[శ్రీ టి.ఎస్.ఎస్. మూర్తి రచించిన ‘మలి చూపులు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]న్నయ్య అమెరికా నుంచి వచ్చాడు. వచ్చాడు అనే కన్నా వచ్చేశాడు అనడం కరెక్ట్ ఏమో? ఎందుకంటే, అక్కడ ఎమ్మెస్ చేసి నాలుగేళ్లు ఉద్యోగం చేసి వెనక్కి వచ్చేయాలని, ఇక్కడే స్థిరపడాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయి మరీ వచ్చేశాడు. ఇక్కడ ఆఫర్స్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ లోనే ఒక ఎమ్మెన్సీలో జాయన్ అవుదామనుకుంటున్నాడు.
కానీ, అమ్మమ్మ, తాతయ్యలకి ఇంకా నమ్మకం కుదరడం లేదు. “డాలర్ రుచి చూసిన వాడికి రూపాయి రుచించదుగా,” అంటారు వాళ్ళు. ఋతువులు మారినంత సిస్టమాటిక్‌గా కాకపోయినా, బుద్ధులు తప్పక మారిపోతాయని వాళ్ళ నమ్మకం. మరోపక్క, వాడు ఇక్కడే ఉండి పోవాలని వాళ్ళ గట్టి కోరిక. “జిహ్వకో రుచి,” అంటారు వాళ్ళు. కానీ, అన్నయ్య ఇక్కడే సెటిల్ అవాలనే సీరియస్ థాట్ ప్రాసెస్‌లో ఉన్నాడు.
వాడు ఇండియాకి వచ్చి వారం రోజులయింది. అమ్మకి, నాన్నకి, పెద్ద అన్నయ్యకి, వదినకి, అమ్మమ్మతాతయ్యలకి, నానమ్మాతాతయ్యలకి.. చివరికి పక్కింటి వాళ్ళ రెండేళ్ళ కుట్టీకి కూడ గిఫ్ట్ తెచ్చాడు. మరి నాకే ఏమీ తేలేదు. చాలా కోపంగా ఉంది. ఎంతయినా అన్నయ్య కదా.. పైగా లాస్ట్ టైమ్ నాకు కాస్ట్లీ గిఫ్ట్స్ చాలా తెచ్చాడు. అయినా సరే, ఏ ట్రిప్ గిఫ్ట్స్ ఆ ట్రిప్‌వే కదా! ఎనీ వే, అన్నయ్యని చూస్తే ఆనందం, కోపం.. రెండూ వస్తూ పోతూ ఉన్నాయి. శికాకులం నుంచొచ్చిన మా పనమ్మాయి బాసలో సెప్పాలంటే “నానేటి సేసేది సెప్పండి?”
ఇవాళ నా పుట్టినరోజు. అందుకని, రెండు రోజుల క్రితం వచ్చిన అమ్మమ్మ తాతయ్యలని అమ్మ ఇక్కడ ఉండమని బలవంతం చేసి ఉంచేసింది. తాతయ్య అస్సలు ఉండనే ఉండరు. అందుకోసం ఆయన ప్రొద్దున్నే వచ్చి మళ్ళీ రాత్రికి వాళ్ళింటికి వెళ్ళిపోతున్నారు. ఇదిగో నా పుట్టిన రోజని బ్రేక్ ఫాస్ట్ టైముకే వచ్చారు.
అమ్మ, అమ్మమ్మ, ఇద్దరూ కలిసి నేను చీర కట్టుకోవాలని తీర్మానించారు. అన్నయ్య కూడ అదే పాట పాడాడు. “మరేటి సేత్తనేటి” అంటూ ఒప్పుకోవలసి వచ్చింది. “అలవాటు లేని అవపోసనాయె” అంటూనే అమ్మమ్మ నాకు హెల్ప్ చేసింది. బాగానే కట్టుకున్నాను అనిపించింది. అలా చీర కట్టుకుని బయటికి వచ్చే సరికి, అన్నయ్య నేనడిగిన లేటెస్ట్ మాక్ బుక్ నా చేతిలో పెట్టి విష్ చేశాడు. ఇంకేముంది? ఐ యామ్ ఆన్ క్లౌడ్ నైన్! నాకేంటి, అన్నయ్య గిఫ్ట్ తేకపోవడమేంటి? ఒక్కగానొక్క చెల్లెల్ని గదా! ఏదో, ఒక చిన్న గర్వంతో కూడిన ఆనందం. వెళ్ళి అన్నయ్యని గట్టిగా పట్టుకుని థాంక్స్ చెప్పాను. రియల్లీ, ఇట్స్ ఎ మెమెరబుల్ డే!
