మహతి-7

4
2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[మహిత కాలేజీతో చాలా హడావిడిగా ఉంటుంది. ఇంటర్-కాలేజీ పోటీలు రాబోతుండడం దానికి కారణం. పాటల పోటీకి హరగోపాల్, మహీ, మరో నలుగురు ఎంపికవుతారు. బూరుగుచెట్టు కింద ఈ ఆరుగురు సమావేశమై, ఏయే పాటలు పాడాలి, ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశాలు చర్చిస్తారు. కానీ ఆ నలుగురు సరిగా స్పందించరు. ఇక వాళ్ళని వదిలేసి, మహీ, హగ్గీ తమ పాటల సంగతి తాము చూసుకుంటారు. ఓ సాయంత్రం హగ్గీ మహీ వాళ్ళింటికి వెళ్ళి – తను ఎంచుకున్న పాట ఎలా ఉందో చెప్పమని మహీ వాళ్ళని నాన్నని అడిగి ‘ఏ దునియా కే రఖ్‌వాలే’ అనే రఫీ పాడిన హిందీ పాట పాడుతాడు. విన్న అందరూ మైమరిచిపోయి అతన్ని అభినందిస్తారు. పాటల పోటీకి సన్నాహాలు సాగుతుంటాయి. ఓ రోజు ఉషారాణి అనే అమ్మాయి రాసిన కథకి ‘ఆంధ్రపత్రిక’లో మొదటి బహుమతి వస్తుంది. ప్ర్రిన్సిపాల్ గారు, మిగతా లెక్చరర్లు ఆమెని అభినందిస్తారు. భారతి అనే అమ్మాయి రన్నింగ్ రేస్‍లో ఫస్ట్ వస్తుంది. పోటీలకు సన్నద్ధమవుతూ కూడా కుసుమ సంగతి మర్చిపోదు మహీ. అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కుసుమ ఆరోగ్యం నిలకడగానే వుందని తెలుసుకుంటుంది. పాటల పోటీలు మొదలవుతాయి. జాలాది గారు, రంగనాథ్ గారు, జి. ఆనంద్ గారు న్యాయనిర్ణేతలుగా వస్తారు. కార్వర్ట్ పైనల్స్‌కి ఎనిమిది మంది వస్తే, వాళ్ళల్లో మహీ కాలేజ్ నుండి తనూ, హగ్గీ మాత్రమే మిగిలారు. క్వార్టర్ ఫైనల్స్‌లో హగ్గీ ‘శివశంకరీ, శివానందలహరి’ పాట పాడ్తాడు. చప్పట్లు మారుమ్రోగుతాయి. మహీ ‘శ్రీరాముని చరితమునూ తెలిపెద మమ్మా – ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా’ అనే పాటని తన్మయత్వంతో పాడుతుంది. జడ్జీలతో సహా అందరూ అభినందిస్తారు. సైమీఫైనల్సూ, ఫైనల్సూ నల్లేరు మీద బండిలా సాగుతాయి. గాల్స్ తరఫున మహీ, బాయిస్ తరఫున హగ్గీ ఇద్దరూ ఫస్టు ప్రైజ్‌లు గెల్చుకుంటారు. వక్తృత్వపు పోటీల్లో ఉషారాణికి మొదటి బహుమతి, మహీకి ద్వితీయ బహుమతి వస్తాయి. పరుగుపోటీల్లో భారతి మొదటి ప్రైజ్ సాధిస్తుంది. ఆమెకి కోచ్‌ని ఏర్పాటు చేసి, తగిన శిక్షణ ఇప్పిస్తామని ప్రామిస్ చేస్తారు ఆంధ్రా సెలెక్టర్. – ఇక చదవండి.]

[dropcap]కా[/dropcap]లేజీ మొత్తం రంగురంగుల తోరణాలతో, స్వాగత ద్వారాలతో విద్యార్థుల కేరింతలతో నిండిపోయింది.

