మైత్రీ పరిమళాలు

3
2

[dropcap]ఈ [/dropcap]ఆదివారం అంటే 4 ఆగస్టు 2019 అంతర్జాతీయ మైత్రీ దినోత్సవం.

అయితే మైత్రీ దినోత్సవ వేడుకలు వివిధ దేశాలలో వేర్వేరు తేదీలలో జరుగుతాయి. మొదటి ప్రపంచ మైత్రీ దినోత్సవాన్ని 1958 జూలై 30న వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ ప్రతిపాదించింది. అధికారిక ‘ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే’గా 30 జూలైని 27 ఏప్రిల్ 2011న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. అయితే, చాలా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం మైత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఎప్పుడు జరుపుకున్నా – పాత, కొత్త స్నేహితులను కలుసుకుని మైత్రీ పరిమళాలను ఆస్వాదించడమే దీని ఉద్దేశం. “ఫ్రెండ్‌షిప్ ఈజ్ ది మెలోడీ అండ్ ఫ్రాగ్రన్స్ ఆఫ్ లైఫ్.”

స్నేహానికీ, సినిమాకీ అవినాభావ సంబంధం ఉంది. స్నేహం ఇతివృత్తంగా భారతీయ భాషలలో అనేక సినిమాలు వచ్చాయి, విజయం సాధించాయి. పేరులోనే స్నేహం, స్నేహితులు ఉన్న – స్నేహం, ఇద్దరు మిత్రులు (పాతది), ప్రాణ స్నేహితులు, చిన్నారి స్నేహం, స్నేహం కోసం, స్నేహమంటే ఇదేరా, ముగ్గురు మిత్రులు, మంచి మిత్రులు (‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం…’ పాట ఈ సినిమాలోదే), ఇద్దరు మిత్రులు (కొత్తది), నీ స్నేహం, స్నేహమేరా జీవితం, మిత్రుడు, ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలు ప్రేక్షకులని అలరించాయి. అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్, స్నేహితుడు (తమిళ్ డబ్బింగ్), ఫ్రెండ్స్, 2ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ వర్సెస్ లవ్, ఫ్రెండ్ రిక్వెస్ట్ వంటి సినిమాలొచ్చినా అవి ఆడలేదు. టైటిల్‍లో స్నేహం లేకపోయినా, చెలిమి ఇతివృత్తంగా వచ్చిన వసంతం, నవ వసంతం, హ్యాపీడేస్, కేరింత, ఉన్నది ఒకటే జిందగీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, యెవడే సుబ్రహ్మణ్యం, బోయ్స్ వంటివి బాగానే ఆడాయి. ఇంగ్లీషులో ‘ఫ్రెండ్స్ విత్ బెనిఫెట్స్’ అనే సినిమా ఒకటి ఉంది.

ఇక స్నేహితుల గురించి, స్నేహం విలువ గురించి వచ్చిన సినీగీతాలు ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని పాటలను తలచుకుంటూ స్నేహ మధురిమలను ఆస్వాదిద్దాం.

1964లో విడుదలయిన ‘దోస్తీ’ అనే హిందీ సినిమా చక్కని స్నేహానికి చిరునామా. ఆ సినిమాలోని అన్ని పాటలు జనాదరణ పొందినా, “కోయీ జబ్ రాహ్ నా పాయే, మేరే సంగ్ ఆయే కె పగ్ పగ్ దీప్ జలాయే” అని మహమ్మద్ రఫీ పాడిన పాట అజరామరంగా నిలిచిపోతుంది. చక్కని స్నేహం లభిస్తే, జీవితంలోని అన్ని కష్టాలూ దూరమవుతాయని ఈ పాటలో రాశారు మజ్రూహ్ సుల్తాన్‌పూరీ. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం.

ఈ సినిమాని ‘స్నేహం’ పేరిట బాపుగారి దర్శకత్వంలో రీమేక్ చేశారు. తెలుగులోను పాటలన్నీ సూపర్ హిట్టే. “ఎగరేసిన గాలిపటాలు/దొంగాట దాగుడుమూతలు/గట్టుమీద పిచ్చుక గూళ్ళు/కాలువలో కాగితం పడవలూ/గోళీలు గోటీబిళ్ళ ఓడిపోతే పెట్టిన డిల్ల/చిన్ననాటి ఆనవాళ్ళు స్నేహంలో మైలురాళ్ళు” అనే పాట బాల్యంలోని స్నేహమాధుర్యాన్ని చాటుతుంది. ఈ సినిమాలోని మిగతా పాటలు కూడా బావుంటాయి.

