మలిసంజ కెంజాయ! -10

5
1

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[భానక్క, వసంత మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కలకి ఆస్తి పంచి ఇచ్చినందుకు తన కొడుకుకి తన మీద కోపంగా ఉందని చెబుతుంది భానక్క. కోడలు కాస్తో కూస్తో ప్రేమగా ఉంటుందనీ కొడుకు మాత్రం పట్టించుకోడని అంటుంది. తానుండగానే అక్కలని ఆడిపోసుకుంటున్నాడు, తాను పోయాకా, అసలు ఆదరిస్తాడో లేదోనని అంటుంది. తను చెప్పడం ఆపి, నీ గురించి చెప్పు అని వసంతని అడుగుతుంది. తన గురించి, తన ఇంట్లో అద్దెకుంటున్న పార్వతమ్మ గురించి చెప్తుంది వసంత. తానిక బయల్దేరుతానంటే, చీకటిపడుతోంది, ఇప్పుడొద్దులే, రేపు వెళ్ళు అంటుంది భానక్క. ఇద్దరూ పాతరోజులు తిరిగివస్తే బాగుండునని అనుకుంటారు. మర్నాడు ఉదయం తమ తోటలో పండిన కూరగాయలు కొన్నిచ్చి, చీర పెట్టి పంపుతుంది వసంతని. ఇంటికొచ్చేసరికి భర్త కుక్కర్ పెట్టుకుని, కూరలు తరుగబోతూ కనిపిస్తాడు. కాసేపు భర్తతో మాట్లాడి వంటింటి పనిలో పడుతుంది వసంత. కాసేపటిని నిర్మల ఫోన్ చేస్తుంది. మొన్న పొద్దున ఇంటికి వచ్చామని తాళం వేసుందని, ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది వసంతని. భానక్క వాళ్ళింటికి వెళ్ళానని చెప్తుండగా, ‘నాకొక మాట చెప్పివెళితే నీ సొమ్మేం పోయింది’ అని కసురుకుంటుంది. వసంత లేనప్పుడు తానూ, తన అత్తగారు అక్కడికి వచ్చామని, తాళం వేసుండడంతో వెళ్ళిపోయామని చెప్పి, ఫోన్ పెట్టేస్తుంది. విశాఖపట్నంలో చిన్న కోడలు ఇంట్లో ఉన్న పార్వతమ్మ – ఇల్లంతా తిరిగి చూస్తుంది. తానే దగ్గరుండి ఇల్లు కట్టించినట్టు గొప్పగా చెబుతుంది చిన్న కోడలు రాణి. గృహపవేశానికి  అక్కా, బావగారు రాలేదని అత్తగారితో అంటుంది రాణి. ఇక చదవండి.]

[dropcap]“ఇం[/dropcap]త మంచి ఇల్లు కట్టుకుంటున్నామని కుళ్ళు కాకపొతే రాకపోవడానికి కారణం ఏమన్నా ఉందంటారా?” అంది అత్తగారిని నిలదీస్తూ.

ఆమె మౌనం చూసి “తమ్ముణ్ణి కూడా చూసి ఓర్వలేని అన్నలుంటారా లోకంలో” అంది అత్తవైపు సూటిగా చూస్తూ.

“ఇల్లు ముందే చూసి వెళ్లాడా?”

“అబ్బే రాందే!” అన్నాక, ఇంత బాగా కట్టుకున్నారని చూడకుండానే ఎలా కుళ్ళుకున్నాడని అత్తగారి భావం అర్థమై గతుక్కుమని, “అదే లెండి, ముందే ప్లాన్ చూపించాం. దాన్ని బట్టి చాలా పెద్దిల్లు ఆధునికంగా కట్టుకుంటున్నామని అప్పుడే అర్థమయ్యినట్టుందాయనకి. అందుకే రాలేదు లెండి” అంది ఆవిడవైపు నిష్ఠూరంగా చూస్తూ.

