మహతి-64

8
1

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అమ్మ గురించి తలచుకుంటూ, అమ్మ నవ్వడం మరిచిపోయిందని, నిర్లిప్తంగా మారిపోయిందని అనుకుంటుంది మహతి. ఇందిరని డిశ్చార్జ్ చేస్తాననీ, కానీ ఆవిడ ఆరోగ్యం బాగయ్యేంత వరకూ ఎవరో ఒకరు సంరక్షకులు వెంట ఉండాలనీ చెప్తారు డాక్టర్. తమ ఇంట్లో ఉంచుకుంటానని కల్యాణి అంటే ఇందిర ఒప్పుకోదు. తమ ఇంటికి ఆవిడని తీసుకువెళ్ళలేనని అనుకుంటుంది మహతి. అయితే తనతో పాటు కర్రావూరి ఉప్పలపాడు తీసుకెళ్ళాలని అనుకుంటుంది. తన నిర్ణయాన్ని తండ్రికి చెప్పి ఒప్పిస్తుంది. అక్కడ డా. శ్రీధర్, డా. శ్యామల ఉన్నారని, అవసరమైతే వాళ్ళు సాయం చేస్తారని అంటుంది. అమ్మకి ముందుగా చెప్పవద్దనీ, అన్ని విషయాలూ తాను చూసుకుంటాననీ అంటుంది మహతి. తన నిర్ణయాన్ని ఇందిరకి చెప్పి ఆమెను ఒప్పిస్తుంది. అలకి ఇచ్చిన కారు తీసుకుని వెళ్ళమంటుంది కల్యాణి. డ్రైవర్‍ని పిలిపిస్తుంది. ఇందిర ఇచ్చిన డబ్బు నుంచి బిల్స్ అన్నీ కట్టేసి, గబగబా డిశ్చార్జ్ చేయిస్తుంది మహతి. ముందు తమ ఇంటికి వెళ్దామంటుంది ఇందిర. సరేనంటారు. గౌతమ్ రానంటే, ఇందిర బతిమాలి లోపలికి రప్పిస్తుంది. అన్ని గదులతో బాటు గౌతమ్ గదిని చూస్తారు కల్యాణి, మహతి. ఆ గదిలో అన్ని అత్యంత శుభ్రంగా ఉంటాయి. టేబుల్ మీద గౌతమ్, ఇందిర చిన్నప్పటి ఫోటోలు, గోడ మీద గౌతమ్ తల్లిదండ్రుల ఫోటోలు గోడలకి ఉంటాయి. అక్కడి వన్నీ చూస్తే నాన్న కట్టుబట్టలతో ఆ ఇంట్లోంచి బయటకొచ్చాడని మహతికి అర్థమవుతుంది. ఇంటి నిర్మాణం గురించి కల్యాణి మెచ్చుకుంటే, ఆ విజన్ గౌతమ్ తల్లిదండ్రులదనీ, ఆమె నాన్న గౌతమ్‍కి ద్రోహం చేసి ఆస్తి కొట్టేసాడని చెబుతుంది ఇందిర. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-11

అల:

[dropcap]షూ[/dropcap]టింగ్ శరవేగంతో నడుస్తోంది. తెలుగులో లేని కామెడీ సీన్స్‌ని హిందీలో చొప్పించడంతో కథ చాలా స్పైసీగా తయారయింది. ఒకటి మాత్రం నిజం, అది సౌత్ అయినా, నార్త్ అయినా సినిమా పరిశ్రమకి చెందిన వారు మాత్రం 100% తమ శక్తినంతా సినిమా కోసం వెచ్చిస్తారు. సోమరిపోతులకీ, ‘రేపు చేద్దాం’ అని వాయిదా వేసే వాళ్ళకీ ఇక్కడ చోటు దక్కదు. దక్కినా ఎక్కువ కాలం నిలుపుకోలేరు.

