(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[టిఫిన్లు పేక్ చేయించి మహతి వాళ్ళు బయలుదేరాకా, దారిలో భారీ వర్షం పడుతుంది. అసలే గతుకుల రోడ్డు. పైగా చీకటి. ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోలు కొట్టించుకుంటారు. గౌతమ్‍ని, ఇందిరని టిఫిన్లు తినేయమని చెప్పి, మహతి, డ్రైవర్ బయట నిలబడతారు. ఇంతలో బంకు యజమాని వచ్చి, మహతిని గౌరవంగా పలకరించి, వచ్చి లోపల కూర్చోమంటాడు. నేను మీకు తెలుసా అని మహతి అడిగితే, మీరు అలగారు ఓ హాస్పటల్‍కి వెళ్ళి అక్కడ భోజనం చేశారుగా, ఆ ఫోటో పేపర్లో వచ్చింది అని చెప్పి, అలగారు మీ ఫ్రెండాండీ అని అడుగుతాడు. అవునంటుంది మహి. బంకులోనే ఉన్న చిన్న షాపు లోండి బిస్కట్లు, చాక్లెట్ బార్లూ తెచ్చిస్తాడు. అతని పేరు అచ్యుతరామారావు. అతనికి అల అంటే ఎంతో అభిమానమట. అక్కడున్న ఫోన్ నుంచి అలకి ఫోన్ చేసి, అతనితో మాట్లాడింపజేస్తుంది మహతి. ఓ రెండు నిమిషాలు అతనితో మాట్లాడిన అల – తర్వాత మహతితో మాట్లాడుతుంది. ఇందిరని కర్రావూరి ఉప్పలపాడు తీసుకువెళ్తున్న సంగతి అలకి చెప్తుంది. గొప్ప నిర్ణయమనీ, అంతకు మించి మరో దారి లేదని అల అంటుంది. ఇంకో ఐదు నిముషాలు కాస్త నర్మగర్భంగా మాట్లాడి ఫోన్ క్రెడిల్ చేస్తుంది మహి. ఈలోపు వర్షం తగ్గుతుంది. అచ్యుతరామారావు మరిన్ని రకల బిస్కెట్లు, చాక్లెట్లూ, పప్పు ఉండలూ ఓ సంచిలో వేసి, అలతో మాట్లాడించినందుకు కృతజ్ఞతలు చెప్పి సాగనంపుతాడు. మరో గంట తరువాత మరో పెట్రోల్ బంక్ దగ్గర ఆపి, టీ తాగుతారు డ్రైవర్, మహి. విజయవాడ ఊర్లోకి ప్రవేశించే ముందు ఏదైనా ఎస్.టి.డి. బూత్ దగ్గర ఆపమని డ్రైవర్‍కి చెప్తుంది మహి. ఇందిరని ఊరికి తీసుకువెళ్తున్న సంగతి అమ్మకి చెప్పాలనుకుంటుంది మహి. అమ్మ ఎలా స్పందిస్తుందో తెలియదు. తాతయ్యకీ, త్రిపుర గారికీ, డా. శ్రీధర్‍కి, డా. శారదకీ కూడా ఈ విషయం చెప్పాలనుకుంటుంది. విజయవాడ సమీపిస్తుంటే, నాన్నని పిలుస్తుంది. మేల్కొనే ఉన్నానని అంటాడు గౌతమ్. ఆలోచనలు మహతి మనసుని అల్లకల్లోలం చేస్తాయి. – ఇక చదవండి.]
మహతి-4 మహతి-అల-14
అల:
[dropcap]మ[/dropcap]హతి ఫోన్ అందుకున్నాక చాలా రిలీఫ్ కలిగింది. అఫ్‌కోర్స్ ఇందిరని కర్రావూరి ఉప్పలపాడు తీసుకువెళ్ళడం గురించి మేం చర్చించిన మాట నిజమే అయినా, ఇందిరని మహతి ఒప్పించగలదని నాకు అనిపించలేదు. ఒకప్పటి నాలాగే, ఇందిర కూడా ఓ పద్మవ్యూహం లాంటిదే అనిపించింది. మహతి అభిమన్యుడి అవతారమెత్తి మొత్తానికి లోపల ప్రవేశించి ఇందిర పట్టుని సడలించగలిగింది.
