మహతి-66

4
1

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[హిందీ ‘ధీర’ షూటింగ్ జరుగుతూంటుంది. వేగంగా అవుతున్నందుకు అలకు సంతోషంగానే ఉన్నా, తరచూ స్క్రిప్ట్ మారుస్తున్నందుకు కంగారుపడుతుంది. కామెడీ హిందీ వెర్షన్‍లో సీన్స్ జోడించడం, హీరో పాత్రకి ప్రాధాన్యం పెంచడం జరిగింది. అయితే కథ దారి తప్పుతుందేమోనని అనుకున్నా, దర్శకుడు, హీరో తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నమ్ముతుంది. షూటింగ్‍కి విరామం వచ్చినప్పుడు తరుణితో కలిసి కమల్‌జీత్ సింగ్ గారి ఇంటికి బయల్దేరుతుంది అల. వాళ్ళ ఊరు ‘సిర్సా’కి దగ్గర్లోనే ఉండడంతో, కమల్‍జీత్ గారే నడుపుతారు కారుని. దారిలో ఒకచోట చిక్కటి టీ తాగుతారు. అక్కడ దొరికే టిఫిన్లూ, దొరకనివాటి గురించి వివరంగా చెప్తారాయన. ఒకప్పుడా ప్రాంతమంతా ఎడారనీ, ఫలావంతం చేయడానికి దశాబ్దాలు పట్టిందని అంటారు. మాటల్లో తాగుడు గురించి వచ్చి, ఇప్పుడు మద్యం సోషల్ డ్రింక్‍గా మారినందుకు విచారం వ్యక్తం చేస్తారు. అప్పుడు తరుణి తన నాన్నకి ఉన్న తాగుడు అలవాటు గురించి చెప్పి, ఆయనెందుకు తాగుతాడో తనకి చెప్పాడని చెప్పి, మద్యపానాన్ని నిషేధించాలంటుంది. ప్రభుత్వమే లైసెన్సులిచ్చి వైను షాపులనీ, బార్లనీ ప్రోత్సహించడం సరికాదని ఆవేశంగా అంటుంది. బెట్టింగుల గురించి, షేర్ మార్కెట్ గురించి మాట్లాడుతుంది. తాను అంత లోతుగా ఆలోచించలేదనీ, ఒకదాని తప్పొప్పులు నిర్ణయించే ముందు దాన్ని గురించి, సమూలంగా ఆలోచించి మాట్లాడాలని ఇప్పుడు నేర్చుకున్నానని అంటారు కమల్‍జీత్ తరుణితో. కాసేపటికి ఇల్లు చేరుతారు. కమల్‍జీత్  గారి భార్య డల్జీత్ కౌర్ ఆప్యాయంగా పలకరించి లోపలికి తీసుకువెళ్తుంది. చక్కని వంటలతో ఆతిథ్యమిస్తుంది. బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తుంది అల. కొన్ని రకాల వంటలను ఎలా చేయాలో అల చెబుతుంటే, డల్జీత్ పంజాబీలో రాసుకుంటుంది. సాయంత్రం తోటలో నడుస్తుంటే గోంగూర కనబడుతుంది. వెంటనే వేరుశనగ నూనె, ఎండుమిర్చి వంటివి అర్జెంటుగా తెప్పించి పచ్చడి చేసేస్తుంది అల. దాన్ని అన్నంలో ఎలా కలుపుకు తినాలో చూపిస్తుంది. వినోద్ కోసం ఓ సీసాలో పేక్ చేస్తుంది. భోజనాలయ్యాకా, కొన్ని పాటలు పాడుకుని నిద్రకి ఉపక్రమిస్తారు. అలకి వాళ్ళ అమ్మా, నాన్న, అన్న, తమ్ముడు గుర్తొస్తారు. మర్నాడుదయం అల కొన్ని తెలుగు వంటలూ, తరుణి బెంగాలీ వంటలు చేస్తారు. అలని తన కూతురిగా భావిస్తుంది డల్జీత్. వీలుంటే వారం వారం రమ్మంటుంది. ఎందుకో ఉన్నట్టుండి అలని తన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ అడుగుతుంది తరుణి. అల  చెప్తుంది. కమల్‍జీత్ విస్తుపోయి – సరిగ్గా అదే తేది, అదే సమయానికి తన భార్యకి గర్భవిచ్ఛిత్తి జరిగిందని చెప్తారు. డల్జీత్ నిశ్చేష్టురాలై అల వంకే చూస్తుండిపోతుంది. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-13

