Site icon Sanchika

మహతి-59

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అల ఢిల్లీ వెళ్ళాల్సిన తేదీ దగ్గరకొస్తోంది. ఆమెలో ఉత్కంఠ, ఆందోళన. మహతి పక్కన తను ఉంటే మహీకి కాస్త టెన్షన్ తగ్గుతుందని తెలిసినా, ఢిల్లీ వెళ్ళక తప్పని పరిస్థితి. అల ఆలోచనల్లో ఉండగానే కారు ఆసుపత్రికి చేరుతుంది. క్యారేజ్‍ తీసుకుని వెళ్ళి, ఇందిర గారి మూడ్ ఎలా ఉందో గమనించమని కల్యాణి గారు చెప్తారు. తాను వెళ్తాననీ, ఈ రోజు తన పుట్టినరోజని అంటుంది అల. మహి, కల్యాణి విస్తుపోయి, మాకు చెప్పలేదే అని అంటే, నాకూ ఇప్పుడేగా తెలిసింది అని నవ్వేస్తుంది అల. అందరం కలిసి భోంచేద్దామంటే ఇందిర గారు ఒప్పుకోరని అలా చెప్పదలుచుకున్నానని అంటుంది. లోపలికి వెళ్ళగానే ఈరోజు అల పుట్టినరోజని చెబుతుంది మహి. అహల్య, గౌతమ్ అలని దీవిస్తారు. అల, మహీ – ఇందిర గారి దగ్గరకి వెళ్తారు. ఈ రోజు అల పుట్టినరోజని ఆవిడకి చెప్తుంది మహీ. ఆవిడ విషెస్ చెప్తే, తనకి పుట్టినరోజు కానుకగా అందరం కలిసి భోం చేద్దామని అంటుంది అల. డాక్టర్‍ని రిక్వెస్ట్ చేసి మీటింగ్ హాల్‍లో భోజనాల ఏర్పాటు చేశానని చెబుతుంది. మొదట కాదన్నా, చివరికి ఒప్పుకుంటారు ఇందిర. భోజనం కోసం పర్మిషన్ తీసుకున్నప్పుడు అక్కడి డాక్టర్‍ని కూడా ఇన్వైట్ చేస్తుంది అల. లంచ్ టైమ్‍లో అందరూ భోజనానికి కూర్చుంటారు. తన సినిమా షూటింగ్ గురించి చెప్తుంది అల. తను ఢిల్లీ వస్తే హీరో వినోద్ కపూర్‍ని పరిచయం చేస్తారా అని డాక్టర్ సుధీర్ అలని అడుగుతాడు. తప్పకుండా చేస్తాను అని చెప్పి – మీరూ మా అమ్మ, ఇందిరగారూ, వీలైతే కల్యాణిగారు కూడా ఢిల్లీ వచ్చేయ్యండి. వినోద్ గారితో పాటు అందరం ఒకే హోటల్లో ఉందాం. అరేంజిమెట్స్ నేనే చేస్తాను – అని అంటుంది అల. తన మానన తనని వదిలేయమని అంటారు ఇందిర. సంభాషణని మార్చి, ఎవరు ఏ వంట చేశారో చెబుతుంది మహి. నాన్నకి గుత్తివంకాయ కూర ఇష్టమని తెలిసి కూడా అంత తక్కువ వేశావేం అంటుంది అహల్య మహితో. ఇంతలో ఇందిర గబుక్కున లేచి ఓ గరిటెతో కూర తీసుకుని గౌతమ్ కంచంలో వేస్తారు. అందరు విస్తుపోతారు. గౌతమ్ ఇదేమీ పట్టించుకోకుండా, కంది పచ్చడి కలుపుకుని తింటారు. అల ఆలోచనల్లో పడితే, ఆమెని కుదుపుతుంది మహీ. ప్రేమ గురించి, పిశాచ ప్రేమ గురించి, పెళ్ళి గురించి తన ఆలోచనలు పంచుకుంటుంది అల. డా. సుధీర్ భ్రూణ హత్యల గురించి విద్య గురించి మాట్లాడుతాడు. తాను నిజమైన చదువుని ఇప్పుడు చదువుకుంటున్నానంటుంది అల. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-6

