మహతి-65

8
1

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[అల హిందీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతూంటుంది. తెలుగులో లేని కామెడీ సీన్స్ జోడిస్తారు. టేకింగ్ లోని తేడాలను ప్రస్తావిస్తుంది అల. డాన్సర్‍గా వచ్చిన సరోజ్‍ని చూసి ఆశ్చర్యపోతుంది అల. ఆమె ఎంతో చక్కగా ఉర్దూ, హిందీ, పంజాబీ మాట్లాడితే, నార్త్ ఇండియన్ అని భావిస్తుంది అల. కానీ ఓ రోజు ఎవరూ లేని సమయంలో తాను తెలుగమ్మాయినేనని అలకి చెప్తుంది సరోజ్. తన కథని వినిపిస్తుంది. ఆమె నుంచి స్ఫూర్తి పొందిన అల భాష మీద మరింత శ్రద్ధ పెడుతుంది. తల్లి పాత్ర వేస్తున్న నందినీ, అక్క పాత్ర వేస్తున్న నైనా – అలని ఎంతగానో ఆకట్టుకుంటారు తమ వ్యక్తిత్వంతో. ఇక్కడ హైదరాబాద్‍లో ఇందిర గారింట్లో ఆవిడకీ, కల్యాణికి – ఇందిర గారి తల్లిదండ్రుల విషయంలో సంభాషణ జరుగుతుంది. తన ఇంట్లో పనిచేస్తున్న నారాయణకి, సావిత్రికి సూచనలిస్తుంది ఇందిర. వాళ్ళకి కొంత డబ్బిచ్చి, త్వరలో తిరిగొస్తానని చెప్తుంది. అందరూ కార్లలో బయల్దేరుతారు. కల్యాణి తన ఇంటి వద్ద ఆగిపోతుంది. మహతి, గౌతమ్, ఇందిరల కారు విజయవాడ వైపు సాగుతుంది. కొంత దూరం ప్రయాణించాకా, వెనుక సీట్లో తన పక్కన కూర్చున్న మహతిని ముందు డ్రైవర్ పక్కన కూర్చోమని, గౌతమ్‍ని వెనక సీట్‍లోకి పంపమని అడుగుతుంది ఇందిర. ఆమె చెప్పిన ప్రకారమే తండ్రికి చెప్పి, సీటు మారుతుంది మహతి. ఒక చోట టీ కోసం ఆపుతుంది. డ్రైవర్, మహతి దిగి టీ కొట్టు లోకి వెళ్తారు. ఫ్రెష్‌గా టీ పెట్టించుకుని తాగుతారు. వేడిగా ఇడ్లీలు వేయగలవా అని కొట్టతన్ని అడిగితే, వేస్తానంటాడు. ఒక వాయ వేసివ్వమంటుంది. భోజనాలున్నాయి కదమ్మా అని డ్రైవర్ అంటే, దారిలో ఆ కేరేజీలు విప్పి, వడ్డించుకోవడం కోసమైనా వెలుతురు ఉండే చోట ఆగాలి. ఇడ్లీలైతే నాలుగు పేకెట్లుగా కట్టించుకుని ఎవరి పేకట్లు వాళ్ళు తిని బయటపడెయచ్చని అంటుంది మహతి. ప్రయాణం కొనసాగుతుంది. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-12

అల:

ఓ పక్క అయిపోతుందనే సంతోషం. మరో పక్క ఎప్పుటికప్పుడు స్క్రిప్టు మారుస్తున్నందుకు అలజడి.. మనసు ఉయ్యాలయింది. కామెడీ బాగా చేస్తున్నందుకు కొన్ని కామెడీ సీన్లు ఎక్‌స్ట్రాగా వ్రాయించారు గదా! అలాగే హాలీవుడ్ కాస్టూమర్ క్లారా డేనియల్‍తో పాటు ఫైటర్ ‘నికో సిమ్సన్’ ని కూడా పిలిపించారు. తెలుగు ‘ధీర’ పూర్తిగా హీరోయిన్ ఓరియంటెడ్ అయితే హిందీలో హీరోకి కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. గొప్ప పేరున్న హీరో కదా! ప్రాధాన్యత ఇవ్వకపోతే జనాలు ఊరుకోరుగా!