కారణం ఒకే కాలేజీ నించి అయిదుగురు స్టూడెంట్స్ అద్వితీయంగా గెలవటం. అందులో నాలుగు ఫస్టు ప్రైజులూ, ఒకటి సెకండ్ ప్రైజూ (నాదే – వక్తృత్వంలో) కావడం. మా ప్రిన్సిపాల్ గారైతే ఒక్కటే మాటన్నారు – “ఇవ్వాళ నేను ప్రిన్సిపాల్‍నని గర్వంగా చెప్పుకోగలను. ఆ గర్వాన్ని నా నుదుట దిద్దింది మీరే!” అని. సన్మాన కార్యక్రమం 3½ గంటల పాటు సాగింది. అందరూ మమ్మల్ని పొగిడేవారే. గౌరవించేవారే.

మహదానందంగా ఇంటికెళ్ళాను. పి.డబ్ల్యూ.డి. గ్రౌండ్స్‌కి మా అమ్మానాన్న వచ్చారని నాకు తెలీనే తెలీదు. కాలేజీ నుంచి సగర్వంగా ఇంటికొచ్చేసరికి గోడల మీద పెద్ద పెద్ద ఫొటోలు (దళసరి ఫ్రేమ్‌తో) వేలాడుతున్నాయి. ఫొటోలు మాత్రం కనపడకుండా పైన కలర్ పేపర్ అతికించి వుంది. నేను ఇంటికి రాగానే, మా నాన్న నాతోటే ఒక్కొక్కటీ ఓపెన్ చేయించారు. మై గాడ్, అన్నీ నా ఫొటోలే. రంగనాథ్ గారు తల నిమురుతున్నదీ, జాలాది గారు భుజం తట్టిందీ, జి. ఆనంద్ గారు కరచాలనం చేస్తున్నదీ, నేను తన్మయత్వంతో పాడుతున్నదీ, ప్రైజ్ మనీ ముగ్గురు జడ్జీల చేతి మీదుగా అందుకుంటున్నదీ.. ఓహ్.. అన్నీ 18″ x 12″ ఫొటోలే. అద్భుతమైన గోల్డ్ ఫ్రేమ్‌తో మెరిసిపోతున్నై. నాకు పిచ్చెక్కింది. “ఎప్పుడొచ్చారు నాన్నా” అంటూ చిన్నపిల్లలా కావలించుకున్నాను.

“నువ్వు అంత అద్భుతంగా పాడతావని నిజంగా నాకు తెలీదురా మహీ.. ఓహ్.. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ” అన్నారు నాన్న చెమ్మగిల్లిన కళ్ళతో.

“కొంత బాగానే పాడతావని తెలుసు గానీ, ఇంత గొప్పగా పాడతావని నిన్న సాయంత్రం దాకా తెలీదే. క్వార్టర్ ఫైనల్స్‌లో నీ పాట విన్న మరుక్షణమే మీ నాన్న ‘వీరయ్య ఫొటో స్టూడియో’కి వెళ్ళి ఆయన్ని బ్రతిమాలి మరీ తీసుకొచ్చి నీ ఫొటోలు తీయించారు. ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, అన్ని పనులూ మానేసి చివరిదాకా వుండి నీ ఫొటోలు తీశారు. అంతే కాదు, ఆ ఫొటోల్ని నీకు గిఫ్ట్‌గా ఇమ్మని చెప్పారు. ఒక్క పైసా కూడా మేము ఎంత బతిమాలినా తీసుకోలేదు” మెరుస్తున్న కళ్ళతో అన్నది మా అమ్మ.

టేబుల్ మీద మరో నాలుగు పటాలు ఫ్రేమ్ చేసి పేక్ చేసి ఉన్నాయి. “అవి?” అడిగాను.