మహతి:

[dropcap]వి[/dropcap]డువలేక విడువలేక ఢిల్లీ వెళ్ళింది అల. అలని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే, ఊహించని విదంగా ఎంతో గొప్పగా ఎదిగింది. ఎంతో విచక్షణతో ఆలోచించడం నేర్చుకుంది. పరిస్థితులను గమనించి, ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎలా మసులుకోవాలో నేర్చుకుంది. అది మారడానికి కారణం నేను అని అంటుంది గానీ, దాని మార్పుకి కారణం నిజంగా అదే. నేను చేసింది ఏదీ లేదు.

అందరం భోజనాలకి కూర్చున్న రోజున అది ప్రేమ, పెళ్ళి, నిజమైన ప్రేమ, పిశాచ ప్రేమల మీద వెలిబుచ్చిన ప్రతి మాటా అందరి హృదయాలల్లోనూ నాటుకుంది.

దాని మనసులోని విషయం అది చెప్పిందో, ఇందిర గారికి ఇన్‌డైరెక్టుగా చెప్పిందో గానీ, ఆ మాటల ప్రభావం ఇందిరగారి మీద చాలా పడింది. ఆమె మాటల్లో అది వరకు కరుకుదనమూ, పెడసుదనమూ లేదు.

అందరితోటీ మామూలుగా మాట్లాడుతున్నా ఎక్కవ సమయం ఆలోచనలతో గడుపుతోంది.

“పెళ్ళి అంటే ఒకరినొకరు కట్టేసుకుని పడుండటం కాదు. స్వేచ్ఛ లేని నాడు ‘నిజం’ ఉండదు. ఎవరి వ్యక్తి స్వేచ్ఛ వారికుండాలి. మన ప్రవర్తన ఎదుటి వారిని ప్రభావితం చేయ్యగలిగేలా ఉండొచ్చు. కానీ – వారిని బందీ చేసేలా ఉండకూడదు. భార్యభర్తల మధ్య మొదట పెంపొందాల్సినది స్నేహం. అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అహంకారం, అధికారం అనేవి ఏనాడూ పెళ్ళి అనే బంధంలో అడుగుపెట్టకూడదు. ఒకరితో ఒకరు మనసు విప్పి చెప్పుకునే పరిస్థితి ఉండాలంటే, మొదట భార్యాభర్తలను ముడి వెయ్యాల్సింది స్నేహబంధమే. నా దృష్టిలో మూడు ముళ్ళు అంటే 1-స్నేహబంధం, 2-ప్రేమబంధం 3-అనురాగబంధం. ఈ మూడు మూడులు వేసినప్పుడే నిజమైన వివాహనికి అర్థం” అని కూడా ఆ రోజున భోజనాలు అయ్యాక చెప్పింది. డాక్టరు గారితో సహా అందరూ చక్కగా శ్రద్ధగా విన్నారని నాకు అర్ధమైంది.

“అలా ప్రేమలో పడ్డాన్నావు కదా.. పెళ్ళి గురించి కూడా ఏమైనా ఆలోచిస్తున్నావా?” అన్నాను. అది చిన్నగా నవ్వి, “నేను అతన్ని ప్రేమిస్తున్నానని అనుకుంటున్నాది నిజం. నేను ప్రేమించినంత మాత్రాన అతను నన్ను ప్రేమించాలన్న రూల్ లేదుగా. మహీ, మనం తాజ్ మహల్‌ని ప్రేమిస్తాం. బదులుగా తాజ్ మహల్ మనని ప్రేమించాలని కోరుకుంటామా?” అన్నది.

“మరి పెళ్ళి గురించి అద్భుతంగా చెప్పావు కదా!” అన్నాను.