‘నిప్పులాంటి మనిషి’ సినిమాలోని “స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం” అనే పాట స్నేహానికి ఐకానిక్ సాంగ్! సినారె రచించిన గీతానికి సత్యంగారు బాణీలు అందించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు.

ఈ సినిమాకి మూలమైన హిందీ సినిమా ‘జంజీర్‌’లోని “యారీ హై ఈమాన్ మేరా యార్ మేరీ జిందగీ” అనే పాట ఈనాటికీ దేశంలో ఏదో ఒక మూల శ్రోతలను రంజింపజేస్తూనే ఉంది. గుల్షన్ బావ్రా రచించిన ఈ గీతాన్ని మన్నాడే పాడారు. కళ్యాణ్‌జీ – ఆనంద్‌జీ సంగీతం సమకూర్చారు.

‘షోలే’ సినిమాలోని “యే దోస్తీ హ‌మ్ న‌హీ తోడేంగే! యే దోస్తీ హ‌మ్ న‌హీ తోడేంగే!” అనే పాట స్నేహితులపై హిందీ సినిమాల్లో వచ్చిన మంచి పాటల్లో ఒకటి. “నా గెలుపు నీ గెలుపు, నీ ఓటమి నా ఓటమి, నీదీ నాదీ ఒకటే ప్రాణం” అంటుందీ పాట. ఆనంద్ బక్షీ రాసిన ఈ గీతాన్ని కిషోర్ కుమార్, మన్నాడే ఆలపించారు. ఆర్.డి.బర్మన్ సంగీతం.

‘ప్రాణ స్నేహితులు’ సినిమాలో “స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగ నిను వీడిపోదురా” అనే పాట ఎందరినో మైమరిపిస్తుంది. ఈ పాటలో “తులతూగే సంపదలున్నా.. స్నేహానికి సరిరావన్నా/పలుకాడే బంధువులున్నా..  నేస్తానికి సరికారన్నా” అంటారు గీతరచయిత భువనచంద్ర. రాజ్-కోటి సంగీతంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గానం.

‘ప్రేమ తరంగాలు’ సినిమాలో “మనసు ఒక మందారం/చెలిమి తన మకరందం/ఆ మధురిమకు పులకించే/బ్రతుకు ఒక మధుమాసం” అనే గీతంలో “ఆ పాటనే నీ కోసమే/నే పాడినా వినిపించునా/నేస్తమా… వికసింతువా వసంతమా…” అంటారు ఆత్రేయ. సంగీతం సత్యం. గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.

‘పెళ్ళి పందిరి’ సినిమాలో “దోస్త్ మేరా దోస్త్ తుహై మేరీజాన్/వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం” అనే పాటలో “బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం/స్నేహం అనే మాటలో చెరో అక్షరం మనం” అనుకుంటారా మిత్రులిద్దరు. భువనచంద్ర గీతాన్ని బాలసుబ్రహ్మణ్యం, మనో ఆలపించారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

‘యారానా’ సినిమాలో “తేరే జైసా యార్ కహాఁ, కహాఁ ఐసా యారానా” పాట బావుంటుంది. అన్‌జాన్ వ్రాసిన ఈ పాటని కిషోర్ కుమార్ పాడారు. రాజేష్ రోషన్ సంగీతం.

‘దోస్తానా’ సినిమాలోని “బనే చాహే దుష్మన్ జమానా హమారా” అనే పాటలో “ఓ క్వాబోం కే దిన్, ఓ కితాబోం కే దిన్, ఓ సవాలోం కీ రాతేం, జవాబోం కే దిన్” అంటూ గతాన్ని తలచుకుంటారు మిత్రులు. ఆనంద్ బక్షీ గీతాన్ని మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ ఆలపించారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించారు.

‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో “నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా/సైకిల్ నుండి బైక్ లోకి మారినా” అనే పాటలో “ట్రెండు మారిన ఫ్రెండు మారడే/ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్‌షిప్పే/ట్రెండు మారిన ఫ్రెండు మారడే/గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్‌షిప్పే” అంటారు గీత రచయిత చంద్రబోస్. స్వీయ సంగీత దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ పాడారీ పాటని.