‘ఇక్కడికొస్తే దీనితో ఇదో గోల. మాటమాటకీ బావగారి మీదా, తోటికోడలి మీద ఏదో ఫిర్యాదు చేయబోతుంది. నాకేం చెప్పాలో తెలీదు అవునంటే ఒక తప్పు. కాదంటే పెద్ద కొడుకుని వెనకేసుకొచ్చానంటుంది’ అనుకుంది పార్వతమ్మ.

కాఫీ తాగగానే వంటమ్మాయి వేడి వేడి ఇడ్లీలు, కారప్పొడి, చిన్న సాంబారు గిన్నె తెచ్చి పెట్టింది. “తినండి” అంది కోడలు.

“నువ్వు తినవా? ఏడీ వీడు?” అందామె ఇడ్లీ తినబోతూ.

“ఆయన కారులో వాకింగ్‌కి వెళ్లారు లెండి. నేను స్నానం చేసి పూజ చేసుకున్నాక తింటాను. తులసమ్మా! ఈ రోజు నుంచీ అత్తయ్యగారికి ఇష్టమైనవి ఆవిడనడిగి వండుతూ ఉండు”

“అయ్యో రామా! నాకిష్టమైనవెందుకే! మీ ఇద్దరూ ఏం తింటారో నాకేం తెలుసూ?”

రాణి అత్తగారి కంగారు చూసి నవ్వేసింది. “మాకేం కావాలో ఆవిడకి తెలుసులెండి. మీకు నచ్చినవి చెప్పండి. మేం తినేవి మీకు నచ్చకపోవచ్చు కదా!”

“చూద్దాంలే ఏం వండుతుందో వండనీ! రెండు రోజులు. అప్పుడే చెబుతానులే” అంది పార్వతమ్మ చిరునవ్వుతో.

“సరేలే తులసమ్మా! ఆవిడ తింటున్నారో లేదో జాగ్రత్తగా చూసుకో!” అంటూ ఆవిడ మీద బాధ్యత పెట్టేసి స్నానానికి వెళ్ళిపోయింది రాణి.

‘ఇలాగే సింహాసనం మీది కెక్కించి ఒక్కసారే కిందకి తోసేస్తుంది మహాతల్లి. ఇన్నేళ్లయినా అత్తగారేం తింటారో కోడళ్ళకి తెలీదు. తెలిసినా గుర్తు పెట్టుకునే అవసరం లేదు. హోటల్‌లో దిగి చెప్పినట్టు వంటవాళ్ళకి నాకది కావాలి? నాకిది కావాలి? అని చెప్పుకోవాలన్న మాట. ఏడిసినట్టుంది’ విసుగ్గా అనుకుంది పార్వతమ్మ.

ఇంతలో స్నానం చేసొచ్చిన రాణి “ఇల్లు చూద్దురుగాని రండి” అంది. “దేవుడికి దణ్ణం పెట్టుకుని రా!” అన్న అత్తగారి మాటకి తన ఆత్రం దాచుకుని, ఓ పది నిమిషాలు దేవుడికి దణ్ణం పెట్టి వచ్చింది రాణి.

“టిఫిన్ ఆయనొచ్చాక ఇద్దరం తింటాం” అంటూ అత్తను వెంటబెట్టుకుని గదులన్నీ చూపించింది. ప్రతి చోటా తనెంత కష్టపడి ఆ ఇల్లు దగ్గరుండి కట్టించిందీ వర్ణించింది. లిఫ్ట్‌లో పైకి తీసుకెళ్లింది. “లిఫ్ట్ అసలు, మీ కోసమే పెట్టించాం. మెట్లెక్కలేరు కదా మీరూ!” అన్న రాణి మాటలకి తలూపింది పార్వతమ్మ, ‘ఈ లిఫ్ట్‌లో పైకెక్కి నేను చెయ్యబోయే పనేముందనీ?’ అని మనసులో అనుకుంటూ.

