Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-74: మహిళలూ – మల్టీటాస్కింగ్..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఆ[/dropcap]మధ్య ఓరోజు సాయంత్రం నేనూ మా వదినా మా భ్రమరాంబ పిన్నింటికి వెళ్ళేం. మేం వెళ్ళేటప్పటికి పిన్ని హాల్లో కుర్చీలో కూర్చుని, ఎదురుగా వున్న టీవీలో సీరియల్ చూస్తూ, ఒళ్ళో వాక్‌మెన్ పెట్టుకుని వాటి ఇయర్ ఫోన్స్ చెవులకి తగిలించుకుని అందులో వచ్చే పాట వింటూ, చేతులతో పక్కనే స్టూల్ మీదున్న పత్తితో ఒత్తులు చేస్తూ, నోటితో లలితాసహస్రం పారాయణ చేస్తోంది. నాకు కళ్ళు తిరిగినంత పనైంది. ఆపుకోలేక అడిగేసేను. “ఏంటి పిన్నీ, నువ్వు సీరియల్ చూస్తున్నావా, పాటలు వింటున్నావా, ఒత్తులు చేస్తున్నావా లేకపోతే లలిత చదువుతున్నావా!” అని.

నా ప్రశ్నకి ఫక్కున నవ్వి “అన్నీ చేస్తున్నాను..” అంది. అర్థంకానట్టు చూసిన నాకు విడమరిచి చెపుతూ,

“సీరియల్ చూస్తే చాలు.. డైలాగ్స్ వినక్కర్లేదు.. ఫాలో అయిపోతాం.. అందుకని కళ్ళతో అది చూస్తున్నాను. ఇంక మా మనవరాలు కొత్త పాట ఏదో పాడిందిట.. ఇందాకే చెప్పింది వినమని..కాసేపట్లో ఎలా వుందని అడుగుతుంది.. అందుకని చెవులతో పాట వింటున్నాను.. మరింక లలిత నాకు కంఠతా వచ్చుకదా.. అది చదువుకుంటూ చేతులు ఖాళీగా వుండడమెందుకని ఒత్తులు చేస్తున్నాను..” అంది.

వెనక్కి వచ్చేటప్పుడు ఈ విషయమే నేనూ వదినా మాట్లాడుకున్నాం. అసలు ఏ పని చెయ్యాలన్నా ఆ పనిమీదే దృష్టి పెట్టాలనీ, ఏకాగ్రతతో ఏ పనైనా చేస్తేనే ఫలితం బాగుంటుందనీ వింటుంటాము కదా.. మరి ఇన్ని పనులు పిన్ని ఒకేసారి ఎలా చెయ్యగలుగుతోందీ అని..

అప్పుడు వదిన చెప్పింది…దీనినే మల్టీటాస్కింగ్ అంటారని.

“ఇప్పుడు పిన్ని విషయమే తీసుకో. ఆవిడ చేసేవాటిల్లో బుర్ర ఉపయోగించి చేసేది ఒక్క పాట విని, ఎలా వుందో చెప్పడమే.. మిగిలినవన్నీ మెకానికల్‌గా ఆవిడ బుర్రలోకి వెళ్ళిపోతాయి తప్పితే ఆలోచించాల్సిన అవసరం లేదు. టీవి సీరియల్ ఆవిడ కళ్ళముందు కదిలే ఓ బొమ్మలాట. అది ఆవిడ బుర్రలోకి వెళ్ళదు. లలిత కూడా ఆవిడకి కంఠస్తమే కనక ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇంక ఒత్తులు చెయ్యడం అంటావా.. ఆవిడ చేతులు దాని కలవాటు పడిపోయేయి.

కొంతమందిలో ఆ ప్రతిభ వుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లలో. ఎందుకంటే ఉదయాన్నే ఇంట్లో గృహిణి చేసే అష్టావధానం ముందు ఏ మల్టీ టాస్కింగ్ అయినా తక్కువేట.” అంది వదిన.

“ఆ… అదేదో మనం మెకానికల్‌గా చేసేస్తాం..” అన్నాను.

“కొంతవరకూ మెకానికల్ అనుకోవచ్చు కానీ అలాగనుకుంటే మరి మనం ఇంట్లో మగవాళ్లని ఏ పనైనా చెయ్యమంటే ఆ ఒక్కపనే చేస్తూ కూర్చుంటా రెందుకు. అంతదాకా ఎందుకూ..చాలామంది మగవాళ్లని చూడూ..మనం నడుస్తూ నడుస్తూ మాట్లాడుకుంటామా.. వాళ్ళలా కాదు.. ఏదైనా మాట్లాడాలంటే నడవడం ఆపేసుకుని, నిలబడి, చెప్పవల్సినది చెప్పేక అప్పుడు మళ్ళీ నడక మొదలెడతారు. వాళ్ళు వట్టి వన్ వే ట్రాఫిక్‌లు. ఎటు వెళ్ళమంటే అటే వెడతారు. కాస్త కూడా అటూ ఇటూ దృష్టి తిప్పరు.”

వదిన వాక్ప్రవాహం ఆగలేదు. ఆడవారిమీద తనకున్న అభిమానాన్నంతా వెళ్ళకక్కేసింది.

“అదేదో సినిమాలో చెప్పేరు చూడూ..మగవాళ్ల బ్రెయిన్ గదులు గదులుగా వుంటుందని.. సరిగ్గా చెప్పేరు. ఏది ఆలోచిస్తే అదే.. ఆ విషయానికున్న వేరే కోణం గురించి ఆలోచించరు. కానీ అలాగే ఆడవాళ్ళుకూడా వున్నారనుకో.. ఇంక ఇంటా బయటా ఏ పనైనా జరుగుతుందా! ఆఫీసులో వున్నప్పుడు పిల్లల చదువులగురించి, ఇంట్లో తేవాల్సిన సరుకుల గురించీ, చేయవలసిన ప్రయాణాల గురించీ, తీర్చవలసిన అప్పులగురించీ, సాయంత్రం వంట గురించీ, ఇంటి  కెడుతూ తీసికెళ్ళాల్సిన సరుకులగురించీ… ఇలా ఎన్నో విషయాలు ఆమె ఆలోచించాలి.”

“ఆలోచించడం వేరు… ఒకే టైమ్‌లో అవన్నీ చెయ్యడం వేరూ కదా..”

“ఎందుకు చెయ్యరూ.. ఆఫీసునుంచి స్కూల్‌కి ఫోన్ చేసి పిల్లల చదువు గురించి విచారిస్తారు. వడ్డీలు కట్టడానికి ఇంకా ఎంత టైముందో కనుక్కుంటారు. పిల్లల పుట్టినరోజులకి కావల్సినవన్నీ ఆర్డరిస్తారు. ఇలా ఎన్నైనా చేస్తారు.”

వదిన మాటలకి నాకు తృప్తి కలగలేదని గ్రహించింది వదిన.

“సరే.. మెకానికల్‌గా కాకుండా ఒకేసారి బుర్ర ఉపయోగిస్తూ మనం చేసే పనులు చెప్పనా..”

ఉత్సాహంగా ముందుకి వంగేను.

“పొద్దున్నే పాలు స్టౌ మీద పెట్టి పొంగు వచ్చేవరకూ ఫేస్‌బుక్ చూస్తాం. అవెప్పుడు పొంగుతాయోనని బుర్ర అటు ఆలోచిస్తుంటుంది కదా.. ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు చదువుతుంటే బుర్ర పనిచేస్తుంది కదా.. ఇంకా వంట చేస్తూ వాట్సప్‌లో మెసేజ్‌లు పెడతాం. పచ్చడిపోపు వేయిస్తూ ఫోన్‌లో మాట్లాడతాం. కూర తరుగుతూ రేడియో వింటాం. పులుసు పోపెడుతూ ఆడియోకథలు వింటాం….ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. బుర్ర ఉపయోగిస్తూ ఇలా మనం చేసే మల్టీటాస్కింగ్‌లు ఎన్నో..ఎన్నెన్నో..” ఆవేశపడిపోయింది వదిన.

నిజమేకదా! ఇన్నాళ్ళు ఈ ఆలోచనే రాలేదేమిటీ నాకూ.. వదినవైపు ఆరాధనగా చూసేను.

“అవునవును. పాటలు పాడుకుంటూ వంట చేసెయ్యడం, వాకింగ్ చేస్తూ వాట్సప్ చూడడం, టీవీలొ సినిమా చూస్తూ పేపర్ చదవడం లాంటివన్న మాట..”

నేనూ వదినకి మరికొన్ని సంగతులు కలిపేను. వదిన నన్ను మెచ్చుకుంటున్నట్టు చూసింది.

“అందుకని మల్టీటాస్కింగ్ అంటే మనమే ముందుంటాం..” అంటూ ముగించింది వదిన.

Exit mobile version