టేకింగ్‌లో మాత్రం సౌత్ చాలా ఫాస్ట్. నార్త్ అలా కాదు. ఘాటింగ్ స్లో అయినా, పర్‌ఫెక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకోక తప్పదు. ఓ హిందీ సినిమా భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో ఆడుతుంది. మరి ప్రాంతీయ సినిమా? ఎక్కడికక్కడే. మనవాళ్ళు అంటే తెలుగు వాళ్ళు చాలా గ్రేట్. తమిళ, కన్నడ, మళయాళ సినిమాల్ని కూడా అనువాదం చేసుకుని సూపర్ హిట్ చేస్తారు. చిత్రం ఏమంటే, మన సినిమాల్ని తమిళులు అక్కున చేర్చుకోరు. ‘శంకరాభరణం’ వంటి సినిమాలు ఎక్సెప్షన్. మన సుప్రీమ్, సూపర్ స్టార్లు, తమిళనాడు కలెక్షన్స్‌లో ఎప్పుడూ ముందుండరు. కారణం వాళ్ళ హీరోల్ని తప్ప అరవవాళ్ళు ఇతరుల్ని యాక్సెప్ట్ చెయ్యరు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లని కూడా. మన టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని వీళ్ళు ఎన్నడూ ఉపయోగించరు. అతి కొత్త వాళ్ళైనా వీళ్ళని మనవాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. డైరెక్షన్ డిపార్టుమెంటు పరిస్థితి అదే. ఇక్కడి సాంబార్ సాదం డైరెక్టర్లు కూడా మన దగ్గర ఫైవ్ స్టార్ పోజులు కొడతారు. ఆ లెవల్ లోనే రెమ్యూనరేషన్ గుంజుతారు. పరభాషా బానిసత్వం మనకి ఇప్పటిది కాదు.

ఇదంతా ఎందుకంటే, ఇక్కడి, అక్కడి వర్కింగ్ స్టైల్‌ని చూస్తూన్నాను గనక. ఇతర భాషల్లో చెయ్యలేదు గనక నాకున్నది వినికిడి జ్ఞానమే!

ఒకటి మాత్రం నిజం. నాలో చెప్పలేని మార్పులు వస్తున్నై. ఆ మార్పు ఎటువంటిదంటే, మన భాష, మన సంస్కృతి ఔన్నత్యాన్ని ఇప్పుడు స్పష్టంగా గుర్తించగలుగుతున్నా. మన పద్ధతులు, మన జీవన విధానం, ఎవర్నయినా నిస్సంశయంగా అక్కున చేర్చుకోగలిగిన గుణం నన్ను ముగ్ధురాలిని చేశాయి. తెలుగు జాతి మీద, తెలుగు భాష మీద మక్కువ పెరిగింది. దానికో కారణం సరోజ్.

సరోజ్ డాన్సర్‌గా వచ్చింది. ఆ పిల్ల ఎంత చక్కగా ఉర్దూ, హిందీ, పంజాబీ మాట్లాడిందంటే ఆమె నార్త్ ఇండియన్ అని నూటికి నూరు పాళ్ళూ నమ్మేశాను. ఒక రోజు ఎవరూ చుట్టూ పక్కన లేనప్పుడు చెప్పింది, తను తెలుగుదాన్నని, ఊరు గుంటూరు దగ్గరనీ.

“ఇన్ని భాషలు ఎలా నేర్చుకున్నావు?” ఆశ్చర్యంతో అడిగాను.

“పదమూడేళ్ళ వయసులోనే ప్రేమ పిచ్చిలో బాంబే వచ్చా. వాడు జంప్ అయిపోయాడు. ఎన్ని ఇళ్ళల్లో పనిమనిషిగా, ఆయాగా పని చేశానో నాకే తెలుసు. లక్కీగా ఓ డాన్సర్ నన్ను వాళ్ళ డాన్స్ మాస్టర్‍కి పరిచయం చేసింది. బస్.. సాధన.. సాధన.. సాధన.. ఏ భాష వారింట్లో పని కుదిరితే ఆ భాష నేర్చుకునే దాన్ని. ఆ తరువాత నాకో విషయం తెలిసింది. భాషలు ఎన్నున్నా భావాలు అవేగా! సంతోషం, దుఃఖం, ఆనందం, ఆలోచన, విరహం ఇవన్నీ భావాలుగా ఒకటే. భాషలే వేరు. అప్పుడు జాగ్రత్తగా గమనించాక భాషలు నేర్వడం సులువైంది. మారాఠీ, గుజరాతీ, తమిళం కూడా నేను ప్లూయంట్‌గా మాట్లాడగలను” అన్నది.