నిజం చెప్పొద్దూ.. ఆ మరుసటి రోజు అందరికీ స్వీట్స్ పంచాను.
“ఎందుకూ?” అని అందరూ అడిగితే, “ధీర 110 days ఆడినందుకు.. ఇంకా ఆడుతున్నందుకు” అని సమాధానం చెప్పాను. వాళ్ళు తీస్తున్నది అదే సినిమా గనక చాలా ఆనందపడ్డారు. వినోద్ అయితే, “అలా.. మేము ఇంకా కష్టపడాల్సి వుంటుందని స్వీట్‌గా గుర్తు చేశావన్న మాట. తెలుగులోనే అంత విజయం సాధించిందంటే, హిందీలో ఇంకా పెద్ద హిట్టయ్యేలా మలచాలి గదా మరి” అన్నాడు.
“యస్.. యూ ఆర్ వెరీ రైట్” అన్నాడు డైరెక్టర్.
“నా ఉద్దేశంలో దీనికీ దానికీ బేసిక్ కథలో తప్ప వేరే పొందిక లేదు. అది లో-బడ్జెట్ సినిమా. నిజం చెబితే అందులో హీరో అనండి హీరోయిన్ అనండి అల మాత్రమే. అల పెర్‌ఫార్మెన్స్‌తో సినిమా సూపర్ హిట్టయింది. ఈ సినిమా వేరు. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తీస్తున్న సినిమా. అంతే కాదు, మెస్మరైజిగ్ లొకేషన్లు, మంచి కామెడీ, మరింత మరిన్ని షేడింగ్స్‌తో నిర్మాణమవుతున్న సినిమా. ఇందులో ‘దీ బెస్ట్’ పెర్‌ఫార్మర్లు ఇద్దరున్నారు. అల సౌత్ ఇండియన్ యూత్ ఐకాన్ అయితే, వినోద్ సార్ ఆలిండియా యూత్ ఐకాన్. ఏమయినా రిలాక్స్‌డ్‌గా మనం అనుకున్న దారిలో మనం వెళ్ళడమే శ్రేయస్కరం. రష్ చూస్తే ష్యూర్ షాట్ హిట్ అనిపించింది మొన్న” అన్నది తరుణి కిద్వాయ్ మా చర్చలో పాలుపంచుకుని.
“You are right. ఎందుకంటే, కథ సౌత్‌ది అయినా మనం తీసేది ఇండియా మొత్తం చూడగలిగే చిత్రం. దీన్ని మూల చిత్రంతో పోల్చకూడదు” అన్నారు కమల్‌జీత్.
“నిజం చాలా మార్పులు జరిగాయి. సక్సెస్ అయితే ‘గ్రేట్’, సక్సెస్‌ఫుల్ సౌత్ ఇండియా ఫిలిమ్ మళ్ళీ తీసి సక్సెస్ చేసారంటారు. సరిగ్గా ఆడకపోతే, ఆ.. ఒరిజినల్‍ని చెడగొట్టబట్టే ఇట్లా అయింది అని పెదవి విరుస్తారు సినీ పండితులు” నవ్వి అన్నాడు జూలూ.
“సిని పండితులెప్పుడూ గోడ మీద పిల్లులే. ఊసరవెల్లి మార్చినట్టు ఎక్కడ మార్చాల్సిన రంగు అక్కడ మారుస్తారు. ఏ హీరో దగ్గర మాటలు ఆ హీరో దగ్గర మాట్లాడటం మాత్రమే కాక, ఇతర్లు అన్నవీ అననవీ కూడా హీరోల చెవుల్లో ఊది ప్రాబల్యం పెంచుకుంటారు. పూర్వకాలం గూఢచారులే రాజులకి చెవూలూ కళ్ళూ.. ఇప్పుడీ పనికిమాలిన జనాలే హీరోల కళ్ళూ చెవులూ” అన్నది తరుణి.