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. స్నేహంలోనూ పాత రోజులే బావున్నాయనిపిస్తుంది. “ఆ నాటి ఆ స్నేహమానందగీతం/ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం” అనే పాటలో ఓ మిత్రుడు “ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం/ఆ రోజులు మున్ముందిక రావేమిరా” అని వాపోతాడు ‘అనుబంధం’ సినిమాలో. గీత రచన ఆత్రేయ. సంగీతం చక్రవర్తి, గానం. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.

‘స్నేహగీతం’ సినిమాలో “ఒక స్నేహమే మము కలిపే/ఒక బంధమే విరబూసె” అనే పాట బావుంటుంది. రచన సిరాశ్రీ. సునీల్ కాశ్యప్ సంగీత దర్శకత్వంలో కార్తీక్ పాడారు.

‘దిల్ చాహ్‌తా హై’ సినిమాలో టైటిల్ సాంగ్ “దిల్ చాహ్‌తా హై” జావేద్ అఖ్తర్ రాశారు. “హమ్ నా రహేఁ కభీ యారోం కే బిన్, దిన్-దిన్ భర్ హో ప్యారీ బాతేం” అని పాడుకుంటారు మిత్రులు. శంకర్ మహదేవన్, క్లింటర్ సెరెజో పాడిన ఈ పాటకి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించారు.

2017 నవంబరులో విడుదలైన ‘స్నేహమేరా జీవితం’ అనే సినిమాలో రాజీవ్ కనకాల, శివబాలాజీ కథానాయకులుగా నటించారు. సినిమా పెద్దగా ఆడకపోయినా, ఇందులోని “స్నేహం వరమే తీరని రుణమే” అనే పాట బావుంటుంది. సునీల్ కాశ్యప్ సంగీతం.

‘భగీరథ’ సినిమాలోని “ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా” అనే పాటలో “మనసున దాగిన మనసుని చూపే ఆకృతి స్నేహనిది, మనిషిని పూర్తిగా మనిషినిగా మార్చే సంస్కృతి స్నేహనిది” అంటారు గీత రచయిత చంద్రబోస్. చక్రి సంగీతంలో శంకర్ మహదేవన్ పాడారు.

‘స్నేహం కోసం’ సినిమాలో “మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ” అనే పాటలో తన నేస్తానికి కోపమెక్కువైనా, మనసు మక్కువ అంటాడు కథానాయకుడు. రచన పి.కె. మిశ్ర, గానం రాజేష్, సంగీతం ఎస్.ఎ. రాజ్‌కుమార్.

జనవరి 2006లో రాజీవ్ కనకాల, శివబాలాజీ, రాజా నటించిన ‘కోకిల’ అనే సినిమా విడుదలయింది. ఇందులోని “స్నేహమా స్నేహమా చెలిమి చెరి సగమా” అనే పాట చక్కని  మెలోడీ. గానం చిత్ర, రూప్ కన్వర్ రాథోడ్, సంగీతం మధుకర్.

‘ప్రేమ దేశం’ సినిమాలో “ముస్తఫా ముస్తఫా” అనే పాటలో “కాలం నీ నేస్తం ముస్తఫా” అంటారు గీత రచయిత భువన చంద్ర. సంగీతం, గానం ఏ.ఆర్. రెహమాన్.

‘ముఝ్ సే దోస్తీ కరోగే’ అనే సినిమాలో “కహ్ దో ముఝ్ సే దోస్తీ కరోగే” అన్న పాట బావుంటుంది. ఆనంద్ బక్షీ రాసిన ఈ గీతాన్ని ఆశా భోస్లే, ఉదిత్ నారాయణ్, ఆల్కా యాజ్ఞిక్ పాడారు. రాహుల్ శర్మ సంగీతం.

“చిన్నారి స్నేహమా../చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో/గతమైన జీవితం కథ గానే రాసుకో/మనసైతే మళ్ళీ చదువుకో…/మరు జన్మ కైన కలుసుకో” అనే పాటని ‘చిన్నారి స్నేహం’ సినిమా కోసం వేటురి సుందరరామమూర్తి రాశారు. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, రమేష్ ఆలపించారు. చదువులయిపోయి, కాలేజీ వీడి వెళ్తున్న మిత్రులు పాడుకునే పాట ఇది.

