[dropcap]మా[/dropcap]నవాళి పాలిట అనుగ్రహప్రదాయిని అయిన శ్రీ రామరక్షా స్తోత్రం జన్మ సాఫల్య మంత్రంగా భావింపబడుతోంది. ఆపదలలో సంజీవిని లాగ పని చేస్తుంది అన్నది కోట్లాది ఆధ్యాత్మికవాదుల అనుభవ సారాంశం. దిక్కుతోచని స్థితిలో పరమాత్భుతంగా పని చేసి అఖండమైన తేజస్సును, వెలుగును, జ్ఞానమును, చూపి బుద్ధిని మంచి వైపు ప్రచోదనం చేస్తుంది.
మర్యాద పురుషోత్తమునిగా అశేష భక్త జనావళిచే కీర్తింపబడే శ్రీ రాముని నుతిస్తూ బుధ కౌశిక ముని ఈ రామ రక్షా స్తోత్రాన్ని రచించారు. ఇది ఎంతో ఫలదాయకమైనది, మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఇందులో వేర్వేరు మూలాల నుంచి రామ మహిమను చెప్పే శ్లోకాలను పొందు పరచారు. భక్తి శ్రద్ధలతో ఒక పర్యాయం పఠించినా శ్రీ రామచంద్రుని విశేష అనుగ్రహానికి పాత్రులమై అన్ని ఆపదల నుండి గట్టెక్కితామన్నది అక్షర సత్యం.
ఈ స్తోత్రం భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి మానసిక ప్రశాంతత, జీవితంలో సుఖశాంతులు మరియు సంతోషము కలుగుననుటలో ఏ మాత్రము సందేహము లేదు అని ఫలశ్రుతిలో పేర్కొనబడింది.
మానవ జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించడానికి తగు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించే అత్యంత సులువైన భక్తి మార్గం రామరక్షా స్తోత్రం. ఎవరికైతే సమస్యలను అధిగమించాలనే సంకల్పం కలుగుతుందో, వారు నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో పదకొండు సార్లు ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేయాలి.
నిరుద్యోగులు, శత్రుభయం కలిగినవారు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నవారు, ఏదైనా ఉద్యోగ లేదా వ్యాపార పరమైన సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నవారు, మానసిక ఒత్తిడులకు గురవుతున్నవారు ఇలా ఒకటేమిటి జీవితంలో ఇబ్బంది పడే ఎటువంటి సమస్యనుండైనా బయటపడాలంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేసి, రాముని శరణు వేడితే తప్పక బయట పడి జీవితము సాఫల్యత వెంపు నడుచుటకు తగు మార్గము కనపడుతుంది అన్నది ఆధ్యాత్మికవాదుల నమ్మిక.
ఈ స్తోత్రం ఈ క్రింది శ్లోకంతో పూర్తవుతుంది.
శ్రీరామ రామేతి రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
పరమశివుడు ఇలా అన్నాడు – “ఓ పార్వతీ దేవీ! నేను రామ నామ ఉచ్చరణను ఆస్వాదిస్తున్నాను. అది నాకు ఎంతో ప్రియమైనది. ఈ నామమును ఒక్కసారి ఉచ్చరించుట పరమాత్ముని ఇతర సహస్ర నామములను ఉచ్చరించినంత ఫలము నిచ్చును.”
సాక్షాత్తు పరమశివుడే రామ నామ స్మరణ యొక్క దివ్య ఫలాన్ని వివరించాడంటే ఇక విష్ణు సహస్రనామ స్తోత్రం పఠనం యొక్క ఫలాన్ని అందించే శ్రీ రామ రక్షా స్తోత్రం యొక్క విశిష్టతను ఇక ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదు.