Site icon Sanchika

మహిళా డిగ్రీ కళాశాలలో రాష్ట్రస్థాయి కార్యశాల – వార్త

[dropcap]స[/dropcap]మాజాన్ని మేల్కోపేదే అసలైన కవిత్వమని ప్రముఖ కవి, పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ అన్నారు. మార్చి 22 న  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఒకరోజు రాష్ట్రస్థాయి కార్యశాల కార్యక్రమానికి ఆయన ముఖ్యవక్తగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో పద్యం నుంచి వచన కవిత్వం దాకా అనేక కవితాప్రక్రియలు పురుడు పోసుకున్నాయన్నారు. మహాకవి శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో మహాప్రస్థానం కవితాసంపుటితో బలమైన ముద్ర వేసారన్నారు. గురజాడ, కాళోజీ, గుర్రం జాషువా, దాశరథి, సినారె వంటి లబ్ధప్రతిష్ఠులైన కవులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్నారు. కవితారచనలో వస్తువు, భాష, శైలి, అభివ్యక్తి ప్రధానమన్నారు. సమకాలీన వస్తువులను తీసుకుని కవితలను అల్లాలన్నారు.

కార్యశాల కన్వీనర్ విఠలాపురం పుష్పలత మాట్లాడుతూ కవిత్వంలో భాషతో పాటు నిర్మాణశైలి ముఖ్యమన్నారు. తెలుగు సాహిత్యంలో ఉపమాలంకారాలతో కవిత్వం రాస్తేనే రాణిస్తుందన్నారు. వస్తువు ఏదైనా కవిత్వం చేయడంలో కవి ప్రతిభ కనిపించాలన్నారు.

సభాధ్యక్షులు కెప్టెన్ డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యశాలలో కనీసం వెయ్యిమంది కవయిత్రులు తయారుకావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమీనా, అకాడమిక్ కో ఆర్డినేటర్ లావణ్య, తెలుగు శాఖ అధ్యాపకులు లక్ష్మీనరసింహరావు, సునిత, హేమలత, బోల యాదయ్య, పొన్నగంటి ప్రభాకర్, వంగా వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version