మహతి-72

6
2

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[హిందీ ‘ధీర’ షూటింగ్ జరుగుతూంటుంది. విలన్ రైట్ హ్యాండ్‍గాడి జుట్టు పట్టుకుని డైలాగ్ చెప్పే ఒక ఎమోషనల్ సీన్‍లో అల అద్భుతంగా నటిస్తుంది. అందరూ అభినందిస్తారు. పాత్ర తాలూకు ఇంటెన్సిటీ నుంచి బయటపడలేకపోతుంది అల. అదే ఇన్‍వాల్వ్‌మెంట్‌తో మిగతా డైలాగ్ పార్ట్ కూడా ఇప్పుడే చిత్రీకరిద్దామని అంటాడు దర్శకుడు అమిత్. సరేనంటుంది అల. పదిహేను నిమిషాలు బ్రేక్ దొరకటంతో కుర్చీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. ఇంతలో సినిమాలో అల తల్లిగా నటిస్తున్న నందినీ సోల్గాంకర్ – నటనని మరీ సీరియస్‍గా తీసుకుని పాత్రలా మారిపోకూడదని, అలా చేస్తే ఆ పాత్ర తాలూకూ రిఫ్లెక్షన్ మనసుపై పడి చాలా ప్రభావం చూపుతాయంటూ తన అనుభవంలోంచి జాగ్రత్తలు చెబుతుంది. ఇంతలో సరోజ్ వచ్చి ఓ చాక్లెట్ ఇస్తుంది. చాక్లెట్ చప్పరిస్తే టెన్షన్ తగ్గి మనసూ, శరీరమూ క్షణాల్లో సెట్ అవుతుందని చెప్తుంది. వెంటనే రేపర్ విప్పి నోట్లో వేసుకుంటుంది అల. సరోజ్ వెళ్ళిపోయాకా, నందిని మాట్లాడుతూ, సరోజ్ చెప్పిన విషయం కరక్టే అయినా, ఇంకెప్పుడు ఎవరు ఏదిచ్చినా నిస్సంశయంగా తినొద్దని హెచ్చరిస్తుంది. గతంలో ఓ నటుడికి ఎదురైన సంఘటనలు వివరిస్తుంది. ఆమె చెప్పినవన్నీ పాటిస్తానని చెప్తుంది అల. సాయంత్రం టీ బ్రేక్‍లో దైవత్వం గురించి చర్చ జరిగితే, కమేడియన్ జులూ వెటకారంగా మాట్లాడుతాడు. అతడికి  చురుక్కుమనిపించే సమాధానం చెప్తారు కమల్‍జీత్. తన తర్వాతి సినిమా ప్లానింగ్ ఎప్పుడో అయిపోయిందనీ, ఆ తర్వాతి సినిమాలో హీరోయిన్‍గా నటిస్తావా అని వినోద్ అలని అడిగి, ఆమె ఒప్పుకోగానే, అలని హగ్ చేసుకుని, ఆ విషయాన్ని అందరికీ ప్రకటిస్తాడు. అన్ని వ్యవహారాలు చూసుకునే ఓ మేనేజర్‍ని పెట్టుకునే సమయం వచ్చిందని కమల్‍జీత్ అలకి చెప్తారు. మంచి వ్యక్తిని ఆయన్నే చూడమని చెప్తుంది అల. ఆ రోజు షూటింగ్ ముగిసాకా, మర్నాడు షూటింగ్ లేదు కాబట్టి, తాను ఊరికి వెళ్ళొస్తానని అంటారు కమల్‍జీత్. ఏమన్నా విశేషమా అని అని అమిత్ అడిగితే, తన భార్య పుట్టినరోజు అని చెప్తారు. తానూ వస్తానంటుంది అల. తమకి రావాలని ఉన్నా, షూటింగ్ ఏర్పాట్ల వల్ల రాలేమని తరుణి, వినోద్ చెప్తారు. కారులో బయల్దేరి వెళ్తారు అల, కమల్‍జీత్. అలని చూసి ఎంతో సంతోషిస్తుంది డల్జీత్ కౌర్. మర్నాడు ఎంతో సంతోషంగా గడుపుతారు. సాయంత్రం బయల్దేరి రాత్రికి షూటింగ్ స్పాట్‍కి చేరుతారు. రాత్రి నిద్రించే ముందు ఓ కవిత రాసుకుంటుంది అల. డల్జీత్ గుర్తొచ్చి, అమ్మ కూడా గుర్తుస్తొంది. అమ్మని తలచుకుని బాధపడుతుంది అల. – ఇక చదవండి.]

