మకరందం కన్నా మధురం

0
3

[dropcap]”మ[/dropcap]కరందం అంటే తేనె! ఇది నోటికి తెలిసిన రుచులలో ఒకటి. అంతకంటే తీయన మనసుకు మాత్రమే తెలిసిన అపూర్వమైన భావం ఇంకోటి….. అదే ప్రేమ….ఇష్టం.. ఇలా… ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. వాటి రూపం రకరకాలుగా ఉంటుంది. ఎందరికో ఇది అనుభవం కూడా!” అంటూ చెప్పడం మొదలు పెట్టింది మధుర.

“అవును. నీది కవితా హృదయం. నువ్వు రచయిత్రివి. నువ్వు చెప్పేది కల్పితం ఐనా నిజమే ఐనా అందంగానూ ఇష్టంగానూ ఉంటుంది. నీ అనుభవాలు నాకు ఎన్నో చెప్పావు. ఎన్నో కథలూ రాసేవు.” అంది మధురకి స్నేహితురాలు యామిని.

“నాకు చాలామంది తెలిసిన వాళ్ళు వున్నారు. నేను చేసిన ఉద్యోగంలోనూ, రచయిత్రిగానూ. అయితే పాఠకురాలిగా నన్ను పూర్తిగా తెలుసుకున్నదానివి. అందుకే నీకు మాత్రమే చెబుతున్నా. నీకు నాకు వయసులో చాలా తేడా వుంది. ఐతేనేం నా జీవితంలో పదిలంగా దాచుకున్న నా ప్రేమ కథను నీతో పంచుకోవాలని వుంది.”

“నిజంగా….? ఇంతకాలం నాకు చెప్పకుండా దాచేవా… చెప్పు వింటాను.” అంటూ వినడానికి సిద్ధం ఐనది యామిని.

“మా నాన్నగారు మిలటరీ ఆఫీసర్. నా చిన్నతనం అంతా ఢిల్లీలోనే గడిచింది. మా నాన్నమ్మకి కూతుర్లు లేరు. నా పెళ్ళి చూడాలని ఒకటే గొడవ చేస్తే డిగ్రీ అవ్వగానే పెళ్ళి చేసారు నాన్న. అతను హర్ష, నేవీలో పని చేసేవారు. అందువలన సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే సెలవులు. నేను కూడా ఉద్యోగంలో చేరాను. అప్పుడే రచనలు చేయడమూ మొదలుపెట్టేను. నాన్నగారు రిటైర్ అయ్యాక హైదరాబాదుకి వచ్చాము. దాంతో ఎందరో అభిమానులు ఏర్పాడ్డారు. బంధువుల్లోనూ రచయిత్రిగా అందరికీ తెలిసాను.

హర్షకి ప్రమోషన్స్ త్వరగా వచ్చేవి. దాంతోబాటు ట్రాన్స్ఫర్స్. అతనోసారి వస్తే నేనోసారి అతని దగ్గిరకు వెళ్లేదాన్ని. అలా రోజులు బాగానే గడిచి పోతున్నాయి. నేను రచనలు చేయడం, వుద్యోగం వలన కాలమే తెలియనంత బిజీగా ఉండేదాన్ని.

ఎందరో ఉత్తరాలు రాయడం ఫోను చేయడం కలుస్తామంటూ అడగటం చేసేవారు. కానీ నేను ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు. పబ్లిసిటీ నాకు నచ్చదు. పొగడ్తలు అవార్డులు సన్మానాలు ఇదంతా ట్రాష్.అనుకుంటాను. కేవలం నా తృప్తి కోసం రాసుకోవడం తప్పితే ఏదో ఆశించి కాదు. కానీ ఎన్ని అనుకున్నా ఒక సర్కిల్ నా చుట్టూ గీసుకున్నా….. అనుకోని అతిథిగా…. నా జీవితంలోకి అడుగుపెట్టాడు ఇంద్రజిత్.”

“ఎవరతను?” అనుకోకుండా అడిగింది యామిని.