మహతి:

[dropcap]టి[/dropcap]ఫిన్లు పేక్ చేయించడం చాలా మంచిదైంది. ఎందుకంటే పేక్ చేయించిన తరవాత పావుగంట గడవకుండానే భోరున వర్షం మొదలయింది. ఎంత తీవ్రంగానంటే వైపర్లు ఎంత వేగంగా కదులుతున్నా రోడ్డు కనిపించనంత. అదీ గాక చీకటి.

రోడ్డు గతుకుల మయం. ఈదురు గాలి వర్షానికి తోడై ఈడ్చి ఈడ్చి కొడుతోంది. సడన్‌గా నాకు అభిమన్యు గుర్తొచ్చాడు. అప్పుడూ ఇలాంటి వర్షమే కురిసింది. ఊరు ఊరంతా బిగ్గటిల్లి పోయేలా!

“నాన్నా మీరు టిఫిన్ చెయ్యడమే మంచిది. వాటర్ బాటిల్సు వెనకే ఉన్నాయి” అన్నాను, తల వెనక్కి తిప్పకుండానే. ఎందుకంటే, వర్షం పెరిగిన కొద్దీ డ్రైవింగ్ కష్టతరమే అవుతుంది గనక.

“ఎక్కడైనా ఆపమంటారా?” అడిగాడు డ్రైవర్.

“ఏ పెట్రోల్ బంకు దగ్గరో అయితే బెటర్, చెట్ల కింద మాత్రం ఆపకండి.. గాలి ఉదృతంగా వీస్తోంది” అన్నాను.

లక్కీగా ఓ పెట్రోల్ బంకు దొరికింది.

“మొదట పుల్‌గా పెట్రోల్ కొట్టించండి” అన్నాను.

“బయలుదేరే ముందు ఫుల్ చేశానండీ” అన్నాడు డ్రైవర్.

“ఇక్కడి దాకా చాలా పెట్రోల్ ఖర్చు అయ్యుంటుందిగా.. ఫుల్‌గా కొట్టించండి. వాన ఉదృతమైతే పెట్రోలూ దొరక్కపోవచ్చు” అన్నాను. నా అసలు ఉద్దేశం వేరు.

“నాన్నా మీరిద్దరూ టిఫెన్లు చేసెయ్యండి. బాత్రూమ్స్ కూడా బంకులో ఉన్నాయి.. అవసరమైతే” అని నేను కిందకి దిగాను. డ్రైవర్ ఏమనుకున్నాడో ఏమో నాతో బాటు కిందకి దిగి, పెట్రోల్ నింపాక కూడా నాకు దగ్గర్లోనే నిలబడ్డాడు.

నా మనసు మొద్దుబారింది. నాన్ననీ, ఇందిరనీ అలా ఒంటరిగా వదిలి పెట్టడం నైతికంగా, సాంఘికంగా, ధర్మంగా కరెక్టో కాదో నాకు తెలీదు. నేను చేస్తున్నది తప్పో రైటో కూడా నాకు తెలీదు. అసలా ఆలోచనే రాలేదు. ఆ క్షణంలో నాకు రిలేషన్స్ గుర్తుకురాలేదు. ఇద్దరు నిస్సహాయ వ్యక్తులు మాత్రమే కనిపించారు.