చిన్నగా నవ్వాడు వినోద్. “అవును తరుణీ, కానీ ఓ మాట చెప్పక తప్పదు. మేము కాస్త బుర్ర వున్న వాళ్ళమే. అన్నీ వింటాం. కానీ మేము మాలాగే వుంటాం!” అన్నాడు.
“మీ విషయం వేరు సార్. కోటికొక్కరు కూడా మీలాంటి వాళ్ళు ఉండరు” అన్నాడు జూలూ.
“తప్పు జూలూ సాబ్. అందరం మనుషులమే! మన పని మనం చేసుకోవడానికేగా పుట్టిందీ! రిక్షా వాడిలా నేను రిక్షా తొక్కగలనా? రైల్వే కూలీలా బరువులు మొయ్యగలనా? సైనికుడిలా దేశాన్ని రక్షించగలనా? డాక్టరుగా, లాయరుగా ప్రజలకు సేవ చేయగలనా? నో. నేనో నటుడ్ని. నటించగలను. అంతే. నటన అనేది పక్కన పెడితే, నాలో ప్రత్యేకత ఏముందీ? నథింగ్. రీయల్లీ నథింగ్. అదృష్టం బాగుండి ‘కపూర్స్’ కుటుంబం నించి వచ్చా గనక ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఆపైన నేను పైకి రావాల్సింది స్వయంకృషితోనేగా!” ఓ సిగరెట్టు ముట్టించి అన్నాడు వినోద్. అతని రీజనింగ్ అందరికీ నచ్చింది.
“వెల్.. షాట్ రెడీ అవడానికి మరో అరగంట పడతుంది” అనౌన్స్ చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ మిథున్ ఛోప్రా.
“మనం మన పోర్షన్స్‌ని మరో సారి రిహార్సల్స్ చేసుకుందామా” పొలైట్‌గా అడిగాడు వినోద్.
“అది అద్భుతమైన పని” అన్నాను నేను లేచి.
“తరుణీ.. నువ్వు కూడా రా. మా రిహార్సల్స్ చూసి మార్పులూ చేర్పులూ చెప్పు” అన్నడు వినోద్. డైరెక్టర్ రైటర్‌తో బిజిగా ఉండడంతో తరుణిని పిలిచాడు వినోద్.
అదో ఇంటిమేట్ సీన్. మొదట ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతూ లేచి అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆ తరవాత ఒకరిని ఒకరు ఆనుకుని కిటికీలోంచి బైటకు చూస్తూ, ఆ తరువాత అతను నా నడుం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకోవాలి.
పొజిషన్స్ అన్నీ నేల మీద గుర్తులు పెడతారు. మొదటి రిహార్సల్ లోనే అతను నా నడుము మీద చెయ్యి వెయ్యగానే నా మనసు వశం తప్పింది. కళ్ళు అరమూతలు పడ్డాయి. అయినా నేనదేమీ బయటకు ప్రదర్శించకుండా మరో రెండు రిహార్సల్స్ చేశాను.
“షాట్ రెడీ” అన్నాడు మిథున్ ఛోప్రా.
“‘ఫస్ట్ టేక్’ ఓకే. అయినా ఒన్ మోర్ టేక్” అన్నాడు డైరెక్టర్ అమిత్. రెండో టేకు చేసేప్పుడు మళ్ళీ కళ్ళకి మత్తెక్కినట్టు అనిపించింది.
“ఫెంటాస్టిక్ అలా.. ఓహ్.. నీ కళ్ళల్లోని మత్తు రేపు కుర్రకారుని వెర్రెత్తిస్తుంది” చప్పట్లు చరిచి అన్నాడు అమిత్.
“ఒన్స్ మోర్ అని అద్భుతంగా expressions రాబట్టావు అమిత్. ఇద్దరి మధ్యా తీసిన యీ షాట్‌ని చూస్తే, ఎవరైనా వీళ్ళు made for each other అనుకోక మానరు” అన్నారు కమల్‌జీత్.