“అది నా ఆలోచన మాత్రమే. వివాహ బంధం గట్టిపడాలంటే ప్రేమ ఒకటే చాలదు. స్వేచ్ఛకావాలి.. కనీసం ఒకరి మనసులో భావాలు మరొకరికి నిస్సంకోచంగా చెప్పుకునే స్వేచ్ఛ. అది స్నేహం బలబడినప్పుడే ఫలిస్తుంది. అందుకే ప్రేమ+స్నేహం=అనురాగం” అన్నది. తన ఆలోచనా పద్ధతి నాకు బాగా నచ్చింది.

“మహీ, నువ్వెవరినీ ప్రేమించలేదా?” అన్నది అల.

“లేదు. అప్పుడప్పుడు అభిమన్యు గుర్తుకొస్తాడు. అతని తలంపు కూడా నాకు ఓ ధైర్యాన్నిస్తుందే గాని మనసుకి ‘అలజడి’ కలిగించదు” సిన్సియర్‍గా అన్నాను.

“అనుకున్నాను. స్త్రీ సహజమైన కోరికలు నన్ను కలవరపెడుతున్నాయి అప్పుడప్పుడు. అందుకే ప్రేమా పెళ్ళి ప్రేలాపన అనుకున్నా. నీ ఆలోచనలే వేరు. నీ ఆలోచటనలు ఎంత సేపు సమాజం కోసమో జనసంక్షేమం కోసమో ఉంటుంది. కానీ, ఓ మాట చెప్పనా? నువ్వు గనుక ఎవర్ని ప్రేమించినా వారి కోసం నింగీ నేలా ఏకం చేస్తావు. నీ ప్రేమ అంత గాఢంగా ఉంటుందని ఖచ్ఛితంగా చెప్పగాను” నవ్వి అన్న దాని గొంతులో నిజాయితీ ధ్వనించింది.

“ఏమో..” అన్నాను. ఆ రాత్రంతా ఇద్దరం కబుర్లు చెప్పకుంటూనే ఉన్నాం.

“మహీ, అవసరమైతే ఇందిరగారికి నువ్వు బాసటగా నిలబడు. వీలైతే ఉప్పలపాడుకి తీసుకెళ్ళి కొన్నాళ్ళు ఉంచుకో. హెల్ప్‌లెస్ కండీషన్స్‌లో తాను మెండిగా, కొంచెం శాడిస్టుగా తయారై ఉండొచ్చు. కానీ ఆమె హృదయంలోనూ కొంత ‘తడి’ ఇంకా మిగిలే వుంది. నువ్వామెని మీ వూరు తీసికెళ్ళడం మీ అమ్మగారికి ససేమిరా నచ్చదు. కానీ, సమస్య పరిష్కారం. కావాలంటే, ముఖ్యంగా మీ సమస్య, ఓర్పు వహిస్తేనే పరిష్కారమవుతుంది. ఇదినా ఆలోచన మాత్రమే” అన్నది అల తెల్లవారు ఝామున పడుకోబోతూ.

“ఆలోచన నాకూ వచ్చింది. ఎలా అనేది ఇంకా స్పష్టత లేదు” అన్నాను నేను. ఆ మాట నిజమే! ఎందుకంటే, ఇందిర ఒంటరిగా ఉండీ ఉండీ బండబారిపోయింది. ఆ బండకరిగితే గానీ అసలు సిసలు ఇందిర మనకి కనపడదు.

ఆ మాటే అలతో అన్నాను. నిద్రపోయి లేచేసరికి పట్టపగలు 10-30 నిముషాలు.

“అమ్మాయ్.. నేను సద్దుళ్ళలో పడతా. నువ్వు హాస్పటల్‌కి వెళ్ళి తీరిగ్గా రా. రాత్రి ఎనిమిది గంటలకి ఫ్లయిట్. అంటే ఏడింటికల్లా ఏర్‌పోర్ట్‌లో ఉండాలి. అయిదున్నరకి ఇంటినుంచి బయల్దేరదాం” అన్నది అల టిఫిన్ అయ్యాక. నేను తల వూపి కారెక్కాను.. హాస్పటల్‌కి వెళ్ళడానికి.

***

“హైద్రాబాద్ వచ్చి ఏడు రోజులయింది. నేను విజయవాడ బయల్దేరుతాను” మెల్లిగా నాన్నతో అన్నది అమ్మ. నాన్న మొహంలో షాక్.