అప్పటి నుంచీ నేను భాష మీద మరింత శ్రద్ధ పెట్టాను. తప్పలు తప్పులుగా అయినా తోటి వాళ్ళతో హిందీలోనే మాట్లాడటం మొదలెట్టాను.

కమల్‌జీత్ ఆ విషయంలో నా శ్రద్ధని మెచ్చుకుని నాకు చాలా సహాయం చేశారు. ముఖ్యంగా పాటలు అర్థాన్ని వివరించే వారు. ఆ పాటలు ‘ధీర’ హిందీవే. అర్థం తెలిశాక మరింత చక్కగా భావాన్ని పలికించే స్థితికి చేరుకున్నాను. సంగీతంలో, అంటే స్వరాలతో కూడుకున్న ‘మాటే’ గా పాటగా మార్పు చెందేదీ!

వినోద్ కూడా నా గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. టాప్ లెవల్ హీరో గనక మిగతా వాళ్ళు నాతో అతి జాగ్రత్తగా అతి మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. నేనూ అందరితో కలిసి మెలిసి ఉంటున్నాను.

తెలుగులో సర్రీ వేసిన పాత్రకి అంటే సెకెండ్ హీరోయిన్ పాత్రకి నైనా మెహతాని తీసుకున్నారు. నైనా చాలా మంచి నటి. డిగ్రీ హోల్టర్. పొలిటికల్ సైన్స్‌లో B.A. చేసింది. ఇంగ్లీషు, పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ మిగతా సబ్జక్టులు. ఇంగ్లీషులో మహా ఫ్లూయెంట్. ఆమెని చూశాక నాకనిపించింది. ఏమైనా సరే ఇంగ్లీషు అంతు చూడాలని. 56 అక్షరాల తెలుగు భాష ముందు 26 అక్షరాల ఇంగ్లీషెంత అని నాకు నేనే జబ్బ చరుచుకున్నాను.

జీవితంలో ఎవరూ పర్మెనెంట్ గురువులు వుండరు. ‘గురువు’ అంటే ఓ మహా చైతన్యం. ఆ గురువు ఎన్నో రూపాల మనకి లభిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చి ఎన్నెన్నో నేర్చుకోవడానికి పునాది అవుతారు. నైనా అలా నా ఇంగ్లీష్ లెర్నింగ్‌కి గురువైంది. నేను తనకి తెలుగు నేర్పుతానని ప్రామిస్ చేశాను. కాని తను నాకు ఇంగ్లీష్ నేర్పడానికి ఒప్పుకుంది గానీ, తెలుగు మీద ఇంట్రెస్టు చూపించలేదు.

తెలుగులో నా మదర్ వేసింది చిత్రాణి. హిందీలో నా మదర్‌గా నందినీ సోల్గాంకర్‌ని తీసుకున్నారు. సినిమాల్లో రాకముందే ఆవిడ గొప్ప మరాఠీ నటిగా స్టేజ్ మీద పేరు తెచ్చుకుంది.

మన చుట్టూ ప్రపంచం విస్తరిస్తున్న కొద్దీ పరిచయస్థులు ఎక్కువైపోతారు. లోకోభిన్నరుచిః అనే దానికి అర్థం తెలుస్తుంది. సహనం పెరుగుతుంది. అందరితో మనం ఎలా మెలగాలో అనే అవగాహన పెరుగుతుంది.

