[box type=’note’ fontsize=’16’] స్వాతంత్ర్య స్వరాన్ని వినిపించటం కోసం, రష్యాలోని విద్రోహ ఆత్మల్ని చిన్నాభిన్నం చేయటం కోసం గోర్కీ 1892లో వ్రాసిన ‘మకర్ ఛుద్ర’ కథ ఎంతోమంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. ఈ కథకి ఫణీశ్ సింహ్ ‘మకర ఛుద్రక్‘ అనే పేరుతో చేసిన హిందీ అనువాదం ఆధారంగా ఈ కథని తెలుగులో అందిస్తున్నారు దాసరి శివకుమారి. [/box]
[dropcap]శీ[/dropcap]తాకాలపు గాలి దూరంగా సముద్రపుటోడ్డుమీద విరిగి పడే అలల యొక్క నీరస మర్మర ధ్వనిని ఆ విశాల మైదానంలోకి మోసుకుని వచ్చి ఎడాపెడా వీచసాగింది. దాంతోపాటు గాలికి వాడి ఎండిన ఆకులనూ తనతోపాటు తీసుకునివచ్చి గుడారం దగ్గర మండుతున్న నిప్పులోకి విసరసాగింది. అలా ఆకులు పడ్డప్పుడల్లా మంట మరింత పెరుగుతున్నది. నాల్గువైపులా వ్యాపించిన అంధకారం, వణుకు పుట్టిస్తుంది. కొద్దిగా పడే వెలుతురులో దక్షిణదిశగా క్షితిజ రేఖ వరకు పరుచుకున్న మైదానం. ఆ మైదానానికి కుడివైపున ఎల్లలు కనపడని సముద్రం మధ్యలో మనకు కనపడే నిర్జనత్వాన్ని కోరుకోదగినదిగా భావింపచేస్తున్నది.
మండే మంట ఎదురుగా కూర్చున్న ముసలి జిప్సీ “మకర ఛుద్రక్’ ముఖం కూడా ప్రకాశవంతంగా మెరుస్తూ మనకు కనపడుతుంది. అతనికి గుడారపు వెంట వచ్చే గుర్రాలను సంరక్షించే బాధ్యత అప్పగించబడింది. కాని ఆ వృద్ధ జిప్సీ ధ్యాస చలికి కొంకర్లు పోయే వాతావరణం పైన లేనేలేదు. అతని వంటి మీద మతగురువులు ధరించే అంగీలాంటి పొడవాటి చొక్కావున్నది. అతని ఒళ్ళంతా దట్టమైన వెంట్రుకలున్నాయి. ఆ వెంట్రుకల క్రింద ఛాతీని, పైన వేసుకున్న చొక్కానుకూడా గాలి తీవ్రంగా ఊపేస్తున్నది.
ఆ జిప్సీ నాతో కాకుండా ఏవో పాత జ్ఞాపకాలతో కొట్టుకుపోతున్నాడు. బంధించి వుంచిన ప్రవాహపు కట్టలు తెగినట్లుగా వుంది అతని పరిస్థితి.
“నీవూ మా ప్రజల మధ్య చేరిపోయావు. చాలా మంచి పనిచేశావు. ఏదైతే మన అదృష్టంలో వ్రాసివున్నదో అదే జరుగుతుంది. అయినా మనకేం కావాలి? ఈ ప్రపంచంలో మనం కళ్ళు తెరుస్తాం.”
ప్రపంచమంతా చుట్టేయాలి. ఆపని అయింతర్వాత విశ్రాంతిగా పడుకోవాలి. చివర్లో హాయిగా చనిపోవాలి. చాలు. ఇంతకంటే ఏం అక్కర్లేదు. కాని మనుష్యుడు తమాషా వ్యక్తి. అతడు తన బలిష్ఠ భుజాలతో విశాలమైన మైదానాన్ని ఆక్రమించాలనుకుంటాడు. ప్రపంచంలో ఇంత భూభాగం వున్నది. అయినా కూడా ఏ కొద్ది భూభాగం కోసమో చావటానికి, చంపుకోవటానికి సిద్దపడతారు. ఎందుకంత వ్యామోహమో తెలియదు. నువ్వు స్వయంగా వెళ్ళి నాగలి పట్టి భూమిని దున్నే రైతును చూడు. మొదట అతడు ఆ భూమి కోసం ఎంతో శ్రమించి చివరకు ఆ పొలంలోనే భూస్థాపితం అయిపోతాడు. చివరికతని అవశేషాలు కూడా లభించవు. అతడు తన చెమటను చిందించి సంపాదించిన సంపదనే తాననుభవించలేని మూర్ఖుడవుతాడు. ఎప్పుడైనా అతను స్వాతంత్ర్యాననుభవించాడా? ఈ విశాలమైన మైదానాన్ని గుర్తించాడా? సముద్రపు మర్మర ధ్వనినెపుడైనా ఆలకించాడా? సర్వాంగ సుందరమైన ప్రకృతిని చూసి పులకించాడా? ఊహు. పుడుతూనే బానిసగా పుట్టి, బానిసగానే అంతమవుతాడు. ఆ బానిసత్వపు పట్టా తొలగించుకోవాలని ఎప్పుడూ ఆలోచించుకోడు. నన్ను చూడు. నా ఈ పండిన కేశాలు ఏభై వసంతాలు చూశాయి. నీవు నా జీవిత కథ వ్రాసేందుకు కూర్చుంటే పుస్తకపు రంగే మారిపోతుంది. అయినా ఇంకా మిగిలే వుంటుంది. నేను చూడని పట్టణం పేరేదైనా నీవు చెప్పగలవా? నేను చూసిన పట్టణాల పేర్లైనా నీవు వినివుండవు. మా సిద్ధాంతం ఏమిటో తెలుసా? ఎల్లప్పుడూ ప్రపంచాన్ని చూస్తూ వుండు. ఒకచోటి నుండి మరో చోటికి తిరుగుతూ వుండు. ప్రతిచోటా కొంచెం సేపు ఆగు చాలు. రాత్రింబగళ్ళూ ఎలా ఒక దాని వెంట ఒకటి తిరుగుతూ వుంటాయో అదే విధంగా నీవూ నిరంతర ప్రయాణం చెయ్యి. జీవితాన్ని గురించి కొంచెం కూడా ఆలోచించవద్దు. అలా ఆలోచించి బుర్రను ఖరాబు చేసుకోవద్దు. నా సలహా ఏంటంటే నీవు నీ జీవితాన్ని గురించి ఎంత ఆలోచిస్తావో అంతే అసహ్యించుకుంటావు. ఇదినాకు బాగా తెలుసు. నేను ఎంతో జీవితాన్ని అనుభవించి, తెలుసుకుని నీకు చెప్తున్నాను” అన్నాడు.
నాలో ఆలోచనలు మొదలయ్యాయి. “నేను జైలులో వున్నాను. అక్కడంతా ఖాళీగా వుండేవాణ్ణి. ఈ ప్రపంచంలో నేను ఎందుకు పుట్టాను అన్న ఆలోచనల్ని కేవలం సమయం గడపటానికి మాత్రమే నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే నా మనసు చాలా భారంగా మారిపోయింది. మనం ప్రపంచంలో ఎందుకోసం వుంటున్నాం? మన లక్ష్యమేమిటో తెలియదు. అలా ఆలోచించటమూ వ్యర్ధమే. తన జీవితం పట్ల పూర్తి ధ్యాస పెడుతూ భ్రమణం చెయ్యి. నాల్గువైపులా కళ్ళు విప్పార్చిచూడు. మన దగ్గర లేని దానిని పొందాలన్న కోర్కె ఎలాంటిదో అది అంతా నేననుభవించాను” అని ఆ జిప్సీతో చెప్పాను.