నా బాధ ఏంటంటే ‘కథ దారి తప్పుతుందా?’ అని.

అమిత్‍ని అడుగుదామంటే కొంచెం మొహమాటం, ఫస్టు పిక్చర్ లోనే ఆరాలు తీస్తోందా? అని. కానీ ఓ నమ్మకం ఉంది.. వినోద్ కేర్ తీసుకుంటున్నాడని!

కమల్‌జీత్ సింగ్ గారి ఇంటికి వెళ్ళాము నేనూ తరుణీ. వినోద్ ఢిల్లీకి వెళ్ళారు ఎవరో చుట్టాల్ని కలవడానికి. ‘సిర్సా’కి దగ్గర్లోనే ఉంది కమల్‌జీత్ గారి ఊరు. “ఒకప్పుడు హర్యానా, పంజాబ్‌లు కలిసే ఉండేవి. ఇంగ్లీషు వాళ్ళొచ్చి డివైడ్ అండ్ రూల్ (విభజించి పాలించు) పద్ధతి భారతదేశంలో ప్రవేశపెట్టాక దేశం ముక్కలు చెక్కలైంది. నేను బెంగాలీని, నేను మరాఠీనీ, నేను హరియాణావీని, నేను మద్రాసీని అని చెప్పుకుంటున్నాం. కానీ, మనం భారతీయులం అని ఎప్పుడైనా చెప్పుకుంటున్నామా? భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ముందు దేశాభిమానం ఏనాడో తల వొంచింది” కారు నడుపుతూనే అన్నారు కమల్ జీత్. ప్రయాణం హాయిగా సాగుతోంది. దారికి ఇరువైపులా పేద్ద సీసపు చెట్లు. గ్రామీణులంతా తలపాగా తప్పక ధరిస్తారు. స్త్రీలు కనిపించేది మేలిముసుగు తోనే. ఆభరణాలు ఇటు వైపు కంటే అటు వైపు వాడకం ఎక్కువ. మన వైపు వాళ్ళు కంటే, ఉత్తర భారతదేశం వాళ్ళు ‘రంగుల్ని’ ఎక్కువ ఇష్టపడతారు. వారి దుస్తులు రంగురంగులుగా, కళ్ళకి ఇంపుగొలుపుతూ ఉంటాయి.

ఇప్పటికీ, బరువుల్ని లాగేది ఒంటె బళ్ళే. ఒంటె అనే జీవికి పంజాబ్, హరియానా, రాజస్థాన్ లలో ఉన్న విలువా ఆదరణ మరెక్కడా మనం చూడం. ఎప్పుడో ‘తిక్క’ తల కెక్కినప్పుడు తప్ప అది చాలా ఫ్రెండ్లీ యానిమల్. అంటే స్నేహజీవే. కానీ తిక్క ఎప్పుడొస్తుందో మాత్రం దానికి మాత్రమే తెలియాలి.

“మీరు ఢిల్లీకి మారొచ్చుగా?” అన్నది తరుణి, కమల్‌తో.

“పని బాంబేలో కదా!” నవ్వి అన్నాడు కమల్. “కానీ, నేను మా ఆవిడ్ని మా గ్రామంలోనే ఉంచడానికి ఇష్టపడతాను. ఎందుకంటే, ఊరంటే ఆమెకి ప్రాణం” అన్నాడు కమల్.

మధ్యలో ఒక చోట ఆగి ఓ చిన్న కొట్టు దగ్గర టీ తాగాము. అద్భుతంగా ఉంది. పాలల్లో చుక్క నీళ్ళు కలపలేదు గదా, చక్కగా మరిగినందు వల్ల చిక్కదనమూ సువాసనా అద్భుతంగా పెరిగాయి.