మహతి-4 మహతి-అల-19

మహతి:

[dropcap]జీ[/dropcap]వితం ఎంత తొందరగా గడుస్తోందంటే ఆ తొందర మనసులకీ శరీరాలకీ కూడా పట్టేసినంత. దాన్ని యాంత్రిక పరిభాషలో ‘డైనమిక్ ఇనర్షియా’ అంటారు. కుసుమ బామ్మ కొంత కోలుకుంది. మనం చెప్పేవి అర్థం చేసుకుంటోంది. 12 రోజులు అయ్యాక ఓ పాతికమంది దిగారు, “మేమే వారసులం” అని.

కరణంగారూ, ప్రెసిడెంటు గారూ స్పష్టంగా, “మేము ఏనాడూ మీ మొహాలు చూడలేదు. అర్జంటుగా ఎక్కడి నించి మీరు పుట్టుకొచ్చారో, ఊడిపడ్డారో మాకు తెలియదు. పెద్దావిడ పూర్తి సృహలోకి వచ్చి ఆవిడ ఏం చేయాలనుకుంటారో మాతో చెబితే సరేసరి. లేకపోతే ఆ ఆస్తిని ఎలా వినియోగించాలో మేము ఏర్పరిచే కమిటీ నిర్ణయిస్తుంది” అని చెప్పారు.

వాళ్ళు చాలా గట్టిగా అరుపులు మొదలెట్టారు గానీ, ఊరివారంతా వచ్చేసరికి తోక ముడిచారు. “వాళ్ళళ్లో కొందరు కుసుమ మాజీ భర్త తాలూకూ వాళ్ళు, వాళ్ళని పెళ్ళిలో చూసినట్టు గుర్తు” అన్నారు తాతయ్య.

ఎంత దైన్యం? ఏనాడు మనిషి ‘డబ్బు’ కనిపెట్టాడో ఆనాడే తనలోని మానవత్వాన్ని తనే హత్య చేసుకున్నాడు అనిపించింది నాకు. తాతయ్యకే కాదు, ఆ వచ్చిన వాళ్ళ వెనక కుసుమ మాజీ మొగుడి హస్తం చాలా ఉందని అర్థమైంది.

పల్లె తల్లిలాంటిది. బిడ్డ కోసం తల్లిపేగు లాగినట్టు, పల్లెపేగు కూడా బిడ్డని ఊళ్ళోకి లాగుతుంది. అందుకేనేమో, కుసుమ ఆస్తి వ్యవహారం కోసం ఊరు మొత్తం ఏకతాటి మీద నిలబడింది.

ఇందిర గారు అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారు త్రిపుర నించి. తాతయ్య కూడా ప్రతి విషయము ఇందిరగారికి చెబుతున్నారు. నాకు పని చాలా ఎక్కువైంది. కుసుమ బామ్మగారికి కూడా నేనే వంట వండి పంపుతున్నాను. నన్ను చూస్తే మాత్రం ఆవిడ నను గట్టిగా పట్టుకుని వదలడం లేదు. ఆవిడలోని గతకాలపు ధాటీ, కఠినత్వం బదులుగా అమితమైన బేలతనం, ప్రేమా ఇప్పుడు కనబడుతున్నాయి.

డా. శ్రీధర్, డా. శారదలు నాకు క్లియర్‌గా చెప్పారు.. ఇందిర గారి హెల్త్ చాలా సెన్సిటివ్‌గా ఉందనీ, మొదట ఆవిడ మానసికంగా కోలుకోవాలనీ. “మందులు తాత్కాలికం. మానసిక స్థైర్యం ముఖ్యం” అని మరీమరీ చెప్పారు. చిత్రం ఏమంటే, అసలు విషయం వారికి ఎలా చెప్పనూ? ‘మన మనసే మనకు బందిఖానా’ అని చెప్పేదెలా?