“ఓహ్! నేనూ ఒకసారి ఒక రష్యన్‌తో మాట్లాడాను. అతనూ నీలాగే బలంగావున్నాడు. అతనేమన్నాడో చెపుతాను విను.. నీ జీవితం నీ ఇష్టానుసారంకాదు ఈశ్వరేచ్ఛ ఎలాగుంటే అలా జీవించటమే నీకర్తవ్యం. నీకు ఏదైనా కావాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్ధించు. ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన పాదాల చెంతే నిన్ను నీవు అర్పించుకో” అన్నాడు. నేనేమన్నానో తెలుసా “నీ ఒంటి మీద బట్టలు చిరిగి జీరండాలైనాయి. చూడటానికి అసహ్యంగా వేలాడుతూ కన్పడుతున్నాయి. నువ్వు దేవుణ్ణి ప్రార్థించి మంచి బట్టలు ఎందుకు పొందవు?” అని.
దీనికై అతను నామీద కోపగించి నానా తిట్లు తిట్టసాగాడు. అంతకుముందే అతను, క్షమ, ప్రేమల గురించి మాట్లాడాడు. కాని నా మాటలు అతని అహంకారాన్ని దెబ్బతీశాయనుకున్నాడు. నన్ను క్షమించనూ లేక తన దారిన తాను పొయ్యాడు. ఇలాంటి శిక్షకులూ వుంటారు. వీరెలాంటి వారంటే నీవు కొంచెమే తిను అంటూ తను మాత్రం రోజుకు పదిసార్లు తినేవాళ్ళు” అంటూ ఆగాడు. మంటవంక చూస్తూ నిశ్శబ్దంగా అయిపోయాడు. తనపైపులో పొగాకు నింపుకోసాగాడు.
గాలివేగం శాంతించి నిశ్శబ్దంగా వున్నది. గుర్రాలు చీకట్లో సకిలిస్తూ వున్నాయి. గుడారానికి ఏభై అడుగుల దూరంలోనే మేము కూర్చునివున్నాం. ఇంతలో మాకు కరుణాపూరితమైన పాటొకటి విన్పించింది. ఆ గొంతు మకరఛుద్రక్ కూతురిది. ఆమె అందమైన యువతి. ఇంకా అందంగా పాటపాడుతున్నది. ఆమె పాట చాలా కోమలంగా వుండి మనసుకు హత్తుకునేటట్లు వున్నది. తీరని కొరతేదో అనుభవిస్తున్నట్లుగా, వ్యధాభరితంగా కన్పడుతూ వుంటుంది. ఇప్పుడు తన హృదయావేదన తగ్గించుకోవటానికే ఆ పాటపాడుతున్నది. అభిమాన ధనంతో తొణికిసలాడుతూ తన అందంతో మిసమిసలాడుతూ చూడటానికి ఆమె ఎవరో రాణీలాగుంటుంది. కాని ఆమెలోతైన కళ్ళలో ఎప్పుడూ వేదనాగ్నేజ్వలిస్తూ వుంటుంది. స్వచ్ఛమైన పోకడలూ వుంటాయి. ఆమె తన అనుపమ సౌందర్యాకర్షణతో నాకు బాగా పరిచితురాలయ్యింది. కాని దురదృష్టమేమిటంటే ఆమె మనసులో ప్రజలపట్ల అసహ్యమే వున్నదికాని అందమైన భావాలు లేవు.
“తీసుకో. ఈ పొగాకు పీల్చు” అన్నాడు వృద్ద జిప్సీ.
“ఈ బాలిక చాలా బాగా పాడుతుంది. వినసొంపుగా వుండి మనసుకెంతో హాయిగా వున్నదన్నాను.”
“మంచిది. ఈ బాలికతో సమానమైన అందం కలిగినామె ఎవరైనా నిన్ను ప్రేమిస్తే ఆమెను నువ్విష్టపడతావా?” అనడిగాడు.
“లేదు. లేదు”, అన్నాను.
“మంచిది. నీవైతే మనసిస్తావు. కాని స్త్రీలపట్ల ఎప్పుడూ అతిగా నమ్మకం పెట్టుకోవద్దు. వారికెంత దూరంగా వుంటే అంతమంచిది. పొగాకు పీల్చటం కంటే ఎవరైనా అమ్మాయిని ముద్దాడటం చాలా బాగుంటుంది. కాని ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా స్త్రీ పెదవుల్ని నీవు ముద్దాడితే నీ స్వాతంత్ర్యాన్ని ఆమె లాగేసుకుంటుంది. నిన్ను తన ప్రేమ పాశంలో బంధించి వేస్తుంది. అదేదీ నీకు కనపడను కూడా కనపడదు. దాన్నుంచి నీవెప్పుడూ విముక్తుడవు కూడా కాలేవు. నీవు పిచ్చివాడిలా నీ ఆత్మను కూడా ఆమెకు అర్పించాలనుకుంటావు. కాని దానికి బదులుగా నీకు లభించేది ఏమీ వుండదు. నా యీ సలహా నువ్వెప్పుడూ మర్చిపోవద్దు. స్త్రీలపట్ల చాలా జాగ్రత్తగా వుండాలి. వాళ్ళు నాగినులవంటివారు. అచ్చం నాగినులే. నేనీ ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్తారు. ఆ మాటలు నమ్మి నీవామే వేలు పట్టుకోవటానికి సిద్దపడితే ఆమె నీ కాలు తీసేయటానికి సిద్దంగా వుంటుంది. ఇది నాకు బాగా తెలుసు. తెలియటం కాదు. ఇలా జరగటం నేనెరుగుదును. ఇంకా నీవు వినదలుచుకుంటే నీకొక కథ వినిపిస్తాను. ఎందుకంటే నేను చెప్పే మాటలు నీ మనసులో బలంగా నాటుకోవాలి. జాగ్రత్తగా వుండు. ఎవరి ఉచ్చులోనూ పడవద్దు. ఎప్పుడూ పక్షిలాగా స్వేచ్ఛగా వుండు.” అంటూ ఒక నిట్టూర్పు విడిచాడు.
చాలా రోజులకిందటి సంగతి. ఒక జిప్సీయువకుడుండేవాడు. అతని పేరు జోబర్. హంగరీ, బొహామియా, స్లావోనియా ఇలా సముద్రపుబొడ్డునున్న చాలా దేశాలు తిరిగివచ్చాడు. చాలా పరాక్రమం కలిగిన వీరుడతడు. చుట్టుపక్కల గ్రామాలలోని డజను మందికి పైగా యువకులు, జోబర్‌ను ఓడిస్తామని, లేదా చంపేస్తామని ప్రతిజ్ఞలు చేశారు. కానీ అతన్నెవరూ ఏమీ చెయ్యలేకపొయ్యారు. అతనికే గుర్రం నచ్చితే ఆ గుర్రాన్ని తీసుకుని ప్రయాణిస్తూ వుండేవాడు. ఒక సైనిక పటాలమే అతడి రాకపోకల్ని గమనించాల్సి వచ్చేది. జోబర్‌కు మనిషి భయమూలేదు, దేవుడి భయమూ లేదు. ఒకవేళ సైతాన్ అయినా తన సైన్యాన్ని తీసుకుని అతన్ని ఎదుర్కోవటానికి వచ్చినా అందరి ప్రాణాలు తీసేయగల సమర్థుడు. సైతాన్ని కూడా తన బలిష్ఠమైన చేతుల్తో చెంపదెబ్బలు కొడతాడని మేమందరం అనుకునేవాళ్ళం.
జిప్సీల దళాలన్నీ అతనికి పరిచయమే. అందరూ ఇతని పేరువినేవుంటారు. అతనికి గుర్రాలన్నా గుఱ్ఱపుస్వారన్నా చాలా ఇష్టం. రెండు గడియల పాటు ఏ గుఱ్ఱంపై స్వారీ చేస్తే ఆ గుఱ్ఱం మంత్రించినట్లుగా అతనికి వశపడిపోతుంది. తీసుకెళ్ళిన గుర్రాన్ని అమ్మివేసుకున్నా ఆ డబ్బును గురించి కూడా ఎవరూ అతన్ని ప్రశ్నించే సాహసం చెయ్యరు. అతని దగ్గరున్న ఏ వస్తువునైనా ఇతరులకు తేలిగ్గా ఇచ్చేశేవాడు. ఒకవేళ నువ్వు అతని హృదయాన్ని అడిగినా అతడు తన చర్మాన్ని కోసి తన హృదయాన్ని నీ చేతుల్లో పెట్టేస్తాడు. కేవలం ఇలాంటి వాటి వల్లే, ఈ సంతోషాల కోసమే అతడు ఇతరుల్ని గౌరవిస్తాడు.