“ఇంద్ర కూడా రచయితే! కానీ అతను ఇంగ్లీషులో రాస్తాడు. ప్రముఖ రచనలు, నవల్స్ తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తాడు.”

“ఎవరితోనూ పరిచయం పెంచుకోని ఈ మధుర….. ఇంద్రజిత్‌ను ఎలా ఇష్టపడింది?”

“నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు.ఇందులో కొంత నాకు స్వార్థం ఉందిలే!”

“అదెలా?….”

“నేను కూడా ఇంగ్లీషులో రచనలు, ముఖ్యంగా ఆర్టికల్స్ రాయాలనే ఇష్టంతో…. ఇంద్ర పంపిన మెయిల్స్‌కి రిప్లై ఇస్తూ వచ్చాను. అందులో కేవలం సాహిత్యాభిలాష అంశమే తప్ప వ్యక్తిగతం లేదు. అతని పర్సనల్ లైఫ్ గురించి నేను అడగలేదు. ఇంద్ర నన్నూ అడగలేదు. అది అవసరం లేదుకదా!”

“నమ్ముతాను. నిజమే!”

“అతని పట్ల ప్రత్యేక అభిమానం స్నేహం ఉందని ఇప్పుడు నీ దగ్గిర ఒప్పుకుంటాను.”

“థాంక్స్! ఆ తర్వాత….?” కుతూహలంగా అడిగింది యామిని.

“అదే ఒక ప్రమాదకరమైన నా జీవితానికి మలుపు అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు.”

“అరే…. ఏమైంది?” ఆత్రంగా అడిగింది యామిని.

“యామీ…. హర్ష నాకు భర్త. నాకు ఎలాంటి లోటు లేదు. నేనంటే ప్రాణం పెడతాడు. మేమిద్దరం దూరంగా ఉన్నామనే అసంతృప్తి మా ఇద్దరికీ లేదు. మా అమ్మ కొద్దిగా బాధపడేది. నా ఇద్దరు పిల్లలనూ పెంచుతూ తృప్తిపడేది. వాళ్ళ ఆలనా పాలనలో సర్దుకుంది. మా నాన్న మిలటరీ మనిషి కనుక ఆయన అంత సీరియస్‌గా తీసుకోలేదు. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవు కదూ…. నా ఇంగ్లీషు ఆర్టికల్స్ ప్రముఖ పత్రికల్లో వచ్చేవి. ఇంద్ర వలన నాకు బాగా రాయడం పట్టుబడింది.”

“నన్ను మించి పోయావు. కంగ్రాట్స్” అన్నాడు ఇంద్ర అభినందిస్తూ.

“ఇదంతా నీ పరిచయం, ప్రోత్సాహా ఫలితం” అన్నాను.

“నీలో టాలెంట్ లేనిదే సాధ్యంకాదు. కొన్ని టిప్స్ చెప్పాను అంతే…” అన్నాడు. “గురుదక్షిణ ఏమిస్తావ్?” అన్నాడు.

“నువ్వు ఏది అడిగినా ఇస్తాను….. అడుగు.” అన్నాను.

“అది గుర్తు పెట్టుకో. సమయం వస్తుంది. అప్పుడే అడుగుతాను” ….అన్నాడు.

“తప్పకుండా…. నీదే ఆలస్యం….” అన్నాను క్యాజువల్‌గా.

“ఇంద్రజిత్ ఉండేది హైద్రాబాదేనా….? మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా?” అంది యామిని.

“కాదు…. బెంగుళూరు. కలుసుకునే అవకాశం రానూలేదు.” చెప్పింది మధుర.

యామిని కలవరపడింది మధుర జవాబుకి. అది కనబడకుండా మానేజ్ చేసింది.

“సరే తర్వాత…. ఏమి జరిగింది?”

“అప్పుడు అమ్మ నాన్న పిల్లలను తీసుకుని ఢిల్లీ వెళ్లారు వాళ్ళకి సెలవలు ఇస్తే! అంతకు ముందే హర్ష వచ్చి వెళ్ళాడు. నేను ఇల్లు సర్దుతూ పాత ఫోటోలను ఫ్రేమ్‌లో ఆర్గనైజ్ చేస్తున్నాను. వర్షం వస్తోంది… పెద్దగా కాదు కానీ జల్లుగా అప్పుడప్పుడు పడుతోంది. ఎవరో తలుపు తట్టిన శబ్దం వస్తే వెళ్లి తీసాను. ఎదురుగా ఇంద్రజిత్!

“ఒహ్ సర్‌ప్రైజ్….. ఇంద్రా …” అన్నాను సంతోషంగా.

అతన్ని ఎదురుగా మొదటిసారి చూస్తున్న. ఇంతకు ముందు స్కైప్ లో చూసేను.

“ఎస్… మధుర!” అన్నాడు.

“వెల్కమ్ .ఏమిటీ ఈ సర్‌ప్రైజ్? ఫోన్ చేయచ్చుగా….” అన్నాను.

“ఫోన్ చేస్తే సర్‌ప్రైజ్ అవదు…” అన్నాడు….లోనికివస్తూ.

“అయ్యో తడిశావా…. వర్షంలో?”

“కేబ్లో వచ్చాను. తడవలేదు.” అన్నాడు

“కూర్చో టీ తెస్తాను వేడిగా..” అంటూ కిచెన్లోకి వెళ్ళాను. అక్కడినుంచే ఏవో కబుర్లు చెబుతూ… టీ పెడుతుంటే హఠాత్తుగా కరెంటు పొయింది. వర్షానికి ఒకోసారి ముందు జాగ్రతగా మా ఏరియాకి పవర్ కట్ చేస్తూండటం మామూలే!

“ఏం చేస్తున్నావ్, ఏమైనా రాస్తున్నావా…” అన్నాడు.

“ఆ…. మామూలే… చూపిస్తా” అంటూ ముందు కేండిల్స్ వెలిగించి పెట్టాను.

ఆ తర్వాత అమ్మనుంచి ఫోను వస్తే మాట్లాడి టీ స్నాక్స్ తీసుకుని హాల్లోకి వచ్చాను.

అక్కడ ఇంద్ర లేడు. నేను ఆశ్చర్య పోయాను. అదేమిటీ ఏమయ్యాడు? అని నాలుగు వైపులా చూసాను.

కనబడలేదు. వర్షం పడుతూనే వుంది…… ఇంద్ర ఎందుకు హఠాత్తుగా వచ్చాడో ఇలా చెప్పకుండా ఎందుకు వెళ్లిపోయాడో అర్థం కాలేదు.. అదేంటీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు? ఆలోచిస్తూ అక్కడే సోఫాలో కూర్చుండిపోయాను.

నేను పెట్టిన ఫోటో ఫ్రేమ్ కింద స్లిప్ కనబడితే చదివాను.

“సారీ మధుర…. నేను వెడుతున్నా. తరువాత లెటర్ రాస్తాను” అని వుంది.

“అంతే అతని దగ్గిరనుంచి లెటర్ రానూ లేదు….. మా మధ్య ఎలాంటి ఫోను కాల్స్ లేవు. ఆ తర్వాత ఇంద్ర గుర్తు వస్తే నాకు చాల బాధగా అనిపించేది. ఏమీ తోచీదికాదు. నా శక్తి ఆలోచనలు అతనితోబాటు మాయం అయ్యాయా అనిపించేది. చాల రోజులవరకూ కోలుకోలేదు.”

అమ్మ అడిగింది.”మధూ ఏమి జరిగింది? అదోలా వున్నావు….” అని .

మొదట చెప్పలేదు. తరచి తరచి అడిగింది.

అప్పుడు చెప్పాను. ఇంద్రతో పరిచయం, నా రచనలకు అతడి తోడ్పాటు… అతనిపై ఏదో తెలియని ఇష్టం. “నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పుడు మన ఇంటికి వచ్చాడు.”