“హరగోపాల్‍వి. అతను ఖచ్చితంగా నీకు ట్రైనింగ్ ఇచ్చి వుండాలి. అందుకే, అతనివీ ఫ్రేమ్ చేయించా” నవ్వుతూ అన్నాడు మా నాన్న.

నా గుండె నిండిపోయింది. కన్న తల్లిదండ్రులుగా నా మీద ప్రేమతో యీ జ్ఞాపికల్ని నాకు బహుకరించడం వేరు. నాతో పాటు పాడిన హగ్గీ ఫొటోల్ని కూడా జ్ఞాపికలుగా తయారు చేయించడం నిజంగా గ్రేట్. అది నా తల్లిదండ్రుల జన్మ సంస్కారానికి అద్దం పడుతుంది. ఆ మరుసటి రోజున హగ్గీని మా ఇంటికి పిలిచాను. విషయం చెప్పలేదు. భోజనాలు స్పెషల్‌గా తయారించింది మా అమ్మ. ముందు నాన్న తీయించిన నా ఫొటోలు అన్నింటినీ చూపించా. హగ్గీ చాలా అనందపడ్డాడు. భోజనాలయ్యాకా, హరగోపాల్ ఫొటోల మీద పైపైన అంటించిన రంగు కాయితాల్ని అతని చేతే తీయించారు మా నాన్న.

మొదటి ఫొటో చూస్తూనే అవాక్కయ్యాడు హగ్గీ. నాలుగూ గబగబా చూచాడు. అతని కళ్ళల్లోంచి ధారగా కన్నీరు. పెదాలు వణుకుతున్నాయి. ఠక్కున మా నాన్న పాదాల మీద చేతులానించి నేలమీద కూలబడ్డాడు.

***

ఈ ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాలం వుండదు. ప్రేమైనా, ద్వేషమైనా, పగ అయినా, కృతజ్ఞత అయినా, పొగడ్త అయినా, విమర్శ అయినా, అన్నీ కదిలిపోయే మేఘాలే.

‘పోటీలో గెలిచిన’ కథ కూడా కొంతకాలమే నడిచింది. ఆ తరువాత అన్నీ యథాతథంగానే సాగుతున్నాయి. మొదటి ఓ వారం పది రోజులు మమ్మల్ని హీరోలుగా చూశారు. ఆ తరువాత మళ్ళీ మామూలే. అయితే తేడా ఏమంటే, ఇప్పుడు ఎవరి పుట్టినరోజైనా మమ్మల్ని పాట పాడమని బ్రతిమలాడుతున్నారు. నేనిది త్వరగానే జీర్ణించుకోగలిగాను. హగ్గీ మాత్రం తట్టుకోలేకపోయాడు.

“బాబూ, అవ్వాళ గెలిచాం, ఆకాశానికెత్తేశారు. ప్రతిరోజూ మనల్ని పొగడడమేనా జనాల పని?” అని నాలుగయిదు సార్లు చెప్పాకా, కొంత మామూలయ్యాడు.

తిమ్మూ మాత్రం చాలా సైలెంటయ్యాడు. అతను ఏ పోటీలోను గెలుపొందలేకపోయాడు. కాన్‌సన్‌ట్రేషన్ బాగా తగ్గింది. ఓ రోజు లైబ్రరీలో తిమ్మూ ఒంటరిగా దొరికాడు. మనిషి కూడా బాగా డల్ అయిపోయాడు.

“తిమ్మూ నన్ను ఫ్రెండ్ గానే భావిస్తావు కదూ?” అడిగాను ఎదుటి కుర్చీలో కూర్చుంటూ.

“నూటికి నూరు పాళ్ళూ” అన్నాడు.. ఓ సన్నని నిట్టూర్పు.

“ఏం జరిగిందీ? డిబేట్‍లో నువ్వు ఫస్ట్ వస్తావని అందరం అనుకున్నాం. పోటీ జరిగేటప్పుడు కూడా నేను అక్కడే వున్నాను. నువ్వసలు ఏ మాత్రం ప్రిపేర్ కానట్టు అనిపించావు. ఎందుకు?” అనునయంగా అడిగాను.

