉండరు, అది మీకైనా, నాకైనా. ‘ఉన్నారు’ అనుకుంటే అందరూ ఉంటారు. చూడమ్మా, బావగారే కాదు, బావగారితో పాటు మేమందరమూ నీకోసం ఉన్నాం. నీకోసం మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.” కుర్చీ లోంచి లేచి ఇందిర తల నిమిరి అన్నారు కల్యాణి గారు.
ఇందిర ఓ క్షణం కల్యాణి గారిని సూటిగా చూస్తూ “అవును.. అవుననుకుంటా” అని కళ్ళు మూసుకుంది.
(ఇంకా ఉంది)