బాత్రూంలన్నీ ఒకో గదంత పెద్దగా ఉన్నాయి. అద్దాలూ, బీరువాలూ ఎంతో ఖరీదైనవిగా ఉన్నాయి. మళ్ళీ లిఫ్ట్ ఎక్కించి టెర్రస్ మీదికి చేయి పట్టుకుని తీసుకెళ్లింది రాణి. అక్కడ అన్ని రకాల కూరలూ పండుతున్నాయి.

“బావుందే ఈ తోట?” పార్వతమ్మ ఆనందపడింది.

“అవును అన్ని కూరలూ పండిస్తున్నాను. ఇదే నాకు బోల్డంత పనుచ్చుకుంటోంది”

“మన పెరటి కూరలన్నమాట” అంది పార్వతమ్మ లేలేత వంకాయల్ని చూసి ముచ్చట పడుతూ.

“అవును కానీ బైట కొన్న రేటుకన్నా మూడురెట్లు ఖర్చవుతుంది శ్రమ కాక” అంది రాణి. ఎందుకో అన్నట్టు చూసింది అత్తగారు.

“బైట కూరలన్నీ ఎరువులు పోసి పండిస్తున్నారు కదా! ఇవి ఎరువులు లేకుండా సహజ కూరగాయలు కదా. విత్తనాలూ, మట్టీ మంచివన్నమాట అందుకూ.”

“ఓహో! అయితే బాగా రుచిగా ఉంటాయన్నమాట”

“చూద్దురుగానీ, మీకే తెలుస్తుంది తేడా! మీ అమలాపురం కూరలకీ వీటికీ” అంది ఉత్సాహంగా రాణి.

“అవునూ! మొన్న మీరు బావగారింట్లో నెల్లాళ్లున్నారు కదా! బావగారు కానీ, అక్కయ్య కానీ మా గురించి ఏమీ మాట్లాడలేదా! అసలు మా పేరే ఎత్తలేదా?” అడిగింది ఆరాగా.

“లేదమ్మా!” అంది అత్తగారు.

“ఎత్తరులెండి. అంత నష్టం ఏం చేసేసామో! వాళ్ళకి, పేరెత్తకూడనంత?” అంది మొహం కందగడ్డలా చేసుకుంటూ.

‘దీని మొహం కాసేపు సరస్వతీ మాతా, కాసేపు కాళీ మాతానూ’ అనుకుంది పార్వతమ్మ.

ఇంతలో కింది నుంచి బెల్ మోగింది. “మీ అబ్బాయి వచ్చినట్టున్నారు రండి రండి” అంటూ అత్తగారి చెయ్యి పట్టుకుని టెర్రస్ నుంచి కిందికి తిన్నగా తీసుకొచ్చింది రాణి. కొడుకు డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

తల్లిని చూస్తూనే “మళ్ళీ మాట్లాడతాను లెండి” అనిఫోన్ పెట్టేసి అంటూ “ఏమ్మా! ఎలా ఉన్నావూ?” అన్నాడు లేచి దగ్గరగా వచ్చి వీపు మీద చెయ్యి వేస్తూ.

“బానే ఉన్నానులే కానీ, అలా చిక్కిపోయావేంట్రా?” అందామె.

“నాలుగు కిలోలు పెరిగాను” అంటూ నవ్వాడు రాజేష్.

రాణి ఇద్దరికీ టిఫిన్ తెచ్చింది. “అమ్మా తిన్నావా?” అన్నాడు కొడుకు.

“తిన్నానురా! ఇల్లు చాలా బావుందిరా! బాగా కట్టించుకున్నావు” అందామె.

“మీ కోడలి కోరిక. పెద్ద ఇల్లు తన మిత్రుల కన్నా బాగా కట్టించుకోవాలని ఆవిడే తెగ కష్టపడి దగ్గరుండి, తిండీ, తిప్పలు లేకుండా కట్టించుకుంది” అన్నాడు భార్యవైపు ప్రేమగా చూస్తూ.