ఇంత ఆనందంగా ఉంటే ఎవరన్నా అలా మాట్లాడతారా? కానీ, అమ్మమ్మలు, నాయనమ్మలు మాత్రం అంతే. ఉన్నట్టుండి అమ్మమ్మ “పనిలో పని దీనికి కూడ ఓ మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేస్తే సరి,” అంది. “అమ్మబాబోయ్, అమ్మమ్మా, అప్పుడే అలాంటి ఐడియాలు అమ్మకి ఇవ్వకు. నన్ను ఫ్రై చేసేస్తుంది. అయినా నాకు ఇంకా రెండేళ్ళ చదువుంది. దాని తరువాత రెండేళ్లు వర్క్ చేసి, అప్పుడు ఆలోచిస్తా” అన్నాను.
వెంటనే అమ్మ అందుకుని, “ఆ.. అనుకోగానే అయిపోతే ఇంకే? దానికెంత తిరగాలో?” అంటూన్నంతలో డోర్ బెల్ రింగైంది. అందరం హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాము.
మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనానేమో అని అమ్మమ్మ, తాతయ్య లోపల డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. నేను, అన్నయ్య మాక్ బుక్ సెట్ చేసుకుంటున్నాము. అమ్మ వెళ్ళి తలుపు తీసింది. “రండి వదిన గారూ” అంటూ ఆవిడని లోపలికి రమ్మంది. ఆవిడతో పాటు ఒక మిడిలేజ్డ్ లేడీ కూడ వచ్చింది. వాళ్ళొచ్చి మా ఎదురుకుండా ఉన్న దీవాన్ మీద కూర్చోబోయారు. వాళ్ళు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చారో అర్థంగాక అమ్మ ఒక్క సారి తేరుకుని “అలా లోపలికి వెళ్లి కూర్చుందాం, రండి వదిన గారు” అంటూ లోపలికి తీసుకెళ్ళింది.
నేను, అన్నయ్య ఒకరి మోహం ఒకరు చూసుకుని తెల్లబోయాం! లోపలికి అడుగు పెట్టిన దగ్గర నుండి ఆ మిడిలేజ్డ్ లేడీకి అన్నయ్యకేసి చూడడమే సరిపోయింది.. పైనుండి కిందదాకా. అసలు వాళ్ళు రావడమే అనెక్ప్పెక్టెడ్ అయితే, ఆమె చూపులు మరీ అనీజీగా అనిపించాయి. నాకే ఇలా అనిపిస్తే ఇంక అన్నయ్య సంగతి ఏం చెప్పను?
మోహమాటం కోసం అమ్మ ఆ లేడీకి ఇల్లు చూపించడం మోదలు పెట్టింది. ఆవిడ ఏ గదిలోంచి ఏ గదిలోకి వెళ్ళాలన్నా హాల్లోకి వచ్చి, అన్నయ్యవైపు ఓ లుక్కేసి వెళుతోంది. ఓ పిచ్చి నవ్వు నవ్వి ఊరుకున్నాము. పోనీ లోపలికి వెళదామా అంటే, వాళ్ళు అందరూ డైనింగ్ హాల్ మోత్తం ఆక్యుపై చేసేశారు. ఏం చెయ్యాలో తోచక ఒకళ్ళ మోహం ఒకళ్ళు చూసుకుంటూ అక్కడే కూర్చున్నాం.
లోపల ఆ పెద్దావిడ పెద్ద గొంతుతో మాట్లాడుతోంది. ఉన్నట్టుండి గట్టిగా నవ్వుతోంది. అమ్మమ్మ కూడ ఉండడంతో అమ్మకి కొంచం మానేజ్ చేయడం ఈజీ అయింది. ఓ కప్పు కాఫీ అయిన తరువాత వాళ్ళు లేచి వెళుతూ హాల్లోకి వచ్చారు. అప్పుడు ఆ లేడీ “మొన్న మా చెల్లెలిని చూడడానికి వచ్చారుట కదా?” అంది అన్నయ్యకేసి చూస్తూ. ఏదో ముభావంగా అన్నయ్య నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో ఆ పెద్దావిడ “మా పెద్దమ్మాయి. కర్ణాటకలో ఉంటారు. నిన్ననే వచ్చారు. ఇక్కడి దాకా వచ్చాము. ఒకసారి చూసి వెళదాము అంటే వచ్చాము” అంది. అన్నయ్య నవ్వు కంటిన్యూ చేశాడు.
వాళ్ళు బయటికి వెళ్ళారు. తలుపు వేసి లోపలికి వచ్చి అమ్మ, నాన్నకి ఫోన్ చేసి రుసరుసలాడటం మొదలు పెట్టింది. వాళ్ళు వస్తున్నట్టు నాన్నకి కూడ తెలియదని చెప్పారు.