“మహీ.. విని లాభం వుందా?” మళ్ళీ నిట్టూర్పు.

“నాకు లాభనష్టాలతో పని లేదు. నీ భాధని పంచుకుంటే గాని, నీ సమస్యకి పరిష్కారం దొరకదు. ఆ పంచుకోవడానికి నాకు అర్హత వుందనుకుంటే చెప్పు” స్థిరంగా అన్నాను.

“కారణం అనంతలక్ష్మి. నన్ను ప్రేమించిదట. నేను ప్రేమించకపోతే బ్రతకదట. ప్రేమించి తీరాలట. ఒక మాట కాదు, ఓ గోల కాదు. నాకు పిచ్చెక్కుతోంది మహీ. ఎలా డీల్ చెయ్యాలో తెలీడం లేదు. భయంకరంగా బెదిరిస్తోంది.” వేదనగా అన్నాడు.

ఇది నేను వూహించిందే. చాలామంది ఆడవాళ్ళు మహా సున్నితమైన వాళ్ళని భ్రమపడుతూ వుంటారు. కుసుమ లాంటి వాళ్ళు నూటికొక్కరు వుంటారేమో. అల లాంటి వాళ్ళు లోకంలో కోకొల్లలు. ‘ప్రేమ’ అంటే వాళ్ళ దృష్టిలో ఎదుటివారి మీద ఆధిపత్యం. తాము మాత్రమే సిన్సియర్ అనీ, ఎదుటివాళ్ళు ఉత్త చీట్ ‍లనీ వాళ్ళ అభిప్రాయం. కాదు.. కాదు.. అహంకారం.

“ఎవరికి చెప్పినా అసహ్యంగా వుంటుంది. నా జీవితం వడ్డించిన విస్తరి కాదు మహీ. నాకంటూ కొన్ని ఆశయాలు వున్నై. ఈ పిచ్చి గోలతో నిజంగా నాకు పిచ్చెక్కుతోంది” రెండు చేతులతోనూ కణతలు నొక్కుకుంటూ అన్నాడు.

“సరే తిమ్మూ. మన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి దీనికి తప్పకుండా ఓ పరిష్కారం చూద్దాం. దసరా సెలవులు ఎలాగూ వారంలో వస్తున్నాయి కదా. నువ్వు రేపో మాపో ఎల్లుండో క్వయిట్‍గా ‘పెర్సనల్ ప్రాబ్లమ్’ అని ప్రిన్సిపాల్ గారితో చెప్పి మీ వూరెళ్ళిపో. ఈ విషయం అలకి తెలీనివ్వదు” చెప్పాను.

“ఎన్నాళ్ళు పారిపొమ్మంటావూ?” నిరాసక్తతతో అడిగాడు.

“దీన్ని పారిపోవడం అనరు. సమస్యని విశ్లేషించి, పరిష్కారం వెదకటానికి ‘టైం’ తీసుకోవడం అంటారు” అన్నాను.

అతనో రెండు మూడు నిముషాలు ఆలోచించి, “సరే మహీ, అలాగే వెళ్తాను” అన్నాడు.

“నీ అడ్రెస్ ఇవ్వు. నిన్ను కాంటాక్ట్ చెయ్యడానికి వీలుండే ఫోన్ నెంబరు ఏదన్నా వుంటే ఇవ్వు” అడిగాను.

“అలాగే అడ్రస్ రాసిస్తాను. ఫోన్ నెంబర్ అక్కడికి వెళ్ళాక ఉత్తరంలో వ్రాస్తాను” అన్నాడు. అతని స్వరంలో చాలా రిలీఫ్ కనిపించింది. ఇందుకేనేమో ‘బాధని పంచుకుంటే, గుండె భారం తగ్గుతుంద’ని అనేది.