“చూసారా అత్తయ్యా వెటకారం?” అంది రాణి గారంపోతూ.

“వెటకారం ఏముందీ? ఉన్నమాటే! బాగా కట్టించుకోవాలని శ్రమ పడి చూసుకున్నావన్నాడు అంతే కదా!” అందామె.

ఇంతలో మరో ఫోన్ రావడంతో టిఫిన్ ముగించి కొడుకు లేచాడు. పార్వతమ్మ కూడా లేచి తన గదిలో కొచ్చి ‘స్నానం కొంతసేపాగి చేస్తాను’ అనుకుంటూ మంచం మీద వరిగింది. ఆలోచనలు చుట్టుముట్టాయామెను. ‘చిన్నకొడుకూ, పెద్ద కొడుకూ ఎందుకు మాట్లాడుకోరో నాకు తెలీదు. ఓ నాలుగైదేళ్ల క్రితం వరకూ బాగానే ఉండేవారు. తర్వాత ఎప్పుడు చెడిందో ఇద్దరూ చెప్పలేదు. పెద్దకోడలు ఆ మాటే ఎత్తదెప్పుడూ! చిన్న కోడలు ఇలాగే ఎప్పుడూ వాళ్ళేమన్నారో కూపీ లాగాలని చూస్తుంది. తండ్రి లేనే లేరు. అక్క చెల్లెళ్ళు లేరు. ఉన్నది నేనొక్కదాన్ని. ఏమన్నా మాటా మాటా అనుకుంటే తనకి చెప్పుకోవచ్చు. తన ఎదురుగా ఒకరినొకరు నిలదీసుకుని, ఆ తర్వాత కలిసిపోతే బాగుంటుంది కదా! రక్త సంబంధం. అన్నదమ్ములు కాకపోతారా!

అన్నా, తమ్ముడూ కలిసి మెలిసి ఉంటే ఎంతో గౌరవంగా ఉంటుంది నలుగురిలో. ఆ మాట నేనెలా చెప్పగలను? చెట్టంత కొడుకుల్ని ఏమని అడగగలను? ఏదైనా ఇబ్బంది తోటి కోడళ్ళిద్దరి మధ్యా వచ్చి ఉంటుంది. అది వీళ్ళిద్దరూ గమనించుకుని సర్దుకోవాలి. లేకపోతే బైటవాళ్ళు వాళ్ళెందుకు సరిపెట్టుకుంటారు. ఇంకా పెద్దది చేస్తారు కానీ. అయినా కొడుకులిద్దరూ చిన్న పిల్లలా ఏమన్నానా? అరవైకి అటూ ఇటూ ఉన్నారిద్దరూ. నా దగ్గరికి వచ్చి ఇలా ఇలా అనుకున్నాం! అని చెప్పుకోవడానికి వాళ్ళకీ అహం అడ్డం వస్తుంది. అదీ గాక ఎనభై ఏళ్ల అమ్మని కదా! వాళ్ళకి చిన్న పిల్లలా కనబడతానేమో!’ అనుకుంటూ మధనపడిందామె మనసు.

మర్నాడు ఉదయమే బైటికెళ్లిన రాణి పదకొండు గంటలకి వచ్చింది. అప్పటికి కొడుకు ఆఫీస్ కెళ్ళిపోయాడు. రాణి రాగానే “ఎక్కడికెళ్లావ్? అబ్బాయి వెళ్ళిపోయాడు” అంది పార్వతమ్మ.

“నా మిత్రురాలొకావిడ కొడుక్కి పెళ్లి కుదిరింది. కట్న కానుకల గురించి మాట్లాడడంలో కాస్త ఇబ్బంది ఉందని రమ్మంటే వెళ్లి కాస్త సలహా చెప్పి వచ్చాను” అంది రాణి ఉత్సాహంగా.