మా దళం అప్పుడు బుకోనియాలో వున్నది. ఇది జరిగి పదేళ్ళయింది. కాని నాకు అది నిన్నే జరిగినట్లుగా వున్నది. అది వసంత ఋతువు. మా సైనికదళం ఒక చోట గుడారం వేసుకున్నాం. ఆ దళంలో సిపాయి “దానిలా”, వృద్దుడైన “నూర్” కూడా వున్నాడు. మరికొంత మంది వున్నారు. వారితో పాటు దానిలా కూతురు “రాద్దా” కూడా వున్నది.
“నీవు నాన్‌కాను చూశావు. ఆమె ఒక రాణీ లాగా వుంటుందంటున్నావు. కాని రాద్దాను ఆమెతో పోల్చలేం. ఎందుకంటే నానకా, రాద్దా యొక్క పాద ధూళితో కూడా సమానం కాదు. రాద్దా అందం మాటల్లో చెప్పలేం. మల్లెపూవుతో పోల్చుకోవచ్చు. ఆ మల్లెపూవు యొక్క ఆత్మతో పరిచయం చేసుకోగలిగిన వాడొక్కడే వుండేవాడు.”
ఎంతోమంది యువకులు రాద్దా వెంటబడి మనసు పారేసుకున్నారు. ఒకసారి ఒక ధనవంతుడి దృష్టి కూడా ఆమె మీద పడింది. అతడు కూడా ఆమెను చూస్తూ నిలబడిపోయాడు. కాని అతని శరీరానికి పక్షవాతం వచ్చినట్లుగా మెలికలు తిరిగిపోయాడు. గుఱ్ఱమెక్కి కూర్చున్నాడు. జ్వరతీవ్రతలో వణికినట్లుగా వణికిపోయాడు. ఆ ధనికుడు కూడా చెప్పలేనంత అందంగా వున్నాడు. అతని దుస్తుల మీద అంతటా జరీ పని చేసివున్నది. గుర్రం కాలిగిట్టలు లేపినప్పుడల్లా అతని దుస్తులు విద్యుత్ కాంతివలె మెరుపులీనుతున్నాయి. తలపై నున్న నీలిరంగు టోపీ మీద వజ్రాలు తాపడం చేయబడివున్నాయి. రాద్దా వైపు చూస్తూ వుండిపోయినతను తెప్పరిల్లి “నీవు నన్ను ప్రేమించు. దానికి బదులుగా సంచి నిండుగా ధనాన్నిస్తాను” అన్నాడు.
రాద్దా దానికి బదులుగా ముఖం తిప్పుకున్నది. “క్షమించండి. నాపై కోపం వస్తే మన్నించండి. కోపం లేకపోతే ఒక చిన్న చిరునవ్వు నవ్వండి” అంటూ ప్రాధేయపూర్వకంగా చూస్తూ నిలబడింది రాద్దా.
రూపాయిలతో నిండిన సంచి నొకదానిని ఆమె కాళ్ళ దగ్గరగా విసిరాడతను. కాని రాద్దా ఏం చేసిందో తెలుసా? వెంటనే ఆ సంచిని కాలితో తన్నేసింది. అది చూసిన ధనికుడు నువ్వేరకం ఆడదానవంటూ తుకతుకా ఉడికిపోయాడు. చాలా విసురుగా, కోపంగా గుర్రానొక్క తన్నుతన్నాడు. ముందుకు దూకించాడు. ఆ గుఱ్ఱం వెనుక లేచిన దుమ్ము మేఘంలా కమ్ముకున్నది.
మరుసటి రోజు అతను మరలా వచ్చాడు. “ఈ పిల్ల తండ్రి ఎవరు?” అనడిగాడు. అతని గొంతు గుడారమంతా ప్రతిధ్వనించింది. ఆ మాటతో ‘రాద్దా’ తండ్రి “దానిలా” బయటికొచ్చాడు.
“నువ్వీ పిల్లను నాకమ్మేయ్. దానికి బదులుగా నీకెంత కావాలంటే అంతా తీసుకో” అన్నాడు దర్పంగా.
“ఇలాంటి పద్దతులు మీలాంటి ధనవంతుల ఇళ్ళల్లో వుంటాయేమో, వాళ్ళు ఏ వస్తువునైనా అమ్ముకుంటారేమో? సాధారణ వస్తువుల దగ్గర్నుంచీ ఆత్మల వరకూ దేన్నైనా అమ్ముకుంటారేమో నాకు తెలియదు. నేను సైన్యంలో పనిచేస్తున్నాను. దేశం కోసం యుద్ధం చేస్తున్నాను. ఏ వస్తువునూ అమ్ముకోలేను.” అన్నాడు.
ఆ ధనికుడు కోపంగా ఎఱ్ఱగా కందగడ్డలాగా తన ముఖాన్ని పెట్టుకున్నాడు. ఉద్రేకంగా చేతిలోని హంటర్లు ఛెళ్ళుమనిపించాడు. ఈలోగా మేం గుఱ్ఱపు చెవి దగ్గర అగ్గిపుల్ల వెలిగించాం. దాంతో ఆ గుఱ్ఱం బెదిరి యజమానితో సహా అక్కణ్ణుంచి మాయమైంది.
మేమంతా మా పనులమీద ఇంకాస్త ముందుకెళ్ళే ప్రయాణం చేస్తున్నాం. రెండు రోజులు గడిచాయి. కాని అతను మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు.
“వినండి. అంటూ అరిచి చెప్పసాగాడు. నా మనసులో ఏ కల్మషమూలేదు. నాకీ పిల్లతో పెళ్ళి చేయించండి. నేను గూడా మీతో పాటే వుంటాను. నా దగ్గర చాలా డబ్బుంది. ఏ ఇబ్బందీ లేకుండా జీవితాలు, గడిచిపోతాయి” అంటూ ఆవేశపడిపోయాడు. ఎంత ఆవేశపడిపోయాడంటే తీవ్రమైన గాలిలో గడ్డిపరక వణికినట్లుగా వణికిపోయాడు.
“మాట్లాడు బేటీ, నీ సమాధానం చెప్పు” అంటూ దానిలా కూతుర్ని గద్దించి అడిగాడు.
“ఒక సింహపు బిడ్డ ఏదైనా ఒక నక్కతోపాటు వెళ్ళిపోతే లోకం ఆమెనేమంటుంది నాన్నా?” అని రాద్దా తండ్రినడిగింది.
దానిలా నవ్వాడు. అతనితో పాటే మేమందరం నవ్వాం. “బాగా చెప్పావు బిడ్డా” అంటూ ధనికుని వైపుకు తిరిగి, “మహాశయా! నాబిడ్డ సమాధానం విన్నారుగా. జరగని పనిని గురించి ఆలోచించవద్దు. మీరు ఏదైనా మీకు తగ్గ నక్కదొకదాన్ని వెతుక్కోండి. చాలా దొరుకుతాయి.” అన్నాడు.
ఆ ధనవంతుడు తన టోపీని తీసి నేలమీద పారవేసి ఎంతో వేగంగా నేలంతా అదిరిపోయేటట్లు గుర్రాన్ని పరుగెత్తించాడు. మేమూ ముందుకెళ్ళిపోయాం. రాద్దా అటువంటిపిల్ల.
ఒకరోజు మేమంతా కూర్చుని వున్నాం. సంగీతం వినపడుతున్నది. మైదానంలో సంగీతపు ధార ప్రవహిస్తున్నది. ఆ మధురమైన సంగీతం వింటూంటే మా నరాల్లోని రక్తం ఉత్తేజమవుతుంది. ఇదేదో దూరదేశపు సంగీతం లాగా వున్నది. మనదాకా తేలివస్తున్నదనుకున్నాం. మా మనసుల్ని పిలిచే ఆ సంగీతం మాలో ఒక అభిలాషను జాగృతం చేసింది. అదేంటంటే ఒక వేళ మేం మరణించినా ప్రపంచాన్నంతా జయించే మరణిస్తాం. అన్న భావనను మాలో కల్గించింది. అటువంటి రసపూరిత సంగీత ప్రతిబింబం వెంటనే మా ముందుకొచ్చింది. మా ఎదుట ముందుగా ఒక గుఱ్ఱం కనుపించింది. ఆ గుఱ్ఱం మీద కూర్చున్న మనుష్యుడొకడు. అతడి చేతిలో వయొలిన్ కనబడింది.