మరుసటి రోజే ‘తిమ్మూ’ క్లాసుకి రాలేదు. ఆ సాయంత్రమే నేను హగ్గీతో తిమ్మూ సమస్యని చెప్పాను.

“మహీ.. అల చాలా జోవియల్ అనీ, అందరితో కలిసిపోతుందనీ అనుకున్నాను. లోపల్లోపల ఇంత కఠినత్వం ఉంటుందని వూహించలేదు. నువ్వు ఇచ్చిన సలహా మంచిదే. ఆ అమ్మాయి ఇప్పుడేం చేస్తుందో బాగా గమనించడానికిదే మంచి అవకాశం” అన్నాడు.

కాలేజీకి రాగానే అల తిమ్మూ కోసం మాటిమాటికీ చూడడం ఆల్‍మోస్ట్ ఆడపిల్లలంతా గమనించారు. హగ్గీ బయటపడకుండా అలని గమనిస్తున్నాడు.

అసహనంగా, పిచ్చెత్తిన దానిలాగా క్షణానికోసారి ఎంట్రన్స్ వంక చూస్తోంది. మధ్యాహ్నం టిఫిన్ బాక్సు కూడా ఓపెన్ చెయ్యలేదు.

ఇక సాయంత్రం తిమ్మూకి క్లోజ్‍గా వుండే బసివిరెడ్డి దగ్గరికెళ్ళి అడిగింది. బసివిరెడ్డి తెలీదని తల అడ్డంగా వూపడం వల్ల, అల తిమ్మూ గురించి అడిగి వుంటుందని మాకు అర్థమయింది.

రెండో రోజు అల పరిస్థితి మరీ దుర్భరంగా వుంది. ‘స్నేక్ పిట్’లో పడి విపరీతమైన వేగంతో బయటపడే ప్రయత్నం చేసే తాచుపాములా అనిపించింది మాకు.

“నిజంగా తిమ్మూ పరిస్థితికి జాలేస్తోంది మహీ. దీన్నే ప్రేమ అని గనుక అంటే, అంతకంటే దౌర్భాగ్యం మరొకటి వుండదు!” ప్లేగ్రౌండ్‍లో పిచ్చిపట్టిన దానిలా తిరుగుతున్న అల వంక చూస్తూ అన్నాడు హగ్గీ. ఆల్‍మోస్ట్ నాకూ అదే అనిపించింది.

“మహీ.. తిమ్మూ సంగతి ఏమైనా తెలుసా?” చాలా మామూలుగా ఏమీ తెలియనట్టుగా నన్నడిగింది అల.

“తిమ్మూకి ఏమయిందో నాకెలా తెలుస్తుందీ?” అడిగాను నేనూ అమాయకంగా మొహం పెట్టి.

“కాలేజీకి రాక ఇవ్వాల్టికి నాలుగో రోజు. పాపం ఆరోగ్యంగా వున్నాడో లేదో!” కేజువల్‍గా అన్నట్టు అన్నది.

“ఏమో.. అయినా అలా, యీ మధ్య నువ్వు నాతో మాట్లాడడమే తగ్గించావుగా. పోనీలే, ఇప్పటికైనా పలకరించావు!” కావాలనే నిష్ఠూరంగా అన్నాను.

“అరరే అదేం లేదే. నేను బాగానే వున్నాను. నువ్వే ప్రైజు గెల్చిన మైకంలో వున్నావు!” పుల్లవిరుపుగా అన్నది అల.

“అవునా! నిజమే! ప్రైజ్ గెలిచిన రోజు నుంచే నా నెత్తిన కొమ్ములు మొలుచుకొచ్చాయి. ఇప్పుడు అవి బాగా పెరిగాయి కూడానూ..! కదూ! అలా యీ పుల్లవిరుపు మాటలు నీ నోట్లోంచి వస్తాయని ఏనాడూ నేను వూహించలేదు. ఓకే. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్” నేనూ కట్ చేశాను. అల విసవిసా నడుచుకుంటూ పోయింది.