‘అన్నీ చిన్నపిల్ల చేష్టలే తప్ప పెద్దరికం లేని ఈమెను సలహా అడిగిన వాళ్ళెంత అమాయకులో’ అనుకుంది పార్వతమ్మ.

“అత్తయ్యా! టిఫిన్ అయ్యిందా? రెండో సారి టీ కూడా తాగారా?” అడిగింది కోడలు.

తలూపింది అత్తగారు. “అయితే పదండి ఓ అయిదు నిమిషాల్లో నేను రెడీ అవుతాను. మీరు సిద్ధంగా ఉండండి. బజారుకెళదాం. మీకొక మంచి చీర కొంటాను” అంది రాణి.

“ఇప్పుడు నాకెందుకమ్మా చీరలూ? ఇంకా మడత విప్పని చీరలొక అరడజనూ, ఒకసారి కట్టి పొడిస్త్రీకిచ్చిన చీరలొక అరడజనూ ఉన్నాయి. నాకొద్దు తల్లీ!”

“చీర కొంటానంటే వద్దంటారేంటత్తయ్యా? నాకు కానీ ఎవరైనా చీర కొంటానంటే ఎగిరి గంతేసి వెళ్ళిపోతా” అంది రాణి.

“అయితే వెళదాం. నేను నీకు కొంటాను చీర” అంది పార్వతమ్మ నవ్వుతూ.

“మీరా? నాకా? పాపం మీకు మేం పెట్టాలి. ఆస్తీ డబ్బూ అంతా మీ కొడుకు లిద్దరికీ పంచేసారు. మీ దగ్గర కాస్త వడ్డీ వచ్చే డబ్బులు మాత్రమే ఉన్నాయి. అవి మీకే సరిపోవు. మీ ఖర్చులు మీకుంటాయి. అద్దె, పాలూ, కూరలూ లాంటివి మీరే కొనుక్కుంటారు కదా! సరే గానీ వచ్చేస్తున్నా” అంటూ పది నిమిషాల్లో తయారయ్యి వచ్చి మంచి కాటన్ చీరల షాపుకి అత్తగారిని తీసుకెళ్లింది రాణి.

రాణిని చూసి షాప్ వాళ్ళు వెంటనే ఇద్దరికీ కూల్ డ్రింక్ సీసాలు తెప్పించారు. మంచి మంచి జరీ చీరల మడతలు విప్పేసి చూపిస్తూ ఉంటే మెల్లిగా అంది పార్వతమ్మ.

“పోనీ అంతగా అంటున్నావు కాబట్టి. ఓ రెండు కట్టుడు చీరలు కొను. అవి కాస్త నలిగాయి” అంటూ.

“సరే, సరే” అంటూ వెయ్యేసి రూపాయల చీరలు అత్తగారికి నచ్చినవి ఓ మూడు తీసుకుంది. జాకెట్ల కోసం మీటర్ ముక్కలు టూ బై టూ ఓ మూడు తీసుకుంది.

“అత్తయ్యా మరి ఫాళ్ళు?”

“వద్దమ్మా! వాటిని నేను మొయ్యలేను” అందామె. “సరే “అంటూ ఇద్దరూ బైటి కొచ్చి కార్లో ఇంటికొచ్చారు.

అప్పటికి వంటామె అన్నీ వండి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. అత్తా కోడలూ భోజనం చేసాక జాకెట్లు కుట్టే ఆమెని ఇంటికి పిలిచి అత్త బట్టలు ఇచ్చేసింది రాణి.

‘అంతా టక టకా అయిపోవాలి ఈ పిల్లకి. మొగుడు మంచివాడు. బోలెడు సంపాదన. పెత్తనం అంతా తనదైతే ఏ ఆడపిల్లకైనా ఇంకేం కావాలి. అదృష్టవంతురాలు’ అని నవ్వుకుంది పార్వతమ్మ.