‘మహర్షి’ సినిమాలో “చోటి చోటి చోటి చోటి చోటీ చోటీ బాతే/మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ మీఠీ యాదే” అనే పాటలో “స్నేహమంటే ఏమిటంటే/పుస్తకాలు చెప్పలేని పాఠం అంటా/; నేస్తమంటే ఏమిటంటే/కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా” అంటారు గీత రచయిత శ్రీమణి. ఈ పాటని స్వీయ సంగీత దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ పాడారు.

***

చాలా సినిమాలలో నాయికానాయకులు తొలుత స్నేహితుల్లా ఉండి, పిమ్మట ప్రేమికులుగా మారతారు. అలాంటి వాళ్ళకి స్నేహం, ప్రేమా ఒకటే. అనేక సినిమాల్లో ఇలా స్నేహితులైన ప్రేమికులు పెద్దలని ఎదిరించో/ఒప్పించో పెళ్ళి చేసుకుంటారు, చాలావరకు కథలు సుఖాంతాలవుతాయి. కాని చిరంజీవి నటించిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో సాక్షి శివానంద్, చిరంజీవిలు ఫ్రెండ్స్‌‌గానే ఉంటారు.

స్నేహంలో స్త్రీ పురుష భేదాలుంటాయని అనుకునేవారి అభిప్రాయం తప్పని అంటుంది ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలోని “నేను తానని అనుకుంటారా…. నేనే తానని అనుకోరా” పాట. “ఇద్దరిగా కనిపించడమే… మా తప్పంటారా…. ఆడ మగ అని తేడా వుందని అభిమానానికి చెబుతారా, స్నేహం మెహం రెండు వేరని తెలిసీ… తప్పుకుపోతారా…” అని ప్రశ్నిస్తుంది ఈ సిరివెన్నెల గీతం. రాహుల్ రాజ్ సంగీతంలో రంజిత్ పాడారు.

ఇక ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి మధ్య స్నేహం ఉండి, వాళ్ళిద్దరూ ఆమెను ప్రేమించడం, ఎవరో ఒకరు త్యాగం చెయ్యడం చాలా సినిమాల్లో చూస్తాం. కొన్ని సినిమాల్లో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని ఇష్టపడినా – ఆ అమ్మాయి ఇంకో ఎవరినో ఇష్టపడడం, వీళ్ళంతా వాళ్ళ పెళ్ళి జరిపించడానికి ప్రయత్నించడం జరుగుతాయి.

ప్రేమికులుగా మారిన స్నేహితుల గురించి ఎన్నో రొమాంటిక్ మెలోడీలు, సాడ్ సాంగ్స్ ఉన్నాయి.

నాగార్జున నటించిన ‘ఢమరుకం’ సినిమాలో “నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా” అనే చక్కని మెలోడీ పాట ఉంది. గానం శ్రీకృష్ణ, హరిణి, సంగీతం దేవి శ్రీ ప్రసాద్, రచన భాస్కరభట్ల.

జగపతిబాబు నటించిన ‘పెళ్ళి పందిరి’ సినిమాలో నాయికకి చూపు ఉండదు. కానీ హీరో తన కళ్ళతో ఆమెకి లోకాన్ని చూపిస్తాడు. “నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా” అనే పాటలో “ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే/ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే/చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే” అంటాడు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం సిరివెన్నెల. గానం బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

‘నీ స్నేహం’ సినిమాలోని “వేయి కన్నులతో వేచిచూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం/ కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం/ ప్రాణమే నీకూ కానుకంటున్నా మన్నించి అందుకోవా నేస్తమా” అనే పాట చక్కని హిట్. ఆర్.పి. పట్నాయక్ సంగీతంలో ఆర్.పి.పట్నాయక్, ఉష పాడారు. రచన సిరివెన్నెల.