అమ్మమ్మ ఉండగా ఆవిడని ఎంతో అల్లరి పట్టించేదాన్ని. తిండి తినకుండా విసిగించేదాన్ని. అలిగి, ఏడ్పించేదాన్ని. ‘ఒక్కమాట’ – కేవలం ‘ఒక్కమాట’ మాట్లాడాలని లక్షసార్లు నా మనసు కొట్టుకుపోతున్నా నేను ఆవిడతో మాట్లడగలనా? ఆవిడ చివరి చూపుని జన్మంతం మర్చిపోగలనా? దేవుడా, మనుషుల మధ్య యీ బంధాల్ని ఎందుకు సృష్టించావు. సృష్టించినా, ఎవరికి వారిని విడివిడిగా తీసుకుపోతున్నావే! పోయినవాళ్ళని తలుచుకుని బ్రతికి ఉండేవాళ్ళు పడే బాధ నీకు తెలీదు కదూ! ఎంత దుర్భరం. మనిషి చుట్టూ ఎన్ని కంచెలు! ఎన్ని చూపుల మాటల తూటాలు.

ఏమో! కొన్ని నిముషాలు, లేదా గంటలు వాళ్ళని వారి మానాన వదిలెయ్యాలని నా మనసుకి అనిపించింది. అది న్యాయమో కాదో నాకు వద్దు.

కొన్ని క్షణాల స్వతంత్రం, కొన్ని క్షణాల శాంతి, కొన్ని క్షణాల కన్నీటి ప్రవాహం.. బస్..!

వర్షం మరింత భీకరంగా కురవడం మొదలెట్టింది. బంకు యజమాని మమ్మల్ని ఆఫీసు గదిలో కూర్చోమన్నాడు గౌరవంగా.

“మీకు నేను తెలుసా?” అన్నాను.

“పేపర్లో వచ్చిందిండీ.. మీరూ అలగారూ ఓ హాస్పటల్‌కి వెళ్ళడం అక్కడ భోజనం కూడా చేశారు గదా! అబ్బ.. అలగారు మీ ఫ్రెండాండీ!” ఉత్సాహంగా చెప్పాడు బంకు యజమాని.

“అవును.. మేం క్లాస్‌మేట్స్” అన్నాను.

“కార్లో ఉన్నారాండీ అలగారూ!” హుషారుగా లేచి అన్నాడతను.

“లేదండీ, ఆమె ఢిల్లీ వెళ్ళారు. హిందీ సినిమా ఘాటింగ్ కోసం” అన్నాను నవ్వుతూ.

బంకులోనే ఓ చిన్న షాపుంది. గబగబా తనే వెళ్ళి రెండు బిస్కట్ పేకట్లూ నాలుగు చాక్లెట్ బార్లూ, ఓ నాలుగు వేరుశనగ చిక్కీలూ, రెండు కూల్ డ్రింకులూ తెచ్చాడు. ఆదరంగా నా చేతికి ఇచ్చాడు.

“అయ్యో.. ఇప్పుడెందుకండీ” అన్నాను మొహమాటంగా.

“అలగారి ఫ్రెండంటే మామూలాండి! అదీ గాక మీరిప్పుడు మా అతిథి” అన్నాడు యజమాని.

అతనికో ముఫై రెండేళ్ళు ఉంటాయి. ఉత్సాహంతో ఉన్నాడు. బయట ఎంత ఘోరంగా గాలి వీస్తున్నా గాజు తలుపుల వెనకాల మాత్రం హాయిగా ఉంది.

అతను అడక్కుండానే చాలా సినిమా కబుర్లు చెప్పాడు. ఆ మాటల ప్రకారం లేటెస్ట్ యువకుల హృదయరాణి ‘అల’ట! నాకు చెప్పలేని ఆనందం కలిగింది.

“మీ దగ్గర STD ఉందా?” అన్నాను.

“లేకేమండీ.. నంబరు చెప్పండి.”

అల నంబరుని నేనే డైల్ చేశాను, అది నిదరపోయే టైమ్ అని తెలిసి కూడా.

“మీ పేరు” అడిగాను.

“అచ్యుతరామారావండీ” అన్నాడు.