సాయంత్రం టీ తాగుతుంటే అంది రాణి. “అత్తయ్యా! ఈ శనాదివారాలు మీ మనవడూ, మనవరాలూ, మునిమనవరాలూ వస్తారు. మీకింక రెండు రోజులు పండగే!”

“అవునా! రానీ! పిల్లని చూడలేదీమధ్య. ఎన్నో ఏడూ పిల్లకి?”

“రెండు నిండి మూడు నడుస్తున్నాయి. వాళ్ళ ముగ్గురికీ పాలకోవా ఇష్టం. ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నాను. ఇంకా బిరియాని, గారెలూ, చికెన్ ఇంట్లోనే తులసమ్మ చేసేస్తుంది. శనివారం మధ్యాన్నం వేడిగా ఉల్లిపాయ పకోడీ వేసుకుందాం. స్వీట్ లెలాగూ తెప్పిస్తున్నాను. ఆదివారం మధ్యాన్నం సమోసాలు తెప్పిద్దాం. ఆదివారం రాత్రి వెళ్ళిపోతారు. వాడికిమర్నాడు ఆఫీస్ కదా!”

చెప్పుకుపోతున్న రాణిని ఆపి, “ఎన్నాళ్ళయింది వీడు వేరు కాపురం పెట్టి? మొన్నటిదాకా నీ దగ్గరే ఉన్నారు కదా!” అడిగింది అత్తగారు.

ఆ మాటకి రాణి మొహం చిన్నబోయింది. వెంటనే సర్దుకుంటూ “ఓ నాలుగు నెలలయ్యిందంతే! పిల్లని ప్రీ స్కూల్‌లో వేశారు. అదిక్కడికి దూరం. దగ్గరగా ఇల్లు తీసుకుంటానమ్మా! అంటే సరే అన్నాను” అంది రాణి సంజాయిషీగా.

“పోనిద్దూ! నీకూ సుఖమే. వాళ్ళుంటే నువ్వే అన్నీ చూసుకోవాలి. విడిగా ఉంటే వాళ్ళకీ బాధ్యత తెలుస్తుంది. ఊరిలోనే కదా వస్తూ పోతూ ఉండడమే మంచిది” అంది పార్వతమ్మ

“కోడలు కూడా ఉద్యోగమా?”

“ఉద్యోగం ఎక్కడ? రోజంతా ఫోన్లు మాట్లాడడంతోనే బిజీ. చదివింది బీ. టెక్. కానీ వొళ్ళు వొంగదు. తల్లి తోటీ, అక్క తోటీ, స్నేహితుల తోటీ రోజంతా ముచ్చట్లే ముచ్చట్లు. తెరిపి వుండదు. పిల్ల స్నానం కూడా నేనే చేయించేదాన్ని. దేవుడే దిగి రానీ ఫోన్ మాత్రం పెట్టదు. అదేం తల్లిగారి పెంపకమో!” అంటూ దణ్ణం పెట్టింది రాణి. పార్వతమ్మ ఏమీ మాట్లాడలేదు..

ఆ రాత్రి పడుకోగానే పార్వతమ్మకి నిద్ర రాలేదు. ఆలోచనల్లో పడింది.

‘కొడుకంటే, కోడలంటే, మనవరాలంటే ఎంత ఆపేక్షో రాణికి. అలాగే మా అత్తకి కూడా ఉంటుంది అనుకోవచ్చు కదా! నెలకి ఒక్కరోజు కూడా ఫోన్ చెయ్యదు. పండగ రోజు కూడా నేను చేస్తే మాట్లాడడానికి ఖాళీ లేదంటుంది. నా మనవల్ని ఎప్పుడైనా నా దగ్గరికి రానిచ్చిందా? సెలవుల్లో కూడా ‘మీ ఊరిలో ఎండలెక్కువ. పిల్లలు మీ మాట వినరు. బైట తిరుగుతారు’ అంటూ కొడుకులిద్దరినీ వేసుకుని అమ్మగారింట్లోనే వేసవి గడిపేది.