“అలా.. ఈ విలేజెస్‌లో ఇడ్లీ దోశ లాంటివి దొరకవు. పూరీ కూడా అడిగితే తప్ప దొరకదు. కుల్చాలు, కబోడీలు, సమెసాలు దొరుకుతై. ఎక్కువగా వాడేది బంగాళదుంప, టమోటా, పచ్చిమిర్చి వగైరా. ఉల్లి చక్రాలో, ముక్కలో ఖచ్చితంగా ఇస్తారు. ‘ఆచార్’ అంటే, ఊరగాయ కూడా. ఆ ఊరగాయలో మీరు వేసినంత నూనె ఉండనే ఉండదు.” మెయిన్ రోడ్ నించి సైడ్ రోడ్ లోకి కారుని పోనిస్తూ అన్నాడు కమల్. రోడ్డుకి అటు ఇటూ ఉన్న చెట్లు బలహీనంగా ఉన్నాయి. లాండ్ కూడా పచ్చదనంతో పరమళించడం లేదు. నిరాశగా, నిస్సత్తువుగా ఉంది.

“ఒకప్పడు ఇదీ ఎడారే. ఈ మాత్రం ఫలవంత చెయ్యడానికి దశాబ్దాలు పట్టింది. గ్రామీణ జనాలు బతుకు ఇప్పటికీ పేదరికంలో కొట్టుమిట్టాడుతూనే ఉంది. మనవాళ్ళు ఏర్‌పోర్టులకీ, పార్టీ పబ్బులకీ పెట్టే ఖర్చులో పదో వంతు పెట్టినా గ్రామాలు ఎంతో బాగుపడి వుండేవి. మీకు తెలుసా, ఈనాటికీ ‘బడి’ లేని గ్రామాలు వేల సంఖ్యలోనే ఉన్నాయి. ప్రభుత్వాలు జనాలకి గ్యాసుబండలూ, సెల్ ఫోనులూ వాడటం ముద్దుగా నేర్పిస్తున్నాయి గానీ, విద్యనీ ఆరోగ్యాన్నీ మాత్రం భయంకరంగా నిర్లక్షిస్తున్నాయి.

ఇక బార్ లకీ, మందు దుకాణాలకీ కొదవే లేదు. ఒకప్పటి తాగుబోతుని చూసి అందరూ అసహ్యంచుకునే వారు. వాణ్ని దూరం పెట్టేవారు. అసలు పిల్లనిచ్చే వాళ్ళు కాదు. ఇవ్వాళ ‘డ్రింక్’ అనేది ‘టీ’కి పర్యాయపదంగా మారింది. సోషల్ డ్రింక్ గా పేరు తెచ్చుకుంది. ‘తాగని వాడు గాడిద’..” నిర్వేదంగా అన్నారు కమల్.

“మీరు చెప్పింది నిజమే. కానీ, కమల్ సాబ్, మా నాన్న కూడా తాగేవాడు. ఆయన రైల్వే ముఠాకూలీగా ఉంటూ మమ్మల్ని, అంటే నలుగురు పిల్లల్ని డిగ్రీ హోల్డర్స్‌గా చేశారు. ఆయన తాగేవారు..! ఎందుకూ? అని నేను అడిగా ఓనాడు. తనతో పాటు నన్ను రైల్వే స్టేషన్‌కి తీసికెళ్ళారు. సామాన్లు మోసే కూలీలు వేరు. మా నాన్న వాళ్ళు మోసేది బస్తాలు. బరువులు. నేను చూస్తేనే ఉన్నా. వంద బస్తాలు వీపు మీద కెత్తుకుని మోశారు. ఒక్కో బస్తా బోలేడు బరువు.

‘అమ్మా.. ఒళ్ళు నలిగి పోతుంది. కాస్త ఓ గుక్క వేసుకుని పడుకుంటే, నిద్ర పట్టి మరుసటి రోజు బరువులు ఎత్తడానికి ఒళ్ళు సిద్ధం అవుతుంది’ అన్నాడు.