“జోబర్! నీవా! అన్నాడు దానిలా సంతోషంగా. అతడే జోబర్. అతని మీసాలు చాలా పొడవుగా పెరిగి వంకర తిప్పితే భుజాలకు అంటుకుంటాయా అనిపించింది. దానికి తోడు భుజాల క్రిందికి దిగిన కేశపాశం. కళ్ళేమో నక్షత్రాలలాగా మెరుస్తున్నాయి. నవ్వుతూ వుంటే మండే సూర్యుడే గుర్తుకొస్తాడు. దూరాన్నుంచి చూస్తే గుఱ్ఱంమీద రాతి విగ్రహమొకటి కూర్చున్నట్లుగా అనిపించింది. మా గుడారం దగ్గర వెలిగే వెలుగు అతని ముఖం మీద పడి వెలుగులు చిమ్ముతుంది. ప్రపంచంలో అతన్ని చూచినవారెవరైనా సరే మోహితులయ్యి తీరతారు. నేను నిజమే చెప్తున్నాను. నమ్మాలి నువ్వు” అంటూ ఆ జిప్సీ కొంచెం ఆగాడు.
“నిజం నిజం. ప్రపంచంలోని కొందరు మన మీద దృష్టి సారించగానే మనం మూర్ఖులమైపోతాం అలాంటి వారి కోసం సిగ్గుపడం కాని వారిని చూసి గర్వపడతాం. కాని మిత్రమా! ఎక్కువ మంది అలాంటి వారుండరు. కాని అలా వుంటే చాలా మంచిదవుతుంది. ప్రపంచంలో అంతటా మంచేవుంటే ప్రజలు అంగీకరించటానికి బదులు వ్యతిరేకిస్తారు. ప్రపంచ రివాజు ఇదే. సరే పోనిమ్ము. ఆ విషయాలకేంగాని ముందీ కథను పూర్తి చేద్దాం.”
జోబర్‌ను చూస్తూ రాద్దా అన్నది. “నీవు వయొలిన్ బాగా వాయిస్తావు. నీ చేతుల స్పర్శ పొందితే వయొలిన్ తన హృదయంతో పాడుతుంది” అన్నది.
ఆ మాటలకు జోబర్ నవ్వాడు. “దీన్ని, ఈ వయొలిన్ ను నా చేతుల్లో నేనే తయారుచేశాను. కర్రతో కాదు. ఒక నవయవ్వని హృదయంతో. ఆమెను నేను చాలా ప్రేమిస్తున్నాను. ఈ వయొలిన్‌లో వున్నది నా హృదయ తంత్రులే. ఇది చూడటానికి మాత్రమే వయొలిన్. అది వాయించేటపుడు నా చేతులను కదిపేది ఎవ్వరో నాకు తెలుసు. విషయం తెలిసిందా?” అన్నాడు.
“మా జిప్సీ ప్రజలు మొదటి నుండీ స్త్రీ పట్ల అంత ఆపేక్ష భావాన్ని కలిగివుండరు. చెప్పాలంటే కొంత ఉపేక్షిస్తూ వుంటాం. అందువలన వారు మా హృదయాలను రగుల్కొలపరు. ఎవరి హృదయాల్లో మొదటగా ప్రేమాగ్ని రగులుతుందో నని వేచిచూస్తాం. జోబర్ కూడా రాద్దా పట్ల అదే యుక్తిని పన్నాడు. కాని రాద్దా అతననుకొన్న రకానికి చెందింది కాదు. రెండవ రకానికి చెందిన స్త్రీ. జోబర్ మాటలకు ఆమె ముఖం తిప్పుకుంటూ, ఆవులిస్తూ ప్రజలంతా జోబర్ చాలా బుద్దిమంతుడు, చతురుడు అని అబద్దాలే చెప్పారు”. అంటూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.
“ఓహ్! సౌందర్యమెంత నిష్ఠూరంగా వున్నదనుకుంటూ జోబర్ గుర్రాన్నుండి దుమికాడు. అతడి కళ్ళు మెరుస్తూనే వున్నాయి. స్నేహితులారా! నేనూ వస్తున్నానన్నాడు.”
“నీకు మా స్వాగతం. రా జోబర్! అని దానిలా అన్నాడు. అతణ్ణందరూ ఆలింగనం చేసుకున్నాక, కబుర్లతో కాలక్షేపం చేసి ఆ తర్వాత నిద్రించటానికి వెళ్ళాం. మేమంతా బాగా నిశ్చింతగా నిద్రపోయాం . మరుసటి రోజు ఉదయమే లేచిచూస్తే జోబర్ ముఖం మీద పట్టీలేసి కట్టుకట్టి వున్నది. ఏమైందని అడిగాం.
“ఏం కాలేదు. గుఱ్ఱం వెనుక కాళ్ళతో తన్నిందన్నాడు.”
“హ.హ.. మాకు తెలుసులే. ఏ గుఱ్ఱం తన్నిందో అన్నాం. గడ్డం సవిరించుకుంటూ దానిలా కూడా చిరునవ్వు నవ్వాడు. “జోబర్ కూడా రాద్దాకు నచ్చలేదా?” అనుకున్నాం.
అంతే అయివుంటుంది. స్త్రీ ఎంత సౌందర్యవతైనా ఆమె హృదయం స్ప్రింగులాంటిది. ఆమె మెడలో బంగారు సంచి వేలాడతీసినా ఆమె మరలా యథాస్థితిలోనే వుంటుంది. నేను నిజం చెప్తున్నాను. గుర్తు పెట్టుకోనువ్వు” అన్నాడు.
ఆ విధంగా మేము రోజులు గడుపుతున్నాం. ఆ ఏరియాల్లో, మా పనులూ, వ్యాపారము కూడా బాగా సాగుతున్నాయి. జోబర్ కూడా మాతోనే వుంటున్నాడు. అతడు చాలా తెలివైనవాడు. మంచి మిత్రుడు. వృద్ధుల్లాగా బుద్ధిమంతుడు కూడా. పనుల్నీ చాకచక్యంగా చేస్తాడు. అతడు హంగేరియా, రష్యన్ భాషల్ని చదవగలడు. వ్రాయగలడు. అతడు మాట్లాడటం ప్రారంభించగానే మనలో ఎంత కోరిక కలుగుతుందంటే నిద్రా, గిద్రా ఏం రాదు. అతని మాటలు అలా వింటూ కూర్చుండి పోవాలనిపిస్తుంది. అతడు వయొలిన్ ఎంత బాగా వాయిస్తాడంటే ప్రపంచంలో ఇంకెవ్వరూ అంత బాగా వాయించలేరు. నిజం. నేను ఒట్టు పెట్టుకుని మరీ చెప్తాను ఈ మాట. అతడు వయొలిన్ చేతిలోకి తీసుకోగానే మన హృదయం గంతులు వేయటం మొదలుపెడుతుంది. అతడు తంత్రులు మీటటం ప్రారంభించగానే మన హృదయపు దడదడా, వేగం అన్నీ ఆగిపోతాయి. అతడు వాయిస్తూనే వుంటాడు. మనవంక చూస్తూ చిరునవ్వులు చిందిస్తూనే వుంటాడు. మన మనస్సులోనే ఒకసారి నవ్వాలని, మరొకసారి ఏడ్వాలని వుంటుంది. అతడి కరుణాపూరితమైన ఆలాపన మన హృదయాన్ని తూట్లుపొడుస్తుంది. మరలా వెంటనే ఉల్లాసపూరితమైన ఆలాపన చేస్తుంటే మన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతున్నది. ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు కూడా అతని సంగీతానికి మైమరచి నాట్యం చేస్తున్నాయా అనిపిస్తుంది. అంత మధురమైనది ఆ వాయులీననాదం.
“అతని సంగీత ధ్వనికి మన శరీరంలోని ఒక్కొక్కనరం ఉప్పొంగి అతనికి బానిసలవుతాం. అదే సమయంలో జోబర్ మమ్మల్నందర్నీ ఆజ్ఞాపించాడు. మిత్రులారా! ఆయుధాలు ఎక్కుపెట్టండి. కర్తవ్యాన్ని పాలించండి అంటూ మేమంతా అతడు సైగచేసిన వైపుకు చూచి మా పిడి కత్తులతో దాడి చేయటానికొచ్చిన వారిని ఎదుర్కొన్నాం. ఇలా అతను మాకు సర్వం నేర్పేవాడు. అందుకే మేమంతా అతన్ని చాలా ప్రేమించేవాళ్ళం. కేవలం రాద్దా మాత్రమే అతణ్ణి లక్ష్యపెట్టటం లేదు. ఇంత జరిగినా కూడా ఆమె అదృష్టం. జోబర్ ఆమెను ప్రేమిస్తూనే వున్నాడు. ఆటపట్టిస్తూనే వున్నాడు. తన హృదయాన్ని రాద్దా పట్ల బందీగా చేసుకున్నాడు. ఒక్కోసారి పళ్ళు పటపటలాడిస్తూ మీసాల్ని వంకర తిప్పేవాడు. అతని కళ్ళు ఒక్కోసారి తేజస్సును కోల్పోతూ వుంటాయి. మరల అప్పుడప్పుడూ ఎంతో తేజస్సుగా మెరుస్తూ వుంటాయి. మాకందరికీ ఒక్కోసారి అతన్ని చూస్తుంటే భయం కలిగేది. రాత్రిపూట మైదానంలో ఒంటరిగా చాలా దూరం పోయేవాడు. ఉదయమవుతూనే వయొలిన్ సాధన మొదలుపెట్టేవాడు. అది కరుణార్ధతలను నింపుకుని భారంగా పలుకుతుంది. దాని స్వాతంత్ర్యాన్ని ఎవరో లాగేసుకున్నారనిపించేది. మేం మా గుడారాల్లో పడివుండి ఏమవుతుందని ఆలోచించేవాళ్ళం. రెండు బండల మధ్య తనను ఇరికించుకుని మృత్యువునే ఆహ్వానిస్తున్నాడా జోబర్ అనిపించేది.
ఒకరోజు మేం కూర్చుని మా పనులను గురించి మాట్లాడుకుంటున్నాం. మా సంభాషణ చాలా నీరసంగా, ఉత్సాహమే మాత్రం లేకుండా నడుస్తున్నది. అది గమనించిన దానిలా “జోబర్! నువ్వొక పాటపాడు. మాకు హుషారొస్తుంది.” అన్నాడు.
జోబర్ దృష్టంతా రాద్దా మీదున్నది. రాద్దా అతడికి దగ్గర్లోనే వెల్లికిలా పరుండి ఆకాశం వంకచూస్తున్నది. జోబర్ తన వయొలిన్ తీశాడు. ఎవరో నవ నవోష్మేషమైన సుందరిలాగా మారి ఎన్నో సోయగాలను పలకసాగింది. “విశాలమైన మైదానంలో నేను పరుగులిడుతున్నాను. ఎందుకంటే నా హృదయంలో ఎగిసే జ్వాలలకు బెదిరి నా గుర్రమూ బాణం వలె రివ్వున దూసుకుపోతున్నది” అంటూ పాడసాగాడు.
పడుకున్న రాద్దా తల విదిలిస్తూ లేచి కూర్చున్నది. జోబర్ కన్నుల్లో చిరునవ్వులు విరిసాయి. ముఖమండలం సూర్యోదయంలా వెలిగిపోతున్నది. మరలా పాటందుకున్నాడు. “హా..ఛలో ఛలో.. మనం పారిపోదాం. రాత్రి అనే చీకటికి పారిపోయి వెలుతురనే ఉదయాన్ని చేరుకుందాం. పదండి. ఈ కుహనా పరదాను చించివేసి సూర్యుణ్ణి, కొండ శిఖరాన్ని ముద్దుపెట్టుకుందాం. మనం కూడా సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ రాత్రయ్యేవరకూ ప్రయాణం చేద్దాం. మిట్టమధ్యాహ్నం నుండి రాత్రయ్యేవరకూ ఆకాశంలో వెలుతురును వ్యాపింపచేద్దాం. మన గుర్రాన్నీ పరుగెత్తిద్దాం. చంద్రుడి శీతలమైన ఒడిలో సేదదీరుదాం, నిద్రిద్దాం” అంటూ పాడసాగాడు. ఇప్పుడెవరూ ఆనాటి జోబర్ లాగా పాడలేరంటూ ఒక నిట్టూర్పు విడిచాడు. మరలా గతంలోకి వెళ్లాడు.
రాద్దా తన చేతిలోకి చల్లని నీటిని తీసుకొని జోబర్ మీద చిలకరిస్తూ “జోబర్ నేనెప్పుడూ అంతెత్తు ఎగిరి చంద్రుని ఒడిలో నిద్రపోను. ఎందుకంటే కిందికి పడిపోయే ప్రమాదముంటుంది. పడిపోతే నీ ముక్కూ పచ్చడవుతంది. మీసాలకు బురద అంటుకుంటుంది. అందువలన జాగ్రత్తగా వుండు” అన్నది.
జోబర్ ఒక్క క్షణం వరకూ ఆమె వంక తదేక దృష్టితో చూశాడు. కాని ఏం సమాధానమివ్వలేదు. తన కోపాన్ని అదుపులో పెట్టుకుని మరలా పాడసాగాడు. “రెండవ రోజూ ఆకాశం వైపుకు వెళ్లాం. అప్పుడక్కడ గాఢ నిద్రలోకి జారుకుందాం. మనమంతా సూర్యుని ఎఱ్ఱని కాంతిలో శాశ్వతంగా నిద్రిద్దాం” అంటూ “చాలు జోబర్! చాలు. అసలైన పాటంటే ఇదే. నా జీవితంలో నేనెప్పుడూ ఇంత మధురగానాన్ని వినలేదు. నేను అబద్దం గనుక చెప్పినట్లైతే సైతాన్ ఇప్పుడే నన్ను రాయిగా మార్చివేస్తాడన్నాడు” ఉద్వేగంగా, దానిలా.
వృద్దుడైన నూర్ గూడా తన మీసాలు సవరించుకుంటూ, భూజాలు ఎగురవేస్తూ, తన స్పందనను తెలియజేస్తున్నాడు. జోబర్ పాడిన ఈ పాట మా అందరి హృదయాలలో ప్రతిధ్వనిస్తూవున్నది. కాని రాద్దా మాత్రం ఈ పాటవిని ఆనందించలేకపోయింది. “ఏం వుందీ పాటలో మేక మే. మే. అని అరిచినట్లుగా వున్నదని” ఈసడించింది.
ఆమాట మాకెవ్వరికీ నచ్చలేదు. “రాద్దా! బహుశా నీకు కొరడా దెబ్బలు తినాలనివున్నట్లున్నది అన్నాడు” కూతుర్ని మందలిస్తూ వాళ్ళ నాన్న.
కాని మధ్యలో జోబర్ తన టోపీ తీసి నేలమీద వుంచి కళ్ళు విప్పార్చి “లేదు. లేదు. దానిలా! వంకర నడకలు పోయే గుఱ్ఱపు గిట్టలకు మంచి పదునైన ఇనుపడాలు దిగొట్టాల్సి వుంటుంది. నేను నీ కూతుర్ని పెళ్ళాడటానికి నీ అనుమతి అడుగుతున్నాను. సరిగా సమాధానం చెప్పు” అన్నాడు.
దానిలా నవ్వుతూ “నీకు కోరికా, శక్తీ వున్నట్లైతే ఆమెను నీ స్వంతం చేసుకో” అన్నాడు.