నా కొడుకే కదా! వాడు మాత్రం ఫోన్ చేస్తాడా? ఆరు నెలలకి కూడా ఫోన్ చెయ్యడు. మనసుంటే ఆఫీస్ నుంచయినా చెయ్యొచ్చు కదా! పండగ పూట అమ్మ ఒక్కతే ఉంటోంది. ఏమైనా వండుకుందో లేదా అన్న అక్కరే ఉండదు వీడికి. వచ్చినప్పుడు మాత్రం అమ్మా అంటూ ప్రేమగా మాట్లాడతాడు. వెళ్ళిపోయాక నేనొకదాన్ని ఉన్నానని గుర్తే ఉండదు. కోడలు సరే సరి ఎప్పుడూ ఉరుకులూ పరుగుల మీద ఉంటుంది. బజార్లకి తిరగడానికి బోలెడు ఖాళీ, కానీ అత్తని ఓసారి పలకరించడానికి మనసొప్పదు’ ఇలా అనుకుంటూ ఉండగా, ఎప్పటికో నిద్ర పట్టిందామెకు.

శనివారం నాడు తెల్లవారింది. అత్తగారికి కాఫీ ఇస్తూ రాణి, “లేచి టిఫిన్ కొచ్చెయ్యమన్నాను ముగ్గుర్నీ. అలాగే అమ్మా! అన్నాడు” అంటూ హైరానా పడిపోతూ అటూ ఇటూ తిరుగుతోంది. “వంటామె నాలుగు రోజులు సెలవని పొద్దున్నే ఫోన్ చేసి చెప్పిందత్తయ్యా! అదీ కంగారు” వివరించింది రాణి. టైమ్ ఎనిమిదయ్యింది, తొమ్మిదయ్యింది కొడుకు ఫ్యామిలీ రాలేదు. “నేను బైటికెళ్ళాలి టిఫిన్ పెట్టేస్తావా?” అంటూ భర్త రాగానే “వీడొస్తాడేమో అని చూస్తున్నా!” అంది.

“వస్తాడులే! ఆదివారం కదా! నెమ్మదిగా లేస్తారు .పిల్లకి కూడా స్కూల్ ఉండదు కదా!” అన్నాక భర్తకీ, అత్తగారికి వడలు చట్నీ వేసి తీసుకొచ్చింది. తాను కూడా ఒక ప్లేట్ తెచ్చుకుని తిన్నది. భర్త వెళ్ళిపోయాక ఆత్రం పట్టలేక కొడుక్కి ఫోన్ చేసింది. ఎత్తలేదు. ‘కారు నడుపుతూ ఉంటాడు కదా ఫోన్ ఎలా ఎత్తుతాడు?’ అనుకుంటూ తృప్తిపడి పరుగున వెళ్లి స్నానం కానిచ్చి హాల్‌లో ఎదురుచూస్తూ కూర్చుంది. అన్నీ గమనిస్తున్న పార్వతమ్మ ‘ఈ కోడళ్ళు తమ పిల్లలే పిల్లలు వాళ్ళని మేమెంతో ప్రేమిస్తున్నాం వెనకటి వాళ్ళు ఇంతగా ప్రేమించలేదు అనుకుంటూ ఉంటారు’ అని నవ్వుకుంది.

ఆఖరికి పదింటికి కారాపి దిగాడు సంతోష్. ఒక్కడే వచ్చాడు. భార్యా పిల్లా లేరు. అది చూస్తూనే చిన్నబోయింది రాణి. కొడుక్కి మంచి నీళ్ల సీసా ఇస్తూ “ముగ్గురూ టిఫిన్ కొస్తారని చూస్తుంటే నువ్వొక్కడివే వచ్చావా?” అంది విసుగ్గా.