“ఇంద్రకి పెళ్లి ఐనదా…..”

“తెలీదు.”

“పోనీ నీకు ఇఇంది అనీ ఇద్దరు పిల్లలున్నారని ఇంద్రకి తెలుసా?”

“మా ఇద్దరి మధ్యా ఆ టాపిక్ రాలేదు.”

“తప్పు చేసావు మధు….అతని నీమీద ఆశలు పెంచుకున్నాడని తెలుసుకోలేని అమాయకురాలివి…. నీకు పెళ్లి అయిన విషయం చెప్పాల్సింది.”

ఆ అర్థం అయింది…… మా ఫోటో ఫ్రీమ్ కింద స్లిప్ రాసి పెట్టిన కారణం అదే! అంత మాత్రాన స్నేహం వదులుకుంటారా …..

ఈ తప్పు మా మధ్య అగాధం తెచ్చింది. ఇదీ నా ప్రమేయం లేని నా ప్రేమకథ.”

“అయ్యో! ఇంత కాలంగా ఇంద్రని మరచి పోలేక పోతున్నాను యామినీ! హర్ష వార్‌లో అమరుడయ్యాడు. పిల్లలు పెళ్లి చేసుకుని దూరంగా విదేశాల్లో వున్నారు. అమ్మానాన్న లేరు. ఇప్పుడు నేను ఒంటరిని…..” అంది మధుర దిగులుగా.

“నువ్వు ఒంటరికాదు మధురా…. నేను కూడా నీ ఇంటి పక్కనే ఇల్లు కొన్నాను. నేను నా భర్తా నీకు తోడుగా ఉంటాము” అంది యామిని భరోసా ఇస్తూ.

“నిజమా… యామినీ.. థాంక్స్” సంతృప్తిగా చెప్పింది మధుర.

***

ఆ తరువాత యామిని ఒక లేఖను మధురకి ఇచ్చింది.

“నా ప్రియమైన మధురా!

ఇలా రాసే హక్కు నాకు లేదని ఇప్పుడే తెలిసింది. పొరబాటు కావచ్చు మరోటి కావచ్చు. నీకు పెళ్లి ఐనది అని ఇప్పటిదాకా నాకు తెలియలేదు. ఏదో సినిమా కథలా ఆ ప్రసక్తి లేకుండా మనం ఇంతకాలం స్నేహం చేసాం. స్నేహానికి పెళ్ళికీ సంబంధం లేదు. కానీ మనసుకీ పెళ్ళికీ ఉందని గ్రహించని తెలివిలేనివాణ్ని. నాకు అసలు ఎవరినీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. నీ పరిచయం, ప్రతిభ, నీ వ్యక్తిత్వం నీపట్ల ఆకర్షణ పెంచాయి. దీన్నే ప్రేమ అనుకోవాలి కాబోలు. నీకు నామీదున్న అభిప్రాయం అడగాల్సింది.

ఇది నేను చేసిన మరో తప్పు.

ఎంతో ఆశగా మనం పెళ్లి చేసుకుందామా …. అని అడగాలని నీ దగ్గిరకి వచ్చాను…. నీ ఆల్బమ్ కనబడింది. నీ భర్త పిల్లలు ఉన్న ఫోటోలు చూసాను. నా మనసు ముక్కలైంది. తట్టుకోలేక నీతో చెప్పకుండానే వచ్చేసాను. కోలుకుని నీ స్నేహాన్ని మాత్రమే ఆస్వాదించే స్థితికి చేరుకున్నాక ఫోను చేస్తాను .

ఇంద్రజిత్.”

ఉత్తరం చదివిన మధుర విచతురాలై వుండిపొయింది. కొంత సేపటికి కోలుకుని ….

“ఈ ఉత్తరం నీకెలా వచ్చింది?” అని అడిగింది.