“కమల్ జీ.. అల కళ్ళు చూశాక నాకు పిచ్చెక్కింది. అంత గొప్ప ఎక్స్‌ప్రెషన్ అది” గట్టిగా నిట్టూర్చి కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వినోద్. నాకు చిన్న నవ్వొచ్చింది.
“ఎందుకు నవ్వావూ?” అడిగింది తరుణి.
“అసలు ఇంటిమేట్ సీన్సు ఎలా తీస్తారో మాకు తెలీయదుగా. నటీనటులు ఎంత సహజంగా చేశారో అని సంబరపడే వాళ్ళం. ఇప్పుడు తెలుస్తోంది అసలు నిజం. ఇంతమంది చుట్టూ మనని చూస్తుండగా ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం లోని కష్టం ఎంత వుంటుందో. అందుకు నవ్వొచ్చింది” అన్నాను.
కానీ అది నిజం కాదని నాకు తెలుసు. అతని స్పర్శ నాలో రేపిన అలజడి మామూల్ది కాదు. అది వినోద్‌కీ తెలిసి ఉండాలి.
“ఏమైనా అలా.. నీ కళ్ళల్లో ఎంత మత్తుందో ఇప్పుడు నీకు తెలుసా? ఫుల్ బాటెల్ కొట్టినా అంత మత్తు రాదు” అన్నది తరుణీ కిద్వాయ్. చిన్నగా నాకు మళ్ళీ నవ్వొచ్చింది.
మగాళ్ళు అనాల్సిన మాట తరుణి అన్నందుకు. తను నవ్వేసింది.
ఆ రోజు లంచ్‌లో నేను తయారు చేసి తీసుకొచ్చిన గోంగుర పచ్చడిని కమల్‌జీకి వినోద్‌కి, అమిత్‌కీ కూడా వడ్డించా. ఆలూ పరోఠాతో నంచుకుని తిని “వావ్.. క్యా టేస్ట్ హై” అన్నాడు వినోద్.
“అలా.. ఇలా కాకుండా నువ్వే ఓ పచ్చడి ఫాక్టరీ మొదలుపెడితే, బెస్ట్ బిజినెస్ ఉమన్‌వి అవుతావు” మెచ్చుకున్నాడు అమిత్.
“ఎందుకూ, ఇవ్వాళా రేపు స్త్రీలేగా అతి పెద్ద సంస్థలకి సిఇవోలుగా ఉన్నది. అంతెందుకు? ‘లిజ్జత్ పాపడ్’ యీ రోజు ప్రపంచ ప్రసిద్ధి పొందలేదూ! ఏ పని చేసినా సంపూర్ణమైన బాధ్యతతో చేస్తే విజయం ఖచ్చితంగా లభిస్తుంది. అల ఏది చేసినా మనసు పెట్టి చేస్తుంది” అన్నారు కమల్‌జీత్.
వినోద్ ఏమీ మాట్లడలేదు చాలా సేపటి వరకూ. ఆ తరవాత “అలా నువ్వు గొప్ప ఆర్టిస్టువి. నా ఉద్దేశంలో నువ్వు బెస్ట్ భార్యవి కూడా అవుతావు. నీలో ఓ సంపూర్ణ స్త్రీ ఉంది” అన్నాడు. నేను తల దించుకున్నాను.
నేను నేనేనా? తిమ్మూని పారిపోయేటట్టు చేసిన ఆ అలనేనా? వీళ్ళందరూ నన్ను గౌరవిస్తున్నారు. సంపూర్ణ స్త్రీవి అంటున్నారు. ఎన్నెన్నో ప్రశ్నలు.