రాద్దా వంకకు తిరిగి “ఓ అందమైన యువతీ! నా మాట విను. హఠం చేయకు. నేను నీ అంత అందమైనవాళ్ళనెందరినో చూశాను. కాని నా మనసునెవరూ ఇలా ఆకర్షించలేదు. కాబట్టి రాద్దా! నా ఆత్మనే నీ బందీగా చేశాను. ఇపుడు ఇక నేను ఏం చెయ్యలేను. దేవుని ఎదుట, నీ తండ్రి ఎదుటా, ఇక్కడున్న ఈ అందరి ఎదుటా చెప్తున్నాను. నన్ను పెళ్ళి చేసుకో. కాని ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నా స్వాతంత్ర్యానికి భంగం కలిగించే ప్రయత్నం ఎప్పుడూ చేయకు. ఎందుకంటే నేనొక స్వేచ్చా జీవిని. నా మనసుకి నచ్చినట్లుగా వుంటాను” అంటూ ఆమె పెదవుల్ని ముద్దాడటానికీ, గుర్రమెక్కించి ఆమెను తీసుకెళ్ళటానికీ రాద్దావైపుకు వంగాడు జోబర్.
ఓహ్! బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు రాద్దాకు సింహానికి, సింహం పావు లభించిందని అనుకోసాగాం. కాని ఇంతలో జోబర్ గాలిలో నాట్యం చేస్తూ నేలమీద వెల్లికిలా పడటం చూశాం. గుండు దెబ్బతిన్న మనుష్యునివలె నేలమీద పడివున్నాడు. ఇదెలా జరిగింది? జరిగినదేంటంటే రాద్దా తన కొరడాను అతని కాళ్ళ చుట్టూ తిప్పి తన వైపుకు లాక్కోగానే అతను నేలపై పడిపోయాడు.
ఆ తర్వాత రాధా నేలమీద పడుకుని నవ్వుతూ ఆకాశం వంక చూడసాగింది. మేమంతా ఊపిరి బిగబట్టి జోబర్ ఇప్పుడేం చేస్తాడు అని చూడసాగాం. కాని జోబర్ పైకి లేచి తన రెండు చేతుల్తో తన శిరస్సును అదుముకోసాగాడు. తన నుదురు ఇప్పుడే పగిలిపోయిందా అన్నట్లుగా అతను తన ముఖాన్ని పెట్టాడు. ఆ తర్వాత అతడు శాంతంగానే పైకి లేచి మా అందరి వంకా దృష్టి సారించి ఎదురుగా వున్న మైదానంలోకి నడిచాడు. వృద్దుడైన నూర్ “చూడు. జోబర్ వెళ్ళిపోతున్నాడని” నాతో అంటే నేను కూడా ఆ చీకట్లో జోబర్ వెంట నడవసాగాను.
ఛుద్రక్ తన పైపులో నుండి నుసిని రాల్పి మరలా దానిలో పొగాకు నింపసాగాడు. నేను నా పొడుగు చేతుల చొక్కాలోకి ముడుచుకుంటూ, వణుకుతూనే అతని వంక చూడసాగాను. గాలీ, పొగా కలసివస్తూ నల్లగా కనపడసాగింది. అతడు భారంగా వున్న తన తలను విదిలిస్తూ, ఏదో గొణిగాడుగాని నాకేం వినపడలేదు. అతని పెద్ద పెద్ద మీసాలు కూడా వెంట్రుకలు ఎగిరినట్లు ఎగురుతున్నాయి. అతడొక ప్రాచీన వృక్షం వలె కనపడుతున్నాడు. దానిమీద పిడుగుపడ్డా ఆకాశం వలె శిరస్సు ఎత్తుకునే నిలబడ్డాడు. సముద్రపుటోడ్డున అలలు అల్లరిపెడుతున్నాయి. గాలిమర్మర ధ్వనులు చేస్తూ మైదానంలో పరుగులు పెడుతున్నది. నాన్‌కా పాడటం ఆపేసింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకోవటం వలన అంతా చీకటిగానే వున్నది. మళ్ళీ కథ మొదలైంది. జోబరు శిరస్సు వంచుకుని చేతులు వేలాడవేసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. నది సమీపానికొచ్చి ఒక బండమీద కూర్చున్నాడు. జాలిగొల్పేటట్లుగా వుంది అతడు బాధపడేతీరు. నా మనసు జాలితో నిండిపోయింది. కాని నేను అతని సమీపంలో కెళ్ళలేదు. కేవలం మాటలతోనే మనుష్యుని బాధకు ఓదార్పులభిస్తుందా? లేదుగా. అతనా బండ మీదే ఎన్ని గంటలసేపు కూర్చున్నాడో తెలియదు.
నేనిక్కడే కొంచెం దూరంలో నేలమీద పడివున్నాను. ప్రకాశవంతమైన వెన్నెల రాత్రిలో మైదానం మొత్తం వెండిలాగా మెరిసిపోతున్నది. పరిసరాలన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. అపుడే రాద్దా తమ గుడారం నుండి జోబర్ వైపుకు రావటం చూశాను. నాకు చాలా సంతోషం కల్గింది. రాద్దా చాలా చిత్రమైన బాలిక. దగ్గరకొచ్చి జోబర్‍తో ఏదో మాట్లాడసాగింది. కాని జోబర్ వినే స్థితిలో లేడు. రాద్దా అతని భుజం మీద చెయ్యేసింది. ఉలికిపాటుతో తన ముఖాన్ని కప్పుకున్న చేతిని తొలగించి త్రుళ్ళి పడిలేచి నిలుచున్నాడు.
అతని చేతులు గట్టిగా పిడిబాకును పట్టుకున్నాయి. ఆమెనేమైనా హత్యచేస్తాడనిపించింది. ఎవరినైనా సహాయానికి రమ్మని పిలుద్దామని గుడారంవైపుకు పరుగెత్తబోయాను. అంతలో నాకేవో మాటలు విన్పించాయి.
“ఆ కత్తిని పారవేయి. లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను. దీన్ని చూస్తున్నావా?” అంటూ జోబర్ శిరస్సుకు తుపాకి నానించింది. అటువంటి స్త్రీ రాద్దా. మంచి జంటే కుదిరింది. ఇపుడేం జరుగుతుందో చూద్దామనుకున్నాను. రాద్దా తుపాకీని లోపల వుంచుతూ, “నేను నిన్ను చంపటానికి రాలేదు. కాని, నీతో ఒప్పందం చేసుకోవటానికి వచ్చాను. నీ కత్తిని పారవేయి” అన్నది.
అతడు కత్తిని పారవేసి ఆమె వైపు కోపంగా చూడసాగాడు. అది చాలా విచిత్రమైన దృశ్యం. ఇద్దరూ ఒకరినొకరు ఎలా చూసుకున్నారంటే రెండు క్రూర జంతువులు ఒకదాని వంక ఒకటి సాహస, పరాక్రమాలతో చూచుకున్నట్లుగా. కేవలం చంద్రుడే వాళ్ళను చూస్తున్నాడు. ఆ చుట్టుపక్కల నేను తప్పితే మరెవరూ లేరు.
“జోబర్! నా మాటలు విను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” అన్నది.
జోబర్ తన భుజాల్ని మాత్రమే కదిలించాడు. అతని కాళ్ళూ, చేతులూ కట్టేసినట్లుగా బిగుసుకుపోయాయి. రాద్దా ఇంకా మాటలు కొనసాగిస్తున్నది. “నేను చాలా మంది యువకుల్ని చూశాను. కాని వారందరిలోనూ నువ్వు చాలా అందమైనవాడివి, పరాక్రమవంతుడివి. వాళ్ళల్లో నేను కోపంగా చూస్తేనే మీసాలు క్రిందికి తిప్పేయగలవాడున్నాడు, నేను సైగ చేస్తేనే తన శిరస్సును నాకాళ్ళ దగ్గర వుంచగలిగినవాడున్నాడు. కాని అందువలన నాకు లాభమేమున్నది? వాళ్ళు నాకు సంతోషాన్ని కల్గించలేరు. వాళ్ళు గొట్టెల్లాంటివారు. జోబర్! ఈ ప్రపంచంలో జిప్సీలు చాలా తక్కువమందున్నారు. మొదట్లో, నిన్నుగాని, మరెవర్నీగాని ప్రేమించలేదు. ఇపుడు నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు స్వాతంత్ర్యమంటే ఇష్టం. కాని దానికంటే కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఇపుడు నిన్ను వదిలివుండలేను. ఏ విధంగా నువ్వు నన్ను వదిలివుండలేవో అదే విధంగా ఇపుడు నేను నన్ను గాఢంగా ఇష్టపడుతున్నాను. నీవు నా వాడివికా. నా మాటలు పూర్తిగా విన్నావా జోబర్!” అన్నది.