“నాకు ఇంద్రజిత్ బాబాయి. మా నాన్నగారికి తమ్ముడు. చాలాకాలం లండన్‌లో వున్నాడు. చదువంతా అక్కడే. తర్వాత బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆరోజు నిన్ను కలిసి ఢిల్లీ నుంచి వచ్చేప్పుడు ప్లెయిన్ యాక్సిడెంట్ అయినది. చాలారోజులు హాస్పటల్లో వున్నాడు. మేము చూడటానికి వెళ్ళాం. అప్పుడు చూసేను ఈ ఉత్తరం. నీకు పోస్ట్ చేద్దామంటే నువ్వు ఎవరో తెలియదు. బాబాయి చెప్పే స్థితిలో లేడు. బ్రెయిన్‌కి దెబ్బ తగిలి గతాన్ని మర్చిపొయాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆ మధుర నువ్వే అని. అందుకే నీ ప్రేమ కథ చెప్పగానే ఉత్తరం ఇచ్చాను.” అంది యామిని.

“ఎంత విచిత్రంగా వుంది…. ఇంద్ర దూరం కావడమేమిటీ… నువ్వు దగ్గిర కావడం ఏమిటీ…. ఇంద్ర గురించి తెలిసినా…. అతను గతం మరిచిపోడం…..అయ్యో! నేను అతన్ని చూడవచ్చా యామినీ?” ఆత్రంగా అడిగింది మధుర.

“అలాగే చూడచ్చు. మనం బెంగుళూరు వెడదాం.”

“అతన్ని ఎవరు చూసుకుంటారు?”

“పనివాళ్ళు. మా అమ్మ నాన్నగారు.”

ఇద్దరు బెంగుళూరు వెళ్లారు. కానీ ఇంద్ర మధురను గుర్తు పట్టలేదు. రక్త సంబంధం వున్నవారు, తరచూ కనబడే వారిని మాత్రమే గుర్తిస్తాడు. అదీ కొన్ని గంటల తరువాత. ఒక వారం రోజులు ఉన్నా యామిని మాత్రమే అతనికి గుర్తు వుంది.

మధుర ఏదో చెప్పబోయి ఆగిపొయింది. యామిని అమ్మగారు నాన్నగారు ఏమనుకుంటారో అని సందేహించింది.

అక్కడ ఉండి చేసేది లేదని తిరిగి హైదరాబాదు వచ్చేసారు.

యామిని భర్త అన్నాడు ఒకరోజు, ఇంద్ర-మధురల పరిచయం తెలిసి.

“యామినీ – మధుర ఒక కేర్టెకర్‌గా ఇంద్ర దగ్గిర ఉండాలని కోరుకుంటున్నట్టు నాకు అనిపిస్తోంది. అది మంచి నిర్ణయం, ఏమంటావ్?”

“అవును. నాకూ అలాగే అనిపించింది. మధురను అడుగుతాను. కానీ వాళ్ళ పిల్లలు ఏమంటారో….”

“ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించక్కరలేదు. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం.”

యామిని మధురతో చెప్పింది.

“మధురా! అమ్మానాన్నా కొద్దిరోజులు మా అన్న దగ్గిరకు అమెరికా వెళ్లాలనుకునున్నారు. నీకు ఇబ్బంది అనుకోకపోతే నువ్వు ఇంద్రను చూసుకుంటావా?” తన మనసు గ్రహించినట్టు యామినీ అడుగుతూంటే…. ఆనందం కలిగింది మధురకు.

“అలాగే తప్పకుండా. నేను చేసే పని ఏమీ లేదు ఇక్కడ. నువ్వు ఇంద్రని ఒప్పించు.”

“అదంతా నేను చూసుకుంటాను. నువ్వు సామాను సర్దుకో” అంటూనే బెంగుళూరుకు ఫ్లయిట్ బుక్ చేసింది, ‘నా ప్రియమైన స్నేహితురాలి ప్రేమ ఇప్పుడైనా ఈ రకంగా అయినా ఫలించింది’ అనే తృప్తితో… యామిని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here