“ok ok. పొగడనులే. ఈట్ ఫుడ్” ప్లేట్లో ఆలూ పరోఠా, టమోటా ఆనియన్ కుకుంబర్ సలాడ్, ఢిల్లీ చాందినీ చౌక్ నించి ప్రత్యేకంగా తెప్పించిన మిక్స్‌డ్ పికిల్, నేను తెచ్చిన గోంగూర నీట్‌గా వడ్డించి ఇచ్చాడు వినోద్. మరో ప్లేట్‌లో వెజిటబుల్ కటోరీలు రెండు, దాల్ కటోరీ ఒకటీ, దహీ కటోరీ ఒకటీ కూడా తనే పెట్టి తెచ్చినా ఎదురుగా పెట్టాడు. ఆ పెట్టడంలో ఓ అనమంతమైన ఆత్మీయత నాకు కనిపించింది. ఆ రోజంతా తీసినవి ఇంటిమేట్ సీన్‌లే. ఓ స్త్రీగా అందులో ఇన్వాల్వ్ అవడం నాకే షాక్ కనిపించిది. సీన్‌లో నటిగా ఇన్వాల్వ్ అవడం వేరు, స్త్రీగా ఫీలవడం వేరు. ఇటువంటి ఫీలింగ్స్ ఇంతకు ముందు ఏనాడు నాకు కగలలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఓ వివశత్వం నాకు ఆవహించింది.
“ఏంటి కథ! వినోద్ నిన్ను ఫుల్‌గా లవ్ చేస్తున్నాడల్లే వుంది” కన్నుకొట్టి అంది తరుణి.
“ఈజిట్..” నవ్వి అన్నాను.
“యస్.. అతనే కాదు.. నీ కళ్ళల్లోనూ ఇవ్వాళ్ల నేను మెరుపులు మైమరపులూ చూశాను. అమ్మాయ్.. నీ ఏజ్‌ని ఏనాడో క్రాస్ చేసి వచ్చినదాన్ని.. నాకు తెలీదా!” అన్నది తరుణి. నేను చిన్నగా నవ్వాను. అంతే.
“ప్రేమ – కాంక్ష – ఆశ – వేదన – లాలన – విరహం – బాధ – కలలు – కన్నీళ్ళు – జారిపోయి పడిపోవడాలూ – తిరిగి పుంజుకుని లేవడాలూ ఇవన్నీ ఇతర జీవుల పైన ఎంత ప్రభావం చూపుతాయో తెలియదుగానీ, మనుషుల్లో మాత్రం అత్యంత ప్రభావం చూపుతాయి. ఓ విధంగా చెబితే మానవ జీవితనాన్ని మనసునీ ఆక్రమించేవి అవి. వాటిని మననించి కొద్దో గొప్పో దూరం చెయ్యగలిగేది ‘వైరాగ్యం’. ఈ వైరాగ్యం తాత్కాలికమైనదే. అందుకే అంటారు, శ్మశాన వైరాగ్యమనీ ప్రసూతి వైరాగ్యమనీ. వీటి నుంచి శాశ్వతంగా దూరమయే మార్గం వేదాంత మార్గం or ఆధ్యాత్మిక మార్గం” ఆగారు కమల్‌జీత్. నేనూ, తరుణీ, వినోద్, మిథున్ అందరం వింటున్నాం. వినోద్ చేతిలో విస్కీ ఉంది. కమల్ చేతిలో బీరు. తరుణి చేతిలో జిన్+లిమ్కా. నా చేతిలో బాగా సగానికి సగం మరిగించి (అంటే లీటర్ని అరలీటరుగా) తేనే బెల్లమూ చక్కగా కలిపి అందులో నేతిలో వేయించిన జీడిపప్పులూ, కిస్‌మిస్, బాదం కలిపి, చిన్న ముక్కలుగా కోసిన ఆపిల్ ముక్కలూ, అరటి పండు ముక్కలు వేసి ఫ్రిజ్‌లో బాగా చల్లర్చిన ‘ప్రూట్ మిల్క్ మిక్స్’ ఉంది.
అదంటే నాకు చాలా యిష్టం. నైట్ డిన్నర్ తరవాత ఓ బౌల్ నిండా యీ ఫ్రూట్ మిల్క్ మిక్స్ చక్కని స్పూనుతో తింటుంటే స్వర్గం కళ్ళముందే ఉంటుంది. ఈ ఫ్రూట్ మిక్స్ మిల్స్ నాకు నేర్పించింది కమల్‌జీత్ గారి భార్య. అన్నట్టు చాక్‌లేట్ చిన్న చిన్న ముక్కలుగా కోసి పైన అలంకరించవచ్చు గానీ, నాకు నచ్చదు. చిక్కని ఫ్రూట్ మిల్క్ మిక్స్ టేస్టు అద్భుతం. దాన్ని చాక్లెట్‌తో కల్తీ చెయ్యలేను.