తాతయ్య ఓ రోజు హాస్పటల్ నుంచి నాకు కబురెట్టారు. కుసుమ బామ్మ చాలా మెలకువతో, స్పష్టమైన మనసుతో ఉండటం నాకు ఆశ్చర్యమనిపించింది. డా. శారద, డా. శ్రీధర్ మాత్రమే కాక కరణంగారూ, మునసబు గారు, ప్రెసిడెంటు గారూ, కుసుమ ఆస్తి కోసరం వ్యవహారాలు నడుపుతున్న కమిటీ మెంబర్సు, త్రిపుర అందరూ అక్కడే ఉన్నారు.

కుసుమ బామ్మ నన్ను చూడగానే దగ్గర కూర్చోబెట్టుకుని, “తల్లీ, జరిగిపోయిన దానికి కన్నీళ్ళు కార్చడం తప్ప ఏమి చేయలేనిదాన్ని. ఆ కన్నీళ్ళూ ఇంకిపోయాయి. పైవాడి పిలుపు కోసం మాత్రమే ఎదురు చూస్తున్నా. కానీ చెయ్యాల్సింది చెయ్యాలి. ఈ ఆస్తి నిజంగా నా తల్లిదండ్రుల దగ్గర్నించి నాకు సంక్రమించిన ఆస్తి. కొడుకూ, కోడలూ, మనవరాలూ అందరూ వెళ్ళిపోయారు. కుసుమ హాస్పటల్లో వుండగా దాన్ని మనుషుల్లో పడెయ్యడానికి నువ్వెంత శ్రమపడ్దావో నాకు తెలుసు. అందుకే, నా యావత్తు ఆస్తికీ సంరక్షకురాలిగా నీ పేరే వ్రాయించాను. అంతే కాదు, సర్వాధికారాలూ నీ పేరే రాయించాను. నీతో చెబితే వద్దంటావని, ఆ రాతకోతలు అయ్యకే నిన్ను పిలిచాను. తల్లీ.. దుర్మార్గురాలినైనా, నేను కుసుమకి బామ్మనే.. నీ చేతులల్లో నేను కళ్ళు మూస్తానే” అని బావురుమంది. నిజంగా నాకు షాక్.

“బామ్మా.. అది కుసుమ సేవా కేంద్రంగానే ఉంటుంది. ఊరు ఉన్నంత కాలమూ ఉంటుంది. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి. మాతో పాటు నువ్వూ సేవా కేంద్రంలో పాలుపంచుకోవాలి” అన్నాను.

‘వద్దు’ అని నేను అనలేకపోయాను. ఎందుకంటే ‘అక్కడ కుసుమే కాదు.. నేనూ ఆడుకున్నాను. దానితో పాటు నేనూ చదువుకున్నాను. నన్ను అత్యంత ప్రేమించిన నా స్నేహితురాలి స్మారక మందిరంగా దాన్ని మలచాలనే బాధ్యత నా మీద ఉంది’ అని మనసులోనే అనుకున్నాను.

ఎవరి దారిన వారు వెళ్ళాకా, “బామ్మగారికి తోడుగా ఎవరుంటారూ?” అన్న ప్రశ్న వేశారు ప్రెసిడెంటు గారు.

“నేనుంటాను” గభాల్న అన్నారు త్రిపురగారు.

“మరి..” ఆశ్చర్యంగా అన్నారు ప్రెసిడెంటు.

“నా ఇల్లు నాకు ఉంది. రోజుకో గంట అక్కడుంటే చాలు. కానీ, బామ్మకి తోడుండటం ముఖ్యం. అలాగే శారద డెలివరీ అయ్యేవరకూ, అయిన తరవాత కూడా నేను చూసుకోగలను” స్థిరంగా అన్నారు త్రిపుర.

ఆ విషయం లోనూ మళ్ళీ బోలెడన్ని చర్చలూ వగైరాలు జరిగాయి ఊళ్ళో. ఎవరో బామ్మగారి అన్నని అంటూ వచ్చాడు. బామ్మగారు “నువ్వు నాకెలా చట్టానివీ?” అని నిలదీశాకా, ఆ పెద్దమనిషి సిగ్గుతో బస్సెక్కాడు.

డబ్బు చెయ్యలేని పని ఏదీ? ఒక్క ప్రాణాన్ని పోకుండా అది కాపాడగలదా? గలదు.. జబ్బొచ్చినప్పుడు. కానీ కాపాడలేదు.. మృత్యువు ముంగిట్లోంచి.

మిగతావి ఏవైనా ధనానికి లోకువే.

***

డా. శ్రీధర్, శారదలు సరైన మోతాదులో మందులు ఇవ్వడం వలన ఇందిర గారు కోలుకుంటోంది. చుట్టూ ఉన్న పరిస్థితులు గమనిస్తూ మాట్లాడటం వలన తనలో తను ‘మథనపడటం’ తగ్గి ప్రపంచం వైపుకి దృష్టి పెట్టడం మొదలెట్టింది. ఓసారి ఇందిర గార్ని కుసుమ సేవా కేంద్రానికి తీసుకెళ్ళాను. అందరూ నోరు వెళ్ళబెట్టి మరీ ఆవిడ్ని చూశారు. “ఓహ్.. ఇంత అందగత్తెని మేం పుట్టాకా చూడలేడు” అనేవాళ్ళు అందరూ. అలసిపోయిన అందం ఇందిరది. ఇప్పుడే జనాలు ఆశ్చర్యపోతే, అప్పటి సంగతి?

“ఇప్పుడు బాగానే ఉన్నానుగా.. బయలుదేరుతాను మహీ” అన్నది ఓ రోజున. ఆ ప్రొద్దుట పూట – నా చదువు కంటిన్యూ చేస్తానని నాతో మాట కూడా తీసుకుంది.

నా ఆలోచనలు బయటపెడితే, “మొదటి డిగ్రీ కానివ్వు. తరువాత సంగతి తరువాత” అని ఒప్పించింది.

శారదగార్ని త్రిపుర గారు సేవా కేందానికి మార్చారు.

“అదేమిటి?” అనడిగితే, “పుట్టింటి వాళ్ళు కదా పురుడు పోయాల్సింది.. అందుకే, అక్కడికి..” అని నవ్వింది త్రిపుర.

అసలు సంగతి ఏమంటే బామ్మగారినీ, శారదనీ ఒకే చోట ఉంచితే చూసుకోవడం తేలిక. అదే కాక, అక్కడ ఉండేది విస్తళ్ళు కుట్టే ఆడవాళ్ళేగా. ఏక్షణంలో పురుడొచ్చినా జనాలు సిద్ధంగా ఉంటారు గదా!

“మరికొన్నాళ్ళు ఇక్కడే ఉందాం! మీరు మరింత ఆరోగ్యం పుంజుకుటే చాలా బాగుంటుంది.” అన్నాను ఇందిర చేతులు గట్టిగా పట్టుకుని.

చాలాసేపు నా వంక నా కళ్ళల్లోకి చూసి, “మహీ.. అక్కడ చూడవలసిన వ్యవహారాలు చాలా ఉన్నై. నిజం చెబితే నీ సహాయం కూడా నాకు కావాలి. శారద డెలివరీ కొన్ని రోజుల్లో అవుతుంది కదా!! అది అయ్యాక, నేను హైదరాబాద్ బయల్దేరుతాను. అవసరమైనప్పుడు నేను కబురు పెడితే వస్తావా?” అనడిగారు.

“తప్పకుండా వస్తా. ప్రామిస్” అన్నాను.

ఠక్కున నన్ను హగ్ చేసి, బుగ్గ విూద ముద్దు పెట్టి “థేంక్యూ డియర్. లవ్ యూ” అన్నది. ఇందిర మొహంలో చెప్పలేని కాంతి.

***

అహల్య:

మళ్ళీ పుస్తకాలు పట్టుకుంటానని జీవితంలో అనుకోలేదు. కర్రావూరి ఉప్పలపాడు సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. మహీ ఏనాడూ ఇందిర గురించి ఎత్తలేదు. కానీ, నాన్నా, శ్రీధర్ నాకు విషయాలు చెబుతూనే ఉన్నారు. కుసుమ ఆస్తికి మహీ ట్రస్టీగా ఉండటం నాకు ఆనందాన్ని కలిగించింది.

