మహితాత్ముడు – మన మోహన్‌దాస్ ‘కరం’చంద్ గాంధీ

0
2

[dropcap]పు[/dropcap]ట్టింది పోరుబందరులో చేపట్టిన వృత్తి న్యాయ వాదము
ఆఫ్రికాలో తెల్ల వారి జాత్యహంకారాన్ని-వర్ణ వివక్షతను ధిక్కరించి
జన్మభూమి దాస్య శృంఖలాలను తుత్తునియలు చేయ స్వదేశం తిరిగొచ్చావ్

అహింసను ఆయుధంగా, సత్యాగ్రహాన్ని ఉద్యమంగా మలిచిన
అసామాన్య భారతీయ వైతాళికుడివై పేరును సార్థకం చేసుకున్న కర్మ వీరుడిగా ఎదిగి
సామ్రాజ్య వాదానికి సవాలై, శాంతి-ప్రేమ జ్యోతులుగా
జైలు శిక్షలకు వెరవక దేశాలను స్వాతంత్య్రపు వెలుగు బాటలు పట్టించావ్
కుల మత ప్రాంత, వర్గాలకతీతంగా దేశ వాసుల్ని
ఒక్క తాటి పైకి తెఛ్చి నాయకత్వంలో నవ శిఖరాలధిరోహించావ్
చంపారన్ ఆందోళన, స్వరాజోద్యమం. ఉప్పు సత్యాగ్రహం (దండి యాత్ర).
‘క్విట్ ఇండియా’ పిలుపుతో స్వాతంత్య్ర సమర విజయం సాధించి జాతి పితయ్యావ్
రవి అస్తమించని ఆంగ్లేయ సామ్రాజ్యానికి చరమ గీతం పాడావు
ప్రజలంతా సుఖ శాంతులతో పురోగమించాలని జీవితాంతం పాటు పడ్డావ్

రాజకీయం కంటే సాబర్మతి సంత్ గా సచ్ఛీలత-ఆధ్యాత్మికమే తమకి ప్రియమని
పార్టీలు-పదవుల కన్నా ప్రజా సంక్షేమమే ధ్యేయమని
దేశ ప్రధాని పదవిని సైతం నిరాకరించిన నిగర్విగా మీ నుండి నేర్చుకోలేరా నేటి నాయకులు

ఖాది-కర వృత్తులతో ఊరూరా స్వావలంబన సాధించి
అంటరాని తనాన్ని అరికట్టి హరిజనోద్దరణ కోసం చివరి కంటా పోరాడవ్
మీ సహనం, సత్య సంధత, ధైర్యం, కరుణ, నిబద్దత- నిరాడంబరత నభూతో నభవిష్యతి
సామాన్యులకే కాదు విశ్వ నాయకులకు కూడా నేటికీ స్పూర్తి ప్రదాతగా నిలిచావు
మీ జీవితమే ఓ సందేశం-మహాదార్శంగా మెలిగి-వెలిగిన
మహితాత్ములు బాపు మీరు – ఈ పుణ్య భూమిపై పునః పునః స్వాగతం మీకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here