ఆరో రోజుకి నాకు తిమ్మూ నించి ఉత్తరం వచ్చింది. ఫోన్ నెంబరు మాత్రం రాశాడు. “మహీ.. భగవంతుడు దయామయుడు. నేను లీవ్ లెటర్ ప్రిన్సిపాల్ గారికిస్తూ జరుగుతున్న విషయాన్ని ఆయనకి చెప్పాను. ఆయన, టి.సి.కి అప్లయి చెయ్యమని చెప్పడమే గాక, వాళ్ళ స్నేహితుడు ప్రిన్సిపాల్‌గా వున్న మరో వూరికి నన్ను పంపారు. నేను ఇక్కడికి వచ్చేముందే నా సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను. ఈ ధైర్యాన్నిచ్చింది నువ్వే. చాలా చాలా ధన్యవాదాలు. కొత్త కాలేజీలో చేరాకా నీకు మాత్రమే ఫోన్ చేసి చెబుతా. దయచేసి నా ఆచూకీ ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా ఆ ..కి. మరోసారి ధన్యవాదాలతో. తిమ్మూ” అని వుంది ఆ వుత్తరంలో. అసంకల్పితంగా ఓ సుదీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది. ఓ పక్క అల నించి అతడు బయటపడ్డందుకు సంతోషం, మరో పక్క ఓ మంచి స్టూడెంట్‍ని ‘ప్రేమ’ పేరుతో వేటాడిన అల మీద అసహ్యం.

హగ్గీకి మాత్రమే విషయం చెప్పి “యీ విషయం మాత్రం బయటకి రానీయద్దు” అని చెప్పా. తిమ్మూ ఇచ్చిన నంబరు హగ్గీకి కూడా చెప్పలేదు. దసరా సెలవులిచ్చేవరకు అల పిచ్చికుక్కలా బిహేవ్ చేసింది. చిన్న చిన్న వాటికే తగువులు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఎంతని భరిస్తారు? వందనకి కోపం వచ్చి ప్రిన్సిపాల్‌కి రిపోర్ట్ చేస్తే, ప్రిన్సిపాల్ అలని పిలిచి స్ట్రిక్ట్ వార్నింగిచ్చారు.

ఏమైనా, ఓ మంచి మిత్రుడ్ని కోల్పోయాం. దసరా సెలవులిచ్చారు. నేను కుసుమ పరిస్థితి చూడడానికి మా వూరెళ్ళాలనుకున్నాను. కుసుమే కాదు, అక్కడ మా అమ్మమ్మ తాతయ్యా నా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు.

***

మళ్ళీ మా కర్రావూరి వుప్పలపాడుకి వెళ్ళాను. సామాన్లు, అంటే నేను తెచ్చుకున్న రెండు సూట్‌కేసులూ ఇంట్లో పడేసి బయలుదేరబోయాను.

“కుసుమని చూడ్డానికా?” నిర్లిప్తంగా అన్నది అమ్మమ్మ.

“ఔను” అన్నాను.

“ఇంత కాలానికి వచ్చావు. కనీసం నీ అమ్మమ్మ తాతయ్యా ఎలా వున్నారో నీకు పట్టలేదు. మహీ, ఇతరుల్ని ప్రేమించడం, స్నేహితుల్ని ఆదరించడం తప్పు లేదు. కానీ నీ వాళ్ళని నువ్వే నిర్లక్ష్యం చెయ్యడం బాగుందా? అది సమంజసమైనదేనా? సరే.. వెళ్ళిరా!” లోపలికి వెడుతూ అంది అమ్మమ్మ. తాతయ్య కనిపించలేదు. బయటకు వెళ్ళారేమో మరి. అమ్మమ్మ అంత నిష్ఠూరంగా మాట్లాడడం ఏనాడూ నేను వినలేదు.