జోబర్ నవ్వాడు. “నాకు నీ మాటలు విని చాలా సంతోషం కలిగింది. చెప్పు ఇంకా చెప్పు. ఆపకు నీ మాటలు” అన్నాడు.
“ఇంకా ఎక్కువే చెప్పాలి. నువ్వెంత దూరం పారిపోయినా నేను నిన్ను నా వాడిని చేసుకునే తీరతాను. అందుకనే చెప్తున్నాను. ఇపుడు సమయాన్ని వృధాపరచను. నా వేడిముద్దు, కౌగిలింత, నీకోసం ఎదురుచూస్తున్నాయి. నా బాహువుల్లోని వేడిలో నువ్వు నీ సాహస జీవితాన్ని మొత్తం మర్చిపోగలవు. నీ సుందర గీతాలను కూడా మర్చిపోతావు. నీ ప్రణయ గీతాల్ని నాకు కూడా విన్పిస్తున్నావుగదా. రా. నా కౌగిలిలోకి. సమయం వృధా చెయ్యకు జోబర్. ఒక ఆఫీసరు ఆజ్ఞను సేవకుడే విధంగా పాటించాలో అదే విధంగా రేపట్నుంచి నీవు నా ఆజ్ఞల్ని పాటించాల్సివుంటుంది. రేపు నీవు గుడారంలోని జనం ముందు నా పాదాల మీద పడి నా కుడిచెయ్యి పట్టుకుని ముద్దాడాలి. అప్పుడే నేను నీ భార్యనవుతాను” అన్నది.
“ఇది ఆ సైతాను బాలిక కోరిన కోరిక. ఇటువంటి విషయాలు పూర్వకాలంలో ఎక్కడైనా జరిగేవేమో? అది కూడా మా జిప్సీలలో ఎప్పుడూ జరగలేదు. ఒక స్త్రీ కాళ్ళు పట్టుకుని పెళ్ళాడటమనేది లేనేలేదు. ఇంతకంటే అవమానపడే విషయం మరొకటేముంటుంది? అదే నువ్వయితే ఏడు జన్మలెత్తినా అలాంటి పని చేయగలవా? అంటూ నావంకకు తిరిగి అన్నాడు. తనే మరలా లేదు నువ్వలా చేయలేవు. ఎప్పటికీ చేయలేవు.” అన్నాడు మళ్ళీ.
రాద్దా మాటలకు జోబర్ ఎగిరిపడ్డాడు. గట్టిగా హుంకరించాడు. ఆ హుంకరింపు మైదానమంతా ప్రతిధ్వనించింది. అతని శరీరం నుండి తూటా దూసుకుపోయిందా అన్నట్లుగా కూడా వుంది ఆ హుంకరింపు. రాద్దా కూడా కంపించింది కాని వెనక్కేమాత్రం తగ్గలా. “మంచిది జోబర్. రేపు కలుసుకుందాం. నువ్వు నా ఆజ్ఞను పాటిస్తావనే అనుకుంటున్నాను. నా మాటలన్నీ విన్నావుకదా! అన్నది”.
“విన్నాను. నీ ఆజ్ఞ పాటిస్తాను.” జోబర్ బాధాపూరిత కంఠంతో చెప్పాడు. ఆమె వైపుకు చేతిని చాపాడు. కాని ఆమె అతనికి దూరంగా జరిగింది. అతడు మొదలునరికిన చెట్టులా నేలమీద కూలబడ్డాడు.
పిచ్చివాడి వలె నవ్వుతూ మరల అంతలోనే ఏడుస్తూవున్నాడు.
అందమైన నాగినులు ఇదే విధంగా తమని ప్రేమించిన పురుషుల్ని కాటువేస్తూవుంటారు. చాలా కష్టంమీద నేను జోబర్‌ను సముదాయించాను.
నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సైతాన్ ఈ విధంగా మనుష్యుణ్ణి శోకంలో ముంచి తనేం సంతోషం పొందుతాడు? స్త్రీ, పురుషుల్ని భయంకర వేదనలలోకి నెట్టి తనేం సుఖాన్ని ఆశిస్తాడు? దార్శనికులు అయిన వారి వద్ద కూడా దీనికి సమాధానమే లేదా?
నేను శిబిరంలోకి వెళ్ళి విషయాలన్నీ అందరికీ చెప్పాను. వాళ్ళంతా పరస్పరం మాట్లాడుకున్నారు. రేపటివరకూ వేచి చూద్దామనుకున్నారు. మరుసటి రోజు సాయంకాలం మేమంతా గుడారం దగ్గర కూర్చునివున్నాం. జోబర్ వచ్చాడు. అతడు చాలా దుఃఖంగా వున్నాడు. ముఖం వాడిపోయింది. కళ్ళ కింద అంతా నల్లని వలయాలు ఏర్పడ్డాయి. నేలవంక చూస్తూ కూర్చున్నాడు. మాటలు మాత్రం మాకు చెప్పసాగాడు. “మిత్రులారా! నేను రాత్రంతా ఆలోచించాను. నా హృదయాన్ని శోధించాను. దాంట్లో ఎక్కడా మునుపటి స్వాతంత్ర్యం లేదు. దాంట్లో కేవలం రాద్దాయే నివాసమున్నది. అందమైన రాద్దా నిలబడి చిరునవ్వు నవ్వుతూ ఒక రాణీలాగున్నది. ఇపుడు కూడా తను నాకంటే తన స్వాతంత్ర్యాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నది. కాని నేను నా స్వాతంత్ర్యానికంటే రాద్దానే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందువలన ఆమె పాదాల చెంత నేను తలవాల్చటానికే నిశ్చయించుకున్నాను. ఆమె నన్ను ఇదే ఆజ్ఞాపించింది. మీరంతా దాన్ని మీ కళ్ళతో చూస్తారు. అందమైన రాద్దా పరాక్రమవంతుడైన జోబర్‌ను తన బానిసగా ఎలా చేసుకుందోనన్న విషయాన్ని పరాక్రమవంతుడైన జోబర్, రాద్దాతో కలవటానికి ముందుగా సింహం తన వేటను ఆడ సింహానికి తినిపించినట్లుగా నేను చెయ్యాల్సివుంటుంది. కాళ్ళమీద పడిన తర్వాత రాద్దా నా భార్య అయిపోతుంది. తన ముద్దుల్లో, కౌగిలింతలతో నన్ను చుట్టేసుకుంటుంది. ఆ తర్వాత నాకు అందరికీ పాటలు విన్పించే కోరిక కూడా వుండదు. నాకు నా స్వాతంత్ర్యం పోగొట్టుకున్నానన్న పశ్చాత్తాపం కూడా వుండకూడదు. నేను సరిగానే చెప్పానా రాద్దా? అన్నాడు జోబర్ తన కళ్ళెత్తి రాద్దా వంక ఉదాసీనంగా చూస్తూ,
రాద్దా బదులుగా ఏం చెప్పలేదు. కేవలం తలాడిస్తూ తన కాళ్ళవైపు సైగ చేసింది. మేమంతా దుఃఖంతో, ఊపిరి బిగబట్టి ఆశ్చర్యంతో ఆ దృశ్యం చూస్తున్నాం. మాక్కొంచెంకూడా అర్ధం కావటం లేదు. మా కోరిక ఏంటంటే ఏదైనా దూరప్రాంతం వెళ్ళి అక్కడ జోబర్ ఏ స్త్రీ కాళైనా పట్టుకుంటే ఆమె రాద్దా అయివుండదు కదా. కాని ఇక్కడ ఇలా అతను అవమానంతో తలదించటం చూడలేం. మా అందరి హృదయాల్లో సిగ్గూ, బాధ, ఇంకా జాలి ఎగిసిపడ్డాయి.
