[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘మైలురాళ్ళు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ధిగమించిన ప్రతిసారీ
ఆప్యాయంగా తడుముతాను
లక్ష్యంగా నిలిచి
రారమ్మని నను పిలిచిన
ప్రతి ఒంటరి జీవన మైలురాయిని
వయసు ఏర్పరిచిన
ఏదో ఒక విజయోత్సవ సభలోనో
విసుగనిపించని
ఏవో పిచ్చాపాటి కబుర్లలోనో
మాటలు
నడక మాని అటూఇటూ దొర్లుతుంటే
ఏదో ఒక మైలురాయి వచ్చేస్తుంది
ఎవరో పనిగట్టుకుని పిలిచినట్టు
ఓరకంట చూస్తూ అలా నిలబడిపోతుంది
“నా గురించి ఏమైనా చెప్పవూ!” అంటూ
తప్పదు కదా!
తనకూ అంకితం చేయాలి
ఓ నాలుగైదు మాటలు
తన ప్రాముఖ్యత ఏమిటో
నా గతంలో తన ప్రాధాన్యత ఎంతెంతో
స్వగతంలా తెలుపుతూ
అందరిలో ఉత్సుకతను ఉసిగొలుపుతూ
అప్పుడెప్పుడో అడిగాను
నన్ననుసరిస్తోన్న మైలురాళ్ళని
“చెబుతారా ఓ నాలుగు ముచ్చట్లు
మీరెప్పుడైనా నా గురించి?” అని
మౌనమే ధ్వనించింది వాటినుంచి
నిజంగా నీవున్నంతవరకు
సత్యంగా అగుపడుతున్నంత వరకు
అవేమీ చెప్పలేవు నీ గురించి
కాల ప్రవాహంలో
నీవరిగిపోయి.. ఆపై కరిగిపోయి
కంటికి కనబడకుండా పోయి
జ్ఞాపకంగా మారిన తరువాతే
నన్ను వెంటేసుకుని
ఎన్నో.. ఎన్నెన్నో చెబుతుంటాయి నీ గురించి
నీవు దాటొచ్చిన ఈ మైలురాళ్ళన్నీ
అంది
జంటగా నాతో నడుస్తున్న ‘చరిత్ర’