స్త్రీ అంటే చదువుకున్నది మాత్రమే కాదు. పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుని, ఆ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మలుచుకునే శక్తి గలది.

మహీకి ఆ శక్తి ఉంది. ఏ పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలదు.

ఇందిర విషయంలో మొదట్లో ఉన్న బాధ ఇప్పుడు లేదు. వారిద్దరి మధ్యా పెళ్ళికి ముందు ఏదున్నా ఏది లేకపోయినా ఇప్పుడు దూరం గానే ఉండడం ఒక కారణమైతే గౌతమ్ స్థిరంగా తన సహజ పద్ధతిలో తానుండటం రెండో కారణం.

నాకు ఒక ఆలోచన వచ్చింది, ‘ఈ లోకంలో ఎవరి బ్రతుకు వాళ్ళే దిద్దుకోవాల’ని. అందుకే ఇంటి దగ్గరుండే ఓ కాన్వెంటులో టీచర్‌గా చేరాను. పిల్లలకి ట్యూషన్లు చెప్పడం అలవాటేగా..  వాళ్ళ చిన్నప్పటి నించీ.

“అవసరమంటావా?” అన్నాడు గౌతమ్.

“అవును. అవసరమే” అన్నాను నేను తల ఎత్తి.

ఓ రెండు నిముషాలు నా వంకే సూటిగా చూసి, నవ్వి, “యస్.. మంచి నిర్ణయం టీచర్” అన్నాడు.

ఆ నవ్వు స్వచ్ఛంగా వుంది.. అప్పటి గౌతమ్ నవ్వు లాగా. మోనమనే ఆనకట్ట ఆనాడు బీటు ఇచ్చింది. నది మళ్ళీ ప్రవహించాలంటే ఆనకట్ట పూర్తిగా తొలగాలిగా!

చాలా రోజుల తరువాత మహీకి ఫోన్ చేశాను. “అమ్మా” అంది. దాని గొంతు నిండా ప్రేమే.

“చెప్పవే” అన్నాను. నా గొంతు లోనూ ప్రేమే.

“ఇందిర మళ్ళీ హైదరాబాద్ వెళ్తానంటున్నారు. నేను మళ్ళీ ‘డిగ్రీ’ పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాను” అన్నది. నా గుండె పొంగిపోయింది.

ఇప్పటిదాకా ఇందిర విషయం ఎత్తని మహీ, ఇందిర హైదరాబాదు వెళ్తోందని చెప్పిందంటే, ఇంతకాలం అదెంత కన్‍ఫ్యూజన్‌ని భుజాల మీద మోసి ఉండాలీ?

“ఇంకా?” అన్నాను. నా గొంతు లోని ‘తేలిక’ దనం నాకే తెలిసింది.

“శారద గారికి మగపిల్లాడు పుట్టాడమ్మ. పేరు నేనే పెట్టాను.. ఏమిటో చెప్పుకో?”

దాని గొంతులో అది వరకటి ఉత్సాహం.

“నాకెలా తెలుస్తుందీ? నువ్వు చెబితే విని ఆనందిస్తా” అన్నాను. సడన్‌గా గుర్తించాను.. మహితో నేను తల్లిలా మాట్లాడటం లేదనీ, ‘ఫ్రెండ్’లా ఫ్రీగా మాట్లాడుతున్నాననీ.

“బాబు పేరు ‘సూర్యమిత్ర’. బాగుందా? చాలా రీసెర్చి చేసి పెట్టాను. శ్రీధర్ గారూ, శారదా, త్రిపుర గారూ ఎన్నో పేర్లు అనుకున్నారు గానీ, చివరికి అందరూ నేను సజెస్ట్ చేసిన పేరుకే ఓటేశారు” అన్నది మహీ సంతోషంగా.

“ఎందుకో తెలుసా?” అన్నాను.

“ఎందుకూ?” అన్నది.

