మైదానమొక తరగని నిధి..!

0
2

[dropcap]పా[/dropcap]ర్లమెంటులో ఆమోదంకై పెట్టిన బిల్లులా
చాలా గట్టి తీర్మానం చేసుకుంటాను
తెల్లవారుజామున లేవాలని
గ్రౌండ్‌కి వెళ్లి నడవాలని
అప్పజెప్పిన పనిని వదిలేయకుండా
కలలను సాకారం చేస్తున్నట్లుగా
సెల్ ఫోన్‌లో అలారం మోగుతుంది
ఇక తప్పదన్నట్లుగా లేస్తాను
పెరుగుతున్న శరీరపు బరువును
కొంతైనా తగ్గించాలనే సదాశయంతో..!

ఇంకా చీకట్లు తరలిపోవు
మైదానంలోకి అడుగు పెట్టేసరికి
నడిచే వాళ్ళ సందడి మొదలవుతుంది
గజిబిజి ఆలోచనలతోనే
చుట్టూ చూస్తూ నడుస్తూనే ఉంటాను
వయస్సు భారంతో వుండే పెద్దలతో పాటు
హుషారైన చిన్న పిల్లలు వస్తుంటారు
వాళ్ల ముద్దు ముద్దు మాటలతో
ఆ పరిసరాలన్నీ
పక్షుల కూజితాల్లా ఉల్లాసభరితమైతాయి..!

ఓ ఐదుగురు పొగైతే చాలు
బాల్ బాట్‌తో క్రికెట్ ఆడేస్తుంటారు
ఇంకోపక్క సీనియర్ సిటిజన్స్
అనుభవాలను నెమరు వేసుకుంటూ
మిత్రులతో సేద తీరుతుంటారు
అది ఆట స్థలమే కావచ్చు
అందర్నీ ఆదరిస్తున్న అమ్మలా కనిపిస్తుంది
ఎన్ని గాయాలనైన భరిస్తుంది
సంభాషణలను ఆత్మీయంగా వింటుంది..!

పొద్దున్నే జీవుల తండ్లాటలు
పరిపరి విధాలుగా ఉంటాయి
నేనొక శ్రోతను మాత్రమే
చెవులకు సోకుతున్న మాటలను
అంతగా పట్టించుకోనేమో
ఒంటరి ఆకాశానికి తోడుగా
నేనున్నా నంటూ సూర్యుడు మెల్లమెల్లగా
కిరణాలను వెదజల్లుతూ పలకరిస్తుంటాడు
రోడ్డుపైన వాతావరణం వేడెక్కుతుంది
రణగొణధ్వనులు మొదలౌతాయి
రోజు చూసే దృశ్యాలే కావచ్చు
అయినా కానీ
ఉషోదయపు పరిమళాలను ఆస్వాదిస్తూ
కొత్త ప్రయత్నాలను ఆహ్వానిస్తూ
విపరీత పోకడలకు ప్రతిస్పందిస్తూ
దేహాన్ని కాంతివంతం చేసుకుంటున్నా
మైదానమంటే నాకెప్పుడూ
తరగని నిధి వంటిదే..!

బాధలు సంతోషాలుగా మారుతాయి
సంతోషాలు దుఃఖాలుగా మారుతాయి
వెంటాడే అనుభవాల గాథలను
హుషారుగా ముచ్చట్లలో వినిపిస్తుంటారు
అక్కడి మాటల్ని అక్కడే దులుపుకొని
నాలోని పనికిరాని చెత్త ఆలోచనలు
పారే చెమట నదిలో కొట్టుకు పోతాయి
కొంగ్రొత్త ఉత్తేజాన్ని నింపుకొని
ఇంటి వైపు అడుగులు వేస్తాను
కొద్ది దూరం పోయాక
బడిలోకి వెళ్ళే పిల్లాడు తల్లిని చూసినట్లుగా
గబుక్కున వెనుకకు తిరిగి చూస్తే
దిగులు ముఖంతో ఆ మైదానం తల్లి
సహస్ర ప్రశ్నల్లా వెంటాడుతున్నట్లున్నది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here