“హలో” అవతల్నించి అల గొంతు కొంచెం విసుగ్గా.

“హలో సెలిబ్రిటీ నేనే.. మహతిని” అన్నా నవ్వుతూ.

“ఓహ్.. వాట్ ఎ సర్‌ప్రైజ్” దాని గొంతు నిండా సంతోషం.

“ముందు ఇక్కడ నీకో గొప్ప అభిమాని ఉన్నారు. ఆయన పేరు అచ్యుతరామారావు గారు.. కొంచెం మాట్లాడు” అని అచ్యుతరామారావుకిస్తూ “అల లైన్‌లో ఉంది” అన్నాను.

“అల గారు.. “ మహాదానందంతో అరిచాడు అచ్యుతరామారావు.

బయటి గాలిహోరు కంటే అచ్యుతరామారావు గొంతు పెద్దదిగా ఉంది. ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ధీరని పదిసార్లు చూశాడట. రెండు నిముషాల తరవాత “మీకిమ్మన్నారండి” అని మహదానందంగా ఫోన్ నాచేతికిచ్చాడు.

“అబ్బ.. ఎలా ఉన్నావే” అంది అల. దాని గొంతులో ఆనందం.

“అలా.. అన్ని విషయాలు తరవాత చెబుతా.. నాన్న ఇందిర గారు నేను కార్లో మా వూరు వెడుతున్నాం. నాన్న మధ్యలో దిగిపోతారు. అమ్మ ఆల్‌రెడీ బెజవాడ వెళ్ళిపోయింది” అని బ్రీఫ్‌గా విషయం చెబుతున్నాను. అచ్యుతరామారావు చెవులు డొప్పలుగా చేసుకుని వింటున్నాడని కూడా గుర్తించాను. ఈ ‘సుగణం’ చాలా మందిలో ఉంది. మన మానాన మనం మాట్లాడుకుంటుంటే, ‘ఎవరితోనండీ’ అనడిగే కుతూహలరాయుళ్ళు కూతూహలమ్మలూ నాకు తెలుసు.

అల అర్థం చేసుకుందనుకుంటాను. “చాలా గొప్ప నిర్ణయం మహీ.. అయినా అంతకు మించి దారి లేదు” అన్నది. మరో అయుదు నిముషాలు కాస్త నర్మగర్భంగా మాట్లాడి ఫోన్ క్రెడిల్ చేశాను.

ఓ పెద్ధ భారం నా నెత్తి మీద నుంచి దిగిపోయినట్లు అనిపించింది. ‘నేను చేస్తున్నది తప్పు’ అని అల అనలేదు గనక కాస్త మనశ్శాంతి.

వర్షం తగ్గింది. ఒక్కోసారి కృజ్ఞతాభావాలు మోయడం చాలా కష్టం. బంకు యజమాని అచ్యుతరామారావు తీవ్ర ప్రేమతో మరిన్ని రకల బిస్కెట్లు, చాక్లెట్లూ, పప్పు ఉండలూ సంచిలో పడేసి “అబ్బా.. అలగారితో మీరు మాట్లాడించారండి. లేకపోతే ఆవిడితో నా జన్మలో మాట్లాడగలుగుతానండీ!” అని కారు బయలుదేరేదాకా మాతోనే ఉన్నాడు.

“నాన్నా సంచి నిండా బిస్కెట్లూ, చాక్లెట్లూ, కూల్ డ్రింకులూ, పప్పుండలూ. హాయిగా, రిలాక్స్‌డ్‌గా ప్రయాణిద్దాం. వర్షం వల్ల టైర్లు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది గనక మెల్లగానే పోదాం” అన్నాను సంచి వెనక్కిచ్చి.

“థాంక్స్ మహీ.. మీ నాన్నగారు తిన్నా తినకపోయినా నేను మాత్రం ఆనందంగా తింటా” అన్నది ఇందిర.

ఆవిడ గొంతులో ఏనాడూ నేను వినని ఉత్సాహం, ఆనందం.. ఎవరు చెప్పారూ? పాషాణాలూ, వజ్రాలూ కరగవని. ఎందుకో ఓ నిట్టూర్పూ.. సమస్య ఓ కొలిక్కి వస్తుందనే నమ్మకం తోనో, ఆశతోనో కావచ్చు. ఎదురొచ్చే లైట్స్ వెలుగులో రివర్స్ వ్యూ మిర్రర్ లో చూశా. నాన్న మొహం నిర్వికారంగా ఉంది. మేం బయలుదేరే వరకూ ఆ ముఖంలో ఉన్నది బాధ, విచారమే. ఇప్పుడు చిన్న రిలీఫ్ కనబడింది నాకు.

చిత్రంగా ఇందిర కూర్చుని కనబడింది. ‘అమ్మాయ్య’ అనిపించింది నాకు. ఈ విషయం తెలిస్తే అమ్మ ఎలా ఆలోచిస్తుందీ? నాకు ఊహకి కూడా అందలేదు. తిట్టదు, ఈసడించుదు.. కనీసం ఎందుకిలా చేశావూ? అనే ప్రశ్న కూడా వేయదు. సైలెంటైపోతుంది. ఆ సైలెన్స్‌ని బ్రేక్ చెయ్యడం అసాధ్యం.

నా బుర్ర నిండా రకరకాల ఆలోచనలు. ఇందిర ఏదో మెల్లగా మాట్లాడుతోంది. ఆమె స్వరం మృదువుగా ఉంది. చెప్పే మాటలు మాత్రం తెలియలేదు, వినిపించనూ లేదు. నాన్న మాట్లాడకుండా వింటున్నారు అంతే.

శీతాకాలపు రాత్రి లాగా రాత్రి అతి మెల్లగా గుడుస్తోంది. రోడ్డంతా గుంటలు, ఎత్తు పల్లాలూ. డ్రైవరు చాలా జాగ్రత్తగా పోనిస్తున్నాడు.

“ఇంకో సారి టీ తాగుదామా అన్వర్?” అన్నాను.

“అలాగేనమ్మా..” ఆనందంగా అన్నాడు. రోడ్డు బాగుంటే డ్రైవింగ్ గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అదే హారిబుల్ రోడ్డులో డ్రైవ్ చేసేప్పుడు మిగిలేది అలసటే.

మరో పెట్రోల్ బంక్ దగ్గర ఆపాడు. ఎదురుగా ఓ బడ్డీ కొట్టు మూసేసి ఉన్నది. దగ్గరగా వెళ్తే ఒక స్త్రీ వుంది.

“టీ ఉందా?” అన్నాను.

“పెట్టివ్వాలి. వర్షం కదా. పాలు అయిపోయాయి. పాల పొడితో పెట్టిమ్మంటే పెట్టిస్తా” అంది నిర్వికారంగా.

“సరే” అని నేను ఇందిర గారి దగ్గరకు వెళ్ళాను.

“బాత్రూంకి వెళ్తారా” అన్నా.

“థాంక్స్.. వస్తాను” అంటూ నా చెయ్యి పట్టుకుని కారు దిగింది. తిరిగి కారు దగ్గరికి వచ్చే వరకూ నా చెయ్యి పట్టుకునే ఉంది.

“నాన్న మరో గంటన్నరలో విజయవాడ వస్తుంది. ఎక్కడ దింపనూ?” అన్నాను కావాలనే.

“బెంజిసర్కిల్ దగ్గర దిగుతా” అన్నారాయన. నేను ముందు సీట్లోనే కూర్చున్నా. పర్సు తీసుకుని “టీలు తాగుతారా?” అన్నాను.

ఇద్దరూ వద్దన్నారు. నేను మళ్ళీ బడ్డీ కొట్టు దగ్గరికి పోయా.