“ఇక్కడ నేను ఉండటం అనవసరం అనిపిస్తోంది. నేను ఎంత ప్రయత్నించినా ఆవిడ నాతో మాట్లాడదు. ఆవిడ అటెన్షన్ అంతా మీ మీదే. ఇక్కడ నేను వుండి ఏం చేయ్యాలి. పిల్లల చదువులు కూడా పాడైపోతున్నాయి. సమస్య ఇప్పట్లో తేలే విధంగానూ లేదు. నేను విజయవాడ వెళ్ళిడమే మంచిదని నాకనిపిస్తోంది. ఒక ఆడ సాయం లేకపోతే మీకైనా సాధ్యం కాదని ఇప్పటిదాకా ఉన్నాను” గట్టిగా నిశ్వసిస్తూ అన్నది అమ్మ.

ఆవిడ చెప్పింది నూటికి నూరు పాళ్ళు రైట్. ఆవిడ ఇప్పటికే మానసికంగా క్రుంగిపోయి వున్న విషయం నేను గ్రహించాను.

“అదీ.. అదీ..” అయోమయంగా అన్నాడు నాన్న.

ఆయన పరిస్థితీ క్లిష్టమే. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో ఎవరికి తెలుసు. నేను మౌనంగా గది బయటకి నడిచాను. సరాసరి ఇందిరగారి బెడ్ దగ్గరికి వెళ్ళాను.

“ఆంటీ.. ఇవ్వాళ అల ఢిల్లీ వెళ్ళిపోతోంది. మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంది. మరీ మరీ మిమ్మల్ని అడిగినట్లు చెప్పమంది” అన్నాను బెడ్ పక్కన కుర్చీలో కూర్చుంటూ.

“ఒంటరిగానే వెడుతుందా?” కొంచెం ఆశ్చర్యం కొంచెం కూతూహలం మిక్స్ చేసి అడిగింది.

“అవును. వాళ్ళ అమ్మగారిని పంపడానికి అల తండ్రి ఒప్పుకోవడం లేదు. ఆయనో చదువుకున్న చాదస్తుడు. కుందేలుకి మూడు కాళ్ళని వాదించే రకం” అన్నాను.

“లోకంలో ఆడవాళ్ళు ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? అదీ సినిమాల్లో! ఏ క్షణం కీడు జరుగినా జరగొచ్చు” అన్నారు ఇందిర. ఆవిడ స్వరంలో కంగారు గానీ అల పట్ల సానుభూతి గానీ ధ్వనించలేదు.

“అలకి మంచి విచక్షణాజ్ఞానం ఉంది. ఎక్కడైనా తనని తాను రక్షించుకోగలదు. ఏ పరిస్థితులోనైనా ఎదుర్కోగలదు. చక్కగా అందరితో కలిసిపోయే తత్వం. కనక అందరూ తనకి మంచే చేస్తారు” అన్నాను.

“అవునా.. నీ వల్లే తన ఎంతో నేర్చుకుందని కూడా అన్నది? ఏమి నేర్పావూ? మీ ఇద్దరిదీ ఒకటే వయస్సు గదా?” అన్నది ఇందిర.

“లేదాంటీ.. నేను తనకి నేర్పడం అన్నది సత్యదూరం.. లోకంలో ఎవరూ ఎవరి వల్లా తమని తామూ మార్చుకోరు. మార్పు అనేది హృదయంలోంచి రావాలి. అలా హృదయంలోంచి రాని మార్పు కూడా ఉండేది కొంత కాలమే. అంటే క్షణికమే. ఓ మనిషిగా యీ లోకానికి వచ్చాం. ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాం. అందరి పరిస్థితీ అదేగా! ఈ రాకడ పోకడ మధ్య అనంతమైన ఆలోచనలు సన్నివేశాలు. అల జీవితపు ‘నడక’ని అర్థం చేసుకుంది. దానిలో నా గొప్పలేదు” అన్నాను.