“ఓ హెక్టిక్ షూటింగ్ తరువాత ఒకటో రెండో లార్జ్ విస్కీ సేవిస్తే ఆ మజానే వేరు అలా” అని తరుణి నన్ను టెంప్ట్ చేసే ప్రయ్తత్నం చేసింది. కానీ “నో తరుణి.. దాన్ని నేను ఏనాడూ ముట్టుకోదలుచుకోలేదు” అని స్ట్రిక్టుగా చెప్పాను.
“లోకంలో ముధురమైనవి ఎన్నో వుండగా ముధువెందుకూ?” అని కూడా అన్నాను. బట్.. వారు రిలాక్స్ అవడం చూసి నేనూ ఆనందించా.
“అసలు మనిషికి ఏం కావాలీ? అందరూ ప్రేమ అనో, డబ్బు అనో, శాంతి అనో, పేరు ప్రతిష్ఠలనో అంటారు. అవన్నీ పుష్కలంగా ఉన్నా ‘తృప్తి’ అనేది మనసులో లేని నాడు మానవుడికి మనశ్శాంతి దొరకదు. ‘తృప్తి’ కలిగించుకోవడం కూడా ఓ సాధనే. చాలా అప్రమత్తంగా చేయాల్సిన సాధన. నిరంతరం నీ మనసుని కంట్రోల్ చేసుకుంటే గానీ తృప్తి అనే శాంతి పుష్పం లభించదు. మనకి ఏది ఎంత వుంటే తృప్తి కలుగుతుందో మనమే నిర్ణయించుకోవాలి” అంటూ చల్లని బీర్ సిప్ చేశారు కమల్‌జీత్.
“అవును కమల్‌జీ.. మీరన్న ప్రతి మాటా నిజమే. ఉన్నదానితో తృప్తి పడి ప్రశాంతంగా జీవించడం చాలా గొప్ప విషయమే కానీ..” ఓ క్షణం ఆగి విస్కీ సిప్ చేశాడు వినోద్.
“ఊ.. చెప్పండి” అన్నారు కమల్ కుతూహలంగా.
“అది గొప్ప పనే.. కానీ, యూ ప్రపంచాన్ని గొప్పగా మలచాలంటే, మనసులో ఉండాల్సింది తృప్తి కాదు. అసంతృప్తి. నడక కంటే సైకిల్ వేగంగా వేడుతుందిగా అని తృప్తి పడితే ఇవ్వాళ రాకెట్లు, శాటిలైట్లు ఉండేవి కాదు. కట్టెల పొయ్యి తోనో గాడిపోయ్యితోనే ఆగితే ఇవాళ ఓవెన్లు వెచ్చేవి కాదు. బార్టర్ సిస్టమ్ (వస్తు వినిమయ పద్ధతి) తో తృప్తిపడితే నాణాలు, నోట్లు లోకాన్ని చూసేవి కాదు. గుహల్లో జీవించిన మానవులు గుహల్లోనే తృప్తిపడితే కోట్లాది ప్రజలకి నిలవ నీడ ఉండేది కాదు. అసంతృప్తితో కూడిన మనస్సేగా అనేక మార్గాలూ, అన్య మార్గాలూ అన్వేషించేదీ! ఏం కొత్త వంగడాలని సృష్టించి ఆహార సమృద్ధిని సాధించింది. మానవుడు అసంతృప్తి కాదా! ఫోటో దగ్గరే ఆగిపోతే మనం ఫిలిం గురించి ఊహించగలిగే వాళ్ళమా? తృప్తి ఉండాలి.. ఉండితీరాలి. తన కోసమూ, సమాజం కోసమూ పాటుపడి ఆ శ్రమలో విద్యనో, జ్ఞానాన్నో ధనాన్నో ఆర్జించుకున్నాక!” అన్నాడు వినోద్. తరుణీ, అమిత్, మిథున్ చప్పట్లు చరిచారు.
