దైవ భక్తిని పెంపొందించే చిత్రం ‘మాలికాపురం’

4
1

మాలికాపురం – తెలుగు అనువాద చిత్రం

[dropcap]డి[/dropcap]స్నీ హాట్‌స్టార్‍లో తెలుగులో లభించే ఈ రెండు గంటల నిడివి గల చిత్రం మిమ్మల్ని ఏదో లోకాలకి తీసుకు వెళుతుంది. ఈ చిత్రాన్ని ఫలానా జానర్ అని ఒక ముక్కలో చెప్పటం కష్టం. ఇది పిల్లల చిత్రం అని చెప్పవచ్చు. దైవ భక్తిని పెంపొందించే చిత్రం, థ్రిల్లర్, సాహసోపేత చిత్రం, కుటుంబ కథా చిత్రం అని చెప్పవచ్చు.

కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నాపెద్దా అందరూ చూడదగ్గ ఒక మంచి చిత్రం అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈ చిత్రానికి ఉన్న ఏకైక బలం ఇద్దరు చిన్నపిల్లల నటన. అందునా షన్నూ/కల్లూ (మలయాళంలో) పాత్ర ధరించిన దేవానంద అనే అమ్మాయి నటన అద్భుతం. ఈ వ్యాసం ఆ పిల్ల నటన గూర్చి నాలుగు ముక్కలు  వ్రాయాలనే బలమైన ప్రేరణతో వ్రాస్తున్నాను. ఆ పిల్లకి అన్నయ్యలాంటి పక్కింటి కుర్రాడు పీయుష్ ఉన్ని పాత్రలో శ్రీపత్ యాన్ కూడా చాలా చలాకీగా నటించాడు. ఆ పిల్లవాడు కూడా ఆ పిల్ల చదివే క్లాసులోనే చదువుకుంటుంటాడు, కానీ షన్నూ వాడిని అన్నయ్యా అంటూ పిలుస్తుంది. వాడు ఎంత అల్లరిగా చదువు పట్ల శ్రద్దలేనివాడిగా కనిపిస్తాడో, కథ వేగం పుంజుకునే కొద్ది, వాడు అంత బాధ్యతగా వ్యవహరిస్తాడు.

వాడు ఆ పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. వాడి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఏది ఏమైనప్పటికీ ఆ చిన్నపిల్ల  దేవానంద నటన కోసం ఈ సినిమా తప్పకుండా చూడాలి.

నిజ జీవితంలో ఆ పిల్ల కేరళలో కలమశెర్రి రాజగిరి పబ్లిక్ స్కూల్లో నాలుగవ తరగతి చదువుకుంటోంది. చాలా చిన్న వయసు నుంచే నటిస్తోంది అట. అంతా చక్కగా జరిగితే ఈ పిల్ల పెద్ద కథానాయికగా ఎదుగుతుంది. చాలా పెద్ద స్థాయికి చేరుకుంటుంది ఈ పిల్ల అనటంలో సందేహం లేదు.

ఒకప్పుడు ‘బడిపంతులు’ సినిమా చూసిన వారు ఆ తరువాత భారతదేశంలో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగిన సినీనటి శ్రీదేవిని చూసి ఎలా ఆనందపడ్డారో, ఇంకొన్నేళ్ళకి ఖచ్చితంగా మనం అందరం అలా గొప్పగా చెప్పుకోవచ్చు, “చిన్నప్పుడు చూసినప్పుడే అనుకున్నాం ఈ పిల్ల పెద్ద స్థాయికి వెళుతుంది” అని. ఇది అతిశయోక్తి కాదు. నా మాటలని వ్రాసి పెట్టుకోండి.

ఆ పిల్ల పలికించిన భావాలలో మచ్చుకు కొన్ని. అమాయకత్వం, చిలిపిదనం, ఆశ్చర్యం, ఆనందం, అలక, నిరాశ, నిస్పృహ, దుఃఖం, ఆందోళన, మొండి పట్టుదల, గర్వం, భయం, భక్తి, వినయం, సంకోచం, పరవశం, అకస్మాత్ సంఘటన వల్ల షాక్ తినటం, తండ్రి వద్ద గారం చేస్తు ముద్దులు ఒలికించడం, బామ్మ వద్ద ప్రేమగా ముద్దుగా మాట్లాడటం, తల్లి వద్ద ఒద్దికగా చెప్పిన మాట వినడం, స్కూల్లో చదువుల తల్లిగా రాణించడం అబ్బబ్బ. ఇలా ఒకటి కాదు ఈ సినిమా అంతా ఆ పిల్ల నటవిశ్వరూపమే.

దేవుడు ఎందుకు కొందరి పట్ల ఇలా వరాలు కురిపిస్తాడు కద అనిపించింది నా వరకు నాకు ఆ పిల్ల నట విశ్వరూపాన్ని చూసి. ఎక్కడా కృత్రిమత్వం లేదు. అంతా సహజ నటనే.