చాలా సేపు మౌనంగానే ఉన్నాము. సడన్‌గా ఇందిర నావంక తిరిగి, “మీ నాన్న నా గురించి ఎప్పుడూ మీకు చెప్పలేదా?” అన్నది నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.

“లేదు. అసలు తనకి బంధువులనే వారు ఉన్నరనే మాకు తెలీదు” నిట్టూర్చి అన్నాను.

“ఎవరో ఒకరు ఉండి కూడా ఎవరూ లేనట్టు బ్రతకటం ఎంత నరకమో అని ఇప్పుడనిపిస్తోంది. తల్లీ తండ్రీ లేరు. మీ ఇంట్లో పెరిగారని మాత్రం తెలుసు. అంతే, ఆయన ఏనాడూ గతాన్ని తవ్వి పోయలేదు. కానీ, అందరినా చాలా ప్రేమగా చూసుకున్నారు. ఆయన తన కోసం తాను ఏదన్నా కొనుక్కోవడం కూడా నేను చూడలేదు” చాలా ఎమోషనల్ అయ్యానని నాకే తెలుస్తోంది. నా కళ్ళు చెమర్చాయని కూడా నాకు తెలుస్తోంది.

“గతాన్ని ఎందుకు దాయడం?” సూటిగా నావంక చూస్తూ అన్నది.

“బాధ కలిగించేదో, భయపెట్టేదో అనే గతాన్ని ఎందుకు పదిమందికీ పంచాలి? యస్.. ఇతర్ల సానుభూతి కోసం అలా గతాన్ని తవ్వి, ఆ మట్టిలోంచి కూడా పెంకులు గాజు పెంకులూ తీసి జనానికి చూపిస్తూ సానుభూతి పొందేవార్ని చాలా మందినే నేను చూశాను. కానీ, మా నాన్న ఎన్నడూ గతం గురించి మాట్లాడలేదు. ఎవర్నీ యీ క్షణం వరకూ నిందించడం నేను ఎరగను” స్పష్టంగా అన్నాను.

తను ఏమీ మాట్లాడలేదు. ఆమె ఉచ్వాస నిశ్వాసలు గాంఢంగా ఉంటడం నేను గమనించాను.

“ఆంటీ, మా నాన్నగారి అమ్మానాన్నా మీకు తెలుసా?” అడిగాను. ఎందుకడిగానో నాకే అర్థం కాలేదు.

“నేను పుట్టేసరికే వాళ్ళు లేరు. బావ చిన్నతనంలోనే పోయారట” కళ్ళు మూసుకుని అన్నది ఇందిర.

“ఆంటీ..” అన్నాను. నిజం చెబితే ఏమడగాలో తెలీదు.

కానీ అవిడ్ని మాట్లాడించడం మంచిదని మనసుకి అనిపించింది.

“మీ నాన్నగారి తల్లిగారి తమ్ముడే మా నాన్న. మా తాతగారు గొప్ప జ్యోతిష్య విద్వాన్ అనీ, గొప్ప దాత అనీ తరువాత తెలిసింది. మా నాన్న మంచివాడే. కానీ, చేతకొచ్చిన దేన్నీ వదిలిపెట్టడు. నిజం చెబితే తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీనివాడు. మీ నాన్నగారి ఆస్తి మాదాంట్లో కలిపేసుకున్నారని కూడా నాకు మీ నాన్న పెళ్ళి అయిన తరువాతే తెలిసింది. అయినా మా నాన్న మాత్రం ఏం బావుకున్నాడు? నాతో ఆ వంశమే ఆఖరవుతుంది” కళ్ళు మూసుకుంది ఇందిర. ఆ కళ్ళల్లో చెప్పలేని వేదన.

“మా నాన్న..” ఆగిపోయాను, సందేహంతో.

“మీ నాన్న నన్ను ప్రేమించారా అని అడగాలనుకున్నావా?” కళ్ళు తెరచి అన్నది ఇందిర.

“అంటే..” ఆగాను.