“గ్రేట్ రీజనింగ్ వినోద్” మెచ్చుకుంటూ అన్నారు కమల్‌జీత్.
“యస్.. ముందు మనమేమిటో మనకి మనమే నిరూపించుకోవాలి. లోకాన్ని విడిచిపోయే ముందు మన అడుగు జాడల్ని స్పష్టంగా శాశ్వతంగా ఇక్కడ వదిలివెళ్ళాలి” ఉత్సాహంగా అన్నాను నేను. ఆనాడు అర్థమైంది. నాణానికి ఒక పక్కే కాదు. రెండు పక్కలూ చూడాలనీ, అర్థం చేసుకున్నాకే అడుగు ముందుకెయ్యాలనీ.
మరో అరగంట సరదా సంభాషణలు జరిగాక, వారందరూ భోం చేసే వరకూ ఉండి నేను నా కాటేజ్‌కి వచ్చాను. తెల్లని పరుపు మీద దుప్పట్లు, తెల్లని గలేబులు, తెల్లని రజాయి, అంతా చూడచక్కగా ప్రశాంతంగా ఉంది. నిద్ర మనిషి జీవితంలో చాలా ముఖ్యైమైనది.
అందుకే పడక గదినీ పక్కనీ చక్కగా అలంకరించాలి. అక్కడ ప్రశాంత వాతావరణం ఉండాలి. పనికి మాలిన ‘షో’ వస్తువులు అక్కడ ఉండకూడదు అని అనుకున్నాను. మనసులో నేను కట్టబోయే ఇంటి బెడ్ రూమ్ రూపుదిద్దుకుంది.
నాకు మళ్ళీ నవ్వొచ్చింది.. ఇల్లు కట్టాలనే ఆశ పుట్టినందుకు. సడన్‌గా అమ్మ జ్ఞాపకం వచ్చి ఫోన్ చేశాను.
“అనంతా.. ఎలా వున్నావే..” అమ్మ గొంతు నీరసంగా పలికింది.
“బాగున్నానమ్మా.. ఘాటింగ్‌లో ఉన్నాను.. నువ్వెలా ఉన్నావూ?” ఆత్రంగా అడిగను.
“బాగానే ఉన్నానే. ఇంట్లో వాళ్ళందరూ పక్కింట్లో డిన్నర్‌కి వెళ్ళారు. పక్కింటి రామారావుగారి షష్టిపూర్తి. నేనే నీకు ఫోన్ చెయ్యాలని అనుకున్నా” అన్నది అమ్మ.
“చెప్పమ్మా” అన్నాను. తనేదో ముఖ్యమైన విషయమే మాట్లాడబోయిందని అర్థమైంది.
“మీ అత్తయ్య గుర్తుందా.. మీ నాన్నగారి చెల్లెలు.. మొన్నా ఆవిడ దాదాపు ఇరవై ఏళ్ళ తరవాత ఇక్కడికొచ్చింది. అప్పుడు ఓ మాదిరి కుటుంబం. ఇప్పుడు కోట్లకి పడగెత్తారట. వాళ్ళ అబ్బాయిని నీకు ఇవ్వాలని వచ్చింది. ఇరవై రోజుల్నించి ఒకటే గోల. ఆడబడుచుగా నన్ను ఎన్ని విధాలుగా విసిగించాలో అన్ని విధాలుగా విసిగించింది. ఆ విషయం నీకు చెప్పాలని ఇందాకట్నించీ ఎదురు చూస్తూన్నా. మీ నాన్న బిల్లు చెక్ చేస్తాడని నీకు తెలుసుగా. అనంతా.. వాళ్ళని అసలు దగ్గర చేరనివ్వకు” ఓ నిముషం ఆగింది. మళ్ళీ
“మరో విషయం ఏమంటే మీ నాన్న మారడు. పిల్లలకి ఓ దారి చూపించి గానీ నేను బయటపడలేను. అమ్మా.. నీ కాళ్ళ మీదే నువ్వు దృఢంగా నిలబడాలి. అవసరమైతే నీ స్నేహితుల సహకారం తీసుకో. మరో మాట కూడా చెబుతున్నా. నిన్ను ఎట్లాగోట్లా ఒప్పించి నీ దగ్గరకి రావాలని మీ నాన్న ప్లాను. చింత గింజంత చోటు వచ్చినా పాతుకుపోతాడు. ఎవరన్నా మంచి వ్యక్తీ, నిన్ను బాగా చూసుకునేవాడు తటస్థపడితే తప్పక వివాహం చేసుకో. వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు. నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. ఉంటానే తల్లీ. వీళ్ళు ఎప్పడైనా లోపలికొచ్చే ప్రమాదం ఉంది. ఉంటానే. మీ మేనత్తా వాళ్ళు ఎవరినో పట్టుకుని నీ దగ్గరకు వచ్చినా, అస్సలు సందు ఇవ్వకు. సరేనా.. బంగారూ.. చల్లగా ఉండు.. దేవుడు నిన్ను నీడలా కాపాడాలి” అంటూ ఫోన్ పెట్టేసింది అమ్మ. చివర్లో అమ్మ గొంతు బాధతో వొణకటం గమనించి నాకు కన్నీల్ళు జల జలా రాలాయి.