ఇవన్నీ ఎప్పటికప్పుడు మహీకి చెప్పాలని అనుకుంటాను. కానీ ఫోన్ చెయ్యడం లేదు. షూటింగ్ ముమ్మరంగా జరుగుతూ ఉండటం, ఓ పక్క డాన్స్ రిహార్సల్స్, ఇంకో పక్క ఇంగ్లీషు, వీటితో సమయం చిక్కడం లేదు. కానీ ఎన్నో సార్లు తనని గుర్తు చేసుకుంటూనే ఉంటున్నాను.

“అలా.. ఇందిరగారు మా వూరు రావడానికి ఒప్పుకున్నారు. ఆ తరువాత చాలా చాలా విషయాలు నీకు చెప్పాలని ఉంది. కానీ నువ్వు నీ వర్క్‌లో పూర్తిగా మునిగిపోయి వుంటావని నా మనసుకి తెలుస్తోంది. ఎంజాయ్ యువర్ వర్క్. ఇక్కడంతా బాగానే ఉంది. ఇక్కడి విషయాలు తలుచుకుని వర్రీ కాకు. సరేనా!.. ఉండనా మరి నీ – మహీ.” అంటూ ఉత్తరం రాసింది మహతి. ఇవ్వేళే ఆ ఉత్తరం అందుకున్న మనసు శాంతపడింది. ఒకప్పుడు నాకు డాన్స్ అంటే పరమ చికాకు. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అదో గొప్ప వ్యాయమం అని అర్థమైంది. డాన్స్ ప్రాక్టీస్ తరవాత శరీరం చాలా తేలిగ్గా నాజుగ్గా తయారవడం నేను స్పష్టంగా గమనించాను.

మా మాస్టర్ డాన్స్‌కి ముందు స్కిప్పింగ్ చేయుస్తున్నారు. అది ఎంత విలువైనదో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ఒక్క స్కిప్పింగ్ చాలు.. వంద జిమ్ ఎక్సర్‌సైజుల కంటే!

“నడిచిపో నేస్తం నడిచిపో

నీడ దొరకే వరకూ

జాడ చెదిరే వరకూ

ఇంకాస్త దూరం నడచిపో

రానివ్వకు నీ వెనకన ఎవ్వరినీ

యాచించకు నీ కోసం ఎవ్వరినీ

ప్రేమించకు పోరబాటున ఎవ్వరినీ

నిలుపుకోకు నీ మనసున ఎవ్వరినీ

హృదయాకాశంలో

మేఘం లేదు

జీవితపు ఎడారిలో

చెట్టు లేదు

ఆశకి అంతూ లేదు

అంతానికి గమ్యమూ లేదు

ఇంకాస్త వేగం పెంచుకో

ఇంకాస్త దూరం నడిచిపో

ఆలోచనల మేఘాల్ని సృష్టించు

ఆశల విత్తనాలని పుట్టించు

అధైర్యాన్ని విడిచిపెట్టు

నీలోకి నువ్వు అడుగుపెట్టు!!”

ఓ కవిత కాని కవితని వ్రాశాను. కారణం నూర్జహాన్. ఆవిడ చనిపోతూ మిత్రులతో, బంధువులతో అన్నదిట “నా సమాధి దగ్గర నా గుర్తుగా మొక్కలు నాటకండి” అని.

“ఎందుకూ?” అని వారడిగితే –

“కోయిలలు వస్తాయి. అవి కూసేప్పుడు వాటి కళ్ళల్లోంచి కన్నీటి చుక్కలు నేలకి జాలువారతాయి. అది నేను భరించలేను” అని చెప్పిందట. ఎంత సున్నిత మనస్కురాలో అనిపించింది.

అందానికీ సున్నితత్వానికీ సంబంధం ఉందా? ఉంటే ఇందిర చాలా చాలా అందగత్తె కదా. మరి ఆమెలో ఆ కాఠిన్యం ఏమిటి? అని అనిపించింది. మనసుని నిగ్రహించుకుని ఓ కప్పు గురువెచ్చెని పాలు తాగి ప్రశాంతంగా పడుకున్నాను.

“కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయేవేళ

కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళా

వెన్నెలా వెన్నెలా చల్లగా రావే..

పూవుల తేనెలే తేవే..”

అంటూ వెన్నెలని ఆహ్వానించాను.

***

మహతి:

నిష్కర్షగా, నిర్మోహమాటంగా నిగర్వంగా ఇందిరగారు చెప్పిన మాటలు నన్నే కాదు, కల్యాణి గారినీ షాక్‌కు గురిచేశాయి. ‘మా నాన్న నమ్మక ద్రోహం చేసి మీ ఆస్తి కొల్లగొట్టాడ’నటంలో ఆవిడకి తండ్రి మీద మాత్రం గౌరవం లేదనీ, ఆమె అన్యాయాన్ని సహించదని కూడా అర్థమైంది.

“మరి మీరు అప్పుడే ఎందుకు ప్రతిఘటించలేదు?” అనూహ్యంగా ప్రశ్నించారు కల్యాణిగారు.

“ప్రతి బిడ్డా తన తల్లిదండ్రుల్నే గుడ్డిగా నమ్ముతుంది. నేనూ అదే చేశాను” నిర్లిప్తంగా ఆగింది ఎందుకో.

“పోనీ తరువాత గౌతమ్ గారిని పిలిచి..” మధ్యలో ఆగింది కల్యాణిగారు.

లేచి కూర్చుని కల్యాణి వంకా, నావంకా మా నాన్న వంకా చూసింది ఇందిర. ఆమె కళ్ళల్లో ఏ భావమూ లేదు. మా నాన్న తల కొంచెం వాలి ఉంది.

“పిలవలేదని ఎలా అనుకుంటారు కల్యాణీ? అది గతం. ఇప్పుడు ఎవర్నీ బయటకి లాగి నిందించను. గాలిపటం తెలుసా? పటం ఎక్కడో గాలిలో విహరిస్తుంటుంది. దారం మాత్రమే మన చేతులో ఉంటుంది. దాన్ని మనమే ఎత్తుకి పైపైకి ఎగరేస్తున్నామని భ్రమపడతాం. కానీ నిజంగా దాన్ని ఎగరేసేదీ మనం కాదు. గాలి! నూటికి మూడొంతులు దూరంలో కొంత భాగం తప్ప గాలిపటం కూడా మన చేతికందదు. అలాగే, మనిషి ఆశలు కూడా గాలిపటాలే! దారం మిగుల్తుంది.. పటం ఎక్కడో వాలిపోతుంది” మళ్ళీ మెల్లగా సోఫాలో వాలింది ఇందిర. ఆ కాస్త మాట్లాడిన దానికే ఆవిడకి అలసట వచ్చిందని స్పష్టంగా తెలిసింది మాకు.

“సారీ ఇందిరా.. ” బాధగా అన్నారు కల్యాణి.

“బయలుదేరాలి. బయలుదేరక తప్పదు!” కళ్ళు విప్పి అని నా వంక చూసి అతి చిన్నగా నవ్వి అన్నది ఇందిర.

***

నారాయణ (ముసలాయన) భార్య సావిత్రి వంట బాగానే చేసింది. అంతా తెలంగాణా పద్ధతిలో చేసినా, టేస్టు చాలా బాగుంది. అందరం భోజనం చేసేటప్పటికి టైము 4 అయింది. వాళ్ళద్దరికీ రెండు వంద కట్టలు ఇచ్చి “నేను తిరిగి వచ్చే వరకూ నీటుగా చూసుకోండి. మళ్ళీ మీకు డబ్బు కావల్సి వస్తే కంగారు పడవద్దు. టైముకి మీకందే ఏర్పాటు చేస్తాను. ఇంకో విషయం – వీళ్ళంతా నా వాళ్ళు. అర్థమయిందా?” అన్నది.

వాళ్ళు తలూపారు. వాళ్ళ ముఖంలో బాధ.