కానీ మనసులో కుసుమని చూడాలన్న తొందర, అమ్మమ్మ నిష్ఠూరానికి కారణం అడగాలన్న కుతూహలాన్ని పక్కన పెట్టించింది. సరాసరి కుసుమ వాళ్ళింటి కెళ్ళాను.

కుసుమ బాగానే పుంజుకుంది. నా మోహం చూడగానే ఉత్సాహంతో పరిగెత్తుకు రాకపోవడం నిరాశ కల్గించినా, ఆ నిరాశని బయటపెట్టకుండా, “ఎలా వున్నావే?” అని అడిగాను. “బాగానే వున్నాను మహీ.. నువ్వెట్లా వున్నావూ?” మొహమాటానికి అడిగినట్లు అడిగింది. నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నట్లు నాకు అనిపించింది.

“ఇప్పుడు ఆరోగ్యం ఎలా వుందీ?” అది కూర్చోమనక పోయినా అరుగు మీద కూర్చుంటూ అడిగాను.

“దానికేవమ్మా. బ్రహ్మాండగా వుంది! రేపు అత్తారింటికి కూడా వెడుతోంది, నీలాంటి వాళ్ళు మధ్యలో దూరి నానా పిటకాలూ పెట్టకుండా వుంటే!” చేతులు తిప్పుతూ అన్నది ముసల్ది.

“నిజమా?” కుసుమని చూస్తూ అడిగాను.

“అవునే. ఆయన పూర్తిగా మారారు. తాగుడు, జరదా కిళ్ళీలు కూడా పూర్తిగా మానేశారు. మందులు తీసుకుని ఆరోగ్యం కూడా బాగు చేసుకున్నారు. డాక్టరు సర్టిఫికెట్ కూడా తెచ్చారు” కొంచెం తల పక్కగా వంచి, నా వంక చూడకుండా అన్నది కుసుమ.

మాట్లాడకుండా లేచి బయటకి వచ్చేశా. ఇందుకన్న మాట మా అమ్మమ్మకి కోపం వచ్చింది అనుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి తలుపు తాళం వేసి వుంది. షాక్. పక్కింటి పిన్నిగారు నన్ను చూడగానే తాళం ఇచ్చి “మీ తాతగారు హాస్పటల్లో వున్నారమ్మా. ఇప్పుడే మీ అమ్మమ్మ గారు హాస్పటల్‌కి వెళ్ళారు. నువ్వొస్తే తాళాలివ్వమని చెప్పారు” అన్నది.

గుండెల మీద పేద్ద సుత్తితో బాదినట్లయింది. హాస్పిటల్‍కి పరుగెత్తాను. డా. శ్రీధర్ బయటికొస్తూ కనిపించారు. “డాక్టర్” అని తెలియకుండానే అరిచాను.

“ఓహ్.. వచ్చేశావా! గుడ్. మొన్న కొంచెం భయపడ్డాను కానీ, ఇప్పుడు ఫరవాలేదు. చాలా మైల్డ్ స్ట్రోక్. అయినా, ఆ జనరేషన్‍కి వున్న స్ట్రెంగ్త్ మనకేదీ.. యూ కెన్ గో ఎండ్ సీ” నవ్వి అన్నారు శ్రీధర్, వెనక్కి నాతో హాస్పిటల్‍కి వస్తూ.

లోపలికి పరిగెత్తా. తాతయ్య మంచం మీద విశ్రాంతిగా పడుకుని వున్నాడు. ఆయన్ని అలా నిస్సహాయంగా పడుకోగా చూడటం నాకు ఇదే మొదటిసారి. అమ్మమ్మ పక్కనే వుంది. తాతయ్య చెయ్యి పట్టుకున్నాను. మెల్లగా కళ్ళు తెరిచారు. కళ్ళల్లో ఓ మెరుపు. “ఎప్పుడొచ్చావురా!” అన్నారు. “తాతయ్యా ఫోన్ ఎందుకు చెయ్యలేదు?” కోపంగా అన్నాను.