తల్లి పేగు లాగటం అంటే ఇదేనా? నేను ఇంటి గురించి ఆలోచించినప్పుడే అమ్మ నన్ను ఇల్లు కట్టుకోమనడం ఎలా సాధ్యపడింది. తల్లి ప్రేమ తల్లి ప్రేమే. ఆ ప్రేమ ముందు ముక్కోటి దేవతలూ సాష్టంగపడాల్సిందే.
అయినా అమ్మ అడక్కుండా మనిషికిచ్చే వరాల్ని ఏ దేముడు ఇచ్చాడు? ఏ దేముడు ఇవ్వగలడు? నా దురదృష్టం ఏమంటే అమ్మ ఉన్నా అన్నీ ఉన్నా అమ్మ దగ్గర లేకపోవడమే. నా కోసం నాన్నతో మిగతా వాళ్ళతో ఎంత పోరాటం చేస్తోంది. ఎంత నీరసపడిపోతోందో. కుర్చీలో కూర్చున్నా ‘ధీర’ ఘాటింగ్ సమయంలో అమ్మ నా దగ్గర కొన్ని రోజులు రిలాక్స్‌డ్‌గా ఉండటం గుర్తొచ్చింది.
అమ్మ ఉన్నా, అమ్మని చూసుకోని వాళ్ళు ఎంత దురదృష్టవంతులు. అసలు అమ్మే లేని వాళ్ళు దురదృష్టం చెప్పడానికి మాటలే రావుగా.
మనసుని అతి కష్టం మీద సాధన వైపు మళ్ళించాను. ధ్యానం నేర్పారుగా కమల్‌జీత్. ఆ ధ్యానం వల్ల కొంత నన్ను నేను సంబాళించుకోగలిగాను.
అప్పుడు అనుకున్నాను.. ఖచ్చితంగా ఇల్లు కట్టాలి.. అమ్మకి ప్రత్యేకంగా విశాలంగా ఆవిడ కోసమే ఓ గది నిర్మించాలి. ఆమెకి ఇష్టమైన పుస్తకాలన్నీ అక్కడ అందంగా పేర్చి పెట్టాలని.
అమ్మను తలచుకుంటూ తలుచుకుంటూ పడుకున్నా. మనసులో అమ్మ మాటలే తిరుగుతున్నై.
‘ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నడయాడతారు’ అంటారు పెద్దలు. స్త్రీలని పూజించే విషయామూ, దేవతల సంగతే చెప్పారు గానీ.. ‘ఎక్కడ స్త్రీ హింసిచబడుతుంటే అక్కడ లక్షలాది దెయ్యాలు వికటాట్టహాసం చేస్తూ ఆనందిస్తాయనీ, ఆ చోటుకి వెళ్లే ధైర్యం దేవతలే చెయ్యలేర’నీ ఎందుకు చెప్పలేదూ???
(ఇంకా ఉంది)