ఆ పెద్దావిడ నాన్న వాళ్ళ ఫ్రెండ్ భార్య. రెండు రోజుల కిందట వాళ్ళ రెండో అమ్మాయిని అన్నయ్యకి పెళ్ళి చూపులు చూసి వచ్చాము. ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు. ఇంతలో అన్నయ్యని చూడడానికి ఆ అమ్మాయి అక్క వచ్చి వెళ్ళింది ఇప్పుడు. అమ్మకి కోపము, చిరాకు ఎక్కువై పోయాయి. “ఇదేంటమ్మా, వాళ్ళ అమ్మాయిని మనం పెళ్ళి చూపులు చూసొస్తే, మన అబ్బాయిని చూడడానికి ఆ అమ్మాయి అక్క వస్తుందా? అదీ చెప్పాపెట్టకుండానా? ఆ అమ్మాయి ఇంత వరుకు ఏనాడూ మనింటికి రాలేదు. ఏదో ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉంటే నేనూ మా ఆయన వెడతాం, అలాగే వాళ్ళు మొగుడూపెళ్ళాలు వస్తారు. అంతే గానీ, అంత మోహమాటం లేకుండా ఇదేం విజిట్ అమ్మా?” వాపోయింది అమ్మ.
తాతయ్య లేచి, “మళ్ళీ వస్తా” అని బయటికి వెళ్ళి పోయారు. అమ్మమ్మ ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. కాస్సేపు ఇల్లంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. నేనింకా ఏదో బర్త్ డే బాష్ అనుకున్నాను. ఒక్క సారిగా ఇంట్లో వాతావరణం మారిపోయింది.
అమ్మ లేచి వెళ్ళి నాన్నకి మళ్ళీ ఫోన్ చోయబోయింది. ఇంతలో అమ్మమ్మ, అమ్మని ఆపి, అదో రకంగా నవ్వి, “ఏమ్మా, వాళ్ళు ఇలా వచ్చి వెడితే ఎబ్బెట్టుగా అనిపించిందా?.. ఒక్కసారి ఒక పాతికేళ్ళు వెనక్కెళ్ళు” అంది..
“.. ఏమైనా గుర్తొస్తోందా?” అంటూ గద్దించింది.
“నీ చెల్లెలి విషయంలో నువ్వు చేసింది అచ్చంగా ఇదేగా! పైగా, వద్దన్నా వినకుండా నన్ను కూడ లాక్కెళ్ళావు! మర్చిపోయావా?” అంది.
కాసేపు మాకు ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ఊహించని నిశ్శబ్దం.
“అతను పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఆ పెళ్ళి జరిగింది. కాకపోతే ఒక్కమాట.. మనము అవతలి వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, అలాగే వాళ్ళు కూడ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.. అప్పట్లో, తొలి చూపులు చెల్లెలితోటి, మలి చూపులు వాళ్ళ అక్కతోటా అని అతను చురకేసినా, ఈ మధ్యనే నా చెవిన ఒక మాట పడింది. ఇష్టం లేకపోయినా అవసరం కనుక చెబుతున్నా. వాళ్ళ కాపురంలో నీ ఇంటర్ఫియరెన్స్ వాళ్ళ పెళ్ళి కుదరక ముందునుంచే మోదలయిందనే ఉద్దేశం.. అంతేగాక, మనము ఇచ్చే సలహాలు భార్యాభర్తలు ఇద్దరికీ మంచి జరిగేందుకా లేక ఒకరి స్వార్థం కొరకా అనే విచక్షణ ఉండాల్సిన వయసు, అనుభవం నీకు వచ్చాయని నేను భావిస్తున్నాను.. మరి నీ పిల్లల కాపురాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే నీకు సమ్మతమేనా?” అమ్మమ్మ అడిగిన ఈ మాటకు అమ్మ ఇమ్మీడియట్‌గా కళ్ళు పెద్దవి చేసి అమ్మమ్మ వైపు చూసింది.
అదోరకంగా నవ్వి, “..మీ నాన్నగారు ఎందుకు అలా బయటికి వెళ్ళి పోయారు అనుకుంటున్నావు? కొంచెం గ్రహించు” అని చెప్పి, అమ్మమ్మ తాతయ్యకి ఫోన్ చేసింది. వాళ్ళు బయలుదేరి వాళ్ళింటికి వెళ్ళి పోయారు.
రెండు రోజులు పట్టింది ఇదంతా సెటిల్ అయ్యేందుకు. తాతయ్య అప్పుడప్పుడు చెప్పినట్టు సమయమే కొన్నిటికి పరిష్కారం చూపిస్తుంది. అలాగే జరిగింది. అమ్మమ్మ మాటలు అమ్మ ప్రవర్తనలో మార్పు తెచ్చాయి అనిపించింది. అన్నయ్యకి ఆ అమ్మాయి నచ్చింది. బాబాయిని ఫాలో అయిపోయాడు. పెళ్ళయింది.
అఫ్కోర్స్, నా కానుకలకి ఏం లోటు జరగలేదుగా! మా పనమ్మాయి బాసలో సెప్పాలంటే, “నాక్కావలిసినయన్నీ నాకొచ్చేసినాయి కాదేటి. ఇంక దేనికేటైతే నాకేటి!”