ఇటీవల తమిళనాట ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ కుమారుడు వందలకోట్లు గుమ్మరించి తానే హీరోగా నటించి అందర్నీ వినోదపరిచాడు. అతనికా నటన రాదు. కానీ నటించాలన్న తిక్క. ఈ తిక్కతో మీమ్స్ చేసే వారందరికీ పండగ సంబరాలు కల్పించాడు. ఇదంతా ఎందుకు, 1980 ప్రాంతాలలో తెలుగునాట విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయితేనేమి, నటసామ్రాట్ అయితేనేమి, మీడియా మొఘల్‍గా పేరు గాంచిన ప్రముఖ నిర్మాత అయితేనేమి, తమ తమ వారసులని రంగంలోకి దింపి నిర్మాతలని, దర్శకులని, ప్రేక్షకులని తెగ ఇబ్బంది పెట్టారు. వినగ వినగ రాగమతిశయిల్లుచునుండు అన్న చందంగా వీరు తమకు రాని నటనని క్రమంగా ఒంటబట్టించుకుని స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వీరు కూడా తమ వారసులని నటులుగా నిలబెట్టారు. ఈ పరంపర కొనసాగుతూ ఉంది. ఇదంతా ఎందుకుచెబుతున్నాను అంటే, వీళ్లు ఎన్నో కసరత్తులు చేసి, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించి కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఆ తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగారు. కానీ ఈ పిల్ల (దేవానంద)ని చూసి వీళ్లందరూ నటనలో ఒనమాలు దిద్దుకున్నా తప్పులేదు.

ఇక కథ విషయానికి వస్తే:

అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో శైజు కురుప్ ఒక మధ్య తరగతి వ్యక్తి, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఆనందంగా ఉంటాడు. అతనికి చక్కటి భార్య, ఒక  కూతురు ఎనిమిదేళ్ళ దేవానంద ఉంటారు. వీరి వద్దే దేవానంద నాన్నమ్మ కూడా నివసిస్తూ ఉంటుంది. వీళ్ళది  చాలా ఆనందమైన జీవితంలా కనిపిస్తూ ఉంటుంది. కానీ తన చెల్లి పెళ్లికి మన శైజు కురుప్ బోలెడు అప్పులు చేసి, కష్టాలలో ఉంటాడు. ఒక వైపు బ్యాంకు వారు, ఇంకో వైపు స్థానిక షావుకారు ఒకరు తమ అప్పులు తీర్చమని గొడవ చేస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉండగా, దేవానందకి చిన్నప్పటి నుంచి అయ్యప్ప అంటే చాలా భక్తి, తనకు చాక్లెట్ తెచ్చిచ్చినా సరే, అయ్యప్పకి ఒక ముక్క పెట్టి గానీ, తాను తినదు. జన్మ సంస్కారం వల్ల కావచ్చు, బామ్మ చెప్పే కథల వల్ల కావచ్చు,  చిన్నప్పటి నుంచి ఆ పిల్లకి  అయ్యప్ప పట్ల దైవ భక్తి ఎక్కువ. అందుకని ఆ పిల్ల తండ్రి ఎలాగైనా శబరిమలకి తీసుకువెళతాను అని మాట ఇస్తాడు. ఆ పిల్ల వ్యక్తురాలయ్యేలోగా శబరిమలకి తీసుకువెళ్ళమని బామ్మ కూడా పోరు పెడుతు ఉంటుంది.

ఈ గ్రామంలోనే ఒక పెద్ద గూండా ఉంటాడు. అతను ఏడెనిమిదేళ్ళ ఆడపిల్లలని అపహరించి బొంబాయికో, గల్ఫ్‌కో,  అక్రమంగా సరఫరా చేసే  ఏజంట్లకి అమ్ముతుంటాడు.

వాడి కన్ను మన దేవానంద మీద పడుతుంది. అవకాశం కోసం చూస్తూ ఉంటాడు.

ఇదిలా ఉండగా, శబరిమల చూడకుండా ఉండలేని దేవానంద ఇక ఆగలేక  తన క్లాస్‍మేట్ పీయుష్ ఉన్నిని తీస్కుని ఇంట్లో చెప్పకుండా శబరిమలకి బయలుదేరుతుంది.  మన గూండా కూడా అదే బస్సు ఎక్కి ఆ పిల్లలు తన తాలూకే అని చెప్పి వాళ్ళకి టికెట్ కూడా తీస్కుంటాడు.

ఇక ఇక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది.

ఇక ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకునే అంశం:

దైవం మానుష రూపేణ అన్నట్టు, ఈ పిల్లలని దేవుడు ఎలా ఆదుకున్నాడు అనే అంశం. దేవుడి కరుణ ఎలా ఉంటుంది అనేది చవిచూసే కొద్ది ప్రేక్షకులు ఉద్విగ్నులు అవుతారు.

  • మాతృదేవోభవ సినిమాలో మనకు కలిగే స్థాయి దుఃఖం
  • దేవుళ్లు సినిమాలో కలిగే స్థాయి ఉత్కంఠ
  • కాంతారా, అన్నమయ్య, మంజునాథ సినిమాలలో దైవ భక్తి వల్ల మనలో కలిగే పారవశ్యం

ఇవన్నీ సమపాళ్ళలో రంగరించి తీయటం వల్ల ఈ సినిమా భలే ఆకట్టుకుంది నన్ను.

అందరూ చూసి ఆనందించదగ్గ సినిమా ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here