ఇందాక చూడలేదు గానీ, ఇప్పుడు కనిపించింది. తడికకి మైదాపిండితో అతికించిన ‘ధీర’ తెలుగు పిక్చర్ వాల్ పోస్టర్. 110 రోజులు అని ఉంది. అల మొహం చాలా అందంగా ఉత్తేజకరంగా ఉంది. విచిత్రం ఏమంటే నేను ఇంత వరకూ ‘ధీర’ చూడలేకపోవడం. అల పోస్టర్ చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ అలేనా యీ అల! అని అనిపించి చాలా సంతోషపడ్డాను.

“అలమ్మగారి పోస్టరండి.. మనసు బంగారమండి” అన్నాడు అన్వర్. గుండెలోతుల్లోనించి వచ్చిన గౌరవంతో.

మళ్ళీ జూనియర్ కాలేజ్ రోజులు గుర్తుకొచ్చాయి. అల, నేను, తిమ్ము, హగ్గీ, రేఛల్, రహీమా, భారతి, వందన, అఖిల, మాన్య, రేణుక మాత్రమే గాక సంపూర్ణాదేవిగారూ, త్రిపురగారూ, తాతగారూ కూడా గుర్తుకొచ్చారు.

“విజయవాడ దాటే ముందు ఇంటికి ఫోన్ చేయ్యాలి. STD బూత్ దగ్గర ఆపండి” అన్నాను డ్రైవర్‌తో.

“అలాగే” అన్నాడతను. టీ తాగడం పూర్తయింది. నిద్ర ఆపుకోవడానికి తప్ప ఆ పాలపొడి టీ రుచికి పనికి రాదు. డబ్బిచ్చి బయల్దేరాం.

“బయలుదేరినప్పుడు ఆవిడ్ని చూసి భయమేసిందిండి.. బతుకుతారో.. లేకపోతే దారిలోనే.. అని. ఇప్పుడు మీరు నడిపిస్తున్నప్పుడు చూస్తే చాలా చాలా మెరుగ్గా ఉన్నారండి.. గండం గట్టెక్కినట్టే అండి” అన్నాడు అన్వర్.

‘గమనిండం’ అందరికీ రాదు. ఆ గమనించడం కూడా ఓ గొప్ప వరమని నాకు తెలుసు. అన్వర్ చెప్పిన విషయాన్ని నేను ఇందాకే గమనించాను. ఆవిడ్ని గమనిస్తే గానీ నేను ఆవిడతో ఎలా డీల్ చెయ్యాలో నిర్ధారించుకోలేను.

కానీ, అన్వర్ కూడ గమనించాడంటే? కొంత కుతూహలం కావచ్చు. కొంత మా మాటల్లో విషయం కొద్దోగొప్పో అర్థమై ఉండొచ్చు. ఏమైనా, గమనించిన మాట మాత్రం నిజమేగా!

“అవును అన్వర్.. వారి ఆరోగ్యం ఇప్పుడు బాగుపడుతోంది. అంతా ఆ భగవంతుడి దయ” అన్నాను.

డోర్ తీస్తూ టీ తాగిన ఉత్సాహంతో అన్వర్ ఉత్సాహంగా డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల నించి మాటలు లేవు. అంటే నిద్రిస్తూ ఉంచొచ్చు. ఏకాంతంలో మా నాన్నతో మాట్లాడిన తృప్తితో ఇందిర, తల మీద భారం మోసీ మోసీ, ఆ భారం తగ్గుతోందనే ఆశతో మా నాన్నా నిద్రలోకి జారి ఉండొచ్చు.

నాకు మాత్రం నిద్ర పట్టలేదు. నేను కన్విన్స్ చెయ్యాల్సింది ముఖ్యంగా అమ్మనీ, తాతనీ. తాతని కన్విన్స్ చెయ్యడం కష్టం అనుకోను. అమ్మకి ఎలా చెప్పాలీ?

పోనీ ఇందిర ఎన్నాళ్ళు మా వూళ్ళో ఉండటానికి ఇష్టపడుతుందీ? ఆమె అలవాట్లు ఏంటో, ఆహార వ్యవహారాలు ఏమిటో నాకే మాత్రం తెలీదు. అక్కడున్న వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి.