ఆయన తాగేది చీప్ లిక్కర్. ఎందుకంటే మాకు చదువు చెప్పించాలంటే, అది తప్ప వేరేది కొనే స్తోమత లేదు కదా! అలాగే, డ్రెయినేజ్ లో దిగగలరా.. కేవలం గోచీతో? కట్టెలు కొట్టే వాళ్ళు, బొగ్గుగనలుల్లో పని చేసేవాళ్ళు, రిక్షా కార్మికలు.. అందరూ తాగురు. కానీ శరీరంలో జవ చేవ తగ్గినప్పుడు కాస్తో కూస్తో తాగుతారు. వాళ్ళు కష్టాన్ని మరిపించే ఏకైక ఔషదం అదే. మందు పార్టీలేని పెళ్ళిని ఊహించుగలమా? వీళ్ళు తాగే సీసాలు వేలల్లో ఉంటే, వాళ్ళు తాగే నాటు సారా ఏదో, రెండు పదులో ఉంటుంది. కమల్ సాబ్, ఒక్క మాట చెప్పనా? ఏదైతే చెడ్డతో దాన్ని దేశం నించి బహిష్కరించాలి.. లేదా నిషేదించాలి. కానీ ప్రభుత్వమే వైను షాపులకీ, బార్లకీ లైసెన్సులు ఇచ్చి కోటానుకోట్లు డబ్బు దండుకుంటోంది. ఇదెక్కడి న్యాయం?” ఆవేశంగా అన్నది తరుణి. నేను అవాక్కయ్యాను.

“అంతే కాదు కమల్ జీ.. రేసులు నడపటం సరైనదా? లక్షలకోట్లు బెట్టింగులు. రేపు ఎవరెస్టు ఎక్కతుందో, కుప్పకూలుతుందో తెలీని షేర్ల బిజినెస్ సరైనదేనా? జాతీయ సంపద అంటే ప్రజలకందరికీ చెందాల్సిన సంపదనీ, ధనబలం, కండబలం, రౌడీ గూండాల దన్ను ఉన్న కొందరు బడాబాబులకి కట్టబెట్టడం న్యాయమేనా? తాగడం మంచిదని నేననను. కొందరికి అది అందుబాటులోకి తెచ్చారు. స్తోమత లేని కొందరికి దాన్ని ఆకాశదీపంగా మార్చారు. ఫలితం కల్తీ సారా!” గుక్క తిప్పుకోవడానికి ఆగింది తరుణి.

కారు ఆపారు కమల్. “తరుణీ నీ అంత లోతుగా నేను ఆలోచించలేదు. ప్రభుత్వాలు లిక్కర్ డబ్బు మీదే చాలా వరకూ నడుస్తున్నదన్నది ముమ్మాటికీ నిజం. ఏమైనా, ఒకదాని తప్పొప్పులు నిర్ణయించే ముందు దాన్ని గురించి, సమూలంగా ఆలోచించి మాట్లాడాలని నీ దగ్గర నేర్చుకున్నాను.. నిజంగా నీకు ధన్యావాదాలు” అన్నారు కమల్ జీత్. ఆయిన గొంతులో నిజమైన వినయం గౌరవం తొణికిసలాడింది.

“సారీ.. ఏదో పిచ్చి వాగుడు వాగాను” సిగ్గు పడింది తరుణి.

“నో.. నో.. నువ్వు మాట్లాడిన ప్రతి పదమూ సత్యమే. ఇవ్వాళ మధ్యానికి కాలేజీ పిల్లలు కూడా అడిక్ట్ అవడానికి కారణం ఎవరూ? ఆ నైతిక బాధ్యాతని ఎవరూ తల కెత్తుకుంటారూ? సిగరెట్లు, ఆల్కహాలూ కేన్సర్ కారకాలనీ సిగరెట్లు పెట్టెల మీదా, మందు సీసాల మీద ముద్రించి చేతులు దులుపుకోవడం సరైన పనేనా? నిజం తరుణీ, నా వాదన వన్ సైడ్‌ది. నీ వాదనలో పరిపక్వత ఉంది” తరుణిని గౌరవంతమైన చూపులతో చూస్తూ అన్నారు కమల్.