***

ఇటువంటి సినిమాలలోని కొన్ని విషాద గీతాలూ అలరించాయి. రాజేష్ ఖన్నా నటించిన ‘బావర్చీ’ సినిమాలో ఒక డైలాగ్ ఉంది – “ఖుషీ కే గీత్ తో బిల్‌కుల్ ఫుల్‌జడియోం కీ తరహ్ హై… జల్తే హై ఔర్ భుజ్ జాతే హై… లేకిన్ ఉదాసీ అగర్‍బత్తీ కీ తరహ్ జల్తీ హై దేర్ తక్… ఔర్ భుజ్‌నేకీ బాద్ బీ మెహక్‌తీ రహతీ హై” అంటాడు విషాద గీతాల గురించి. ఎంతో నిజం!

‘నువ్వే కావాలి’ సినిమాలో తమది స్నేహం మాత్రమే కాదు, దాన్ని మించిన ప్రేమ అని గ్రహించిన నాయిక “కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు” అని పాడుతుంది. “మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు/ నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు” అంటుంది. రచన సిరివెన్నెల. సంగీతం కోటి, గానం చిత్ర.

‘మనసంతా నువ్వే’ సినిమాలో “నీ స్నేహం ఇక రాదు అని/కరిగే కలగా అయినా …” అని పాటలో మనసంతా నిండిపోయిన ప్రేమికుడి గురించి పాడుకుంటుంది హీరోయిన్. “ఈ దూరం నువ్వు రాకు అని/నను వెలివేస్తూ ఉన్నా… /మనసంతా నువ్వే …” అంటుంది. సంగీతం, గానం: ఆర్.పి. పట్నాయక్, రచన: సిరివెన్నెల.

***

వినోదమైనా, విషాదమైనా పంచుకునేందుకు మిత్రులవసరం. అందుకే ఎయిర్‌టెల్ వారు ఒక ప్రకటనలో “ప్రతీ ఫ్రెండూ అవసరమేరా” అన్నారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ఉద్దేశించినదే అయినా, పాట బావుంటుంది.

“టీ తో పాటు టోస్ట్ ఎలా కావాలో
అలా ప్రతి ఫ్రెండూ అవసరమేరా
ఆఁ… ప్రతి ఫ్రెండూ అవసరమేరా
ఆఁ… ప్రతి ఫ్రెండూ అవసరమేరా
తెల్లారుతూనే నిద్ర లేపే ఫ్రెండ్ ఒకడు
అర్ధరాత్రి ఆదుకునే ఫ్రెండ్ ఒకడు
ఒకడేమో అవసరంలో షేరింగ్ చేస్తాడు
ఒకడు నీ బడ్జెట్‌లో స్నీక్ ఇన్ చేస్తాడు
ఒకడు నేచుర్ కొద్దీ గెస్ట్… ఇంకోడు హోస్ట్ అవుతాడు
కానీ ప్రతి ఫ్రెండూ అవసరమేరా
కానీ ప్రతి ఫ్రెండూ అవసరమేరా
ఒకడు మాటిమాటికీ హెల్ప్ చేస్తాడు,
అప్పుడప్పుడూ ఫోన్ చేస్తాడు
ఇంకొకడు అప్పుడప్పుడూ హెల్ప్ చేస్తాడు,
కానీ మాటిమాటికీ ఫోన్ చేస్తాడు.
గాసిప్‌లో ఒకడేమో తిరిగే శాటిలైట్
ఇంకొకడు వెంట ఉంటే అన్నీ ఆల్‌రైట్
ఒకడు ఎఫర్ట్‌లెస్, ఒకడు ఫోర్స్‌డ్ రకంరా
కానీ ప్రతి ఫ్రెండూ అవసరమేరా
కానీ ప్రతి ఫ్రెండూ అవసరమేరా”

ఈ పాటని ఎవరు రాసారో తెలియదు. ఒకే ఒక్క నిమిషం నిడివి ఉన్న ప్రకటనలో ఈ పాటని కాస్త వేగంగానే పాడారని చెప్పాలి. కొంచెం జాగ్రత్తగా వింటే కానీ భావం సరిగా గ్రహించలేం. ఇదే భావంతో హిందీలోను ఈ ప్రకటన ఉంది “హర్ ప్రెండ్ జరురీ హై యార్” అని సాగుతుంది హిందీ వెర్షన్. ఏ భాషలోనైనా భావం ఒకటే. స్నేహం గొప్పతనం చాటుతుంది.

సో, పాట పాతదైనా కొత్తదైనా హాయిగా పాడుకుంటూ ‘స్నేహితుల రోజు’ని మిత్రులతో గడపుదాం. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here