మొదటి త్రిపుర గారితో చర్చిస్తే బాగుంటుందేమో. ఆవిడకి అర్థం చేసుకునే మనసే కాదు, అనుభవం కూడా ఉన్నది. ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్న అనుభవం ఉంది కదా! అలాగే, శ్రీధర్‌కీ శారదకీ చెప్పాలి. హాస్పటల్లో కలిసి వాళ్ళతో చెప్పి చర్చించాలి.

“ఇంట గుట్టు విధీలో పెడతావా?” అన్నది మనసు.

“గుట్టు గుట్టు అనుకుంటూ గుట్టులోపలే దాచుకోవడం వల్లే గుండె నొప్పులొస్తున్నాయి. ఇందులో గుట్టు ఏముందీ? దీనవల్ల కాసేపు నలుగురూ అచ్చిక బుచ్చికలాడే ఛాన్సు పొందుతారు. అంతేగా! ఆ తరువాత మరో వ్యవహారం వెలుగు చూస్తే దాన్లోకి జారిపోతారు. మనుషుల నైజం అంతేగా. ఏ సన్నివేశమైనా జీవితంతో జరుగుతున్నదీ – జీవితానికి సంబంధించినదీ! దాయడం ఎందుకూ? ఒక్క నిజాన్ని దాయడానికి లక్ష అసత్యాలు పలకడానికి సిద్ధం కావడం బుద్ధిమంతమేనా?” లోపల్నించి జవాబు.

చిత్రం ఏమంటే ప్రశ్నా జవాబూ రెండూ కూడా మనసులోంచి పుట్టినవే.

విజయవాడ 20 km మైలురాయి కనిపించింది కారు వెలుగులో. అంటే మరో ఇరవై ఇరవై అయిదు నిముషాలు. పోనీ అరగంట.

“నాన్నా” అన్నాను మెల్లగా.

“లేచే ఉన్నానమ్మా” నాన్న గొంతులో కొంచెం నీరసం. పాపం ఎన్నాళ్ళయిందో ప్రశాంతంగా భోంచేసి.

“సరే నాన్నా” అన్నాను. ఇందిర గారి విషయం అడగలేదు. నిద్రపోతూ వున్నట్లయితే లేపడం ఎందుకూ? అనుకున్నాను.

తెల్లవారు ఝాముయిందేమో.. లారీలు సర్రు సర్రు మంటూ ఎదురుగా వస్తున్నాయి. కొన్ని కార్లు కూడా.

జీవితమే ఓ పరుగు పందెం అయిపోయింది. కొందరు మాములూ పరుగు పెడితే, కొందరు కార్ల మీద. వాహనం ఏదయితేనే.. పరుగు మాత్రం ఆగదు.

“జీవితం ఓ ప్రయాణం/తోడుగా సాగనీ” అని వ్రాసిన కవి గుర్తుకొచ్చాడు. సడన్‌గా నాకు అభిమన్యు గుర్తుకొచ్చాడు.

“గాడ్.. అతనైతే క్షణాల్లో నిష్పక్షపాతంగా ఈ సమస్యని పరిష్కరించగలడు. ఓహ్.. ఎలా అతన్ని కలవటం?” నా మనసు పదే పదే ఆలోచిస్తోంది.

‘ఓ వర్షం కురిసిన రాత్రి
ఓ మామిడి చెట్టు కాండాన్ని ఆనుకుని
కూర్చున్నాం గుర్తుందా
మనిద్దరం!
చెట్టూ అక్కడే ఉంది
వర్షం ఇంకా కురుస్తూనే ఉంది
నేనూ అక్కడే ఉన్నా
నువ్వే.. మాయమయ్యావు..
ఒక్కసారి కలవ్వూ
ఒక్కసారి ప్రియా అని నన్ను పిలువ్వూ!’ – ‘పాదచారి’.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here