“బాధెందుకూ.. అక్కడ ఇద్దరు డాక్టర్లున్నారు. త్వరలోనే వస్తాను” అన్నది.

అంటే ఎదుటి వారి మనసులోని భావాల్ని ఆవిడ స్పష్టంగా గుర్తించగలదనీ నాకు తెలిసింది.

“అమ్మా, చపాతీలు కూరా, పెరుగన్నం రాత్రికి కూడా సరిపోయేట్లు కేరేజీలో పెట్టి ఉంచానమ్మా. బయట తినొద్దు” సావిత్రి ప్రేమతో అన్నది. ఇందిర మెల్లగా తల వూపి కార్లో కూర్చుంది. కళ్ళు మూసుకుంది. మళ్ళీ వెనక్కి తిరగలేదు.

నాన్న డ్రైవర్ పక్కన ముందు సీట్లో కూర్చున్నారు. ఇందిర, నేను, కల్యాణిగారు వెనక కూర్చున్నాం. అలకి ప్రత్యేకించిన కారు హస్పటల్ నించీ మమ్మల్ని ఫాలో అవుతూనే ఉంది.

“ఓహ్.. కనక కూడా ఏదో food పంపించదనుకుంటా” అన్నాను. నిజంగా ఆ సంభాషణ నాకు గుర్తు లేదు.

“ఊర్లో వాళ్ళకి చెప్పలేదు గనక ఆ ఫుడ్ కూడా వేస్ట్ కాదు” అన్నారు కల్యాణి. దోవలో కల్యాణి గారింటి దగ్గర కారు ఆగింది. నేను ముందర కిందకి దిగాను.

“ఇందిరా.. ఓపిక ఉందా మా ఇంట్లో కేసేపు గడపడానికి?” ప్రేమగా అడిగారు కల్యాణి.

“లేదమ్మా.. నిజంగా ఓపిక లేదు. భగవంతుడు నిర్ణయిస్తే తప్పక ఏదో నాడు వస్తాను. ప్రస్తుతానికి క్షమించండి” అన్నది ఇందిర.

కల్యాణి దగ్గర ఓ కౌగిలితో వీడ్కోలు తీసుకుని అల కార్లోకి మేము ముగ్గరమూ మారాము. కారు బయలుదేరే వరకు కల్యాణి మమ్మల్ని చూస్తూనే ఉన్నారు, గేటు దగ్గర నిలబడి.

***

మెత్తగా కారు సాగుతోంది. కనీసం ఆరు గంటల జర్నీ. మా ఊరికి చేరేసరికి రాత్రి 11 గంటలు అవుతుంది. ఇంత ప్రయాణాన్ని ఇందిర తట్టుకోగలదా? అసలు నేనేమైనా ఆవిడని తొందరపెట్టి బయల్దేరదీశానా? అసలు నా నిర్ణయం సరైనదేనా? ఇవన్నీ ప్రశ్నలు. కానీ, జవాబులకి వెతకాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన పెళ్ళికి బాజాలెందుకన్నట్లు, బయలుదేరాను. ప్రశ్నలెందుకూ?

“మహీ..” అన్నది ఇందిర. వెనక సీట్లో మేమిద్దరమే ఉన్నాం.

“చెప్పండి ఆంటీ!” అన్నాను.

“చెప్పింది చెయ్యగలవా?” అన్నది నీరసంగా.

“తప్పక చేస్తాను” అన్నాను దృఢంగా.

“మీ నాన్నని వెనక కూర్చోబెట్టి నువ్వు ముందు సీట్లో కూర్చో” అన్నది. ఆ గొంతులో ఒకరకమైన బేలతనం. నీరసం.

నేను నిర్ఘాంతపోయాను.

“నాకు తెలుసు. నువ్వు షాకవుతావని. కాస్సేపు నేను పరాయిదాన్ననీ, ఆయన నీకు తండ్రి అని మరిచిపో. సమయం గడిచిపోతోంది మహతీ. కారు ఆపి..” ఆగింది ఇందిర. డ్రైవర్‍ని కారు ఆపి నేను దిగి, నాన్న కూర్చున్న లెఫ్ట్ సైడ్ డోర్ తీసి, “నాన్నా ఓ సారి కిందికిరా” అన్నాను.

“ఏంటమ్మా?” అన్నారు. నేను నోరు మూసేశాను.

“ఎందుకూ ఏమిటీ అని అడగొద్దు. దయచేసి మీరు వెనక సీట్లో కూర్చుంటే.. ప్లీజ్” అన్నాను.

నాన్న ఏదో మాట్లాడబోతుంటే “ప్లీజ్ నాన్నా” అన్నాను.

ఆయన నా ముఖం వంక చూసి మాట్లాడకుండా వెనక సీట్లోకి వెళ్ళారు. నేను ఫ్రంట్ సీట్లో కూర్చుని డోర్ వేసేసి “పద భయ్యా” అన్నాను డ్రైవర్‍తో. ఆ డ్రైవర్ తెలిసినవాడేగా.

కారు చీకటిని చీల్చుకుని ముందరి కెళ్తోంది. ఎదురు వచ్చే వాహనాల వెలుగులో మాత్రమే కారు లోపల చీకటి దూరమై కొంత కనబడుతోంది. మిర్రర్ లోనించి వెనక వైపుకి చూస్తే, నాన్న తొడమీద ఇందిర తల పెట్టుకుని పడుకుని ఉంది. నాన్న చెయ్యి ఇందిర తలని నిమురుతోంది.

మౌనం అగ్ని పర్వతంలా పేలింది. ‘గాడ్’ అనుకుని కళ్ళు మూసుకున్నాను. నా కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీరు, నేను చూస్తున్నది నాన్ననీ, ఇందిరనే కాదు. చిన్నప్పుడెప్పుడో తప్పిపోయి మళ్ళీ ఇన్నాళ్ళకి కలిసిన పిల్లల్ని. ఒక్కక్షణం మా అమ్మ నా మనసులో మెదిలి మాయమైంది.

అవును ఇందిర అన్నట్లు ‘సమయం గడిచిపోతోంది’. మళ్ళీ యీ ఏకాంతం వారికి జన్మలో దొరకదు. పది నిముషాల తర్వాత డ్రైవర్‍ని ఓ రోడ్డు పక్క హోటల్ దగ్గర కారు ఆపమన్నాను.

“భయ్యా.. నాకు టీ కావాలి. నువ్వూ రా టీ తాగుదాం” అని అతన్నీ తీసుకుని హోటల్ వైపుకి వెళ్ళిబోతూ..

“నాన్నగారూ టీ కావాలా?” అన్నాను.

“వద్దు” అన్నారు నాన్న. ఆ గొంతులో జీర.

“సరే.” నేను డ్రైవరు రోడ్డు పక్క హోటల్‌కి వెళ్ళాం.

“రెండు టీ. బాగా స్ట్రాంగ్‌గా, వేడిగా కావాలి. తొందరేమీ లేదు. ఫ్రెష్‌గా చెయ్యండి” అన్నాను. ఓ సీట్లో కూర్చుని డ్రైవర్‍ని కూర్చోమంటూ.

‘అలాగే’ అన్నట్టు తలడించాడు బడ్డీ కొట్టు వాడు. ఓ క్షణం గట్టిగా గాలి పీల్చుకుని వదిలి స్థిరంగా కూర్చున్నాను. వీలున్నంత ఎక్కువ సేపు బడ్డీ కొట్లో గడపాలి. ఇదేనా ఉద్దేశం. ఆ క్షణంలో నా మనసులో మెరిసింది మా అమ్మ కాదు, నిస్సహయంగా మొండిగా మోడుగా బ్రతుకున్న ఇందిర.