ఎదిగిన వారు ఎలా ఒదిగి ఉంటారో ఆనాడు నేను చూశాను.. కమల్ గారి ప్రవర్తనలో. ఎంతో తెలిసినా ఏమీ తెలీనిదానిలా నిగర్విగా ఉండటం తరుణిలో చూశాను. ఎవరంటారూ, సినిమా వాళ్ళకి మిగతా ప్రపంచం పట్టదనీ?

పదిహేను నిమషాల తరువాత కారు ఓ మట్టి మిద్దె దగ్గర ఆగింది. ఇంటి ముందు చక్కగా ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న పెద్ద గౌడు గేదేలూ, ముర్రా జాతి ఆవులూ ఉన్నాయి. గూళ్ళల్లో పావురాలూ ఉన్నై. చక్కని పూల చెట్లు.. రంగు రంగుల పూలు, అత్యంత పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం. కమల్ జీ దిగగానే పావురాళ్ళు పలకరింపులా అరిచాయి.

“ఇదీ.. మా ఇల్లు. మంచి ఇల్లు కడదామనుకున్నా. మా నాన్నగారూ అమ్మాగారూ, నా భార్యా డల్జీత్ కూడా వద్దన్నారు. నిజం చెబితే, ఆ కాంక్రీట్ గూడు కంటే, యీ చక్కని మట్టి మిద్దె చాలా చక్కగా, చల్లగా ఉంటుంది” అన్నారు కమల్.

లోపలికి తీసుకెళ్ళారు. కుంటుతూ ఒకామె ఎదురొచ్చింది. అసాధారణమైన అందం. “ఆమె డల్జీత్ కౌర్.. నా భార్యా.. డల్జీత్.. ఈమె అల. నేను తీస్తున్న సినిమాలో హీరోయిన్. ఆవిడ తరుణీ.. All in one” అని ఆమెకి మమ్మల్ని, మమ్మల్ని ఆమెకీ పరిచయం చేశారు.

కాలు కొద్దిగా కుంటు లేకపోతే.. మిస్ ఇండియాకి ఏమాత్రం తగ్గని సౌష్టవం ఆమెది. చాలా ప్రేమగా నన్ను హగ్ చేసుకుని చక్కని ఇంగ్లీషులో మాట్లాడింది. హీందీ, ఇంగ్లీషు కలగలుపుతో నేను మాట్లాడాను.

ఆ రోజు స్పెషల్ ‘సర్‌సోంకా సాగ్, మఖ్ఖీ రోటీ’. అంటే ఆవ ఆకులతో చేసిన సాగ్, మొక్కజొన్న రొట్టెలు. బ్రహ్మాండమైన సొంతింటి నెయ్యి. రొట్టెల్లో వేడి వేడిగా సాగ్ నంజుకు తింటూ, మధ్యలో వారి ఊరగాయ రకాలు, ఉల్లిపాయా పచ్చిమిర్చి నంజుకు తింటుంటే స్వర్గం అక్కడే ఉందనిపించింది. ‘సుజీ’ (బొంబాయిరవ్వ) ఉందా లేదా అన అడిగాను డల్జీత్‌ని. ఉందంటే “నేను ఉప్మా, ఇన్‌స్టంట్ రవ్వ దోశ నేర్పుతా” అని ప్రామిస్ చేశాను. ఆమెకి ఆ రెండూ స్వయంగా తయారు చేసి చూపించి నేర్పాను కూడా. ఉప్మా మొత్తం నేతితోనే చేశాను, ధారాళంగా జీడిపప్పులు వేసి, ఎందుకంటే, వాళ్ళు వాడేది ఆవ నూనె. అది ఉప్మాకి బాగోదు.

“భలే.. చాలా చాలా బాగుంది” ఎగ్జైటింగ్‌గా అన్నది డల్జీత్ కౌర్. ఆవిడ ఆనాటి వరకూ మన ఉప్మా తినలేదట. పనిలో పనిగా పెసర పచ్చడి, కంది పచ్చడి, టిఫిన్ కోసం వేరుశనగ పచ్చడి, కొబ్బరి పచ్చడి ఎలా చెయ్యాలో కూడా మెల్లగా నేను చెబుతుంటే ఆవిడ పంజాబీలో రాసుకుంది.