“నీ పేరు మహతి కనక” అని, “తొందరగా వచ్చేయ్..” అన్నాను. ఓ అయిదు నిముషాలు మాట్లాడి పెట్టాకగాని నాకు గుర్తుకు రాలేదు.. నేను ఉద్యోగం చేస్తున్న సంగతి మహతికి చెప్పలేదని!

నాన్నకీ చెప్పలేదు. ఒక్కసారి ట్రైను పట్టాలు తప్పితే అది మళ్ళీ ట్రాక్ మీదకి రావటం అంత తేలిక కాదు. అలాగే, భయంకరమైన తుఫాన్లు కూడా ఎప్పడో అప్పుడు తీరం దాటక తప్పదు. ఎటొచ్చీ తుఫాను వచ్చినప్పటి ఉధృతం తీరం దాటేప్పుడు ఉండదు. మనసూ అటువంటిదే. అనుకోని ఎన్ని ఆటుపోట్లనయినా సాగరంలా భరిస్తుంది. మొదట్లో అల్లకల్లోలం కావొచ్చు. కానీ ఆ అల్లకల్లోలాన్ని ఎలా అధిగమించాలో నేర్పేది కూడా కాలమే.

అలాగని నాకు నేను నా నుంచి పారిపోవడం లేదు. ఒక స్థిరత్వం కోసం  ప్రయత్నిస్తున్నాను.

జీవితాన్ని వ్యర్థపుటాలోచనలకి వదలకుండా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.

ఎవరి మనసులో ఏముందీ, ఎవరి మనసులో ఎవరున్నారు, ఎంత గాఢంగా పాతుకుపోయారూ అనేదాని కంటే, నేనేం చేస్తే నిబ్బరంగా ఉండగలను అనే దాని మీదనే శ్రద్ధ పెట్టాను. దాని పర్యవసానమే ఉద్యోగస్థురాలినవడం.

మరో పదేళ్ళలో పిల్లల దారి పిల్లలదవుతుంది. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు.. వాళ్ళ సంసారాలు. రెక్కలొచ్చి ఎగిరిపోయిన పక్షులు మళ్ళీ తల్లి గూటికి వస్తాయా? అలాగే వృద్ధాప్యంలో ఏ తల్లి పక్షి అయినా ఆశ్రయం కోసం పిల్లల గూళ్ళకి వెళ్ళి యాచిస్తుందా?

ఈ చిన్న ప్రకృతి నియమాన్ని మనిషి ఎందుకు గ్రహించడూ! Free.. Free.. Free! Be free from everyone & everything. అన్నిటినీ అందరినీ పక్కన పెట్టి ముందు నీ మరో స్వేచ్ఛని సాధించు” అన్న నా మనసుకి నేను విలువ ఇచ్చుకున్నాక నా ప్రాణం కుదుటబడింది. ఇప్పుడు నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ‘నేను’ లా నేను బ్రతగ్గలుగుతున్నాను.

***

త్రిపుర:

మహతి పరిచయం నా జీవితాన్ని ‘విశాలం’ చేసింది. కష్టనష్టాల్ని లెక్కచెయ్యకుండా ముందుకు సాగే యవ్వన ధైర్యాన్ని తన స్నేహం నాకు ఇచ్చింది. జీవితం వ్యర్థమనుకున్నాను. కానీ ఇప్పుడు నా జీవితమూ చాలా విలువైనది. అత్యంత అహంభావంతో అందరినీ శాసించి – చివరికి అహంభావపు భవనంపు శకలాల క్రిందే ఆక్రోశిస్తున్న బామ్మ ఒకవైపూ, ఎవ్వరూ లేని ఎడారి ఏకాంతం నించి శ్రీధర్ అనే పూలతోట చేరి సూర్యమిత్ర అనే బిడ్డకు తల్లై, నన్ను అమ్మమ్మను చేసిన శారద ఇంకోవైపూ నాకు రెండు ప్రాణాలయ్యారు.