“నీ ప్రశ్న అదే అయితే దానికి సమాధానం మీ నాన్నే చెప్పాలి. మీ నాన్ననే అడుగు. మీ నాన్న మనసు ఓ కీకారణ్యం. ఆయనకి ఏది కావాలో, ఏది వద్దో కూడా చెప్పడు. సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ ఆ సంతోషం అనేది నిజంగా ఉందో లేదో ఆయనకే తెలియాలి. మహతీ.. మీ అందరి దృష్టిలోనూ నేనో విలన్ లాగా, మూర్ఖురాలి లాగా, మంకుపట్టు పట్టే పెంకెదానిలాగా కనబడుతూ ఉండొచ్చు. అవన్నీ నిజమే కావచ్చు. కానీ ఒక్క నిజాన్ని విస్మరించకండి” ఆగింది ఇందిర. నిజంగా ఆ గొంతులో వేదన నా మనసుని తాకింది.

“ఏ విషయం ఆంటీ?” కుర్చీలోంచి లేచి పక్కమీద కూర్చుని ఆవిడ చెయ్యి పట్టుకున అడిగాను.

“నేనూ ఓ ఆడదాన్ననే విషయం” మెల్లగా అన్నారు ఇందిర. అప్రయత్నంగా నా చేతుల్లోని ఆవిడ చేతిని బందించి పట్టుకున్నాను.

నాకు తెలుసు.. కోటి మాటలు ఇవ్వలేని సాంత్వన ఒక్క చిన్న స్పర్శ ఇవ్వగలదని.

***

“బహుశా ఇందిరగారు తన పట్టు సడలించవచ్చు.. కానీ..” అంటూ ఆగింది అల. ఉన్నదంతా ఆ ‘కానీ’ లోనే ఉంది. అసంకల్పితంగా ఓ నిట్టూర్పు వెలువడింది.. నా నాశిక నుంచీ.

“అవును.. అవును. పట్టు సడలించవచ్చు. కానీ, కండీషన్స్ అంటే షరతులు కాదు, పరిస్థితులు అలాగే వుంటాయిగా! హైల్త్ బాగుపడ్డాక మళ్ళీ ఆవిడా ఆ ఒంటరితనం. ఇటు వైపు చూస్తే ఇందిర మీద మా అమ్మగారికి ఏనాడైనా సాఫ్ట్ కార్నర్ వస్తుందా? నెవర్..” ఆగాను. పరిస్థితిని ఊహించాలన్నా భయంగానే ఉంది.

“లేదు మహీ.. చెప్పు.. మన మనసులోని ఆలోచనలు ఒక విధంగానే ఉన్నాయి. కానీ, బయట పెట్టలేకపోతున్నాం. బయటపెడితే గానీ, సమస్యని లోతుగా పరిశీలించలేము. చెప్పు.. వాటెవర్ ఇట్ మే బీ” అన్నది అల.

“ఏముందీ.. ఇందిర మాటల్లో నాన్న గురించిన స్పష్టత లేదు. ప్రేమించారో లేదో ఆయన్నే అడగమంది. ఆయన మనసో కీకరణ్యం అన్నది. ఆ మాటల్లో ‘ప్రేమించారు’ అనే ఓ చిన్న హింట్ మాత్రమే ఉంది. అయితే, ప్రేమించినంత మాత్రాన యీవిడ ఇలాంటి అస్తవ్యస్థ పరిస్థితుల్ని కల్పించవచ్చునా? ఎవరితోటీ ఏమి చెప్పుకోలేని ఆయన స్వభావాన్ని ఇలా చీల్చి చెండాడవచ్చా? సరే, ప్రేమకి మించి ముందుకు వెళ్ళిందనుకుందాం – అప్పుడే ఆవిడో, ఆవిడ తల్లిదండ్రులో నాన్నని నిలదీయవచ్చుగా? ఎందుకు చెయ్యలేదు? ఇప్పుడు ఇన్నేళ్ళ తరవాత ఆయన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినా లాభం ఏముంటుందీ? లోకానికి తెలీదా ఇన్నాళ్ళు ఆయన ఇందిరని కలవలేదనీ? పోనీ ఆవిడకి తెలిదా మా నాన్న పెళ్ళి చేసుకుని తన మానాన తానుంటున్నాడనీ?” నా గొంతు నాకే ఆవేశంగా వినిపించింది.