భోజనం అయ్యాక కాసేపు రెస్టు తీసుకున్నాక మా టిఫెన్ కార్యక్రమం జరిగింది. అందరూ సరదాగా నడుస్తుంటే ఓ చోట గోగుతోట కనిపించింది. నాకు పిచ్చ ఉషారు వచ్చి అటు పరిగెత్తి చెప్పాను “మా తెలుగు వాళ్ళకి మోస్ట్ ఫెవరెట్ చెట్నీ” అని. భార్యాభర్తలిద్దరూ షాక్. వాళ్ళకి గోగునార మాత్రమే తెలుసుట. ఆకు తుంచి నోట్లో పెట్టుకుంటే మరీ పుల్లగా ఉంది. గబగబా ఆకులు నేను కోసి, వాళ్ళతో కోయించి ఇంటికి పట్టుకుపోయి. వేరుశనగ నూనె తెప్పించి, ఎండు మిర్చి etc అర్జంటుగా ఆర్డర్ చేసి పచ్చడి రుబ్బి వాళ్ళకి తినిపిస్తే గానీ నా మనసు చల్లబడలేదు.

“ఓహ్.. ఫెంటాస్టిక్” మెత్తని అన్నంలో ఎలా కలుపుకోవాలో నేను చూపించాక కలుపుకుని, ఉల్లి పాయ కొరికి నంజుకుంటూ తిన్నారు ముగ్గరూ. ఓ హార్లిక్సి బాటిల్ నిండా నేనూ తీసుకున్నాననుకోండి. ఎందుకంటే వినోద్‌కి తినిపంచడానికి.

అసలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుగా అనిపించలేదు. డల్జీత్ అంత ప్రేమగా చూసుకుంది. రాత్రంతా కమల్, డల్జీత్ పంజాబీ హిందీ పాటలు పాడితే నేను తెలుగు పాటలు పాడాను. తరుణి బెంగాలీ పాటలు పాడింది. రాత్రి పది గంటలకి నేను లేచి అన్నాను “నిద్ర ప్లీజ్” అని.

“Yes.. You are right.. టైమింగ్ తప్పక పాటించాలి” మెచ్చుకుంటూ అన్నారు కమల్.

“నేనో మాట చెప్పనా.. నువ్వు అద్భుతమైన అందగత్తెవే కాదు.. అద్భుతమైన మనిషివి కూడా.. అందుకే, అడుగుతున్నా.. నాకు కూతురిగా ఉంటావా?” నా చుబుకాన్ని వేళ్ళతో స్పుశించి అన్నది డల్జీత్.

“నిన్ను చూసిన వెంటనే యీ మాటే నేనూ అనాలనుకున్నాను. కానీ సందేహించాను” చిన్నగా నవ్వి అన్నారు కమల్.

నేను మెల్లగా తలవూపాను. నాకు మాట రాలేదు. సడన్‌గా మా అమ్మగుర్తుకొచ్చింది.

***

మా అమ్మ మాత్రమే కాదు, నాన్న, అన్న అన్వేష్, తమ్ముడు బ్రజేష్ అందరూ గుర్తొచ్చారు. మొదటిసారి నాతో మాట్లాడాక మా అమ్మతో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు మా నాన్న. అమ్మ ఫలానా అని చెప్పపోయినా తను బాధపడుతోందన్న విషయం నాకు తెలుసు.

అయినా ఏం చెయ్యగలదు? నా గుండె ఆ చీకట్లో మూల్గింది. ఒక్క పదిరోజులైనా అమ్మని తెచ్చుకుని నా దగ్గర వుంచుకుంటే? కానీ అది కుదరని పని. నాన్న కుదరనివ్వడు. ఒక్క పసుపుతాడు మనిషి యొక్క సర్వ స్చేచ్ఛనీ హరించగలదా? అన్న ప్రశ్నకి అవుననే జవాబు చెప్పాలి. వండీ వార్చీ, ఇల్ల ఊడ్చీ, అంట్లు తోమీ, బట్టలుతికీ మడతపెట్టీ ఇలా కుటుంబం తాలూకు పనినంతా చేసే గృహిణికి మగవాడు నిజమైన గుర్తింపునూ విలువనూ ఇస్తున్నాడా? లోకంలో చాలా మంది మా నాన్నలాంటి వాళ్ళే. కానీ, నాన్న లాగా కాక ఓ మనిషిగా బిహేవ్ చేస్తున్న కమల్ గార్ని ఇవ్వాళ చూశాను.