“అమ్మమ్మా అను.. అమ్మమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పు” అని బిడ్డతో శారద చెబుతున్నప్పుడల్లా నా కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉన్నాయి. జీవితానికి ఓ కొత్త అర్థం స్ఫురిస్తూనే ఉంది. చిన్నారి సూర్యమిత్రని ఎత్తుకున్నప్పుడల్లా నా గుండె సంతోషంతో నిండిపోతూనే ఉంది.

మరి తాతగారు! ఎంత వివేచన, ఎంత సూక్ష్మ దృష్టి. అహల్య, మహతి చెప్పకపోయినా, ఇందిర ఎవరో ఏమిటో ఆయన ముందే ఊహించారు. “త్రిపురా.. విషయం క్లిష్టమైనదే. కానీ, సమయం గడిస్తే గానీ మబ్బులు తొలగవు. ఎన్నడూ లేనిది అల్లుడు ఫోన్ చేసి తన మరదలు ఇక్కడి కొస్తుందీ, మహతి తీసుకొస్తోందీ అనగానే నాకు కొంత అర్థమైంది. అమ్మాయ్.. నా వయసు ఎటువంటిదీ? అన్ని బంధాలకీ అతీతంగా ఆలోచించవలసిన వయసు. అందుకే, నేను ఆమెతో ఆదరణ తోనే ఉంటాను. త్రిపురా, నువ్వూ అలాగే ఉండు. మహి మనసు దొడ్డది. అయినా అది నోరు విప్పి చెప్పదు. కారణం నేను చింతాక్రాంతుడ్నవుతానని. బహుశా నీకూ చెప్పదు. కారణం, ఇందిరపై నీకు చిన్న చూపు రాకూడదని. అందుకే మహతి అంటే నాకు ప్రాణం, త్రిపురా.. వచ్చాక ఎప్పుడు ఏది ఎలా పరిణమిస్తుందో తెలీదు. కానీ, ఎప్పుడైనా మహతి తన మనసులో మాట నీతో చెబితే, దానికి ధైర్యాన్నివ్వు. సరేనా!” అని వాళ్ళు ఊరు చేరక ముందే చెప్పారు.

“జీవితం అంటే కంకర్రాళ్ళ గుట్టలా ఉండకూడదు, అన్నీ ఒకచోటే ఉన్నా ఏదీ మరో దానిలో కలిసిపోనట్టు. జీవితం చెట్టులా ఉండాలి. అన్ని కొమ్మల్నీ తనతో పాటే కలుపుకున్నా, ఆ కొమ్మలకి స్వేచ్ఛనిచ్చినట్టు” అని కూడా అన్నారు, ఎంత విజ్ఞత.

‘సూర్యమిత్ర’ని నాచేతికిచ్చింది శారద. వాడు బద్ధకంగా కళ్ళు తెరిచి నా వంక చూసి నవ్వాడు. ఎందుకు నవ్వాడో కూడా వాడికి తెలియదు అనుకుంటాం గానీ, ‘పరిచయమైన మొహం కనిపించినప్పుడు చిరునవ్వే చక్కని పలకరింపు’ అని వాడికి తెలీదా!

“తెలిసినవారు కనిపించినప్పుడు తాబేలులా తలని డిప్పలోకి ముడుచుకోకు. పసిపిల్లల్లా నవ్వుతో పెదావుల్ని వెలిగించు” అని వాడు నాకు ఓ బుల్లి పాఠం చెప్పినట్లు అనిపించింది.

‘నన్ను మాత్రమే
నేను చూసుకున్నప్పుడు
నాతో ఉన్నది
నేను మాత్రమే.
నన్ను నేను మరిచి
లోకంతో ఉన్నప్పుడు
నాతో ఉన్నది
ఈ విశ్వం మొత్తం.
ప్రేమ అనేది
బయట నించి
లోపల పెట్టుకునే
వస్తువు కాదు
అది గుండె గంగోత్రిలో
పుట్టాలి
గంగలా పరవళ్ళు తొక్కుతూ
ప్రవహించాలి
జీవన పయనంలో కలిసే
అన్ని మనోక్షేత్రాలల్లోను
అమృతం పండించాలి.
ఓ గంగా, జీవనగంగా,
జీవితాన్ని సాగిపోనీ
మధురంగా సస్యశ్యామలంగా!’
-పాదచారి

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here