“అలాగే అనుకున్నాము కానీ మా అమ్మ ఇంటికి వెళ్ళాలి నన్నక్కడ దింపండి అంటే అక్కడ దింపేసి, టిఫిన్ తినేసి రావడం వల్ల లేట్ అయ్యిందమ్మా!”

అంటూ భోజనాల బల్ల దగ్గరున్న నాన్నమ్మని చూస్తూ “ఇదేనా ఒక సర్‌ప్రైజ్ ఉందన్నావూ?” అంటూ పార్వతమ్మని ఒకసారి రెండు చేతులతో ఎత్తి దింపాడు.

“మా బంగారు నానమ్మా! చిక్కిపోయావు బాగా! ముప్ఫయి కిలోలున్నావో లేదో!” అంటూ నవ్వాడు.

“బలానికి, లావు అవ్వడానికి టానిక్కులుంటే తెచ్చిపెట్టు” అంటూ మనవడి చేతిని ముద్దు పెట్టుకుందావిడ.

“నిన్న నేను ఫోన్ చేసినప్పుడు ఈ ప్రోగ్రాం లేదా?” అంది రాణి

“అనుకోకుండా అటు వెళ్ళవలసి వచ్చినట్టుందమ్మా!”

“ఆ ముక్కే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుకదా! కోడలు”

“నేను వస్తున్నాను కదా! అని ఊరుకుందేమో! నాకసలు నేను ఒక్కడినే వచ్చి నీ దగ్గర ఉండడం ఇష్టం. అందుకే మెదలకుండా ఊరుకున్నానమ్మా!”

“పోనీ పిల్లనన్నా తీసుకు రావలసింది కదా!” అంది అసంతృప్తిగా.

“అడిగాను”

“ఏమంది? రానందా?”

“తల్లి వెనకే పిల్లలుంటారులే! దానికెందుకు ఆలోచిస్తావమ్మా?”

“ఇక్కడున్నప్పుడు నా వెనకే తిరిగేది, తల్లి అటూ ఇటూ పోయినా అమ్మేదని అడిగేది కాదు. చెవులు కుట్టించి వంటినిండా బంగారం పెట్టింది నేను. ఆ అమ్మమ్మ ఒక ఉంగరం పెట్టి ఊరుకుంది. ఇప్పుడావిడ దగ్గరయింది. నేను పరాయి దాన్నయ్యానన్న మాట?”

“చిన్నపిల్లకవన్నీ ఏం తెలుస్తాయమ్మా! తెలిసాక ఇంకా అటు వెళ్ళమన్నా వెళ్ళదు. సరేనా!”

“నువ్వు భలే సద్దుతావులేరా!” అంది రాణి కోపంగా.

“అలా సద్దకపోతే నేను అయిపోతాను కదా బలి, ఏమంటావు నానమ్మా?” అంటూ నానమ్మ దగ్గరగా కుర్చీ లాక్కుని ఆమె చుట్టూ చెయ్యి వేసి అన్నాడు.

“బాగానే బతికేస్తున్నావురా! మనవడా!” అంది పార్వతమ్మ సంతోష్ బుగ్గలు సాగదీస్తూ

“టిఫిన్ కూడా తినేసి వస్తావా?” దుఃఖంతో మాట రాలేదు రాణికి.

“అయ్యో అమ్మా! ఇప్పుడు మళ్ళీ తింటాను, టిఫిన్ పెట్టు. మా అత్తగారు పెట్టిన మూడు పూరీలూ ఎప్పుడో అరిగిపోయాయి” అంటూ నానమ్మ వైపు చూసి నవ్వాడు. రాణి పరుగున వెళ్లి వడల పళ్లెంతో వచ్చింది.

“వడలు చేస్తే మా అమ్మే చెయ్యాలి. బావున్నాయి కదా నానమ్మా?” అంటూ వాతావరణాన్ని తేలిక చేసాడు.

“లంచ్ లోకి ఏం చేస్తున్నావమ్మా!”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here