భార్యని ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో.

“మళ్ళీ మరో పెళ్ళి చేసుకోమని వెయ్యి సార్లు చెప్పినా వినడం లేదు అలా. నాకు పిల్లలు పుట్టనే పుట్టరు. పిల్లలు లేక పోతే వంశం అంతరిస్తుందిగా!” బాధతో నాతో అన్నది డల్జీత్.. ఆ మరుసటి రోజు పొద్దన.

“సరే.. సిద్ధమైపో.. ఆ మరో పెళ్ళి జరిగేది కూడా నీతోనే. సరేనా” నవ్వి అన్నారు కమల్.

“ఇదీ సంగతి!” చిరు కోపంతో అన్నది డల్జీత్.

వంటలో నేనూ పాలు పంచుకున్నాను. మన గుత్తి వంకాయ కూర, టమోటా పప్పు నేనూ చేస్తే, బెంగాలీ హల్వా పూరీ తరుణీ చేసింది.

“భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. మీ సౌత్ వంటా, బెంగాలీ వంటా కలిశాక. వాహ్.. అలా.. చాలా వంటలు నేను నేర్చుకోవాలి. తరుణీ, నువ్వూ అలా వారానికోసారి రారూ ప్లీజ్” అన్నారు డల్జీత్.

“అసలు సంగతి చెప్పు” నవ్వుతూ అన్నారు కమల్.

“నిజం చెబితే వారానికోసారైనా నువ్వింటికి వస్తావనీ, నీకు రకరకాలుగా వండి తినిపించాలనీ.. అలాగే, అల వస్తే.. నేను..” సైలెంటుయింది డల్జీత్.

“వస్తే?” అన్నది తరుణి.

“చెప్పలేను తరణీ.. కానీ, నాకు బిడ్డ పుట్టి వుంటే, ఈ వయసుదే ఉండేది. అలని చూసినప్పుడల్లా నాకు ఆ భావనే కలుగుతోంది. కారణం ఏమిటో నాకూ తెలీదు” ఓ క్షణం నా కళ్ళల్లోకి చూసి అన్నదామె.

“నీ డేటాఫ్ బర్త్ ఎప్పుడు అలా?” సడన్‌గా అడిగింది తరుణి. చెప్పాను.

“మైగాడ్.. ఏ సమయంలో?” ఆశ్చర్యంగా అన్నాడు కమల్.

“ఉదయం ఎనిమిదంటికి” అన్నాను నేను.

“సరిగ్గా అంతకు ముందే యాక్సిడెంట్ జరిగి గర్భవిచ్ఛిత్తి జరిగింది మైగాడ్.. మైగాడ్” మెల్లగా అన్నారు కమల్. నిశ్చేష్టురాలై నావంకే చూస్తోంది డల్జీత్.

***

(మిత్రమా.. ఇదేమీ కల్పితమూ కాదు.. ఫాంటసీ కూడా కాదు. నాకు నూటకి నూరు పాళ్ళు తెలిసిన ఓ నిజాతి నిజం. గత జన్మలూ, రాబోయే జన్మలూ ఉన్నాయా లేవా అనే చర్చకి తలుపులు తెరవదలచుకోలేదు. ఒకరిని చూశాక ఒకరికి తల్లి పేగు ఎందుకు కదిలిందీ? అసలు ఒకరిని చూస్తే పెట్టబుద్దీ, వేరొకర్ని చూస్తే, మొట్టబుద్దీ ఎందుకవుతుందీ? ఆలోచిస్తే దానికీ సమాధానాలు దొరుకుతాయి. కథకీ యీ ఇన్సిడెంట్‌కీ సంబంధం ఉందా లేదా అనేది కాలమే చెప్పాలి)

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here