***

మా అమ్మమ్మ చెప్పేది “మహీ.. ఎవరికి భోజనం వడ్డించినా నువ్వు చూడాల్సింది వాళ్ళ పొట్టనీ, ఆకల్నీ; మోహాన్ని, అందాన్నీ కాదు. ఆకలి సర్వజీవుల లక్షణం. ఆకలి రాక్షసి చెలరేగుతుంటే, ఆ మంటని లోకంలో ఏ నీరూ ఆర్పలేదు. చీమ నించీ ఏనుగు దాకా యీ ఆకలి రాక్షసి బారిన పడని జీవి లేదు. అన్నీ ఆకలిని కొద్దోగొప్పో ఆపుకోగలవు. మనిషి మాత్రం అస్సలు తట్టుకోలేడు. ఆకలితో అలమటిస్తున్న మనిషిని అడుగు – నీకో కోటి రూపాయలు కావాలా ఓ ముద్ద అన్నం కావాలా? అని వాడు గర్భదరిద్రుడైనా అన్నమే కావాలంటాడు గానీ కోటి రూపాయలు కాదు. అందుకే వడ్డించేటప్పుడు శ్రద్ధగా వడ్డించు. ప్రేమగా వడ్డించు. స్వపర భేదాన్ని దూరం పెట్టి వడ్డించు” అన్న మాటలు గుర్తొచ్చాయి.

టీ తాగటం పూర్తయింది. అదీ అతి మెల్లగా.

“వేడిగా ఇడ్లీలు వెయ్యగలవా?” అడిగాను బడ్డీకొట్టువాడ్ని.

“ఆ.. అయితే టైం పడుతుందమ్మా” అన్నాడు.

“ఎంత టైం?” అడిగాను.

“పావుగంటో ఇరవై నిముషాలో” అన్నాడు.

“వెయ్యండి. మంచి చట్నీ కూడా కావాలి” అన్నాను.

“అలాగే.. ఎన్ని వెయ్యమంటారు?” అడిగాడు.

“ఒక వాయికి ఎన్ని వస్తై?” అడిగాను.

“16” అన్నాడు.

“సరే. వెయ్యిండి” అన్నాను.

“భోజనాలు ఉన్నైకదమ్మా?” అన్నాడు డ్రైవరు.

“అవును. దారిలో ఆ కేరేజీలు విప్పి, వడ్డించుకోవడం కోసమైనా వెలుతురు ఉండే చోట ఆగాలి. ఇడ్లీలైతే నాలుగు పేకెట్లుగా కట్టించుకుని ఎవరి పేకట్లు వాళ్ళు తిని బయటపడెయచ్చు” అన్నాను.

“మంచి ఆలోచన” అన్నాడు డ్రైవర్.

మేం ఇడ్లీలు పేకెట్లుగా కట్టంచుకుని బయల్దేరే వరకు సమయం 35 నిముషాలు పట్టింది.

“లోపల ఇందిర గారికి ఒంట్లో బాగోలేదు. తెలుసు గదా! మెల్లిగా, జర్కులు లేకుండా కారుని పోనివ్వండి. తొందరేం లేదు. కుదుపులు లేకుండా చూడండి భయ్యా.” అన్నాను.

“అలాగే నమ్మా. ఆయమ్మ చాలా నీరసంగా ఉంది. నాకు ఇందాకే భయం వేసింది. ప్రయాణం చెయ్యగలదో లేదో” అని అన్నాడు.

“ఏం ఫరవాలేదు భయ్యా. ప్రశాంతంగా నడపండి. ఎక్కడ టీ తాగాలన్నా, సిగరెట్టు తాగాలన్న అక్కడ చక్కగా ఆపండి” అన్నాను.

ఇందాక టీ తాగాక అతని బయటకి వెళ్ళి సిగరెట్టు తాగటం గమనించాను.

“అలాగేనమ్మా” అన్నాడు డ్రైవర్ సీట్లో కూర్చుని. రెండు పేకెట్లు వెనక్కి ఇచ్చి –

“నాన్నా వేడి వేడి ఇడ్లీలు. తినాలనుకున్నప్పుడు చెప్పండి.. కారు ఆపుతా” అన్నాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here