ఇంతలో రాద్దా జోబర్‌ను “త్వరగా కానీ” అంటూ హెచ్చరించింది.
“ఇంత తొందరవద్దు రాద్దా. ఇంకా చాలా సమయముంది. ఈ రోజుతో నువ్వు చాలా మహిమాన్వితురాలవయిపోతావు” అంటూ జోబర్ నవ్వాడు. ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుంది. జోబర్ తన మాటలు కొనసాగించాడు.
మిత్రులారా! ఇదీ నా కథ. ఇప్పుడు నాకు వేరే దారేమీలేదు. నా రాద్దా పైకే ఎంతో కఠినాత్మురాలు. కాని పైకి కనుపించినంతగా లోపలి కాఠిన్యం ఆమెలో లేదు. ఇపుడు నేనా విషయం తెలిసికోవాలనే ఉబలాటపడుతున్నాను. మిత్రులారా! నన్ను క్షమించండి” అన్నాడు. జోబర్ ఏం చేయబోతున్నాడు? ఎలా తెలుస్తుంది అనుకునే లోగానే రాద్దా నేలమీద పడి విలవిలా తన్నుకుంటున్నది. ఆమె గుండెలో జోబర్ తన కత్తిని పూర్తిగా దించాడు. మేమంతా, బొమ్మల్లాగా నుంచుండిపోయాం.
రాద్దా తన చేత్తో ఆ కత్తిని తీసివేసి ఒక వైపు పారవేసింది. గాయాన్ని తన పొడవాటి వెంట్రుకలతో అదిమిపెట్టి నవ్వసాగింది. “ఆమె చాలా స్పష్టంగా, తెలివిగా మాట్లాడసాగింది. “జోబర్! నీకు వీడ్కోలు చెప్తున్నాను. నువ్విలాగే చేస్తావని నాకు తెలుసు.” అంటూండగానే ఆమె కళ్ళు శాశ్వతంగా మూతలుపడ్డాయి.
“ఇప్పుడు మీకు తెలిసిందా? రాద్దా ఎంత విచిత్రమైన బాలికో?”
“నువ్వు చాలా విచిత్రమైనదానివి. నా చిలిపి చేష్టల రాణీ! నీ కోర్కెప్రకారం నేనిపుడు నీ పాదాలపై పడతాను అంటూ జోబర్ రోదించాడు. అతని హృదయవిదారకమైన ఏడ్పు, మైదానమంతా ప్రతిధ్వనించింది. నేలమీద పడి చనిపోయిన రాద్దా పాదాలను ముద్దాడుతూ తానుకూడా అక్కడే పడి లుంగ చుట్టుకుపోయి రోదించసాగాడు.
వృద్దుడైన నూర్ “హంతకుణ్ణి పట్టుకోండి అన్నాడు”. కానిమేమెవ్వరం జోబరను బంధించటానికి ముందుకు రాలేదు. అలా జరుగుతుందని నూర్ కూడా తెలుసు. కాని దానిలా ముందుకు వచ్చి రాద్దా రక్తంతో తడిసిన కత్తిని పైకి తీశాడు. ఆ కత్తి వంకే తదేక దృష్టితో చూడసాగాడు. అతడి పెదవులు ఒణక సాగినవి. కత్తిమీద రాద్దా వెచ్చని నెత్తురు అంటివున్నది. దానిలా వేగంగా ముందుకు కదిలి జోబర్‌ను గట్టిగా పొడిచాడు. దానిలా ఒక సైనికుడు ఆపై రాద్దా తండ్రి కదా?
“సెభాష్!” అంటూ జోబర్ దానిలా వైపుకు దుమికాడు. కాని అతని శరీరం రాద్దాకు దగ్గరగా కుప్పకూలింది. అతని ఆత్మ కూడా రాద్దాను కలుసుకోవటానికి మరో లోకంలోకి సాగిపోయింది.
మా కళ్ళముందు రాద్దా శవం పడివుంది. ఆవిడ ఒక చెయ్యి గుప్పెడు వెంట్రుకలతో తన ఛాతీకైన గాయాన్ని కప్పుతూవ్నుది. పొడవాటి వెంట్రుకలు ఆమె ముఖమంతా కూడా పరుచుకుని వుండి రాద్దా ముఖంలోని భావాలు స్పష్టంగా మాకు తెలియటం లేదు.
అంతా విచారంలో మునిగిపోయాం. దానిలా మీసాలు గూడా కంపిస్తున్నాయి. అతడి కళ్ళముందు అంతా అంధకారమే అలుముకున్నది. ఒకసారి తలెత్తి ఆకాశం వంక చూశాడు. అతని నోటి నుండి ఒక్కమాట కూడా రాలేదు. వృధుడైన నూర్ మాత్రం నేలమీద పడి దొర్లుతూ రోదిస్తున్నాడు. ఏడ్వాల్సిన విషయమే. కాని ఏడ్వటం ఎందుకు? ఈశ్వరుడందరికీ మేలే చేస్తాడు. మెడను వెనక్కు తిప్పకుండా ముందుకు నడవటమే మనపని. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా ప్రయాణం ఆపేస్తే మృత్యువు వచ్చినట్లే.” అన్నాడు.
కథ చెప్పటం ఆపేసి ఆ వృద్ద జిప్సీ మౌనంగా అయిపోయాడు. తన పైపును తీసి సంచిలో వేశాడు. తన పొడవాటి చొక్కాను సరిగా లాక్కున్నాడు. వర్షం మొదలైంది. గాలి తీవ్రమైంది. సముద్రపొడ్డున అలలు ఎగిసిపడుతున్నాయి. గుర్రాలు మా నాలువైపులా నిలబడి తమ తమ పెద్ద కళ్ళతో మా వంక చూస్తూ నిలబడ్డాయి.
ఛుద్రక్ వెళ్ళి ప్రేమగా వాటిని నిమిరాడు. అతని గొంతు ఇంకా భారంగానే వున్నది. నా వంకకు తిరిగి “ఇపుడు నిద్రపోయే సమయమైంది అంటూ తన పొడవాటి అంగీనే ముఖం మీద దాకా కప్పుకుని నేలమీదే పడుకుని వెంటనే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కాని నాకు నిద్రపోవాలని లేదు. మైదానంలో పరుచుకున్న అంధకారాన్ని, దూరంగా గర్జించే సముద్రాన్ని, దట్టంగా పట్టబోయే మంచునూ చూస్తున్నాను. నా కన్నుల ఎదుట రాద్దా యొక్క రాణీత్వపు తేజస్సు, అభిమానంతో పైకెత్తి చూసే ఆమె శిరస్సే కపడుతున్నాయి. ఆమె తన చేతితో గుప్పెడు వెంట్రుకలతో తన హృదయపు గాయాన్ని దాచుకుంటూ తన కోమలమైన వ్రేళ్ళ నుండి అగ్ని కణాలవలె జాలువారే చుక్కలచుక్కల రక్తం భూమిని తడిపే దృశ్యమే కదలాడుతున్నది.
రాద్దా వెనుకగా పరాక్రమవంతుడైన జోబర్ పడివున్నాడు. అతని ముఖం మీద పొడవైన వెంట్రుకలు చిందరవందరగా పరచుకుని వున్నాయి. ఆ వెంట్రుకల చాటు నుండి కన్నీళ్ళ ధారలు కారబోతున్నాయి.
వర్షపు నీరు ఎక్కువవుతున్నది. గాలి వ్యధిత హృదయం లాగా ఘోషపెడుతున్నది. అటు రాద్దా ఇటు జోబర్ల స్మృతిలో శోకం అలా ప్రకటితమవుతున్నదని నాకనిపించింది. ఆ రాత్రి చీకటిలో రెండు నీడలు ఒక దానికొకటి దగ్గరగా వచ్చి నాట్యమాడుతున్నాయి. అయినప్పటికీ, ముగ్ధమోహన గాయకుడైన జోబర్ తన అభిమాన ప్రేమాస్పదురాలైన రాద్దాను దక్కించుకోలేకపోయాడు.
(మూలం: మాక్సిం గోర్కీ, హిందీ: ఫణీశ్ సింహ్, తెలుగు: దాసరి శివకుమారి)