“చెయ్యచ్చు. కానీ వచ్చి అందరూ ఇబ్బంది పడటం తప్ప ఉపయోగం ఏముంటుందీ. అదీ గాక వచ్చింది మైల్డ్ స్ట్రోకు. జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు డాక్టరు గారు” నవ్వి అని, “దీనికి ముందు భోజనం పెట్టవే” అన్నారు అమ్మమ్మతో.

లేచి అమ్మమ్మని కౌగిలించుకున్నాను. అంతకుమించి ఏం చేయగలనూ? ఇంటికి రాగానే కుసుమ ధ్యాసే గానీ పెద్దవాళ్ళ క్షేమం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదుగా నేను. అమ్మమ్మ మెల్లగా నా తల నిమిరి “ముందు మీకు తినిపించి తరవాత దాన్ని ఇంటికి తీసుకెడతా లెండి. ఈలోగా పాలేరు వెంకడూ, వాడి పెళ్ళాం దుర్గా కూడా వచ్చి ఇక్కడుంటారు, నేను మళ్ళీ వచ్చేదాకా” అన్నది అమ్మమ్మ.

మేం ఇంతమందిమి వుండగా పాలేరూ, పాలేరు భార్యా చూసుకోవాల్సి వచ్చిందా.. భగవంతుడా! లోలోపలే బాధతో సుడి తిరిగిపోయాను. నా ఎదురుగానే తాతయ్యకి ‘పథ్యం’ భోజనం తినిపించింది అమ్మమ్మ.

“నన్ను క్షమించు అమ్మామ్మా” హాస్పటల్ గేటు దాటుతూ వుండగానే అన్నాను అమ్మమ్మతో. ఓ క్షణం ఆగి, నా భుజం మీద చెయ్యేసింది అమ్మమ్మ.

“అంత పెద్ద మాటెందుకే! చిన్నదానివి. అందరిలానే నువ్వూ స్నేహానికే పెద్ద పీట వేశావు! అయినా తాతయ్య హాస్పటల్‍లో వున్నట్టు నీకు తెలీదుగా. నీకు చెప్పకపోవడం నాదీ పొరపాటే” అన్నది అమ్మమ్మ లాలనగా. కుసుమ విషయం చెప్పాలనిపించలేదు.

ఇంటికి వెళ్ళిన వెంటనే తాతయ్య హాస్పటల్‍లో ఉన్న సంగతి అమ్మకి ఫోన్ చేసి చెప్పాను. అమ్మమ్మ వారించినా, నేను వినలేదు.

“అమ్మమ్మా.. మేం ఇబ్బంది పడతామనే మీరనుకున్నారు గనీ, తెలీకపోతే ఇంకెంత బాధపడతామో ఆలోచించలేదు. నేను కూడా ఆ విషయం దాస్తే, అమ్మానాన్నా యీ జన్మలో నా మోహం చూడరు” అన్నాను.

సాయంత్రానికల్లా అమ్మానాన్నా సురేన్, నరేన్, కల్యాణీ మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు హరగోపాల్ కూడా వచ్చాడు. అందర్నీ ఒకేసారి చూసిన ఆనందంలో తాత మొహం పున్నమి చంద్రుడిలా మారింది.

“హాస్పటల్లో ఎందుకూ? హాయిగా ఇంటికెళ్ళిపోండి. రిక్షాలూ కార్లూ కూడా అక్కర్లా. నడిచే వెళ్ళవచ్చు. అసలు మీకు స్ట్రోకు వచ్చిందన్న సంగతే మర్చిపొండి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మహీతో చెప్పి పంపుతాను” తాతయ్యని పరీక్షించి డిశ్చార్జ్ చేస్తూ అన్నారు డాక్టర్ శ్రీధర్. మహా ఉత్సాహంగా మంచం దిగాడు తాతయ్య.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here