“అందరికీ అన్నీ తెలుసు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఈవిడ సమస్య తీరాలంటే ఆవిడ్ని ఎక్కడో అక్కడ ఎలాగోలా సెటిల్ చేసే ప్రయత్నం చెయ్యాలి. అయితే ఆ సెటిల్మెంటు ఎటువంటిదనేదే అతి పెద్ద ప్రశ్న.” అన్నది అల.

ఆ ప్రశ్న నా మనసులోనూ ఉంది. అస్పష్టమైన జవాబులూ ఉన్నాయి. కానీ స్పష్టంగా రూపు దిద్దుకోలేదు.

ఫోన్ రింగయింది. అల తీసింది. ఫోన్‌లో “ok ok” అని పెట్టేసి, “ప్రొడక్షన్ మేనేజర్ రాజే, కారు తీసుకుని స్వయంగా వస్తున్నాడు. టైమ్ అయిదయింది కదా?” అన్నది.

“అవును. నువ్వు బయలుదేరాలిగా! ఏర్‌పోర్ట్ దాకా వస్తాను” అన్నాను.

“అబ్బ.. అంతకన్నానా. అది నాకు తప్పకుండా ఓ మధుర జ్ఞాపకం అవుతుంది.” అన్నది నన్ను కౌగిలించుకుని.

కనక చక్కటి ఫిల్టర్ కాఫీ వచ్చింది మా ఇద్దరికీ, సేఫ్టీకి సాయంత్రం అల నాకోసం చేసిన పులిహోర, పెరుగన్నం ప్యాక్ చేసి పెట్టాను. అఫ్‌కోర్స్ దానికీ ప్యాక్ చేశాను.

“నువ్వు నీలా ఆలోచించు మహీ. అప్‌కోర్స్ నాకు తెలుసు.. ఏ డాక్టరు తనకి తాను ఇంజక్షన్ ఇచ్చుకోలేడు. కానీ తప్పదు. ఎంత బాధాకరమైనదైనా మనం నిష్పక్షపాతంగా స్థిర బుద్ధితో ఆలోచించాలి. నీ మీద నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది” అన్నది లేచి.

అయిదు నిముషాల్లోనే నేనూ తయరయ్యాను.

“గాడ్.. నువ్వేనా?” షాక్ తిన్నది అల.

నేను నిజంగా నవ్వేశాను. కారణం జీవితంలో ఫస్ట్ టైం జీన్స్ పేంట్, వైట్ షర్టూ వేసుకున్నాను. ఆ డ్రస్సు అలది.

“ఓహ్.. లవ్లీగా ఉన్నావ్ మహీ.. సూపర్” గట్టిగా కావలించి అన్నది.

“లేదే.. నీ దుస్తుల్లోకి మారినట్టుగానే, నీ మనసులోంచి ఈ సమస్యని ఆలోచిస్తా. అప్పుడే నిష్పక్షపాతంగా ఆలోచించగలను. మంచి మాట చెప్పావు. ఇప్పటిదాకా నేను కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆలోచిస్తూ, కొంత పక్కకి జరిగినమాట నిజం. ఇప్పుడు.. ఓహ్.. కమాన్.. లెట్స్ గెట్ గోయింగ్” అన్నాను, కింద నించి కారు హారన్ శబ్దం విని.

ఉత్సాహంగా ఇద్దరం కిందికి వెళ్ళాం. హీరోయిన్ కోసం పంపిన కాస్ట్లీ కార్ కదా! రోడ్డు మీద మెత్తగా జారిపోతోంది.. అల నా ఫ్రెండే.. రియల్లీ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనుకోగానే మనసు ఉప్పొంగింది. జస్ట్ దాన్ని హగ్ చేసుకుని అన్నాను “లవ్ యూ మై డియర్ బెస్ట్ ప్రెండ్” అని. దాని మనసంతా దాని చిరునవ్వులోనే చూశాను.

(ఇంకా ఉంది)

Exit mobile version